వాట్సప్ లో వైరల్ అయిన పోస్టుని తెచ్చి ఫేస్ బుక్కులో పెట్టాడొక దేశభక్తుడు!
కరోనా వైరసును మించిన శక్తి దేశభక్తికి వుంది! కరోనా అంటురోగం కావచ్చు, అయితే కరోనాకు దూరంగా వుండొచ్చు! దేశభక్తి అంటురోగం కాకపోవచ్చు, దేశభక్తికి దూరంగా వుండలేం! దేశభక్తిని ప్రకటించకుండా వుండలేం! లేం గాక లేం!
కామెంట్లు కదిలిరాగ దేశభక్తి నదులై ప్రవహించింది! సముద్రమై వుప్పొంగింది! ఉప్పెనై ముంచెత్తింది! అక్కడొక మహావిష్కరణం జరిగింది!
“ఇప్పుడు దేశమంటే ఖచ్చితంగా మతం!”
“మతాన్ని కాపాడుకుంటే దేశాన్ని ఖచ్చితంగా కాపాడుకున్నట్టే”
“ఆ మతం ఖచ్చితంగా హిందూ మతం!”
“”
“అది మన జీవన విధానం!”
“మన జీవన విధానానికి కరోనా కూడా భయపడుతుంది!”
“ఆవు మూత్రము చాలు… అమృతమూ పాలు…”
“హిందువుగా జీవించినా మేలు… మరణించినా మేలు మేలు…”
“మన జీవనవిధానం వల్లనే మన దేశంలో కరోనా ఆటలు సాగడంలేదు… ప్రపంచదేశాలతో పోల్చుకున్నప్పుడు!”
“కరోనా కట్టడి యెప్పుడో జరిగేది, బట్ తబ్లిఘి నిజాముద్దిన్ వల్లనే మరిన్ని కేసులు పెరిగాయి”
“ఒకరా యిద్దరా సోదరా- మొత్తం నాలుగు వేలమంది”
“ప్రాణాలకన్నా వాళ్ళకి వాళ్ళ మత భక్తి యెక్కువ…”
“అలాగని మనల్ని మనం భక్తి విషయంలో తక్కువ చేసుకోనక్కరలేదు సోదరా- వాళ్ళకు దీటుగా అదే టైంలో మనం ఆతుకల్ పొంగల తిరువనంతపురం లక్షమందిమి దర్శించాం. తిరుపతి నలభై వేలమందిమి దర్శించాం. ఇస్కాన్ టెంపుల్ పన్నెండు వేలమందిమి దర్శించాం. ఖోడ్లధం టెంపుల్ ఏడు వేలమందిమి దర్శించాం. పవగాది టెంపుల్ అయిదు వేలమందిమి దర్శించాం. సోమనాథ్ టెంపుల్ అయిదు వేలమందిమి దర్శించాం. ద్వారకా టెంపుల్ మూడు వేలమందిమి దర్శించాం. భద్రకాళి టెంపుల్ రెండు వేలమందిమి దర్శించాం…”
“సత్యం, భక్తి మనకు యెవరికంటే తక్కువ కాదు”
“యస్… కానే కాదు”
“తబ్లిఘి నిజాముద్దిన్ వల్లనే వైరస్ విజ్రుమ్భిస్తోందని లోకం కోడై కూస్తోంది, కుహనా లౌకికవాదులు తప్ప”
“మన మీడియా గ్రేట్”
“రిపబ్లికన్ టీవీ యింకా గ్రేట్”
“అర్నబ్ మాట – మన తుపాకీ తూటా”
“తబ్లిఘిగాళ్ళు తమని సమర్ధించే కుహనా లౌకిక వాదులకు ఆ కరోనా యేదో యిచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది… పీడా పోతుంది”
“డౌట్ లేదు మిత్రమా- అందరికీ అంటిస్తారు…”
“మనం వాళ్ళని యెట్లా కట్టడి చేస్తాం?”
“దేశ విదేశాలనుండి వచ్చి మత ప్రార్ధనలు చేసారంటే ఫైనాన్సియల్ గా స్థిరం అవుతున్నారని అర్థం చేసుకోవాలి. కట్టడికి పునాదిగా ఆ విషయం ముందు ఆలోచించాలి”
“అందుకే కదా ఈ పోస్ట్! హిందూ వ్యతిరేకులతో వ్యాపారం బహిష్కరిద్దాం! నేను రెడీ, మీరు రెడీనా?”
“రెడీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ… ఢీ…”
“హిందువునైన నేను హిందువుల వద్దే ఏదైనా కొంటాను!”
“గుడ్… యిది శిలా శాసనం”
“ఆ శాసనాన్ని మన రాజ్యాంగంలో చేర్చాలి!”
“మనదేశం హిందూ రాజ్యం అయ్యాక అదెంత పని?”
“ఆ దిశగానే యిప్పుడు మన పాలక పెద్దలు చాలా బాగా కష్టపడుతున్నారు”
“ఉయ్ సపోర్ట్… CAA, NRC, NPR”
“భారత్ మాతాకీ జై!”
“కులం ఏదైనా సాటి హిందువుకే నా సహకారం. తోటి హిందువుతోనే నా వ్యాపారం”
“అలా అని కుల ధర్మం పాటించకపోతే చాతుర్వర్ణ వ్యవస్థను కాపాడుకోలేము మిత్రుమా!”
“అనేక కులాలు వొక్కటే మతం. అదే మనం. భిన్నత్వంలో ఏకత్వం”
“నేను నా దేహాన్నైనా ముక్కలు కానిస్తాను కానీ నా దేశాన్ని ముక్కలు కానివ్వను!”
“దేశద్రోహులకు సహకరించను, జీహాదీ గ్యాంగులను ప్రోత్సహించను”
“ఎవరు దేశ ద్రోహి?”
“మనమతం కాని ప్రతివాడూ పరాయివాడూ దేశద్రోహే!”
“మరి మనమతంలో వుండి సర్వమత సమానత్వం అంటూ పరాయి మతాన్ని వెనకేసుకు వచ్చేవాడు?”
“దేశద్రోహి మాత్రమే కాదు, హంతకుడిగా పరిగణించాలి… ఉగ్రవాదిగా ప్రకటించాలి!”
“ఉరి తియ్యాలి”
“నా ప్రతి రూపాయి దేశం హితం కోసమే!”
“నా రూపాయి కూడా”
“ఇప్పుడు దేశమంటే ఖచ్చితంగా మతం!”
“మతాన్ని కాపాడుకుంటే దేశాన్ని ఖచ్చితంగా కాపాడుకున్నట్టే!”
“ఆ మతం ఖచ్చితంగా హిందూ మతం!”
“ఓం!”
“మన నమ్మకం పట్ల గౌరవం లేని వ్యాపారులకు నా రూపాయి ఖచ్చితంగా పోనివ్వను”
“పోనివ్వం… అందరిదీ వొకే మాట”
“ఒకేమాట… ఒకే భార్య… ఒకే బాణం… రాముడు మనకు ఆదర్శం!”
“జై శ్రీరామ్!”
“ప్రతి రూపాయి పోకూడదంటే ఆపనీ ఈపని అనకుండా ప్రతి పనీ మనమే మనవాళ్ళే చేసుకోవాలి”
“యస్… మనమే వాళ్ళకు ప్రత్యామ్నాయం కావాలి!”
“ఔను, అప్పుడు హిందువు హిందువు దగ్గరే సర్వీస్ తీసుకుంటాడు. కస్టమరుగా వుంటాడు”
“అలా వుండాలంటే వాళ్ళు చేస్తున్న వృత్తులను వుపాదులను గుర్తించి అందులోకి మనం ప్రవేశించాలి!”
“సిద్ధం చేద్దాంరా ఢింభకా”
“సీరియస్”
“సారీ”
“వాళ్ళు ప్రధానంగా మెకానిక్లుగా వున్నారు. ఆపరేటర్లుగా వున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారు”
“ముఖ్యంగా పండ్ల మార్కెట్ వాళ్ళదే”
“ఫ్రూట్ మార్కెట్టే కాదు, ఫ్లవర్ మార్కెట్టూ వాళ్ళదే”
“పూలూ పళ్ళూ అంటారు, ఈ కరోనా కాలంలో కనీసం ఒక బ్రెడ్ ధైర్యంగా తినగలమా?”
“అందుకే మనవాళ్ళని పోటీగా తయారు చేసేద్దాం”
“బిర్యానీ సెంటర్స్ వాళ్ళవే”
“చికెన్ మటన్ దుకాణాలన్నీ ఆల్లవే”
“చికెన్ మటన్ షాపులు మనమే పెట్టేద్దాం”
“కాదంటే మనవాళ్ళతో పెట్టిద్దాం!”
“మనం ఏదీ వాళ్లకు వదలకూడదు… ప్రతి రూపాయి పోకూడదు”
“నేను చికెన్ మటన్ షాపులు పెట్టడానికి రెడీ”
“గురువుగారు చాన్నాళ్ళుగా ప్లానుతో వున్నట్టున్నారు”
“మంచి పేరు చెప్పండి మహాశయా… దుకాణానికి”
“మన షాపులకు మన మతం గుర్తులూ పేర్లూ వుండాలి. కోర్టు సమస్యలు వస్తాయంటే అందుకు సింబల్ గా వున్న మన పెద్దల పేర్లతో- మన మత సేవకుల ప్రముఖుల పేర్లతో- ఓపెన్ చెయ్యాలి. చూడగానే మన కస్టమరుకు మన మతం గుర్తుకు రావాలి. దానికదే వొక బ్రాండ్ లాగ చెప్పకుండానే టక్కున స్పురించాలి!”
“వీలయితే మన రంగుని వాడాలి, యూనిఫామ్ గా”
“మనకు కాషాయం… ఇతరులకు కషాయం!”
“ఇదే వేదం… వైద్యం… దేశానికి నైవేద్యం”
“ఇంతకీ నా చికెన్ మటన్ షాపులకు పేరు సూచించలేదు?”
“ఆది శంకర చికెన్ షాప్”
“నేను వైన్ షాప్ పెట్టాలని అనుకుంటున్నా, కాని మా ఏరియాలో శ్రీశ్రీ వైన్ షాప్ వుంది. దానికి దీటుగా పేరు చెప్పండి?”
“విశ్వనాధ…”
“సాహిత్యం చచ్చుబండ వద్దు. ఆపేర్లు యిప్పుడు యెవరికీ తెలీవు”
“యస్… క్యాచీగా వుండాలి… కాన్టెంపరరీగా వుండాలి”
“సాయిబాబా వైన్ షాప్”
“అబ్బో ఆ పేరుతో బోలెడు వున్నాయండీ”
“వివేకానందా?”
“మా ఏరియాలో వివేకానంద వైన్స్ వుంది”
“మీరు యెవరిని బాగా నమ్ముతారో ఆ పేరు పెట్టేయండి”
“నేను శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజియ్యరు స్వామి వారినే నమ్ముతాను”
“ఇంకేం… సుభస్తు శ్రీఘ్రం… ఆ పేరుతో చికెన్ షాపు పెట్టండి”
“చినజియ్యరు స్వామి చికెన్ షాపా?”
“మొదట్లో అలా వుంటుంది, అలవాటయితే అదిరిపోతుంది సోదరా”
“మీకొద్దయితే ఆపేరు నాకిచ్చేయండి”
“ఆల్రెడీ రిజర్వుడు యిక్కడ!”
“బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి పేరుతో నేను మటన్ షాపు పెడుతున్నా, యెవరూ కాదన కూడదు”
“అయ్యా… మీ తర్వాతే మేం”
“స్వామి పరిపూర్ణానంద హెయిర్ సెలూన్”
“వచ్చి రిబ్బను కూడా కట్ చేస్తారు, ఆయన హిందూమతం కోసం ప్రాణమిస్తారు, ఆఫ్ట్రాల్ పేరు యివ్వరా?”
“అయ్యా… వెధవది నాన్ వెజ్ వాసన వేస్తోందండీ”
“తప్పదండీ… మన అగ్రవర్ణాలన్నీ కలిపి పదిహేను శాతమే, మిగతావాళ్ళంతా దళిత బీసీలే, ఎయిటీ ఫైవ్ పర్సెంటు కస్టమర్స్ వాళ్ళే”
“యస్… నేనో ఫిష్ సెంటర్ మా బామర్ది పేరుతో పెడదామని…”
“కంగ్రాట్స్”
“నిత్యమూ కళకళలాడడానికి నిత్యానంద స్వామివారి పేరు?”
“మార్కెట్ డౌన్… పడిపోతుంది”
“ఇన్ని మఠములూ పీఠాలూ వున్నాయి, వెధవది ఏ పీఠాధిపతి పేరు పెడితే యెవరు కాదన్నారు?”
“మన మత ఉద్దారకులు జొన్నవిత్తుల గరికపాటి నుండి జయేంద్ర సరస్వతులదాక ఎంతమంది లేరు?”
“వ్యాపారాలన్నీ మనమే చేయక్కర్లేదు, చేసిన మిగతా మన వాళ్ళతో చెప్పి హిందుత్వం ప్రతిఫలించేలా వుంటే బెటరు”
“ఆచార్యా… రూపాయికి వందపైసల మాట చెప్పారు”
“మన ప్రతి పైసా మనకే దక్కాలి!”
“మనం ఈ విషయంలో యోగీ ఆదిత్యానాథ్ గార్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన ఏకంగా నగరాలూ పట్టణాలు పేర్లు మార్చేసి వీరోచిత నిర్ణయం తీసుకున్నారు… అమలు చేస్తున్నారు!”
“మనమూ ఆ మార్గంలోనే వున్నాం”
“మన చర్చ చూస్తే ఖచ్చితంగా యోగిగారు మనల్ని ఫాలో అయిపోతారు!”
“వీరసావర్కరే సాక్షి”
“గాడ్సే జిందాబాద్ ”
…………………….
వ్యూ మోర్ కామెంట్స్…
…సమ్ వన్ ఈజే టైపింగ్ ఎ కామెంట్…
రైట్ ఎ కామెంట్…
కామెంట్స్ కావ్యమై పరుగులెత్తుతూనే వుంది!
(మిత్రుడు తమ్మినేని రామారావుకు కృతజ్ఞతలతో)
చక్కగా అంటించారు. బాగుంది.