సదువుల తీరు మారాలి

పల్లవి :

సదువుల తీరు మారాలి – మన
బతుకులు మారాలి
పాలక రీతులు మారాలి – మన
పరీక్షలు మారాలి
అంగడి సరుకై విద్యా వైద్యం
అమ్ముడు కొనుడు మారాలి
కార్పొరేట్లకు పట్టం గట్టే
కాసుల రాజ్యం మారాలి

                    ||సదువుల||

1)

లాభం కోసం వైద్య విద్యను
అమ్మిన ఫలితం గుప్పుమన్నదా
ఒకటా రెండా వందల సార్లు
ప్రశ్నాపత్రం తుస్సుమన్నదా
అభమూ శుభము ఎరుగని బిడ్డల
ఆశలన్నీ అడియాసలైనయా
విద్యార్థుల ప్రాణాలెన్నో
ఉసురుమంటూ రాలిపోయినయా
సెప్పరయ్య ఓ మంత్రులారా ఈ పాపం అందరిదో
నైతిక బాధ్యత వహించి మీరు తప్పు కోరేందుకో

                            ||సదువుల||

2)

పోటీ పరీక్ష జూదం ఆటై
కోచింగుళ్ళు కొల్లగొట్టిరా
లక్షల మంది అర్హత పొందిన
లక్ష సీట్లకే పరిమితుండెనా
వ్యాపారులతో నేరగాళ్లతో
పార్లమెంటు పండిపోయెనా
ఏలిన వాళ్లు నిద్రలేస్తరా
రాజ్యాంగాన్నట రక్షిస్తరా
జంతర్ మంతర్ ర్ దిక్కే సూడగా ఒక్కరికైనా మనసే లేదా
దీక్షలు జేసినా నోరు విప్పని ఒప్పు గుండెలు కరగకుండెనా

                       ||సదువుల||

3)

జాతీ నీతనె మాటలు మరిచి
లాఠి తూటకు పని చెబుతారా
పోలీసోళ్ళతో సరిపోదంటూ
రౌడీ మూకల జేరుస్తారా
చెదలు వట్టిన చదువులతోనే
విజ్ఞానానికి పాతరేస్తరా
విద్యార్థుల రక్తంతోటే
పార్లమెంటు పవిత్రమవునా
చెప్పగలర ఈ విద్యా వైద్యం అందరికొకటని ప్రకటిస్తారా
కార్పోరేట్ విద్యాసంస్థల ప్రభుత్వపరమే చేసేస్తారా

పాడగలరా మీరు సర్కారు వారి పాట
పాపాలు కడ్గకుంటె ఈ తీరు మారదంటా

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply