ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినాన్ని ఎత్తిపడుతూ ఆదివాసీ స్వయం పాలనకై ఉద్యమిద్దాం

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (Indigenous peoples day) జరపాలంటూ 1994 డిసెంబర్ లో ఐక్యరాజ్యసమితి (UNO) జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఆనాటి నుండి ప్రపంచీకరణ విధానాలతో అడవులు, ఆదివాసుల జీవితాలు మరింత ప్రమాదంలోకి నెట్టబడుతూనే ఉన్నాయి. జల్, జంగల్, జమీన్ ల నుండి, భాషా-సంస్కృతుల నుండి ఆదివాసులను పరాయీకరించే పరిస్థితి పెరుగుతూనే ఉంది. అందుకేనేమో కంటితుడుపు చర్యగానైనా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భారత్ లోని పదిన్నర కోట్ల ఆదివాసులకు పెద్దగా ఉపశమనం కలిగించలేకపోతున్నది. 17వ శతాబ్దం నుండి ఆదివాసుల తిరుగుబాట్లే భారతదేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రల కోసం చేసిన పోరాటాలకు ఎంతో ఊతమిచ్చాయి. “అడవులల్లో నివసించే ఆదివాసులు, భారత విప్లవ పోరుకు మూలపురుషులు” అంటూ గర్జించిన కవుల కలాలు ఎన్నో. కానీ నక్సలబరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాల మూలంగా వచ్చిన 1/ 70 అనే భూమి బదలాయింపు నిరోధక చట్టం (LTR) ను ఎత్తేయాలని ఒక ఆదివాసి ఎమ్మెల్యేనే మాట్లాడేంతగా వారిపై ఒత్తిడి ఉందని అర్థం చేసుకోవచ్చును. తమ నేల మీదనే ఆదివాసీ ప్రజలు పరాయివాళ్లయి పోతుండడం ప్రపంచవ్యాప్త పరిణామంగా ఉంది. అందుకేనా అన్నట్లు 2025 ఆగస్టు 9నాడు ఆదివాసి దినం జరుపుకునే సందర్భంగా “ఆదివాసి ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు- ఆహార భద్రత మరియు సార్వభౌమాధికారానికి ఒక మార్గం” అంటూ పిలుపునిచ్చింది. అందుకే ఈ సందర్భంగా అడవుల నిర్మూలనకు, ఆదివాసి జీవితాల పరాయీకరణకు వ్యతిరేకంగా “ఆదివాసుల స్వయం పాలన హక్కుల కోసం పోరాడేందుకు ప్రతినబూనుదాం.

దిగజారుతున్న ఆదివాసీల పరిస్థితి

తొంబై దేశాల్లో దాదాపు 48 కోట్ల జనాభా (476 మిలియన్లు) తో ఆదివాసులు (Indigenous people) ప్రపంచ జనాభాలో ఆరు శాతంగా ఉన్నారు. ఒక్క భారత్ లోనే 705 తెగ జాతులతో మనదేశ జనాభాలో 8.6 శాతంగా పదిన్నర కోట్లకు పైగా షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల్లో 15% ఆదివాసులేనని పలు నివేదికలున్నాయి. ఏడు వేల భాషలు, ఐదు వేల విభిన్న సంస్కృతులతో, తెగలతో ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతం నిజమైన భిన్నత్వంతో కూడుకుని ఉంది. అది 28 శాతం భూగోళాన్ని ఆక్రమిస్తే, వారి నివాసం చుట్టూ 11 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. సహజసిద్ధ అడవుల సంరక్షకులుగా, పర్యావరణ పరిరక్షకులుగా, యాభై శాతానికి పైగా ఆహార స్వయం సమృద్ధి కలిగిన ఆదివాసులు నేడు కార్పోరేట్ల దాడిలో సర్వం కోల్పోతున్నారు. పరాయీకరణ ప్రధాన సమస్యగా మారిన పరిస్థితిలో, తాము పుట్టి పెరిగిన అడవుల్లోనే మైనారిటీగా మారుతున్నారు. విప్లవ పోరాటాలతో, అనన్య త్యాగాలతో ఆదివాసుల భూమి బదలాయింపు నిరోధక రెగ్యులేషన్ 1 ఆఫ్ 70 చట్టం, 1996 పెసా చట్టం, రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్లలోని రక్షణలు, 2006 అడవి హక్కుల చట్టం ఏవీ వారిని కాపాడలేక పోతున్నాయి. సరిగ్గా పాడేరులోనే పంప్డ్ హౌస్ పవర్ ప్రాజెక్టుల పేరు మీద గౌతం అదానీ పవర్ ప్రాజెక్టు అడవులను, గ్రామాలను కబళించింది. బాక్సైట్ తవ్వకాల కార్యక్రమం తలపైన వేలాడుతుంది. పోలవరంలో మునిగిన 200 ఆదివాసీ గ్రామాలకు నేటికీ సరయిన పరిహారం లేదు. రక్షణావసరాల పేరు మీద అడవులు, గూడాలు ఖాళీ అవుతుండగా, పెసా చట్టం చిన్నబోయింది. వేలాది సంవత్సరాలు ఆదివాసులు, జంతువులు పశుపక్ష్యాదులతో సహజీవనం చేస్తున్నారు. కానీ నేషనల్ పార్కులు, పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, వన్యప్రాణి కేంద్రాలు, నీటి ప్రాజెక్టులు, రవాణా మార్గాలు, ఖనిజాభివృద్ధి సంస్థలు, బొగ్గు నిక్షేపాలు, రక్షణావసరాలు అంటూ అడవుల నుండి ఆదివాసుల గెంటివేత సర్వసాధారణమైంది. నూరేళ్ళుగా సాగుచేస్తున్న కొందరు ఆదివాసులకు పట్టాలు లేకపోవడం, నూరుశాతం అడవులున్న గ్రామాలను, మండలాలను షెడ్యూల్డు ఏరియా పరిధిలోనికి తేకపోవడంతో ఆదివాసేతర పెత్తందార్ల ఆక్రమణలు పెరగడం, స్మగ్లర్లను వదిలి బొమ్మకొయ్య (ఎర్రచందనం) పేరుతో సామాన్య ఆదివాసులనే వేధించడం సర్వసాధారణమయింది. మైదానాల్లో చేపల వేటపై ఆధారపడ్డ యానాదుల బతుకులు దుర్బలంగా ఉన్నాయి. కొన్ని దుర్భల (vulnerable) జాతులు అంతమయ్యే స్థితిలో ఉన్నాయని నివేదికలున్నాయి.

అత్యంత ఆదిమజాతిగా ప్రసిద్ధిగాంచి, సునామీలను పసిగట్టగలిగిన అండమాన్ నికోబర్ దీవుల్లోని జారోవా తెగ ప్రజల నివాసాల మధ్య నుండి జంతువుల సఫారీ లాగా పర్యాటకుల రోడ్డు నిర్మించారు. మనుషులను జంతువుల్లా చూసే human Safari పద్దతిని 2002లో సుప్రీంకోర్టు నిషేధించింది. అయినా చట్ట విరుద్ధంగా ఇది సాగుతూనే ఉంది. తాజాగా 72,000 కోట్లవ్యయంతో అక్కడ నిర్మాణం అవుతున్న ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్షిప్మెంట్ పోర్ట్ (ICTP) ప్రాజెక్టులు రెండు పురాతన దుర్బల (vulnerable) తెగలైన షాప్మెన్, నికోబార్లు మాయమైపోతున్నాయి.

ఇక ఫార్మా ఈస్ట్ అండ్ కాంటా బేసిన్ (PEKB) అనే అదానీ కంపెనీ చత్తీస్ఘఢ్ లోని హస్టేవ్ అరాండ్ అడవిలో బొగ్గు తవ్వకాలకై ఐదు లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. ప్రజాభిప్రాయంతోనే ఇదంతా చేస్తున్నాం అంటున్నా అదంతా బూటకమని ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఘాట్బర్రాతో పాటు కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దాదాపు లక్షల విలువచేసే వందలాది వ్యాపార ఒప్పందాలతో విలువైన ఖనిజ సంపద కార్పొరేట్ల వశం చెయ్యబోతున్నందున అక్కడ మావోయిస్టులతో శాంతి చర్చలను నిరాకరిస్తున్నారు. అక్కడే ఆదివాసుల నరమేధం కొనసాగుతుంది. సంపద కొద్దిమంది చేతుల్లో పడరాదన్న సుప్రీంకోర్టు మాటలు సైతం పెడచెవిన పెట్టబడుతున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్లో వేలాదిమంది ఆదివాసులను నిర్వాసితులను చేసే ఎగువ సియాంగ్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు (USMP)కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనను అణిచివేస్తున్నారు. అస్సాంలో ఖాజీరంగ ఉద్యానవనం సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలపై అణచివేత సాగుతోంది. ఇక మణిపూర్ మారణహోమం నాగా, కుకీ జాతి తెగలను అణిచివేసే దుర్మార్గమైన కుట్ర మాత్రమే. అదే దేశ రక్షణ పేరిట 2023లో అటవీ రక్షణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం చేసిన నూతన చట్టం విదేశీ సరిహద్దుల నుండి 100 కిలోమీటర్ల వైశాల్యాన్ని, 10 హెక్టార్లలో ఏదైనా నిర్మాణం చేసుకునే అంశం ఈశాన్య రాష్ట్రాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో ఉన్న ఈ ప్రాంతంలో జిల్లాల వారీగా స్వయంపాలన మండళ్ళు ఉన్నాయి, కానీ ఆ రాజ్యాంగ రక్షణలు ప్రశ్నార్ధకమైతున్నాయి.

పులుల అభయారణ్యం పేరిట GO.No. 49 చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల ఆందోళన ఫలితంగా వెనక్కు తగ్గింది. ఆదివాసుల భాష, సంస్కృతి, వనరుల విధ్వంసం, అడవుల నుండి గెంటివేత ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. బ్రెజిల్లో 100 ఆదిమ తెగలు అంతర్ధానం అయ్యే స్థితి ఏర్పడ్డది. ప్రపంచంలోనే 82.5 సం.రాల సగటు ఆయురార్ధంతో ముందు వరుసలో ఉన్న ఆస్ట్రేలియాలో భూములు కోల్పోయిన ఆదిమ జాతులు పదేళ్లు తక్కువ కాలం బతుకుతున్నాయి. మధ్యాహ్నం భోజనం కొరవడిన మనదేశ ఆదిమ జాతుల ప్రజలు అతి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. పెరుగ్వే, బ్రెజిల్, అర్జెంటీనాలో నివసిస్తున్న గోవరాని కయోవా (gouarani kalowa) తెగ జాతులు తమ పూర్వీకుల నుండి వచ్చిన భూములన్ని కోల్పోతున్న కారణంగా 30 సంవత్సరాల లోపే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ప్రజల్లోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే 19 రెట్లు ఎక్కువ, ఆస్ట్రేలియా కెనడాలోను ఆదిమ తెగల్లో ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్నాయి. అనేకమంది ఆంత్రోపాలజిస్టులు అవి నాగరిక సమాజాలు విధిస్తున్న మరణశిక్షలని అభివర్ణిస్తున్నారు.

బ్రిటిష్ వలస పాలకులు సహజ అడవులను సరుకుగా మార్చి మొట్టమొదటిసారిగా 1927లో అటవీ చట్టం చేసింది మొదలు అడవులన్నీ పెట్టుబడిదారుల సంపదగా మారాయి. దీనికి అనుగుణంగానే చట్టాలు చేస్తూ వస్తున్న పాలకులు ఆదివాసుల తిరుగుబాటులతోనే కొన్ని సంస్కరణలు తెచ్చారు. కానీ నేడు పచ్చిగా కార్పోరేట్ అనుకూల విధానాలతో ప్రజావ్యతిరేక చట్టాలు ఊపందుకుంటున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలతో క్రీస్తు శకం 1260లో బలమైన కాకతీయ సామ్రాజ్యంతోనే పోరాడిన సమ్మక్క సారక్కలు, మొగలాయిలను-రాజాధిరాజులను ఎదిరించిన బిర్సా ముండా, 1940లో నిజాం పాలకులను సవాల్ చేసిన కొమరం భీమ్, బ్రిటిష్ వాళ్లతో ఎదురొడ్డి పోరాడిన రాంజీ గోండు, అల్లూరి మన్యం పితూరి లాంటివి చరిత్రలోనే కొన్ని రికార్డ్ అయినాయి. కానీ ఉరితీయబడ్డ కారం తమ్మన్న (ముఠాదారు) అదేవిధంగా జమీందారు కోరుకొండ సుబ్బారెడ్డిని 1857లో ఉరితీసి రాజమండ్రి కోటలో 1929 వరకు మృతదేహాన్ని ఇనుపబోనులో పెట్టి అలాగే ఉంచారు. నేటికీ ప్రజా తిరుగుబాటులను అణిచివేయడం నిరంతరం జరుగుతూనే ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో బ్రెజిల్ అధ్యక్షుడిగా లిబరల్ అభ్యర్థిగా పోటీ చేసిన జైర్ మెస్సియాస్ బోల్సోనారో “ఒక్క ఇంచు కూడా ఆదివాసుల భూమి లాక్కోనివ్వనని” వాగ్దానం చేసి గెలిచాడు. ఈరోజు లక్షలాది ఎకరాల అటవీ భూములు కార్పొరేట్లమయవుతుంటే ఒక్కరైనా అడ్డుకునేవాళ్లున్నారా? అంటూ రోజు నెత్తురోడుతున్న ఆదివాసి సమాజం ఎదురుచూస్తోంది. అందుకే ఆదివాసులకు సంఘీభావంగా స్వయంపాలనకై కదం దొక్కుదాం.

(9 ఆగస్టు, 2025 ఆదివాసి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా) 

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply