క్యూబా దేశం నుండి, ఒక సామాన్యమైన మహిళ ప్రపంచానికి రాసిన  ఒక బహిరంగ లేఖ!

సమస్త మానవాళికి, ప్రపంచంలోని తల్లులకు, సంక్షోభకాలంలో సరిహద్దులు పాటించని డాక్టర్లకు, గౌరవనీయులైన పాత్రికేయులకు, న్యాయాన్ని విశ్వసించే ప్రభుత్వాలకు క్యూబన్ మహిళా విజ్ఞప్తి:

నా పేరు లక్షలాది మంది పేర్ల లాంటిదే. నాకు ప్రసిద్ధమైన ఇంటిపేరు గానీ, ముఖ్యమైన బిరుదు గానీ లేదు. నేను ఒక సాధారణ క్యూబన్ మహిళను. ఒక కుమార్తెను, ఒక సోదరిని, ఒక దేశభక్తురాలిని. విరిగిన మనసుతో, వణుకుతున్న చేతులతో నేను ఇది రాస్తున్నాను, ఎందుకంటే ఈనాడు నా క్యూబన్ ప్రజలు అనుభవిస్తున్నది ఒక “సంక్షోభం” కాదు. ఇది నెమ్మది, నెమ్మదిగా – వాషింగ్టన్ నుండి ఒక పథకం ప్రకారం, నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్న హత్యలు.
కానీ ప్రపంచం దృష్టి మరోవైపుకి మరల్చబడింది.

నా తాతలు – నాన్నమ్మ, అమ్మమ్మల తరఫున నేను దీన్ని ఖండిస్తున్నాను:
క్యూబాలో, దిగ్బంధనం కారణంగా గుండె జబ్బుల మందులు, రక్తపోటు మాత్రలు, మధుమేహ చికిత్సలు అందకుండా అడ్డుకుంటున్నందువల్ల, వృద్ధులు అకాల మరణం చెందుతున్నారని నేను ఖండిస్తున్నాను. ఇది వనరుల కొరత కాదు. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా నిషేధిస్తున్నారు. క్యూబాకు తమ ఉత్పత్తులను అమ్మాలనుకునే కంపెనీలకు జరిమానాలు విధిస్తున్నారు, వారిని వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. వారి ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయి. ఇంతలో, ఒక క్యూబన్ తాత తన ఛాతీని పట్టుకుని ఎదురుచూస్తున్నాడు. మృత్యువు హెచ్చరిక ఇవ్వదు. దిగ్బంధనం ఇస్తుంది.

నా పిల్లల తరపున నేను దీన్ని ఖండిస్తున్నాను:
ఇంధనం లేకపోవడం వల్ల క్యూబాలోని ఇంక్యుబేటర్లను ఆపివేయవలసి వచ్చిందని నేను ఖండిస్తున్నాను. ఏ దేశాలు మాకు చమురు అమ్మవచ్చో, ఏవి అమ్మకూడదో అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తుండగా, నవజాత శిశువులు ప్రాణాల కోసం పోరాడుతున్నారని నేను ఖండిస్తున్నాను. తమ తీరానికి 90 మైళ్ల దూరంలో ఉన్న ఒక మానవ శిశువు ఏడుపు కంటే, వాషింగ్టన్‌లోని ఒక కార్యాలయంలో సంతకం చేసిన ఒక ఆజ్ఞ, ఎక్కువ విలువైనది కావడం వల్ల, తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడటాన్ని చూసిన క్యూబన్ తల్లులు అలమటిస్తున్నారని నేను ఖండిస్తున్నాను. బాల్యాన్ని అంత ఆర్ధ్రంగా రక్షించే సంస్థలు గానీ, అంతర్జాతీయ సమాజాలు గానీ ఎక్కడ ఉన్నాయి? లేకపోతే క్యూబన్ పిల్లలు బ్రతకడానికి అర్హులు కాదా?

కావాలనే ఉద్దేశపూర్వకంగా క్రూరంగా సృష్టించే ఆకలిని నేను ఖండిస్తున్నాను:
ఈ దిగ్బంధనం ఒక ప్రణాళికాబద్ధంగా సృష్టిస్తున్న ఆకలి అని నేను ఖండిస్తున్నాను. ఆహారం ఊరికే అందుబాటులో లేకుండా పోవడం కాదు. దాన్ని కొనకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఆహారాన్ని తీసుకువచ్చే ఓడలను వేటాడుతున్నారు. బ్యాంకు లావాదేవీలను నిరోధిస్తున్నారు. మాకు ధాన్యం, కోడి మాంసం, పాలు అమ్మే కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నారు.

క్యూబాలో ఆకలి అనేది యాదృచ్ఛికమైనది కాదు. ఇది అమెరికా ప్రభుత్వపు దుష్ట విధానం. దీనిని 60 ఏళ్లుగా మెరుగుపరుస్తూ, ప్రతి ప్రభుత్వంలోనూ నవీనీకరించి, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో మరింత తీవ్రతరం చేయగా, దాన్ని మార్కో రూబియో దురుద్దేశంతో అమలు చేస్తున్నాడు. దీనికి వారు “ఆర్థిక ఒత్తిడి” అని తప్పుడు పేరు పెట్టారు. కానీ నేను దీనిని ఆకలి ద్వారా చేసే ఉగ్రవాదం అని పిలుస్తాను.

మా వైద్యుల తరపునుంచి నేను దీనిని ఖండిస్తున్నాను:
ప్రపంచమంతా కుప్పకూలుతున్నప్పుడు, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడిన మా వైద్యుల వద్ద ఈ రోజు సిరంజిలు, అనస్థీషియా, ఎక్స్-రే పరికరాలు ఏవీ లేవని నేను ఖండిస్తున్నాను. వాటిని ఎలా ఉత్పత్తి చేయాలో మాకు తెలియక కాదు. మాకు ప్రతిభ లేక కాదు. కానీ దిగ్బంధనం కారణంగా మాకు అవసరమైన వస్తువుల సరఫరాలు, విడి భాగాలు, సాంకేతికత అందకుండా పోతున్నాయి.

మా శాస్త్రవేత్తలు, ఎవరి సహాయం లేకుండా, అన్ని ప్రతికూలతలకు, దిగ్బంధనానికి, అబద్ధాలకు వ్యతిరేకంగా ఐదు రకాల కోవిడ్-19 వ్యాక్సిన్‌లను సృష్టించారు. అంతటి ఘన విజయాలను సాధించినందుకు ఓర్వలేని ఈ సామ్రాజ్యం మమ్మల్ని శిక్షిస్తోంది.

ఈ ప్రపంచానికి నేను చెప్పదలచుకున్నది:
క్యూబా ప్రపంచంలోని మిమ్మల్ని భిక్ష అడగడం లేదు.
క్యూబా మిమ్మల్ని సైనికసహాయం ఇమ్మని కోరడం లేదు.
క్యూబా మమ్మల్ని ప్రేమించమని ప్రపంచ ప్రజలందర్నీ అడగడం లేదు.
క్యూబా మిమ్మల్ని న్యాయ సహాయం కోసం అర్ధిస్తోంది. అంతకు మించి ఎక్కువ ఏమీ అడగడం లేదు.
మా ప్రజల బాధలను సీరియస్ గా తీసుకోమని, సాధారణీకరించడం ఆపమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

దిగ్బంధనాన్ని దాని అసలు పేరుతో పిలవమని, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాన్ని ప్రతిఘటించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను:
వారు మా మెడలకు ఉరి బిగిస్తున్న సమయంలో “సంభాషణ” , “ప్రజాస్వామ్యం” అనే కథలతో మోసపోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
మాకు దానధర్మాలు వద్దు. మమ్మల్ని జీవించనివ్వాలని మేము కోరుకుంటున్నాము.

మౌనంగా ఉండి, ఈ నేరంలో భాగస్వాములైన ప్రభుత్వాలకు: చరిత్ర మిమ్మల్ని జవాబుదారీగా చేస్తుందని హెచ్చరిస్తున్నాము.
అబద్ధాలు చెప్పే మీడియాకు: సత్యం ఎప్పుడూ నిగ్గు దేల్చి దాని పగుళ్లను కనుగొంటుందని తెలియజేస్తున్నాము.
మాకు విధిస్తున్న ఆంక్షలపై సంతకాలు చేసే హంతకులను: క్యూబా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరు.

ఇంకా తమ హృదయాల్లో మానవత్వం నిలుపుకున్నవారికి:
క్యూబా వైపు చూడండి. మా దేశానికి వాళ్ళు ఏమి చేస్తున్నారో చూడండి: నేను చరిత్రలో ఏ పక్షాన ఉండాలనుకుంటున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ చిన్న ద్వీపం నుండి, విశాలమైన జనాభా మధ్య, లొంగిపోవడానికి నిరాకరించే ఒక సాధారణ క్యూబన్ మహిళను గుర్తు తెచ్చుకోండి.

ఈ సందేశం మీలో ఏదైనా కదలికను కలిగించి ఉంటే, దీన్ని పంచుకోండి.
మీకు 10 మంది స్నేహితులు ఉన్నారా లేదా 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారా అనేదాన్ని నేను పట్టించుకోను.
మీ వాల్ పబ్లిక్‌గా ఉందా లేదా ప్రైవేట్‌గా ఉందా అని కూడా నేను పట్టించుకోను.
మీరు ఎప్పుడూ ఏదీ ఎవరికీ పంచుకోని వారయినా సరే నేను పట్టించుకోను.

కానీ ఇది అన్ని విషయాలకంటే భిన్నమైనది, పట్టించుకోవాలసిన విషయం!
ఇది సూర్యాస్తమయం ఫోటో కాదు.
ఇది సెలబ్రిటీ వార్తలకు సంబంధించినది కూడా కాదు.
ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు.
ఇది ఒక ఆక్రందన. ఆక్రందనల హాహాకారాలను అణచిపెట్టుకోకూడదు. అవి వినబడాలి. అవి ప్రతిధ్వనించాలి. అవి ఒక సమూహంగా మారాలి.
ఈ రోజు నేను ఒక ‘లైక్’ అడగడం లేదు.

స్క్రోలింగ్ కంటే గొప్పదైన దాని కోసం మీ బొటనవేళ్లను ఉపయోగించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. షేర్ చేయండి
క్యూబాలో ఘోరమైన సంక్షోభాన్ని మించినది ఉందని ప్రపంచానికి తెలియాలి.
అక్కడ జరుగుతున్నది ఒక నేరం.
దిగ్బంధనం వల్ల ఆపివేయబడిన ఇంక్యుబేటర్లలో పసికందులు పోరాడుతున్నారని ఇతర దేశాల తల్లులకు తెలియాలి.
వాషింగ్టన్ అనుమతించని మందుల కోసం ఎదురుచూస్తూ వృద్ధులు చనిపోతున్నారని ఇతర దేశాల తాతయ్యలకు తెలియాలి.
ఈ కుట్రలో భాగస్వాములైన ప్రభుత్వాలు సిగ్గుపడాలి.
అబద్ధాలు చెప్పే మీడియా సంస్థలకు తప్పించుకునే మార్గం లేకుండా పోవాలి.
మమ్మల్ని మౌనంగా ఉంచలేరని హంతకులకు తెలియాలి.
ఒక్క వ్యక్తి దీన్ని పంచుకోవడం వల్ల ప్రపంచం మారదు.
వేల, లక్షల మంది పంచుకుంటారు.
ఈ సందేశాన్ని దాచిపెట్టవద్దు.
ఈ మౌనానికి సహకరించవద్దు.
ఈ ఖండనను దిగ్బంధనాన్ని దాటి ముందుకు తీసుకువెళ్ళండి.
షేర్ చేయండి. ఇప్పుడే.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply