దేశ ద్రోహుల సమయం

ఏం చేస్తున్నావు భాయి?
దేశద్రోహం
నువ్వలా కాదే
నేను మటన్ తింటున్నా కదా

ఏం చేస్తున్నావు చెల్లెమ్మా?
దేశద్రోహం
హాస్యమాడకమ్మా
సహజంగా వున్నా కదా

ఏం చేస్తున్నారు మాస్టారూ?
దేశద్రోహం
మీరేంటి సారూ
పిల్లలకు ఒరవడి దిద్దిస్తున్నా కదా

ఏం చేస్తున్నారు సారూ?
దేశద్రోహం
మీరు మరీను
హక్కుల కోసం మాటాడుతున్నా కదా

ఈ కదల లేని స్థితిలో
ఏం చేస్తున్నారు?
దేశద్రోహం
ఊరుకోండి సారూ
సత్యాన్ని రికార్డు చేస్తున్నా కదా

మీరేం పని చేస్తున్నారు?
దేశద్రోహం
నమ్మలేను సారూ
నేను కలలను తుపాకీ మొనకు వేలాడదీస్తున్నా

దేశ ద్రోహుల కాలం కదా
తూరుపు వేచి చూస్తోంది ఆకుపచ్చని సూరీడు వెలుగులో!

జ‌న‌నం: విజయనగరం జిల్లా పార్వతీపురం. విరసం స‌భ్యుడు. త‌న‌ను తాను వ్య‌క్తీక‌రించుకునే సాధ‌నంగా క‌విత్వం త‌న జీవితంలో భాగంగా మారింద‌ని న‌మ్మిన క‌వి. ఇప్పటివరకు 'వెన్నెలదారి', 'రెప్పల వంతెన', 'కాగుతున్న రుతువు' కవితా సంపుటాలు వచ్చాయి.

Leave a Reply