నేపాల్: దృశ్యం ఒకటే – దృక్పథాలు అనేకం!

ఏదైనా ఒక ఘటన, పరిణామం జరగగానే, ఒక్కొక్కసారి జరుగుతుండగానే, దానికి సంబంధించిన వివరాలు తగినన్ని అందుబాటులో లేకుండానే, కేవలం దానికి సంబంధించి మాధ్యమాలు చూపుతున్న దృశ్యాలతో, చెపుతున్న వివరణలతో ప్రభావితమై, అప్పటికే ఉన్న అవగాహనతో దాన్ని పూర్తిగా సమర్థించడమో, పూర్తిగా ఖండించడమో మనకు అలవాటు. కాని ఇందులో చాల సమస్యలున్నాయి. కనబడుతున్న దృశ్యాలూ వినబడుతున్న వివరణలూ వాటికవిగా సంపూర్ణమైనవీ కాదు, ఏ దృక్పథమూ అంటని తెల్ల కాగితాలూ కావు. ఏ దృశ్యాలు చూపాలో, ఏ వివరణలు ఇవ్వాలో ఆ మాధ్యమాల స్వభావమే నిర్ణయిస్తుంది.

అలాగే అప్పటికే మనకు ఏర్పడి ఉన్న అవగాహనకూ వాస్తవానికీ మధ్య అంతరం కూడా ఉంటుంది. అవగాహన గతం మీద రూపొందినది కాగా, వాస్తవం వర్తమానంలో రూపొందుతున్నది. గతానికి వర్తించినదంతా, గతంలో నిజం అయినదంతా వర్తమానానికి యథాతథంగా వర్తించాలనీ, వర్తమానంలో నిజం కావాలనీ లేదు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలూ, గ్రహించిన నిర్ధారణలూ తప్పకుండా మార్గదర్శకంగా ఉంటాయి. కాని దిక్కు చూపే బోర్డు తానే ఆ దిక్కుకు వెళ్లజాలదు. అది ఒక సూచిక. ఒక మార్గదర్శి. నిత్య చలనశీల ప్రపంచంలో అదే సమస్తమూ కాదు, అంతిమమూ కాదు.

ఇవాళ్టి వర్తమానం కూడా కొంతకాలానికి ఘనీభవించి, దాని నుంచి నిర్ధారణలు తీయగలిగిన స్థితి వచ్చినాక అవగాహనలో భాగం అవుతుంది. మరి వర్తమానాన్ని అర్థం చేసుకుని, మన అంచనా ప్రకటించి, ఒక వైఖరి తీసుకోవలసి ఉంటుంది గదా, అది గతం అయ్యేదాకా ఆగే అవకాశం ఉండదుగదా అనే సమస్య కూడా ఉంది. అందువల్ల సులభమైన నిర్ధారణలూ, వర్తమానంలోని సంక్లిష్టతను పక్కన పెట్టి చేసే సరళరేఖ నిర్ధారణలూ సూత్రీకరణలూ వస్తుంటాయి.

వర్తమానం గురించి భిన్నమైన కోణాల నుంచి సమాచారం సేకరిస్తే వాస్తవం ఆ రెండు కొసల మధ్య ఎక్కడో ఉందని ఉజ్జాయింపుగా నిర్ధారించవచ్చు. అలా వీలైనన్ని కోణాల సమాచారాన్ని సేకరించడం మొదటి మెట్టు. దాని ఆధారంగా ఆ ఘటన, పరిణామం పట్ల ఒక అంచనాకు రావచ్చు. ఆ అంచనాను కాలక్రమంలో మార్చుకోవలసిన అవసరం ఉంటుందనే ఎరుక కూడా ఉండాలి.

అందువల్ల ఒక పరిణామాన్ని పూర్తిగా సమర్థించడమో, పూర్తిగా కొట్టివేయడమో కాక, అందులో ప్రగతిశీల, ప్రగతి నిరోధక అంశాలను గుర్తించే సమ్యగ్ వైఖరి తీసుకోవడం, ఆ వర్తమానం ఏ దిశగానైనా పర్యవసించ వచ్చునని, అందువల్ల దానిలో పూర్తిగా సమర్థనీయమైనదీ, పూర్తిగా ఖండనీయమైనదీ ఏమీ ఉండదని గుర్తించడం అవసరం.

అందులోనూ ఆ ఘటన, ఆ పరిణామం అంతర్జాతీయ పర్యవసానాలు ఉన్నదైనప్పుడు దాని గురించి కచ్చితమైన, “సరైన” సమాచారం అందడం అరుదు. మామూలుగానే ఏ సమాచారమైనా ఒక ప్రత్యేక దృక్పథం నుంచే వస్తుంది గాని, అంతర్జాతీయ సమాచారం అయితే భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో, రాజకీయార్థిక ప్రయోజనాల నేపథ్యంలో పూర్తి తలకిందులుగా కూడా రావచ్చు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అలంకారాలతో రావచ్చు. అబద్ధాలే, అర్ధసత్యాలే నిజాలుగా చలామణీలోకి రావచ్చు. వార్తా సంస్థల, ప్రచారసాధనాల బహుళజాతి సంస్థలు అందించే సమాచారం ఆ సంస్థల, వాటి వెనుక ఉన్న సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాల మేరకు తయారై ఉంటుంది. లేదా, ఒక సమాచారంలో ఏ కోణాలను పైకి ఎత్తాలి, ఏ కోణాలను తగ్గించి చెప్పాలి, అసలు చెప్పకుండా ఉండాలి అనేవి ఆ సంస్థల ప్రయోజనాలు నిర్ణయిస్తాయి. కనుక మనకు అందే సమాచారమే ఒక జల్లెడ దాటి వచ్చినదై ఉంటుంది. దాని నుంచి నిర్ధారణలు, విశ్లేషణలు చేసే మరొక జల్లెడ పట్టేసరికి అసలు వాస్తవానికీ, ఈ విశ్లేషణకూ పొంతన కుదరని స్థితి వస్తుంది.

నేపాల్ లో జెనరేషన్ జీ – జెన్ జీ అని పిలుస్తున్న యువతరం – ఆందోళన మన కళ్ల ముందర రెండు మూడు రోజులు అనేక దృశ్యాలు ప్రదర్శించింది. ఆ దృశ్యాలతో పాటే ఆయా వార్తా సంస్థలు వాటి మీద చేసిన అభివర్ణనలు కూడా వచ్చాయి. అవన్నీ వాస్తవంలో ఎంతో కొంత భాగాన్ని యథాతథంగానే పట్టుకుని ఉండవచ్చు. కాని ఏ దృశ్యాలను చూపాలి, వాటిని ఎట్లా వర్ణించాలి అనేది కూడా రాజకీయ నిర్ణయమే అని గుర్తు పెట్టుకోవాలి.

అధికార పీఠాల మీద యువతరం దాడి దృశ్యాలు ఎన్నో కనబడ్డాయి. వేలాది యువతరం పాల్గొన్న విస్తృతమైన భాగస్వామ్యం కూడా కనబడింది. పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి అధికారపీఠాల మీద, హిల్టన్ హోటల్ వంటి ఆస్తుల మీద, అవినీతిపరులని పేరుబడిన రాజకీయ నాయకుల మీద, మినహాయింపు లేకుండా అన్ని రాజకీయ పక్షాల మీద దాడులు జరిగాయి. ఆ ఆందోళన ఎవరో ఒకరి, ఏదో ఒక దృక్పథం నాయకత్వంలో జరగలేదు గనుక అన్ని రకాల అభిప్రాయాల వాళ్లూ పాల్గొన్నారు. ఏదో ఒక గుంపు, ఎవరో ఒక నాయకుడు అంతా తామే నడిపామని గొప్పలు చెప్పుకొని ఉండవచ్చు గాని, నాయకత్వమూ మార్గదర్శకత్వమూ లేని అరాచకత్వమే ప్రధానంగా కనబడింది. ఏదో ఒక గుంపు హిందుత్వ చిహ్నాలనో, మోడీ బొమ్మలనో కూడా ప్రదర్శించి ఉండవచ్చు. (ఆ మోడీ బొమ్మల ప్రదర్శన నేపాల్ ది కాదనీ, సిక్కిం లో జరిగిన ప్రదర్శనను వాట్సప్ యూనివర్సిటీ తెలివిగా నేపాల్ ఘటనగా ప్రచారం చేస్తున్నదనీ కూడా బైటపడింది!)

ఏది ఏమైనా కొన్ని దృశ్యాలనే ప్రధానంగా చూపాలని కూడా కొన్ని మాధ్యమాలు అనుకున్నాయి. జెన్ జీ రెవల్యూషన్ (విప్లవం) – తొలి యవ్వనంలో ఉన్న తరం, సామాజిక మాధ్యమాలతో పెరిగిన తరం చేస్తున్న విప్లవం – అనే నిర్వచనం కూడా ఆ దృశ్యాలతో పాటే కలిసి వచ్చింది. ప్రభుత్వం సామాజిక మాధ్యమాల మీద నిషేధం విధించడాన్ని నిరసిస్తూ యువతరం ఆగ్రహ ప్రదర్శన జరిపిందని కూడా వార్తలూ వ్యాఖ్యలూ వచ్చాయి.

ఒక కారణం, ఒక దృశ్యం (లేదా కొన్ని దృశ్యాలు), ఒక నిర్వచనం – అన్నీ కూడా చూపరుల ఆలోచనను ప్రభావితం చేసే, సమ్మతిని తయారు చేసే ఉద్దేశంతో ప్రదర్శితమయ్యేవే అని గుర్తుంచుకోవాలి. చూపరులు ఇతర కారణాల గురించి ఆలోచించగూడదనీ, ఇతర దృశ్యాలు చూసినా వాటిని ఎక్కువ పట్టించుకోగూడదనీ, ఆ జన సంచలనాన్ని తాము ఇచ్చిన నిర్వచనం ద్వారానే తప్ప ఇతర నిర్వచనాల ద్వారా అర్థం చేసుకోగూడదనీ పాలకవర్గాల, వారి ప్రచార సాధనాల కోరిక. కాని సమాజంలో, ఆలోచనాపరులలో భిన్నత్వం, భిన్న భావజాలాలు, భిన్నమైన అవగాహనలు ఉంటాయి గనుక ప్రచార సాధనాలు చూపే దృశ్యాలకు, చెప్పే నిర్వచనాలకు అవతల ఏమి ఉందో అన్వేషిస్తారు, ఊహిస్తారు, అవతలి కోణాలను పసి గట్టడానికి, సూత్రీకరించడానికి ప్రయత్నిస్తారు.

అందువల్లనే, నేపాల్ పరిణామాలు ప్రారంభమయిన ఈ వారం రోజుల్లో వాటి మీద లెక్కలేనన్ని అంచనాలు, నిర్ధారణలు, సూత్రీకరణలు వచ్చాయి, వస్తున్నాయి. ప్రచార సాధనాలు చెప్పినట్టుగా ఆ ఆందోళన అంతా కేవలం ప్రభుత్వం విధించిన సామాజిక మాధ్యమాల నిషేధానికి యాదృచ్ఛిక వ్యతిరేకత మాత్రమే అనుకున్నవాళ్లున్నారు. సామాజిక పరిణామాల విషయంలో సహజంగా వెలికివచ్చే కుట్ర సిద్ధాంతాలు ఎన్నో ఇప్పుడు కూడా వచ్చాయి. అది నిజమైన ప్రజాగ్రహం అవునా కాదా, ఎవరో రెచ్చగొట్టిన కల్లోలమా అనే అనుమానం వెలిబుచ్చిన వాళ్లున్నారు. అది అమెరికా, సిఐఎ అనుకూల స్వచ్ఛంద సంస్థల పన్నాగమని అనుకున్నవాళ్లున్నారు. అది చైనా అనుకూల శక్తులు రెచ్చగొట్టిన ఆందోళన అని, టిబెట్ ను ఆక్రమించినట్టుగా చైనా నేపాల్ ను కూడా ఆక్రమించబోతున్నదని అన్నవాళ్లున్నారు. అది భారత హిందుత్వ శక్తుల ప్రోద్బలంతో జరిగినదనీ, అఖండ భారత్ ఏర్పాటులో మొదటి అడుగు అనీ అన్నవాళ్లున్నారు. ఆ కల్లోలం భారత ప్రభుత్వం చేయించిన పనే అని పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి అన్నాడు.

ఏమైనా అంతర్గత కారణాలు ఉండవచ్చునా అని అన్వేషణ కూడా చేయకుండా అదంతా బాహ్యశక్తుల వల్ల మాత్రమే జరిగిందని కొందరు అన్నట్టుగానే, బాహ్య కారణాల ప్రభావమే లేకుండా అంతర్గత కారణాల వల్ల మాత్రమే జరిగిందని మరి కొందరు అన్నారు. ఆ కల్లోలం రాచరికాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం అని కొందరన్నారు. ఆ కల్లోలానికి నాయకత్వం వహించినవాళ్ల (నిజానికి అది ఒక నాయకత్వం కింద జరిగినట్టేమీ లేదు!) తిరోగామి, ఛాందసవాద భావాలను కొందరు ఎత్తి చూపారు. సైనిక నేత మాట్లాడుతున్నప్పుడు వెనుక రాజు ఫొటో ఉండడం రాచరికాన్ని పునరుద్ధరించడానికి సూచన అన్నవాళ్లున్నారు. సైనిక జోక్యంతో రాచరికాన్ని పునరుద్ధరించే ప్రతీఘాత విప్లవం జరగబోతున్నదనీ, దాన్ని ఎదిరించి జెన్ జీ ఉద్యమపు అసలు లక్ష్యాలను ముందుకు తీసుకురావాలనీ ఒక నేపాలీ సంస్థ పిలుపు ఇచ్చింది. అసలు జెన్ జీ ఉద్యమానికే ప్రగతిశీల లక్షణాలున్నాయా, అది అమెరికన్ ఎన్ జి వోలు రెచ్చగొట్టిన చిచ్చు మాత్రమేనా అని కూడా చర్చ జరిగింది.

అది “జెన్ జీ విప్లవం” అని ప్రచారం అయింది గనుక అది విప్లవం కాదని, కాజాలదని చూపడానికి చాలామంది ప్రయత్నించారు. అందులో పాల్గొన్నది జెన్ జీ గనుక, వాళ్లు కూడా సామాజిక మాధ్యమాల నిషేధానికి స్పందించారు గనుక వాళ్లు సామాజిక మాధ్యమాల బానిసలు అని, అంటే సామ్రాజ్యవాద శక్తుల చేతిలో పావులనీ అన్నవాళ్లున్నారు. జెన్ జీ ఉద్యమాల ఇతర ఉదాహరణలు చూపి వాటి వల్ల నష్టాలుంటాయని హెచ్చరించిన వాళ్లున్నారు. ఇటీవలి శ్రీలంక, బాంగ్లాదేశ్ ఆగ్రహ ప్రదర్శనల తర్వాత పరిణామాలను చూపి ఇది కూడా తాటాకు మంటే అవుతుందని చప్పరించినవాళ్లున్నారు. ఇటువంటి స్పాంటేనియస్ – ప్రాప్తకాల – ఆందోళనలు ఏమీ సాధించజాలవని అన్నవాళ్లున్నారు. ఆందోళనలో భాగంగా, ప్రణాళిక ప్రకారమో, అసంకల్పితంగానో జరిగిన భారీ హింసాకాండను, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చూపి ఇది ఉట్టి అరాచక గుంపుల మూకోన్మాదం అన్నవాళ్లున్నారు. నేపాలీ సమాజంలో బ్రాహ్మణ-క్షత్రియ ఆధిక్యత, దేశ వనరుల మీద, రాజకీయాల మీద ఆ రెండు కులాల ఆధిపత్యం మీద వ్యతిరేకతగానే ఈ విస్ఫోటనం సంభవించిందని అన్నవాళ్లున్నారు.

ఈ అన్ని విశ్లేషణల్లో ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత నిజం ఉంది. చాలా వరకు స్వీయ అభిప్రాయాలను వాస్తవికతకు అన్వయించడం ఉంది. ప్రతి ఒక్కరూ ఉటంకించినవన్నీ వాస్తవాలే. ఈ వాస్తవాల నుంచి సత్యం గ్రహించడానికి, ఈ రూపాల నుంచి సారాన్ని అన్వేషించడానికి కొంత కాలం పట్టవచ్చు. ఈలోగా, కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.

ఎక్కువమంది వ్యాఖ్యాతలు సామాజిక మాధ్యమాల నిషేధం అనే చివరి దెబ్బనే మొత్తం ఆందోళనకు కారణం అనుకునేలా ప్రచార సాధనాలు ప్రభావితం చేశాయి. అది చివరి దెబ్బ కావచ్చు గాని అదే పూర్తి కారణం కాదు. సామాజిక చలనంలో అలా ఏదో ఒక ఘటన దగ్గర విస్ఫోటనం జరిగినట్టు కనబడుతుంది గాని అంతకు ముందు ఎంతో కాలంగా జరిగిన ఎన్నో పరిణామాల ఫలితంగానే ఆ ఘటన దగ్గర విస్ఫోటనం జరుగుతుంది. ఆ ముందరి పరిణామాలు కనబడకపోవచ్చు, నిశ్శబ్దంగా జరిగిపోయి ఉండవచ్చు. కాని అవన్నీ ఒక గెంతు జరగడానికి రంగం సిద్ధం చేసి పెడతాయి. ఒక ఘటనతో ఆ గెంతు జరగగానే, మొత్తం గెంతుకు ఆ ఘటనే కారణం అని మనం అనుకుంటాం. ప్రకృతి నుంచి ఉదాహరణ చెప్పాలంటే నీరు వేడెక్కుతున్నప్పుడు తొంబై డిగ్రీల నుంచి తొంబై ఒక్క డిగ్రీకి మారడానికి ఏమి జరిగిందో, తొంబై తొమ్మిది డిగ్రీల నుంచి వంద డిగ్రీలకు మారడానికి అదే జరుగుతుంది. కాని తొంబై తొమ్మిది డిగ్రీల వరకూ అలా పెరుగుతూ వచ్చిన ఒక్కొక్క డిగ్రీ వేడి చేయలేని మార్పు, తొంబై తొమ్మిది తర్వాత ఒక్క డిగ్రీ చేస్తుంది. నేపాలీ సమాజంలో కూడా కనీసం రెండు దశాబ్దాలుగా, లేక అంతకు ముందు నుంచీ కూడా, జరుగుతూ వస్తున్న మార్పుల పర్యవసానమే ప్రస్తుత విస్ఫోటనం. సామాజిక మాధ్యమాల నిషేధం అనేది ఒక చివరి దెబ్బ మాత్రమే.

ప్రస్తుత విస్ఫోటనానికి అనేక చారిత్రక, రాజకీయార్థిక కారణాలున్నాయి. సాయుధ పోరాటం, సాయుధ పోరాట విరమణ, రాచరికం పతనం, రాజ్యాంగ రచన, ఐక్య సంఘటన ప్రభుత్వాలు, మావోయిస్టులతో సహా అన్ని రకాల రాజకీయ పక్షాలు అధికారంలోకి రావడం, ముప్పై ఐదు సంవత్సరాలలో ముప్పై ప్రభుత్వాలు మారడం, అంతర్గత రాజకీయార్థిక విధానాలలో ఇటు చైనా, అటు అమెరికా, ప్రత్యేకించి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ జోక్యం వంటి అనేక పరిణామాలు ఈ మూడు దశాబ్దాల్లో జరిగాయి. ఈ క్రమంలో ఉద్యోగ కల్పన జరగవలసినంత జరగలేదు. ఉద్యోగార్థం వేలాది మంది, లక్షలాది మంది యువకులు దేశం వదిలి చిరుద్యోగాల కోసం, పొట్టకూటి కోసం, పైసో పరకో మిగిల్చి ఇంటికి, కుటుంబాలకు పంపడం కోసం విదేశాలకు వలస వెళ్లడం పెరిగింది. నిరక్షరాస్యులు, తక్కువ చదువుకున్నవారు భారతదేశానికీ, గల్ఫ్ దేశాలకూ కనీసమైన ఉపాధి కోసం వలస వెళ్తుండగా, చదువుకున్నవారు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలకు వెళ్తున్నారు. అలా విదేశాల్లో ఉపాధి సంపాదించుకుని తమ కుటుంబాల కోసం వెనక్కి పంపుతున్న డబ్బు – రెమిటెన్సెస్ అంటారు – ఇవాళ నేపాల్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా ఉన్నదంటే, ఆ ఆర్థిక వ్యవస్థ దుస్థితి అర్థమవుతుంది. ఇలా వస్తున్న డబ్బు నేపాల్ జాతీయాదాయంలో 1990లో ఒక్క శాతం ఉన్నదల్లా, 2024లో 33 శాతానికి, మూడో వంతుకు చేరింది. (ఒక పోలిక చెప్పాలంటే భారత జాతీయాదాయంలో రెమిటెన్సెస్ వాటా 3.3 శాతం!)

దేశంలో పారిశ్రామికీకరణ లేక, ఉద్యోగ కల్పన లేక, పర్యాటక రంగంలో కాస్తో కూస్తో ఉపాధి ఉన్నప్పటికీ, రోడ్లు, హోటళ్లు, వాహనాలు వంటి మౌలిక సాధన సంపత్తి తగినంత లేక ఆ ఉద్యోగాలు కూడా తరిగిపోయి నిరుద్యోగం కనీవినీ ఎరగని స్థాయికి పెరిగింది. ఉద్యోగం, ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లినవాళ్లు వెళ్లగా, దేశంలో మిగిలిపోయిన యువత భయంకరమైన నిరుద్యోగంలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఒత్తిడి వల్ల ఒకవైపు పన్నులు పెంచడం, మరొకవైపు సంక్షేమ పథకాల మీద కోత విధించడం ఈ నిరుద్యోగపు ఒత్తిడికి తోడయింది. లక్షలాది జనం ఇంత దుస్థితిలో ఉండగా, వాళ్ల కళ్ల ముందరే రాజకీయ నాయకుల, అధికారుల మితిమీరిన అవినీతి కనబడుతున్నది. కనబడని అవినీతి కూడా కాదు, పిడికెడు మంది రాజకీయ నాయకులు, అధికార వర్గాల భవనాలు, ఆస్తులు, వాహనాలు, ఆడంబర విలాస ప్రదర్శన కనబడుతున్నది. ఇలా సామాజిక, ఆర్థిక అంతరాలు స్పష్టంగా బహిర్గతం కావడం మొదలయింది.

ఈ దుష్పరిణామాల నుంచి తమను గట్టెక్కించే, ఈ సమస్యలు పరిష్కరించే రాజకీయ, సామాజిక శక్తులు ఎక్కడన్నా ఉన్నాయా అని వెతుకుతున్న నేపాల్ ప్రజానీకానికి ఎటు చూసినా నిరాశే ఎదురయింది. రాచరిక, భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ శక్తుల నుంచి సమాజాన్ని విముక్తం చేసి సమసమాజ దిశలో నడిపిస్తుందనుకున్న ప్రచండ విప్లవ మార్గం పార్లమెంటరీ పందుల దొడ్డిలో, ఇతర రాజకీయ పక్షాలతో సమానమైన, లేదా ఎక్కువ అవినీతిలో, అవకాశవాదంలో, ఆదర్శాలను అమ్ముకోవడంలో, చీలికల్లో కూరుకుపోయింది. ఇక మిగిలిన రాజకీయ పక్షాల నుంచి ఆశించగలిగినది ఏమీ లేదు. ఆ రాజకీయ ఎడారిలో బహుశా నేపాల్ యువతరానికి కనబడిన ఎండమావులు అమెరికా ప్రేరేపిత ప్రాయోజిత స్వచ్ఛంద సంస్థలు. అందువల్ల ప్రస్తుత ప్రజాగ్రహ మార్గం మొదటి నుంచీ అపసవ్య మార్గంలోనే ఉందని అనుకోవచ్చు.

కాని ఎప్పుడైనా ప్రజాగ్రహం, బహిరంగంగా ప్రగతి నిరోధకంగా, మతోన్మాదంతో, ఆధిపత్య లక్షణాలతో ఉంటే తప్ప, దానికదిగా సమర్థించవలసినది. అది అప్పటికప్పుడు తప్పుడు నినాదాల కింద, తప్పుడు నాయకత్వాల కింద, తప్పుడు మార్గాలలో కూడా ఉండవచ్చు. కాని ప్రజల నిజమైన సృజనాత్మకత, ఆలోచన, చొరవ, ఆచరణలో భాగస్వామ్యం, నాయకత్వ శక్తి, తప్పులు చేసినా సరిదిద్దుకోగలిగే ఉన్నత చైతన్యం వ్యక్తమయ్యేది ఇటువంటి జన విస్ఫోటనాల లోనే. అటువంటి విస్ఫోటన పెల్లుబికే సమయానికి ప్రగతిశీల శక్తులు సంసిద్ధంగా ఉండి, దానికి మార్గ నిర్దేశకత్వం చేస్తే, సరైన నాయకత్వం అందిస్తే, ఆ ఆగ్రహాన్ని సరైన దారిలోకి మళ్లిస్తే అద్భుతాలు సాదించవచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రజాగ్రహంలో ఎక్కడైనా అట్టడుగున వ్యక్తమయ్యేదీ, ఆ ఆగ్రహపు సారాంశంగా చెప్పగలిగేదీ యథాస్థితి పట్ల వ్యతిరేకత. ప్రజలు ఇంకెంతమాత్రమూ యథాస్థితిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. వారిలో ఆ అసంతృప్తి ఎంత గడ్డిపోచనైనా ఆయుధంగా భ్రమించే స్థితి, పామునైనా శత్రువును బంధించగల తాడుగా భ్రమించే స్థితి కల్పిస్తుంది. ఆ భ్రమలను వదల్చవలసిన ప్రగతిశీల శక్తులు లేకపోవడం, నిష్క్రియాపరంగా ఉండడం, ప్రజల్లో తమ మీద విశ్వాసాన్ని పోగొట్టుకోవడం, ప్రజాగ్రహ ప్రకటనను తమ చేతుల్లోకి తీసుకుని నాయకత్వం, మార్గదర్శకత్వం అందించే చొరవ చూపకపోవడం నేపాల్ లో ఇవాళ నిజమైన విషాదం.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply