వెనిజులాపై అమెరికా దురాక్రమణ గర్హనీయం

అమెరికా సామ్రాజ్యవాదం బుసలుకొడుతోంది. నిన్న వెనిజులాపై ఆకస్మిక దాడి చేసి, వందలాది మందిని హత్య చేసి, దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అర్ధరాత్రి వేళ సైనిక విమానంలో ఎత్తు కెళ్లడం, నేడు గ్రీన్‌లాండ్‌ను కబళించేందుకు సిద్ధం కావడం అమెరికా యుద్ధోన్మాదానికి నిద‌ర్శ‌నం. అలాగే.. ఇరాన్, క్యూబా, మెక్సికో, కొలంబియా లాంటి దేశాలపై బెదిరింపులకు దిగడం లాంటివన్నీ సామ్రాజ్యవాద వికృత రూపానికి ఆనవాళ్లు. ఇవన్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో పాటు అగ్రరాజ్య దురహంకారానికి ప్రతిరూపాలే. వ‌ర్త‌మాన ప్ర‌పంచంలో దౌత్యనీతికి అర్థం లేకుండా పోయింది. అంతర్జాతీయ సంబంధాలకు అర్థం మారిపోయింది. ట్రంప్ హయాంలో కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న చందంగా ప్రపంచం మారిపోయింది. ఒక సార్వభౌమ దేశపు అధ్యక్షుడిపై మరొక దేశ సైన్యం దాడిచేసి ఆ దేశ పాల‌కుడిని ఒక నేరస్థుడిలా తమ వెంట తీసుకుపోవచ్చునా? వెనిజులా అధ్యక్షుని విషయంలో జరిగింది అపహరణ లేదా కిడ్నాప్ మాత్రమే. ఎందుకంటే మదురో నేరాలు రుజువు కాలేదు. ఆయనను ‘పట్టుకొని పోవడానికి’ అమెరికా సైన్యం విశ్వ పోలీసూ కాదు. అయినా మ‌దురోపై నేరారోప‌ణ‌లు చేయాల్సిం దీ, విచార‌ణ జ‌రిపి రుజువు చేయాల్సిందీ వెనిజులా ప్ర‌జ‌లు మాత్ర‌మే. అమెరికాకు, ఆ దేశ సైనికుల‌కు ఏ అధికారం ఉన్న‌ది?

వెనిజులాపై ట్రంప్ బందిపోటు దాడి :
జనవరి 2 అర్థరాత్రి వేళ కారకాస్ గగనతలంలో యుద్ధ విమానాలు కురిపించే ఆయుధాల దాడితో ఆకాశ‌మెత్తు అగ్నిజ్వాలలు ఎగిశాయి. ఆ తర్వాత కమాండో ఆపరేషన్లలో ఉపయోగించే హెలికాప్టర్ల బారు వెడలింది. మరీ ముఖ్యంగా అవి డెల్టా ఎయిర్‌ఫోర్స్ (డిఇఎ)కు చెందినవి. 3వ తేది తెల్లవారుతుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోటనే దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేశాడు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సాయుధ బలగాలు కస్టడీలోకి తీసుకున్నాయని, తమ అధీనంలోని అజ్ఞాత ప్రదేశానికి ఆయనను తీసుకుపోతాయని తెలిపాడు. ఏ విధంగా చూసినా ఇది పచ్చి దుర్మార్గమైన, క్రూరమైన బందిపోటు చర్య. వెనిజులా లోని అపార చమురు నిక్షేపాల కోసమే ఇది జరిగిందని చెప్పడానికి గుట్టలు గుట్టల సాక్ష్యాధారాలున్నాయి. గత రెండు మాసాల నుంచి వెనిజులా చుట్టూ వున్న అంతర్జాతీయ జలాలలో సాగుతున్న అమెరికా నౌకాదళ సన్నాహాలను చూసినప్పుడు ఏదో తీవ్రమైన సంఘటన జరగ బోతున్నదని స్పష్టమవుతూ వచ్చింది. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నదనే నెపంతో వెనిజులా చమురు ట్యాంకర్లను విచక్షణారహితంగా ఆపడం, కాల్పులతో ముంచెత్తడం జరుగుతూ వచ్చింది. నిజానికి ట్రంప్ చేసిన మాదకద్రవ్యాల ఆరోపణకు దాంతో మదురోకు ఏలాంటి సంబంధం లేదు. కేవ‌లం ట్రంప్ చేయ‌ద‌ల్చుకున్న దాడికి ఓ సాకు మాత్ర‌మే.

అమెరికా ఇతర దేశాలపై దాడి చేయడం, అధినేతలను పట్టుకోవడం ఇదే కొత్త కాదు. ఇరాక్ పై దండెత్తినప్పుడు మహావిధ్వంసక మారణాయుధాలున్నాయ‌నేది ఓ సాకు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ను పట్టుకొని అప్పటికప్పుడు అమెరికా ఉరిశిక్ష విధించింది. ఆ ఆయుధాల సంగతి ఇప్పటికీ రుజువు కాలేదు. ఇప్పుడు డ్రగ్స్ సరఫరా పేరిట మదురోపై చేస్తున్న ఆరోపణలకూ ఆ గతే పట్టవచ్చు. మదురో ‘ అరెస్టు’ తర్వాత అమెరికా వెనిజులా చమురు గురించి మాట్లాడటం చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది.. తాటిచెట్టు ఎక్కింది దూడ గడ్డి కోసం కాదని. వెనిజులాలో సౌదీ అరేబి యా ను మించిన చమురు నిల్వలున్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు వనరుల్లో 20 శాతం దాకా వెనిజులాలోనే ఉన్నాయి. ఆ చమురును డాలర్లలో కాకుండా చైనాకు ఆ దేశం ఎప్పటి నుంచో యువాన్ల మార్పిడిలో అమ్ముతున్నది. డాలరు నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు 2018లో వెనిజులా ప్రకటించింది. యువాన్‌తో పాటుగా యూరోలు, రూబుళ్లు ఇలా ఏ కరెన్సీకైనా చమురు విక్రయిస్తూ డాలరును పూర్తిగా పక్కన పెట్టేసింది. డీ డాలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది.

మదురోను అమెరికాకు తరలించడం ద్వారా వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలను నియంత్రించడమే ట్రంప్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వెనిజులాలోని చమురు సంపదను అమెరికా కంపెనీల పరంచేయడం కోస‌మే. వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈ చర్యను దుర్మార్గపు కిడ్నాప్‌గా అభివర్ణించారు. అయితే, ట్రంప్ మాత్రం ఆ దేశాన్ని సరిగ్గా నడపాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానిస్తూ, అవసరమైతే సైనిక బలగాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించుతామని హెచ్చరించారు. ఇది ఒక దేశ సార్వభౌమత్వాన్ని కాలరాయడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ ఒక నియంత తరహాలో వ్యవహరించడమే.

ఒక సర్వసత్తాక దేశం మీద దాడి చేసి ఆ దేశపు అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలనూ కాలరాసిన ట్రంప్ తాను వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడానని చెప్పుకుంటున్నాడు! మదురో ఒక మాదకద్రవ్య ముఠాకు నాయకుడిగా ఉన్నట్టు, ఆ ముఠాను అరికట్టకపోతే అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లనున్నట్టు ప్రచారం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి ప్రపంచంలో జరుగుతున్న కొకైన్ వ్యాపారంలో ఉన్న అంతర్జాతీయ ముఠా నెట్‌వర్క్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మెక్సికో, కొలంబియా, హౌండురాస్, అర్జెంటీనా, ఈక్వెడార్ వంటి దేశాల్లో పనిచేస్తున్న మితవాద శక్తులు. ఈ శక్తులకు అమెరికా అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. అందులో వెనిజులా దేశంలోని డ్రగ్ మాఫియా వాటా నామమాత్రమే. ఐనా, తక్కిన దేశాలను వదిలిపెట్టి వెనిజులా మీదనే పడ్డాడు ట్రంప్. ఈ దాడికి ప్రధాన కారణం వెనిజులాలో ఉన్న చమురు నిల్వల మీద పెత్తనాన్ని పొందాలని అమెరికా భావించడమే. వెనిజులాతో ప్రారంభించి మొత్తం లాటిన్ అమెరికా దేశాలన్నింటిపైనా తన పెత్తనాన్ని చెలాయించాలని అమెరికా చూస్తున్న‌ది.

1817-1825 మధ్య అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన జేమ్స్ మన్రో ఆ కాలంలో ఒక సిద్ధాంతాన్ని ప్రకటించాడు. దానినే మన్రో సిద్ధాంతం అని పిలుస్తారు. దాని ప్రకారం తన దేశ భద్రత, రక్షణ అవసరాల కోసం ఎప్పుడైనా, ఏ దేశం మీదనైనా సైనిక చర్యలతో సహా ఎటువంటి చర్యలకైనా పూనుకునే హక్కు అమెరికాకు ఉంది. చాలా దుర్మార్గమైన ఈ సిద్ధాంతానికి తర్వాత కాలం చెల్లింది. కాని శతాబ్దాల క్రితమే తిరస్కరించబడిన ఆ సిద్ధాంతాన్ని ట్రంప్ మళ్లీ ముందుకు తెచ్చాడు. ఇప్పుడు మన్రో సిద్ధాంతం కాస్తా ‘డాన్రో సిద్ధాంతంగా పేరు మార్చుకున్న‌ది. (ట్రంప్ పేరులోని మొదటి భాగం డొనాల్డ్‌లోని డాన్‌ను, మన్రో పేరులోని ఒక భాగాన్ని కలిపి డాన్రో చేశారు). 1991లో అమెరికాకు అనుకూలంగా తొత్తు మాదిరిగా వ్యవహ రించే ప్రభుత్వాన్ని తొలగించి ఆ స్థానంలో చావెజ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వెనిజులాలోని చమురు కంపెనీలను జాతీయ చేశాడు. వాటి ద్వారా లభించే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేయసాగాడు. దానికి ప్రతీకారంగా అమెరికా వెనిజులా మీద ఆంక్షలు ప్రకటించింది. విదేశాల్లో ఉన్న వెనిజులా పెట్టుబడులను స్తంభింపజేసింది. దాంతో వెనిజులా తీవ్ర ఆర్థిక వత్తిడికి లోనైంది. ఆ పరిస్థితుల్లో వెనిజులా చైనా, రష్యా, ఇరాన్ దేశాలతో ఆర్థిక, సైనిక సంబంధాలను బలపరుచుకుంది. తక్కిన లాటిన్ అమెరికా దేశాలకు దగ్గరైంది. ఐనప్పటికీ అమెరికా ఆంక్షలు వెనిజులాను కుంగదీశాయి.

కండకావరంతో అమెరికా సామ్రాజ్యవాదం ఇకమీదట వెనిజులా అధ్యక్షున్ని తానే అని ట్రంప్ ప్రకటిం చుకోవడం సామ్రాజ్యవాద దురహంకారానికి నిదర్శనం. గ్రీన్‌లాండ్ కావాలని, కెనడా అమెరికాలో భాగమౌతుందని, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోను క్యూబా అధ్యక్షుడుగా చూడాలని ట్రంప్ బరితెగించి ప్రకటిస్తున్నాడు. కొలంబియా, మెక్సికో, ఇరాన్, కెనడా, పనామా, నైజీరియా, సిరియా, నికరాగువా… ఇలా 11 దేశాలు తనకు లొంగివుండాల్సిందేనని, లేదంటే యుద్ధం తప్పందంటున్నాడు. అమెరికా సైన్యం రష్యా చమురు పడవలను సముద్రపు దొంగలా తరలించుకుపోతున్నాయి. ఈ ఆటవిక దురాక్రమణకు తెగబడడం కేవలం ట్రంప్ వ్యక్తిగతం కాదు, ఆ నయా ఫాసిస్టును నడుపుతున్న అమెరికా పెట్టుబడి (ఒలిగార్కి) వినాశకర విధానమిది. సజావుగా దేశాలను దోచుకునే అవకాశం ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ న్యాయం వంటి చిలుకపలుకులు పలికే పెట్టుబడి, తన లాభాలకు ఇబ్బంది వచ్చినప్పుడు క్రూరంగా దేశాలను ఆక్రమించుకుని, అమానవీయంగా మానవ ప్రాణాలను తీసి, అనాగరికంగా నీతి నియమాలను తుంగ‌లో తొక్క‌డం దాని నైజం. నాడు హిట్లర్ లాగానే నేడు ట్రంప్ ప్రపంచ ప్రమాదకారిగా మారాడన్న‌దానికి ఇది నిద‌ర్శ‌నం.

వెనిజులా అమెరికాల మధ్య విభేదాలు :
20వ శతాబ్దం రెండవ భాగంలో వెనిజులా రిపబ్లిక్ కాలంలో అమెరికాతో సంబంధాలు బలంగా ఉన్నా యి. 1999లో హ్యూగో చావెజ్ వెనిజులా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇది మారిపోయింది. వెనిజులా తన చమురు నిల్వలపై సార్వభౌత్వాన్ని తిరిగి నొక్కి చెప్పడం ప్రారంభించింది. ఈ చర్య ఒక శతాబ్దం పాటు అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు ఉన్న సౌకర్యవంతమైన స్థానాన్ని సవాలు చేసింది. చావెజ్ పరిపాలన ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ పిడివిఎసఎ ప్రైవేటీకరణను రద్దు చేసింది. విదేశీ సంస్థలకు రాయల్టీలను పెంచింది. చివరికి దేశ జిడిపిని రెట్టింపు చేసింది. వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికి పైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత ఏర్ప‌డింది. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీ లను చావెజ్ స్వాధీనం చేసుకోవటం వల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటి నుంచి వెనిజులాపై అమెరికా కడుపుమంట మొదలైంది.

రెండు సంవత్సరాల తరువాత, తాను ‘సోషలిస్టు’ను, “సామ్రాజ్యవాద వ్యతిరేకి” అని చావెజ్ ప్రకటించుకున్నాడు. ఇది అమెరికా విధానినికి వ్య‌తిరేకం. 2002లో హ్యూగో చావెజ్‌పై జరిగిన వెనిజులా తిరుగుబాటు ప్రయత్నానికి జార్జ్ డబ్ల్యూ. బుష్ పరిపాలన మద్దతు ఇచ్చిందని వెనిజూలా ఆరోపించిన తర్వాత దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. క్యూబా, ఫిడేల్ కాస్ట్రోతో చావెజ్ స్నేహం, గణనీయ మైన వాణిజ్య సంబంధం క్యూబాను ఒంటరి చేసే అమెరికా విధానాన్ని దెబ్బతీశాయి. అంతేకాకుండా, చావెజ్ చొరవతో, అమెరికా వెనిజులా సైన్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాలు తెగిపోయాయి. 2000లో వెనిజులా పెట్రోల్ ఎగుమతి దేశాల(ఓపిఇసి-ఒపెక్‌) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, చావెజ్ ఒపెక్‌ దేశాలలో పది రోజుల పర్యటన చేశారు. ఈ ప్రక్రియలో, గల్ఫ్ యుద్ధం తర్వాత సద్దాం హుస్సేన్‌ను కలిసిన మొదటి దేశాధినేత ఆయన. ఈ పర్యటన అమెరికాలో వివాదాస్పదమైంది.

2008 సెప్టెంబర్‌లో బొలీవియాకు సంఘీభావంగా అమెరికా రాయబారిని వెనిజులా బహిష్కరించి నప్పుడు, అమెరికా వెనిజులా మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. దేశంలో హింసాత్మక ప్రభుత్వ వ్యతిరేక సమూహాలకు సహకరిస్తున్నారని ఒక అమెరికా రాయబారిపై ఆరోపణలు వచ్చిన తర్వాత జూన్ 2009లో అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో సంబంధాలు కొంతవరకు మెరుగుపడినప్పటికీ, ఆ తర్వాత అవి క్రమంగా క్షీణించాయి. ఫిబ్రవరి 2014లో, హింసను ప్రోత్సహించారనే ఆరోపణలపై వెనిజులా ప్రభు త్వం ముగ్గురు అమెరికన్ దౌత్యవేత్తలను దేశం నుండి వెళ్లిపోవాలని ఆదేశించింది. 2019లో వెనిజులా అధ్యక్ష సంక్షోభం సమయంలో, జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జువాన్ గైడోను తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన తరువాత, వెనిజులా అమెరికాతో సంబంధాలను తెంచుకుం టున్నట్లు నికోలస్ మదురో ప్రకటించారు. 2023లో గైడో తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష జాతీయ అసెంబ్లీ ఓటు వేసినప్పుడు, యునైటెడ్ స్టేట్స్ దానికి మద్దతు తెలుప‌టం, అమెరికా త‌న‌ తొత్తుకోసం అమెరికా ఆడుతున్న నాట‌కాల‌కు నిద‌ర్శ‌నం.

అమెరికా సామ్రాజ్యవాద దాహం :
అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి. కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం పేరుతో డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి అల‌వాటు. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా అమెరికా కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, ఆఫ్గానిస్తాన్ నెత్తుటి మ‌డుగుల‌య్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది. వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరుచుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం అమాన‌వీయం, రాక్ష‌స‌త్వం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్‌ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగుకుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం పాత పద్ధతుల్లో వలస దేశాలను ఏర్పాటు చేసుకోవ డానికి సోషలిస్టు శిబిరం, ఇంకా అనేక దేశాల్లో సాగిన సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోధ్యమాలు అడ్డుగా నిలిచాయి. లాభం లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేని పెట్టుబడి మేకవన్నె తోలు కప్పుకుని కొంతకాలం ప్రజాస్వామ్య, సంక్షేమ రాజ్య అవతారం ఎత్తింది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకవైపు వివిధ దేశాల్లో ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి తమ తైనాతీ నియంతలను ప్రతిష్టించుకుని దోపిడీని కొనసాగించింది. మరోవైపు ప్రపంచీకరణ ముసుగులో ఎక్కడి నుండి ఎక్కడికైనా పెట్టుబడి, సరుకులు అంటూ కొత్త నీతి సూత్రాలను వల్లిస్తూనే సైనిక జోక్యాలను కొనసాగించింది. ఇప్పుడు ఏకంగా దేశాల దురాక్రమణకు సిద్ధపడుతున్నది.

2021 జూలై నాటికి కనీసం 80 దేశాల్లో దాదాపు 750 సైనిక స్థావరాలను అమెరికా ఏర్పాటు చేసుకున్న ట్లు వాషింగ్టన్ డిసిలోని అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ వైన్ పరిశోధన పత్రం ప్రకటించింది. ఈ దేశాల్లో అతి ఎక్కువ విస్తీర్ణంలో 439 స్థావరాలను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. వాస్తవానికి ఈ సంఖ్య లు ఇంకా ఎక్కువగా ఉంటాయి. 2020 నాటికి 159 దేశాల్లో దాదాపు 1,73,000 మంది అమెరికన్ సైనికులు మోహరించి ఉన్నారు. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్‌ల్యాండ్… ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో వ్య‌తిరేకించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి.
అమెరికా సైన్యం మీద చేసే ఖర్చు ప్రపంచంలోని పది దేశాల జిడిపి కంటే ఎక్కువ. ఇదంతా బయటకు కనిపించే దాని సైనికాధిపత్య బలం. కానీ ఇంతకంటే ఘోరమైన ప్రమాదం దాని నిఘా విభాగం. వివిధ దేశాల్లో చేసే కుట్రలు, కుతంత్రాలు. అమెరికా ఇంత బరితెగింపుకు కారణం పెట్టుబడి లాభార్జన ఉన్మాదం.

అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి భ్రమల్లో ఉన్నవారికి డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గ చర్య కనువిప్పు కలిగించిందని భావించవచ్చా? వెనిజులా మీద దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, సతీమణి సిలియా ప్లోర్స్‌ను బంధించి అమెరికా తీసుకువెళ్లి తమ చట్టాల ప్రకారం విచారణ జరుపుతా మంటున్నారు. ఈ తీరును సమర్థించేవారు, జరిగిన దుర్మార్గాన్ని చూసి కూడా మౌనముద్ర దాల్చిన అపర ప్రజాస్వామికవాదుల తీరు ఆందోళన కలిగిస్తున్నది. సర్వసత్తాక వెనిజులా దేశాధ్యక్షుడిని బంధించిన తరువాత వివిధ దేశాల స్పందన అన్యాయం. రష్యా, చైనాలు గట్టిగానే ఖండించినప్పటికీ, తదుపరి మౌనాన్నే ఆశ్రయించాయి. ఇక ఐక్యరాజ్యసమితి అలంకారప్రాయంగా మారింది. నిస్సహాయ, బేల దేశాలకు మేమున్నామని ధైర్యాన్నిచ్చే పరిస్థితి కనబడటం లేదు. కేవలం అమెరికా దుస్సాహాసాన్ని దూషించేందుకు ఒక అంతర్జాతీయ వేదికను అందించేందుకే అది పరిమితమైందనే పెదవి విరుపులు క‌నిపిస్తున్నాయి. ఇలాగే మిన్నకుంటే, ఒక దేశం తరువాత మరో దేశాన్ని తొక్కిపట్టి 75 ఏళ్ల క్రితం అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం తరహాలో అమెరికా సామ్రాజ్య ఏర్పాటుకు అడుగులు పడతాయి. ప్రజాస్వామ్యం పుస్తకాలకే పరిమితమై, తిరోగమన పథంలోకి వెళ్లడం తథ్యం.

ముగింపు :
అమెరికా ప్రవచిస్తున్న ప్రపంచ శాంతి ముసుగు తొలిగిపోతున్నది. సామ్రాజ్యవాద సిద్ధాంత వికృత రూపం మళ్లీ ఆవిష్కృతమవుతున్నది. కరేబియన్‌లో ఇటీవల జరిపిన వైమానిక దాడులు, వెనిజులా అధ్యక్షుడు మధురో కిడ్నాప్ ఇందుకు నిదర్శనాలు. ఈ ప్రాంతాలపై దశాబ్ధాలుగా అమెరికా అనుసరిస్తున్న అనుచిత వైఖరికి ఇది కొనసాగింపు.

నాడు విధ్వంసకర ఆయుధాల పేరిట ఇరాక్‌తో ఆడిన నాటకాన్ని ఇప్పుడు ‘నార్కోటెర్రరిస్టు’ అంటూ వెనిజులా అధ్యక్షుడు మధురోతో కొనసాగిస్తున్నది. కానీ, ఇరాక్ మాదిరి వెనిజులాను లొంగతీసుకోవడం, పాదాక్రాంతం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదని అమెరికాకు తెలుసు. అందుకే, ఆర్థిక నిర్బం ధాలు… ప్రజాస్వామ్యవాదుల పేరుతో కుట్రదారులకు ప్రోత్సాహకాలు సాగిస్తున్న‌ది. తాజా పరిణామాలతో అమెరికా తాత్కాలికంగా తలిగించుకున్న ‘విశ్వశాంతి’ పరదా తొలిగింది. సామ్రాజ్యవాద వికృత రూపం బయటపడింది. అమెరికా తన ఆయుధ అమ్మకాలను వదులుకోదు. వాణిజ్య ప్రయోజనాల కోసం దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి వెనుకాడదు. సజావుగా సాగుతున్న ప్రభుత్వాలను కూల్చడానికి, అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడానికి వెనుకాడదు. వెనిజులా విషయంలో ఇదే విధానం… అనుస‌రించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ వెనిజులాను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా మార్చేయడమే ఇప్పుడు అమెరికా ధ్యేయం. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చడమే లక్ష్యం. బలప్రయోగంతో దేశాల సార్వభౌమత్వాన్ని హరించే, ఐరాస ప్రణాళికను బరితెగించి ఉల్లంఘించే ఆటవిక పద్ధతులకు అమెరికన్ సామ్రాజ్యవాదం ఒడిగడితే ఇక అంతర్జాతీయ న్యాయచట్టాలెందుకు? ప్రపంచంలోని ప్రగతిశీల శక్తులన్నీ ఈ దురాక్రమణను వ్య‌తిరేకించాలి, ఎదుర్కోవాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply