యే భద్రతా రెక్కల కింద పిల్లల్ని దాచుకుందాం?…

రాప్తాడులో యిరవై వొక్క యేళ్ళ యువకుడు పదో తరగతి చదువుతున్న అమ్మాయిని రంపంతో హతమార్చి, మరికొంతమందిని గాయపరిచిన సంఘటన…

అలానే హర్యానాలో ఆరేళ్ళ బాలుడు తన స్కూల్లోనే మూడేళ్ళ విద్యార్థి మీద చేసిన దాడి…

యీ సంఘటనల గురించి తెలిసినప్పుడు శరీరమంతా వణికిపోయింది. నిద్ర కరువైపోయింది. భయంకరమైన అలజడి మనసంతా.

హింస యెంటర్టైన్మెంటై వేసే యీలలు… కొట్టే చప్పట్ల ధ్వని వినోదమైన సమాజంలో నెత్తురు మడుగులో పిల్లల ప్రాణాలు తేలాడుతున్నాయి.

యేం చేద్దాం…

వాళ్ళు వస్తారు… కత్తులతో… యాసిడ్ బాటిల్స్‌తో…

రంపాలతో… సుత్తులతో…

వాళ్ళు వస్తారు… వొప్పుకోలేదనో… తిరస్కరించారనో… తమ మాట వినలేదనో… తమకు కావలసింది దక్కలేదనో…

వొప్పుకోమని బెదిరిస్తారు. వొప్పుకోకపోతే హింసిస్తారు.పసి ముఖాల్లో చిరునవ్వులు చెరిగిపోతాయి.

పసి జీవితాలు చీకటిలోకి జారిపోతాయి.

కలలు వికసించాల్సిన చోట భయం గడ్డ కడుతుంది.

వొకటా… రెండా…

తరం తరం… నిరంతరం… బాల్య యవ్వనాలను వెంటాడుతోంది హింస. క్రూరంగా… దుర్మార్గంగా…

పురుషాధిపత్యమనో… పురుషాహంకారమనో… వ్యక్తులు చేసిన పని కాదనో… సంఘమే కారణమనో… కన్జ్యూమరిజమనో… సినిమాలనో… మన మన అభిప్రాయాలను, ఆలోచనలను మనసాగక దుఃఖభరితులమై మాట్లాడుతూ వుంటాం.

పిల్లల్ని కాపాడుకోలేని నిస్సహాయత నుంచి విలపిస్తూ… వొక్కోసారి శాపనార్థాలు కూడా పెడుతూ… వొకచోట మౌనమై భీతిల్లుతూ… బెంబేలుపడుతూ… వులిక్కిపడుతూ… యిదేమిటి యిలా అయిపోయింది సమాజమని చింతిస్తాం. దిగులు పడతాం.

మనసాగక పిల్లల్ని యెలా పెంచాలి… కుటుంబం యెలా వుండాలి… స్కూల్ యెలా వుండాలి… సమాజం యెలా వుండాలి… అని ప్రశ్నించుకుంటాం.

కానీ యీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికేలోగానే మరో సంఘటన. మరో దారుణం. మరో కుటుంబంలో తీరని విషాదం.

వొకప్పుడు హీరో విలన్ నుంచి కుటుంబాన్ని… సమాజాన్ని… ప్రేమని… కాపాడుకుంటాడు.

యిప్పుడు కొన్ని సినిమాల్లో హీరో భాష సమస్తమూ విలన్ భాషే. అదే ట్రెండీ. అదే మాస్. అదే వీరత్వం.

హింసను ప్రశ్నించాల్సిన చోట హింసనే పరిష్కారంగా చూపిస్తున్నారు. ప్రతీకారాన్ని న్యాయంగా, క్రూరత్వాన్ని ధైర్యంగా, యెదుటివారిని భయపెట్టటాన్ని ఆధిపత్యంగా చిత్రిస్తున్నారు.

అయ్యో… అని బాధపడాల్సిన చోట సంతోషం కళ్ళనిండా తళతళలాడుతుంటే… హింసను చూసి చప్పట్లు కొట్టే మనస్తత్వం యెక్కడ మొదలవుతోంది? యెక్కడికి చేరుతోందనిపిస్తుంది.తెరమీద హింసను చూసిన ప్రతి మనిషీ హింసాత్మకంగా మారతాడని అనలేం. కానీ హింసను వీరత్వంగా, ఆధిపత్యాన్ని పురుషత్వంగా, ప్రతీకారాన్ని న్యాయంగా పదేపదే చిత్రించే సాంస్కృతిక వాతావరణం మన విలువల మీద యెలాంటి ప్రభావాన్ని చూపుతుందో ప్రశ్నించుకోవద్దా?ముఖ్యంగా ప్రేమను హక్కుగా భావించే మనస్తత్వం యెక్కడి నుంచి వస్తోంది?తమను ప్రేమించకపోవటాన్ని అవమానంగా, తిరస్కరణను పరాజయంగా, యెదుటివారి స్వేచ్ఛను తమ మీద తిరుగుబాటుగా భావించే పురుషాధిపత్య భావజాలం యెక్కడి నుంచి పుట్టుకొస్తోంది? ప్రేమించటానికి వొకరికి యెంత స్వేచ్ఛ వుందో, ప్రేమించకపోవటానికి మరొకరికి అంతే స్వేచ్ఛ వుంటుందనే సాధారణమైన మానవీయ విలువను యెందుకు అంగీకరించలేకపోతున్నాం?

పిల్లలకు చదువు నేర్పుతున్నాం. పోటీపడటం నేర్పుతున్నాం. గెలవటం నేర్పుతున్నాం.కానీ వోడిపోవటాన్ని స్వీకరించటం నేర్పుతున్నామా?తమకు నచ్చినవాళ్ళు తమని యిష్టపడకపోవచ్చని, తమ కోరికను తిరస్కరించే స్వేచ్ఛ యెదుటివాళ్ళకు వుంటుందని నేర్పుతున్నామా?ప్రేమంటే స్వాధీనం కాదని… తిరస్కరణ అవమానం కాదని… కోపం హింసకు అనుమతిపత్రం కాదని… పిల్లలకు యెవరు చెబుతున్నారు?యింట్లోనూ, బడిలోనూ, సమాజంలోనూ యీ విలువలను పెంపొందించకుండా హింసారహిత సమాజాన్ని యెలా నిర్మించగలం?మరోవైపు ఆరేళ్ళ బాలుడి ప్రవర్తనను చూసినప్పుడు మరింత లోతైన ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.

అంత చిన్న వయసులో హింసాత్మక ప్రవర్తనకు దారితీసే పరిస్థితులు యేమిటి? పిల్లలు యెలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళు చూస్తున్న దృశ్యాలు, వింటున్న మాటలు, యెదుర్కొంటున్న అనుభవాలు, వాళ్ళ భావోద్వేగ ప్రపంచాన్ని యెలా ప్రభావితం చేస్తున్నాయి?వయోజనుల హింసకు, పసిపిల్లల హింసాత్మక ప్రవర్తనకు వొకే కారణాన్ని ఆపాదించలేం. కానీ రెండింటినీ నిర్లక్ష్యం చేయలేం.

పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించే తీరిక కుటుంబాలకు వుందా? వాళ్ళ భయాలను, కోపాలను, అసహనాలను, అభద్రతలను అర్థం చేసుకునే అవకాశం పాఠశాలల్లో వుందా?మార్కుల కోసం, ర్యాంకుల కోసం, విజయాల కోసం పరుగులు పెట్టిస్తున్న సమాజం పిల్లల భావోద్వేగ వికాసానికి యెంత ప్రాధాన్యం యిస్తోంది?వాళ్ళకి మనం యెలాంటి ప్రపంచాన్ని అందిస్తున్నాం? సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో మానవీయ విలువలు కూడా అంతే వేగంగా వికసిస్తున్నాయా?వస్తువులను సమకూర్చుకోవటమే జీవిత విజయంగా, యెదుటివారిని అధిగమించటమే ప్రతిభగా, కోరుకున్నది దక్కించుకోవటమే సామర్థ్యంగా భావించే వినియోగ సంస్కృతి మధ్య మనుషుల్ని గౌరవించటం, వారి స్వేచ్ఛను అంగీకరించటం, భిన్నాభిప్రాయాలను సహించటం యెక్కడ నేర్చుకుంటున్నారు పిల్లలు? అసలు యీ హింసకు కారణం వొక్క వ్యక్తా? వొక్క కుటుంబమా? వొక్క సినిమానా? వొక్క సామాజిక మాధ్యమమా?కాదు కదా!మన కుటుంబ సంబంధాలు, పెంపకపు పద్ధతులు, విద్యావ్యవస్థ, సాంస్కృతిక విలువలు, సామాజిక అసమానతలు, పురుషాధిపత్య భావజాలం, హింసను సాధారణీకరించే ధోరణులు… యివన్నీ యెలా పరస్పరం ప్రభావితం చేసుకుంటున్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం వుంది.

అయ్యలారా… అమ్మలారా…!

యే భద్రతా రెక్కల కింద పిల్లల్ని దాచుకుందాం?యెంతకాలం యిలా భయపడుతూ బతుకుదాం?యెంతకాలం పిల్లలకు జాగ్రత్తలు చెప్పటంతోనే సరిపెట్టుకుందాం? హింసకు గురికాకుండా వుండే బాధ్యతను పిల్లల మీదనే మోపుతూ, హింసకు పాల్పడే మనస్తత్వాలను మార్చే సామాజిక బాధ్యత నుంచి మనం తప్పించుకోగలమా? ప్రతి సంఘటన జరిగినప్పుడూ కొన్నాళ్ళు ఆవేదన చెందటం… నిరసనలు తెలపటం… శిక్షలు కోరటం… ఆ తరువాత మరో సంఘటన జరిగేవరకు మౌనంగా వుండటం… యిదేనా మనం చేయగలిగింది? సంఘటన సంఘటనకీ బ్యాండేడ్ సొల్యూషన్స్ కాకుండా మొత్తం సమాజాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఆలోచించాలి.

సమాజంలో జరజరా బుసలు కొడుతున్న యీ హింసాప్రవృత్తి మీద సామాజిక శాస్త్రవేత్తలు, బాలల మనస్తత్వ నిపుణులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు తమ పరిశీలనను నిలపాలి.

హింసకు దారితీసే సామాజిక, మానసిక, సాంస్కృతిక పరిస్థితుల మీద విస్తృతమైన అధ్యయనాలు జరగాలి.పాఠశాలల్లో భావోద్వేగ వికాసం, లింగ సమానత్వం, పరస్పర గౌరవం, సహజీవన విలువలు, సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకునే పద్ధతులు విద్యలో అంతర్భాగం కావాలి.

పిల్లలకు కేవలం భద్రత కల్పించటమే కాదు… వాళ్ళు భయపడకుండా జీవించగలిగే సామాజిక వాతావరణాన్ని నిర్మించాలి.

ప్రభుత్వాలు యెంత వీలైతే అంత తొందరగా యిటువంటి హింసల నివారణకు అవసరమైన దీర్ఘకాలిక చర్యలను ప్రారంభించాలి. బాలల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. పాఠశాలల్లో కౌన్సెలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. హింసను ప్రోత్సహించే సామాజిక ధోరణులను నిరోధించటానికి నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

యిది వొక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. వొక్క కుటుంబ బాధ్యత మాత్రమే కాదు. వొక్క పాఠశాల బాధ్యత మాత్రమే కాదు. మనందరి బాధ్యత.

పిల్లలు భయంతో కాదు… స్వేచ్ఛతో పెరగాలి.

ప్రేమ పేరుతో ఆధిపత్యాన్ని కాదు… పరస్పర గౌరవాన్ని నేర్చుకోవాలి.

తిరస్కరణకు ప్రతీకారం కాదు… అంగీకారాన్ని అలవర్చుకోవాలి.

భిన్నత్వాన్ని ద్వేషించటం కాదు… గౌరవించటం నేర్చుకోవాలి.

మన పిల్లలకు మనం అందించాల్సింది భయంతో కుంచించుకుపోయే ప్రపంచం కాదు. నమ్మకంతో, నిర్భయంగా, స్వేచ్ఛగా జీవించగలిగే ప్రపంచం.

అందుకోసం…అంతా కలిసి హింసారహిత సమాజం కోసం అలుపెరగకుండా పని చేయాల్సిందే.

**

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

8 thoughts on “యే భద్రతా రెక్కల కింద పిల్లల్ని దాచుకుందాం?…”

  1. చాలా మంచి వ్యాసం…పిల్లల్లో చాలా విషయాల్లో భయాలు అపోహాలు అభద్రతా భావం పొడచూపుతున్నాయి! పైగా రాజకీయాలు వీటినే పెంచి పోషిస్తున్నాయి‌. ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలంటే హింస ప్రబలాలి! మన రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్ళందరూ ఇదే ధోరణితో ఉన్నారు. దీనిని ప్రక్షాళన చేయకపోతే పోతే ఇవి తగ్గవు ఇంకా పెరుగుతాయి.

  2. నిస్సహాయత ఆవరించిన వేళ మీ వ్యాసం ఒక ఊరట.

  3. ప్రతి విషయాన్ని ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పుకునేలా ఉండాలి నేటి సమాజం. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవాలి. తల్లితండ్రులు పిల్లల విషయంలో భయాన్ని పోగొట్టాలి ధైర్యాన్ని నింపాలి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సమాజం మేలుకోవాలి సమాజం ముందడుగు వేయాలి ఇలాంటి క్రూరమైన విషయాలు జరిగినప్పుడు వాటిని అరికట్టాలి.. అందరం కలిసి ఖండించాలి..

Leave a Reply