ఎర్రపిట్ట పాట (12) – కఠినమైన దినచర్య

కర్కశంగా మోగే బెల్లొకటి వణికించే చలికాలం ఉదయాల్లో పొద్దున్న ఆరున్నరకే మమ్మల్ని నిద్ర లేపేది. పశ్చిమాన వదిలేసి వచ్చిన పచ్చిక మైదానాలనూ, సంకెళ్లు లేని స్వేచ్ఛ గురించీ కంటున్న కలలనుంచి చల్లని నేలమీదకు జారి తెల్లమొఖాల రోజులోకి తిరిగి వచ్చేసేవాళ్లం. హాజరు కోసం బెల్లు మోగేలోగా, మంచం దిగి బట్టలూ, బూట్లు వేసుకుని, గడ్డకట్టించే నీళ్లతో కళ్లు తడిచేసుకుని రెడీ అవడానికి చాలా తక్కువ సమయం ఉండేది.

మగతలో జోగుతున్న ఇంతమంది పిల్లలూ, అనుసరించవలసిన లెక్కలేనన్ని ఆజ్ణల మధ్య ఆగి పొద్దు పొద్దున్నే తన పిల్లలకు ఇంత షాక్ ఇచ్చినందుకు ప్రకృతికి క్షమాపణ చెప్పడానికి ఒక్క క్షణమైనా వృధా చేసేంత తీరిక ఎవరికీ లేదు. అసెంబ్లీ హాలును సమయానికి చేరుకోవాలని రెండ్రెండు ఎత్తైన మెట్లమీదనుంచి దూకుతూ మేడ కిందకు ఉరికేవాళ్లం.

హాజరుపట్టీ ఉన్న పసుపుపచ్చని నోటుబుక్కునూ, కొరికేసినట్లున్న ఒక పెన్సిలునూ పట్టుకుని ఒక తెల్లామె తలుపు దగ్గర ప్రత్యక్షమయ్యేది. అలసిన ఆమె సన్నని మొఖాంలో పెద్ద బూడిదరంగు కళ్లు ఉదాసీనంగా వెలిగేవి.

అధికారదర్పపు వలయంలో ఆమె నిశ్చలంగా నిలబడేది. కళ్లజోళ్ల వెనక ఆమె కళ్లేమో గదిలోని పిల్లలందరిని తీక్షణంగా పరిశీలించేవి. పొడవైన హజరుపట్టీలోని పేర్లను చూసి, మొదటిపేరును పిలిచి, చుబుకం ఎత్తి సమాధానం కోసం కళ్లజోడులోంచి అందరివైపు పట్టిపట్టి చూసేది. పేరు పిలిచినప్పుడు ఉన్నామని సమాధానం చెప్పకపోతే మా రోజువారీ రికార్డులమీద ఆమె పెన్సిలు నిర్దయగా నల్ల మార్కు పెట్టేసేది. ఎలాంటి కారణమూ దాన్ని మార్చగలిగేది కాదు. చిన్న తలనొప్పైనా, లుంగలు చుట్టుకుపోతున్న దగ్గువల్లనైనా హాజరు వేయించుకోవడానికి ఆలస్యంగా వచ్చిన పిల్లలకు నల్ల మార్కు పడిపోయేది. తన రోజుని కోలాహలంగా ఝుమ్మని మొదలెట్టేసిన నాగరికత నేర్పే యంత్రాపు దృఢమైన దినచర్యను ఆపడం దాదాపు అసంభవం.

నా బాధను నిశ్సబ్దంగా ఓర్చుకోవాలే తప్ప, కళ్లు తెరుచుకునీ నా నొప్పిని చూడలేని వాళ్ల చెవులకు ఎలాంటి విన్నపాన్నీ వినిపించకూడదన్నది నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం. సడలని దినచర్యలో జబ్బుతో, నోరులేని జంతువులగా కాళ్లీడ్చుకుంటూ ఎన్నోసార్లు పాల్గొన్నాను.

నాకు చాలా ఇష్టమైన ఒక స్నేహితురాలిని పోగొట్టుకున్నాను. ఆమె ఎన్నో రోజులు ఎలాంటి ఉత్సాహం లేకుండా నా పక్కన నడవడం గుర్తుంది. చివరికి ఒకరోజు దిండుమీదనుంచి తలెత్తలేని స్థితికి చేరుకుంది. నేను చనిపోతున్న ఆ అమ్మాయి మంచం పక్కన నిలబడి ఏడ్చాను. ఒక తెల్లామె ఎండిపోతున్న ఆ అమ్మాయి పెదవులను తడుపుతూ కూర్చుంది. ఆమె దుప్పటి మడతల మధ్య తెరచివున్న తెల్లవాడి బైబిల్ నాకు కనిపించింది. చనిపోతున్న ఆ అమ్మాయి జీసస్ గురించీ, ఉబ్బిన ఆమె కాళ్లూ చేతులను తడుపుతున్న తెల్లామె గురించీ, ఏవేవో సంబంధంలేని విషయాలు మాట్లాడింది.

దుఃఖంతో నాలో కసి పెరిగింది. మా జబ్బులపట్ల క్రూరమైన ఊదాసీనతతో ఉండే ఆ తెల్లామెను నా మనసులో నిషేధించాను. అప్రయత్నంగా కదిలే పెన్సిల్లన్నా, ఒక పెద్ద మందుసీసాలోంచి వంపిన మందును జబ్బుపడ్డ పిల్లలందరికీ వరసగా ఇచ్చే స్పూన్లన్నా నాకు అసహ్యం పుట్టేసింది. సదాశయంతో కష్టపడి పని చేస్తూన్న ఆ తెలివి తక్కువ తెల్లామెను, తన మూఢనమ్మకాలను మా హృదయాల్లోకి చొప్పిస్తున్నందుకు నిందించాను. నా చిన్న సమస్యలతో విషాదంలో ఉండినా, బాధ తగ్గాక కొన్ని రోజులకు ఆ క్రూరురాలివైపు నవ్వుమొఖంతో చూడగలిగాను. ఓ వారం తిరిగేలోగా సమాధిచెయ్యడానికి సిద్ధం చేస్తున్న శవాన్ని కట్టేసినట్లు నా వ్యక్తిత్వాన్ని బంధిస్తున్న సంకెళ్లను చురుకుగా పరీక్షించడం మొదలుపెట్టాను.

​​ఆ నల్లబారిన రోజుల విషాదం ఎంత పొడవైన నీడ పడేసిందంటే గడచిపోయిన ఆ సంవత్సరాల దారిని అది చీకటిమయం చేసేసింది. సడలని కఠిన నియమాలతో సాఫీగా సాగిపోయిన బడిరోజుల గ్నాపకాలలో ఆ విషాదభరిత అనుభవాలే ఎక్కువగా గుర్తొస్తున్నాయి. అక్కడ జరిగిన సంఘటనలను ఇప్పుడు నమోదు చెయ్యడానికి నా ఇండియన్ మనసులోని దుఃఖపు తెర ఆ గ్నాపకాలను తట్టిలేపుతున్నదేమో. నాలోలోపల ఎంత కల్లోలం చెలరేగుతున్నా, దయతో చెవి వొగ్గి వినేవారికి మాత్రమే వినిపించే విచిత్రమైన రంగుల అల్చిప్ప హీనస్వరంలా మాత్రమే ఇదంతా వెల్లడవుతోంది.

Xiii: విచిత్రమైన నాలుగు వేసవి కాలాలు

మూడేళ్లు తెల్ల బడిలో గడిపాక ఓ నాలుగు వేసవి కాలాలు మా పశ్చిమ దేశంలో గడిపాను.

ఆ రోజుల్లో నేనేదో సంక్షోభానికి కేంద్రంలో ఉన్నట్లు, ఏ ఒక్క మానవీయ స్పర్శకూ స్వరానికీ అందనంత దూరంలో ఉన్నట్లు అనిపించేది. నాకంటే పదేళ్లు పెద్దవాడైన మా అన్నకు నా వేదన సరిగ్గా అర్థం కాలేదు. ఎన్నడూ బడిలో అడుగుపెట్టి ఉండని అమ్మకూ ఈ చదువుకున్న కూతురిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ప్రకృతిలో కూడా నాకు స్థానమేది లేనట్లు అనిపించింది. నేను చిన్నపిల్లను కాదూ పెద్దదాన్నీ కాదు. అడవి మనిషిని కాదూ, మచ్చికచేయబడ్డ ఇండియన్నూ కాదు. ఈ దయనీయమైన స్థితికి తూర్పుదేశపు అనుభవాలు ఒక కారణమైతే, ఏదో అసంతృప్తితో రోజులు వెళ్లదీసే యుక్తవయసులో ఉండడం మరో కారణం.

చిరాకు పెడుతున్న అలాంటి అవస్థలో, ఓ మంచి మధ్యాహం పూట అంతుబట్టని అనిశ్చితితో, విచారంగా ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు, మా అన్న గుర్రం ఉల్లాసంగా కదంతొక్కుతూ మా ఇంటి పక్కనున్న రోడ్డుమీద రావడం వినిపించింది. ఇంతలో గుర్రాన్ని ‘హో! ‘ అంటూ అపుతున్న అన్న సుపరిచతమైన గొంతు వినిపించింది. అన్న ఇంటిముందున్న గుంజకు దాన్ని కట్టి ఇంట్లోకి రావడానికి చెక్కమెట్లమీద కాలుపెట్టాడు.

గుమ్మం దగ్గరే పలకరించి బయటకు వెళ్లిపోతున్న నన్ను, “ఏంటి సంగతి?” అన్నట్లు చూశాడు.

తను అమ్మతో మాట్లాడుతుండగానే గుర్రం కళ్లేలను గుంజనుంచి విప్పాను. గుర్రాన్ని ఎక్కి, కళ్లేలను పట్టుకుని, దాని డొక్కలను కాళ్లతో నొక్కిపట్టి దాన్ని గిర్రున తిప్పాను. పరిగెత్తడంలో తన సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుంది గుర్రం. వెనక్కి తిరిగి చూస్తే మా అన్న నావైపు చేతులు ఊపుతూ కనిపించాడు. రోడ్డు మలుపుతోపాటు తిరిగేసి కనిపించకుండా అదృశ్యమయ్యాను.

మలుపులు తిరిగిన రోడ్డుమీద, చిన్ని గుట్టల పక్కన ఎత్తుపల్లాలలో ఆగకుండా గుర్రాన్ని పరిగెత్తించాను. రోడ్డుకు ఇరువైపులా నీళ్లు కోసిన గుంటలు మాకు సమాంతరంగా పరిగెత్తాయి. గాలి విసురుగా నా చెంపలను తాకుతూ నా చొక్కా చేతులను ఎగరగొట్టింది. అన్నిటికన్నా ఎత్తైన గుట్టను ఎక్కేసిన గుర్రం ఇక చదును నేలమీద పరిగెట్టడం మొదలుపెట్టింది. అంత ఎత్తునుంచి చూస్తుంటే వృత్తాకరంలో కనుచూపుమేర పరచుకుని ఉన్న డకోట ప్రెయిరీ మైదానంలో ఎత్తుగా పెరిగిన గడ్డీ, దానిమీద పొర్లిపోతూ పొడవాటి నీడలు పరుస్తున్న గాలి తప్ప మరే కదలికా కనిపించలేదు.

గుర్రం నోటినుంచి ఎగిరిపోతున్న తెల్లని నురగను చూసి నా అల్ప మనసు సంతోషపడింది.

నేలలోంచి వచ్చినట్లు హఠాత్తుగా మాముందొక తోడేలు ప్రత్యక్షమయింది. గుట్టలను దాటి ఆ పక్కనున్న ఊర్లోకి వెళ్తున్నట్లుంది ఆ దొంగ తోడేలు. చాలాసేపు తరుముతూ వెళ్లి దాన్ని బాగా భయపెట్టాను. వెనక్కి వెళ్లడానికి మా ఊరివైపు గుర్రాన్ని తిప్పగానే ఆ తోడేలు అలసట తీర్చుకోవడానికి ఎర్రటి ఎండలో నేలమీదకు ఒరిగింది.

గుర్రాన్ని ఇంటివైపు మెల్లగా నడిపిస్తూ కొండ దిగేంతవరకూ ఆ తోడేలు ముక్కు నావైపే గురి చూసి ఎత్తి పెట్టింది.
కాసేపటికి మా ఇంటి కనుచూపుమేరలోకి వచ్చాను. ముంగిలిలో నిలబడి ఓ ముసలివీరుడెవరో మాట్లాడుతుంటే నవ్వుతూ కనిపించాడు మా అన్న డావీ. ఆ పెద్దాయన చూపుడువేలితో ఒకసారి, చేతులను ఊపుతూ మరోసారి కొండలవైపు చూపిస్తూ ఏదో చెప్తున్నాడు. ఒక భుజం మీద దుప్పటి వెసుకుని ఉన్న ఆయన ఉద్రేకంతో మట్లాడుతున్నాడు. డావీ అయన భుజాలు పట్టుకుని నావైపు తిప్పి ఆయనకు నన్ను చూపించాడు.

“ఓ హాన్! ” (ఓ అవును) అని గొణిగి ఆ వీరుడు తన దోవన వెళ్లిపోయాడు. ఆయన తనకు ఇష్టమైన గుట్టను ఎక్కి ప్రెయిరీ మైదానాన్ని పర్యవేక్షిస్తుంటే తోడేలును తరుముతున్న నేను కనిపించానట. చురుకైన ఆయన కళ్లు గుర్రాన్నీ, దాని రౌతునూ గుర్తుపట్టాయి. నాకేదైన ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి అమ్మను హెచ్చరించడానికి పరుగుపరుగున వచ్చాడట. దయతో ఆయన నాపట్ల కనబరచిన శ్రద్ధ నాకు చిరాకు కలిగించింది. అప్పట్లో నాలోని అలజడి నా హృదయాన్ని నమిలేస్తున్నట్లుండేది.

ఆ పెద్దాయన అక్కడ్నుంచి వెళ్లిపోగానే వేరే విషయం గురించి డావీని అడిగాను.

“లేదు, నా చిన్నారి చెల్లాయీ, ఈ రాత్రి పార్టీకి నాతోపాటు నిన్ను తీసుకెళ్లలేను.” తను జవాబిచ్చాడు. నాకు పదిహేనేళ్లు రావడానికి ఎన్నో రోజులు లేకపోయినా, మా అత్తకూతురిలా పెద్దరికం తెచ్చే ప్రత్యేక హోదాను అనుభవించాలని నేను ఆతృత పడుతున్నా డావీ నన్నింకా చిన్నారి చెల్లాయి అనే పిలుస్తాడు.

ఆ వెన్నెల రాత్రి, మా ఇంటిపక్కనుంచి ఉల్లాసంగా పరాచికాలాడుతూ వెళ్తున్న యుక్తవయస్కుల మాటలు వింటూ మా అమ్మ ఎదుటే ఏడ్చాను. వాళ్లెవరూ దుప్పట్లు కప్పుకున్న యువవీరులుగానో, చెంపలను అందమైన రంగులతో అలంకరించుకున్న పడుచు అమ్మాయిలుగానో మిగల్లేదు. వాళ్లంతా తూర్పువైపు వెళ్లి బడిలో మూడేళ్లపాటు నాగరికత నేర్చుకుని వచ్చినవాళ్లు.

యువకులు తెల్లవాడి కోటు, ట్రౌజర్లు వేసుకుని నిగనిగలాడుతున్న టైలను మెడచుట్టు కట్టుకున్నారు. యువతులేమో సన్నని బట్టతో నేసిన గౌన్లను వేసుకుని, నడుము చుట్టూ, మెడ చుట్టూ రిబ్బన్లు కట్టుకున్నారు. ఇలాంటి పార్టీలలో వాళ్లు ఇంగ్లీషు మాట్లాడేవాళ్లు. మా అన్న మాట్లాడేంత ఇంగ్లీషు నేను కూడా మాట్లాడేదాన్ని కానీ, నన్ను వెంట తీసుకెళ్లడానికి ఆ పార్టీకి తగిన బట్టలు నా దగ్గర లేవు. తలమీద పెట్టుకోవడానికి సరైన టోపీ గానీ, రిబ్బన్లు గానీ, శరీరాన్ని అతుక్కున్నట్లుండే బట్టలూ లేవు. తూర్పుబడి నుంచి వచ్చేశాక నేను నా బూట్లను పడేసి మెత్తని మొకాసిన్లను తొడుక్కుంటున్నాను.

డావీ పార్టీకి వెళ్లడానికి హడావిడిగా తయారవుతున్నంతసేపు, నేను నా కన్నీళ్లను దిగమింగుకున్నాను. కానీ తను గుర్రాన్నెక్కి పార్టీవైపు ఎగురుకుంటూ వెళ్లిపోవడం విని, నేను చేతుల్లో మొఖం దాచుకుని వేడి కన్నీళ్లు కార్చాను.

నా విచారాన్ని చూసిన అమ్మ చాలా బాధపడింది. నా పక్కన నిలబడి, మా ఇంత్లో ఉన్న ఒకేఒక అచ్చుప్రతిని నాకు ఇవ్వబోయింది. అది ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక మిషనరీ ఇచ్చిన ఇండియన్ బైబిల్. దానితో ఆమె నన్ను ఓదర్చడానికి ప్రయత్నించింది. “చిట్టితల్లీ, ఇదిగో తెల్లవాడి పేపర్లు. కొద్దిసేపు చదువుకో” ఆ పుస్తకం పట్ల ఎంతో భక్తితో ఆమె అన్నది.

ఆమె కోసం తన చేతుల్లోంచి ఆ పుస్తకాన్ని అందుకున్నానేగానీ కోపంతో రగిలిపోతున్న నా మనసుకు ఆ పుస్తకాన్ని కాల్చెయ్యాలనిపించింది. ఆ పుస్తకం వల్ల నాకు అందే సహాయమేమీ లేదు కానీ అమ్మకు అదొక మత్తులా పనిచేస్తోంది. నేను దాన్ని చదవలేదు. నేను కూర్చున్నచోటే కాళ్ల పక్కన ఆ పుస్తకాన్ని తెరిచి పెట్టుకున్నాను. నా బైబిల్ తిరస్కరణ వెంబడి వచ్చిన నిశ్సబ్దపు తుపానులో, చిన్న గిన్నెలోని నూనెలో వెలుగుతున్న దీపం మిణుకుమిణుకుమంది.

ఆ తరువాత విధి పట్ల నాలో చెలరేగుతున్న ఆగ్రహం, నా కన్నీళ్లను కళ్లల్లోకి చేరకముందే ఆవిరి చేసింది. తలదించుకుని, శిలలా కూర్చుండిపోయాను. అమ్మ భుజాలచుట్టూ, తలమీదా దుప్పటుకప్పుకుని, చీకట్లో బయటకు అడుగుపెట్టింది.

అనిశ్చిత ఏకాంతంలో కాసేపు గడిచాక, రాత్రిని కోసేస్తూ ఏడుపులాంటి అరుపు ఒకటి నన్ను మేల్కొలిపింది. చనిపోయిన వీరుల ఎముకలను తమలో దాచుకున్న గుట్టలవైపునుంచి ఏడుస్తున్న అమ్మ గొంతు వినిపించింది. ఈ అసహాయ స్థితిలో తనకు తోడు ఉండమని తన సోదరుల ఆత్మలను ఆమె బిగ్గరగా కోరింది. నా కన్నీళ్లు నా వేదనను ఆమెకు చెప్పేసాయని, ఆమె నాకోసం దుఃఖిస్తోందని అర్థమై నా వేళ్లు చల్లగా గడ్డకట్టాయి.

కాసేపటికి ఏడుపు ఆగిపోవడంతో ఆమె ఇంటికి తిరిగివస్తోందని అర్థమైంది. అమ్మ ఇంటికి చేరేలోగా దీపాన్ని ఆర్పేసి కిటికీకి తల ఆనించి కూర్చున్నాను.

ఆ పరిసరాలనుంచి పారిపోవడనికి ఎన్నెన్నో ఎత్తులు నా మనసులో తిరిగేవి. అలా కలతల్లో గడిచిన మరిన్ని నెలలు నన్ను తూర్పుబడివైపు తోశాయి. తెల్లవాడి ఇనుపగుర్రాన్నెక్కి మరోసారి తూర్పువైపు ప్రయాణించాను. కొన్ని శీతాకాలాల తరువాత అమ్మ దగ్గరికి మళ్లీ వెళ్లిపోతాననీ, అప్పటికి ఇంకా ఎత్తు పెరిగుతాననీ, నన్ను ఇష్టపడే స్నేహితులు ఇంటిదగ్గర నాకోసం వేచిచూస్తుంటారని అనుకున్నాను.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply