దేశమే నిషేధాల మయం!

సాగుతున్న జనహననాన్ని, చిన్నారి పిల్లలను ఆకలికి మాడ్చి చంపడాన్ని నిరసించే మానవీయ ప్రదర్శనపై నిషేధం! నడిచివచ్చిన విషాదచరిత్రను చెప్పే సునిశిత మేధా అధ్యయనాల, విశ్లేషణల పుస్తకాలపై నిషేధం! తన జీవితాన్నంతా ఆదివాసుల సేవలో ధారపోసిన మనిషిని జ్ఞాపకం చేసుకునే సభపై నిషేధం! కార్పొరేట్ కోరల్లో చిక్కిన ఆదివాసి బాధితులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మనుషులపై నిషేధం! నిరసనపై నిషేధం, పుస్తకంపై నిషేధం, జ్ఞాపకంపై నిషేధం, మనిషిపై నిషేధం! ఒకటి ఉత్తర కొసన జమ్ము కశ్మీర్ లో, మరొకటి తూర్పు తీరపు ఒడిశాలో, రెండు పశ్చిమ తీరపు మహారాష్ట్రలో! అంటే ఇవాళ దేశం నిషేధ పరీవృతమై ఉన్నది. ఈ మూడు ప్రాంతాలలో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతం, రెండు బిజెపి పాలిత రాష్ట్రాలు.

మొదట నిరసనపై నిషేధం: ఇరవై రెండు నెలలుగా గాజాలో సాగుతున్న మారణహోమం మీద ప్రపంచమంతా మానవీయంగా స్పందిస్తున్నది. దశాబ్దాలుగా సాగుతున్న దుర్మార్గమే అయినప్పటికీ, ఇటీవల పెచ్చరిల్లిన దారుణ మారణకాండలో ఇప్పటికి 17,000 మంది చిన్నారి పిల్లలతో సహా 65,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైనిక చక్రబంధంలో ఉన్న గాజాకు ఆహార పదార్థాలు, ఔషధాలు కూడా రవాణా కావడానికి వీలులేదనే ఆంక్షల వల్ల ఆకలికి పిల్లలు చచ్చిపోతున్నారు. పక్కటెముకలు తేలి అస్థిపంజరాలుగా మారిన పిల్లల దృశ్యాలు, వీడియోలు ప్రతి రోజూ అంతర్జాతీయ వార్తాఛానళ్లలో కనబడుతూ ప్రపంచ మానవ హృదయాన్ని తట్టి లేపుతున్నాయి. నిరసనగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట విస్తారమైన ప్రజా ప్రదర్శనలు కనబడుతున్నాయి. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మూడు లక్షల మంది ప్రదర్శన అందరూ చూశారు. నెదర్లాండ్స్, స్పెయిన్, ఫ్రాన్స్, స్వీడన్, ఐర్లాండ్, ఈక్వడార్, బాంగ్లాదేశ్, పాకిస్తాన్, మలేషియా – ఎన్నో దేశాల్లో మానవత్వం తనను తాను వ్యక్తీకరించుకుంటున్నది.

బహుశా భారతదేశంలోనే ఇప్పటికి అటువంటి విస్తృత ప్రజా నిరసన ప్రదర్శన జరగలేదు. ముంబాయిలోని ఆజాద్ మైదాన్ లో ఒక ప్రదర్శన జరపాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రయత్నిస్తున్నది. జూన్ 19, జూలై 15, జూలై 31 – మూడు సార్లు ప్రదర్శనకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసింది. పోలీసులు మూడుసార్లూ నిరాకరించారు. నిరాకరణను సవాల్ చేస్తూ నిర్వాహకులు బొంబాయి హైకోర్టుకు వెళ్లారు. న్యాయమూర్తులు అనుమతి ఎందుకివ్వలేదని, రాజ్యాంగ అధికరణం 19 (1) ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను అడిగే బదులు. “మీకు దేశంలో సమస్యలేమీ కనబడలేదా? ఎక్కడో వేల మైళ్ల ఘటనల గురించి ఇక్కడ ప్రదర్శన జరపాలా? కాస్త దేశభక్తి నేర్చుకోండి” అని నిర్వాహకులకే సలహాలు చెప్పారు.

పుస్తకాలపై నిషేధం: సరిగ్గా అదే సమయానికి జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వ హోమ్ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని పుస్తకాలు చరిత్రను వక్రీకరిస్తున్నాయని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని, అందువల్ల ఆ పుస్తకాలను నిషేధిస్తున్నామని, వాటిని ఎవరూ దగ్గర ఉంచుకోవద్దని, ఉంటే జప్తు చేస్తామని ఆ ఆదేశం. పుస్తకానికి పుస్తకంతో, వాదనతో జవాబు చెప్పాలి గాని, పుస్తకం నోరు నొక్కగలరా? పైగా ఆ పుస్తకాలన్నీ ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు, జర్నలిస్టులు రాసినవి. ప్రపంచమంతా ప్రచారంలో ఉన్నవి. రౌట్లెడ్జ్, వెర్సో, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, మాంచెస్టర్ యూనివర్సిటీ ప్రెస్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వంటి అంతర్జాతీయ, మనోహర్, గుల్షన్, జుబాన్, హార్పర్ కాలిన్స్, పెంగ్విన్, పాన్ మాక్మిలన్ ఇండియా, బ్లూమ్స్ బరీ అకడమిక్ ఇండియా వంటి జాతీయ ప్రామాణిక ప్రచురణ సంస్థల ప్రచురణలు. సమాచారాన్ని, జ్ఞానాన్ని, అధ్యయనాన్ని, విశ్లేషణను నిషేధించడం సమాజాన్ని ఏ చీకటి కొట్లలోకి నడిపించడానికి?

జ్ఞాపకంపై నిషేధం: బిహార్-జార్ఖండ్ ఆదివాసుల సేవలో జీవితాంతం గడిపిన జెసూయిట్ ఫాదర్ స్టాన్ స్వామిని, కేవలం ఆదివాసుల మీద కార్పొరేట్ అక్రమాలను ఖండిస్తున్నాడని, అక్రమ కేసులలో నిర్బంధించిన ఆదివాసులకు న్యాయపోరాటంలో రక్షణగా ఉంటున్నాడని కోపంతో భీమా కోరేగాం అక్రమ కేసులో నిందితుడిగా చూపి 2020 అక్టోబర్ లో అరెస్టు చేశారు. ఆయన నిర్బంధంలోనే అనారోగ్యంతో 2021 జూలై 5న మరణించారు. అప్పటి నుంచి దేశంలో ఆనేకచోట్ల ఆయన పేరు మీద స్మారకోపన్యాసాలు జరుగుతూ, సమాజానికి ఆయన అందించిన సేవలను జ్ఞాపకం చేసుకునే ఆనవాయితీ సాగుతున్నది. ఈ సంవత్సరం ముంబాయిలోని సేంట్ గ్జేవియర్ కాలేజీలో ఫాదర్ స్టాన్ స్వామి స్మారకోపన్యాసంగా ‘జీవిక కోసం వలస: కష్టాల మధ్య ఆశాసూచిక’ అనే అంశం మీద రోమ్ లోని పోంటిఫికల్ గ్రెగోరియన్ యూనివర్సిటీ, థియాలజీ అధ్యాపకులు ఫాదర్ ప్రేమ్ హోల్హోను ఆహ్వానించారు. “దేశద్రోహి” పేరు మీద స్మారకోపన్యాసం జరుపుతారా, ఖబర్దార్” అంటూ ముంబాయి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యదర్శి ప్రశాంత్ మాలి కాలేజీకి బెదిరింపు ఉత్తరం రాశారు. స్టాన్ స్వామి నిందితుడే తప్ప నేరస్తుడు కాదని, ఆయన నేరం రుజువు కాలేదని, అసలు విచారణ కూడా జరగలేదని కాలేజీ ప్రిన్సిపాల్ ఫాదర్ కీత్ డిసౌజా జవాబు చెప్పడానికి ప్రయత్నించారు గాని, చివరికి బెదిరింపులకు లొంగిపోయి, స్మారకోపన్యాసాన్ని రద్దు చేశారు.

చివరి ఘటన, మనుషులనే నిషేధించినది. ఆగస్ట్ 9 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం. స్వయంగా ప్రధాని మోడీ సందేశంతో ఆరోజు ప్రభుత్వం కూడా ఉత్సవం జరిపింది. ఒడిశా లోని సిఝిమాలి కొండలలో వేదాంత కంపెనీ సాగిస్తున్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న ‘మా, మాటి, మాలి సురక్షా మంచ్’ (తల్లి, భూమి, మనిషి పరిరక్షణ వేదిక), నియాంగిరి సురక్షా సమితి ఈ ఆదివాసి దినోత్సవం నాడు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి, నర్మదా బచావ్ ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ను ఆహ్వానించి సభ జరుపుదామనుకున్నారు. కాని ప్రభుత్వం ఆమెను, ఆమెతో పాటు ఆ రెండు ప్రజా సంఘాల నాయకులు ప్రఫుల్ల సమాంతర, నరేంద్ర మొహంతీ, లింగరాజ్ ఆజాద్, రాజా రంజన్, శరణ్య కుమారి, రాజ్ కిషోర్ సునాని లను అక్కడికి ప్రవేశించగూడదని నిషేధించింది. రాయగడ జిల్లాలోని సిఝిమాలి, కాశీపూర్, సుంగేర్, అడజోర్, సిందూర్ ఘాటి, తలాఝిరి గ్రామాలకు వాళ్ల ప్రవేశం నిషేధం. ఈ ఏడుగురు, ఆ ఆరు గ్రామాలలో పాదయాత్ర, బహిరంగ సభ, సమావేశం, పత్రికా సమావేశం, మనుషులతో సంభాషించడం, నిరసన ప్రదర్శన నిర్వహించడం నిషేధిస్తున్నామని ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ప్రకటించారు.

ఇదీ ఈ దేశం సాధిస్తున్న పురోగతి! నైసర్గికమైన మానవహక్కుల నిషేధం. భావ ప్రకటనా స్వేచ్ఛపై నిషేధం. నిరసన ప్రదర్శనపై నిషేధం. పుస్తకాల అధ్యయనంపై, జ్ఞాన సముపార్జనపై నిషేధం. పెద్దల జ్ఞాపకాలను స్మరించుకోవడం నిషేధం. ఆ పెద్దల స్మృతిలో అవగాహనలను విశాలం చేసుకోవడం నిషేధం. తమ భూములు లాక్కొని, తమను నిర్వాసితులను చేసిన కార్పొరేట్ అక్రమాలకు వ్యతిరేకంగా, తమకే కేటాయించబడిన అంతర్జాతీయ దినాన ఒక చిన్న సభ ఏర్పాటు చేసుకుని, ఆ రంగంలో ప్రపంచ ప్రసిద్ధులైనవారిని ఆహ్వానిస్తే వారి మీద నిషేధం. ఎటు పోతున్నదీ దేశం?

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “దేశమే నిషేధాల మయం!

Leave a Reply