కుల నాగు

కడుపులో ఉన్న పిండాన్ని మాట్లాడుతున్నా
వైరల్ అవుతున్న రక్త మాంసాల ముద్దనై

నెత్తుటి గుహను చీల్చుకొని లక్ష బొట్ల వీర్యం వీరంగమాడి
అండం పిండంగా మారిన రోజు నీకు గుర్తుందా?
నేనప్పుడు మాలిన్యంలో మెలికలు తిరుగుతున్న మానవత్వపు పరిమళాన్ని

కడుపు చీల్చుకొని పుడుతూనే వంశం నను ముద్దాడింది, వంశోద్ధారకునివని
అంటుముట్టు మైల తొలిగిన పురుడుల నాకు కులగోత్ర నామాలొచ్చినయి
మంగళి బాలమ్మ తవ్వ ఎగరేశి తూటు పైసను గలగలలాడిస్తున్నప్పుడు

నెత్తుటి గుడ్డునై రక్త కల్లంల తారాడిన నాడు
అది అంటరాని మాయి నా బొడ్డు పేగు

తల్లి రొమ్ముల గడ్డలు పుట్టి నెత్తుటి పుండ్లయ్యి సలుపుతున్నప్పుడు
ఎనుబోతుల తోలు నానేసిన తంగెడు లంద సుట్టూ
ఎర్రమన్ను పూతేస్తున్న పెద్ద మేతరి పెండ్లం మాదిగ ఆశవ్వ సన్ను ధార
ఎన్ని గడియలు కడుపుల కుతిని దీర్శిందో పూట పూటకు
కుల దీపకుడువన్న సార్ధక నామం నిత్యం గండ్ర గొడ్డలై నరుకుతుంటే
అవుసలి సోమయ్య కాలికి మెట్టెలెక్కిచ్చంగ
ఐరేణి కుండల మీద గడి కుడకల పోలు దిరిగిన మైలపోలు కులం
అద్భుత శ్రమ జీవన సౌందర్యం ఒకనాడు!

నేడది కాలకూటం! మిన్నాగుల మొగిలిపొద
మనిషి తత్వాన్ని వస్త్ర గాయం చేసి మింగుతున్న రాజకీయ ఎత్తుగడల ఆఖరి అస్త్రం!!
దూదేకుల సిద్ధప్పా.. ఏ కులం బని ఎరుకతో నన్నడిగితే…
ఒకటికి పదిమ్ములనూరు వేల లక్షల కోట్లు గర్భ యోనుల యందు ఉద్భవించిన వాడు
ఏ ముఖం పెట్టుకొని పాడమంటావ్ ఈ కులగీతికని
రక్తపిపాస రాజ్యపు నాలుక మీద మండుతున్న కర్పూర దీపాన్ని ఉప్పున ఊది
అడవి పాలనకు – అసెంబ్లీకి – పార్లమెంటుకు అంతర్మధ్యాన భగ్నం చెయ్యు సాధనానుర
ఇది నా ఆజ్ఞ !
మొండి గోడల మీద గుండెలు దీసిన మిండెల సహవాసియై చరిస్తున్న కులమా
నేనిప్పుడు కటారుతో సకల రాజ్యాంగాల్ని మున్నూట పదారు లింగాలకు సుట్టుకొని బైలెల్లిన
నా ఉమ్మనీటి వాడల నుంచి తొలగిపొమ్ము…

జననం: బ్రాహ్మణ వెల్లెంల, నార్కెట్ పల్లి మండలం, నల్లగొండ జిల్లా. కవి, రచయిత.  విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకుడు. రచనలు: నరమాంస భక్షణ(దీర్ఘ కవిత), కైవారం.

Leave a Reply