Heart of the Heartless – అంటరాని వసంతం

అంటరాని వసంతం నవల తెలుగు సాహితీ లోకంలో ఒక సంచలనం. ఇందుకు పలు కారణాలు. రచనా విషయం కథన శైలి, రాజకీయ సందర్భం, రాజకీయ ప్రేరణ కూడా విభిన్నమైనవి. ఈ కాలంలో ప్రముఖంగా ఉన్న ధోరణులలో ఏదో ఒకటి కాదు. ఆ ఒక ధోరణిని ఎన్నుకుని, దాని ప్రాచుర్యం పెంచటానికి చేసిన రచన కాదు. పూర్తిగా సొంత గొంతు. వస్తురీత్యా ప్రధాన స్రవంతి రాజకీయ చారిత్రక ధోరణుల దృష్టిలోనికి రాని, ఒక అణగారిన జాతి సజీవ చరిత్రను అక్షరంగా, వాక్యంగా, కావ్యంగా మలచడం ప్రధాన లక్ష్యం. ఆ కావ్యం సొంత మనషుల బతుకు కష్టసుఖాల కథ కావడం మరో విశేషం. అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు కాదు. ఆ తరాల దు:ఖంతో కమిరిన గుండెపు అగాధాలను తట్టిలేపి, ఉవ్వెత్తున ఎగిసి, కన్నీటి జలను స్రవింపచేసే కొత్త రకం మందు. చదువుతుంటే, పాఠకుల కన్నీరు చారికలు కట్టే ఉద్విగ అనుభవం. ఇంత విభిన్నత కలిగిన రచన ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యం లేదు.

తెలుగు సాంసృతిక లోకంలో అంటరాని వసంతం నవలకు శైలి రీత్యా సారూప్యత కలిగిన సృజనగా వెలువడింది రాణి శివశంకర శర్మ పుస్తకం The Last Brahmin. దృశ్య పరమైన సినిమాలను గమనిస్తే శ్రీరాములయ్య, బాలకృష్ణ నాయకుడిగా వచ్చిన సమరసింహారెడ్డి, – రెండిటికీ శైలి పరమైన సారూప్యత కనిపించింది. శైలి అంటే రూపం అనే అర్థంలో కాదు. శైలి అంటే, Narrative Structure అన్న ప్రత్యేకమైన అర్థంలో వాడుతున్నాను. ఒకే రకమైన Narrative Structure కనిపిస్తుంది. నాలుగు రచనలలోనూ నాయక కేంద్రంగా నిర్మితమైన కథ- 2. Loss, వ్యవస్థల వలన అన్యాయానికి బలైన అపర శక్తివంతమైన నాయకుడు లేదా శక్తి లేదా సమూహం. అన్యాయం తీవ్రమైతే, నాయకుని తేజస్సుకు మరింత నిగారింపు. 3. అన్యాయాన్ని గానంచేస్తూ, నీతిని, జాతిని నిలబట్టే నాయక పాత్రల సృజన రచయిత బాధ్యత. 4.అక్షర, వాక్య దృశ్య పరంగా జీవాన్ని శ్వాసిస్తూ వెలుగును పెంచే శైలీ.

ఈ లక్షణాలు పైన చెప్పిన నాలుగు రచనలలోనూ సామాన్యం. నాయక ప్రధానమైన ఇతివృతంలో కావ్యరచన పురాణ కాలం నుంచి కొనసాగుతూ, అదే లాంటి ఇతివృత్తాలు స్థానిక సాంప్రదాయం కథా రచనలో కూడా ఉన్నాయి. ఆధునిక రచనలలో ఇవే అంశాలు వ్యక్తమయ్యే తీరువేరు. ఆధునిక రచనలలో Individual or Collective lossను నెమరు వేసుకుంటాడు రచయిత. బాపిరాజు రచనలను చూడండి. సాంప్రదాయ వ్యవస్థలు పలుచబారినపుడు వ్యక్తి- సమాజ సంబంధాలు అతలాకుతలం అవుతాయి. ప్రేమని కోల్పోయి హిమాలయాల బాట పడతాడు బాపిరాజు నాయకుడు. కులం వలన అవమానింపబడి, నా అన్న వారిని వదలి, దేశ సంచారి అవుతాడు ఎల్లన్న. తల్లిని, ఊరిని వదలి ప్రజల బాట పడతారు విప్లవ కారులు. Lossను పరిహరించేది ప్రజలు ప్రేమ, దేశ ప్రేమ, తిరుగుబాటు. ఇంటిలో కోల్పోయింది, ప్రజాసమూహంలో వెతుక్కుంటారు అంటారు కదా! ప్రజ వీరుని కౌగలించుకుంటుంది. ప్రజ నాయకున్ని కనుక్కుంటుంది.

ఆధునిక యుగంలో ఈ వ్యక్తి భావన రూపుదిద్దు కుంది. వ్యక్తి సంఘం నుండి విడివడి, మరల సంఘంతో పెనవేసుకునే క్రమంలో అనేక సమస్యల వస్తాయి. దేవుడి ప్రకృతి, సమాజ నుండి ఎడబాటు, అంతా ఎడబాటు. ఎడబాటును ఆవిరి చేస్తూ సంఘంతో ప్రకృతితో మమేకమయ్యే క్రమంలో సృజన కీలక మైన భావనలను అందిస్తుంది. వంచితుడు (Victim) అయిన వ్యక్తి సంఘంతో మమేకమయ్యే క్రమంలో అనేక సామాహిక భావనలను కల్పించుకుంటుంది. మానవ హృదయం, నాయకుడు అనే భావం ప్రధానమయింది. కర్తవ్యం పవిత్రమయింది. ప్రకృతి భగవంతుని స్వరూపం. సృజన రచయిత అంతఃలోకాల నుండి తన్నుకొచ్చేది అనే భావనలు.

అంటరాని వసంతం నవల లోతులను ఆకళింపు చేసుకోవడానికి, యురోపియన్ ఆధునికతలో ఆలోచన పాయలను రేఖమాత్రంగానైనా ప్రస్తుతించాల్సి ఉంటుంది. Rationalism మరియు రొమాంటిసిజం. నమ్మకాలను హేతువుతో పుటం పెట్టాలి. హేతువు నిర్మిత మానవ సమాజ భవిత శోభయమానంగా ఉంటుంది. సంఘ ప్రభుత్వ చట్ట వ్యవస్థలను హేతువు ఆధారంగా పునర్శించాలి అని Rationalism భావనలు. Rationalismకి ప్రతిగా పుట్టి, వికసించిన ఆలోచనా ధోరణి Romanticism. Romanticism ఒక తర్కబద్దంగా నిర్మితమైన ఆలోచనల సముదాయం కాదు. Romanticism కవిత్వంలో మొదలుకొని, అనేక సృజన స్రవంతుల నుండి తన్నుకొచ్చిన ఉవ్వెత్తు భావ తరంగం. ఈ భావనకు పలు పార్శ్వాలు ఉన్నాయి.

Romanticism is Union of Love, Religions and Chivalry అంటాడో యూరోపియన్ మేధావి. పై మూడు భావనలు కలగలసి ఉంటాయి. ప్రేమ, మతం, వీరత్వం కలగలసి ఆధునికతకు ఒక వింత. ఈ మూడూ కలిసిపోయి సంఘంలో సంస్కరణ లేదా విప్లవంగా వ్యక్తమవుతాయి. సామాజిక వ్యక్తి కరణ సంస్కరణ, విప్లవం అని రెండు వెర్రితలలు అంటాడు ఒక మేధావి. వివిధ రూపాలలో వ్యక్తమవుతూ, సాంప్రదాయానికి, గతానికి తీరని ఉపద్రవమే ఇది. పాత, కొత్త, బూర్జువా వర్గాల సంఘర్షణ Romanticism అని కూడా.

ఉదారవాద ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులకు ప్రతిగా పుట్టిన సాంస్కృతిక సృజన వ్యక్తీకరణగా అంటరాని వసంతం నవలను అనుకోవచ్చు. ఈ నవలా గానం తెలుగు నేలను మొలకెత్తిన కొన్ని రకాల Romanticist సృజన కావ్యాలలో ఇదొకటి.

ప్రపంచీకరణ సకల రంగాలను తొలిచి పీల్చి పిప్పి చేసున్న కాలం. సర్వం లెక్కల ప్రకారం నడవాలి (ప్రభుత్వంతో సహా) అని నమ్మి అధికారంలోనికి వచ్చాడు చంద్రబాబు నాయుడు. సర్వరంగాలలో నైతికత ఆవిరి అయిపోయి, Mind Games గుబాళిస్తున్న కాలం. విప్లవం గాలి తీసిన టైరులా అయిపోయింది. Software విరజిమ్మిన డబ్బు thrill value తబ్బిబ్బు చేసింది. మరొక వైపు దళిత స్త్రీవాదాలు విప్లవోద్యమంపై ప్రశ్నలు లేవనెత్తాయి. అందరికీ కులం నిజం. విప్లవం చేతకాని తనమయింది. కులం అనే Identityతో ఊహించుకుంటే దేహం దూది పింజయి, ఇహలోక ముక్తి కళ్ళముందు కనిపించడం మొదలయింది. ఈ సందర్భానికి విప్లవ పథికుడు ఎలా సమాధానం చెపుతాడు? అంటరాని వసంతంలా.

అంటరాని వసంతం విప్లవ నవల అని, విప్లవ సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన నవలగా భావించవచ్చు. దళిత సాహిత్యానికి కొత్త రంగులద్దిన రచన అనుకోవచ్చు. రచయిత అన్నట్టుగా, ప్రదాన స్రవంతి రచనలో అక్షరబద్ధం కాని దళిత జాతి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్మిక వారసత్వాన్ని ఎలుగెత్తిన పుస్తకం. దళిత ఉద్యమ సాహిత్యం చరిత్ర రచనకు పూనుకోలేదు. చరిత్రంతా గాయాల గేయం అనుకొని ఉండవచ్చు. ఒక జాతి ప్రస్తుత అస్తిత్వ నిర్వచనానికి చరిత్ర వాహిక కావడం ఆధునిక యుగలక్షణం. జాతి కావచ్చు, కులం కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు. దాని అస్తిత్వానికి చరిత్రను కథనంగా గుర్తు తెచ్చుకోవడం అనివార్యం. అలాంటి కథ అంటరాని వసంతం.

రాజకీయాల ఆధారంగా సాహిత్య విభజన జరుగుతూ వస్తుంది. విప్లవ, దళిత ఉద్యమ సాహిత్యంలా. కథనంలో అంతర్గతంగా ఉండే భావనల ఆధారం కూడా రచన యొక్క ఆత్మ రూపు దిద్దుకుంటుంది.

అంతరాని వసంత నవలలో అంతర్గతంగా ఉన్న భావనలు యూరోపియన్ ఆధునికతలో ఒక పాయ అయిన రొమాంటిసిజం వ్యక్తీకరించిన అంశాలను పోలి ఉంటాయి. రచన అంతా యుద్దం అనే Metaphorతో ఆవరించబడి ఉంది. నవలలో చిత్రించిన జీవితం యొక్క సకల పార్శ్వాలు న్యాయం కోసం పోరాటం కోసం మలచబడి ఉంటాయి. పాత్రలు idealise చేయబడి ఉంటాయి. ప్రతి పాత్ర జాతి గౌరవ పోరాటం కోసం పూర్తిగా ఎక్కుపెట్టిన విల్లులా ఉంటాయి. ఓటమి, సంశయం, ద్రోహం లాంటివి ఉండవు, జీవితంలో loss ఉంటుంది. అవమానం హింస వలన కలిగే loss నుండి suffering. ఎల్లన్న ఊరికి లేడు. అవమానింపబడి ఊరి నుండి పారిపోయి దేశ దిమ్మరి బతుకు. లోకం కోసం, జాతి కోసం పాటలతో, ఆటలాడి లోక సంచారం. పల్లెలో ఎదురు చూపులు జీవితమంతా ఎదురుచూపు అయిన భార్య, మేనత్త అవధుల్లేని కల్ముషంలేని ప్రేమలు. భార్యా భర్తలు వేరు కాదు. ఒకటే. ఒకరి కోసం ఒకరు ఎడబాటు వలన కలిగిన దుఃఖం. దుఃఖం ఒక loss సమూహానికి. దుఃఖం వ్యక్తిగతం కాదు.

ఇదే వరస తరువాత తరంలో కూడా, అవమానం. అవమానమే అయిన ఇల్లు. ఇంటి నుండి ఎడబాటు. ఇల్లే అయిన ఉద్యమం. ఎల్లన్న వాగ్గేయకారుడుగా, తరువాత క్రైస్తవం. ఆ తరువాత కమ్యూనిజంలోకీ సంచారం. అవమానం వలన దుఃఖం ఎడబాటు వలన దుఃఖం. దుఃఖాన్ని పరిహరించే ప్రేమ. సమాజంలో ప్రేమ. ఈ idealized viewకి మరింత లోతునిచ్చేవి కళలు ప్రకృతి. ఎల్లన్న జీవితం అంతా పాట ఉంది, ఆట ఉంది. వంటిలో లయ ఉంది. మనిషిన సంపూర్ణంగా వ్యక్తీకరించుకోగలిగేవి కళలోనే కదా, బరువైన అందమైన ప్రకృతి వర్ణనలు. పొలాలు, వెన్నెల, మొదలైనవి.

ఈ idealized viewతో ఇబ్బంది ఏమిటి? ఇబ్బంది ఏమీ లేదు. దళిత ఉద్యమ సాహిత్య ఒరవడిలో లేదు. పంచమం లాంటి నవలలా. స్త్రీవాద సాహిత్యంగానూ లేదు. విప్లవ సాహిత్య విషయకంగా ఉన్నప్పటికి విప్లవోద్యమం నిరాకరించే అనేక అంశాలు ఉన్నాయి. ఒక కుటుంబం చరిత్ర. ఒక కులం చరిత్ర విప్లవోద్యమ సాహిత్యంలో లేదు అని చెప్పవచ్చు. విప్లవోద్యమం చిత్రించిన నాయకుల అంశ అంటరాని వసంతంలో నాయకుల పాత్ర చిత్రణలోను ఉంటుంది. విప్లవోద్యమ నాయక పాత్రలు అమూర్తమై ఉంటాయి. వాటికి కుటుంబం లేదా కులం వాసనలు ఉండవు.

కల్యాణరావు గారి అంటరాని వసంతం నవలలో ప్రస్తావించిన రాజకీయ విలువలను ఎలా స్వీకరించాలి. లిబరలైజేషన్ అనంతర కాలంలో ప్రబలిన బూర్జువా నీతికి విమర్శగా చూడాలా? ప్రజా జీవితంలో సకల నైతిక విలువలు ఆవిరి అయి, లాభం, నష్టం లెక్కలు అన్నీ విలువలకి గీటు. RGVలా. ప్రజా ఉద్యమాలు కూడా లిబరలైజేషను దాటికి నిలబడలేక పలుచబారిపోతున్న రోజులు. దశాబ్దాలుగా సాగిన ఉద్యమాల ఉనికి ప్రశ్నార్ధకమవుతున్న రోజులు. ఈ కాలానికి సవాలుగా ఒక ఆదర్శం అత్యుత్తమ విలువలు, నిస్వార్ధ జీవితం, త్యాగం, తెగింపు, ప్రజా ప్రేమ ఆదర్శవంతంగా. ఇలా ఎందుకు. యుగ ధర్మాన్ని ప్రశ్నిచడం హేతువు ఒకటే మనిషిని నడిపించదు. మనిషిని నడిపించే అనేక శక్తులు అక్షర రూపం. మనిషి సర్వ శక్తి మంతుడు.

God is Dead. పునరుత్థానం (Resurrection). ప్రకృతి లో దేవుడు పనిలో, ఉద్యమంలో ప్రేమలో దేవుని రూపు Romanticism. రాజకీయ విలువగా ప్రగతి కారకమా? కొన్ని సందర్భాల్లో ప్రగతి కారకం మరికొన్ని సమయాలలో పునరుద్ధరణ వాదం (Revivalism). దళిత నవల, కాదా అనే చర్చ కంటే, వివిధ సాహితీ రూపాలలో ఉన్న Romanticism ను గురైరిగి. అర్థం చేసుకోవాలి. దాని రాజకీయ పర్యావసానాలు ప్రత్యేకంగా విశ్లేషించాలి.

రచయిత, విమర్శకుడు. అస్సాం యూనివర్సిటిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

One thought on “Heart of the Heartless – అంటరాని వసంతం

Leave a Reply