ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు రాజకీయాలు వివిధ రూపాల్లో విస్తరిస్తూ సమాజంలోని అన్ని సంబంధాల మీద తమ పట్టును బిగిస్తున్నాయి. మానవ నాగరికత, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రజా రాజకీయాలు తిరోగమన దారిలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అంతటా చీకటి అలుముకున్నట్లు అనిపిస్తుంది. అన్ని స్వరాలు నొక్కివేయబడి నిశ్శబ్దమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది. మానవ, సామాజిక సంబంధాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు ఒక్కొక్కటిగా కూలిపోతుంటే ఇలాంటి నిరాశ కలగడం సహజం. భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలిగే దీర్ఘకాలిక ఉద్యమాలు దెబ్బతిని వెనక్కి నెట్టబడినప్పుడు ఆ నిరాశ మరింత పెరుగుతుంది.
ఫాసిస్టు శక్తులు అధికారాన్ని మాత్రమే కాదు, ప్రజల ఆలోచనలను కూడా ఆక్రమించేశామని విజయగర్వంతో ప్రకటిస్తున్నప్పుడు, “ఇక మనం ఏం చేయగలం?” అనే నిస్సహాయత మనలోకి ప్రవేశిస్తుంది. ప్రజల ఊహాశక్తిని కూడా వాళ్లు స్వాధీనం చేసుకున్నారా అనే బాధ కలుగుతుంది. మరో ప్రపంచాన్ని ఊహించగల పరిస్థితి లేకుండా పోయిందా అనే నిరాశ కలుగుతుంది.
కానీ చరిత్ర ఎప్పుడూ సరళరేఖలో నడవదు కదా. బహుశా మనకు మిగిలిన ఆశ అక్కడే ఉంది.
అయితే ఇది చరిత్ర తనంతట తానుగా అణగారిన ప్రజల వైపు తిరుగుతుందనే విధివాదపు ఆశ కాదు. దోపిడీ వ్యవస్థలు తమను తాము నిలబెట్టుకునే క్రమంలోనే వైరుధ్యాలను సృష్టిస్తాయి. సంపద కొద్దిమంది చేతుల్లో పోగవుతుంది. శ్రమ అస్థిరమవుతుంది. విద్య, వైద్యం, నివాసం, ఉపాధి వంటి జీవనావసరాలు మార్కెట్‌కు మరింతగా లోబడి పనిచేస్తుంటాయి. వీటిని ఒక్కొక్కరు తమ వ్యక్తిగత సమస్యలుగా అనుభవించినా, అవే సమస్యలు కోట్లాది మంది జీవితాల్లో పునరావృతమైనప్పుడు వాటి సామాజిక స్వభావం బయటపడుతుంది.
ఒక వ్యక్తికి ఉద్యోగం రాకపోతే తన వైఫల్యంగా భావించవచ్చు. చదువుకున్న కోట్లాది మందికి ఉద్యోగాలు దొరకనప్పుడు మాత్రం ప్రశ్న మారుతుంది. ఇంతమందిలో ఒకేసారి ప్రతిభ లోపించిందా? లేక వారికి ఉపాధి కల్పించలేని ఆర్థిక వ్యవస్థలో సమస్య ఉందా?
అలాంటి ప్రశ్నలే ఉద్యమాలను ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కానీ ఏ ఉద్యమమూ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక శూన్యంలో పుట్టదు. గత పోరాటాలు గెలిచినా, ఓడినా ఏదో ఒకటి మిగిల్చి వెళ్తాయి. న్యాయం, సమానత్వం వంటి భావనలను మిగులుస్తాయి. హక్కుల స్పృహను పెంచుతాయి. పోరాట రూపాలను నేర్పుతాయి. ఒక ఉద్యమం ఓడిపోయినా అది నిర్మించిన విశాలమైన రాజకీయ స్థలం తరువాత వచ్చే ఉద్యమానికి ఉపయోగపడవచ్చు. ఒక తరం పోరాడి సాధించిన హక్కును తరువాతి తరం తన సహజ హక్కుగా భావించవచ్చు.
ఈ నేపథ్యం నుంచే నేటి జెన్ జీ ఉద్యమాలను చూడాలి.
ఈ ఉద్యమాలను చూసినప్పుడు తక్షణంగా వచ్చే ప్రశ్న ఏమంటే, ఇప్పుడే ఎందుకు మొదలయ్యాయి?
ఒక ప్రశ్నాపత్రం లీక్ కావడం ఉద్యమానికి తక్షణ కారణం కావచ్చు. కానీ ప్రశ్నాపత్రాలు గతంలోనూ లీకయ్యాయి. అవినీతి కొత్తది కాదు. నిరుద్యోగం కొత్తది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యమూ కొత్తది కాదు. మరి ఒక సందర్భంలో సాధారణ వార్తగా మిగిలిపోయే సంఘటన మరో సందర్భంలో ఎందుకు వేల మందిని వీధుల్లోకి తీసుకొస్తుంది?
ఈ ప్రశ్నకు సమాధానం ఆ సంఘటనలో మాత్రమే ఉండదు. అది జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఉంటుంది. వాటిని కేవలం దేశీయ పరిణామాలుగా చూడటం కూడా సరిపోదు. ఈ తరం జీవిస్తున్న ప్రపంచాన్ని ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చిన మార్పుల నుంచి విడదీసి అర్థం చేసుకోలేం.
“ప్రతిదాన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థతో ఎందుకు ముడిపెడతారు?” అని విసుక్కునేవారికి ఒక విషయం చెప్పాలి. ప్రతి ప్రశ్నాపత్రం లీక్‌కు పెట్టుబడే కారణమని చెప్పడం కాదు. ప్రతి అవినీతి కేసు వెనుక ఒకే ఆర్థిక కారణం ఉందని కూడా కాదు. అసలు ప్రశ్న వేరేది. ఒక పరీక్ష కోట్లాది మంది భవిష్యత్తును నిర్ణయించేంత ప్రాధాన్యం ఎందుకు పొందింది? కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది ఎందుకు సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్నారు? కుటుంబాలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని విద్య, శిక్షణ, పరీక్షల మీద ఎందుకు ఖర్చు చేస్తున్నాయి? విద్యా పట్టాలు పెరుగుతున్నా వాటికి తగిన ఉపాధి ఎందుకు దొరకడం లేదు? ఈ ప్రశ్నలకు ఒక అవినీతి అధికారి దగ్గరో, మంత్రి దగ్గరో సమాధానం దొరకదు.
ప్రజల జీవితాల్లోని ఈ అంశాలన్నీ మార్కెట్ పరిధిలో నిర్ణయించబడుతున్నప్పుడు, ఆ మార్కెట్ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థతో ముడిపడి ఉన్నప్పుడు పెట్టుబడి గురించి, దాని దోపిడీ గురించి మాట్లాడక తప్పదు. కానీ అక్కడితో ఆగిపోతే భారతదేశపు ప్రత్యేకత కనిపించదు. ప్రపంచ పెట్టుబడి ఇక్కడికి వచ్చి నేరుగా ప్రజల జీవితాలను మార్చదు. దానికి అనుకూలంగా విధానాలు రూపొందించే రాజ్యం ఉంటుంది. దానితో లాభపడే దేశీయ పెట్టుబడిదారీ వర్గం ఉంటుంది. భూమి, పెట్టుబడి, విద్య, వ్యాపార అవకాశాలు, సామాజిక సంబంధాల మీద చారిత్రక ఆధిపత్యం కలిగిన కులాలు ఉంటాయి. భారతదేశంలో పెట్టుబడిదారీ దోపిడీ కుల నిర్మాణానికి బయట పనిచేయదు. కుల ఆధిపత్యం కూడా ఆస్తి, శ్రమ, పెట్టుబడి సంబంధాలకు బయట నిలబడదు.
ఈ కుల, వర్గ సంబంధాలను కాపాడే రాజకీయ వ్యవస్థగా హిందుత్వాన్ని చూడకుండా, దాన్ని కేవలం మత రాజకీయంగా చూస్తే దాని బలంలో సగమే కనిపిస్తుంది. హిందుత్వ రాజకీయాలు జాతీయత, అభివృద్ధి, బలమైన దేశం, సాంకేతిక ఆధునికత, ప్రపంచంలో భారతదేశం ఎదుగుతోందనే ఒక బలమైన కథను నిర్మించాయి. అది మొత్తంగా సమాజాన్ని, ముఖ్యంగా మధ్యతరగతిని ప్రభావితం చేయగలిగింది. అదే కాలంలో సంపద కేంద్రీకరణ, ప్రైవేటీకరణ, అస్థిరమైన శ్రమ, ప్రజా ఉపాధి కొరత వంటి సమస్యలు కొనసాగాయి.
ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఆ ముడులను విప్పుకుంటూ పోతే తప్ప “ఇప్పుడే ఎందుకు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకదు.
ఈ తరానికి చదువుకో, నైపుణ్యాలు సంపాదించు, సాంకేతికతను అందిపుచ్చుకో, పోటీ పడు, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారు అని చెప్పారు. అలా చేస్తే గత తరాల కంటే మెరుగైన జీవితం దొరుకుతుందని వాగ్దానం చేశారు. కానీ విద్య విస్తరించిన వేగంతో స్థిరమైన ఉపాధి విస్తరించలేదు. అభివృద్ధి భావన కొత్త ఆకాంక్షలను రేకెత్తించింది. కానీ వాటిని నెరవేర్చే భౌతిక అవకాశాలు అదే స్థాయిలో విస్తరించలేదు.
స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని చేతిలో పెట్టింది. కానీ ఆ ప్రపంచంలోకి ప్రవేశించే ఆర్థిక సామర్థ్యాన్ని ఇవ్వలేదు. మార్కెట్ వినియోగానికి పిలుస్తోంది. కానీ ఆ వినియోగాన్ని భరించే వేతనాన్ని ఇవ్వడం లేదు. ఇది కేవలం పేదరికం కాదు. వాగ్దానం చేసిన భవిష్యత్తుకు, జీవిస్తున్న వర్తమానానికి మధ్య పెరిగిన దూరం.
భారతదేశంలో ఈ వైరుధ్యాన్ని కులం, కుటుంబం, సామాజిక చలనం మరింత లోతుల్లోకి తీసుకుపోతాయి. ఇక్కడ విద్య కేవలం ఉద్యోగ అర్హత కాదు. ఒక పేద కుటుంబానికి పేదరికం నుంచి బయటపడే ఆశ. ఒక గ్రామీణ కుటుంబానికి వ్యవసాయ అస్థిరత నుంచి బయటపడే దారి. కులం నిర్దేశించిన వృత్తి నుంచి బయటపడే అవకాశం. మహిళలకు ఆర్థిక స్వతంత్రతకు ఒక మార్గం.
అందుకే ఒక పట్టా వెనుక ఒక్క వ్యక్తి మాత్రమే ఉండరు. ఒక కుటుంబం ఉంటుంది. పొదుపు ఉంటుంది. అప్పు ఉంటుంది. సంవత్సరాల శ్రమ ఉంటుంది. పిల్లల ద్వారా కుటుంబం సామాజికంగా పైకి వెళ్లాలనే ఆశ ఉంటుంది. ఆ పట్టా ఉద్యోగంగా మారకపోతే అక్కడ నిరుద్యోగిగా మిగిలిపోతున్నది ఒక్క వ్యక్తి మాత్రమే కాదు. ఒక కుటుంబం పెట్టుకున్న భవిష్యత్తే నిలిచిపోతుంది.
మార్క్స్ చెప్పిన “సాపేక్ష అదనపు జనాభా” భావనకు ఇక్కడ కొత్త రూపం కనిపిస్తుంది. కర్మాగారం గేటు బయట పని కోసం ఎదురుచూసే కార్మికుడే నేటి అదనపు శ్రమశక్తి కాదు. విశ్వవిద్యాలయ పట్టాతో ప్రభుత్వ పరీక్ష కోసం మూడేళ్లు చదువుతున్న వ్యక్తి కూడా అందులో భాగమే. తాత్కాలిక ఉద్యోగం చేస్తూ నోటిఫికేషన్ పడే ప్రతి పరీక్షకు సిద్ధమవుతున్న వ్యక్తి కూడా అందులో భాగమే.
ఇటువంటి వ్యక్తిగత, సామాజిక, రాజకీయార్థిక పరిస్థితుల కోణం నుంచి చూస్తే కానీ జెన్ జీ ఉద్యమం అర్థం కాదు. అయితే దీనికి ఇంకా స్థిరమైన రాజకీయ కార్యక్రమం లేదు. స్పష్టమైన సిద్ధాంతం లేదు. సమగ్ర ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. ఏ వర్గాల మధ్య ఎలాంటి రాజకీయ ఐక్యత నిర్మించాలన్న అవగాహన కూడా ఇంకా రూపుదిద్దుకుంటున్న దశలోనే ఉంది. ఉద్యమంలో ఉదారవాద ఆకాంక్షలు ఉన్నాయి. సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలనే కోరిక ఉంది. అవినీతి వ్యతిరేకత ఉంది. ప్రతిభకు న్యాయం జరగాలనే ఆశ ఉంది. అదే సమయంలో ప్రభుత్వంపై కోపం, మీడియాపై అవిశ్వాసం, నిరుద్యోగంపై అసంతృప్తి, ప్రజాస్వామిక సంస్థలపై ప్రశ్నలు కూడా ఉన్నాయి.
అయితే యువత వీధిలోకి వచ్చినంత మాత్రాన వర్గ చైతన్యం ఏర్పడదు. సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది ఒక నినాదాన్ని పంచుకున్నంత మాత్రాన స్థిరమైన రాజకీయ సంస్థ ఏర్పడదు. పాత పార్టీలపై అవిశ్వాసం ఉన్నంత మాత్రాన కొత్త రాజకీయాలు ప్రగతిశీలంగా ఉంటాయని హామీ లేదు. కానీ ఇదంతా “మధ్యతరగతి అసంతృప్తి” లేదా ఇవాళో రేపో పగిలిపోయే నీటి బుడుగ మాత్రమే అని కొట్టిపారేయడం అంతకంటే పెద్ద పొరపాటే అవుతుంది.
ఎందుకంటే ఒక ఉద్యమం ఎక్కడ మొదలైందన్నది దాని రాజకీయ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో ముందే నిర్ణయించదు. పరీక్షలో న్యాయం కావాలనే డిమాండ్ సంస్థల జవాబుదారీతనం వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి ఉపాధి ప్రశ్నకు వెళ్లవచ్చు. ఉపాధి నుంచి అభివృద్ధి నమూనాపై ప్రశ్నలు కురిపించవచ్చు. “మేమెంతో మాకంత” అని నినదించవచ్చు. దొంగ ఓట్ల నుండి ఓట్ల దొంగల వరకు “వెలిగిపోతున్న” మొత్తం పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థనే నిలదీయవచ్చు. ఇవన్నీ ఇప్పుడున్న ఫాసిస్టు పరిస్థితులలో విప్లవాత్మకంగా కనిపించవచ్చు. కాని, ఇవన్నీ కూడా ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగమే. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలోనే చెయ్యగలిగే అవకాశాలు ఉన్నాయి.
అయితే కొనసాగుతున్న ఉద్యమాన్ని రొమాంటిసైజ్ చేయకుండా దానిలోని రాజకీయ అవకాశాన్ని చూడగలగాలి. కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలను నిలువరించడంలో జెన్ జీ ఎలాంటి రాజకీయ శక్తిగా మారగలదో చూడాల్సి ఉంది. భారతీయ సమాజాన్ని భయానంతర రాజకీయ స్థితివైపు నడిపించే సామర్థ్యం ఈ తరానికి ఉందన్న నమ్మకాన్ని ఇప్పటికే కలిగించింది.
ఈ ఉద్యమానికి ఎన్ని పరిమితులైనా ఉండవచ్చు. ఊపిరాడనట్లున్న నేటి రాజకీయ వాతావరణంలో జెన్ జీ కొత్త రాజకీయ ఆకాంక్షలకు, అవకాశాలకు అవసరమైన స్థలాన్ని తెరవగలదనే ఆశ కలుగుతోంది. ఈ ఉద్యమ చారిత్రక నేపథ్యాన్ని, ప్రస్తుత పరిణామాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి క్రాంతి రాసిన జెన్ జీ భారతం ఉపయోగపడుతుంది.
(“మలుపు” ప్రచురించిన క్రాంతి పుస్తకం “జెన్ Z భారతం” లోని ముందుమాట)