నల్ల బల్ల

వందల ఏళ్లుగా ఊరికి దూరంగా
వెలివేయబడ్డ మాదిగ లందలో
ఉదయించిన నల్లపొద్దతను!

మనువు డొక్కచీరి డప్పు కట్టి
ఆకలిమంటలపై కాపి
వాడవాడల సిర్రా చిటికెన పుల్లతో
దరువేస్తున్న దండోరా శబ్దం!

నల్లమల వీచిన గాలుల్ని పసులకాడ పిల్లనగ్రోవిపొత్తిలో నింపుకొని
రేలపాటల్లో ఓనమాలు దిద్దిన
శంభూకుడతడు!

తెగ్గోయబడ్డ గొంతుకలకు
చూపుడు వేలెత్తే
జ్ఞానాయుధాన్ని అందించిన
తధాగతుడతను!

అంటరానిగాలి నేరమయినచోట
సుద్దముక్కలతో సుద్దులు బోధించే నల్లబల్లతను!

బాధల కొలిమిలో భావానికి ఫుటంబెట్టి చేతిలో
కరవాల కాలంతో
నడుస్తున్న తెలంగాణతను!

(విరసం కార్యదర్శి కాశీంపై కుట్ర కేసుకు నిరసనగా…)

కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో బీఎస్సీ(బయోలాజికల్ సైన్సెస్), ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. (శ్రీశ్రీ కవిత్వంపై ప్రాచ్య పాశ్చాత్య ప్రభావం) పరిశోధన చేశాడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ బోధన విద్యలో పాఠాలు చెప్తున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు. ప్రస్తుతం వరంగల్ లో ఉంటున్నాడు.

Leave a Reply