కుల వివక్ష (Caste Discrimination):
కులం ఒక సామాజిక వ్యవస్థ కాదు – అది ఒక మతం” – డా. బి.ఆర్. అంబేడ్కర్.
“కుల వ్యవస్థ ఉత్త శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన కూడా” (Caste System is not merely division of labor. It is also a division of laborers అని అంబేద్కర్ మరింతగా నొక్కిచెప్పారు. ఆర్థిక, సామాజిక, మత, చట్టపరమైన లేదా రాజకీయ ప్రమాణాల ద్వారా వేరు చేయబడిన వ్యక్తుల సమూహాన్ని కులం అని అర్థం వస్తుంది. ఎటువైపు తిరిగినా ఎదురొచ్చేది కులం అని అంబేద్కర్ చెప్పినట్లు వివక్ష అక్కడున్నది. ఇక్కడలేదనేది లేదు. సర్వకాలాల్లో సర్వ వ్యాపితం అయింది. కుల వివక్ష పాథమిక హక్కులను కాలరాయడం, సమాజంలో అసమానతలను సృష్టించడం. ఈ వివక్షత వల్ల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. పౌర హక్కుల పరిరక్షణ చట్టం, SC/ST (అత్యాచార నిరోధక) చట్టం వంటి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. వివక్షను సంప్రదాయ కులవివక్ష, ఆధునిక కులవిక్ష అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. కొన్ని కథలను పరిశీలిద్దాం.
సంప్రదాయ కులవివక్ష: సంప్రదాయ కుల వివక్ష అనేది భారతీయ సమాజంలో పురాతన కాలం నుండి వస్తున్న సామాజిక అసమానత. కులం ఆధారంగా మనుషులను వర్గీకరించి, ఒక వర్గం వారిని అణచివేయడం, వారి హక్కులను కాలరాయడం దీని ముఖ్య ఉద్దేశం. వివక్ష చూపే విధానాలలో పధానంగా అంటరానితనం, దేవాలయ ప్రవేశం, పాఠశాలల్లో ప్రత్యేక కూర్చోబెట్టే విధానాలు, సామాజిక బహిష్కరణలు. వృత్తిపరమైన బలవంతం చేయాలనడం, సాంస్కృతిక ఆంక్షలలో వివాహాలు, పండుగలు, సామాజిక వేడుకలలో కూడా కులాంతర సంబంధాల అంశాలున్నాయి.
తెలుగు కథా సాహిత్యంలో దళితవాదం 1990 నుండి ఉద్యమ రూపంగా వచ్చింది. బోయ జంగయ్య కథలలో అధికం దళిత స్పృహతో దళితుల జీవన విధానాన్ని చిత్రించాయి. 1970 ముందు తెలుగు సాహిత్యంలో పల్లెబతుకుల విస్తృతి అందించాడు. కుల వివక్షకంటే ఎక్కువ కుల సమస్యలు ఏకరువు పెట్టాయి. మీ బర్రెకు ఉప్పునీళ్లు పోస్తం కానీ మాకొన్ని మంచి నీళ్లడిగినా పోయని కుల వివక్షను చూపిన కథ ‘ఉప్పు నీళ్లు’. ‘పాము’ కథలో తొడపాము ఉన్నవారితో సంభోగం చేస్తే చనిపోతారనే మూఢనమ్మకంలో పెద్దొర్సాని కొడుకు బతుకాలని వేసిన పన్నాగమే ఈత. ఈత నేర్పుమని చిందొర్సానిని నారిగాని వద్దకు పంపిస్తే శారీరకంగా ఒక్కటయ్యారు. నారిగాడు చావలేదు. కోడలు నారిగాన్ని వదులలేదు. కొడుకు కాపురం చక్కబడాలంటే నారిగాన్ని నిద్రలో చనిపోయేలా చేసారు. పాము కరిసిందని నమ్మించారు. దొరల జుల్మును ప్రశ్నించిన కథ ‘ఇంకనా ఇకపై సాగదు’. కలెక్టరయిన కొండయ్య బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులని మరిచిపోయాడని చెప్పే కథ ‘దొరసాని’.. వ్యవసాయం కాదనీ చెప్పులు కుట్టేలా కుట్ర పన్నిన కథే ‘ఇది కతా’. ఆర్థికలేమితో పాటు కుల వెనుకబాటుతనం ఉంటుందనీ, దేశంలో కమ్యూనిజం నిలబడలేక పోతుందంటాడు. ఈ విషయమై “వామపక్ష దృక్పథంలోంచి ఎదిగి దళిత దృక్పథంలో కథా ప్రస్థానం చేసిన రచయితగా జంగయ్యను” పరిశీలించాలని డా. తాళ్లపల్లి యాకమ్మ పేర్కొనడం సముచితంగా ఉంది. దళితులు రాసిన ప్రతి కథలో ఎంతో కొంత వివక్షాపూరిత బాధ కనపడుతుందంటే అతిశయోక్తి కాదు.
జాతాశ్రీ కథలు దళిత స్పృహతోనే రాసాడు. కరువు పరిస్థితుల వల్ల నీరు దొరకటం లేదు. మాలగూడెం అంతా బతుకడానికే వలస పోతున్నట్లు ‘వలస’ కథ చి తించింది. రాయప్ప చిన్నయ వైపు కడు దీనంగా పెదయా అని పిలుస్తుంటే అతని కళ్లు నీళ్లు అడుగంటిన బావిలా ఉన్నాయని పోల్చడం కరువుకు ప్రతీకగా ఉంది. ఉన్న ఊరును కన్నతల్లిని విడిచి వెళ్లుతున్నప్పుడు ధ్వంసమవుతున్న వాళ్ల గుండెల్ని చి తించిన తీరు పాఠకుడికి దు:ఖపుతెర విసురతది. అవసరానికనుగుణంగా కులాన్ని, అంటరానితనాన్ని వాడుతుంటారు. దళితులు పనిచేసేటప్పుడు లేని అంటుముట్టూ దళితులు ఇచ్చే వస్తువులకు అంటరానితనం ఉంటుందనీ దగుల్బాజీతనాన్ని తెలిపే కథ మాష్టార్జి రాసిన ‘అవసరమొస్తే’ కథ చిత్రించింది. రామిగాడు కూరగాయలు తెస్తే పటేలమ్మ కడుక్కుంటుంది. బియ్యం తెస్తే పసుపుతో పరిహారం చేస్తది. చక్కెర బస్తాను పొయ్యింట్ల పెట్టుమంటది. అంటుకాదా? అని అడిగితే అవసరాన్ని అంటు, ముట్టు పాటిస్తరా అని చెప్పుతది పటేలమ్మ. ధాన్యాన్ని పండించినప్పుడు లేని ముట్టుడు. ఆ ధాన్యాన్ని గరిసెల్లోకి ఎత్తినంతర్వాత ఎందుకు? ఆ ధాన్యంలో పసుపు చల్లి శుద్ధీకరిస్తారు. వాళ్లకు తాకితే గో మూత్రం చల్లుకుంటారు. దళితులు తెచ్చిన వస్తువులపైన, సరుకులు, పండ్లు ఫలాలపైన గో మూత్రం, పసుపు మొదలైన చల్లి శుద్ధీకరిస్తారు. అంటే అవసరాన్ని బట్టే వివక్ష మారుతుంటదని వివరిస్తుందీకథ.
కులం దళితుల్ని అవమానిస్తుంది. ఆగ్రహిస్తుంది. రూపం మార్చుకొని నిత్యం వెంటాడుతుంది. కులపంకిలం అనుభవించిన విధానాన్ని దళిత కథకులు చిత్రించారు. గిరిపుత్రులు అంటరానితనం ఎలా పాటించారో తెలిపిన జూపాక సుభద్ర కథ ‘అడవిని యిడువని అంటు’. అడవిలోకి వచ్చిన దోస్తుకు స్టీలు ప్లేట్‌లో అంబలి ఇస్తది. తల్లి తిడ్తది. కొడుతది. జర్నలిస్టుగా దళితులపై జరుగుతున్న ఘోరాలను రాస్తున్నప్పుడు తన కులం తెలియగానే తనలోతాను మథనపడే గోగు శ్యామల కథ ‘తెరీడిన పూవెండ’ చిత్రిస్తది. దళిత జర్నలిస్టు “నేను దళిత” అని అమెరికాలో ఆత్మగౌరవంగా ప్రకటిస్తది.
వ్యవస్థను ప్రశ్నించిన మన్నె ఏలియా కథ ‘అపచారమపచారం’. దళితులకు నీళ్లివ్వని బావిలో పంది పడ్డది. ఆ పందిపిల్లను తీయడానికి చిన్రాజిగాడు ఒప్పుకుంటాడు. తీసాక గుళ్లోని నందిని తాకి మొక్కుత అని అడుగుతాడు. సరే అని చెప్పి పనిచేసాక గుడి మెట్లనుకూడా తాకనివ్వరు. ఈ వ్యవస్థ మీద ‘థూ’ అని ఉమ్మేస్తాడు చిన్రాజిగాడు. వైంకుఠధామంలోనూ వివక్షను పెద్దన్న మారాబత్తుల ‘వైకుంఠ క్షామం’లో స్వభావోక్తంగా చిత్రించాడు.
ఏళ్లు గడిచినా ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మాదిగల జీవితమున్నదని తెలియజెప్పే రుద్రవరం ఎల్లయ్య కథ ‘మాదిగల తలరాత’. ఈ కథలో మాదిగ కులవృత్తి గురించి, సాయవ్వ దేవరాజు పాత్రలద్వారా చర్చకు పెడుతాడు. మాల మాదిగల మధ్య ఉన్న తేడాలు, మాలలు క్రైస్తవమతంలో యేసుపాదంలాంటి వారు ఎదిగిన తీరు కనబడుతుంది. మాదిగలంటే చులకనభావం వలన మాదిగల సామాజిక స్థితి కనబడుతుంది. దళితులలో ఉన్న తేడాలు స్పష్టంగా చూపించాడు. మాదిగ యాదయ్యకు మాల పరంజ్యోతి మధ్య చిగురించిన ప్రేమల్ని చూపుతాడు. కులాంతర పెళ్లిల్లు జరుగుతున్న తీరును వివరిస్తుంది. అన్ని పార్టీల పతిపక్షనాయకుడు ప్రభాకర్ డొల్లతనాన్ని తెలియజేస్తాడు. మాదిగలు వెట్టిచాకిరీ చేస్తే నేటి మాదిగలు కాంటాక్ట్ సఫాయి కార్మికులుగా కొనసాగుతున్న విషయాలను వివరిస్తూ మారని మాదిగల జీవితం గురించి తెలుపుతుంది. మాదిగలపై కుల వివక్ష మారుతలేదని తెలియజేస్తుంది.
బడిలో ఎంతో ఆత్మీయంగా ఉండే దోస్తులు ఇంటికొచ్చేసరికి కుల వివక్ష స్థలాన్నిబట్టి మారుతుందని తెలిపే జూపాక సుభద్ర కథ ‘బడిలే దోస్తు ఊల్లెగాదు’ ముసుగుల్ని తొలగించి చూపుతుంది. మాదిగ శ్రీలత, సాలె సువర్ణలు ఒక్క దగ్గరనే సదువుకున్నరు. ఉన్నత విద్యకు పక్కూరికి వెళతారు. ఒకరోజు బడిలో శ్రీలత వేసుకున్న సువర్ణ బట్టల్ని తల్లి కొమురవ్వ ఎందుకు తెచ్చినవే? దోస్తు గీస్తు అంత బల్లెనే గీ మన వూల్లెగాదు’ అంటూ గ్యాసునూనే పోసి ఆ బట్టలు అంటువెట్టింది.
ఆధునిక కుల వివక్ష: (ఇల్లు,) ఆధునిక కుల వివక్ష అంటే పాతకాలపు సాంప్రదాయ పద్ధతుల్లో (ప్రత్యక్షంగా అంటరానితనం చూపించడం వంటివి) కాకుండా, చదువుకున్న సమాజంలో, పట్టణాలలో, ఆధునిక రంగాలలో అదృశ్యంగా లేదా పరోక్ష రూపాల్లో సాగే వివక్ష : ఉదా. 1. కార్పొరేట్ రంగాలలో నెట్‌వర్కింగ్ మరియు సిఫార్సులు, 2. విద్యా సంస్థలలో రిజర్వేషన్ల ఆధారిత వేధింపులు(రోహిత్ … మరణాలు / రిజర్వేషను గాళ్లనడం) 3. కులం లేదా ఆహారపు అలవాట్లను (శాకాహారం/మాంసాహారం) సాకుగా చూపి దళితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడం 4. గేటెడ్ కమ్యూనిటీలు, 5. ట్రోల్ చేయడం(హ్యాష్‌ట్యాగ్‌లు (#)సాకుగా చూపి దళితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడం, 4. గేటెడ్ కమ్యూనిటీలు, 5. ట్రోల్ చేయడం(హ్యాష్‌ట్యాగ్‌లు (#) సృష్టించి రీల్స్, వీడియోల ద్వారా కుల అహంకారాన్ని డిజిటల్ రూపంలో ప్రదర్శించడం)
విదేశి విద్యార్థి బెంగ్త్‌తో చదువుతున్న రచయిత ఈ దేశంలో కులం ఎలా వెంట బడుతుందో, ఎలా వివక్ష చూపుతుందో తెలియజేసే పసునూరి రవీరందర్ కథ ‘వేరెవర్ యు గో’ తన మిత్రున్ని ఊరికి తీసుకొస్తూ రైల్లోని పయాణీకుల మధ్యన సంభాషణలో ‘సరే సారు, మీరు కులం లేదు. కుల వివక్ష లేదంటున్నరు కదా! మీ ఇంటి పక్కన నాకు ఇల్లిస్తరా చెప్పుండి’ అని ప్రశ్నించిన రచయిత మాటలకు పెద్దమనిషి బిత్తరపోయిండు. అతను పిలువగానే దొరా వస్తిని అనుకుంటూ వొచ్చిండు జీతగాడు మల్లయ్య. జరిగిన సంభాషణంతా బెంగ్త్‌కి ఇంగ్లీష్‌లో రచయిత వివరించాడు. బెంగ్త్ “వేరెవర్ యు గో… ది క్యాస్ట్ ఫాలోస్ ఇండియన్స్” అని అంటాడు. ఆధునిక రూపంలోకి మారుతున్న వివక్షను చిత్రించిన పసునూరిదే మరో కథ ‘గోవర్ణం’. వెంచర్‌లు కొత్తగా ఏర్పాటు చేస్తుంటారు. దళితులకు ప్లాట్ వి క్రయించమని చెప్పకుండా చాకచక్యంగా ఎలా డైవర్ట్ చేస్తారో తెలియజేస్తుంది. ప్లాట్ కొందామనుకున్నమిత్రునికి ‘గోవర్ణభూమి’ కేవలం జంధ్యం ఉన్నోల్లకేనటరా. ఆడ్ కింద ట్యాగ్ లైన్ వేస్తుండు” అని ఫోన్ చేసి వివరిస్తాడు.
అద్దిల్లు / కిరాయిల్లు: అంబేడ్కర్ ఇచ్చిన అక్షరజ్ఞానంతో వివిధ ఉద్యోగాలు పొంది పట్టణాలలో కిరాయికి పోతే కులం ఎంత వివక్షకు గురిచేసిందో తెలిపే సంఘటనలు కోకొల్లలు. అనుభవాలను అక్షరీకరించిన కథలు పరిశీలిద్దాం.
ఇల్లు ఇస్తున్నట్లే అనిపిస్తది. మీరేమిటోల్లు అని అడుగరు. మీరు వైశ్యాసా? రెడ్డీసా అని అడుగుతారు? కాదు. అంటాము. ఎంటిది? అన్నట్లు చూపులు ప్రశ్నిస్తాయి. చెప్పే పరిస్థితి కల్పిస్తారు. అతని భార్యని అడిగినట్లు అడిగి అడ్వాన్స్ తీసుకుందాట అని చెబుతారు. క్యాన్సిల్ చేస్తారు.
ఉన్నత చదువు చదివి ఉన్నతోద్యోగం చేసినా కిరాయిల్లు తీసుకున్నాక కులం ఎలా వివక్ష చూపుతుందో తెలిపే జూపాక సుభద్ర కథ ‘శుద్ధిజెయ్యాలె’. లెక్చరర్ ఉద్యోగికి ఆ ఊలో కిరాయిల్లు దొరికింది. ఇంట్లోకి వెళ్లాక కులం తెలిసింది. ‘వాళ్లు కడజాతోల్లట కదా! ఇల్లు ఖాళీ చెయమను. ఇల్లు శుద్ధి జెయ్యాలే.’ అని చె ప్రాసి ద్వారా లెక్చరర్‌కి వార్త పంపిం డు. ‘శుద్ధిచేయ్యాల్సింది యిల్లుకాదు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి’ అని తిట్టుకుంటూ కాలేజీలో సామాను పెట్టించుకున్న అనుభవానికి అక్షరరూపమే ఈ కథ. ఇంట్లోని పనిమనిషికి కులం తెలియగానే చెప్పక చెయ్యక పనికిరాకుండా పోయిన వివక్షను చూపిన వీరిదే మరో కథ ‘కూటికి పేదనైనా…’. ఉపేం ద్ర, శారదలకు పనికి కుదిరింది శారద. మిగిలిన అన్నం కూర తీసుకపోయేది. అక్క హాస్పిటల్‌కి వచ్చింది. ఆ తరువాత నాలుగు రోజులుగా శారద రాలేదు. అక్కను ఉపేంద్ర అడిగింది. కులం అడగింది. చెప్పిన. ‘బువ్వకూర’ గిన్నె ఆన్నే పారేసి ‘సీ.. సీ… థూ… థూ..’ అనుకుంట వెళ్లిపోయింది. పనిమనిషి చెప్పిన విషయాలు అక్క ద్వారా తెలుసుకున్నది. అప్పుడు అర్థమయ్యింది ఉపేంద్రకు. కూటికి పేదనైనా కులానికి తక్కువనా? అని పశ్న వేసినట్లే అనిపించింది.
కులం తెలియగానే ఛాందసవాద యజమాని ఇంట్లో వస్తువులు బయటపడేస్తాడు. వస్తువులన్ని డీసిఎంలో వేసుకొని తిరుగుతుంటే అంబేడ్కరిస్టు వచ్చి మా ఇంట్లో కిరాయి ఉండండి సార్ అని ఆహ్వానించడంతో కథలోని పా త్రగా మండల స్వామి ‘ఇల్లు దొరికింది’ అని తృప్తిపడుతాడు. ‘కిరాయిల్లు’ కథలో విఠలాపురం పుష్పలత వివరించింది. ఒక స్థాయికెదిగిన మాదిగ ఉద్యోగి మూలాన్ని మరిచి కిరాయి కోసం ఇబ్బందులకు గురిచేసే ఆత్మవిమర్శలాంటి కథ ‘పుండాకోరు’ను సిద్దెంకి యాదగిరి చిత్రించాడు.
కులం తెలిశాక ఎలా ఖాళీ చేయించడానికి వేసే దుర్మార్గపు ఎత్తులను విశదపరిచే ఎలమంద కథ ‘అద్దిల్లు’. నవదంపతులు ఇల్లు కిరాయికి తీసుకున్నారు. కొన్నాళ్లకు వాళ్లు మాదిగలు అని తెలిసింది. ఆ ఇంటి యజమాని వాళ్లను పంపించాలని ఎత్తుగడ వేసిండు. నిరోధ్ ప్యాకేట్ ఆ పిల్ల బ్యాగ్‌లో పెట్టిండు. అనుమానం పెనుభూతమైంది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఓనరు తాగిన చోట చెప్పుకోగ విన్నాడు. నవ దంపతులు చర్చించుకున్నారు. ఇద్దరు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. పెనుభూతమైన అనుమానం సమసిపోయింది.
అప్పట్దాక కలుపుగోలుగా ఉన్న మనుషులలో అకస్మాత్తుగా మార్చిన కుల వివక్షను తెలిపే పసునూరి రవీందర్ కథ ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’. పైండ్లైన ఇంటిలో వరకట్నం చర్చిస్తున్నప్పుడు మా కులంలో ఇంత వరకట్నం ఇవ్వక పోదురు అని చెప్పుతది వరవ్వ. ఏర్పడకుంట వారడగిన పశ్నకు ‘హరిజన్స్’ అని చెప్పుతది. ఆ ప్రభావంతో వరవ్వ కోడలు రజిత వివక్షలోనై ఒంటరిదైతది. భర్తకు ఫోన్ చేసి ఏడుస్తుంటది. తల్లిని తెలుసుకొని భార్యకు ఫోన్ చేసినా ‘యు ఆర్ ట్రైయింగ్ రీచ్ ద మోబైల్, ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ అని డిఫాల్ట్ గా నెట్వర్క్ స్వరం వినపడుతుంటది. ఔను మా బతుకులెపుడు ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియానే’ అని బాధపడుతుంటాడు సురేష్. ఈ కథ మనుషుల మధ్య వివక్ష మోడర్న్ గా ఎలా హింసిస్తుందో తెలుపుతుంది.
ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు పొందిన దళిత టీచర్లు ఇల్లు దొరకని కిరాయి బాధల నుంచి విముక్తి పొందాలని ఆలోచిస్తున్నారు. చిన్నదో పెద్దదో గూడు కోసం తిరిగీ తిరిగీ అసైన్డ్ ల్యాండ్‌లు కొనుక్కుని తాహతును మించిని ఇండ్లు కట్టుకున్నా కులం ఎలా విభజిస్తుందో తెలిపే కథ డా. సిద్దెంకి యాదగిరి కథ ‘తప్ష’. కన్నయ్య సారింట్ల పెండ్లి. అందరినీ పిలిచినట్లే ఇండ్లున్న వెంకయ్య, రాకేష్‌లను పిలిచిండు. పసుపులు ముట్టే పండుగకు ఆడోల్లను పిలువలేదు. రేకుల ఇల్లుగల నర్సయ్య టీచర్‌ను పిలువలేదు. ఏమి జరుగుతుందో అర్థం చేసుకున్నారు. అందరు కలుసుకొన్నారు. ఈ విభజించి పాలించడం వద్దు. ఆత్మ గౌరవం లేని చోట అడుగుపెట్టొద్దని తప్ష(తీర్మానం) చేసుకున్నరు.
రైలు ప్రయాణపు అనుభవాన్ని చిత్రించిన జూపాక సుభద్ర కథ ‘రిజర్వేషన్ భోగి’. రిజర్వు టికెట్ కొని సీటు కోసం వెతుకుతుంది. ‘హలో ఇది రిజర్వేషన్ డబ్బా! తెలిసే ఎక్కినవా? జెండల్ డబ్బగాదు పో. పో.’ అన్నడు. ‘పెద్దమనిషోలే ఉన్నవ్ బుద్ధిలేదా? నువ్వు కూసున్న బెర్తు నాది. రిజర్వు చేస్కుంటేనే గదా! ఇందులోకి వొచ్చింది.’ ఇయ్యర మయ్యర మాటలంది. సంజాయిషి ఇచ్చుకోబోయిండు. పరాయిదేశంల నల్లోడని దించేయబడ్డ గాంధీ జాతి వివక్ష పెద్ద చరిత్ర. నాలాంటి నల్ల బక్క మొకాలు రిజర్వషన్ టిక్కెట్‌తో ఎక్కినా సొంత దేశమోల్లే జనరల్ భోగిలోకి తరుమవట్టిరి. అనే అవుమానాలు కూడా ‘వార్త’ కాదెందుకో… అని ఆలోచిస్తూ తెల్లతెల్లవారుతుండగా నిద్దురలేని కళ్లతో స్టేషన్ల దిగింది రచయిత్రి.
ఆకలి అంటరానితనం మిక్స్‌చేసి, అగ్రవర్ణాల వారు మాదిగల్ని బొందపెట్టైనా సరే ఎలా ఎదుగుతారో తెలిపే పసునూరి రవీందర్ కథ ‘లీఫ్మెన్’. ఆకలి తాళలేక ఆకులు తినే మాదిగ లింగంను దేవున్ని చేసింది మీడియా. పూజలందుకుంటున్నలింగంను గోపాల్‌రెడ్డి చంపి ఏమీ ఎరుగకుండా గుడికట్టుమని లింగమయ్య బాబా దేశసంచారం పోయిండని ప్రజలధనం దోచుకోవడానికి మరో ఉపాయంతో సిద్ధపడ్తాడు. వీరిదే మరో కథ కులానికి, మతానికి, రాజకీయ వర్గాలకు, మా కులానికి సంబంధించిన వ్యక్తుల రక్తం మా తమే కావాలనే వాట్సాప్ గ్రూపులున్నాయి అంటే ఆలోచించాల్సిందే. అలాంటి ముసుగుల్ని చించేసిన పసునూరి రవీందర్ కథ ‘వాట్సప్ స్త్రీట్స్’.
చెన్నూరు మాలలను ఊచకోత కోసారని టీవి వార్తలు విని రా తికి రా తే బాధ్యతాయుత ఉస్మానియా విద్యార్థులు కమిటీగా వెళ్లి సమస్యను ఆరాదీసిన బాధ్యతను రికార్డుచేసిన దార్ల రామచం ద కథ ‘ఇంకా ఎన్నాళ్లీ నరమేథం’. దళిత యువకుడు అగ్రవర్ణాల యువతికి లిఫ్ట్ ఇచ్చినందుకు మూడూల్ల రెడ్డీలు వచ్చి మాలలను దొరికినోల్లకు దొరికినట్లే చంపేసిండ్రు.
దళితులను కుల వివక్ష బహురూపులుగా, బహు కోణాలుగా(కొన్ని చోట్ల గుళ్లోకి రానివ్వక పోవటం, జులూస్ తీయనివ్వక పోవటం, ప్రతిభ ఉన్నప్పటికీ రిజర్వేషన్ గాళ్లు అని సంబోంధించడం, అడక్వసి(సరిపడిన దానికంటే ఎక్కువ ఉన్నారనే నెపంతో రిజర్వేషన్లు అమలు పరచకపోవడం), కార్పోరేట్ సంస్థలలో ఉద్యోగాలు, పదోన్నతులు తమవారికే చెందేలా చేయడం. మొదటి ర్యాంక్ వచ్చినా రిజర్వు కేటగిరీలలో నింపడం లాంటి అనేక ఇంకా వెంటాడుతూనే ఉంది. వాటి గురించి సృజనకారులు రాయాల్సి ఉంది.
కుల వివక్ష అనేది కేవలం చరిత్రలో మిగిలిన అంశం కాదు. అది నేటికీ నానారూపాలుగా సజీవంగా ఉంది. సాంప్రదాయ అంటరానితనం నుండి ఆధునిక డిజిటల్ వివక్ష వరకు దళిత జీవితాల్లో దాని ముద్ర చెరగలేదు. తెలుగు దళిత కథకులు ఈ వాస్తవాలను ధైర్యంగా, నిజాయితీగా అక్షరీకరించారు. కులం పేరిట జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, అంబేడ్కర్ చూపిన దారిలో ఆత్మగౌరవంతో జీవించాలనే స్ఫూర్తిని ఈ కథలు అందిస్తున్నాయి. సాహిత్యం కేవలం వినోదానికి కాదు. అది మార్పుకు ఆయుధం. దళిత కథా సాహిత్యం ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగిస్తూ న్యాయమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతోంది.
(ఇంకా ఉంది…)