మాయవ్వ కాలిముడి

యాన్నో సముద్రాలకవతల తుపాను రేగితే ఆ ముసరతో మా పక్క రేయి పొగులు ఎడతెరుపిలేకుండా వానే! వో గంట పెద్దవాన, వో గంట తుంపర్లు, వో గంట ఈసుగాలి, నిండా మబ్బులు ఇన్ని రకాలుగా దినము గడస్తది. పద్దినాలాయ ఎండ మగము చూసి.

తెరపిడిసినబుడు మాత్రం ఇంటి బయట తిరిగి చేసుకునే పనులన్నీ ఉలిబలిగా చేసుకుంటా ఉండాము. కానీ ఒక పని మాత్రం మిగిలిపోతా ఉంది. అదే మాసిన గుడ్లు. దండ్యాలు నిండిపోతా ఉండాయి. ఆ మాసిన గుడ్ల కల్ల చూసినప్పుడల్లా మా యాడోల్లకు ఎక్కడ లేని బీతి చుట్టుకుంటుంది. ఇంట్లో అన్ని పన్లు ఒగెత్తైతే, ఈ మాసిన గుడ్లు ఉతికే పనే ఒగెత్తు. ఆ గుడ్లుతుకినాపొద్దు ఎట్లాంటి వాళ్లకైనా పానమలిసి పోతుంది. ఆడోల్లకు అంటగట్టిన పనుల్లో ఇదొగటి. అది గాక ఆడది లేని ఇల్లు తప్ప మిగతా ఊరంతా ఆడోళ్ళమే గుడ్లుతకల్లంట?

ఈ మాడంబట్టి ఏదన్నా అవసరం పడి బయట తిరిగి ఇంటికి కొస్తే ఒళ్ళు మీద వేసుకున్న గుడ్డ నానిపోతుంది. మామూలు దినాల్లో ఇప్పే గుడ్ల కంటే ఈ మాడంలో ఎక్కువ మాసిన గుడ్లు పన్నాయి. నలుగురు ఆడోళ్ళం ఒక తావజేరితే ముందుగా మేము మాట్లాడే మాట గుడ్డలు ఎబుడు ఉతికేది అని. చానా మంది మా ఊర్లో గుడ్డలు ఇండ్లల్లో ఉతకరు. మేము ఎండకు, గాలికి, మొంట్లో పనిచేస్తాము. మా ఒంట్లో సరుతు ఉప్పుగా పొంగుతుంది. ఆ మురికి బాగిడగల్లంటే ఆ గుడ్లను సలవ బండకేసి మా సత్తవార బాదల్ల.

మా అదురుస్టం బాగుండి మా ఊరు నడిమిద్దెన పెద్ద బండుంది. ఆడే నీళ్ల తొట్టి కూడా ఉంది. ఆ బండపైనే మా ఊరు ఆడాళ్ళం గుడ్డలుతికేది. అందరం మంచి, చెడ్డ మాట్లాడుకుంటా ఉతుక్కుంటాము. పొగులు ఏ పొద్దే గాని ఆ బండ కాళీగా ఉండంగా సూల్లా. ఎవురో ఒగరు గుడ్డలుతుకతానే ఉంటారు. ఆ గుడ్డలుతికే శబదం సోలిగా ఊరంతా ఇనపడుతుంది. ఆ శబదం ఇని జతకు మనిసుండారని ఉతుక్కోను పాతారు ఇంకొంతమంది .

గుడ్డోడు గువ్వనేసినట్లు ఈ పొద్దు తెల్లారి నుండి ఆకాశం తేరిడి కొట్టింది. మా ఇండ్లలో బాగా వాడే ఒక సామెతుంది ‘ముందుగా పోయినోనికే సిక్కుతుంది పొదుక్కండ’ అని. మేము ఎక్కువ సచ్చిన గొడ్లను తెచ్చుకొని కోసుకొని తింటా ఉన్నోళ్ళం. ఆ గొడ్డు మొత్తంగా ఉండే తునక రుసి ఒగెత్తైతే, దాని పొదుక్కండ రుసి ఏరుగా ఉంటుంది. అంత బాగుంటుంది. ఆ పొదుక్కండ యనకబొయినోల్లకు సిక్కదు. అట్లా మా ఊరి సలవబండకి కూడా ఈ పొద్దు ఎక్కువమంది పాదుకుంటారు. ముందుగా పోవల్లని మాసిన గుడ్డలన్నీ మూటకట్టుకొని బయలు దేరితి .

నాకిబుటికీ గుర్తుంది. నా చిన్నబుడు మా యమ్మోల్లు గుడ్డలిడిగే దానికి నిర్మ సబ్బు, పొడి, తెల్ల గుడ్లకు పెట్టేదానికి నీలిమందు గడ్డ, గాములు లెక్కన అమ్మేవాళ్లు. పది ఇరవై గాములు తెచ్చుకొని ఒక గుడ్డలో మూటగట్టి ఆ మూట నీళ్లల్లో కలిపి తెల్ల గుడ్లు అద్దేది. ఒగ మూట సుమారు ఆరునెల్లు వచ్చేది. యా యమ్మ న్నా ఒగాయమ్మ గుడ్డలుతికే సబ్బు సరుపు పలానిది బాగుంటుంది అని చెప్తే ఊరంతా అదే వాడతారు. ఈ నడన మల్లా ఉజాల నీలి డబ్బాలు, సరుపెక్సెల్ సబ్బు, సబ్బుపొడి అవి రెండే ఊరోళ్లంతా ఉతికేది. ఆ సబ్బుతో వొగనాడు గుడ్డలుతికినామంటే అరచేతులు పైనుండే పైతోలంతా మూడు దినాలు పొట్లు, పొట్లుగా లేసిపోతుంది. కొందరికి అరిచేతులు బొక్కలు కూడా పడతాయి. కొందరికి చేతులు మంటలు వస్తాయి. టీవీల్లో చూపించినట్లు మురికి గుడ్డ మీద చెయ్యి పెడతానే అట్లా తెల్లగా అయిపోతాయే అట్లా చూసి కూడా చాలామంది తెచ్చుకుంటారు. నేను కూడా సరుపెక్సల్ సబ్బెత్తుకొని బండకాడికి పోతి. నాకాడికి ముందుగానే నలుగురొచ్చి ఉతకతా ఉండారు.

బండే కదా అని యాడబడితే ఆడ గుడ్డలుతకను కాదు. మేము కూర్చునే దానికి సదరంగా ఉండి, గుడ్డలుతికే దానికి ఆ ముందర కాసింత ఏటవాలుగా ఉండి, ఆ బండ కూడా ఎక్కువ నునుపు లేకుండా, ఎక్కువ గరుకు లేకుండా ఉండల్ల. అట్లా బండ పైన గుడ్డలు బాగా ఇడగతాయి. ఆ తావుల్ని ముందుగా పోయినోళ్ళు ఆకిరిమించేస్తారు. అందుకే ముందుగా పోవాలనేది. అడక్కతిన్ను పోయినా ఆరుబాట ముండల్ల అనేది. సరే అని నాకు తగిన బండ చూసుకొని కుసుంటి. ఈలోగా మా ఆడబిడ్డ సరోజి నా పక్కనే కూసొని దాని మాసిన గుడ్డల మూట ఇప్పబాయ.

ఈడ మా సరోజి గురించి చెప్పల్ల. అది కూడా ఇంచు మించు మా ఈడుదే. మేమంతా తొమ్మిది మంది దాకా ఉండాము. మేము తొమ్మిది మంది ఒకసారిగా బల్లో చేరినోళ్ళం. మాలో ఐవోర్లు కొట్నారని బయపడి చదువు నిలిపేసినోల్లు కొందరు, అచ్చరాలు రాక నిలిపేసినోల్లు మరి కొందరు, ఇంట్లో పరిస్తితులు బాగాలేక నిలిపేసినోల్లు ఇంకొందరు, ఇట్లా అందరం ఐదు లోపలే బడికి నామం పెట్టేసినాము. కానీ మాలో తొమ్మిదో తరగతి వరకు చదివింది సరోజి ఒకటే. దానికి చదువు మింద చింత ఉన్నాకూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసిరి. కాకపోతే అది యాడ కాగితం కిందపడినా ఎత్తి సదివి చెప్తుంది. జాబులు రాస్తుంది, జాబులు సదువుతుంది, క్యాలెండర్లో వారం, వజ్జెరం చెబుతుంది. మా అందరి మనసుల్లోనూ అది బాగా చదివిన లెక్కసారం. అందరూ దాన్ని తెలివైంది అంటారు. ఇంట్లో వాల్లమ్మా, నాయిన, వాల్ల నాయనమ్మ, వాళ్ల తాత నలుగురు ముసలోళ్లతో అది ఏగతా ఉంది. వాళ్ళమ్మ ఈ యమ్మను తమ్మునికిచ్చి ఇల్లరీకం చేసుకుంది. దానికి కూడా ఇద్దరు బిడ్డలు .అయినా కూడా మగము చిట్లిచ్చుకోకుండా ముసలోళ్ళను బాగా చూసుకుంటుంది.

బండ కొచ్చి నా పక్కన దాని మాసిని గుడ్ల మూట ఇప్పేకుందుకు ఆ మూట్లో నుండి గప్పున కుమిటిగబ్బు కొట్టే. నేను ముక్కులెగరేస్తా ‘‘ఏందే సరోజ, గుడ్లనుంచి గొబ్బు , మీ సీతవ్వ గుడ్లలో ఏమన్నా ఏరుకుందా? నీ గుడ్లెత్తుకొని దూరంగా పోయి ఉతుక్కోపో’’ అంటి. ఆ మాటకు సరోజి ‘‘కాదే వదిన ఆ కత చెప్తే పెద్దది. మా అవ్వకు నిన్న పానమగదప్పింది, ఆసుపతిరికి తోడుకొని పోదామని నేనే మాయవ్వను పయనం చేసుకొని దొన్ని కట్టి పట్టుకొని చిన్నగా దావింటి నడిపించుకుంటా పోతావుండాము. ఈ మోడాలు బట్టి చల్లగాలి తోల్తా ఆకాశం మబ్బులు లేసుకోనుంది. మాయవ్వ ఉచ్చల్ని కాలిముడి అంటుంది. బారడు దూరం నడుస్తామో లేదో ‘‘పాప నేను కాలిముడి పోయల్ల’’ అంటుంది. మన ఊరి దావ కాబట్టి దావింటి పెద్దగా జనాలు కూడా తిరగరు, రోడ్డు కిరుపక్కల మొన్నుంది, ఆడాడ చింతమాండ్లు, లక్కమాండ్లు మొరుగుండాది. ఆయమ్మ కాలిముడి పోయల్ల అన్నబుడల్లా చెట్టు మొరుక్కు రోడ్డుపక్కకు నిలబెట్టి పోపిచ్చుకొని పోయిన. మెయిను రోడ్డుకు పోయేకాడికి మూడుసార్లు పోసింది. ఈ యమ్మ యాడ నడిదావలో నిలమ్మంటుందో అని బస్సు కూడా ఎక్కకుండా ఆటో ఎక్కిపోతి. ఆసుపతిరిలో అడుగుపెట్టీ పెట్టకనే మల్ల కాలిముడి పోయల్ల నాయనా అనే. ఆడ మల్ల పేషెంట్లు ఉండే వార్డులోకి తోడకపోయి పోపిచ్చుకొని ఆసుపత్రిలో చూపించుకోని బయట కొచ్చి ఆ పక్కనే టీయంగిడి ఉంటే ఈయమ్మకు వొగలాసు పాలు, ఒగ నానరొట్టి తీసిస్తి. ఆ పాల్లో రొట్టి అద్దుకొని తినె . నేను గలాసు టీ తాగితి. మాయవ్వ పానం కొంచెం తెపుర్లు కుండే. ఇంక మేమిద్దరం బస్టాండుకొచ్చి బసెక్కలంటే ఆసుపతిరి నుండి బస్టాండుకు ఆటోకి యాబై రూపాయలు, నా దగ్గర ఆడి కాడి కుండాయి డబ్బులు. సరేవా చిన్నగా నడుచుకొని పదాం పద అని చిన్నగా వస్తాఉండాము. మాయవ్వ చెయ్యి రెట్ట పట్టుకుని నడిపించుకుంటా వస్తాఉండ.

బెంగుళూరు బస్టాండ్ దాటుకొని చిత్తూరు రోడ్డింటి మూడు రోడ్లు కలిసే టౌనుబేంకు సరికిలిలోకి వచ్చేకుందుకు మాయవ్వ మల్లా కాలిముడి వస్తది అనే. నా గుండెకాయి సల్లగైయిపాయ. యాడచూసిన జనాలు కిక్కిరిస్తా ఉండారు. చుట్టూ అంగిళ్ళు, వచ్చే బండ్లు, పోయే బండ్లు. మేము రోడ్డుపక్క నిలబడుకొనుండాము. గుడ్లంగిట్లో కుసోనుండే ఆ యప్ప నడిగితి, అన్నా ఇక్కడ యాడన్నాకక్కసు రూములు ఉన్నాయా అని. ఈ చుట్టుపక్కల ఏడేగాని లేవమ్మా, మీరు పోతే బస్టాండుకే పావల్ల అనే ఆయప్ప. ఆ బస్టాండుకు పావల్లంటే ఆటోకి యాబై రూపాయలు పోయేదానికి, యాభై రూపాయలు వచ్చే దానికి, ఆడ కక్కసు పోయేందుకు పది రూపాయలు. నూట పది రూపాయలు కావల్ల. నా దగ్గర ఊరికి పోను చార్జి కైయేటిగా ఉంది. ఇప్పుడేం చేయల్ల బగవంతుడా అని నాకు దిక్కు తెల్ల . యాడేగాని కాసింత బిడుగు జాగా లేదు, కాసింత మొరుగులేదు, కాసింత మన్ను లేదు. ఈ జనాలు ఏమనుకుంటారో ఏమో, యాడ పోయమనల్ల అనే ఆలోచన ఊపిరాన్నీలే.

నేను చుట్టుపక్కల దిక్కులు చూస్తన్నట్లే మాయవ్వ నిలబడున్నట్లే గుడ్లలోనే పోసేస్తా ఉంది. దరిద్రునికి యాటికి పొయినా రాళ్ళవానే అన్నట్లు, ఆపొద్దే ఆయమ్మకి ఎర్ర నూలుచీర కట్టిన్య . నడిచేటప్పుడు యాడ దొందురుకొని పడుతుందేమో నని ఆ చీర కూడా ముని కాళ్ళ పైకి ఎగట్టిన. ఆ కీలురోడ్డు మింద నల్లగా ఉచ్చలు దొల్లుకొని పోతా ఉండాయి. చుట్టూ జనాలే. ఏ పక్క నేను అడ్డగిద్దు. ఆయమ్మ ఎర్ర చీర ఒంటికితో నాని తడిసిన మరక తెలస్తా ఉంది. ఉచ్చల్లో నానిన చీర అంచులింటి ఆ ఉచ్చల్లు బొట్టు, బొట్టుగా కారతా ఉండాయి. ఆ ఉచ్చల్లో తడిసి నిలబన్న మాయవ్వను, రోడ్డుపైన పారిన ఉచ్చల్ని, పక్కన నిలబన్న నన్ను కలిపి రోడ్డు మీద పోయే జనాలు ఒకేసారి ఎర్రి చూపులు చూస్తా పోతా ఉండారు. నాకు తలగొట్టేసినట్టు అయింది. మొంట్లో ఉచ్చలు పోస్తే గబక్కున ఇమిరిపోతాయి. కానీ కీలురోడ్డుమీద తడి ఆరలే. దొంగతనమో, కూనినో చేయరాని నేరం చేసినంత చిన్నతనం అయిపోయింది. మా యవ్వను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితి. నువ్వు సచ్చన్న పోరాదా నాకేంది ఈ కర్మ అని. చిన్నగా నడిపించు కొని కాసింత దూరం పోయి ఆడ కాన్చేడి కుసంబెట్టి. ఆయమ్మ ఉచ్చల గుడ్లు ఒలి బలిగా ఆరినంక తోడుకొని వస్తా ఉంటే గాలికి ఉచ్చలగద్దు వాసన వస్తా ఉంది. జనాల్లో ఎక్కితే ఏమనుకుంటారో ఏమో అని పక్కన అంగిట్లో పది రూపాయలించ్చి పాంచు పాడరు చిన్న డబ్బా తీసుకొని ఆ పాడరు అంతా ఆ యమ్మ చీర మింద ఇదిలిచ్చి ఆటోఎక్కి ఇల్లు జేరితిమి. ఆయమ్మను ఇల్లు జేరిసిందంకా ఏందో నేను ఆయమ్మ చేయరాని నేరం చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నంత పని అయింది. ఇంగ మాయవ్వ సచ్చినా, బతికినా, యాడికీ బయట తొడప్పోకూడదు అనిపిచ్చేసింది నాకు.

కాదు వదిన అబుడెబుడో నేను సదువుకునేటప్పుడు పిల్లి కండ్లైవోరు ఓ మాట చెప్పేది. అద్దరాతిరి ఆడబిడ్డలు నడి రోడ్డుమింద ఒంటరిగా తిరుగుతారో అబుడే నిజమైన సొతంతరము వొచ్చినట్లే అని. కానీ నాకు నిన్న అనిపించింది. ఆ జనాలు మా కళ్ళ నేరస్తుల్ని చూసినట్లు చూస్తూ ఉంటే ఆడది, రాత్రి మబ్బులో యాడన్న ఉచ్చలన్నా పోసుకోవచ్చు. దానికంటే ముందు పట్టపొగులు ఆడది బయటొచ్చినపుడు యాడ ఉచ్చలొస్తే ఆడ కక్కసు రూములు కనబడి దైర్నంగా ఉచ్చలు పోసినబుడే నిజమైన సొతంతరము వచ్చినట్టు అనిపించింది. ఏదన్నా పనిబడి మదనపల్లికి పోతే తిరిగి ఇంటికి రావాలంటే ఐదారు గంటలు పడుతుంది. కడుపునిండా అన్నం తిని, నీళ్లు తాగి పొయినామంటే, ఉచ్చలుబోయను నూరు రూపాయలు ఎచ్చుగా ఎత్తుకొని పావల్ల.

మదనపల్లి దినదినానికి ఎంత ఇడగతా ఉంది మన చిన్నబుడెట్లుంది, ఇబుడెట్లుంది నాలుగు దిక్కులు పెరిగిపాతానే వుంది. ఏగిలేసి పొద్దు కుంకితే లచ్చులాది మంది బతుకుదెరువు చేసుకొని ఇండ్లకు పోతా ఉండారు. యా సందు చూసిన, యాగొంది చూసినా జనాలే. పతి బజారుకు ఒక కక్కసు పెట్టినా సాలవేమో? అయినా ఆడదాని అవసరాలు ఇంట్లో మగోల్లే పట్టించుకోరు. ఇంగ దేశం మొగోల్లు ఏం పట్టించుకుంటారులే’’ అనే సరోజి. వాళ్లవ్వ ఉచ్చల గుడ్లన్నీ నా పక్కనే ఉతికే.

**

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

Leave a Reply