అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు “సెలియా సాంచెజ్ “

చుట్టూ చలి. యేం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ యీ పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నప్పటి వెచ్చదనం అరిచేతుల్లోకి చిన్నగా ప్రసరిస్తోంది. మెల్లగా మెల్లగా శరీరమంతా పాకుతోంది. చలి, వెచ్చదనం శరీరంకి సంబధించినవా.. మనమున్న మనస్థితివా యేమో… ప్రస్తుతం నాయీ వుక్కబోత వో ఆశ్చర్యవంతమైన సాహసి జీవితం. సాహసవంతమైన జీవితాలని చదవటం.. వూపిరి బిగపెట్టి తెలుసుకోవటం.. వినటం.. బొత్తిగా అలవాటు లేదని కాదు. చిన్ననాటి నుంచి యెన్నెన్ని సాహసాలు వినలేదు. అయితే యిప్పటి నా ఆశ్చర్యానికి కారణం క్యూబా విప్లవ యోధురాలు “సెలియా సాంచెజ్ “! చిత్రంగా యీ యోధురాలు అమెరికావాళ్ళకీ చాల కాలం వరకు పెద్దగా తెలియరని చదివి మరింత ఆశ్చర్యపోయాను. గూగుల్ కాలమిది. విషయాలని వెతికితే యెంతోకొంత సమాచారమూ దొరుకుతుంది. అలా అప్పుడప్పుడూ చూసినా వొక విషయం మీద లేదా వ్యక్తుల మీదా కొంతమేరకైనా వచ్చిన వాటిని చదివినప్పుడు లేదా చూసినప్పుడు మరింత లోతుగా అర్ధమవుతాయి. అలా అప్పుడప్పుడు చూపుకి తాకినప్పుడ్డు వో ఫోటో కుతూహలంగా అనిపించి అప్పుడు యీ అమ్మాయి యెవరు అని తెలుసుకోవటం మొదలు పెట్టి అలా ఆ పుస్తకాన్ని అందుకొని… యింకా యేమేమి వున్నాయో వెతుక్కుంటూ ప్రతీ పుస్తకం అందుకొన్నప్పుడు కలిగిన అనుభవం.. నిజమే.. అర్మాండో హార్ట్ డావలోస్ అన్నట్టే “ఆమె యెల్లప్పుడూ విప్లవం అత్యంత ప్రామాణికమైన వైల్డ్ ఫ్లవర్ గా వుంటుంది” అనిపించింది. అవును ఆమె వైల్డ్ ఫ్లవర్ సెలియా సాంచెజ్… వైల్డ్ ఫ్లవరే.

సెలియా సాంచెజ్ మనకి అధికారిక క్యూబా ప్రభుత్వం యేర్పడిన సందర్భంగా తీసిన ఫొటోలో క్యూబా తిరుగుబాటు సైన్యం యూనిఫాంలో చాలా సన్నగా, చాలా చిన్నగా కత్తిరించి వున్నదట్టమైన జుట్టుతో, బూడిదరంగులోని ముఖముతో చాలా అస్పష్టంగా కనిపిస్తారు.

మనం యెప్పుడూ అంటుంటాం స్త్రీల జీవిత చరిత్రలు చరిత్రలో చాల తక్కువగా నమోదు అయ్యాయని. యిలాంటివి చదివినప్పుడు యెప్పుడో నమోదు కావాల్సిన సెలియా సాంచెజ్ జీవితచరిత్ర ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ఆ విషయాలని మరింత ఆలస్యం చదవినప్పుడు పుస్తకాలు చదవటం ముఖ్యంగా స్త్రీల గురించి చదవటం తెలుసుకోవటం యెంతో ఆసక్తి.. యిష్టం వుండి కూడా యిప్పటికి అయింది. ప్రతి యేడాది చే పుట్టినరోజుకి లేదా వెళ్ళిపోయిన రోజునా తలచుకుంటూ అదే సమయంలో క్యాస్ట్రో గారిని గుర్తుచేసుకొంటూ వారి గురించి చదువుతూ రాస్తూ కొన్నేళ్ళగా కొన్ని వాక్యాలు వో పిక్చర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కూడా చాలకాలం వరకూ సెలియా సాంచెజ్ గురించి శ్రద్ధగా చదువుకోలేదు.

రష్యన్.. చైనా సాహిత్యాన్ని.. చదువుకోవటం వల్ల పోరాటమూ.. విప్లవం.. ప్రజాపోరాటాల్లో యెందరో విప్లవ స్త్రీల సాహసాము మనకి వారి పట్ల గౌరవం.. ఆరాధన కలుగుతాయి. వారి జీవితాల్లో వారు నింపుకొన్న రాజకీయాల పట్ల భిన్నాభిప్రాయాలు వున్నవారు సైతం వారి పోరాటపటిమకి.. సాహసానికి ఆశ్చర్యపోతారు. గౌరవిస్తారు. ఆరాధిస్తారు.

సెలియా సాంచెజ్ జీవితం గురించి తెలుసుకుంటున్న కొద్దీ నిశ్శబ్ధమైపోయింది మనసు. హృదయమంతా బరువైపోయింది. వుద్వేగభరితమైంది.
“యుద్ధానికి స్త్రీ ప్రకృతి విరుద్ధం” పుస్తకం మదిలో మెదిలింది. మళ్ళీ తీసి చదివాను. అందులోని రష్యన్ మహిళల యుద్ధ అనుభవాలు సెలియా సాంచెజ్ అనుభవాలు యెలాంటివో అని అనుకోగానే నిస్సందేహంగా “సెలియా సాంచెజ్” జీవితం వొక అసాధారణ వ్యక్తీకరణ అని అనిపించింది.
ఆమె విప్లవంలో యెంత రహస్య జీవితాన్ని గడిపారంటే “సెలియా సాంచెజ్ యెవరు?” అని సి.ఐ.యే. నివేదికలో ఆమె పేరు కనిపించినప్పుడు అధ్యక్షుడు జాన్ యెఫ్. కెన్నెడీ కూడా అడిగారంట. అప్పుడు ‘క్యూబా విప్లవ ప్రభుత్వంలో సెలియా హవానాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అత్యున్నత ర్యాంక్ లో వున్న గౌరవనీయురాలైన మహిళ’ అని రాయబారి ఎఎ బెర్లే చెప్పారు. అంతేకాకుండా సెలియా సియెర్రా మాస్ట్రా మొదటి గెరిల్లా హోదా ను పొందిన ఆమె ఫిడెల్ కాస్ట్రో కి అత్యంత విశ్వసనీయురాలని, విధేయురాలనే వివరాలు తెలిసాయంట జాన్ యెఫ్. కెన్నెడీ గారికి.

సెలియా సంచేజ్ జీవితాన్ని మనకి నాన్సీ స్టౌట్ అందించిన పుస్తకం చదువుతున్నప్పుడు
అరే.. విప్లవానికి యింత సమర్ధవంతమైన రూట్ మ్యాప్ ని స్త్రీలు రచించగలరా అనే వొక ప్రశ్న మనలో మొలకలు వేసి వటవృక్షమై విస్మయం శాకోపసాఖలుగా విస్తరిస్తూ మనలో సంచలనాన్నికలిగిస్తుంది. నిజంగా ఆమె మానవ మాత్రురాలేనా? అనే ప్రశ్న మనలో వుద్భవించి తీరుతుంది. వొక విప్లవాత్మక మహిళ అద్భుతమైన వెల్లడి, డాక్యుమెంటేషన్‌లతో యీ పుస్తకం నిండి వున్న యీ పుస్తకం మెరుగైన మహిళా నాయకత్వం యెలా వుంటుందో స్పష్టమైన దృష్టిని, అన్నింటి కంటే ప్రధానంగా స్త్రీ, పురుష సంబంధాల నిజమైన సమానత్వ విప్లవ నాయకత్వం యెలా వుంటుందోననే చేదైన విషయం కూడా మనకి స్పురిస్తుంది.

క్యూబా విప్లవం అనగానే మనకు తలపు కొచ్చేది చే గువేరా, ఫిడెల్ కాస్ట్రో. వీళ్ళిద్దరూ, మిగిలిన విప్లవకారులు విప్లవ విజయం కోసం చేసింది కొంతైతే సైద్ధాంతికపరమైన కృషి రిక్రూట్ మెంట్స్, సప్లయ్స్, రూట్ మాప్ వరకూ మొత్తం రూపొందించిన అద్భుతమైన వొక వ్యక్తి ఆలోచనలు, కృషి వెలుగులోకి చాలకాలం రానేలేదు. రావాల్సినంతగా రాలేదు కూడా. యిలా యెందుకు జరిగివుంటుందో తెలీయదు కానీ స్త్రీ అవ్వటం వల్ల అనైటం తేలిక. కానీ మనకి తెలియని ఆ కాలానికి ఆ సంక్షోభంలో యెవవరెవరి పేర్లు రావాలి అనే దృష్టి కంటే సాధించాల్సిన గమ్యం ముఖ్యమైనది అయినప్పుడు కొన్ని చరిత్రలో రికార్డ్ కాకపోవొచ్చు. అలా కాని వాటిల్లో అధికశాతం స్త్రీల కాంట్రిబ్యూషన్ అవ్వటంలో సందేహం యేమి లేదు.

విప్లవ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనేకమంది క్యూబా పిల్లలను సెలియాతో పాటు ఫిడేల్ కాస్ట్రో కూడా దత్తత తీసుకొన్నారు. పిల్లలను దత్తత తీసుకోవడమే కాకుండా, చాలా సంవత్సరాల పాటు జరిగిన హత్యాప్రయత్నాలు, అనేక యితర సామాజిక రాజకీయ వొత్తిళ్ళ మధ్య కూడా వారు వారిని పెంచగలిగారు.

ఆశ్చర్యకరంగా ఫిడేల్, సెలియా వారు కలుసుకోవడాని కన్నా చాలా కాలం ముందు నుంచే చేయవలసిన పనిని వివరించే రహస్య సందేశాలను వొకరికొకరు పంపుకొనే పనిని కలిసి పనిచేశారు. వారు కలుసుకున్నాక ఆమె మరణించే వరకు వారు చాలా వరకు విడదీయరాని విధంగా జీవించారు. అయితే వారు ప్రేమికులా? సెలియా జీవించి వుండగా, క్యూబన్లు, క్యూబనేతరులకు మిగిలిన వొకే ప్రశ్న యిది. వీరిద్దరూ అభివృద్ధి చెందిన విప్లవాత్మక భాగస్వామ్య నమూనాను యెలా అందజేసారు. గోప్యతా క్షణాలలో వారేమి చేసారు? అనే విషయాలని యీ జీవిత చరిత్రలో కనిపిస్తాయి. నిజానికి యిది వారి స్వంత వ్యవహారం. కానీ ప్రశ్న, సూక్ష్మ రూపాల్లో పరిగణించబడుతుంది. యే మేరకు వారి మధ్య సంబంధా బాంధవ్యాలు వున్నాయి? వారు ప్రేమికులా? ఆత్మ సహచరులా? విప్లవ సహచరులా? కేవలం స్నేహితులా? వొకరి సన్నిధాన్ని మరొకరు ఆనందించారా? క్యూబా ప్రజల్ని క్రూరమైన నియంతృత్వం, దాని వారసత్వం నుండి విముక్తి చేయడానికి వారి జీవితాలను అంకితం చేసిన “ది న్యూ పర్సన్స్”.

ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు క్యూబా యిప్పటికీ భవిష్యత్తు దిక్సూచి. ప్రపంచానికి, ముఖ్యంగా మొదటి ప్రపంచ ఆధిపత్య దేశాలకు, దశాబ్దాలుగా, భరించలేని, కనికరంలేని ప్రాణాంతకమైన ద్వేషాన్ని భరించడం అంటే యేమిటో నేర్పింది. యెందరో వ్యక్తులు హింసించబడ్డారు, హత్య చేయబడి, అదృశ్యమయ్యారు, విముక్తి కోసం ఆరాటపడి, తప్పిపోయారు. ఫ్రాంక్ పైస్-యిరవై యేళ్ల యువ పాఠశాల వుపాధ్యాయుడు, యితర కమాండెంట్, నియంతను పడగొట్టడంలో మార్గనిర్దేశం చేయడంలో ఫిడేల్ భాగస్వామి. విప్లవం ప్రారంభ రోజులలో సెలియా ప్రాథమిక పరిచయస్తుల్లో వొకరు-బాటిస్టా పోలీసులచే అతని తమ్ముడు జోసుయే చంపబడిన వొక నెల తర్వాత హత్య చేయబడ్డాడు. వారి శరీరాలను క్లెయిమ్ చేసుకున్న వారి తల్లి, రోసారియో కూడా యిప్పుడు లేరు. యీ విషయాలను చదువుతున్నప్పుడు ఆమె అనుభవించిన వేదనలో దుఖం మనసుకి తడుతూనే వుంది. యిద్దరు లొంగని తిరుగుబాటు మహిళలు, క్లోడోమిరా, లిడియా, పోలీసుల కస్టడీలో చనిపోయే ముందు క్రూరంగా హింసించబడ్డారు. యిప్పటికీ యెప్పటికీ ప్రపంచంలోని చాలా మందికి చేగువేరా చాలా చిన్న వయస్సులో హత్య చేయబడ్డటం దుఖం కలిగిస్తూనే వుంది. యిటువంటి అమానవీయతని అంతమొందించే సమాజంకోసంచేసే క్యూబా విప్లవంలో సెలియా ముఖ్యపాత్రని పోషించారు.

యెన్నెన్నో బాధలను అనుభవించిన క్యూబా, ప్రజల లోతైన భావాలను పంచుకున్న సామూహిక అనుభవమే గొప్ప సంపన్న దేశమనే భావన, చాలా ధైర్యంగా పోరాడి మరణించిన వారందరూ, కొన్నిసార్లు భయంకరంగా, వారి ఫంధా ని వదిలిపెట్టిన విప్లవకారుల చేత కూడా వుద్రేకంగా ప్రేమించి,. ప్రశంసింపడటం యీ రెండూ పరస్పరం జీవించిన యీ చరిత్ర గొప్పదనం అనే నమ్మిక అనేక మందిలో వుంది. దేశాన్ని కలిపి వుంచే స్వేచ్ఛ, ఆరోగ్యకరమైన క్యూబాను సృష్టించాలనే ఆశ యీ పుస్తకంలో దర్శనమిస్తూనే వుంది. అది యీ నాటి ఆకాంక్ష కూడా.

ఫిడెల్ కాస్ట్రో సెలియా సాంచెజ్‌ను యెందుకు ఆరాధించారో, చే, సెలియా యెందుకు మంచి స్నేహితులో అని వారి గురించి వచ్చిన పుస్తకాల్ని.. దొరికిన సమాచారాన్ని.. కథనాలని చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా తడుతుంది. యీ విప్లవకారులు ముగ్గురూ అత్యున్నత నైతిక స్వభావం, సమగ్రత కలిగిన వ్యక్తులు. అంతే కాదు లోతైన మానవులు కూడా. వారి అతిక్రమాలు, అసంపూర్ణతలలో, వారు భయంకరమైన సమానులు. వారందరి తలలపై ధర కూడా వుండేది.

సెలియా సాంచెజ్ మే 9, 1920న తూర్పు క్యూబాలో మీడియా లూనాలో జన్మించారు. సెలియా ఆరు సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు ఆమె తల్లి మరణించారు. యెనిమిది మంది పిల్లలని పెంచడానికి ఆమె తండ్రికి సహాయం చేయడానికి ఆమె అమ్మమ్మ వెళ్ళారు. ఆమె చిన్నతనంలో, సెలియా, ఆ సమయంలో తన సామాజిక వర్గంలో చాలా మందిలానే గృహనిర్వాహకులు, తోటమాలి డ్రైవర్లతో కూడిన విస్తృతమైన గృహ శ్రామికదళం సహాయం తీసుకునేవారు. సెలియా తండ్రి అమ్మమ్మ పిల్లలను క్యూబా సార్వభౌమాధికారం పట్ల దృఢమైన గౌరవ సామాజిక సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతతో పెంచారు.
వొక వైద్యుని కుమార్తె అయిన సెలియా తన తండ్రి పేదలకు వైద్యం చేయడానికి తరచుగా సెలియా అతన్ని మోటివేట్ చేసేవారు. ఆమె తండ్రికి సహాయం చేసేవారు.

వొక హై సొసైటీ అమ్మాయి,యెర్రని లిప్‌స్టిక్‌, హైస్కూల్ అందాల రాణి, వెడల్పు స్కర్టులు, హై హీల్స్ తో తిరిగే యీ మహిళ తిరుగుబాటు చేసే ఆర్మీ యూనిఫాం ధరించి చే, యితర విప్లవకారులతో కలిసి తూర్పు క్యూబా పర్వతాలను అధిరోహించటమంటే చిన్ని విషయం కాదు. కానీ ప్రపంచానికి ఆమె యోధురాలుగా అంతగా తెలిసినవారు కాదు. సంపద, అవినీతి.. అధికారం అనే హత్యా యంత్రానికి వ్యతిరేకంగా ఆమె జీవితాన్ని పరదాల వెనుకే దాచి వుంచి ఆమె ప్రియమైన దేశం ఆమెని తీవ్రంగా గాయపరిచింది.

సెలియా యెలిమెంటరీ స్కూల్ టీచర్. ఆమె వ్యక్తిత్వం మీద ఆమె తండ్రి ప్రధానమైన ప్రభావాన్ని చూపారు. వొక యువతిగా, ఆమె బలమైన రాజకీయ అభిప్రాయాలను యేర్పరుచుకున్న సెలియా చర్చివర్జిన్ ఆఫ్ ఛారిటీ విగ్రహానికి దుస్తులు కుట్టడం, కేకులు కాల్చడం వెడ్డింగ్ ప్లానర్‌గా కూడా పని చేయడం కూడా చేసారు. అద్భుతమైన గృహనిర్వాహకులు అని ఆమెని మెచ్చుకునేవారు. ఆమె అద్భుతంగా వండేది, బేకర్‌లో నైపుణ్యం సాధించింది. కుట్టడం, యెంబ్రాయిడరీ చేయగలరు. అటువంటి అమ్మాయి విప్లవ రూట్ మ్యాప్ ని ఆవిష్కరించగలదని యెవరైనా వూహించగలరా..!!! ఆమెకి యెలా అలవడిందో కానీ ఆమె విప్లవాత్మక కేంద్రకాన్ని రూపొందించటంలో మాత్రమే కాకుండా విప్లవ విజయాల చరిత్రను రూపొందించటంలో సెలియా పాత్ర అద్భుతమైనది. ప్రతీ వొక్క కాగితం ముక్క ని ప్రతి వొక్క విషయాన్ని ఆమె భద్రపరిచేవారు. డాక్యుమెంటేషన్ లో అద్భుతమైన ముందు చూపున్న ప్రతిభాశాలికి తాను వ్యక్తిగతంగా పత్రికల వారితో మాటాడటానికి యే మాత్రం ఆసక్తి చూపకపోవటమే కాకుండా ఫోటోలను తీయించుకోడానికి యిష్టపడేవారు కాదు.. పైగా ” యెలరిజ్జీ” అని నవ్వుతూ అనేవారంట.

మైదానాల్లో వుండటం ఆమెకు చాల ప్రమాదకరంగా మారినప్పుడు, ఆమె క్యాస్ట్రోతో కలిసి సియెర్రా మాష్ట్రా లో చేరారు. లా ప్లాటా కమాండ్ పోస్ట్ వద్ద, ఆమె ఆహారం, బట్టలు, ఆయుధాలు పర్యవేక్షణ ను చూస్తుండే వారు గెరిల్లా యుద్ధంలో తిరుగుబాటు దళాలను నిలబెట్టడానికి అవసరమైన ప్రతీదీ ఆమె చూసేవారు. ఆమె క్యాస్ట్రో నుంచి యెప్పుడు దూరంగా లేరు. ఆమె కూడా యుద్దానికి దిగేరు. పదిహేనేళ్ళప్పుడు ఆమె మాజీ గెరిల్లా ఫైటర్ బ్రిగేడియర్ జనరల్ టెట్ ప్యూబ్లా సియెర్రా మాస్ట్రా లో కలిశారు. సెలియా ప్రారంభంలో యితర మహిళలతో కలిసి నియంత్రత్వంతో పోరాడటానికి ఆయుధాలతో వుండే వారు. క్యూబా మహిళలు విప్లవంలో పూర్తి భాగస్వామ్యులు, పోరాట యోధులు, రహస్య కార్యకర్తలు, సహ ప్రేరకులని వారి గురించి చదువుతున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.

ఫిబ్రవరి 1957 వరకు సెలియా ఫిడెల్‌ను వ్యక్తిగతంగా కలవలేదు. ఆ సమయానికి, ఆమె అతను మెక్సికోలో ప్రవాసం నుండి తిరిగి రావడానికి ప్రణాళిక వేసారు. అతని గెరిల్లా సైన్యానికి పునాది వేసింది. తిరుగుబాటు కోసం లాజిస్టిక్స్, పరిచయాలను సమన్వయం చేయడంలో ఆమె చేసిన పని ఫిడెల్ నుండి ప్రశంసలు అందుకుంది, “ఆమె రహస్యంగా వ్యవహరించి పోరాటంలో అపారమైన కష్టాలని యెదుర్కొ ఆమె అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించింది” అని ఫిడెల్ ప్రశంశించారు.

విప్లవం తరువాత, సెలియా ఫిడెల్‌తో కలిసి రాజధానికి చేరుకున్నాక సెలియా క్రమంగా యెల్ వెడాడోలోని 11వ వీధిలోని వొక భవనంలో అపార్ట్‌ మెంట్‌లను కొనుగోలు చేసి ఆ కాంప్లెక్స్‌ను పాక్షిక-పబ్లిక్ హోమ్‌గా మార్చారు. అక్కడ నుండి ఆమె ఫిడల్ కోర్టును నిర్వహించారు. యుద్ధ అనాథలను స్వాగతించారు. నటులు, రచయితలు పాత్రికేయుల అంతర్జాతీయ వర్గానికి ఆతిథ్యం యిచ్చారు. . అప్పటికి, సెలియా డిఫెరెన్షియల్ భాగస్వామి పాత్రలో స్థిరపడినట్లు అనిపించినప్పుడు వొకసారి, జర్నలిస్ట్ ఫిలిస్ బాటెల్లె రాజకీయ విషయంపై సెలియా అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ఆమె యిలా స్పందించారు “ఫిడెల్‌తో మాట్లాడండి.”

ఫిడెల్‌ను రక్షించడంతో పాటు, క్యూబా నిజమైన గమ్యస్థాన నాయకురాలుగా, యెప్పుడూ దాడికి పాల్పడుతున్న నాయకురాలుగా సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న విప్లవకారిణిగా ఆమె చేసిన లోతైన బాధాకరమైన, వొత్తిడితో కూడిన పనిని ఆమె ప్రేమించారని అనిపిస్తుంది. విప్లవం, దేశానికి తన బాధ్యతలను నెరవేర్చడానికి వ్యక్తిగత నష్టాలు, విషాదాలు జోక్యం చేసుకున్నప్పుడు ఆమె అణుచుకోవలసిన దుఃఖం కూడా ఆమెపై అదనపు బరువుగా వుండేది.

పర్వతాలలో వారి జీవితాన్ని ఆమె యెప్పుడూ గుర్తుచేసుకునేవారు. అక్కడ అన్ని రకాల కష్టాలని, సంతోషాల్ని మననం చేసుకొనేవారు. సంగీతాన్ని వినేవారు. యుద్ధవార్తలను రేడియో ప్రసారాలల్లో తెలియజేసారు. ఆగస్ట్‌లోని అత్యంత ఆవిరి రోజులలో, వారు పార్టీ, ఐస్‌క్రీం కేక్‌తో తమ నాయకుడి పుట్టినరోజు త్వరలో విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని జరుపుకున్నారు.

సెలియా సాంచెజ్ అసాధారణ జీవితం దైర్యాన్నిస్తుంది. ప్రోత్సహిస్తుంది. విప్లవ సమయంలో తన చుట్టూ వున్నవారు చేసిన ప్రతిదాని గురించి ఆమె రికార్డులలలో భద్రపరిచేవారు. నిస్వార్ధం నిండిన ఆమె తన జ్ఞానంతో, క్యూబా తాను కంటున్న కలల సాకారానికి మార్గదర్శకత్వం వహించే ప్రదేశంలో తానున్నానని ఆమె భావించారు. తిరుగుబాటుదారుల గురించి భవిష్యత్తులో అందరికి తెలియచేసేందుకు రికార్డ్ చెయ్యాల్సిన విషయాల మీద ఆమె శ్రద్ధ వహించారు.


ఆమె యెవరు? ఆమె యెందుకు పెద్దగా ప్రసిద్ధి చెందలేదు? యీ ప్రశ్నలకు క్యూబాలో సమాధానం చెప్పగల యేకైక వ్యక్తి కూడా యిప్పుడు లేరు. ఆమె జీవించడానికి , తన జీవితాన్ని వివరించడానికి ఆమె అజ్ఞాతత్వం కొంతవరకు స్వీయసృష్టి అని అర్ధమవుతుంది.”నా రసహీనమైన జీవితం రాయడానికి అర్హమైనదే, కానీ వెర్రి విషయాలు చాలా వున్నాయి అందులో” అని ఆమె మార్చి 1, 1958న తన డైరీలో రాసుకున్నారు. యీ జీవితచరిత్ర రచయిత్రి నాన్సీ స్టౌట్ అంతర్దృష్టితో ఆమె పరిపక్వతతో సాహసోపేతమైన వ్యక్తిత్వపు అన్వేషణ కోసం సాగించిన ప్రయాణాన్ని తప్పకుండా అభినందించాలి.

1956లో ప్రవాసం నుండి ఫిడెల్ కాస్ట్రో క్యూబాకి తిరిగి రావడానికి సమన్వయం చేయడం, క్యూబా నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను పడగొట్టే ప్రయత్నాలలో ఫిడెల్, అతని తిరుగుబాటు సైన్యానికి మద్దతునిచ్చే రహస్య నెట్‌వర్క్‌ ను ఆమె నిర్మిస్తూ ఆమె నాటికల్ చార్టులను దొంగిలించారు. రైతులతో పొత్తులు పెట్టుకొని నగదుని సేకరించి రహస్య సందేశాలను పంపారు.
సంపన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సెలియా సాంచెజ్ క్యూబా విప్లవంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఆమె వొకరిగా యెదిగారు, అదే సమయంలో మహిళలపై విధించిన ఆంక్షలు సమాజాన్ని అంతర్గతీకరించడం, కొన్నిసార్లు దోపిడీ చేయడం. మళ్లీ మళ్లీ, ఆమె స్త్రీ అయినందువలన వున్న సౌలభ్యాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. వొక సారి, ఆమె తన పనికి వెళ్లే దారిలో గృహిణిగా నటిస్తూ పట్టుబడకుండా తప్పించుకుంది. మరొకసారి, ఆమె బ్లౌజ్ కింద కుషన్‌ను అతికించి గర్భవతి లాగ్స్ శత్రువుల కన్నుగప్పారు.

ఆమె వో గెరిల్లా నాయకురాలిగా పదునుగా కనిపించటం సహజం. కానీ ఆమె వౌదార్యం కూడా యెంతో గొప్పది. ఆమె M-1 రైఫిల్‌ని తీసుకుని మే 1957లో యువేరొ యుద్ధంలో తిరుగుబాటుదారులతో చేరి పోరాడారు. “ఆమె కొత్తగా కనిపించలేదు. ఆమె చాలా సహజంగా, యెంతో అనుభవం వున్న గెరిల్లా యోధురాలుగా కనిపించింది,” అని రావుల్ కాస్ట్రో ప్లాటూన్‌లో ప్రయాణిస్తున్న యెలోయ్ రోడ్రిగ్జ్ చెప్పారు. “సెలియా బాగా పోరాడింది. కానీ నిర్దిష్ట వివరాలు లేవు” స్వయంగా సెలియా రూపొందించిన క్యూబా విప్లవచరిత్ర లో కూడా ఆమె తన పాత్రని చాలా తక్కువ నమోదు చేసారు” అని ఆమె చరిత్ర రాసిన స్టౌట్ రాశారు.

2011 లో బీబీసీ నివేదిక శీర్షిక : సెలియా కాస్ట్రో ప్రేమికురాలా ? అని రాశారు. యిటువంటి ప్రశ్నలు యిప్పటికీ వినిపిస్తుంటాయి. స్త్రీ పురుషులు కలిసి పని చేసినప్పుడు యిలాంటి ప్రశ్నలు తరచుగా వినిపించటం సర్వసాధారణం. యే కాలంలోనైనా యే రంగంలోనైనా స్వయాన వారికివారు ప్రకటించేవరకూ యిటువంటి వూహాజనిత కథనాలు అనవసరం. వూహకి సత్వానికి దూరం కొలతలకి అందనంత. క్యూబా నాయకుడు ఫిడల్ జీవితంలో మహిళా విప్లవకారిణి సెలియా కీలక పాత్ర పోషించారు.. అయితే వారిద్దరూ నిజంగా యెంత సన్నిహితంగా వుండేవారు అనే చర్చ ఆమె మరణించిన యిన్నేళ్ళ తరువాత కూడా కొనసాగుతోంది. సెలియా రెండు దశాబ్దాలకు పైగా క్యూబా విప్లవానికి గుండెకాయగా వున్నారు. 1957 లో కాస్ట్రో ను కలిసిన తరువాత ఆమె అనివార కారణాల వల్ల సహాయకురాలిలా అయ్యారు. వీరిద్దరూ ప్రేమికులు అనే వూహాగానాలకి.. పుకార్లకి వీరిరువూ యెప్పుడు యేమి మాటాడలేదు. వారిద్దరూ విప్లవ కార్యాచరణలో ప్రజా విముక్తి కోసం నిరంతరం పని చేస్తూనే వున్నారు. సెలియా బతికి వున్నప్పుడు క్యూబా బయట ప్రపంచంలో ఆమె పోషించిన పాత్ర గురించి చాలా తక్కువగా రికార్డ్ అయింది. సెలియా కాస్ట్రో కలిసి వున్న తొలి చిత్రం 1957 లో మొదటి సారిగా కులుసుకున్నప్పుడు తీసింది.

1958లో, ఫిడెల్, తాను అంగీకరించిన మాచిస్మోను పక్కనపెట్టి, స్త్రీల పోరాట విభాగాన్ని ప్రతిపాదించినప్పుడు అతని తోటి గెరిల్లా పురుషులు దాదాపు తిరుగుబాటు చేశారు. ఆయుధాలు తక్కువగా వున్నాయని వారు వాదించారు. కానీ.. స్త్రీలు చివరికి విజయం సాధించారు, “చాలా మంది పురుషుల కంటే స్త్రీ లే చాలా ప్రమాదకరమైన చర్యలు చేసారు.” స్వాతంత్ర్య వీరుడు మరియానా గ్రజలేస్ పేరు పెట్టబడిన యీ యూనిట్‌లో కేవలం 14 మంది మహిళలు మాత్రమే వున్నారు, అయితే వారు బాటిస్టా సైన్యంతో “కనీసం పది యెన్‌కౌంటర్ల”లో పాల్గొని విజయం సాధించారు.

కానీ కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె చేస్తోన్న పనులు ఆమెను క్యూబా నాయకత్వంలో అగ్రస్థానానికి చేర్చినప్పుడు, ఆమె ప్రజల గుర్తింపును పొందకుండా వుండటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. విప్లవం ప్రారంభ రోజులలో వొక విలేఖరి తన “జీవిత చరిత్ర” కోసం చుట్టుముట్టడం ప్రారంభించినప్పుడు అతనికి యెలాంటి సమాచారాన్ని యివ్వవొద్దని “నా గురించి యెవరూ అతనికి వొక్క విషయాన్ని కూడా చెప్పకండి.. అచ్చులో నా పేరు చూసిన ప్రతిసారీ నేను చాలా కుంగిపోతున్నాను. నేను పేరుని ద్వేషిస్తున్నానని, నేను దానిని సహించలేనని మీకు తెలుసు” అని తన సోదరి అకేసియాకు మిగిలిన కుటుంబ సభ్యులను హెచ్చరిస్తూ సెలియా తన సోదరి అకేసియాకు వొక లేఖను పంపారు.

విప్లవం తర్వాత కూడా సమూహంలో కలిసి చేసే కీలక పదవులు, పనులు కాకుండా విప్లవం అధికారిక ఆర్కైవ్స్, హవానాలోని పార్క్ లెనిన్, ప్రసిద్ధ కొప్పెలియా ఐస్ క్రీం పార్క్ నిర్మాణంతో సహా అనేక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ, సెలియా నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించారు. వందలకొద్దీ యిం టర్వ్యూల ఆధారంగా క్యూబా విప్లవ చరిత్ర ని కూర్చడం సెలియా సాధించిన గొప్ప విజయమని, ఆమె అనుకున్న వాటినన్నింటినీ అన్నిటినీ సాధ్యం చెయ్యటానికి చేసిన కృషి కనిపిస్తుంది. ఆ కృషి వల్లే

క్యూబన్ విప్లవంలో ఆయుధాన్ని ప్రయోగించిన యీ మొదటి మహిళ, సెలియా జనవరి 1959లో విజయవంతమైన ఫిడెల్ కాస్ట్రో, అతని బార్బుడోస్‌ను హవానాలోకి తీసుకెళ్లిన జీప్‌లో ఆమె నిలబడే హక్కును సంపాదించుకొన్నారు.


దాదాపు అరవై సంవత్సరాలు జీవించిన సెలియా వొక అమరవీరురాలు. కేన్సర్ ను సహజమని భావించగలిగితే ఆమె సహజ కారణాల వల్లే మరణించారని భావించవచ్చు. జనవరి 11, 1980న ఆమె మరణించిన ఆ చలికాలంలో ఆమెకి నివాళులర్పించేందుకు వేలాది మంది సంతాపకులు వచ్చారు. సామూహిక ర్యాలీల కోసం కార్మికులు తమ కార్యాలయాల నుండి వచ్చారు. ఆమె అంత్యక్రియల వూరేగింపు హవానాస్ రివల్యూషన్ ప్లాజా నుండి కొలన్ స్మశానవాటికకు నెమ్మదిగా చేరుకుంది. ఫిడెల్ క్యాస్ట్రో బహిరంగంగా యేడ్వడం యిదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆమె క్రిప్ట్ “43” అనే సంఖ్యతో మాత్రమే గుర్తించబడిన ఆమెకి సందర్శకులు టార్చ్ ఆకారంలో వుండే క్యూబా జాతీయ పుష్పం వైట్ మరిపోస ని వుంచారు. యిప్పటికీ క్రమం తప్పకుండా ఆ పువ్వులతో ఆమెకి నివాళని వినమ్రంగా అర్పిస్తారు.

ఆమె మరణించిన తర్వాత క్యూబా ఆమె చిత్రాన్ని యిరవై-పెసో నోట్లో వాటర్ మార్క్ గా ముద్రించింది. రాష్ట్ర మీడియాలో సంపాదకీయం ఆమెను “విప్లవ అపారమైన సముద్రంలో అదృశ్య వుప్పు” అని ప్రశంసించింది. సెలియా ప్రాథమికంగా ధైర్యవంతమైన పోరాట యోధురాలుగా కాకుండా, క్యూబా “అత్యంత స్థానిక వైల్డ్ ఫ్లవర్” గా ప్రసంసలని అందుకున్నారు.


సెలియా గొప్ప సృష్టిలలో పార్క్ లెనిన్ వొకటి. భారీ స్థాయిలో రూపొందించిన యీ పార్క్ దాదాపు 2,000 యెకరాల విస్తీర్ణంలో వుంది. సెలియా నాయకత్వం వహించి పద్నాలుగు వాస్తుశిల్పులతో 1969లో దీని రూపకల్పన చేసారు. యీ పార్క్ 1972లో ప్రారంభించబడింది. పన్నెండు సంవత్సరాల తరువాత, ప్రభుత్వం 9 మీటర్ల యెత్తైన లెనిన్ విగ్రహాన్ని ఆ పార్క్ లో యెత్తైన కొండపై ప్రతిస్టించారు. ఆ లెనిన్ పార్క్ లో నిరాడంబరమైన సెలియా స్మారక చిహ్నం ఆకులలో దాగి “ఆమెలా పరిమళించే పువ్వుల మధ్య, ఆమె ఆప్యాయత చిరునవ్వుల స్పష్టమైన నీటి ప్రవాహంతో” అని వొక కవి రాశారు.

“సెలియా విప్లవకాలంలో గొప్ప యోధురాలు
ఆమె వ్యక్తిగతంగా ఆ విప్లవం నుంచీ యేమీ ఆశించలేదు.
ఆమె కేవలం తన నేలని ప్రేమించింది.
ఆమె తన నేల విముక్తిని కోరుకుంది.
అందుకే తనని తాను చెరిపేసుకుంది.”
మొన్న జనవరి 11 సెలియా సాంచేజ్ వర్ధంతి రోజు యీ మాటలు పదేపదే గుర్తొచ్చాయి.
అర్మాండో హార్ట్ డావలోస్ అన్నట్టు “ఆమె యెల్లప్పుడూ విప్లవం అత్యంత ప్రామాణికమైన వైల్డ్ ఫ్లవర్ గా వుంటుంది”

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

9 thoughts on “అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు “సెలియా సాంచెజ్ “

  1. Celia Sanchez లేకపోతే క్యూబా విప్లవమేలేదు. గొప్ప వ్యూహకర్త. పోరాట యోధురాలు. క్యూబా రివల్యుషనరీ ఆర్కైవ్ రూపకర్త. లెనిన్ పార్క్ డిజైనర్. ప్రేమ కొందర్ని తెరల వెనుక మరుగు పరుస్తుంది. గొప్ప పరిచయం. థ్యాంక్స్ టు యు.

  2. చరిత్ర పుటలలో దాగిన unsung warrior Celia Sancheg గురించి మొదటి సారిగా చదివాను. చాలా ఉత్కంఠతతో గుండెనిండా తడితో. కళ్లు వాటికవే చెమర్చాయి. మౌనంగా నివాళులర్పించాయి. ధన్యవాదాలు మీకు..

  3. సెలియా సాంచెజ్ జీవితాన్ని, “కుప్పిలి పద్మ గారు చాలా చక్కగా విశదీకరించారు. కూలంకషంగా చర్చించారు. అభినందనలు.

    మేడం మీరు అచ్చులు బదులు హల్లులు ఎక్కువ వాడటానికి కారణం మాత్రం అర్ధం కాని విషయం. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? వొక.. వుషోదయం/ వుద్యమం,, యెవరు, వంటివి. మీ బోటి పేరున్న రచయిత్రులు అలా వాడటం వల్ల అవే సరైన పదాలుగా చలామణీ అవుతాయి కదా?

  4. Thank you Kalyan garu.
    మీరు అడిగిన విషయం కి యెందుకు రాస్తానో యేమో తెలీదండీ. అలా అలవాటు అనుకుంటాను. థాంక్యూ అండి.

  5. ఒక గొప్ప విప్లవ వనిత జీవితాన్ని మొదటిసారిగా తెలుగు పాఠకులకు అందించారు. ఆ పుస్తకం సంపాదించి చదవాలనిపించెంత ఆసక్తికరంగా వుంది మీరు రాసిన పరిచయం. ధన్యవాదాలు.

Leave a Reply