గ్వాటెమాల కి చెందిన మిగెల్ ఆంజెల్ ఆస్టూరియాస్ కవి, నవలాకారుడు,నాటక కర్త మరియు పాత్రికేయుడుగా ప్రఖ్యాతి చెందారు. అతని తల్లిదండ్రులు ఎర్నెస్టో ,మరియా లు. తండ్రి లాయర్ గా, జడ్జిగా పనిచేశారు .కొందరు విద్యార్థులను ఉద్యమంలో పాల్గొన్నా అరెస్టు చేయకుండా వదిలిపెట్టినందుకు నాటి నియంత కాబ్రేరాకు వ్యతిరేకమయ్యారు.ఫలితంగా కుటుంబం అంతా 1904 లో సలామ అనే ప్రాంతానికి వలస వెళ్లారు .తరువాత1908 లో తిరిగి గ్వాటెమాల నగరం చేరారు. మిగెల్ ఆంజెల్ ఆస్టూరియాస్ వ్యతిరేకంగా విద్యార్థి పోరాటాలలో చురుకైన పాత్ర వహించారు. 1923లో లా డిగ్రీ తీసుకున్నారు. మధ్యలో అర్బెంజ్ ప్రభుత్వ పాలనతో పౌరసత్వం పోయి ఎనిమిది ఏళ్ల పాటు ప్రవాసం, తిరిగి మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మోంటెనెగ్రో గెలిచిన తర్వాత స్వదేశం వచ్చి పౌరసత్వం పొంది రాయబారిగా పని చేశారు.
ఆస్టూరియాస్ రచనల్లో “లెజెండ్స్ ఆఫ్ గ్వాటెమాల,” “ది ప్రెసిడెంట్,” “మెన్ ఆఫ్ మైజ్” అనే రచనలు ముఖ్యమైనవి. ‘ది ప్రెసిడెంట్’ నవలలో స్పానిష్ వలస , స్వాతంత్ర్య అనంతర కాలంలో రాజకీయ నియంతృత్వానికి వ్యతిరేకంగా రాశారు.. మాయా జాతి బైబిల్” గా పెరుగన్న “Popol Vuh” అనే గ్రంథ అనువాద ప్రాజెక్టుపై నలభై ఏళ్లు శ్రమించారు. తన జీవితానుభవాలు, ఆంథ్రోపాలజీ లోని అంతర్దృష్టి తో “మెన్ ఆఫ్ మైజ్” (Men of Maize) నవల వచ్చింది. “స్ట్రాంగ్ విండ్,” “ద గ్రీన్ పోప్,” “ది ఐస్ ఆఫ్ ది ఇంటర్డ్, ” అనే మూడు పుస్తకాలలో అరటి తోటల్లో ఇండియన్స్ పై అమెరికాకు చెందిన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ దోపిడీకి వ్యతిరేకంగా రాసినందుకు 1966లో సోవియట్ యూనియన్ నుంచి లెనిన్ శాంతి బహుమతి , 1967లో నోబెల్ బహుమతి ఆయనకు లభించాయి.
మిగెల్ ఆంజెల్ ఆస్టూరియాస్ జీవితంలో చాలా భాగం నియంతలైన కాబ్రేరా , ఉబికో అనే నియంతల పాలనలో గడిచింది. మధ్యలో పారిస్ లో గడిపిన 10 సంవత్సరాల లో సర్రియలిస్టు , అవాగార్డు(ప్రయోగాత్మక) ఉద్యమాలకు దగ్గరగా ఉన్నాడు. El imparcial అనే ప్రగతిశీల పత్రికను కూడా కొంతకాలం నడిపాడు.
గ్వాటెమాల రచయిత ఆస్టూరియాస్ నవల “మెన్ ఆఫ్ మైజ్” (1949)ప్రకృతికి నివాళిగా రాసిన నవల. ఇండియన్స గా పిలువబడే జాతి , స్త్రీపురుషుల మధ్య పోరాటాలు సమస్త ప్రకృతికి మనిషికి గల బంధాన్ని అభివృద్ధి పేరిట నాశనం చేయకూడదు అనే వివేకం కలిగిస్తుంది. ఈ నవలను “మాయా బైబిల్” అని చెప్పబడే “Popol Vuh” తరువాత ముఖ్యమైన రచన అని ప్రముఖ విమర్శకుడు గెరాల్డ్ మార్టిన్ రాశాడు. ఈ పుస్తకాన్ని రచయిత దాదాపు 30 ఏళ్ల పాటు సాంస్కృతిక కోణంలో పాత పద్ధతులను లేదా వస్తువులను తీసుకుని వాటికి సరికొత్త అర్థాన్ని ఇచ్చే ‘బ్రికోలేజ్’ రీతిలో రచించాడు.
ఈ నవలకు మార్టిన్ రాసిన ఉపోద్ఘాతం ఒక అద్భుతమైన విశ్లేషణ గా చెప్పవచ్చు. “మెన్ ఆఫ్ మైజ్”పుస్తకంలో ఆరు భాగాలు ఉన్నాయి .మొదటి భాగంలో మాయా ఇండియన్ గిరిజనులు గాస్పర్ ఇలాం నాయకత్వంలో తమ పూర్వీకుల జన్మభూమిని కాపాడుకునేందుకు, వ్యక్తిగత ఆస్తి, మార్కెట్ శక్తులు, పెట్టుబడిదారీ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతారు . 19వ శతాబ్దము చివరిలో లిబరల్ ప్రభుత్వం పెట్టుబడి దారి వ్యవసాయం కోసం మూలవాసుల ప్రాంతాల పై చేసిన అణచివేతను చూపిస్తుంది . 1980 లలో రెండు లక్షల మంది పైగా మాయా ఇండియన్ జాతి వారు హత్యకు గురైనారు. వాస్తవానికి 1520ల లోనే స్పానిష్ వలసవాదులు వచ్చి మాయా నాగరికతను ధ్వంసం చేశారు.
రెండు నుంచి నాలుగు భాగాల్లో ఇండియన్ కుటుంబానికి చెందిన తెకూన్ మరియు ప్రభుత్వ శక్తుల మధ్య పోరాటం జరిగి , తెగవారికి తాత్కాలిక విజయం వచ్చి ,కొంతవరకు మొక్కజొన్నపై ఆధారపడిన సాంస్కృతిక సంస్కృతిని కాపాడుకోగలుగుతారు. ఐదవ భాగం లో కొన్ని శతాబ్దాల తరువాత దశలో ఆదిమ -వర్గ సమాజాలకు ,మౌఖిక - లిఖిత సంస్కృతు లకు, ప్రకృతిపై ఆధారపడిన మతం మరియు దానికి భిన్నంగా మంచి, చెడులు పై ఆధారపడిన క్రిస్టియన్ మతాల మధ్య సంధి కాలంగా చూడవచ్చు. ఆరవ భాగంలో గత చరిత్ర విస్మృతమై పురాణాలు , గాధలు , జానపద పాటలుగా పరిరక్షించబడి భిన్న దృక్పధాల ద్వారా కథ చెప్పబడుతుంది
నవలలో మాయా ఇండియన్ల నాయకుడు గాస్పర్ ఇలోమ్ దృష్టిలో మొక్కజొన్న తినటానికి వేయడం అయితే మొక్కజొన్నతో తయా రైన వారి పవిత్రమైన మనుగడకు ఉపయోగపడుతుంది. డబ్బు కోసం అయితే అది కరువు తెచ్చిపెడుతుంది . అందుకే గాస్పర్ ఇలోమ్, అతని అనుచరులు మొక్కజొన్న వేసే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. అతడ్ని చంపటానికి కల్నల్ ఇచ్చిన విషాన్ని టోమాస్ , అతడి భార్య వాకా మాన్యుల మాయా ఇండియన్సు నాయకుడు గాస్పర్ ఇలోమ్ కి మద్యంతో కలిపి ఇస్తారు.
గాస్పర్ భార్య రానున్న కీడును గ్రహించి కొడుకుతో సహా పారిపోగా, విషం తీసుకున్న గాస్పర్ నది నీళ్లు బాగా తాగి బతికినా కూడా తన సహచరులందరూ నరమేధానికి గురి కావడంతో తాను కూడా నదిలో దూకి చనిపోతాడు .అయితే శాపం తగిలి టోమాస్ ఏకైక వారసుడు మాకోజన్ ఒక గుర్రంపై క్యాండిలారియ అనే వనితతో వివాహం కోసం వెళ్లి దారిలో మిణుగురు పురుగులు కమ్మి జాడలేకుండా పోతాడు. దానితో వెర్రెక్కినట్లు అయి అతడి తండ్రి మొక్కజొన్న పొలాలని తగలబెడతాడు .దీన్ని చూసి వచ్చిన సైనికులను అతడి భార్య వారి కల్నల్ ను తమ బాధలకు మూలమని నిందిస్తుంది . ఇది సహించని సైనికులు ఆమెను ,ఆమె సేవకులను హతమారుస్తారు .అటు టోమాస్ కూడా కొడుకు లాగే నామరూపాలు లేకుండా పోతాడు.
తెకూనే తెగకు చెందిన ఒక తల్లి జబ్బు పడుతుంది. దీనితో ఆందోళన గురైన ఆమె పిల్లలు ఒక వైద్యున్ని పిలుస్తారు .ఆ వైద్యుడు మాటలు విని కుమారులు వెళ్లి జకాతన్ తెగ తలలు తరాలు నరికి తెస్తారు. సోదరులలో ఒకడైన గౌడెన్సియో ఒక జింకను కాల్చి చంపితే ఆ అంశతో తిరిగే వైద్యుడు కూడా చనిపోతాడు. అంతకుముందు ఆ వైద్యుడి మందు తాగి తల్లికి హాని చేసిన వారి గురించి చెప్పిన, పిచ్చి పట్టిన మరో సోదరుడు కాలిస్ట్రో తిరిగి మామూలు మనిషి అవుతాడు.
కల్నల్ గోడోయ్ తన కింద అధికారులను అవమానిస్తూ , పెత్తనం చేస్తూ ఉంటాడు . అతడు అంతకుముందు ఎంతోమందిని ఇండియన్ తెగ వారిని , వారి నాయకుడు గాస్పర్ తో సహా నిర్మూలిస్తాడు. చివరికి ‘ది ఎర్త్ షేకర్’ అనే ప్రాంతం దగ్గర అతడు, అతడి సైనికులు తెకూనే తెగ వారి చేతుల్లో , నిప్పుల్లో నిర్జీవమవుతారు.
అలాగే తన భార్య మరియా తెకూనే అన్వేషణలో గోయో ఇక్ అనే గుడ్డి ఇండియన్ బిచ్చగాడు చిరు వర్తకుడుగా, చేతకాని సారా అమ్మకందారు గా చివరకు ఖైదీగా మారుతాడు. జైలు పాలు అయిన గోయో ఇక్ చాలా కాలం తర్వాత ఒక దీపంలోనీ జైలుకు తరలించబడి, కొంత కాలం తర్వాత తన కొడుకును అక్కడే కలుసుకుని , భార్య సాయంతో బయట పడతాడు. తన సమాజ సంప్రదాయాలతో , గత వర్తమానాల మిళితమైన మొక్క జొన్న పంట కు చేరువ అవుతాడు.
ఈ నవలలో శాన్ మిగెల్ అకాటన్ పట్నంలో ఒక పోస్ట్ మాన్ నీకో అక్వినో తన భార్య తన నుంచి వెళ్ళిపోతే ఆమెను వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో అడవి కుక్క గా మారి , ప్రకృతి శక్తులతో సాన్నిహిత్యం చెంది , మనుషులలోని జంతు అంశాలను (nahuals) కనుగొనడం చూడచ్చు. దీనిని వలస వ్యవస్థ అంటగట్టిన పనులను తిరస్కరించడం లాగా కూడా చూడవచ్చు.ఈ పోస్ట్ మాన్ జనం ఉత్తరాలు , డబ్బు , తన ప్రాణాన్ని కోల్పోతాడనే ఆలోచనతో ఇతడిని వెతుక్కుంటూ వెళ్ళిన హిలారియో పలు అనుభవాలు ఎదుర్కొని ఒక బార్ యజమానురాలితో స్థిరపడి ఆమె ఆస్తికి వారసుడు అవుతాడు. పోస్ట్ మాన్ నీకో చివరకు తన భార్య తన్ను వదిలిపోలేదని , ఒక నేల బావిలో పడి చనిపోయిందని, ఎవరూ చూడ లేదని తెలుసుకుంటాడు. తాను పశ్చాత్తాపం చెందుతాడు.
ఈ నవల గ్వాటెమాల చారిత్రిక దశలకు అర్థం పడుతుంది .ఈ నవలను కొంత వరకు “ది వేస్ట్ లాండ్” కావ్యంతో కూడా పోల్చవచ్చు. అయితే టీ ఎస్ ఇలియట్ ఆధునిక కాలంలో క్రిస్టియానిటి ఆత్మ తిరిగి నెలకొనడం లో విముక్తి చూస్తే , “మెన్ ఆఫ్ మైజ్” నవల ప్రకృతి సహజాతాలపై ఆధారపడిన మాయా నాగరికత కోసం , ఆధునిక నాగరికత అణచివేత కు వ్యతిరేకంగా రాయబడింది.ఇది ఒక ఉద్వేగ భరితమైన, కవితాత్మక నవల. ఇది వాణిజ్య రాక్షసుల నుంచి భూమాత రక్షణ కోసం పొలి కేక. నవల రచనా శైలిలో కాలంలో వరుస లేకపోవడం, చనిపోయాయని అనుకున్న పాత్రలు తిరిగి ప్రత్యక్షం అవడం, సంబంధం లేని పదాలు, సమాసాలు, చిత్రాలు, అలంకారాలు , నిర్దిష్ట, దృశ్య వస్తుగత ప్రపంచం నుంచి అకస్మాత్తుగా మిత్, మాజిక్ ల ఆహేతుక, అదృశ్య కోణంలో మారటం వంటివి ఉన్నాయని విమర్శకుడు రాయ్ సి. బోలాండ్ వోస్సేగెడా రాశారు.నయా వలసవాద సైనిక దుశ్చర్యల కాలంలో నేడు ఈ నవల లోని లోతులు , భిన్న స్వరాలు తెలుసుకోవడానికి దీనిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
గతంలో మార్క్స్ చెప్పినట్లు పారిశ్రామిక యుగంలో రైతులు భూమి పోగొట్టుకొని కూలీలుగా మారారు. తర్వాత కాలంలో ఉత్పత్తి సాధనాలపై పెత్తనం లేని కార్మికులు పెట్టుబడి దారి ఉత్పత్తి సంబంధాలను మార్చే సమ సమాజ పుట్టుక కోసం కార్యాచరణ సాగిస్తారు. నేడు బహుళ జాతి సైనిక పెట్టుబడిదారీ 'అభివృద్ధి' రథ చక్రాలు కింద నలిగిపోయే బడుగు ప్రజానీకం ఆర్తనాదం వినిపించటమే సాంస్కృతిక యోధుల కర్తవ్యం.
నవలా రచన ఎంతో ప్రమాదకరమైన లాటిన్ అమెరికాలో "సంస్కృతులు ఏ విధంగా పురాణాలు బాధలు కథలు నమ్మకాల వ్యవస్థలను కలిపి అల్లుతాయో" చెప్పాడు. మిగేల్ ఆంజెల్ ఆస్తూరియాస్ రచనలపై కాఫ్కా , జేమ్స్ జాయిస్ ,విలియమ్ ఫాక్నర్ ల ప్రభావం ఉంది . అంతేకాక అతనికి పాబ్లో నెరుడా లాంటి కవులతో స్నేహం ఉంది. ఆయన మాయా ఇండియన్ల తెగకు గొంతుగా నిలిచాడు. మ్యాజికల్ రియలిజం అనే రచనా పద్ధతికి దారివేశాడు.ఆతని మరణం తర్వాత ఆయన పేరుపై గ్వాటెమాల లో సాహిత్యం, నాటక రంగాలలో జాతీయ బహుమతులను ఏర్పరిచారు.