వనజ

మధ్యాహ్నం రెండు దాటింది. కాచిగూడలోని ఆ పెద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఏసీ చల్లదనంలో, ప్లాస్టిక్ ట్రాలీల రాపిడి, స్కానర్ల ‘బీప్’ శబ్దాల మధ్య ఎవరూ ఎవరి ముఖమూ చూడటం లేదు.

నాలుగో కౌంటర్ క్యూలో నిలబడ్డాను. సరుకులు స్కాన్ చేస్తున్న అమ్మాయి చేతులనే చూస్తున్నాను. వస్తువును తిప్పడం, బీప్ వినగానే పక్కకు జరపడం. పచ్చ ఆప్రాన్, మెడలో ఐడీ కార్డ్, రబ్బర్ బ్యాండ్‌తో ముడేసిన జుట్టు.

తల ఎత్తకుండానే ముందున్న వాళ్లతో “కవర్ కావాలా?” అంది.

ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించింది.

నా వంతు వచ్చింది. సరుకులు బెల్ట్ మీద పెడుతుంటే ఒక సబ్బు కింద పడింది.

ఆమె తల ఎత్తినప్పుడు కంటి చివర చిన్న మచ్చ కనిపించింది. కృష్ణమూర్తి కూతురికి ఉన్న మచ్చ.

“క్యాషా, కార్డా సార్?” అడిగింది ఆమె.

“వనజా …” పిలిచాను

ఆమె చెయ్యి ఒక్కక్షణం స్కేనర్ మీద ఆగిపోయింది. కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తున్న ఆమె కనురెప్పలు కొద్దిగా వణికాయి. కానీ నా వైపు చూడలేదు.
“ఎనిమిది వందల యాభై సార్. క్యాష్ ఇస్తారా?” అంది, ఏమీ తెలియనట్టు.

“నేను… నరసింహం బాబాయ్‌ని. గూడేంలో మీ నాన్నతో కలిసి…”

“సార్, వెనుక క్యూ ఉందండి. దయచేసి బిల్ త్వరగా చేయనివ్వండి” అంది. ఆమె తన గొంతులోని వణుకును దాచడానికి ఆరాటపడుతోంది.

నేను నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టాను. చిల్లర పక్కన పెట్టి, బిల్ చేతికిచ్చింది. నా కళ్లలోకి నేరుగా చూడలేక చూపు పక్కకు తిప్పుకుంది.
**
నేను బ్యాగ్ పట్టుకుని స్టోర్ బయట నిలబడ్డాను. పని మీద హైదరాబాద్ వచ్చాను. మనవరాలు తిరిగి వచ్చేటప్పుడు ఏవో తెమ్మంటే ఇలా store కి రావడం అనుకోకుండా  వనజను చూడడం జరిగింది. నా bus సాయంత్రం ఆరు గంటలకు. ఎలాగైనా వనజతో మాట్లాడే వెళ్ళాలి అనుకున్నాను.

నాలుగింటికి ఆమె షిఫ్ట్ అయిపోయి బయటకు వచ్చింది. భుజాన పాత హ్యాండ్ బ్యాగ్ వేసుకుని, బస్టాప్ వైపు వేగంగా నడవబోయింది. నేను పరుగెత్తినట్టు వేగంగా నడిచి ఆమె ముందుకు వెళ్లాను.

“నన్ను గుర్తుపట్టనంతగా మారిపోయావా వనజ ?”
ఆమె అడుగులు ఆగాయి. నడిరోడ్డు మీద, జనం తోసుకుపోతున్న సందడి మధ్య ఆమె నిలబడింది. కాసేపు కిందకి చూసి, మెల్లగా నా వైపు చూసింది. ఆ కళ్లల్లో ఏడుపు లేదు… ఒక రకమైన ఎండిపోయిన శూన్యం ఉంది.

“గుర్తుపట్టకపోవడం కాదు బాబాయ్… గుర్తుతెచ్చుకోవాలని లేదు.” ఒక్క క్షణం ఆగి

మీరు కూడా గుర్తుపట్టరేమో అనుకున్న..గుర్తుపట్టకపోతే బాగుండు అని కూడా” … అన్నది వనజ


దాహంగా అనిపించడంతో పక్కనున్న  కొట్టులో రెండు నీళ్ళ సీసాలు కొని ఒకటి ఆమెకు అందించాను. తీసుకుంది కానీ తాగలేదు.

“ఎట్లున్నావ్ బిడ్డా..కిరణ్ ఎట్లున్నడు?” నీళ్ళు తాగి సీసా మూత పెడుతూ అడిగాను.

ఆమె చేతులు క్షణం ఆగాయి. “ఆయన తన పనిలో తను ఉన్నాడు బాబాయ్. నాకే తెలీదు… నేను సరిగ్గా ఉన్నానో లేదో.”

ఏంటమ్మా ఇది? కిరణ్‌తో కలసి హైదరాబాద్ వచ్చావు కదా? ఊర్లో మీ నాన్న ఎంత బాధపడ్డాడో తెలుసా? అసలు ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు?”

వనజ బస్టాప్ వైపు మెల్లగా నడుస్తూ అంది..”కిరణ్ మంచివాడే బాబాయ్. నాకేం అన్యాయం చేయలేదు. నన్ను కొట్టలేదు, తిట్టలేదు. నాతో అబద్ధాలు కూడా చెప్పలేదు.

“అదేమిటమ్మా అలా అంటున్నావు .. మీ ఇద్దరూ బాగానే ఉంటున్నారు కదా ? ” అడిగాను

“బాగానే ఉన్నాం బాబాయ్ ఆయన వేరు నేను వేరుగా “

“అంటే మీరిద్దరూ కలిసి లేరా.. ఏమైంది తల్లీ..”

వనజ పెదవులపై ఒక చిన్న చేదు నవ్వు మెరిసింది.

గతమంత కళ్ళ ముందు తిరిగింది.

కిరణ్  ఒక Cultural Researcher. గిరిజన కళలు, వారి జీవన విధానంపై పిహెచ్‌డి (PhD) రీసెర్చ్ చేయడానికి అక్కడకు వచ్చాడు. అతని రీసెర్చ్ సబ్జెక్ట్… స్వేచ్ఛకు ఎంతో ఇష్టమైన గిరిజన కళా రూపాలు.

ఆ కళ పట్ల వనజకు ఉన్న ప్రావీణ్యం చూసి కిరణ్ ఆశ్చర్యపోయాడు. వనజ కూడా తన కళకు ఒక గుర్తింపు తెచ్చే అవకాశం దొరికిందని భావించి, కిరణ్ రీసెర్చ్‌లో ఒక భాగమైంది. రోజూ కొండలు తిరుగుతూ, పాతకాలపు పాటలను సేకరిస్తూ, నృత్య రీతులను వివరిస్తూ అతని పుస్తకానికి జీవం పోసింది.
కిరణ్ గూడేనికి రీసెర్చ్ కోసం వచ్చినప్పుడు పరిశోధకుడిలా రాలేదు, ఒక కుతూహలమున్న మనిషిలా వచ్చాడు. వాగు ఒడ్డున వనజ పాడుతుంటే ప్రపంచాన్ని మరిచిపోయి వినేవాడు. ఆమె మాటలో ఉండే యాస వినసొంపుగా అనిపించి గంటలు గంటలు దొర్లిపోయేవి మాటల్లో…

పాటల వేటకు ఇద్దరూ కలిసే తిరిగేవారు.కిరణ్ రేలా పాట నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు. అతని ఉచ్చారణ విని ఆమె పకపకా నవ్వేది, వాగు నీళ్లు దోసిట్లో తెచ్చి అతని మీద చల్లేది. అతను నోట్‌బుక్‌లో ఆమె చెప్పిన పదాలు రాసుకుని, తప్పులు దిద్దుకునేవాడు. “నీ యాస నాకు పుస్తకాల కన్నా ఎక్కువ నేర్పుతుంది వనజ ,” అనేవాడు.

ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. విషయం తెలిసిన వనజ తండ్రి కృష్ణమూర్తి కిరణ్ ని నిలదీసాడు.

“నేను వనజను పెళ్లి చేసుకుంటాను. ఆమె ఇష్టంతో,” అన్నాడు కిరణ్.

కృష్ణమూర్తి చాలాసేపు మాట్లాడలేదు. “నువ్వు మంచోడివే బాబూ, అది నాకు తెలుస్తోంది,” అన్నాడు.
ఇక్కడ ఆమె ఎవరో అందరికీ తెలుసు..ఎవరైనా ఒక్క మాట అంటే మేమందరం ఆమె వెనక నిలబడతాం. నీ పట్నంలో ఎవరుంటారు ఆమె వెనక? నువ్వు ఒక్కడివే. నీ మనుషుల ముందు కూడా ఆమె వైపు నిలబడతావా? అది చెప్పు.”

కిరణ్ కళ్లల్లో నిజాయితీ ఉంది. “నిలబడతాను,” అన్నాడు. కృష్ణమూర్తి నెమ్మదిగా తల ఊపాడు. నమ్మినట్టు కాదు, ఇంకేం అనలేనట్టు. పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదు.

ఆ సాయంత్రం వాగు దగ్గర
నాతో రా వనజ ” అన్నాడు కిరణ్. “అక్కడ నీకు ఏ లోటూ ఉండదు.”
“లోటు గురించి నాకు భయం లేదు,” అంది ఆమె. “అడవిల పుట్టినదాన్ని. తిండి తక్కువైనా, గది చిన్నదైనా, చెప్పులు లేకపోయినా సర్దుకుంటా. ఒంటికి కష్టమైతే సహిస్తా. కానీ మనసుకు కష్టమైతే… చెప్పకుండానే వెళ్లిపోతా.”

“అదేంటి?” కిరణ్ నవ్వాడు.

“నవ్వకు. నేను నీ దయ మీద రావడం లేదు. మా పాటలు ఎవరి జాలి కోసం కాదు. నన్ను గూడెం పిల్లగానే చూడు, ఆ పేరు నాకు సిగ్గు కాదు. నా మనసు చిన్నబోయే చోట నేను ఉండను. ఆ రోజు ఆపకు, వెతకకు. ఇప్పుడే చెప్తున్నా.”

“అలాంటి రోజు రాదు,” అన్నాడు కిరణ్.

“రాకూడదనే కోరుకుంటా. కానీ చెప్పింది మరిచిపోకు.”
ఆ క్షణం ఆమె చిన్న పిల్లలా కాదు, అడవి నేర్పిన నియమాలున్న మనిషిలా మాట్లాడింది.


కిరణ్ ప్రేమను, అతను తన కళకు ఇచ్చిన గౌరవాన్ని నమ్మి వనజ నగరానికి వెళ్లింది. కిరణ్‌ను పెళ్లి చేసుకుంది.   ఆ తర్వాత ఎప్పుడు తండ్రి ఆమెతో మాట్లాడలేదు ..బిడ్డ వెళ్ళిపోయిన బాధతో ఆ తండ్రి  ఏడాదిలోపే కన్నుమూశాడు.

Bus హారన్ గట్టిగా వినపడడంతో ఇద్దరూ ఈ లోకంలో పడ్డారు.

“ఇంతకు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అమ్మా ? ఎమన్నా గొడవ పెట్టాడా ” అని అడిగాను.

ఆమె చూపులు దూరంగా పోతున్న బస్సుల వైపు ఉన్నాయి.

“మొదట్లో అంతా మంచిగానే ఉండె ..ఆయన నా పాటలు రికార్డ్ చేసి రాత్రిపూట ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని వినేటోడు. ఆ తర్వాత కొంత కాలానికి కాలేజీలొ జాబ్ వచ్చింది. ఇంటికొచ్చే మనుషులు పెద్దోళ్లు… వారితో మధ్యలో నేను మాట్లాడితే ఆయన ఒకసారి నా వైపు చూసేటోడు. నేను ఆగిపోయేదాన్ని.”

పట్నంల ఆకాశం ఉండదు బాబాయ్, జిగేల్ మనే లైట్లు ఉంటయ్. బాల్కనీల నిలబడి పిట్టలను లెక్కపెట్టేదాన్ని. ఆయన ఒకరోజు అడిగినాడు , ఏం చూస్తున్నవ్ అని. పిట్టలన్నాను…‘ఓహో’ అని తన పని చూసుకున్నడు
ఆ ‘ఓహో’లో ఉన్న ఖాళీనే నా ఉనికిని దెబ్బ తీసినట్టు అనిపించింది .” చెప్తోంది వనజ.

“ఒకరోజు ఆయనే చెప్పిండు, కొంచెం యాస తగ్గించు వనజ … మాములుగా మాట్లాడడం అలవాటు చేసుకో అని. ఎంత మెల్లగా చెప్పిండో బాబాయ్. అరిస్తే బాగుండు… నేనూ ఎదురు మాట్లాడేదాన్ని.”

ఒక సాయంత్రం ఆయన కాలేజీ స్నేహితులు భోజనానికి వచ్చినారు. అందులో . ఒకావిడ, ప్రొఫెసర్ భార్య, నన్ను చూసి, ‘మీరు చక్కగా పాడతారంటగా, ఒక్క పాట పాడండి’ అన్నది. కిరణ్ నా వైపు చూసిండు. ఆయన కళ్లలో వద్దు అనీ లేదు, సరే అనీ లేదు. వచ్చిన అవకాశం పోగొట్టుకోలేక సంతోషంగా  పాడిన బాబాయ్. వాగు దగ్గర ఎప్పుడు పాడే పాట…అడవిలో ఉన్నప్పుడు మీరంతా నన్ను మెచ్చుకునే వాళ్ళు నువ్వు పాడితే అడివే ఆగి వింటది అని…

అయిపోయినంక అందరూ చప్పట్లు కొట్టినారు. పాట అడిగిన ఆవిడ  జూ లొ  జంతువును చూసినట్టు చూస్తూ
“ఎంత సహజంగా ఉంది, ట్రైబల్ ఫోక్ కదా ” అన్నది  కిరణ్ కూడా చప్పట్లు కొట్టిండు.”

ఆమె గొంతు సన్నగా నవ్వింది, కానీ అది నవ్వు కాదు.

“ఆ రాత్రి అడిగిన బాబాయ్,  ఆవిడ ఆ మాట అన్నప్పుడు నువ్వు ఎందుకేం అనలేదు?’ అని. ఆయన, ‘ఏం అన్నది? పొగిడింది కదా’ అన్నడు. ‘పాటను పొగిడింది. నన్ను జూలో జంతువును చూసినట్టు చూసింది అన్నాను

నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నవ్ వనజ..వాళ్లు అలా అనుకోలే.’ అని వెనకేసుకొచ్చాడు

‘మరి నువ్వేం అనుకున్నవ్?’ అని అడిగిన
ఆయన జవాబు ఇవ్వలే.”

ఆమె బెంచీ అంచును గట్టిగా పట్టుకుంది.

“నాన్న కిరణ్ ని అడిగిన మాట గుర్తొచ్చింది బాబాయ్.. నీ మనుషుల ముందు కూడా నా బిడ్డ వైపు నిలబడతావా అని…చిత్రం ఏమంటే నిలబడాల్సిన అవసరం ఉందని కూడా ఆయనకు అనిపించలే. అదే నేను తట్టుకోలేకపోయాను ”

“అతను నన్ను ప్రేమించినట్టే తన వర్గాన్ని సమాజాన్ని, తన హోదాను కూడా ప్రేమించాడు.

ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది.

“ఓ రోజు రాత్రి అతను వచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. నా పక్కన కూర్చుని, ‘వనజా…నగరంలో బతకాలంటే కొన్ని విషయాలు సర్దుకోవాలి. నేను నీ గూడేన్ని ప్రేమిస్తాను, కానీ ఇక్కడ నా సహోద్యోగుల ముందు నువ్వు ఆ యాసలోనే మాట్లాడితే వాళ్లు నిన్ను వేరుగా చూస్తారు. అది నాకు బాధగా ఉంటుంది’ అన్నాడు. అతను అరిచి ఉంటే నేను గొడవపడేదాన్ని బాబాయ్. కానీ అతను నా చేతులు పట్టుకుని, కళ్లల్లో నీళ్లతో అడిగాడు. అతనూ నలిగిపోతున్నాడు. తన వర్గాన్ని దాటి నన్ను ప్రేమించినందుకు అతనూ సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.”

“మరి? ఆ తర్వాత ఏమైంది? ” అడిగాను.

“నేను కొద్దిరోజులు మారడానికి ట్రై చేశాను. గొంతు నొక్కుకున్నాను. మాట యాస మార్చేందుకు….కానీ పాడటం ఆపేసేసరికి నాలో ఏదో చచ్చిపోవడం మొదలైంది. ఆయన ల్యాప్‌టాప్ ముందు అర్ధరాత్రి దాకా పనిచేస్తుంటే, నేను బాల్కనీలో నిలబడి చీకటిని చూసేదాన్ని. ‘ఏంటి వనజ ఇట్లా ఉన్నావు? నీకేం లోటు చేశాను?’ అని ఆయన ఆవేదనగా అడిగేవాడు.

ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన ఇచ్చిన ఇల్లు, ప్రేమ నిజమే. కానీ నా వైపు నుంచి చూస్తే నేను సంతోషంగా లేను.  కరిగిపోతున్నాను. రోజురోజుకూ ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఒక గోడలా పెరిగింది.”

ఆమె సీసా మూత తిప్పుతూ అంది “ఒకరోజు ఆయన పనిమీద వేరే ఊరు వెళ్లాడు.  ఆయన వెళ్ళిపోయాక ఇక ఇంట్లో  ఉండలేకపోయాను. లెటర్ రాసి పెట్టి వచ్చేసాను … నీ తప్పు లేకపోవచ్చు  కిరణ్,  ఈ కృత్రిమ వెలుగుల్లో నా మనసు చిన్నపోతోంది….ఇమడలేకపోతున్నాను. పూర్తిగా మాయం కాకముందే కాపాడుకోవాలి. దయచేసి నన్ను వెతకొద్దు.. అని  బయటికి వచ్చేసాను..“ముందే చెప్పిన కదా బాబాయ్, చెప్పకుండా పోతానని. ఆయన మరిచిపోయిండు. నేను మరిచిపోలే.” గటగట నీళ్ళు తాగింది.

కానీ బయటకు వచ్చాక వెంటనే నాకే పని  దొరకలేదు బాబాయ్. జీవితం సాఫీగా సాగడానికి ఇది నా అడవి కాదు జనారణ్యం..కడుపులో పెట్టుకునే నాన్నా లేడు.  ఏడుపు వచ్చేది. ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ ఆయన దగ్గర ఒక్క పైసా తీసుకోలే, తీసుకోను కూడా. దొరికిన ఈ పని చేస్కుంటున్న.”

ఆమె గొంతులో అస్పష్టత, ఒక లోతైన సంఘర్షణ వినిపించింది.

“ఇప్పుడు ఆలోచిస్తుంటే… నేను తొందరపడ్డానా అనిపిస్తుంది. కొంచెం సర్దుకుని ఉంటే ఆయనతో ఉండగలిగేదాన్నేమో. కానీ అడవి అలవాటైన ప్రాణం గదా,  ఊపిరి ఆడకపోతే  పారిపోవాలని అనిపించింది . నా ఆత్మగౌరవమో, అహంకారమో నాకే తెలీదు బాబాయ్. ఆయన దగ్గర ఉంటే నా గుర్తింపు పోతోందనిపించింది, బయటపడితే నా ఉనికే ప్రశ్నార్థకమైంది.”

“మరి గూడేనికి రావద్దా తల్లి.. మేమంతా లేమా? బాధ నిండిన గొంతుతో అడిగాను.

“ఏ మొహం పెట్టుకుని రావాలి? అక్కడ నాన్న నాకోసం కన్నుమూశాడు. ఇక్కడ నేను కిరణ్‌ని వదిలేసి వచ్చాను. ఏ బంధాన్నీ నిలబెట్టుకోలేనిదాన్ని నేను. అందుకే ఈ స్టోర్… ఈ బీప్‌లు, ఈ సరుకులు. ఇక్కడ ఎవరికీ నేనెవరో తెలీదు, నా పాటా తెలియదు. ” చెప్పింది వనజ..

“ఎక్కడ ఉంటున్నావు మరి ” అడిగాను

“దగ్గర్లో ఉన్న బస్తీ లొ ఉంటున్నాను చిన్న రూమ్ rent తీసుకుని.  ఆ బస్తీలొ ఏజెన్సీ వైపు నుంచి వలస వచ్చిన కూలీల ఇళ్లు ఉన్నాయి. వాళ్ల అమ్మానాన్నలు సాయంత్రం దాకా కన్‌స్ట్రక్షన్ పనుల్లో ఉంటారు.  పిల్లలు బడి అయిపోయాక సందులో రాళ్ల మీద ఆడుకుంటారు.
రోజూ సాయంత్రం నా గది మెట్ల మీద వచ్చి కూర్చుంటారు. వాళ్లకు మన రేలా పాటలు, ఆటలు మళ్లీ నేర్పుతాను. వాళ్లు పాడేటప్పుడు నా గూడెంలో ఉన్నట్టే అనిపిస్తుంది బాబాయ్. ఈ నగరంలో నా పాటను అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ లేకపోయినా, ఆ పిల్లల గొంతుల్లో నా పాట బతికే ఉంది. ఆ కొద్దిసేపు నేను కిరణ్ భార్యను కాను, స్టోర్ లొ పని చేసే మనిషిని కాను… కేవలం వనజను మాత్రమే.” వనజ గొంతులో ఏదో ఒక తృప్తి.

“సరేలే గాని రా బిడ్డా… గూడెం లొ మీ నాన్న లేకుంటే ఏమాయె… మేమందరం లేమా….మనందరి అడవి తల్లి ఎదురుచూస్తోంది. ఆ అమ్మ ఒడి నిన్ను పిలుస్తోంది. ఊరికి తిరిగొచ్చేయ్. ” అన్నాను ఆగలేక.


వనజ నా వైపు చూసింది. ఆ చూపుల్లో కంటి నీటితో పాటు ఏదో చెప్పలేని నైరాశ్యం ఉంది.

నా మాటల్లోని వెచ్చదనం ఆమె గుండెను తాకిందేమో. కానీ ఆమె వెంటనే అవుననలేదు. కాసేపు నిశ్శబ్దంగా ఉండి, ఒక నిట్టూర్పు విడిచి అంది:

“వస్తాను బాబాయ్.. కానీ ఇపుడు కాదు ” అంది వనజ .

“ఎందుకమ్మా? ఇంకెన్ని రోజులు  ఇట్లా ఒంటరిగా  ఇబ్బంది పడతావు?” అడిగాను.

“గూడెం నుండి వచ్చినప్పుడు నా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా వచ్చాను బాబాయ్… కానీ ఇప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉంది. నా ఆత్మను, నా పాటను పట్నపు రంగుల మధ్య ఎక్కడో పోగొట్టుకున్నట్టు ఉంది.
ఈ రూపంతో, ఈ గందరగోళంతో నేను ఊరికి రాలేను. నన్ను నేను మళ్లీ దృఢపరుచుకోవాలి. నా లోపలి భయాలు పోయి, నా పాటను, నా ఉనికిని నేను మళ్లీ సంపాదించుకోవాలి. నన్ను నేను దృఢపరుచుకున్న రోజు… మళ్లీ అదే స్వచ్ఛతతో నా గూడేనికి వస్తాను బాబాయ్!”
ఆమె మాటల్లో ఏ తడబాటు లేదు, ఒక గొప్ప నిజాయితీ ఉంది.

ఆ మాట విన్నాక ఆమెను రమ్మని బలవంతం చేసే ధైర్యం నాకు లేకపోయింది.

నేను ఊరికి తిరిగొచ్చిన రాత్రి కృష్ణమూర్తి పాత ఇనప్పెట్టె తెరిచాను. లోపల ఉన్న అతని పాత బటన్ల ఫోన్ ఆన్ చేసి చూశాను. డయల్డ్ కాల్స్‌లో ఒకే నంబర్ వందల సార్లు ఉంది. చదవడం రాని ఆ మనిషి, తనకు సేవ్ చేసి ఇచ్చిన ఆ ఒక్క నంబర్‌ను నొక్కుతూనే ఉన్నాడు. స్క్రీన్ మీద పేరు మసకగా కనిపిస్తోంది: “స్వేచ్ఛ”. కాల్ కలవాలంటే సిగ్నల్ కూడా ఉండాలి కదా…

తెల్లవారి ఆ ఫోన్ తీసుకెళ్లి అతని సమాధి దగ్గర పెట్టాను. జేబులో ఉన్న ఆ స్టోర్ బిల్లును సమాధి రాయి కింద నెట్టి, “పిల్ల వస్తుంది కృష్ణమూర్తీ… తను కోల్పోయిన స్వచ్ఛతను మళ్లీ గెలుచుకుని సగౌరవంగా తిరిగొస్తుంది” అని మనసులోనే అనుకున్నాను

కొన్ని నెలల తర్వాత…

ఒక రోజు సాయంత్రం ఊరి చివర రోడ్డు మీద ఎర్రటి ఆర్టీసీ బస్సు వచ్చి ఆగింది. బ్రేకుల రాపిడికి, హార్న్ శబ్దానికి పెద్ద ఎత్తున ఎర్రటి దుమ్ము గాలిలోకి లేచింది. ఆ పక్కగా వెళ్తున్న నేను ఆగి చూసాను.

బస్సు మళ్లీ ముందుకు సాగిపోయింది.

ఆ రోడ్డంతా దట్టంగా కమ్ముకున్న ఎర్రటి దుమ్ము… గాలికి పొరలు పొరలుగా మెల్లగా విడిపోతూ వచ్చింది.
ఆ దుమ్ము తెరలన్నీ పూర్తిగా తొలగిపోయాక… దారి నడిబొడ్డున నిలబడి ఉన్న వనజ ముఖం కనిపించింది!
ఆ ముఖంలో పట్నం ఇచ్చిన ఆందోళన లేదు, ఏదో కోల్పోయానన్న నైరాశ్యం లేదు. ఆమె తను చెప్పినట్టే… తనను తాను దృఢపరుచుకుని, మళ్లీ ఆ పాత స్వచ్ఛతతో, ప్రశాంతంగా వెలిగిపోతోంది. భుజాన పాత సంచి, కాళ్లకు చెప్పులు.

నాకు పట్టరాని ఆనందం అయింది.. నాతో పాటు ఊళ్లోకి తీసుకుపోయాను. ఆమె ఒక్కసారి తను తండ్రితో కలిసి కూచున్న తన ఇంటి అరుగు కేసి చూసింది. ఆప్యాయంగా తడిమింది… కన్నీటితో కడిగింది.. చూస్తున్న నాకు తండ్రి కాళ్లకు అభిషేకం చేస్తున్నట్టు అనిపించింది…

ఆమె పెదవుల మీద  రేలా పాట మెల్లగా చిగురించింది. కాసేపటికి ఆమె నా వైపు తిరిగి నిశ్శబ్దంగా నవ్వింది. ఆ నవ్వులో మళ్లీ ఆ పాత స్వచ్ఛత, ఒక గొప్ప నిర్ణయం ఇచ్చిన నిబ్బరం కనిపిస్తున్నాయి.

ఆ మరుసటి రోజు నుంచి వనజ ఆ పాత అరుగునే ఒక చిన్న పాఠశాలగా మార్చింది.

ఊరి పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని, వారికి చదువుతో పాటు తమ కన్న నేల మూలాలను, రేలా పాటలను, గిరిజన కళల గొప్పతనాన్ని బోధించడం మొదలుపెట్టింది. పట్నంలో తను అనుభవించిన అవమానాలు, తన అస్తిత్వానికి ఎదురైన ప్రశ్నలు రేపటి తరం గూడెం పిల్లలకు ఎదురవ్వకూడదని ఆమె తపించింది. తన సంస్కృతిని గౌరవిస్తూనే, ప్రపంచంతో పోటీపడేలా ఆ పిల్లలను తీర్చిదిద్దడం ప్రారంభించింది.

ఆమె తన వ్యక్తిగత ప్రేమను, ఆవేదనను ఈ సమాజంలో మార్పు కోసం, ఆ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం పూర్తిగా అంకితం చేసింది.

సూర్యుడు కొండల వెనక్కి మరుగున పడుతున్న వేళ… ఆ అరుగు మీద నుంచి పిల్లల కిలకిలలు , వాళ్లతో కలిసి వనజ పాడుతున్న రేలా పాట కొండ గాలితో పాటు ఊరంతా వ్యాపించాయి.

ఆమె ఏదీ కోల్పోలేదు.

**

కథా రచయిత, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఆడియో ప్రెసెంటేటర్, వాయిస్ ఆర్టిస్ట్, వ్లాగ్ మేకర్. కాకతీయ యూనివర్సిటీ నుంచి కామర్స్ లో మాస్టర్స్ చదివారు. 150 కవితలు, పది కథలు రాశారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మిత్రులతో కలసి 'పొయ్యిరాళ్లు' పేరుతో ఛానెల్ ప్రారంభించారు. నాలుగు షార్ట్ ఫిల్మ్స్ రాసి దర్శకత్వం వహించారు. ఫైనాన్షియల్ సెక్టర్ లో జోనల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నారు.

Leave a Reply