పల్లవి :
మీ పేరు అమరం
మీ వృత్తి సమరం
మీ ఊరు ఈ విశ్వమూ- మీ
వారసులే పోరాట జనమూ. ||మీ పేరు||
1)
తల్లిదండ్రులెవరంటే ఎవరినని చూపేము
కోట్లాది జనములో మీ గురుతులుండగా
కార్చిన కన్నీళ్లు ఎవరియని చెప్పేము
కన్నీళ్లు కడవలై పోటెత్తుతుండగా
కొండ కోనల మేము ఎక్కడని వెతికేము
మా గుండెలో మీరు కొలువై ఉండగా
||మీ పేరు||
2)
చెమట చిందని పంట పండునా ఎపుడైన
నెత్తురోడని నేల ఉండునా ఎకడైన
పక్షులై ప్రతి చెట్టు తిరుగుతూ బతికినా
భిక్షువోలే ప్రజలు పెట్టిందే తింటున్న
మనిషి మనుగడ కొరకు పోరాడి గెలిచినా
మనిషి మనిషిని దోసె దోపిడెదిరించినా
||మీ పేరు||
3)
మాతృస్వామ్యం బతికే వేలాది ఏళ్లుగా
బానిస రాజ్యాలు బలిదీసుకునే దాక
వర్గమని కులమని శ్రామికుల విడదీసి
ఎదురులేదని వాళ్లు మిడిసి పడేదాక
కులవర్గ దోపిడీని కూల్చేటి బలమూ
ప్రజల కొరకు ప్రాణమిచ్చేటి ధైర్యము
||మీ పేరు||
4)
ప్రపంచ గతియందు మార్పులెన్నోగని
సంఘర్షణ లేక శాంతియె రాదని
అసమానతల వల్ల యుద్ధాలు మెండని
అంతరాలు లేని సమతనే కలగనీ
చరిత్ర మార్పుకై మండేటి తైలమూ
మీ రక్తమే కదా వెలుగేటి దీపమూ
||మీ పేరు||
5)
డొంకలో అడవిలో ఒడ్డులో ఒరములో
నడిచిపోయిన దారి పూలబాట కాదు
విప్లవమె ఎదురీత కనబడి గెలిచేది
ఆటుపోట్ల నడుమ తీరానికి చేరేది
కనుగొంటూ రేపటిని కత్తులా నడుమా
అమరులా త్యాగమే గెలుచునన్నా ధీమా
మీ పేరు అమరం
మీ శ్వాస సమరం
మీ కీర్తి అజరామరం
మీ స్ఫూర్తి అజరామరం
(అమరుల త్యాగాలను కీర్తిస్తూ నవంబర్ 9, 2020 సి.పి రెడ్డి 36వ వర్ధంతిలో పాడిన పాట)