నువ్వు నిజంగానే యుగపురుషుడివి సామీ
ఈ పాప ప్రపంచమే నీ పాదాలమీద పడే
ఏ దేశమైనా అధర్మమమే రాజ్యమేలుతుండే
నీ రాకకై యెయ్యి కళ్లేసుకుని వెతుక్కుంటూ
ఎక్కడ అశాంతి రేగినా దైవావతారమై ప్రభో
నీకెన్ని శాంతి బహుమతులిచ్చినా దిగదుడుపే!
మహా దేవో !
రోజుకో దేశం , లక్ష గాలన్లు చమురు
ఖండ ఖండాల తలకాయ కూరలు
మూడు పూటలా ముగ్గురు మిస్ యూనివర్స్లు
సమర్పించుకోడానికి సిద్ధమని తీర్మానించుకున్నాం !
దేవదేవా! జగన్నాయకా!
మేమాదమరచి నిద్రపోతున్నప్పుడు
మమ్ముల్ని కట్టేసుకు పోనక్కరలేదు
నువ్వు అగ్గి విమానాలేసుకుని
మా మీద వాలాల్సిన పనిలేదు
దాచుకున్న చిచ్చుబుడ్లు దోచుకోవాల్సిందిలే
మేమంతా నీ గులాములం
నువ్వు కట్టిన సమాధుల్లో నిద్రపోటానికి సిద్ధం !
మహోన్నతమైన మా ప్రభువా!
వాడేమి చేయుచున్నాడో వాడికి తెలియదు
ఆటకాయిల సీమ టపాకాయల్ని పట్టించుకోకండి
రొమ్ములిరుచుకొనే ఆవేశ దేశ ప్రజల తరుపున
క్షమించమని వేడుకుంటున్నాం ప్రభూ
ఈ భూసామ్రాజ్యం బూడిదవ్వకుండా !