ఎవరైనా ఎంత కాలముంటారని
గదిలో ఒంటరిగా కూర్చొని ఉక్కపోతను భరిస్తూ
రావాలికదా
తలుపులు తెరిచి బయటకు వచ్చి
వీచే చల్లగాలికి
మనసును ఆరబెట్టుకోవాలి కదా!
చెప్పినంత సులభమేమీ కాకపోవచ్చు
ఒక ఆకాంక్ష ఆచరణగా రూపుదిద్ధుకోవడం
యుద్ధం ముగిసిన తర్వాత
తెగిపడ్డ శరీరాంగాలతో
రక్తసిక్తమై రణ భూమిలా ఉన్న ఇంటిని
తుఫాను ముంచెత్తిన తర్వాత
చెల్లా చెదురై కుప్పకూలిన ఇంటిని
మళ్ళీ పునర్నిర్మించుకోవాలి గదా
తెల్లవారగానే నిదుర లేచి
వాకిలిలో పేరుకుపోయిన
చెత్తను ఊడ్చి అవతల పడేసి
కళాపి చల్లి ముగ్గులు పెట్టి
దినచర్యలో అడుగు పెట్టాలి కదా
ఎంత కాలమని గతానికి వేళ్ళాడుతూ నిలుచుంటాం
ఎంత కాలమని మనల్ని మనం నిందించుకుంటూ
కాలాన్ని సాగదీస్తుంటాం
తుఫానులను తట్టుకొని నిలబడేటట్టు
భూకంపాలను తట్టుకొని నిలబడేటట్టు
అనుభవాలన్నింటినీ మదింపు చేసుకొని
ఇటుక ఇటుక పేర్చి
గోడలు నిర్మించి
పై కప్పు వేసి
బలంగా మళ్ళీ ఇంటిని నిర్మించుకోవాలికదా
గతాన్ని తలుచుకున్నప్పుడల్లా గుర్తుకు వచ్చే
మన వైఫల్యాల నుండి బయట పడాలి కదా
మానని గాయాలకు
కాలమే అసలైన మందు
అనుమానం లేదు!
ఇవాళ కాకపోయినా రేపైనా
వనాల నుండి వేరుపడిన పువ్వులన్ని
మళ్ళీ ఉద్యానవనాల పాటలు పాడుతాయి
సముద్రాన్నుంచి ఎగిసిన నీటి బిందువులన్ని
మళ్ళీ సముద్రపు ఘోషను వినిపిస్తాయి
అడవులను వీడిన పక్షులన్ని
మళ్ళీ అడవుల అంతరంగ రాగాలను వినిపిస్తాయి
పుడమి తల్లికి దూరమైన ఇసుక రేణువులన్ని
మళ్ళీ నేల పాటను ఎలుగెత్తి పాడుతాయి
ఏరివేయబడ్డట్టు చెల్లాచెదురైన ఆలోచనలన్నీ
గడ్డిపరకలతో బలమైన తాడు పేనినట్టు
ఒక్కచోట చేరి
ఒకే ఆలోచనగా రూపు దిద్ధుకుంటాయి
చెదిరిపోయిన అడుగులన్నీ
మళ్ళీ దారిని కనుగొంటాయి
కాకుంటే
ఈసారి
మరింత ధృడంగా
మరింత విశ్వాసంతో
మరింత ఐకమత్యంతో
కొత్తకొత్త ఆలోచనలతో
కొత్తకొత్త దారులలో
కొత్తకొత్త వ్యూహాలతో…