తెలుగు సమాజంపై చైనా సాహిత్య ప్రభావం

తెలుగు సమాజం మీద చైనీస్ సాహిత్య ప్రభావం గత అరవై సంవత్సరాలకు పైగా చాల ఎక్కువగానే ఉంది. అసలు భారత సమాజం మీదనే ఈ ప్రభావం బలంగా ఉండడానికి చాల కారణాలున్నాయి. విముక్తి పూర్వ చైనా ప్రజల కడగండ్లతో సమానమైన వేదన భారత ప్రజానీకంలో కూడ ఉండడం కావచ్చు. చైనాలో ఉండిన అర్ధ భూస్వామ్య, అర్ధ వలస రాజకీయార్థిక, సామాజిక స్థితే ఇక్కడ కూడ ఉండడం కావచ్చు. చైనాలో సాగిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పోలిన విప్లవమే భారత సమాజంలో కూడ జరగవలసి ఉందనే విప్లవోద్యమ అవగాహనల వల్ల కావచ్చు. తెలుగు సమాజంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ విప్లవోద్యమం సజీవంగా, శక్తిమంతంగా ఉండడం వల్ల చైనా సాహిత్య అధ్యయనం, అనువాదం, అనుసరణ, ఆచరణ ప్రభావం విస్తృతంగా ఉన్నాయి.

‘ఓల్గా ఘనీభవించెను/యాంగ్సీ నది పొంగెను/హోరు హోరు హోరుగా/హోయలు హోయలు హొయలుగా/రుతుగీతికి పులకించి/గంగ కూడ పొంగెను’ అని శివసాగర్, ‘బోల్షివిక్కు వారసులం/నక్సల్బరి బిడ్డలం/జన చైనా వెలుగులలో నడుస్తున్న వారలం’ అని చెరబండరాజు భారత సమాజం మీద చైనా ప్రభావాన్ని మూడున్నర దశాబ్దాల వెనుకనే కవితాత్మకంగా వ్యక్తీకరించారు. బ్రిటిష్ పాలన వల్ల మనకు ఇరుగు పొరుగు, సోదర ఆసియన్ దేశాల సాహిత్యం కన్న యూరోపియన్ సాహిత్యమే ఎక్కువగా అందు బాటులోకి వచ్చింది. చైనా సాహిత్యం తెలుగులోకి రావడం ఎప్పుడు మొదలయిందో పరిశోధించవలసి ఉంది గాని 1940ల కన్నముందు, సన్ యట్ సేన్ గురించి అరకొర ప్రస్తావనలు తప్ప, అనువాదాలుగాని, చైనా ప్రభావంగాని పెద్దగా ఉన్నట్టు కనబడడం లేదు. చైనా మార్గమే మన మార్గం’ అనే మాట మొదటిసారి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ప్రొవిన్షియల్ కమిటీ 1948 జూలై 9న చేసిన తీర్మానంలో కనబడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గు రించి వివరించే క్రమంలో ఈ అవగాహన వ్యక్తమయింది. నిజానికి అప్పటికి చైనా విప్లవం విజయం సాధించలేదు. కాని అప్పటికే చైనా విప్లవ పరిణామాల గురించిన వార్తలు తెలుగు సమాజంలోకి వస్తున్నాయి. అన్నా లూయీ స్ట్రాంగ్ రాసిన ‘మా సియాంగ్ బోధనలు’ అనే పుస్తకా న్ని ప్రజాశక్తి ప్రచురణాలయం 1947లోనే ప్రచురిం చింది. అటూ ఇటూగా కమ్యూనిస్టు, అభ్యుదయ ప త్రికలలో చైనాగురించిన వార్తలు, వ్యాసాలు, రచనల అనువాదాలు మొదలయి ఉంటాయి.

చైనా విముక్తి (1949 అక్టోబర్ 1) తర్వాత సహజంగానే చైనా వ్యవహారాలపట్ల ఆసక్తి మరింత పెరిగింది. తెలుగు సమాజంలో కూడ 1950 దశకం తొలి అర్ధ భాగంలో చైనా సాహిత్య అనువాదాలు విస్తరించాయి. మావో సేటుంగ్ వ్యాసాలు ఆచరణ, ప్రజల ప్రజాతంత్ర నియంతృత్వంలను మహీధర జగన్మోహనరావు అనువాదం చేశారు. వాటిని మహీధర సోదరులు రాజమండ్రిలో ప్రారంభించిన విశ్వ సాహిత్యమాల 1952లో విడివిడిగా ప్రచురించింది. ‘చైనాను గురించీ, ప్రపంచా న్నికదిల్చివైచిన చైనా విప్లవాన్ని గురించీ, చైనా విప్లవ సారథులైన మావో మొదలైనవారి సిద్ధాంతాలను గూర్చీ తెలుగు భాషలో వున్న పుస్తకాలు చాల కొద్ది మాత్రమే. చైనా సాహిత్యమును మన తెలుగు భాషలోకి తేవడానికి యధాశక్తి విశ్వ సాహిత్యమాల ప్రయత్నించగలదని మనవి చేస్తున్నాము” అని జగన్మోహనరావు రెండో పుస్తకానికి పీఠికలో రాశారు. ఆ తర్వాత వారే, డిప్యూటీ చైర్మన్ అనే చీనా విప్లవ కథల సంపుటాన్ని, ఆస్వాల్డ్ ఎడ్బర్గ్ రాసిన (సంకలనం చేసిన?) చీనా కథలు అనే సంపుటాన్నీ ప్రచురించారు. పురిపండా అప్పలస్వామి అనువాదం చేసి, సంపాదకత్వం వహించిన ‘విశ్వకథావీథి’ సంపుటాలతో (1955) టింగ్లింగ్, లూసన్ల కథలు చెరి ఒకటి ఉన్నాయి. చైనా విప్లవ క్రమంలో తమ ప్రత్యక్ష భాగస్వామ్యానికి నవలా రూపం ఇస్తూ యువాన్ చింగ్, కుంగ్ చూయే రాసిన కొడుకులు- కూతుళ్లును చిట్టా మహానందీశ్వరశాస్త్రి (మహేశ్) అనువదించగా ఆదర్శ గ్రంథమండలి 1955లోనే ప్రచురించింది.

ఆ తర్వాత గడిచిన అరవై సంవత్సరాలలో తెలుగులో చైనా పుస్తకాల అనువాదాలు వందకు పైగానే వెలువడి ఉంటాయి. వాటిలో కొన్ని పుస్తకాలు అనేకసార్లు పునర్ముద్రణలు కూడ పొందాయి. తెలుగు పత్రికలలో చైనా రచనల అనువాదాలు వందలాదిగా వెలువడ్డాయి. చైనా గురించి ఇతరులు రాసిన పుస్తకాల అనువాదాలు, తెలుగులో స్వతంత్ర రచనలు కూడ వెలువడ్డాయి. ఈ విశాలమైన చైనా ప్రభావిత సాహిత్య సంపదలో కథ, కవిత్వం, నవల, వ్యాసం, బాల సాహిత్యం వంటి సృజనాత్మక రచనలు, విప్లవోద్యమ అనుభవ కథనాలు, చైనా గురించి విదేశీయుల రచనలు, సైద్ధాంతిక రచనలు, తెలుగు రచయితలు రాసిన విశ్లేషణలు ఉన్నాయి.

అలాగే ఈ ఆసక్తి గత ఆరు దశాబ్దాలలో వేరు వేరు సందర్భాలలో వేరు వేరుగా కూడ వ్యక్తమయింది. మొదటి దశ 1950ల నుంచి 1960ల మధ్య భాగందాకా సాగితే, 1956-57 నుంచి 1980ల మధ్యదాకా రెండో దశగా, ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా మరొక దశగా సాగుతోంది. మొదటి దశలో విప్లవం సాధించిన మరొక వ్యవసాయ సమాజ అనుభవాన్ని తెలుసుకోవలసిన అవసరం నుంచి, తొలి ఆసక్తి నుంచి రచనలు, అనువాదాలు, పరిచయాలు సాగాయి. కాని అప్పటికే తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం సోవియట్ ప్రభావంలో ఉండడం వల్ల, 1956 నుంచే సోవియట్ యూనియన్ కూ చైనాకూ మ ధ్య విభేదాలు మొదలు కావడం వల్ల తెలుగునాట అధికారిక కమ్యూనిస్టు ప్రచురణలుగాని, రచయితలుగాని చైనా సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఈ లోగా 1962లో భారత – చైనా యుద్ధం జరగడంతో నిరాధారమైన దేశభక్తి, చైనా పట్ల వ్యతిరేకత తెలుగు రచయితలలో వ్యక్తమయ్యాయి. అజంతా, కాళోజీ వంటి కవులు కూడ చైనా వ్యతిరేక కవిత్వం రాశారు. మొత్తం మీద మొద టి దశ, కొద్దికాలం వ్యతిరేకత మినహాయిస్తే, కేవలం పరిచయ దశగా, ఆసక్తి ప్రేరక దశగానే తప్ప నిజంగా ప్రభావం వేయగలిగిందా అనుమానమే.

ఇక సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీకీ, చైనా కమ్యూనిస్టు పార్టీకి గ్రేట్ డిబేట్ జరిగి, అది అంతర్జాతీయ ప్రకంపనాలు సృష్టించి, భారతదేశంలో కూడ నక్సల్బరీ పంథా ఆ ప్రభావానికి లోనయిన తర్వాత, చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారికంగా నక్సల్బరీ పంథాను సమర్థించిన తర్వాత చైనా ప్రభావం విస్తృతమయింది. నక్సల్బరీ ప్రజ్వలనను చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ ‘వసంత మేఘగర్జన’గా అభివర్ణించింది. చైనా పట్ల భారత విప్ల వోద్యమపు మైత్రి చైనా చైర్మన్ మన చైర్మన్ అనే అతివాద నినాదం దాకా విస్తరించింది. అప్పటి లిబరేషన్ పత్రికలోనూ, అప్పుడు వెలువడిన అనేక పుస్తకాల మీద రేడియో పెకింగ్ ఇంగ్లీషు, హిందీ ప్రసారాల వేళలు ప్రచురించారంటే ఆ ప్రభావం ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థమవుతుంది. ఈ పూర్వ రంగంలో చైనా సాహిత్య అధ్యయనం, అనువాదం, ప్రచారం 1960ల చివరినుంచీ, 1980ల మొదటిదాకా విపరీతంగా సాగాయి. మొత్తం పుస్తకాలలో మూడు వంతులు ఆ పది పన్నెండు సంవత్సరాలలోనే వెలువడి ఉంటాయి.

మావో మరణానంతరం డెంగ్ సియావో పింగ్ అధికారానికి వచ్చి చైనా కమ్యూనిస్టు పార్టీని, పాలననూ పెట్టుబడిదారీ మార్గానికి మళ్లించి న తర్వాత, చైనా మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. పాత ప్రచురణల పు నర్ముద్రణలు, చైనా మీద విదేశీయులు రాసిన విశ్లేషణల ప్రచురణలు, విప్లవ కాలపు అనుభవాల పాత పుస్తకాల అనువాదాలు మినహా సమకాలీన చైనా సాహిత్యం గురించి తెలుసుకోవడానికి తెలుగు సమాజం పెద్దగా ప్రయత్నించినట్టు లేదు. ప్రభావితమయిందీ లేదు. అడవి గాచిన వెన్నెల వంటి కమ్యూనిస్టు వ్యతిరేక రచనల ప్రపంచం దృష్టిని అనువాదాలు ఒకటి రెండు వచ్చాయిగాని వాటి బ్రాడ్ షీట్ గ్రూప్ ప్రభావం పెద్దగా లేదు.

ఇవాల్టి స్థితి ఏమయినప్పటికీ, రెండో దశలో వెలువడిన ప్రచురణలు, విస్తరించిన ప్రభావం అపారమైనవి. ప్రాంతాల పేర్లతోనూ, మనుషుల పేర్లతోనూ, బౌద్ద సంస్కృతి చిహ్నాలతోనూ తెలుగు పాఠకులు కొంత దూరాన్ని అనుభవించినప్పటికీ, చైనా వ్యవసాయ సమాజపు జీవితాన్ని చదువుతుంటే మన జీవితం చదువుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడి పోరాట అనుభవాలు చదువుతుంటే మన పోరాట అనుభవాలు మనం నెమరు వేసుకుంటున్నట్టే ఉంటుంది. అతి భయంకరమైన నిర్బంధకాండ సాగుతున్నప్పుడు విప్లవ సందేశాన్ని వినిపించడానికి లూసున్ ఉపయోగించుకున్న వ్యంగ్య రచనా శైలి మన రచయితలను ఎందరినో ప్రభావితులను చేసింది.

కొడుకులు-కూతుళ్లు నవలను మహేశ్ కేవలం ఆసక్తితోనే, ఏ ఉద్యమ వాతావరణం లేనప్పుడే అనువాదం చేసి ఉండవచ్చుగాని, నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో ఆ నవల గోర్కీ అమ్మలాగ నిత్య పఠనీయ గ్రంథమయింది. ఉద్యమం తర్వాత వెలువడిన మొదటి నవల టావ్ చెంగ్ ‘నా కుటుంబం'(నోముల సత్యనారాయణ అనువాదం) మొదట 1972లో సృజనలో సీరియల్గా వచ్చి, తర్వాత పుస్తక రూపంలో వెలువడింది. ఇప్పటికీ ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందిన ‘నా కు టుంబం’ ఒక స్త్రీ ప్రధానపాత్రగా చైనా విప్లవ ఘట్టాలను అత్యంత రోమాంచకారిగా వివరిస్తుంది. మరికొద్ది కాలానికే చౌలిపో నవల ‘ఉప్పెన’ చైనాలో జరిగిన విప్లవ భూసంస్కరణలను, గ్రామీణ జీవిత సంక్లిష్టతను చెపుతూ భారత విప్లవం ఏమి సాధించదలచుకున్నదో కళాత్మకంగా చూపించింది. ఎన్. ఎస్. ప్రకాశరావు ప్రారంభించిన ఆ అనువాదాన్ని ఆ తర్వాత నళిని కొనసాగించారు. మొదట సృజనలో సీరియల్గా వచ్చిన ఈ నవల రెండు భాగాలు సృజన ప్రచురణగా వెలువడింది. పాత్రల సంభాషణలలో విశాఖపట్నం మాండలికాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఉప్పెన తెలుగు సమాజానికి చాల సన్నిహితమయింది. ఆ తర్వాత విద్యార్థి యువజన ఉద్యమాలను వివరించే యాంగ్ మో నవల ‘ఉదయగీతిక’, ‘ఎర్ర మందారాలు’ నవలలు 1980లలో వెలువడి చాల ఆదరణను పొందాయి. ఇప్పటికి రెండు మూడుసార్లు పునర్ముద్రణ పొందాయి. వీటితో పాటుగానే చెప్పుకోదగినవి సు కువాంగ్ యావో నవల ‘మైదానం మండుతోంది’, లిన్ చింగ్ నవల ‘నవ జీవన నిర్మాతలు’.

చైనా కథల తెలుగు అనువాదాలు కూడా ఎన్నో వచ్చాయి. కేవలం లూసన్ వంటి లబ్దప్రతిష్టులైన కథకుల కథలు మాత్రమేకాక, చైనీస్ లిటరేచర్ పత్రికలోనూ, ఇతరచోట్లా వచ్చిన భావస్ఫోరకమైన, ప్రభావశీలమైన కథలెన్నో తెలుగులోకి అనువాదమయ్యాయి. చలసాని ప్రసాదరావు సొంతగా ఒక అనువాద కథల పుస్తకం ప్రచురించగా, వివిధ పత్రికలలో వచ్చిన చైనా అనువాద కథలను క్రాంతి ప్రచురణలు నేలతల్లి చెర విడిపించిన ‘లాంగ్ మార్చ్’ పేరుతో ప్రచురించింది. అలాగే యేట్టు కథల సంపుటం పంటను కూడ వెలువరించింది. అలాగే నేనూ బడికి వెళ్తా, బాల గెరిల్లా లాంటి బాలసాహిత్య రచనలు కూడ ఎన్నో తెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ఎన్నో కవితలు, వ్యాసాలు, నాటికలు కూడ అనువాదమయ్యాయి.

ఇక ఇక్కడ సాగుతున్న విప్లవోద్యమానికి స్పూర్తినీ, ప్రేరణనూ అందించడానికి చైనా విప్లవోద్యమ చరిత్రలోని అద్భుత ఘట్టాల గురించిన పుస్తకాలు కూడా ఎన్నో తెలుగులో వెలువడ్డాయి. లాంగ్ మార్చ్లో చైర్మన్ మావోతో, కోట్లాది వీరయోధులు, మావో జీవిత చరిత్రలు, ఛూటే జీవి త చరిత్ర జైత్రయాత్ర, నార్మన్ బెతూన్ జీవితచరిత్ర రక్తాశ్రువులు, కంకార్డ్ దీవి మిలీషియా మహిళలు వంటి రచనలు వేలాది మందికి తమ విప్లవ జీవితంలో ఉత్తేజాన్ని నింపాయి. అలాగే చైనా విప్లవం జరుగుతున్న సమయంలోనే చైనాలో పర్యటించిన జర్నలిస్టు ఎడార్స్నో రాసిన చైనాపై అరుణతార ఎంతో మందిలో విప్లవ విజయం గురించిన విశ్వాసాన్ని నింపింది. విలియం హింటన్ చైనా గ్రామీణ ప్రాంతాలలో సాగిన విప్లవ భూసంస్కరణల గురించి రాసిన ఫాన్ షెన్ కు సహవాసి సంక్షిప్త అనువాదం విముక్తి చాలమందిలో విప్లవ నిబద్దతను బలోపేతం చేసింది. అలాగే జాక్ బెల్డెన్ చైనాలో జరుగుతున్న మార్పుల గురించి రాసిన చైనా షేక్స్ ది వరల్డ్లో నుంచి కొన్ని అధ్యాయాలు తెలుగులోకి వచ్చాయి. చైనాలో జరిగిన మార్పులన్నిటిలోకీ ముఖ్యమైనది స్త్రీల పట్ల సామాజిక దృక్పథంలో వచ్చిన మార్పు. పాదాలకు బంధనాలు విధించి పరుగెత్తడానికి కూడ వీలులేకుండా చేసిన పాత సమాజంనుంచి స్త్రీలను సోషలిజం విముక్తి చేసింది. ఆ విముక్తి కథనాలు క్లాడీ బ్రాయెల్, డెలియా డేవిన్ల వంటి పాశ్చాత్య రచయితల పుస్తకాల అనువాదాల ద్వార తెలుగు పాఠకులకు చేరాయి.

చైనా శ్రామికవర్గ మహత్తర సాంస్కృతిక విప్లవంలో జరిగిన ప్రయోగాలు, సాగిన అన్వేషణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బ్రాడ్ షీట్ గ్రూప్ పేరుతోనూ, కన్సర్న్డ్ ఏషియన్ స్కాలర్స్ పేరుతోనూ, స్వతంత్రంగారూ అనేకమంది అమెరికన్లు, యూరపియన్లు చైనా అధ్యయనాలు సాగించారు. ఇంగ్లీషులో వందలాది పుస్తకాలు వెలువడ్డాయి. ఆ పుస్తకాలలో నుంచి అనువాదాలుగాని, పరిచయాలుగాని, ఉపన్యాసాలలో ప్రస్తావనలు గాని తెలుగులోకి వచ్చి చాల ప్రభావం చూపాయి. డెంగ్ అనంతర పరిణామాల గురించి కూడ ఛార్లెస్ బెతల్హాం, విలియం హింటన్ మొదలయినవారి రచనలు తెలుగులోకి వచ్చాయి.

ఇక చైనా విప్లవ నాయకుల, కార్యకర్తల రచనల తెలుగు అనువాదాలకయితే లెక్కలేదు. 1970ల తొలి రోజుల్లోనే చండ్ర పుల్లారెడ్డి అనువాదం చేసిన మావో మిలిటరీ రచనలు తెలుగులోకి వచ్చాయి. మావో రచనల చైనా అధికారిక ప్రచురణ ఐదు సంపుటాలతో పాటు, ఇంగ్లీషులో నూ తెలుగులోనూ మరొక ఐదు సంపుటాలు ప్రచురించిన ఘనత తెలుగు విప్లవోద్యమానిదే. మావో రచనలలో నుంచి విడివిడి వ్యాసాల పుస్తకాలు కూడా ఎన్నో వెలువడ్డాయి. చైనా విప్లవోద్యమ చరిత్ర పుస్తకాలు కనీసం రెండు(హోచియావో మూ, హో కాన్స్టీ) వెలువడ్డాయి. మావో రాసిన కళలూ సాహిత్యం ఎవరి కోసంతో పాటు, లూసన్, మావో టున్ తదితరుల విప్లవ సాహిత్య విమర్శ వ్యాసాలు ఎన్నో తెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సిద్దాం తాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన గ్రేట్ డిబేట్ తెలుగులోకి సంపూర్ణంగా వచ్చింది. చౌ ఎన్ లె, చూటే, లీ సావ్ చీ, వాంగ్ మింగ, లిన్ పి యావో వంటి నాయకుల రచనలు కూడ తెలుగులోకి వచ్చాయి. చైనాలో రాజకీయార్థిక శాస్త్రం, తత్వశాస్త్ర, చరిత్రలలో జరిగిన పరిశోధనలు కూడ తెలుగులోకి వచ్చాయి. చైనా ప్రగతి గురించీ, సాంస్కృతిక విప్లవం గురించీ, చైనాలో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించీ కూ డ తెలుగులో రచనలు వెలువడ్డాయి. శ్రీశ్రీ తన చైనా పర్యటన అనుభవాలను ‘చైనా యానం’ పేరుతో ప్రచురించారు. మొత్తంగా చెప్పాలంటే తెలుగు సమాజపు ఆలోచనలలో, ఆచరణలో, ఉద్యమాలలో, ప్రభావం లో చైనా పాత్ర అపారమైనది. అసాధారణమైనది. తెలుగువారి, కనీసం తెలుగు ఉద్యమకారుల మనసు లోపలి సన్నిహిత మిత్రురాలు చైనా. 1940ల నుంచి 1970ల చివరి వరకూ అయినా.. తెలుగు సమాజం మీద చైనా సమాజ, సాహిత్య ప్రభావాలకు చెరగని నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా రెండు ఉదాహరణలు మాత్రం చెప్పుకోవచ్చు. ఒకటి ఇంద్రవెల్లి స్థూపం. చైనా పర్యటించి, బీజింగ్ లోని తియెన్ ఆన్ మెన్ స్క్వేర్ లో స్థూపాన్ని చూసి ఉత్తేజితులైన ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షులు గంజి రామారావు, ఆదివాసి అమరవీరుల స్మృతిలో అటువంటి స్థూపమే ఇంద్రవెల్లిలో నిర్మించాలని ఆలోచించారు. ఎంతో కాలం ఇంద్రవెల్లిలో మకాం వేసి దాని నిర్మాణాన్ని పర్యవేక్షించారు. తర్వాత ప్రభుత్వం దాన్ని కూల్చివేసిందిగాని ఇంద్రవెల్లి ఆకాశం బీజింగ్ ఆకాశానికి ప్రతిబింబాన్ని చూపుతూనే ఉంటుంది.

రెండవది, చాల భాషల వారికి తెలియనిదీ, తెలుగువారికి వెంటనే అర్థ మయ్యేదీ ఆకాశంలో సగం అనే వ్యక్తీకరణ. స్త్రీల గురించి మాట్లాడుతూ మావో అన్న ఆమాట తెలుగు నుడికారంలోకి పూర్తిగా సంలీనమైపోయింది. కొన్ని డజన్లమంది రచయితలూ కవులూ ఆ అభివ్యక్తిని వాడుకున్నారు.

(ఎన్. వేణుగోపాల్, 27 సెప్టెంబరు 2009, వార్త ఆదివారం పత్రికలో ప్రచురితం)

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

2 thoughts on “తెలుగు సమాజంపై చైనా సాహిత్య ప్రభావం

Leave a Reply