150 మంది మిలిటెంట్ల కోసం 7 లక్షల సైన్యం కావాలా?

(ఖుర్రం పర్వేజ్ శ్రీనగర్ లో కశ్మీరీ మానవహక్కుల యాక్టివిష్టు. జమ్మూ కశ్మీర్ పౌరసమాజ సంకీర్ణ సంస్థ (Jammu Kashmir Coalition of Civil Society- JKCCS) కు ప్రోగ్రాం కోఆర్డినేటర్.

కశ్మీర్ లో ప్రస్తుత సంక్షోభానికి ముందు Scroll. in చేసిన ఇంటర్వ్యూలో పర్వేజ్ లోయలో మానవహక్కుల వేధింపుల గురించి మాట్లాడారు. ప్రజల కథనం రాజ్య కథనం కంటే ఎలా భిన్నంగా ఉందో చెప్పారు. భారత మీడియా మిగతా హిందువులను వదిలేసి, కేవలం కశ్మీరీ పండితుల శాశ్వత వలసల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతుందో వివరించారు. ఇంటర్వ్యూ నుండి కొన్ని సంక్షిప్త విషయాలు.)

అజాజ్ అశ్రఫ్: ఐదు నెలల క్రితం The Times of India పత్రికకు వ్యాసం రాస్తూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక కరపత్రం గురించి చెప్పారు. ఫిబ్రవరి 9న జవహర్లాల్ యూనివర్సిటీలో పంచిన ఈ కరపత్రంలో ‘తీగల సమూహంలో బంధించబడి, రక్తసికతమైన మరకలతో కూడిన తుపాకి మొనలను అన్ని వైపుల నుండి ఎదుర్కొంటూ, కశ్మీర్ ప్రపంచంలోనే అది పెద్ద సైన్యపు స్థావరంగా మారింది. కశ్మీర్ పోస్ట్ ఆఫీస్ లేని దేశంగా మిగిలిపోయింది.’ అనే వాక్యాలను ఉదహరించాడు. ఈ పదాలు కొద్దిగా అతిశయోక్తులుగా లేవూ?
ఖుర్రం పర్వేజ్: భారత రాజ్యం ప్రయోగించిన హింసలో 25 సంవత్సరాలుగా బతికిన యువకులు, ఆ రాజ్యం గురించి చాలా కఠిన భాషను వాడతారు. ఉదాహరణకు ‘భారత్ కీ బర్బాది’ (భారతదేశపు వ్యర్ధపదార్ధాలు) అనే స్లోగన్ తీసుకొండి. సయ్యద్ ఆలీ జిలానీ, ఉమర్ ఫారూక్, యాసీన్ మాలిక్ లాంటి నాయకులు భారత దేశపు వ్యర్ధ పదార్ధాలతో తమకు సంబంధం లేదనీ, తమకు ఆజాదీ కావాలనీ పదే పదే చెబుతారు. అయినప్పటికీ యువకులు అలాంటి స్లోగన్లు సైనికులనూ, మీడియాను బాధిస్తాయని తెలిసీ అరుస్తారు. అంతమాత్రాన వారికి ఇండియాను ఏదో చేసేసే శక్తి ఉన్నట్లు కాదు.

అజాజ్ అశ్రఫ్: నేను అడుగుతున్నదేమిటంటే కశ్మీర్ ను జైలుతో పోల్చటం సరైందేనా అని.
ఖుర్రం పర్వేజ్: సరైనదే. 2015 JKCCS రిపోర్ట్ ‘హింసకు సంబంధించిన వ్యవస్థలు’ లో మేము ఎంత మంది సైనికులు, ఎంత మంది పారా మిలటరీ, ఎంత మంది పోలీసులు కశ్మీర్ లో నియామకం అయ్యారో లెక్కలు ఇచ్చాము. మన అంచనా ప్రకారం జమ్మూ కశ్మీర్ లో 6.5 నుండి 7.5 వరకు రక్షక దళం ఉండవచ్చు. ఇది తక్కువ సంఖ్య కాదు. మొత్తం ఆర్మీ సంఖ్య తీసుకొంటే సగం ఇక్కడే ఉన్నారు. పోలీసులకూ ప్రజలకూ మధ్య నిష్పత్తిని తీసుకొంటే అన్ని రాష్ట్రాల కంటే ఇది ఎక్కువ. కారాగారం లాంటి వాస్తవం ఉన్నప్పుడు ప్రజలు మౌనంగా ఉంటారని ఎలా ఆశిస్తావు?

అజాజ్ అశ్రఫ్: కానీ అన్ని రాష్ట్రాల లాగా కాకుండా కశ్మీర్ లో సాయుధ పోరాటం ఉంది కదా?
ఖుర్రం పర్వేజ్: ప్రభుత్వం లెక్కల ప్రకారం పోయిన సంవత్సరం కేవలం 150 మంది మాత్రమే మిలిటెంట్లు ఉన్నారు. 150 మంది మిలిటెంట్ల కోసం 7 లక్షల మంది సైనికులు కావాలా? మొత్తం రాష్ట్రంలో ఉన్న మిలిటెంట్ల సంఖ్య 150. 2008 నుండి మిలిటెంట్ల సంఖ్య ఎప్పుడూ 250 మించలేదు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు, ఇరాక్ లాంటి ఇతర సంక్షోభ ప్రాంతాలలో ఉన్న సైనికులతో పోలిస్తే, కశ్మీర్ ప్రపంచంలోనే అత్యధిక మిలటరీ ఉన్న ప్రాంతంగా ఉంటుంది.
భారతదేశం కశ్మీర్ లో అంతర్జాతీయ జోక్యాన్ని అనుమతించదు. ఇక్కడ సాయుధ లేక సాయుధ రహిత సంక్షోభం ఉన్నదంటే ఒప్పుకోదు. అలా కాకుండా ఇక్కడ అంతర్గతంగా శాంతి భద్రతల సమస్య ఉందని మాత్రం అంటుంది. కానీ మీడియా దాన్ని పాకిస్తాన్ ప్రేరిపిత యుద్ధంగా పిలుస్తుంది.

అజాజ్ అశ్రఫ్: మీరు దాన్ని పాకిస్తాన్ ప్రేరేపితంగా భావించటం లేదనిపిస్తుంది.
ఖుర్రం పర్వేజ్ : ఖచ్చితంగా కాదు. అధికార లెక్కల ప్రకారం 1990 నుండి కశ్మీర్ లో చనిపోయిన మిలిటెంట్లు 21000. వారిలో 3000 మంది మాత్రమే విదేశీ మిలిటెంట్లు.

అజాజ్ అశ్రఫ్: పాకిస్తాన్ ప్రేరేపితం అంటే, కశ్మీరీలకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, కశ్మీర్ లోకి తోయటం అని అర్థం.
ఖుర్రం పర్వేజ్ : ఈ విషయాన్నే చాలా విషయాలకు కారణంగా చెబుతారు. ఒకటి, ప్రపంచం ఇప్పుడు చవి చూస్తున్న ఇస్లామోఫోబియా, దాని వలన వచ్చిన లాభాలను భారతదేశం అనుభవించాలనుకొంటుంది. రెండు, భారత ప్రభుత్వం కశ్మీర్ నుండి వస్తున్న దేహ సంచుల గురించి తన సొంత ప్రజలను ఓదార్చాలి.
కశ్మీరీలు ఇండియాతో ఉండదలుచుకోలేదనీ, ఇక్కడ జరుగుతున్న పోరాటం ప్రాధమికంగా ఇక్కడి ప్రజల ద్వారానే జరుగుతుందనీ, బయట శక్తుల మద్దతు పరిమితంగానే ఉందనే వాస్తవాన్ని భారత ప్రజలకు చెబితే, ఇండియాలో ప్రజాభిప్రాయం కూడా మారుతుంది. ప్రజాభిప్రాయం మారటానికి అనుమతించకుండా, వీళ్లు పాకిస్తాన్ ప్రేరేపిత పరోక్షయుద్ధం అనే అబద్ధాలు చెబుతారు. మా వరకు భారత మీడియా అంటే కశ్మీర్ లో భారత సైన్యపు పరిశ్రమలో భాగమే.

అజాజ్ అశ్రఫ్: మీడియా అంతా కాదులే …
ఖుర్రం పర్వేజ్ : నేను ముఖ్యంగా చెబుతున్నది ఎలెక్ట్రోనిక్ మీడియా గురించి. నిజమే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ అవి మినహాయింపులు మాత్రమే.

అజాజ్ అశ్రఫ్: వెంకయ్య నాయుడు, ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో రాసిన వ్యాసంలో ఆ కరపత్రం గురించి చెబుతూ ‘మంచు గడ్డ కడుతూ, కరుగుతూ, మళ్లీ గడ్డ కడుతూ- అక్కడి వేల సామూహిక సమాధుల చరిత్రను భూస్తాపితం చేస్తుంది’ అనే వాక్యాల గురించి రాశాడు. ఈ అభియోగం అసంబద్ధం అని ఆయన అనుకొంటున్నాడు.
ఖుర్రం పర్వేజ్ : JKCCS, ఇంకా మాలో ఒక భాగమైన The Association of Parents of Disappeared Persons (అదృశ్యమైన వ్యక్తుల తల్లిదండ్రుల సంఘం) కలిసి ఈ సామూహిక సమాధులను బయటకు తీసే పని చేశాము. 2005లో మా పని మొదలుపెట్టి 2008లో మా మొదటి రిపోర్ట్ ‘Facts Underground’ లో ఇచ్చాము. బారాముల్లాలోని ‘ఉరి’ లో 940 అనామిక సమాధులు, సామూహిక సమాధులు ఉన్నాయని కనుక్కొన్నాము.

అజాజ్ అశ్రఫ్: సామూహిక సమాధులను మీరు ఎలా నిర్వచిస్తారు?
ఖుర్రం పర్వేజ్: రెండు రకాల సమాధులు ఉంటాయి. అనామిక సమాధులు ఉనికి తెలియని వ్యక్తులవి. ఇంకా కొన్ని సమాధుల్లో ఒకళ్ల కంటే ఎక్కువ మంది సమాధి అయి ఉంటారు. ఉదాహరణకు, కుప్వారలో ఒకే సమాధిలో 11 మంది పూడ్చబడ్డారు. ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా, కుప్వారా, బండిపోరాలలోని 7000 అనామిక సమాధులు, సామూహిక సమాధుల గురించి మేము గ్రంధస్తం చేశాము. ఇది చాలా పెద్ద సంఖ్య.

రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఒక విచారణలో ఉన్న కేసు గురించి చెబుతూ, ఉత్తర కశ్మీర్ లోని మూడు జిల్లాల్లో మాకిచ్చిన సంఖ్య చాలా తక్కువని చెప్పింది. విదేశీ మిలిటెంట్లగా అక్కడ నమోదు అయిన 570 మందిని తరువాత స్థానిక కశ్మీరీలుగా గుర్తిచారని ఆ కమీషన్ చెప్పింది.

అజాజ్ అశ్రఫ్: ఈ శరీరాలను పూడ్చిన వ్యక్తులు ఎవరైనా ఎన్ని పూడ్చారో చెప్పారా?
ఖుర్రం పర్వేజ్: మా మొదటి రికార్డు ‘Facts Underground’, రెండో రికార్డు ‘Buried Evidence’. ఈ రెండిటి కోసం మేము అనేక మంది సమాధుల తవ్వకందారులతో మాట్లాడాము. స్థానిక పోలీసులు, సైన్యం వారికి శవాలను అందచేశారు.
రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఈ అనామిక, సామూహిక సమాధుల్లో ఉన్న శరీరాలకు డిఎన్ ఏ టెస్టులు చేయించమనీ, అదృశ్యమైన బిడ్డలు కల తల్లిదండ్రులతో వాటిని సరి చూడమనీ ప్రభుత్వాన్ని అడిగింది. గత 25 సంవత్సరాలుగా అదృశ్యమైన పిల్లలు ఉన్న కుటుంబాలు 8000 ఉన్నాయిక్కడ. 2012లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆ పనికి నిరాకరించింది.

అజాజ్ అశ్రఫ్: 8000 కుటుంబాలకు డి ఎన్ ఏ పరీక్ష చేయటం పెద్ద పని కదా?
ఖుర్రం పర్వేజ్: అవుననుకోండి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వంతో చర్చించారు. ఇండియా మొత్తం మీద డి ఎన్ ఏ పరీక్ష చేయగల శక్తి ఉన్న కేంద్రాలు 16 మాత్రమే ఉన్నాయన్నారు. వాటి కెపాసిటీ సరిపోదన్నారు. అలా చేయటం వలన తిరుగుబాట్లు వచ్చి శాంతి భద్రతల సమస్య కూడా వస్తుందని భారత ప్రభుత్వం చెబుతోంది.
మా మొదటి రిపోర్ట్ 2008లో వచ్చాక, యూరోపియన్ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని జులై 10, 2008లో చేసింది. ఈ డి ఎన్ యే పరీక్షలు చేయటానికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని, ధన సహాయాన్నిఅందచేస్తానని ముందుకు వచ్చింది. అప్పుడు మన సార్వభౌమత్వం సమస్య ముందుకు వచ్చినట్లుంది.


అజాజ్ అశ్రఫ్: అంతర్జాతీయ మహిళా దినం రోజు కన్నయ్య కుమార్ మాట్లాడుతూ ‘మన సైనికుల పట్ల మనకు చాలా గౌరవం ఉండటం వలన, కశ్మీర్ లో మహిళలపై ఇండియన్ ఆర్మీ చేస్తున్న అత్యాచారాల గురించి మనం మాట్లాడం’ అని అన్నాడు. ఆయన ఇలాంటి ఆరోపణ చేయటం సరైందేనా?
ఖుర్రం పర్వేజ్:
కన్నయ్య కుమార్ చెప్పింది నిజం. చాలా మంది భారతీయ సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. గత 25 సంవత్సరాలలో, వందలాది మహిళలు అత్యాచారపు కేసులు పెట్టటానికి ముందుకు వచ్చారు. ఈ కేసులు పెట్టటానికి వారిని ఒప్పించడం చాలా కష్టం. ఒకటి, ఆర్మీ నుండి ప్రతీకార చర్యలు జరుగుతాయని భయపడతారు. ఎలా ఎందుకు జరుగుతుందంటే, అత్యాచార కేసుల గురించి రిపోర్ట్ చేసినపుడు వారి కుటుంబ సభ్యుల మీద దాడీ, ప్రశ్నించటం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవి కాకుండా సామాజిక నిందలు, మరీ ముఖ్యంగా న్యాయాన్ని నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ వందలాది కేసులు నమోదు అయ్యాయి.

అజాజ్ అశ్రఫ్: 1990 నుండి ఎన్ని రేప్ కేసుల ఆరోపణలు ఉన్నాయి?
ఖుర్రం పర్వేజ్: మా లెక్క ప్రకారం లైంగిక, జెండర్ హింస కేసులు 7000 దాకా ఉన్నాయి. లైంగిక, జెండర్ హింస అని నేను అనటానికి కారణం అబ్బాయిలతో సంభోగించిన కేసులు, మగవాళ్లను రేప్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. సాంకేతికంగా ఒక అత్యాచారాన్ని రుజువు చేయటం చాలా కష్టం.

అజాజ్ అశ్రఫ్: ఎందుకు రేప్ ను రుజువు చేయటం సాంకేతికంగా కష్టం అవుతుంది?
ఖుర్రం పర్వేజ్: ఎందుకంటే పూర్తిగా సైన్యం ఆధీనంలో ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. కొంత మంది మహిళలు సెక్స్ వర్కర్స్ గా ఉన్నారనీ, వాళ్ల అంగీకారంతో సైన్యం వారితో సెక్స్ చేస్తారని సైన్యం మమ్మల్ని నమ్మమంటుంది. కొంత మంది లొంగిపోయి ఉండవచ్చు. కానీ దాని అర్ధం వారు అత్యాచారానికి గురి కాలేదని కాదు. ఎవరి చేతిలోనైనా తుపాకి ఉండి, వాడు ఒక స్త్రీని సెక్స్ కోసం అడిగితే- ఆమె ఒప్పుకొంటే- దాన్ని ఆమె అంగీకారంగా అనలేము.

అజాజ్ అశ్రఫ్: ఇది చాలా పెద్ద ఆరోపణ!
ఖుర్రం పర్వేజ్ : మేజర్ రహ్మాన్ హుస్సైన్ విషయమే తీసుకోండి. హంద్వారాలో ఒక మహిళ, ఆమె కూతురు రేప్ కేసులో ఆరోపణలకు గురి అయినవాడు. మేము అధికారులతో మాట్లాడినపుడు వాళ్లు, ‘కానీ అతను మేజర్ రహ్మాన్ హుస్సైన్’ అని అన్నారు. దీనికి అర్థం ఏమిటంటే ఆ అధికారి ముస్లిం కాబట్టి, మాకెందుకు సమస్య ఉండాలని.

అజాజ్ అశ్రఫ్: అతనికి శిక్ష పడిందా?
ఖుర్రం పర్వేజ్ : లేదు. హంద్వారా ఘటన జరిగినపుడు బ్రిగేడియర్ గా ఉన్న అటా హుస్సైన్ తరువాత లెఫ్ట్ నెంట్ జనరల్ గా రిటైర్ అయ్యాడు. అతను తానే మేజర్ హుస్సైన్ కు శిక్ష వేశానని చెబుతాడు. నిజానికి హుస్సైన్ కు రేప్ వలన శిక్ష పడలేదు. అతని ప్రజల ఆస్తుల విషయంలోకి చొచ్చుకొని పోయిన ఆరోపణలో శిక్ష పడింది. అతనికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష పడింది. తరువాత అతన్ని విధుల నుండి తొలగించారు.

తన నేరానికి ఆ శిక్ష సరైంది కాదని అంటూ మేజర్ హుస్సైన్ తరువాత హై కోర్టుకు వెళ్లాడు. నిజమే అది సరైనది కాదు. ఎందుకంటే అది కేవలం ప్రజల ఆస్తుల అతిక్రమణ మీద విధించబడింది. అత్యాచారం మీద కాదు. మేజర్ హుస్సైన్ అత్యాచారం కేసులో బయట పడ్డాడు.

అజాజ్ అశ్రఫ్: కూనన్ పోశ్పోర సామూహిక అత్యాచారం కేసు, 2013లో విచారణ నమోదు అయ్యాక ఏమైయ్యింది?
ఖుర్రం పర్వేజ్ : సామూహిక అత్యాచారం 1991లో జరిగింది. చాలా సంవత్సరాలు విచారణ జరుగుతున్నట్లు మేము నమ్మేటట్లు చేశారు. ఆర్ టి ఐ ద్వారా కేసును మూసివేశారని మేము తెలుసుకొన్నాము. ఈ లోపల కూనన్ పోశ్పోర కుటుంబాలు కొన్ని 2004 నుండి ఈ కేసులో న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ తో పోరాడుతున్నాయని మాకు తెలిసింది.

అజాజ్ అశ్రఫ్: రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు వెళ్లటానికి వాళ్లు ఎందుకు అంత కాలం తీసుకొన్నారు?
ఖుర్రం పర్వేజ్ : ఈ కమీషన్ జమ్ము కశ్మీర్ లో ఉనికిలోకి రావటమే 1997 లో వచ్చింది. 2011 అక్టోబర్ లో ఈ విషయాన్ని విచారణ చేయాలనీ, కూనన్ పోశ్పోర కేసును పోలీసులు తారుమారు చేయరాదనీ ఆదేశించింది. రేప్ కు గురి అయిన 40 మహిళలకు 2 లక్షల చొప్పున ఇవ్వాలని కూడా సిఫార్సు చేసింది.

2012 లో అప్పటి న్యాయ శాఖా మంత్రి సైఫుల్లా (ఆయన నియోజక వర్గంలోనే కూనన్ పోశ్పోరా ఉంది) ఈ మహిళలు 39 మందికి ఒక్కొకరికి ఒక లక్ష చొప్పున నగదుగా ఇచ్చాడు. 40 మహిళ హాజరు కాలేదు. ఇది మామూలుగా అనుసరించే విధానం కాదు. ప్రభుత్వం చెక్కులు ఇస్తుంది.

2012లోనే ఢిల్లీలో, ఒక ఫిజియో థెరపీ డాక్టర్ రేప్ విషయంలో నిరసనలు జరిగాయి. మా సంస్థలో పని చేస్తున్న యువతులు, కూనన్ పోశ్పోరా మహిళలను కదిలించి హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని వేయాలని భావించారు. దాన్ని 2013లో శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ హై కోర్టు బెంచ్ లో వేశారు. ఆ బెంచ్ కేసు మూసి వేయలేదని మాకు చెప్పింది. మాకు వేరే విధంగా తెలిసినప్పటికీ, హై కోర్టుకు ముందే వచ్చామని అర్ధం అయ్యింది.

అజాజ్ అశ్రఫ్: తరువాత మీరు కుప్వార జిల్లా కోర్టుకు వెళ్లారా?
ఖుర్రం పర్వేజ్: అవును. మేము కూనన్ పోశ్పోర బాధితుల తరఫున ఒక నిరసన పిటీషన్ వేశాము. కోర్టు అప్పటివరకూ జరిగిన విచారణ విషయంగా సంతృప్తిగా లేదని చెప్పింది. అది జరిపిన ప్రాధమిక విచారణలో సాయుధ దళాలకు ఈ సామూహిక అత్యాచార కేసులో పాత్ర ఉందని చెప్పింది.

కోర్టు ఫైల్ చూడగలిగిన అవకాశం కూడా ఒక సమయంలో మాకు ఉండింది. ఆ రాత్రి కూనన్ పోశ్పోర లో ఉన్న 126 మంది సైనికుల పేర్లు కూడా మేము చూసాము. ఈ పేర్లను అప్పటి ఆర్మీనే పోలీసులకు ఇచ్చింది. ఇంకో రకంగా చెప్పాలంటే సామూహిక అత్యాచారం జరిగిన రాత్రి, కూనన్ పోశ్పోరలో ఆర్మీ ఉనికిని అది నిరాకరించలేదు.
2013 జులైలో మూడు నెలల్లో విచారణ జరగాలని కోర్టు ఆదేశాలు చేసింది. కానీ అది జరగలేదు. పోలీసు ఆ కాలాన్ని కొనసాగించటానికి అనుమతి కోరుతూ వస్తుంది. ఈ కాలంలోనే పోలీసు ఆర్మీకి ఉత్తరాలు రాసింది. ఆర్మీ దానికి సమాధానం ఇచ్చే విషయం పట్టించుకోలేదు.

అజాజ్ అశ్రఫ్: మీరు హై కోర్టుకు వెళ్లలేదా?
ఖుర్రం పర్వేజ్: మేము వెళ్లాము. కొన్ని కోర్టు విచారణల తరువాత, వారికి నగదు పరిహారం ఇవ్వమని మధ్యంతర ఆదేశం కోర్టు ఇచ్చింది. 39 మందికి ఒక్కో లక్ష చొప్పున ఇచ్చారని మేము చెప్పాము. కానీ ప్రభుత్వం ఇచ్చినట్లు ఒప్పుకోలేదు. ఆ లక్ష ఇచ్చింది బాధితులను నోరు మూయించటానికే అనేదే మా ఊహ. అది నగదు రూపంలో ఇవ్వటం వలన ప్రభుత్వ అకౌంట్ లో ఇచ్చినట్లుగా ఉండదు. మేము కూనన్ పోశ్పోర కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకొన్నప్పుడు ఈ నగదును చెల్లించారు.

హై కోర్టు ఆర్డర్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లటానికి నిర్ణయించుకొన్నది. విచారణ ఇంకా జరుగుతూ ఉండగా నగదు పరిహారం ఇవ్వకూడని అది చెబుతోంది. ఈ కేసు ఒక సంవత్సరం క్రితం నమోదు అయ్యి ఇంకా కాగితాల్లోనే ఉంది.

అజాజ్ అశ్రఫ్: ఎన్ కౌంటర్ కేసుల్లో ఇక్కడైనా శిక్షలు పడ్డాయా?
ఖుర్రం పర్వేజ్ : ఎన్ కౌంటర్లకు కానీ, అత్యాచారాలకు కానీ, కష్టోడియల్ మరణాలకు కానీ, అదృశ్యాలకు కానీ, హింసించటంలో కానీ ఎలాంటి శిక్షలూ పడలేదు. దక్షిణ కశ్మీర్ లో ఒక కేసులో ఇద్దరు అక్కచెళ్లెళ్లూ అత్యాచారానికి గురి అయ్యారు. వారి తండ్రి అదృశ్యం అయ్యాడు. జమ్మూ కశ్మీర్ పోలీసులు అక్క చెళ్లెళ్లలో ఒకరి మీద మాత్రమే అత్యాచారం జరిగిందనీ, ఇంకొకరి మీద జరగలేదనీ నిర్ధారించారు. కాబట్టి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ద్వారా ఆర్మీని ప్రశ్నించటానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగింది.

దానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన రెండు వాక్యాల సమాధానానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అత్యాచారానికి గురి అయిన మహిళ ఒక చనిపోయిన మిలిటెంట్ భార్య కాబట్టి ఆమె మాటలు నమ్మటానికి వీలు లేదనీ, సైన్యానికి అపకీర్తి తీసుకొని రావటానికే ఆమె ఈ కేసు నమోదు చేసిందని ఆ సమాధానం.

ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఆ మిలిటెంట్ ను అరెస్టు చేయటానికే ఆర్మీ వారి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. కుటుంబం శిక్షకు గురి అయ్యింది. మిలిటెంట్ మామ అదృశ్యం అయ్యాడు. భార్యా, ఆమె చెల్లీ అత్యాచారానికి గురి అయ్యారు.

తరువాత ఆ మిలిటెంట్ ను అరెస్టు చేశారు. ఒక సంవత్సరన్నర జైలులో ఉన్నాడు. తరువాత ఆర్మీ కోసం పనిచేయటం ప్రారంభించాడు. అతని భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ఒక వైపు సైన్యానికి చెడ్డ పేరు తీసుకొని రావటానికి భార్య ఆ కేసు నమోదు చేసిందని ఆరోపిస్తారు. ఇంకొక వైపు ఆమె భర్త వారితో కలిసి పని చేస్తాడు.

అశ్రఫ్ అజాజ్: చత్తీసింఘ్ పొరా మారణహోమంలో కొంత అభివృద్ధి కనిపించింది కదా!
ఖుర్రం పర్వేజ్: చత్తీసింఘ్ పొరాలో 2000, మార్చ్ 20న ఈ కేసులో 35 మంది సిక్కులు సామూహిక మారణకాండకు గురి అయ్యారు. పత్రిబల్ లో జరిగిన ఇంకో సామూహిక మారణకాండలో అయిదుగురు మరణించారు. ఈ అయిదుగురే ఆ 35 మందిని చంపారనే అభియోగం ఉన్నది. సిబిఐ పత్రిబల్ సంఘటనను విచారించి అది ఒక నకిలీ ఎన్ కౌంటర్ అని నిర్ధారించింది. అంతే కాకుండా ఆ ఆర్మీ అధికారిని (ఇప్పుడు మేజర్ జనరల్) ప్రశ్నించాలని చెప్పింది. పిటిషన్లు నమోదు అయ్యి కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆరోపితులను పరిమిత టైమ్ లో సైనిక కోర్టు ద్వారా విచారించాలని చెప్పింది. కానీ ఆర్మీ వారిని విచారించకూడని నిర్ణయం తీసుకొన్నది. సిబిఐ, పోలీసుల కనుక్కొన్న విషయాలు ఉన్నప్పటికీ సరైన రుజువులు లేవని చెప్పింది.

అశ్రఫ్ అజాజ్: ఎప్పుడైనా ఆర్మీ మనుషులను విచారించటానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా?
ఖుర్రం పర్వేజ్ : గత 25 సంవత్సరాలలో ఆర్మీని ప్రశ్నించటానికి రక్షణ మంత్రిత్వ శాఖా నుండి కానీ, పారా మిలటరీని ప్రశ్నించటానికి హోమ్ మంత్రిత్వ శాఖ నుండీ కానీ తమకు అనుమతి లభించలేదని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది.

అశ్రఫ్ అజాజ్: మానవ హక్కుల కార్యకర్తగా మీరు కశ్మీరీ పండితుల శాశ్వత వలసను ఎలా చూస్తారు? మానవ హక్కుల సంస్థలు ఈ విషయంగా స్పష్టతతో లేవని అభియోగాలు ఉన్నాయి?
ఖుర్రం పర్వేజ్: ఇలాంటి అభియోగాలు ‘ఆర్మీకి హక్కులు లేవా? హిందువులకు హక్కులు లేవా?’ అనే వారి నుండి వస్తాయి. అలాంటి ఆరోపణల గురించి మాకు బాధ లేడు. ఎందుకంటే మేము సమాజపు మూలాల నుండి పని చేస్తున్నాము.

‘కశ్మీరీ పండితుల్ని చంపారు అన్న కేసుల్లో విచారణ జరపకుండా ఏ విషయం వారిని ఆపుతుంది’ అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము.

కశ్మీరీ పండితుల గురించి భారత మీడియాలో పెద్ద దండోరా జరుగుతుంది. కానీ విచారణ కమీషన్ ను వేయమనే డిమాండ్ ఎందుకు రావటం లేదు? 1990 లో జరిగిన పడితుల వలస గురించి విచారణ జరపలేదు? కశ్మీరీ పండితుల హంతకులను ప్రశ్నించాలనే మా డిమాండ్, భారత ఆర్మీని ప్రశ్నించమనే మా డిమాండ్ తో సమానం. కానీ విచారణ జరగకుండా అది జరగదు.

కశ్మీరీ పండితుల వలస, వారి హత్యల గురించి చాలా చర్చ జరుగుతుంది. అన్ని హత్యలు దురదృష్టకరమే. కానీ కశ్మీర్ లో హత్యకు గురి అయిన ఇతర మైనారిటీలు కూడా ఉన్నారు.

అశ్రఫ్ అజాజ్: అంటే…?
ఖుర్రం పర్వేజ్: జమ్మూ కశ్మీర్ లో చనిపోయిన హిందువులు కేవలం కశ్మీరీ పండితులు మాత్రమే కాదు. మిగతా వారి గురించి ఎందుకు మాట్లాడరు?

అశ్రఫ్ అజాజ్: ఎవరు వాళ్లు?
ఖుర్రం పర్వేజ్ : ప్రభుత్వ లెక్కల ప్రకారం 1990-91 మధ్య హత్యకు గురి అయిన 1544 మంది మైనారిటీలలో హిందువులు 1400 మంది. ఆ 1400ల మందిలో 209 మంది మాత్రమే కశ్మీరీ పండితులు. వారి గురించి మీడియా బయటకు చెప్పటం మంచిదే. కానీ మిగతా వారి 1200 మంది హిందువుల మాట ఏమిటి?

అశ్రఫ్ అజాజ్: బహుశా పండితులు వారి స్వస్థలం నుండి గెంటివేయబడటం వలన అయి ఉండవచ్చు.
ఖుర్రం పర్వేజ్ : జమ్మూ ప్రాంతంలో రజౌరి, ఉధాంపూర్, దోడా, కిశ్త్వర్ ల నుండి హిందువుల వలసలు 1995-96ల మధ్య ప్రారంభం అయ్యాయి. పండితులు వలసలు పోయినపుడు వారికి శిభిరాలు, వంట సామాగ్రి ఇచ్చారు. త్వరలో తమ ప్రాంతాలకు చేరుకోవచ్చునని వారు భావించారు. వారి శరణార్ధిత్వం కొనసాగింది.

కానీ మిగతా హిందువుల విషయంలో- ముఖ్యంగా క్షత్రియలు మరియు నిమ్న కులాల విషయంలో ప్రభుత్వం వారిని వెనుకకు తరిమింది. వారు వెనక్కి రావాలంటే వారికి పోరాడటానికి తుపాకులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దురదృష్టవశాత్తు వారు చంపబడ్డారు. వారు మామూలుగా యోధులు కాదు. కానీ వారు ఇతర సమూహాల మానవహక్కుల ఉల్లంఘనలో తలదూర్చారు. వారిలో చాలా మంది విశ్వ హిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ తో సంబంధంతో ఉంటారు. ఈ సంస్థలు, పండితులు కానీ హిందువులను వలస పోవటానికి అంగీకరించవు. వాళ్లు చనిపోయిన పర్వాలేదు. అందుకే పండితులు కానీ హిందువులు చాలా మంది చనిపోయారు.

అశ్రఫ్ అజాజ్: కశ్మీరీలు రాజ్యం, మిలిటెంట్ల మధ్య చిక్కుకొని ఉన్నారని మీరు భావిస్తారా? అలా భావిస్తే ఈ ఇద్దరికీ అతీతంగా పోవాల్సిన అవసరం ఉందని అనుకొంటారా?
ఖుర్రం పర్వేజ్ : ఇక్కడి ప్రజలు మిలిటెంట్లను ‘వేరేవాళ్లుగా’ భావించరు. కశ్మీరీ మిలిటెంట్లు అని మీరు పిలిచేవారిని వారి సొంత మనుషులుగా భావిస్తారు. ఏ మిలిటెంట్ అంతిమ యాత్రలోనైనా మీరు చూస్తే – వారు కశ్మీరీలు అయినా, పాకిస్తాన్ వారు అయినా సరే- ప్రజలు వారిని తమ సొంత మనుషులుగా ఎలా భావిస్తారో అర్థం అవుతుంది.

కశ్మీర్ లో రెండే కథనాలు ఉన్నాయి. కశ్మీర్ ప్రజల కథనం. భారత సైన్యం లేక రాజ్యం కథనం. కశ్మీర్ ప్రజల కథనం ఎప్పుడూ రాజ్యం కథనంతో విబేధిస్తుంది.

అశ్రఫ్ అజాజ్: మిలిటెంట్లు చాలా మంది కశ్మీరీలను చంపారు అనే విషయాన్ని దృష్టిలోకి తీసుకొంటే, మీ దృష్టి కోణాన్ని ఎలా వివరిస్తారు?
ఖుర్రం పర్వేజ్: కొన్ని హత్యలకు మిలిటెంట్లే బాధ్యులు అనే విషయం నిజం. అన్ని హత్యలూ ఖండించదగ్గవే అయినప్పటికీ, ఆ హత్యలు స్థానిక అర్థంలో ఆర్మీ ఏజెంట్ల హత్యలే. కశ్మీరీ పౌరుల హత్యలు కాదు. కాబట్టి ఒక పౌరుడు మిలిటెంట్ల చేతిలో మరణిస్తే ‘భారతీయలు కోసం ఏదో చేసి ఉంటాడు’ అని కశ్మీరీలు స్పందిస్తారు. అయినప్పటికీ పౌరులు మిలిటెంట్ల చేతిలో చనిపోయిన కేసులను కూడా మేము గ్రంథస్తం చేశాము.

తెలుగు అనువాదం: రమాసుందరి

(అశ్రఫ్ అజాజ్ ఢిల్లీకి చెందిన ఒక జర్నలిష్టు. బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యంగా ఆయన ‘The Hour before Dawn’ అనే పుస్తకం రాశాడు)

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

Leave a Reply