మాటల్లో చెప్పలేనంత బాధ
మనసొక కన్నీటి మహాసముద్రం
నిర్భయ చట్టాలు చేసినా నిర్భయంగా ఆనందిస్తారు
తేనెతాగి విషం కక్కే క్రిములు
మనీషల వెన్నువిరిచి నాలుకలు తెగ్గోస్తారు
ఇప్పుడున్నది ఒకటే రుతువు వీర్య రుతువు
తినడం నిద్రించడం అత్యాచారం సామాన్య కృత్యాలైన వ్యవస్థలో
’రాక్షసుల‘ని నిందించడమెందుకు?
’మృగాల‘ని ‘పశువుల’ని ఉపమించడమెందుకు?
రావణుడైనా కొనగోటితో సీతదేహ వీణను మీటలేదు
కీచకుడైనా ద్రౌపది శరీర పుష్పాన్ని ఆఘ్రాణించలేదు
జంతువులైనా తోటి ప్రాణులపై నీచానికొడిగట్టిన దాఖలాల్లేవు
అక్కలూ చెల్లెళ్లూ అమ్మలూ గుర్తుకురారు
దేహమొక్కటే విశ్వరూపం దాలుస్తుంది
యోని ఒక్కటే సమ్మోహన మోహిని
ఊరించే మాంసపు ముద్దలే డేగ కళ్లక ఆహారాలు
స్త్రీపురుష సమానత్వం వేదికల మీదకే పరిమితమైనపుడు
పిట్ట పురుగుల్ని పొడిచి పొడిచి తిన్నట్లు
ఆయుధాలతో దేహ సామ్రాజ్యంపై దాడిచేస్తారు
కోరిక తీరాక సామ్రాజ్యాన్ని జయించాక
నాలుకతో పనేముంది?
అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుందనా?
పరువు ప్రతిష్టలే హార్మోన్లైనపుడు
బాధితురాలే నేరస్తురాలైనపుడు
కరెన్సీ నోట్ల కన్ను గీటితే నోరుమూసుకుంటుంది న్యాయం
దశాబ్దాలు గడిచినా సాక్ష్యాలు లేవంటుంది కళ్లు లేని దేవత
గుడ్డిదే కాదు తెగిపడ్డ నాలుక ఆమె
శరీరమొక గాయపడిన వస్తువు మనసొక ఆరని చితిమంట
రేపు మరొక లేడిపిల్ల కోసమో కుందేటి కూన కోసమో
ఎక్కుపెట్టిన పురుషాంగంతో వేటాడుతూ నువ్వు…