కొన్ని వెన్నెల పువ్వులు కొన్ని వేసవి గాడ్పులూ

మానవ భావోద్వేగాల నుంచి కథ పుడుతుంది. ఉద్వేగాలకు మూలం  జీవితానుభవం.  మనుషుల ఇష్టా ఇష్టాలతో  నిమిత్తం లేని  వాస్తవికత అనుభవంలో పోగుపడుతుంది. దానికి ఉద్వేగం, తార్కికత అనే  రెండు దేదీప్యమానమైన పార్శ్వాలు ఉంటాయి. అందుకే సాహిత్యంలోని  అనుభవ చిత్రణ పాఠకులకు వాస్తవికత గురించి ఎరుక కలిగిస్తుంది. ఆ చిత్రణ సవ్యంగా ఉన్నదా, అపసవ్యంగా ఉన్నదా? కేవలం భావోద్వేగాలకే పరిమితం అయిందా? అనే చర్చ సాహిత్యంలో అతి ముఖ్యమైనది. దీనికి తప్పనిసరిగా దృక్పథమే గీటురాయి.

1990 డిసెంబర్‌ సృజన పత్రికలో  శ్రీనివాసమూర్తి తొలి కథ అచ్చయింది.  2000 దాకా తొమ్మిది రాశాడు. మళ్లీ 2020లో మొదలు పెట్టి  ఆరు కథలు రాశాడు. మధ్యలో 20 ఏళ్ల విరామం. నిజంగా అది విరామమేనా? ఏమీ రాయలేదా? ‘రాయడం’ అనే పనికి సాంతం దూరంగా ఉండిపోయాడా? హటాత్తుగా మళ్లీ రాతలోకి వచ్చాడా? అనే సందేహాలు ఎవరికైనా కలగవచ్చు. 

ఇటీవలి ఆరు కథలు చూడండి. మానవుడిగా, కథకుడిగా ఈ ‘విరామ’ కాలం పొడవునా ఆయన  రూపొందుతూ వచ్చాడని తెలుస్తుంది. నిజానికి  ఇది ఈ ఇరవై ఏళ్లదే కాదు.  తొలి కథ ‘సేద్యం’  దగ్గరి నుంచీ  సాగుతున్నది.  మూర్తి కథల్లో రెండు దశలు కనిపించవచ్చు. కానీ వ్యక్తిగా, కథకుడిగా అంతా ఒకే క్రమం అని నమ్మకం కలుగుతుంది. 

మొత్తంగానే ఉద్వేగం, తార్కికత ఆయన్ను కాల్పనిక రంగంలోకి నడిపించాయి. ఆయన కథా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. తన గురించి తెలిసిన వాళ్లయితే ఇది మూర్తి వ్యక్తిత్వమే అంటారు. ఆయనలోని సకల ఉద్వేగాలను నింపాదిగా, సాంద్రంగా, గాఢంగా అనుభవించిన సన్నిహితులకు ఈ సంగతి తెలుసు.  ఆలోచనాపరుడిగా తనలోని తార్కికతే రచయితలోని భావోద్వేగ వ్యక్తీకరణ.  నిజానికి  తన కథా శిల్పం కూడా భావోద్వేగాలు,  తార్కికత కలిసి రూపొందినదే.  

                                                      1

ఇటీవలే ఒక పగలు, రాత్రి కూచొని ఈ కథల్లోని ప్రపంచాన్ని మళ్లీ జ్ఞాపకాల్లోంచి పునర్నిర్మించుకున్నాం.  అందులోని గాయాలను, మరణాలను, నెత్తుటి ధారలను  స్పృశించి దు:ఖితులమయ్యాం. అన్నిటికన్నా దు:ఖమే పదే పదే మనుషుల కూడలి అవుతోంది కదా అనుకున్నాం. అట్లాగే ఈ కథల్లోంచి  భవిష్యత్తు దిశగా విస్తరిస్తున్న పోరాట ప్రపంచపు  అజేయమైన శక్తిని తరచి చూసుకున్నాం.  దానికి అనేక అర్థ వ్యాఖ్యానాలు ఇచ్చుకున్నాం.

అంతా అయ్యాక ముందుమాట  రాయమని మూర్తి అడిగాడు. ఇలా నేను రాయడమంటే ‘నీ కథల గురించి నీవే రాసుకోవడం కాదా?’ అని నేను మరో మిత్రురాలి మాటలను  ప్రస్తావించాను. బహుశా ఈ కథల్లో ఒక్క ‘సేద్యం’ తప్ప మిగతావన్నీ కలిసి ఆలోచించి, ఆంతర్మథం చెంది తీర్చిదిద్దినవే. మేం ఇద్దరమే కాదు. నాకంటే ఎక్కువగా రాప్తాడు గోపాలకృష్ణ, ఇంకా అనేక మంది మిత్రుల కలబోత. ప్రజల చైతన్యవంతమైన ఆచరణ, సమాజమంతా కదలబారుతున్నప్పటి సంఘర్షణ, సంరంభం. అవన్నీ 1990ల నాటి కర్నూలు నిర్దిష్ట స్థలకాలాలు.  ఈనాటి వాటి తార్కిక  విస్త్తరణ.  ఇందులోంచే  మూర్తి రెండో దశ కథలు మొదలయ్యాయి. వాటి ఇతివృత్తాలు వేరే కావచ్చు. కానీ వాటి వెనుక కూడా కర్నూలు స్థానీయత తనకు  ప్రేరణగా  ఉన్నది. 

ఈ కథలన్నీ ఒకచోట పేర్చుతున్నప్పుడు ముప్పై ఏళ్ల తన అనుబంధపు లోతుల్లోకి వెళ్లాను. మూర్తితో పాటు నడిచిన దారినంతా తలపోసుకున్నాను. నా తొలినాళ్ల ఉద్వేగాలను, ఉత్సుకతలను తను ముట్టుకొన్నప్పటి స్పర్శను తనవితీరా మళ్లీ అనుభవించాను. నా వేలు పట్టుకొని విప్లవ సాహిత్యోద్యమంలోకి నడిపించి, నా ఆలోచనలను  తీర్చిదిద్దిన స్నేహాన్ని గుర్తు చేసుకొని సంభ్రమానికి లోనయ్యాను.   కలిసి చేసిన పనులు, తిరిగిన ప్రయాణాలు, అంతులేని వాదోపవాదాలు, లోపలా బైటా సాగించిన అన్వేషణలు, ఏ చిన్న విజయమో సిద్ధించినప్పడు కలబోసుకున్న ఆనందాలు,  ఒకే హృదయమై పంచుకున్న దు:ఖాలు మరోసారి సొంతం చేసుకున్నాను. ఊహ తెలియకముందే తండ్రి నదిలో కొట్టుకొనిపోతే.. ఒంటరి తల్లి అనుభవించిన కష్టాల్లోంచి  తనను తాను గుర్తు చేసుకుంటూ ఒకనాటి సాయంవేళ కానల మధ్య మిత్రుల నడుమ మూర్తి గుండెలవిసేలా దు:ఖించడం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది.

తన కోసమైనా, మరెవరి కోసమైనా ఒకేలా స్పందించడానికి  ముప్పై  ఏళ్లుగా తన హృదయం ఎక్కడ ఉండాలో అక్కడ పదిలంగా దాచుకున్నాడు. వుద్యోగం కోసం దేశమంతా తిరిగినా   విశ్వాసాలను అపురూపంగా నిలుపుకున్నాడు. ఇటీవల ఒక యోధుడి స్మృతిలో.. ‘కరుకైన నీ ప్రశ్నలకు వొకమారు కలవరపడి కడుపులో దుఃఖాన్ని ఎత్తి పోసుకుంటే అమ్మలా ఓదార్చావ’ని గుర్తు చేసుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ తనలోని తడి తడి  ఉద్వేగపు ధారను ఈ కథలన్నిటిలో మరోసారి చూస్తున్నాను. ఈ కథలను అర్థం చేసుకోడానికి మూర్తి రూపొందిన ఈ భావోద్వేగ, తార్కిక ప్రపంచం అత్యవసరం. ఇవన్నీ కలిసి ఈ కథలకు ముందుమాట రాయడమంటే మరేమో కాదు.. తన గాఢమైన ఆలింగనాన్ని మళ్లీ అందుకోవడమే.

                                                      2

రాయలసీమలో..అందునా కర్నూలు కథా ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. విచిత్రమైనది. లోకమంతా ప్రగతిశీల, విప్లవ, అస్తిత్వ చైతన్యాలతో నవనవలాడుతోంటే కర్నూలు కథ 1990 నాటికి కూడా అస్పష్ట, గందరగోళ, శుష్క మానవతావాద, మధ్య తరగతి ఈతి బాధల, జనరంజక ధోరణులతోనే ఉండిరది. సరిగ్గా ఆ సమయంలోనే మూర్తి తిరుపతి విశ్వవిద్యాలయం నుంచి కర్నూలుకు 1991లో తిరిగి వచ్చాడు. వస్తూ వస్తూ  యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ ఉత్తేజాన్ని తీసుకొని వచ్చాడు.  విరసం సాంస్కృతిక చైతన్యాన్ని హృదయం నిండా నింపుకొని వచ్చాడు. పౌరహక్కుల ఉద్యమ  అనుభవాలతో వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడే  ‘సేద్యం’ కథ రాశాడు. ఇంత విశాల పోరాట ఉద్విగ్నతల మధ్య  కూడా మూర్తికి తన గురించి పూర్తిగా తెలుసు. సేద్యం కథలో అలాంటి ఎరుక ఉన్నది. అలాంటిది  చాలా మందిలో ఉంటుంది. అదొక్కటే చాలదు. ప్రపంచ గతిపట్ల తార్కికమైన ఆశావాద వైఖరి ఉండాలి. అది చెప్పడానికే  ‘సేద్యం’ రాశాడు. ఈ కథలో రెండు మూడు రకాల వైరుధ్యాలను చిత్రిస్తూ దాన్ని ప్రదర్శించాడు. విప్లవాచరణలో బిడ్డ పదే పదే జైలుపాలవుతున్నప్పటికీ, కథకుడి సందేహాలను తేల్చేస్తూ రైతు సుబ్బయ్య ‘నా సేద్యం నా కష్టాల్ను పోగొట్టలేకపోయినా, వాని సేద్యం మాత్రం పోగొడ్తాది’ అంటాడు.  

ఆ తర్వాత మూర్తి మళ్లీ 1995లో కథా రచనలోకి వచ్చాడు. అప్పటికి తూర్పు  కర్నూలు నల్లమల అంతటా విప్లవోద్యమం విస్తరిస్తున్నది. రేనాటి సరిహద్దు ప్రాంతమంతా అనేక ప్రజాస్వామిక పోరాటాలు సాగుతున్నాయి. దళితులు, రైతు కూలీలు, మహిళలు భూస్వామ్య సాయుధముఠాల వ్యతిరేక చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణంలో బహుజన సంచలనాలు ఊపందుకున్నాయి. ఆలోచనాపరులందరిలో స్త్రీవాద అవగాహనలు భాగమయ్యాయి.

వీటన్నిటికీ తగినట్లు జిల్లాలో సాహిత్యం ఎదగలేదు. ప్రజా చైతన్యం ప్రత్యక్ష్యంగానో, సుదూరంగానో సాహిత్యంలో ప్రతిఫలిస్తుందని అంటాం.  కానీ కర్నూలు కథలోకి, కవిత్వంలోకి ఇవేవీ రాలేదు. విచిత్రమంటే అదే. స్థూలంగా అభ్యుదయ ధోరణి ఉండిరది. అది స్థల కాల రహితమైనది. అమూర్తమైనది. కానీ ప్రజా సంచలనాలు ఎల్లప్పుడూ నిర్దిష్టంగానే ఉంటాయి. సార్వజనీన లక్ష్యాలను, విలువలను నిర్దిష్టంగానే ప్రతిపాదిస్తాయి. పోరాటాలు ఎప్పుడూ నిర్దిష్ట దృక్పథాలతోనే సాగుతాయి. వాటన్నిటితో ఒక కొత్త భావోద్వేగ ప్రపంచం స్థానిక ప్రజల అనుభవాల్లో రూపొందుతోంది. దాని తార్కిక పరిణామాలు కంటికే కనిపిస్తున్నాయి.

సరిగ్గా అక్కడ మూర్తి కథలు రాయడం మొదలు పెట్టాడు. నిస్సందేహంగా కర్నూలు కథలో అదొక మూల ములుపు. అక్కడ తను మార్పు జెండాను పట్టుకొని నిలబడ్డాడు. ఇలాంటి నేపథ్యం నుంచే రాప్తాడు గోపాలకృష్ణ కర్నూలుకు విప్లవ సాహిత్యోద్యమంలోంచి వచ్చాడు. బహుశా రాయలసీమలోనే  లోతైన, విస్తారమైన, బహుముఖీనమైన వర్గపోరాటం  అనంతపురంలో సాగుతుండిరది. దారుణ నిర్బంధం మధ్యనే అక్కడి విశ్వవిద్యాలయంలో అనేక కొత్త పద్ధతుల్లో  విప్లవ విద్యార్థి ఉద్యమం నడిచింది. ఈ ప్రభావాల్లోంచి గోపీ వచ్చాడు.

ఇప్పుడు వెనక్కి తిరిగి కర్నూలు ప్రగతిశీల, విప్లవ కథా వికాసాన్ని పరిశీలిస్తే ఆ ఇద్దరి కథల ప్రత్యేకత తెలుస్తుంది. వాటి  స్థానం తెలుస్తుంది.  కర్నూలు  విప్లవోద్యమ నిర్మాణానికి బైటి నుంచి నాయకులు వచ్చినట్లే బైటి విప్లవ, ప్రజా పోరాటాల ప్రభావంతోనే ఇక్కడి కథలో కూడా విప్లవాత్మక మార్పు వచ్చింది.  

ఆ అవకాశం  మూర్తికి  చరిత్ర ఇచ్చింది. దాన్ని అందుకోగల దృక్పథం పుష్కలంగా ఉంది. మార్క్సిస్టుగా స్థానిక ఉద్యమాల దగ్గరి నుంచి జాతీయ, అంతర్జాతీయ  పరిణామాల దాకా అన్నిటినీ గమనించాడు.ఆ కాలంలోనే దేశవ్యాప్తంగానే  విప్లవోద్యమాలు గుణాత్మక దశకు చేరుకున్నాయి. అనేక రంగాల్లో ప్రత్యామ్నాయ భావజాలాన్ని బలంగా ప్రవేశపెట్టాయి. అట్టడుగు నుంచి  ప్రజా పాలనా నిర్మాణ రూపాలను తీసుకొచ్చాయి. ప్రత్యామ్నాయ అభివృద్ధికి సహకార పద్ధతులను ఆచరణలో పెట్టాయి.  వీటితోపాటు అస్తిత్వ వాద ధోరణులు ప్రబలంగా ముందుకు వచ్చాయి.  దళిత వాదం క్షేత్రస్థాయిలో కదలికలు తీసుకొచ్చింది.  పార్లమెంటరీ మార్గంలో కూడా ఉధృతంగా ఉండిరది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గ్గీకరణ కోసం మాదిగ దండోరా ఏర్పడిరది.  సారా వ్యతిరేక ఉద్యమాల్లాంటివి సాగుతుండేవి.  రాయలసీమ భూస్వామ్య సాయుధ ముఠాల వ్యతిరేక వేదిక, ఆ తర్వాత రాయలసీమ ప్రజా సమితి ఏర్పడ్డాయి. పౌర ప్రజాస్వామిక ఉద్యమాల స్ఫూర్తితో ఎక్కడికక్కడ హక్కుల ఆందోళనలు జరుగుతుండేవి. అటు అస్తిత్వ వాదాల వల్ల, తూర్పు యూరోప్‌ పరిణామాల వల్ల, ఉదారవాద భావజాలం వల్ల హక్కుల ఉద్యమంలో  దృక్పథ చర్చ మొదలైంది.

అన్ని రంగాల్లోని ఈ అల్లకల్లోలాలను కథల్లోకి తేవలసి ఉన్నది. కథ రాయడం అంటే అనుభవాన్ని చెప్పడమే కాదు. అనుభవం కలుగుతున్న తీరును చెప్పడం.  మరే రకంగా తెలుసుకోలేని కోణాలను కళాత్మకం చేయడం.  దీన్నంతా కథల్లోకి తేవడానికి తనను తాను సిద్ధం చేసుకోడానికి మూర్తికి నాలుగైదేళ్లు పట్టింది. చాలా నెమ్మదిగానే రాయడం మొదలు పెట్టాడు. లెక్కబెడితే  ఆ దశలో రాసింది తొమ్మిది కథలే. కానీ కర్నూలు ఆధునిక కథకు చెరిగిపోని దారి పడిరది.  అప్పటికే విప్లవ కథలోకి మూడో తరం అనేక ప్రత్యేకతలతో, నిర్దిష్టతలతో  ప్రవేశించి ఉన్నది. ఆ దారిని  విశాలం చేసిన వాళ్లలో మూర్తి  పాత్ర చెప్పుకోదగింది.

ఈ కథలకు ఒక సన్నాహక వాతావరణాన్ని 1995  మహానంది విరసం కథల వర్క్‌షాపు అందించింది. వేగంగా మారుతున్న కాలంలో,  ఊపందుకున్న ఉద్యమ ఆవరణలో ఎలాంటి కథలు రాయాలో రచయితలకు  స్పష్టత  వచ్చింది.

దేనికంటే సాహిత్యం గత పరిణామాలను చిత్రిక పట్టడంతో ముగిసిపోతే లాభం లేదు. గతాన్ని రాసేది రేపటిని ఊహించడానికి. తద్వారా భవిష్యత్తులో ప్రాసంగికతను సంతరించుకోడానికి. ఆ రోజుల్లో  మూర్తి ‘ఊరు మునిగింది’ కథ రాశాడు. ఈ కథకు నేపథ్యం శ్రీశైలం జలాశయం ముంపు. అప్పటికి లక్ష మెగావాట్ల ‘వెలుతురు’ తప్ప దాని దాపున ఉన్న చీకట్లను ఎవ్వరూ పట్టించుకోలేదు.  ఒక్క పౌరహక్కుల ఉద్యమం మాత్రమే ఈ చీకటి జాడల్లో గల్లంతైన బతుకులను వెతుకుతుండిరది.  ఇంకో పక్క హిరాకుడ్‌ ఆనకట్ట అభివృద్ధి వెలుగు నీడలను చూపించి ప్రొ. ఆర్‌ఎస్‌రావు ఒక విస్తృత రాజకీయార్థిక చర్చను ఆరంభించారు. మరో పక్క ప్రత్యామ్నాయ అభివృద్ధి అంటే ఏమిటో ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం దాకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో మూర్తి ఆలోచనాపరుడు, కార్యకర్త, సృజనకారుడు.

ఊరు మునిగింది కథను ఈ వాతావరణంలో చూడాలి. విప్లవ పార్టీలు ప్రారంభించిన రాయలసీమ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలో  నీటి సమస్య లేదు. అంతకు ముందు నీటి సమస్య మీద పోరాడిన చరిత్ర ఉన్నప్పటికీ అప్పటికి  ఫ్యాక్షన్‌ సమస్యనే ఆ ఉద్యమం ప్రధానం చేసుకున్నది. కానీ మూర్తి ఈ కథ అంతటా  శ్రీశైలం వెలుగు నీడలను  ప్రసరింపజేశాడు. నీటి సమస్యను కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు సాగుతున్న రాయలసీమ నీటి ఉద్యమానికి గొప్ప కళాత్మక ఊతం ఇవ్వగల శక్తి ఈ కథకు ఉన్నది. బహుశా ఆ రోజు తను కూడా ఊహించి ఉండడు.. భవిష్యత్తులో దీని ప్రాసంగికతను. ప్రగతిశీల విప్లవ దృక్పథం వల్లనే ఇది సాధ్యమైంది. 

ఈ కథలో పుల్లన్న అనే ముంపు బాధిత రైతు ‘శ్రీవైలం ప్రాజెక్టు గడితే నీళ్లొస్తాయి. కరెంటొస్తాది. దేశం ముందుకు పోతాది అనిరి. ప్రాజెక్టు కట్టిరి. దేశానికంతా నీళ్లిచ్చిరి. మనకు ఈ పొద్దటికీ రాల్యా!’ అంటాడు. 

ఈ కథలో ఇంకో అద్భుతమైన వెలుగు ఉంది. మామూలుగా రచయితలకు స్పృహ లేకపోతే  సాహిత్యానికి  గతం పెద్ద గుదిబండగా మారుతుంది. వర్తమాన పరిమితి కఠినమైన సంకెల అవుతుంది. బతికేందుకు ఏ దారి లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమా? వర్తమాన పరిస్థితులకు లోబడి  బేలగా ఉండిపోవడమా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి చెప్పడానికే అయితే సాహిత్యం రాయవసరం లేదు. జీవితంలో అవి మాత్రమే ఉండవు. వ్యక్తం కానివి ఇంకా ఎన్నో ఉంటాయి. మానవ అస్థిత్వపు అట్టడుగు తలంలోంచి సాగే  అన్వేషణ  కాల్పనిక సాహిత్య లక్ష్యం కావాలి.  ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వలేదు. అక్కడ నీళ్లయితే ఉన్నాయి. దిక్కుమొక్కులేక వలస పోవడం కంటే ఆ నీళ్లలో చేపలు పట్టుకొని బతకవచ్చనే ఊహ రచయిత చేస్తాడు. అది ఈ కథకు అపారమైన శక్తిని ఇచ్చింది. 

రాయలసీమ కథల్లో కర్నూలు కథకు సానుకూల ప్రత్యేకతలు కూడా  వున్నాయి. అందులో ఒకటి రాయలసీమ అస్తిత్వంలోని ఫ్యాక్షనిజంపట్ల వ్యతిరేకత.   ఇది అంతక ముందు సీమ కథల్లో లేదు. కర్నూలు కథలోనే బలంగా ముందుకు వచ్చింది. మామూలుగా అస్తిత్వవాదుల వైభవీకరణకు భిన్నంగా ఫ్యాక్షనిజాన్ని ఒక పెద్ద ప్రాంతీయ సామాజిక సమస్యగా రచయితలు గుర్తించారు. ఈ ఎరుకను భూస్వామ్య సాయుధ ముఠాల వ్యతిరేక ఉద్యమం అందించింది. అంటే ‘ప్రాంతం’లోని ఆంతరంగిక సమస్యలపట్ల విమర్శనాత్మకంగా ఉండటం.

ఈ దృష్టితో మూర్తి ‘మెడ మీద వేలాడే కత్తి’ అనే కథ రాశాడు. బహుశా దాంతో ఫ్యాక్షన్‌ వ్యతిరేక కథలు మొదలయ్యాయి. కొంచెం అటూ ఇటూగా గోపి, తుమ్మల రామకృష్ణ రాసిన రెండు కథలతో ఫ్యాక్షన్‌ కథలు అనే చిన్న సంకలనం వచ్చింది. ఆ తర్వాత వెంకటకృష్ణలాంటి వాళ్లంతా రాశారు. కుల, భూస్వామ్య దోపిడీ, సాంస్కృతిక ఆధిపత్యాల ప్రత్యేక లక్షణమైన ఫ్యాక్షనిజం ఆ తర్వాత విస్తృత కథా వస్తువు అయింది. అట్లాగే ‘పల్లె మంగలి కథలు’ వచ్చాయి. ఇవి కర్నూలు కథకు, విప్లవ కథకు కూడా ఒక వరవడిని అందించాయి.

‘మెడ మీద వేలాడే కత్తి’ కథతో సహా తొలి దశలో మూర్తి రాసిన కథలు ఆనాటి విప్లవ, దళిత, పౌరహక్కుల పోరాటాల ఆవరణను అద్భుతంగా ప్రతిఫలించాయి. విప్లవమంటే సామాజిక, రాజకీయ సంఘర్షణ. దాన్ని చైతన్యవంతమైన మనుషులు నిర్వహిస్తారు. అందువల్ల అదంతా మానవ సంబంధాల, విలువల, సంస్కృతుల సంఘర్షణగా మారుతుంది. మూర్తి కథా క్షేత్రం ఇది. ఈ ఒరవడి  అప్పటికి పాతికేళ్ల కిందే విప్లవ కథ అందుకున్నది. దాన్ని అనేక ప్రత్యేకతలు ఉన్న కర్నూలు నిర్దిష్టతలోంచి మూర్తి ఎత్తిపట్టాడు.

ఈ సంపుటిలో  ‘అడివోడు’ అనే కథ ఉంది. కథ చివర ఒక సన్నివేశంలో.. అడివోడు తన  మంగలి షాపులో ‘పిట్టా వెంకటరెడ్డి ఇల్లు పేల్చివేత ప్రయత్నం’ అనే  వార్త ఉన్న న్యూస్‌ పేపర్‌ అంటిస్తాడు. అది అతను ఎందుకు అంటించిందీ ఊళ్లో ప్రజలందరికీ తెలుసు. రెడ్డి ఆధిపత్య వర్గానికీ తెలుసు. ఆ వార్తను కథలోకి అలా తేవడం వల్ల కథ ఒక తార్కిక ముగింపుకు చేరుకుంది. ఆత్మగౌరవం కోరుకుంటున్న దళిత బహుజనులకు ఆ వార్త వెనుక ఉన్న విప్లవోద్యమం  జిల్లా అంతటా ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నది. ధిక్కారాన్ని అందిస్తున్నది. తిరగడటం నేర్పిస్తున్నది. ఈ కథలోని వైరుధ్యం మీద ఆ చైతన్యం ప్రసరించేలా కథలోకి మూర్తి దాన్ని తీసుకొని వచ్చాడు.

బహుశా మూర్తి కథల్లో  విప్లవోద్యమ ప్రస్తావన ఈ మాత్రమైనా ఉన్నది ఈ ఒక్క కథలోనే.  మిగతా కథల్లో అదీ ఉండదు. ‘మెడమీద వేలాడే కత్తి’లో యువజన సంఘం  ప్రస్తావన ఉంటుంది. కానీ ఈ కథల్లోని ఇతివృత్తాలు విప్లవోద్యమ ప్రభావం లోనివి. దళిత బహుజనులు, ఆ కులాల మహిళలు, ఇప్పుడిప్పుడే చదువుకొని లోకం తెలుసుకుంటున్న కింది కులాల యువకులు ఈ కథల్లోకి వచ్చారు. వీళ్ల చైతన్యం వెనుక విప్లవశక్తులు ఆరంభించిన సామాజిక సంఘర్షణ ఉన్నది. అది నేరుగా కావచ్చు. పరోక్షంగా  కావచ్చు. కల్పనా సాహిత్యం కాబట్టి మనుషుల వివేకంగానే కావచ్చు. కానీ అందులో కొత్త విలువల కోసం ఆరాటం ఉన్నది.  ఒక వెతుకులాట ఉన్నది. 

సహజంగానే దాన్ని అగ్రకుల ముఠా నాయకులు అంగీకరించరు.   అనేక రకాలుగా  హింస  మొదలైంది. ఇదంతా వ్యక్తుల చర్యలుగా  బైటికి కనిపిస్తుంది. కథల్లో  పాత్రలే అటూ ఇటూ అన్నీ నిర్వహిస్తాయి. కానీ మూర్తి ఉద్దేశం అది చెప్పడం కాదు. సామాజిక స్థితిని విప్పి చూపాలనుకున్నాడు. అందులోని కదలికల అంతరార్థాలను వివరించాలనుకున్నాడు. ఈ పని పట్ల తన కళాదృష్టి ఎలాంటిదో  ఈ కథల్లో చూడొచ్చు. 

అట్లా మూర్తి కర్నూలు కథలోకి విప్లవాన్ని తీసుకొచ్చాడు. కథ కర్నూల్లోనో, ప్యాపిలి దగ్గరో, నందికొట్కూరు దగ్గర పల్లెలోనో, ఆత్మకూరు అంచులోనో జరిగి వుంటుంది. మాల, మాదిగ, శికారి, మంగలి, బలిజ తదితర కులాలన్నీ కథల్లోకి వస్తాయి. వాళ్లంతా ‘సేద్యం’ కథలో సుబ్బయ్యలా ఎరుకపొందిన వాళ్లే. కాకపోతే ఆ కథ రాసినప్పటికంటే ఈ కథల్లో కథకుడి పరిణతి గొప్పగా కనిపిస్తుంది. అది కేవలం కథ చెప్పడంలోనే కాదు. జీవితాన్ని, విప్లవాన్ని, ప్రజా సంఘర్షణలన్నిటినీ లోతుగా తెలుసుకొనే చూపు పదునెక్కింది. 

అందుకే మూర్తి  రాసిన ఒక్కో కథ కర్నూలు  గ్రామాన్ని  ఒక వైపు నుంచి చిత్రించింది. ఊరిలోని సామాజిక సంబంధాల తీరును చూపిస్తుంది. కథాంశానికి లోబడి ఊరిలోని సంక్లిష్టతనంతా కథ ఎత్తి చూపిస్తుంది. 

మామూలుగా గ్రామాలు సరళమని, నగరాలు సంక్లిష్టమనే భ్రమ కొందరికి ఉంటుంది. కానీ పల్లెలు తరతరాల సంబంధాలతో జటిలంగా ఉంటాయి. బైట జరుగుతున్న ఆధునిక పరిణామాలతో, ఉద్యమ ప్రభావాలతో సంక్లిష్టంగా మారుతాయి. ఈ కథల్లోని పల్లెలన్నీ అలాంటివే. ఈ కథలు రాసేనాటికి సరుకుల మార్కెట్‌ నేరుగా  లేకపోవడం మినహా పల్లెల వాస్తవ  స్థితిని చిత్రించిన ప్రాతినిధ్య కథలివి. అడివోడు, ఓటు మల్లన్న, దేవుని మాన్యం, ఏకంగార్రి కథల్లో గ్రామ ఆధిపత్య వర్గ కుల పితృస్వామ్య సంబంధాల పొందికనంతా సూక్ష్మదర్శినిలో మూర్తి చూపించాడు.

ఇదంతా కేవలం ఒకప్పుడు ఉండిన స్థితిని చెప్పడం కోసం కాదు.  ఒక్క కథ కూడా ఒకప్పడు ఇట్లా ఉండేదని చెప్పడానికి మూర్తి రాయలేదు.  వర్తమానంలోని  రాపిడిని చెప్పడమే ఈ కథల ఉద్దేశం. తద్వారా మార్పు గురించి చెప్పడమే కథాంశం. ఆ మార్పు పోరాట ప్రపంచంలో ఎలా రూపొందుతున్నదో మూర్తి అద్భుతంగా చిత్రిస్తాడు.  కొన్ని మార్పులు వ్యవస్థలో భాగంగానే జరుగుతుంటాయి. మూర్తి కథల్లో అదీ ఉన్నది. కానీ మానవ చైతన్య క్రమాలను, ఆచరణ రూపాలను చెప్పడమే ఆయన ఉద్దేశం.

కథకుడిగా మూర్తి వీటన్నిటినీ కనుగొన్న తీరు చాలా ఆసక్తికరం. ఆయన చుట్టూ అనేక కొత్త చైతన్యాలు విస్తరిస్తున్నాయి. వాటికి ప్రతిబంధకాలు కూడా సమాజంలోనే ఉన్నాయి. ఇవన్నీ గ్రామంలో ఎలా ఉంటాయి? అక్కడ జరిగే పోరాటాలకు ఊరు ఎలా ప్రతిస్పందిస్తుందనే ప్రశ్నలు సహజంగానే  తలెత్తుతాయి. ఈ కథల్లో ‘ఇదీ మన పనే’ అనే కథ తప్ప మిగతా అన్నిటికీ ఊరు కేంద్రం. నిజానికి ఆ కథ కూడా పట్టణంలో మొదలై పల్లెలో పారిశుధ్య పని చేసే మహిళ దగ్గరికి విస్తరిస్తుంది. సమాజంలో  కొన్ని ‘పనులు’ దళితులకు, మహిళలకు నిర్దేశించబడతాయి.  మధ్య తరగతి దళితేతర కుటుంబంలో టాయిలెట్‌ను శుభ్రం చేయడం గృహిణి  బాధ్యత. ఆ పని గురించే ఆలోచిస్తోంటే ఆమెకు తన ఊళ్లో పారిశుధ్య పని చేసే దళిత మహిళ గుర్తుకు వస్తుంది. అక్కడే కులానికి, పితృస్వామ్యానికి సంబంధాన్ని కథ ఫోకస్‌ చేస్తుంది.

అట్లా ఊరు ఒక  భావజాల కేంద్రం కూడా. అందుకే ఏ  చిన్న ఘటన జరిగినా ఊరంతా కదిలిపోతుంది. ఆధిపత్య శక్తులు అపమ్రత్తమవుతాయి. ఆ కదలికను తమకు అనుకూలంగా మలుచుకోడానికి ప్రయత్నిస్తాయి. రాయలసీమ రెడ్డి ఆధిపత్యశక్తుల వ్యవహార శైలిని మూర్తి భలే పట్టుకుంటాడు. ఆయన కడగట్టు కులాల పక్షాన ఉండి, అవతలి వాళ్ల ఎత్తులు జిత్తులు పసిగడుతూ ఉంటాడు. దేవుని మాన్యం, ఏకంగార్రి.. కథలు చదవండి. మూర్తికి రాయలసీమ  మనుషుల మానసికత మీద ఎంత పట్టు ఉన్నదో తెలుస్తుంది. ఆయన వాడిన మాండలికం, నుడికారం వెనుక భాషా సౌందర్యాన్నే చూడలేం. అదీ అద్భుతంగా కథల్లో ఉన్నది. దానితోపాటు మనుషుల  సామాజిక మానసికతను  చిత్రిస్తాడు.  ఆధిక్యాలకు, ఆత్మగౌరవాలకు మధ్య  తేడాను చూడ్డానికి కూడా మనం మూర్తి చిత్రించిన ఈ మానసిక ఆవరణలోకి వెళ్లాల్సిందే. అదంతా  కర్నూలు సాంస్కృతిక పర్యావరణంలో భాగం.  మాదిగ దండోరా ఉద్యమం వచ్చాక స్వతహాగా మాల మాదిగ కులాల మధ్య ఉన్న సామాజిక అంతరాలను రెడ్డి కులస్థులు ఎలా వాడుకొనేదీ ఏకంగార్రి కథలో చూడవచ్చు. అంతకు ముందు కూడా పీడిత కులాల తేడాను ఇలా వాడకున్నవారే. ప్రతి కథలో ఇట్లా  ఆధిక్య మానసికత ఎట్లా పని చేస్తుందో చిత్రించాడు.

అయితే ఇలాంటి  సూక్ష్మ పరిశీలనలు  మూర్తికి ఎలా సాధ్యమయ్యాయనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ కథలు రాసేనాటికే ఆయన గ్రామ జీవితానికి దూరం. కానీ గ్రామాన్ని సకల సంక్లిష్టతల్లోంచి అర్థం చేసుకున్నాడు. వాటి మధ్యనే చలనాన్ని పట్టుకున్నాడు. ఇవన్నీ మూర్తికి కేవల పరిశీలనలే కాదు. వాటిని తనలోకి అనుభవీకరించుకున్నాడు. తన దృక్పథంలోకి రంగరించుకున్నాడు. దీనికి తన రాజకీయం  సహకరించింది. ఇది మొదటిది.

దీనికి మరో రెండు కూడా తోడ్పడ్డాయి. ఆ కాలంలో జిల్లాలోని ఈ కల్లోలాలన్నిటిలో  పౌరహక్కుల సంఘం భాగమైంది. హక్కుల ఉల్లంఘనలపై  సంస్థ  నిజ నిర్ధారణలకు సామాజిక విశ్లేషణ స్థాయి కల్పించింది. దానిది హక్కుల కార్యక్షేత్రమే కావచ్చు. అందులో లోతైన రాజకీయార్థిక, సాంఘిక సాంస్కృతిక కోణాలు ఉంటాయి. ఈ కథల్లోని వస్తువులయినా, ఇతివృత్తాల ఫోకస్‌ పాయింట్‌ అయినా, కథకు ఒక ప్రేరణ అయినా, కథలో ట్రిగ్గర్‌ చేసే ఒకానొక చిన్న అనుభవమైనా.. అవన్నీ మూర్తి పౌరహక్కుల కార్యకర్తగా కూడా ప్రజల జీవితం నుంచి తెలుసుకున్నాడు. అయితే అవేవీ యథాతథంగా కథలు కాలేదు. అక్కడే తన కాల్పనికశక్తి, దృక్పథ బలం ఉన్నాయి. గోపీ అనేవాడు.. ‘ఎంత సమగ్రంగా ఉన్నా సరే పౌరహక్కుల నిజనిర్ధారణ నివేదికలోకి రానిది, అది చెప్పలేనిది మాత్రమే కథ అవుతుంది అని’. సరిగ్గా కథా కాల్పనిక క్షేత్రం అదే.

కథకుడిగా మూర్తి అక్కడే బయల్దేరాడు. తన కాల్పనికత వల్ల నేరుగా జీవితానుభవంలో లేని వాస్తవికతను అందుకున్నాడు. దాన్ని భావోద్వేగాలతో గ్రహించాడు. తార్కికంగా పునర్నిర్మించాడు. ఇరవై ఏళ్ల కిందటి సగటు కర్నూలు గ్రామం చాలా మారిపోయినట్లనిపించవచ్చు. ఆనాటి ఉద్యమాలు కూడా అనేక రూపాల్లోకి మారి ఉండవచ్చు. సారంలోకి వెళ్లితే మూర్తి చిత్రించిన జీవన సంఘర్షణలు ఇంకా అనేక తలాల్లో  కొనసాగుతునే ఉన్నాయి. ఆ వైరుధ్యాలు చిన్న చిన్న రూప పరిణామాలతో కొనసాగుతున్నాయి. ఆయన కథల్లో చిత్రించిన  ఎన్నికల సమీకరణాలు కూడా గ్రామాల్లో మారిపోయి ఉండవచ్చు. ఆ మాటకొస్తే పార్లమెంటరీ రాజకీయాలే గత ఇరవై ముప్పై ఏళ్లలో చాలా మారాయి. కానీ రాజకీయాధికారం చుట్టూ, ఆదాయ మార్గాల చుట్టూ కులాల వారీగా ఆధిక్య సమీకరణాలు గ్రామాల్లో మరింత జటిలంగా తయారయ్యాయి. క్రూరంగా, మొరటుగా మారాయి. దోపిడీ పీడనలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి.

పైకి అన్నీ ‘ఆధునికం’గా మారుతున్నట్లనిపిస్తుంది. కానీ దళితుల, స్త్రీల, పేదల ఆత్మగౌరవం, వ్యక్తి స్వేచ్ఛ, స్వావలంబన అనేవాటికి ఇప్పటికీ గ్రామాల్లో చోటు లేదు. ఈ కథలు వాటి కోసం పెనుగులాటను చిత్రించినవే. విప్లవోద్యమ చైతన్యం నుంచి వ్యక్తిగత స్థాయి దాకా వాటి కోసం సాగిన ఆరాటాన్ని వర్ణించినవే. అవన్నీ అట్టడుగు ప్రజల అనుభవంలోకి వచ్చాయనే  సాహసం ఇప్పటికీ ఎవ్వరూ చేయలేకపోవచ్చు. అంత వరకు మూర్తి తొలి దశ కథలు అవసరమే.

                                                      3

మూర్తి మళ్లీ 2020 డిసెంబర్‌లో ‘ప్రస్థానం’లో ‘స్వాములొచ్చారు’ కథ రాశాడు. ఇదీ పౌరహక్కుల ఉద్యమ అనుభవమే.  తాను తిరుపతిలో ఉన్నప్పటిది. ఆ రకంగా పాతదే. కానీ చిత్తూరు జిల్లాలోని ఏనుగుల సమస్య  సాహిత్యంలో అరుదైనది.   ఇందులో  రాజ్య స్వభావాన్ని అద్భుతంగా చిత్రించాడు. అందువల్ల కొత్తగా అనిపిస్తుంది.

ప్రమాదకరంగా తయారయినప్పటికీ ఏనుగులపట్ల గ్రామీణులకు ఉండే దృష్టి కోణాన్ని, ఆ సమస్య పట్ల రాజ్య యంత్రాంగానికి ఉండే దృక్పథాన్ని చెప్పడం వల్ల ఈ కథకు తాజాదనం వచ్చింది. ఏనుగుల విషయంలోనే కాదు, అన్నిటిపట్లా రాజ్యానిది ఇప్పటికీ ఇదే వైఖరి. ఆయన ఏనుగుల గురించి చెబుతోంటే మనకు ఇవ్వాల్టి అనేక విషయాలు స్పురిస్తుంటాయి. ఇందులో సాధువు చెప్పిన పద్యాలు, పదాల వల్ల కథ ప్రత్యేకంగా నడిచినట్లనిపిస్తుంది.   

సరిగ్గా ఇలాంటిదే మరో ఇతివృత్తం ‘కోవెల మావటి’లో ఉంది. తమిళనాడు  మధుర మీనాక్షి ఆలయం పూజల్లో పాల్గొనే ఏనుగుల మావటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆలయాల్లో మావటి వృత్తి పాతదే. ఆలయాల సంప్రదాయక వైభవంలో భాగం. ఈ కథను చెప్పడానికి ఏనుగులకు శిక్షణ, ఏనుగుల వేట మొదలైనవాటి కోసం మరింత వెనక్కి చరిత్రలోకి వెళతాడు. అనేక విషయాలు చెప్పాడు. అందువల్ల కొత్త కథ అనిపిస్తుంది. కానీ విశేషం ఇది కాదు.

ఏనుగులను మచ్చిక చేసుకొని లొంగదీసుకోడానికి  మనుషులు ప్రయోగించే హింస ఈ కథ అసలు ఇతివృత్తం.

‘‘ఆడివిలో మైళ్ళు మైళ్ళ దూరం నడుస్తుంది రోజూ. యిక్కడ..యీ తారు రోడ్డుమీద నువ్వు నలభై అయిదు నిముషాల షికారు తీసకపోతావు. అనుకుంటే నవ్వురాదూ నీకు?’’ కొడుకుతో అంటాడు  ముసలాయన.

ఆధిక్యం, హింస అనేవి ఏనుగుకు కూడా తెలియనంతగా అలవాటవుతాయి. ఇది చదువుతోంటే ఎరుక గురించి ఈ కథ తాత్విక స్థాయిలో చర్చించిందా? అనిపిస్తుంది. ‘‘ముప్ఫై ఏండ్లలో ఏనాడూ, ఏ ఉత్సవంలోనూ ఎదురుతిరగని ‘సుందరవల్లి’ దీపావళి ముందు రోజు ఎదురుతిరిగింది. దాని మనసుకు ఏం నొప్పి కలిగిందో ఏమో!’’ అని కూడా అంటాడు. ఏనుగు మనిషికి లొంగిందని అనుకుంటాం. కానీ దాని మీద ఎంత హింసను ప్రయోగించిందీ మనుషులు గుర్తించలేరు.  

సమాజంలో  పెచ్చరిల్లిపోయిన హింస గురించి ఈ కథ మన  లోచూపును పెంచుతుంది. కథలోని వివరాలు వేరే. ఫోకస్‌ పాయింట్‌ మాత్రం ఇది. తన మొత్తం కథల్లో ఇది చాలా విభిన్నమైనది.

మూర్తికి పర్యావరణ శాస్త్రం మొదటి నుంచీ ఇష్టం. కానీ ‘దొర్లు దొర్లు పుచ్చకాయ్‌’ కథతోనే అది కథల్లోకి వచ్చింది. ఇదొక అచ్చమైన పర్యావరణ కథ. దీన్నీ  కర్నూలు ప్రాంతీయ, నైసర్గికతల నుంచే నడిపించాడు. దేశీయమైన ఆనవాళ్లను పర్యావరణమనే ఆధునిక అవగాహనలోకి అతి జాగ్రత్తగా తీసుకొచ్చాడు. కథ ఒకప్పటి బాల్యంతో మొదలవుతుంది. ప్రకృతికి, అందులోని అలుగు అనే జీవిని పాఠకులను చేరువ చేసి కథ నడపడానికి దీన్ని వాడుకున్నాడు. ఆ తర్వాత పర్యావరణం పట్ల ఆధునిక శాస్త్రీయ వైఖరికి కథ చేరుకుంటుంది. గొప్ప శిల్పంతో కథ నడుస్తుంది. ‘కోవెల మావటి’లో వలె దీనిలో కూడా చివర ఫుట్‌నోట్‌ ఇస్తాడు. అందులో చారిత్రక విశేషాలు ఉంటే ఇందులో అలుగుల వ్యాపారం మీద  మంచి ఫుట్‌నోట్స్‌ ఇస్తాడు. అలుగుల రక్షణకు సంబంధించిన నేషనల్‌ జియోగ్రఫీ చానల్‌ వీడియో లింక్‌ కూడా ఇస్తాడు. ఆ రకంగా ఈ కథ మల్టీ మీడియంగా మారింది.

కాల్పనిక రచనలకు వివరాలు భారమవుతాయని అంటారు. బహుశా ఇదీ సంప్రదాయ వాదనే కావచ్చు. కథను భావోద్వేగాల, తార్కిక క్రమాల మీద నిర్మిస్తే అవసరమైన సమాచారం బరువేం  కాదు. లేదా కథను  ప్రయోగాత్మకంగా చెబితే ఈ సమస్య అసలే ఉండకపోవచ్చు. శిల్పాన్ని వస్తువును, దృక్పథాన్ని సమానంగా మేళవించి గరిష్ట స్థాయికి తీసికెళ్లినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తకపోవచ్చు. ఆ రకంగా ఈ రెండు కథలకు ఫుట్‌నోట్స్‌  కథా నిర్మాణంలోనే భాగమయ్యాయి.

అయితే ఇవేవీ కేవలం శిల్ప విశేషాలు కాదు. అట్లా  ప్రత్యేకంగా కనిపించవు. ఇరవై ఏళ్ల ఆలోచనలు, పరిశీలనలు, అవగాహనలు తనలో ఒక కొత్త సృజన తలాన్ని రూపొందించాయి. దీనితో నిమిత్తం లేకుండా ఈ రెండో దశ కథలను అంచనా వేయలేం. వాటి ప్రత్యేకతలను పట్టించుకోలేం.

ఇదంతా మూర్తి కాలంతోపాటు నడిచినందు వల్లే సాధ్యమైంది. ముప్పై ఏళ్ల కింద కర్నూలు సామాజిక చలనాలను మొత్తం ప్రపంచంలో భాగంగా, విప్లవంలో భాగంగా ఎలా చూశాడో ఈ కొత్త జీవన ప్రపంచంలోని వైరుధ్యాలనూ అంతే  సునిశితంగా చూస్తున్నాడు. మార్క్సిస్టుగా తనకు మొదటి నుంచి మార్పు క్రమాలను లోపలి నుంచి చూసే అలవాటు ఉన్నది. అందువల్ల ఈ ఇరవై ఏళ్లలో ఆయన ఆలోచనలకు ఏ పరిమితీ ఏర్పడలేదు. హృదయంతోపాటు మేధలోని తార్కికతను పదునుపెట్టుకుంటూ వచ్చాడు.  మౌలిక తాత్విక, రాజకీయ అవగాహనలు, విలువలను నిత్యం సజీవం చేసుకుంటూ వచ్చాడు. అవన్నీ శాస్త్రీయ దృక్పథం గీటురాయిగా ఎదుగుతున్నాయి.

దీనికి మనుషుల పట్ల కథకుడి వైఖరే నిదర్శనం. తొలి దశ కథల వలె మిగతా వాటిలో కూడా మనుషుల సకల స్థితులను అర్థం చేసుకోవడంలో మూర్తి ఎంత భావోద్వేగంగా ఉంటాడో, అంతే తార్కికంగా కూడా ఉంటాడు.  ఇది ఆయన మౌలిక దినుసు. అందువల్లనే ‘కవుడు అనునొక కాపటి’ కథలో కార్పొరేట్‌ విద్యా రంగంలోని అండర్‌ వరల్డ్‌ మాఫియా స్వభావాన్ని తెలుపు నలుపుల్లో ఎత్తి చూపుతూనే అందులోని మనుషుల తీరును అనేక రంగుల్లో చూస్తాడు. ఎక్కడా మనుషుల మీద కథకుడు కోపం ప్రదర్శించడు. పాఠకులకు కోపం కలిగేలా రాయడు. ఎన్నెన్నో చీకటి అగాధాలను చూపిస్తాడు. మనకు వాళ్ల పట్ల అయ్యో అనిపిస్తుంది. ఆ వ్యవస్థ పట్ల ఆగ్రహం కలుగుతుంది.

కథా రచనలో మూర్తి వివరణాత్మక పద్ధతి పాటిస్తాడు. కథ చెప్పడానికి ఎన్నుకున్న ఫ్రేం వర్క్‌లో భాగంగా వస్తువును చెప్పడానికి, అది పాఠకులకు చేరడానికి అవసరమైన వివరాలను దాచి పెట్టడు. ఇది మొదటి నుంచీ ఉన్నది. ఇది వాస్తవికతా వాద శిల్పం.  ఇరవై ఏళ్ల తర్వాత మూర్తి కథా శిల్పంలో మార్పు వచ్చింది. వివరణాత్మక పద్ధతిని వదులుకోకుండానే కొత్తగా కథ చెప్తున్నాడు. మొదటి కథల కంటే తర్వాతి వాటిలో వేగం పెరిగింది. అయితే ఎక్కడా తన తార్కికతను అది దెబ్బతీయదు. వస్తువు ఏదైనా, కథన పద్ధతి ఏదైనా వాటి మీద మూర్తి దృక్పథానిదే పైచేయి. బహుశా ఆ మూటింటి మేలిమి మేళవింపు వల్లే ఇది సాధ్యం అయి ఉంటుంది.

మామూలుగా కార్పొరేట్‌ విద్యా వ్యవస్థను పిల్లల వైపు నుంచి చూస్తుంటాం. విశ్లేషిస్తుంటాం. ఇది అతి ముఖ్యమైనది. అది అంత హింసాత్మకంగా మారడానికి   రాజకీయార్థిక వ్యవస్థ కారణం. దాన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థల పునాది నిర్మాణంలోని  దుర్గుణాల నుంచి చూపిస్తాడు. అట్లా ‘కవుడు అనునొక కాపటి’ తెలుగులో ఒక ప్రత్యేకమైన కథ. కొత్త కథ.

సరిగ్గా ఇలాంటిదే  ‘హాయి హాయి ఆపదలు గాయీ..’ కథ కరోనా నేపథ్యంలో ఈ వికృత, విషాదాలను చిత్రించాడు. కార్పొరేట్‌ విద్యా సంస్థలో పని చేసే వాళ్ల జీవితాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ రెండు కథలను మూర్తి విలువల ప్రాతిపదిక మీద  చెబుతాడు. అసలు కార్పొరేట్‌ సామ్రాజ్యాల్లో   విలువల ప్రమేయమే ఉండదు. వాటి తర్కం లాభాలు. కానీ మనుషులు పైకి ఎలా కనిపించినా, ఏం చేసినా మనిషి అస్తిత్వంలోనే ఏదో ఒక విలువ దాగి ఉంటుంది. దాన్ని వదిలేయడం, మర్చిపోలేకపోవడం, తిరిగి సంతరించుకోడానికి ఆరాటపడటం, అదీ చేతకాకపోవడం..ఇవన్నీ చెప్పే క్రమంలో మనుషులు మిగిలే ఉంటారనే ఆశ కలిగించడం  ఈ కథల ఉద్దేశం.

మూర్తి రెండో దశ కథల్లో ఖబర్‌ కె సాత్‌ అత్యుత్తమ కథ. కథకుడి కాల్పనికతా స్థాయికి రుజువు ఈ కథ. మామూలుగా జీవితానుభవమే కథా రచనకు మూల వనరు అంటాం. నిజమే. కానీ అదొక్కటే నిజమయ్యేట్లయితే సాహిత్యం పాత్ర చాలా పరిమితం. రచయితలు తమ అనుభవంలోకి వచ్చిన వాస్తవికతనే సాహిత్యం చేయగలరని ఒప్పుకున్నట్లవుతుంది. లేదా అలా స్వీయానుభవాల్లోంచి వచ్చిందే సాహిత్యమని అంగీకరించినట్లవుతుంది.

కానీ సాహిత్యాన్ని అనుభవ దర్శనం కోసే మానవాళి రాసుకోవడం లేదు. అంతకంటే ఇంకా చాలా విస్తారమైన పాత్ర సాహిత్యానికి ఉంది. సృజనకారులు దాన్ని తీర్చగలరని ఎల్లవేళలా రుజువు అవుతూనే ఉంటుంది. అలాంటి కథ ఖబర్‌ కే సాత్‌.

ఇది కశ్మీర్‌ దారుణ స్థితిని చెప్పిన కథ. గత ముప్పై ఏళ్లుగా వేర్వేరు రూపాల్లో తను కశ్మీర్‌ గురించి తెలుసుకుంటూనే వచ్చాడు. వాటన్నిటినీ బలపరిచే సమకాలీన సమాచారం సేకరించుకున్నాడు. అంత మాత్రాన  అవన్నీ క్రోడీకరిస్తే కథ అవుతుందా?  కానే కాదు. మూర్తి తనకు ప్రత్యక్షంగా తెలియని కశ్మీర్‌ను తన భావోద్వేగాలతో సంలీనం చేసుకున్నాడు. తన కాల్పనికశక్తితో దర్శించాడు. కశ్మీరీలను తన దృక్పథంతో హృదయంలోకి తీసుకున్నాడు. బహుశా కశ్మీరీలపై ప్రేమ అంటే మానవాళిపై ప్రేమ అని అర్థం. ఈ ఉద్వేగాలన్నిటినీ తార్కికంగా, కాల్పనికంగా పునర్నిర్మిస్తేగాని ఖబర్‌ కె సాత్‌ వంటి కథ బైటికి రాదు.

మూర్తి సమకాలీనతకు కూడా ఈ కథ గొప్ప ఉదాహరణ.

కథ ఒక కళా ప్రక్రియ. దానికి కళాత్మక ప్రతిభ ఉండాల్సిందే. అంతకంటే కథా వ్యక్తిత్వం, కథకుల వ్యక్తిత్వం అభేదం కావాలి. అప్పుడే కథ సౌందర్యవంతం అవుతుంది. తిరిగి మానవ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. ఈ కథలు అలాంటివి. 

తప్పక చదవండి. ఈ కథలు మీ వ్యక్తిత్వాన్ని తేజోవంతం చేస్తాయి.

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

Leave a Reply