హిందుత్వ ఫాషిజం – ప్రతిఘటన

2014 ఎలక్షన్లలో నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఉదారవాదులు, వామపక్షవాదులు, ప్రజాస్వామిక వాదులందరూ భారత దేశం ఫాషిస్టు యుగంలోకి ప్రవేశిస్తోందని ఆందోళన చెందుతూ ఉన్నారు. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలైనా, అది స్పష్టంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, వ్యవస్థలకి హాని చేసినా, 2019 ఎలక్షన్లలో అదే ప్రభుత్వం తిరిగి అధిక సంఖ్యాక మెజారిటీ తో గెలిచిన తర్వాత, ఆ ఆందోళన ఇంకాస్త పెరిగింది. ఈ ఆర్ఎస్ఎస్/ బీజేపీల దాడిని సమర్థవంతంగా ప్రతిఘటించే కార్యక్రమాన్ని రూపొందించాలంటే, ముందుగా మనం భారత దేశంలో పరిస్థితులు అసలు ఫాషిస్టువా కాదా అనేది నిర్థారించుకోవాలి. అట్లానే, మోడీ అధికారంలోకి రావడానికి, స్థిరపడడానికీ ఆర్థిక కారణాలు ఏమిటి, ఆర్ఎస్ఎస్/బీజేపీల సైద్ధాంతిక కార్యాచరణ ఏమిటి అనేవి అర్థం చేసుకోవాలి. భారత దేశ పరిస్థితులు ఫాషిస్టు దశలోకి ప్రవేశించడాన్ని సూచిస్తే, ఆ ఫాషిజం ఏ రూపాల్లో వ్యక్తమవుతోందో తెలుసుకుని, దానిని రాజకీయ, సైద్ధాంతిక, సాంస్కృతిక రంగాల్లో ప్రతిఘటించాలి.

అసలు ఫాషిజం అంటే ఏమిటి? దానికి స్పష్టమైన నిర్వచనమేమీ లేదు కానీ దాని రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రూపాలని బట్టి దాన్ని నిర్ధారించే కొన్ని సూత్రీకరణలు మాత్రం ఉన్నాయి. అట్లాగే, ఫాషిజం రావడానికి ఖచ్చితమైన పరిస్థితులంటూ లేవు. కానీ, చారిత్రకంగా ఫాషిజం ఉన్న దేశాల అప్పటి పరిస్థితులకి ఇప్పటి మన పరిస్థితులకి పోలికలు ఉన్నాయో లేదో చూడవచ్చు. అట్లాగే, ఫాషిస్టు రాజ్యం రావడానికి కావలసిన ఆర్థిక పరిస్థితులని మనం అర్థం చేసుకోవాలి.

చారిత్రక ఫాషిజం:

చారిత్రక ఫాషిజం 1919 – 1945 సంవత్సరాలలో మధ్య, దక్షిణ, తూర్పు యూరోపు దేశాల్లో అధికారంలో ఉన్న రాజకీయార్థిక, సాంస్కృతిక సిద్ధాంతం. 1922 – 45 మధ్య అనేక దేశాల్లో ఫాషిస్టు పార్టీలు, ఉద్యమాలు అధికారంలోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి ఇటలీలో ముస్సోలినీ నాయకత్వం వహించిన నేషనల్ ఫాషిస్ట్ పార్టీ, జర్మనీలో హిట్లర్ నాయకత్వం వహించిన నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ లేదా నాజీ పార్టీ.

కేవలం ఫాషిస్టుల మీద, నాజీల మీద కేంద్రీకరించి చేసే ఫాషిస్టు అధ్యయనం మితవాద తీవ్రవాదాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమౌతుంది. పైన చెప్పిన పార్టీల సభ్యులు కాకపోయినా, వాటి సిద్ధాంతాలని పూర్తిగా అంగీకరించక పోయినా, ఇటలీ, జర్మనీలలోని భూస్వాములు, ఆర్మీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యమైన పారిశ్రామికవేత్తలు ఫాషిస్టులు అధికారంలోకి రావడానికి ఎంతో తోడ్పడ్డారు. క్రైస్తవ సాంప్రదాయవాదులు కూడా ఫాషిస్టులని సమర్థించారు. నాస్తికుల నుంచి, మానవతావాదుల నుంచి క్రైస్తవ మతాన్ని, కుటుంబాన్ని తాము సంరక్షిస్తామని చాలా ఫాషిస్టు ఉద్యమాలు చెప్పుకున్నాయి. జాతీయ అస్తిత్వమే ఒక వ్యక్తి అస్తిత్వానికి మూలమని, అది విదేశీ ప్రభావాలతో, ముఖ్యంగా వామపక్ష ప్రభావాలతో, చెడిపోకూడదని ఫాషిస్టు సిద్ధాంతకర్తలు చెప్పేవారు. ఫాషిస్టులకి అన్నిరకాల మార్క్సిస్టులంటే – కమ్యూనిస్టుల నుంచి సోషలిస్టుల దాకా – ద్వేషమనే విషయం చాలా స్పష్టం. అంతర్జాతీయ వర్గ సంఘీభావం బదులు జాతీయ వర్గ సహకారాన్ని నెలకొల్పాలని ఫాషిస్టుల ఆలోచన. పారిశ్రామిక, వ్యవసాయిక, ప్రొఫెషనల్ రంగాలనూ, కళలనూ రాజ్య నియంత్రణ కింద పని చేసే కార్మిక సంఘాల, యజమాన సంఘాల ‘కార్పొరేట్ల’గా ఏర్పాటు చేయాలని ఫాషిస్టుల ఆర్థిక సిద్ధాంతం ‘కార్పొరేటిజం’ ప్రతిపాదన.

ఫాషిస్టు పాలనలో మహిళలని భార్యలుగా, తల్లులుగా సాంప్రదాయక పాత్రలు పోషించమని, దేశం కోసం ఎక్కువ మంది పిల్లలని కనమని ప్రోత్సహించేవారు. ఫాషిస్టు విద్యావేత్తలు సమాచార ప్రసారాన్ని తక్కువ చేసి, ఫాషిస్టు సిద్ధాంతాన్ని ప్రశ్నించే విమర్శనాత్మక, స్వతంత్ర ఆలోచనని నిరుత్సాహ పరచి, మేధో వృద్ధి కన్నా నడత (శీలం) ముఖ్యమని, అధికారానికి గుడ్డి విధేయతని నేర్పేవారు.

ఫాషిజం – మార్క్సిస్టు విశ్లేషణ:

బల్గేరియాకి చెందిన కమ్యూనిస్టు జార్జి దిమిత్రోవ్ ఫాషిజం ని “అతి ప్రతిఘాతుక, దురహంకార, సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి యొక్క బహిరంగ ఉగ్రవాద నియంతృత్వం”గా నిర్వచించారు. దిమిత్రోవ్ ప్రకారం ఫాషిజం సైద్ధాంతిక మూలాలు పెటీ బూర్జువా వర్గంలో ఉన్నా, బూర్జువా వర్గ రాజకీయ మద్దతు ఉంటేనే అది అధికారంలోకి రాగలదు. జర్మన్ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త క్లారా జెట్కిన్ ఫాషిజం గురించి ఈ విధంగా అన్నారు “అది అన్ని చోట్లా క్రూరమైన, ఉగ్రవాద హింసని మోసపూరిత విప్లవాత్మక వాక్యాలతో కలగలిపి, విశాల ప్రజా సమూహాల అవసరాలని, మనోభావాలని రెచ్చగొట్టే విధంగా వాక్సూరత కలిగి ఉంటుంది. అది కొనసాగుతున్న పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ క్షయానికి, శిథిలమౌతున్న బూర్జువా రాజ్యానికీ వ్యక్తీకరణ.” పెట్టుబడిదారులు ప్రజాస్వామ్య యంత్రాంగంతో పాలన, ఆధిపత్యం సాగించలేనప్పుడు, కార్మిక వర్గ సంఘాల వినాశం ద్వారా కార్మిక వర్గాన్ని ఛిన్నాభిన్నం చెయ్యడం, రాజకీయ స్వేచ్ఛలని అణగదొక్కడం ఫాషిజం చారిత్రక కర్తవ్యం.

మార్క్సిస్టు మేధావుల ప్రకారం ఫాషిజానికి పునాది మధ్య తరగతి, పెటీ బూర్జువా వర్గం లో ఉంది. చిన్న వ్యాపారులు, వర్తకులు, రైతులు, కొంత మంది వృత్తి నిపుణులు ఈ వర్గంలో ఉంటారు. ఆర్థిక సంక్షోభంలో మధ్య తరగతి అందరికన్నా ఎక్కువ దెబ్బతినడంతో, అల్ప సంఖ్యాక వర్గాలనీ, కమ్యూనిస్టులనీ, కార్మిక సంఘాలనీ సంక్షోభానికి కారణమని నిందిస్తారు. కార్మిక వర్గానికున్న వర్గ సంఘీభావం లేకపోవడంతో మధ్య తరగతి తీవ్ర జాతీయవాదాన్ని, జాత్యహంకార దృక్పథాన్ని అలవరచుకుని పెట్టుబడిదారీ వ్యవస్థ లోని సంక్షోభాలని పరిష్కరించడానికి బలమైన రాజ్యం కావాలని డిమాండ్ చేస్తుంది. ఫాషిస్టులు పెట్టుబడిదారీ వ్యతిరేక భాషని జాత్యహంకార, జాతీయవాదాలతో కలగలిపి అసంఘటిత, నిరుద్యోగ కార్మికుల పేదరికానికి వివరణ ఇచ్చి వారిని తమ వైపుకు లాక్కుంటారు. సంక్షోభంలో ఉద్యోగావకాశాలు లేని యువతని కూడా అదే విధంగా తమ వైపుకు లాక్కుంటారు. నేరగాళ్ళని తమతో చేర్చుకుని వారిని ఫాషిస్టు సంఘాల కిరాయి (పేరామిలిటరీ) దళాలుగా వాడుకుంటారు.

ఫాషిజం సాధారణంగా రాజకీయ అస్థిరతని కలగచేస్తుంది కాబట్టి, రాజకీయార్థిక సంక్షోభ సమయంలో పెట్టుబడిదారీ వర్గం దాన్ని ఆఖరి అస్త్రంగా వాడుతుంది. పెట్టుబడిదారీ వర్గం ఫాషిజాన్ని సమర్థించి, అది అధికారంలోకి రావడానికి తోడ్పడడానికి దిమిత్రోవ్ మూడు కారణాలు వివరిస్తారు. ఒకటి, శ్రామిక వర్గం పై పెట్టుబడిదారీ పెత్తనాన్ని ప్రశ్నించే బలమైన కార్మికోద్యమం ఉండడం. రెండు, పెట్టుబడిదారీ విధాన ఉనికినే దెబ్బ తీసేంత ఆర్థిక సంక్షోభం ఉండడం. ఫాషిజం పెట్టుబడిదారీ విధానంలో ఉన్న వైరుధ్యాలని ఎప్పుడూ పరిష్కరించలేక పోయినా, ఆర్థిక సంక్షోభానికి ఫాషిస్టు రాజ్యం ఒక తాత్కాలిక పరిష్కారం కింద బూర్జువాజీ చూస్తారు. మూడు, సాధారణంగా రాజకీయ సంక్షోభమున్నప్పుడు మాత్రమే బూర్జువాజీ ఫాషిజాన్ని సమర్థిస్తారు. అటువంటి సంక్షోభమున్నప్పుడు పెట్టుబడిదారీ వర్గం ఏ ఒప్పందానికి రాలేని అశక్తతని కనబరుస్తుంది. అటువంటప్పుడు బూర్జువా అధికారం కొనసాగడానికి ప్రజాస్వామ్యం సరిపోదు. ఫాషిజం కమ్యూనిస్టుల పట్ల, కార్మిక సంఘాల పట్ల కనబరిచే అతి విరోధాన్ని చూసి బూర్జువాజీ దానికి ఆర్థిక సహాయాన్ని అందించి దాని పెరుగుదలని ప్రోత్సహిస్తుంది.

ఫాషిజం లక్షణాలు:

ముస్సోలినీ ఫాషిస్టు హయాంలో పెరిగిన ఇటాలియన్ నవలాకారుడు, తత్త్వవేత్త ఉమ్బర్టో ఇకో 1995లో ‘న్యూ యార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్’ లో ఫాషిజం గురించి ఒక వ్యాసం రాశారు. దానిలో ఆయన ఫాషిజంకి ఉన్న 14 లక్షణాల జాబితా ఇచ్చారు:
• సంప్రదాయం పట్ల ఆరాధన – అంటే, సత్యం ఎప్పుడో చెప్పబడి ఉంది, దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉండడమే మన పని. దీని పర్యవసానంగా జ్ఞానం ఏ మాత్రం పెరగదు.
• ఆధునికతని తోసిపుచ్చడం – ఫాషిస్టులు, నాజీలు ఇద్దరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరాధించారు కానీ ఆధునిక యుగాన్ని నైతిక పతనానికి నాందిగా చూశారు. ఫాషిజం ఎక్కడైనా హేతువిరుద్ధంగా ఉంటుంది.
• చర్య పట్ల ఆరాధన – దాని మూలాన ముందు ఆలోచన లేకుండా చర్య తీసుకోవడం, ఆలోచనని ఒక రకమైన నపుంసకత్వంగా చూడడం, విమర్శనాత్మక దృష్టిని అనుమానించడం.
• అసమ్మతిని ద్రోహం కింద చూడడం
• భిన్నాభిప్రాయం పట్ల భయం – ఆ భయాన్ని ఉపయోగించుకుని, ఇంకొంత పెంచి ఫాషిజం వృద్ధి చెందుతుంది. బయటి వాళ్ళని చూపెట్టి భయపెట్టడం ఫాషిస్టు చేసే మొదటి పని. ఫాషిజం జాత్యహంకారం కలిగి ఉంటుంది.
• సామాజిక నిస్పృహని వాడుకోవడం – ఆర్థిక సంక్షోభం నుంచో, రాజకీయ అవమానం నుంచో నిస్పృహ చెంది, కింది సామాజిక వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి భయపడుతున్న మధ్య తరగతి నిస్పృహని, భయాన్ని వాడుకుని వృద్ధి చెందడం.
• ఏదో కుట్ర జరుగుతోందని పదే పదే ఊహించడం – దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర ఏదో జరుగుతోందని, దానికి అంతర్గత శత్రువులు (హిందుత్వ ఫాషిస్టుల దృష్టిలో ముస్లిములు) కూడా తోడ్పడుతున్నారని ఫాషిస్టులు నమ్ముతారు. ఇదే వాళ్ళ జాతీయవాదానికి మూలం.
• శత్రువుల సంపత్తిని, బలాన్ని చూసి అవమాన పడడం
• శాంతిప్రియత్వమంటే శత్రువుతో చేతులు కలపడమే – ఫాషిస్టులది జీవితం కోసం పోరాటం కాదు, పోరాటం కోసం జీవితం. అందుకే వాళ్ళకి జీవితమంటే నిరంతర యుద్ధం.
• బలహీనుల పట్ల తిరస్కార భావన
• ఫాషిస్టు సిద్ధాంతంలో వీరత్వమే ఆదర్శం, ప్రతి ఒక్కరిని వీరులుగా, శూరులుగా తయారు చెయ్యడమే విద్య లక్ష్యం. ఫాషిస్టు హీరోలు వీర మరణం కోసం తపిస్తూ ఇతరుల మరణానికి కారకులౌతారు.
• పురుషత్వం, ఆయుధాలు అంటే మక్కువ – దీని ఫలితంగా మహిళలంటే చిన్న చూపు, ఇతర లైంగిక ధోరణుల పట్ల అసహనం, ఖండన.
• బలమైన నాయకుని పట్ల ఆరాధన – ఫాషిజం లో వ్యక్తులకి ఎటువంటి హక్కులూ ఉండవు. ప్రజ అనే ఒక ఉమ్మడి వస్తువుకి ఉమ్మడి ఇచ్ఛ ఉంటుంది, నాయకుడు ఆ ప్రజా ఇచ్ఛకి వ్యాఖ్యాత. తమకంటూ హక్కులు లేని పౌరులు ఏ విషయం గురించి ఏ చర్యా తీసుకోరు, కేవలం ప్రజ అనే పాత్ర పోషిస్తారు.
• ద్వంద్వార్థ, అస్పష్ట భాష – సంక్లిష్ట, విమర్శనాత్మక వాదనకి హద్దులు విధించేందుకు ఫాషిజం పరిమితమైన పదజాలాన్ని వాడుతుంది.

హిందుత్వ ఫాషిజం:

ఈ రోజు మనం హిందుత్వ అని అంటున్న దాని మూలాలు 1925లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి. 1923 నాగ్పూర్ లో వీ.డీ.సావర్కర్ ప్రచురించిన ‘హిందుత్వ’ పుస్తకంతో ప్రభావితమైన హెడ్గేవార్, హిందూ సమాజాన్ని బలోపేతం చేసే ఉద్దేశ్యంతో ఆర్ఎస్ఎస్ ని స్థాపించాడు. సావర్కర్ ప్రకారం ‘హిందుత్వ’ కి మూడు ముఖ్య లక్షణాలు ఉన్నాయి – సమష్టి దేశం, సమష్టి జాతి, సమష్టి సంస్కృతి. భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అందులో మత మైనారిటీలు రెండో తరగతి పౌరులుగా మాత్రమే ఉండగలరు.

తనని తాను సామాజిక ఉద్యమంగా అభివర్ణించుకుని ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్, బ్రిటీషు పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏ రాజకీయ సంఘంతోనూ పొత్తు పెట్టుకోలేదు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బాహాటంగా హిట్లర్, ముస్సోలినీల పట్ల తమ మెప్పుని ప్రకటించారు. హెడ్గేవార్ తర్వాత ఆర్ఎస్ఎస్ ని నడిపిన గోల్వాల్కర్ హిట్లర్ సిద్ధాంతమైన జాతి స్వచ్ఛత నుంచి ప్రేరణ పొందాడు. నాజీ జర్మనీలో యూదుల ఊచకోతని మెచ్చుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకని జాతీయ జెండా కింద గుర్తించ నిరాకరించింది. అట్లానే, ‘మను ధర్మసూత్రాల’ ప్రసక్తి లేని భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించి గుర్తించ నిరాకరించింది.

ఆర్ఎస్ఎస్ కుటుంబం (సంఘ్ పరివార్) లోని ముఖ్య సంస్థలు ఇవి:
* పార్లమెంటరీ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
* సాంస్కృతిక/ రాజకీయ సమీకరణ సంస్థ విశ్వ హిందూ పరిషద్ (వీహెచ్‌పీ)
* పేరామిలిటరీ విభాగం బజరంగ్ దళ్
* సేవా విభాగం సేవా దళ్

ఇవే కాకుండా, వివిధ ప్రజా సెక్షన్లలో వివిధ సంస్థలని ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది – విద్యార్థులు (అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఏ‌బి‌వి‌పి), విద్యా సంస్థలు (విద్యా భారతి), ఆదివాసీలు (వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్), కార్మికులు (భారతీయ మజ్దూర్ సంఘ్, బీ.ఎం.ఎస్), రైతులు (భారతీయ కిసాన్ సంఘ్, బీ.కే.ఎస్) మొదలైనవి. బీజేపీ 1980 లో హిందుత్వ లక్ష్యంగా స్థాపించబడి, 1999 లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని మొదటి నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ రూపంలో అధికారంలోకి వచ్చింది. తిరిగి 2014లోనూ, 2019లోనూ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా అత్యధిక సంఖ్యలో సీట్లు గెలిచి అధికారం లోకి వచ్చింది.

ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న 14 లక్షణాల వెలుగులో ఆర్ఎస్ఎస్ ని, సంఘ్ పరివార్ ని పరీక్షించి అవి ఫాషిస్టో కాదో నిర్ధారణకు వద్దాం.

సంప్రదాయం పట్ల ఆరాధన – ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ పురాతన హిందూ సంస్కృతి గురించి, అది సాధించిన ఘనకార్యాల గురించి మాట్లాడుతుంది. దాని చర్యలన్నీ ఆ సంస్కృతిని పునరుద్ధరించడానికే.

ఆధునికతని తోసిపుచ్చడం – ఆర్ఎస్ఎస్ ఆధునిక శాస్త్రాలన్నిటిని (సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రం కాదు సుమా) పాశ్చాత్య దిగుమతులని, అవి హిందూ జీవన శైలికి సరైనవి కావని ఖండిస్తుంది. అట్లాగే, ఆధునిక రాజకీయ రూపాలు, చట్టాలు హిందూ దేశానికి సరిపోవని నమ్ముతుంది. చివరికి సంఘ్ పరివార్ కి చెందిన కార్యకర్తలు, హిందూ మతంలోని మూఢ నమ్మకాలని, దురాచారాలని ప్రశ్నించిన హేతువాదులని చంపడం దాకా వెళ్లారు.

చర్య పట్ల ఆరాధన – సంఘ్ పరివార్ విభాగాలన్నీ విమర్శనాత్మక ఆలోచన కన్నా చర్య గొప్పదని కీర్తిస్తూ, యూనివర్సిటీల్లో, బయటా ఉన్న మేధావుల పైనా, విద్యావేత్తల పైనా దాడి చేస్తూ ఉంటాయి.

అసమ్మతి అంటే ద్రోహం – అధికారంలో ఉన్న బీజేపీతో కానీ, ఇతర సంఘ్ పరివార్ సంస్థలతో కానీ, హిందూ మతంపై ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానంతో కానీ అసమ్మతి ఉన్న వాళ్ళని దేశద్రోహులుగా చిత్రించి వాళ్ళ మీద దాడులు సాగించడం.

భిన్నాభిప్రాయం పట్ల భయం – ముస్లింలని ఎల్లప్పుడూ బయటివాళ్లుగా చూపించి వాళ్ల పట్ల ద్వేషాన్ని, భయాన్ని రెచ్చగొట్టడం. వాళ్ళే కాకుండా, ఇతర మత మైనారిటీలపై, హేతువాదులపై, నాస్తికులపై, ఉదారవాదులపై, సంఘ్ పరివార్ కన్నా వేరే రకంగా ఆలోచించే ఎవరైనా సరే వారిపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం.

సామాజిక నిస్పృహని వాడుకోవడం – పట్టణాల్లోని నిరుద్యోగ యువతలోనూ, మధ్య తరగతిలోనూ అవినీతి, నిరుద్యోగం, తమ ఆకాంక్షలని తీర్చుకోలేక పోవడం పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తిని బీజేపీ ఎలక్షన్లలో చాలా తెలివిగా వాడుకుంది. దేశంలోని సకల అనారోగ్యాలకి కారణం కాంగ్రెస్ ప్రభుత్వాలని తేల్చేసి, ప్రజలని ఆకట్టుకునే నినాదాలల్లి, సమస్యల పరిష్కారానికి ఎటువంటి విధాన ప్రకటన చెయ్యకుండానే మంచి మెజారిటీతో గెలిచింది.

ఏదో కుట్ర జరుగుతోందని పదే పదే ఊహించడం – సంఘ్ పరివార్ జాతీయవాదం నిర్వచన ప్రకారం దేశంలో ముస్లిములు, బయట పాకిస్తాన్ భారత దేశ శత్రువులు, నిరంతరం దేశానికి వ్యతిరేకంగా ఏవో కుట్రలు చేస్తూ ఉంటారు.

శత్రువుల సంపత్తిని, బలాన్ని చూసి అవమాన పడడం – అది చైనా ఐనా, పాకిస్తాన్ ఐనా, వాళ్ళు ఆర్థిక రంగంలో కానీ, ఆయుధాలలో కానీ, సైనిక బలంలో కానీ ముందుంటే, ఓర్వ లేకపోవడం, అవమానంగా తీసుకోవడం.

శాంతిప్రియత్వమంటే శత్రువుతో చేతులు కలపడమే – కాశ్మీర్ సమస్యని, ఈశాన్య రాష్ట్రాల సమస్యలని పరిష్కరించడానికి వేర్పాటువాదులతో, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సంభాషణ సాగించమని చెప్పడాన్ని సంఘ్ పరివార్ శత్రువుతో కుమ్మక్కవ్వడంగా పరిగణిస్తుంది.

బలహీనుల పట్ల తిరస్కార భావన, పురుషత్వం, ఆయుధాలు అంటే మక్కువ – ఇవి రెండూ కలిసి సాగుతాయి. సంఘ్ పరివార్ భాష, చర్యలు ప్రజలని ఆయుధాలు పట్టి శత్రువులపై విచక్షణ లేకుండా దాడి చేసేలా పురికొల్పుతాయి. ఆ శత్రువులు ఊహాజనితం కావచ్చు, వాళ్ళు వృద్ధులు, పిల్లలు, బలహీనులు, వికలాంగులు కావచ్చు. అట్లానే సంఘ్ పరివార్ కార్యకర్తలు సాయుధ దళాల పట్ల విపరీతమైన ఆరాధనా భావాన్ని కనబరుస్తారు, వాళ్ళని మాత్రమే నిజమైన దేశభక్తులుగా చూస్తారు.

వీరత్వమే ఆదర్శం – దేశం కోసం వీర మరణం పొందాలని, వీలైనంత ఎక్కువమంది ఇంటా, బయటా ఉన్న శత్రువులని చంపాలనే బలమైన ఆకాంక్షని ఆర్ఎస్ఎస్ క్యాడర్లో బాగా నూరిపోస్తారు.

బలమైన నాయకుని పట్ల ఆరాధన – బీజేపీ పార్టీలో, ప్రభుత్వంలో నరేంద్ర మోడీకి ఎదురులేదు. మిగతా కేంద్ర మంత్రులు, ఎంపీ లు, ప్రజల్లో అధిక భాగం ఆయన్ని ఆరాధించే అనుచరులు. ఆయన నిర్ణయాలకి తిరుగు లేదు, వాటిని ప్రశ్నించే సత్తా ఎవరికి లేదు.

ద్వంద్వార్థ, అస్పష్ట భాష – అసమ్మతి ప్రకటించే విద్యావేత్తలని, రాజకీయ పార్టీలని, కార్యకర్తలని, విద్యార్థులని, రచయితలని, కళాకారులని, మీడియాని, మామూలు ప్రజలనీ దూషించడానికీ, ఖండించడానికీ, బెదిరించడానికీ సంఘ్ పరివార్ కొత్త పదజాలాన్ని కనిపెట్టింది. ఈ పదజాలం మెల్లగా పాత పదాల స్థానాన్ని ఆక్రమించుకుని, మధ్య తరగతి ప్రజల్లో విస్తృతంగా ఆమోదాన్ని పొందుతోంది. ఉదా – ‘యాంటీ-నేషనల్’, ‘స్యూడో-సెక్యులర్’, ‘ప్రెస్టిట్యూట్’.

హిందుత్వ ఫాషిజం పెరుగుదల కారణాలు:

ఆర్థిక రంగంలో తగ్గిన పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఉద్యోగావకాశాల లేమి, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల అవినీతి, రోడ్లు, నీళ్ళు, విద్యుత్తు మొదలగు మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇవన్నీ యూపీఏ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కోపం, నిరాశ పెరగడానికి ముఖ్య కారణాలు. వాటి పర్యవసానంగా 2014లో మోడీ మొదటి సారి అధికారంలోకి వచ్చాడు. దీనికి తోడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా చేస్తున్న సాంస్కృతిక, స్వచ్ఛంద కృషి ఫలితంగా ప్రజలు తమ అస్తిత్వాన్ని చూసే దృష్టిలో పెద్ద మార్పు వచ్చింది. హిందువుల్లో చాలా మంది తమని తాము ముందు హిందువులుగా, తర్వాతే భాషా, కుల, ప్రాంత ఆధారిత అస్తిత్వాలతో గుర్తించడం మొదలు పెట్టారు. దీని పర్యవసానంగా హిందూ అస్తిత్వం దేశం మొత్తం మీద నిర్మించబడింది. అదే సమయంలో, ఈ రకంగా ఆలోచించే హిందువులు ఇతర మత ప్రజలని, ముఖ్యంగా ముస్లిములని రెండో తరగతి పౌరులుగా చూడడం మొదలు పెట్టారు.

బాహాటంగా కనిపించే ఈ కారణాల వెనక దేశీయ, అంతర్జాతీయ కార్పొరేషన్ల, కార్పొరేట్ మీడియాల హస్తముంది. అవన్నీ కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడి, చాలా డబ్బు వెచ్చించాయి. నిర్మాణ, గనుల, పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో యూపీఏ ప్రభుత్వంతో (ఎం.ఓ.యూ) ఒప్పందాలు సంతకం చేసిన కార్పొరేషన్లు కొన్ని ప్రాంతాల్లో ప్రజల ప్రతిఘటన వలన తమ ప్రాజెక్టులని నిర్వహించలేక పోయాయి. మన్మోహన్ సింగ్ కన్నా నిర్దయగా, పట్టుదలగా ప్రతిఘటనని అణచివేసి, అవసరమైతే ప్రజలని పెద్ద ఎత్తున నిర్వాసితులని చేసి, రక్తపాతం కావించైనా కార్పొరేషన్ల దారి సుగమం చేసే మనిషి వాటికి కావాల్సి వచ్చింది. అందుకే ఈ కార్పొరేషన్లు మోడీ గెలవడానికి అంత కష్టపడ్డాయి. యూపీఏ ప్రభుత్వం కింద ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో మొదలైన నిర్వాసిత ప్రక్రియ, రక్తపాతం కార్పొరేషన్లకి కావాల్సినంత సమర్థవంతంగా సాగలేదు. అంతే కాకుండా, రెండో సారి అధికారం లోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో, విధాన స్తంభనలో కూరుకు పోయింది. అది ప్రజల్లో చాలా సెక్షన్లలో ఆగ్రహానికి దారి తీసింది. ఆ ఆగ్రహం పెరిగి విప్లవ మార్గం పట్టేలోపు దాన్ని నిభాయించాల్సిన అవసరముంది. అటువంటి సందర్భంలో గుజరాత్ ముఖ్య మంత్రిగా ‘సమర్థుడు’, ‘అభివృద్ది కాముకుడు’, ‘నీతిపరుడు’ అని పేరు ప్రఖ్యాతులు గడించిన మోడీ కార్పొరేషన్లకి ప్రధాన మంత్రి పదవికి ఉత్తమ అభ్యర్థిగా కనిపించాడు. అట్లా పెట్టుబడిదారులు సంభవించగల రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి అడ్డుపడ్డారు. ఎలక్షన్లలో మోడీ బ్రాండ్ ధగ ధగా మెరిసి పోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలని బలవంతాన ప్రజలపై రుద్దడానికి మోడీ నిరంకుశ వ్యక్తిత్వం అవసరమైతే, అప్రజాస్వామిక, అన్యాయమైన, బాధాకరమైన ఆర్థిక కార్యక్రమాలని ప్రజలకి మింగుడు పడేలా చెయ్యడానికి, వాళ్ళ ఆగ్రహాన్ని పక్క దారి పట్టించడానికి బీజేపీ పార్టీ జాతీయవాద హిందుత్వ సిద్ధాంతం అవసరమైంది. ఈ విధంగా అంతర్జాతీయ నయా ఉదారవాద పెట్టుబడి హిందుత్వ ఫాషిజంతోనూ, దేశీయ దళారి పెట్టుబడితోనూ చేతులు కలిపి మోడీ అధికారంలోకి వచ్చేట్టు చేసింది.

హిందుత్వ ఫాషిజం దాడి రూపాలు:

ఆర్ఎస్ఎస్/ సంఘ్ పరివార్ చర్యలన్నీ ‘హిందూ రాష్ట్ర’ స్థాపన లక్ష్యంగా, ‘హిందూ ధర్మ’ సిద్ధాంతాన్ననుసరించి సాగేవే. హిందూ ధర్మాన్ని అమలు చెయ్యడానికి వివిధ సెక్షన్ల ప్రజల మీద వివిధ రూపాల్లో జోక్యమూ, దాడులూ సంఘ్ పరివార్ సాగిస్తోంది. వాటిలో మచ్చుకి కొన్ని:

సంఘ్ పరివార్ సభ్యులు, బీజేపీ ఎంఎల్ఏ లు, ఎంపీ లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తరచుగా భారత రాజ్యాంగం మన దేశ పరిస్థితులకి సరిపోదని, దాని స్థానంలో మను స్మృతిని అమలు చేయాలని అంటూ ఉంటారు. అట్లాగే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాశ్చాత్య దిగుమతి అని, ‘భారత్’కి అది అన్వయించదని, దాని స్థానంలో వేరే రకమైన పాలనావ్యవస్థని నెలకొల్పాలని బాహాటంగా చెప్తారు.

సంఘ్ పరివార్ ఏనాడూ కుల వ్యవస్థని ప్రశ్నించలేదు, ప్రశ్నించదు కూడా. అగ్రకులాలు, వెనకబడిన కులాల మధ్య ఉన్న భేదాలు, వైరుధ్యాలకి పైపై పరిష్కారంగా అస్పృశ్యతని వ్యతిరేకించడమే కానీ కుల వ్యవస్థని రద్దు చేయాలని సంఘ్ పరివార్ ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేదు. చాలా సార్లు వాళ్ళు కుల పంచాయతుల తాఖీదులని సమర్థించారు కూడా.

హిందుత్వ కార్యకర్తలు నిరంతరం ముస్లిమ్లని అంతర్గత శత్రువులుగా చూపిస్తూ, ముస్లిం యువకులు ‘లవ్ జిహాద్’ పేరిట అమాయక హిందూ యువతులని తమ వలలో వేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటారని చెప్తూ, వాళ్ళ పట్ల హిందువుల్లో ద్వేషాన్ని, భయాన్ని రెచ్చగొడుతున్నారు. ఇదే సాకుగా తీసుకుని ముస్లింలపై దాడులు చేసి, వాళ్ళని చిత్రవధ చేసి చంపుతున్నారు. ముస్లిం యువకులని పెళ్లి చేసుకున్న హిందూ యువతులని భర్తల నుంచి బలవంతంగా విడదియ్యడం, లేదా ఆ యువతుల కుటుంబ సభ్యులు ముస్లిం యువకులపై దాడులు చెయ్యడానికి సహాయపడడం చేస్తున్నారు. కొన్ని సార్లు ముస్లింలకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టించి కోర్టుకి వెళ్తున్నారు.

కుల అణచివేతని తప్పించుకోవడానికి, విద్యావకాశాలు మెరుగు పర్చుకోవడానికి, ఆత్మగౌరవంతో బ్రతకడానికి క్రిస్టియన్ మతం తీసుకున్న ఆదివాసీలు, దళితుల విషయంలో సంఘ్ పరివార్ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో క్రిస్టియన్లుగా మత మార్పిడి చేసుకున్నా వాళ్ళని తిరిగి హిందూ మతంలో చేరుస్తారు. చాలా సార్లు ఇది బలవంతంగా చెయ్యబడుతోంది.

హిందుత్వ సమూహానికి ఆవు అతి పవిత్రమైనది కాబట్టి, దాన్ని రక్షించాలనే నెపంతో దేశం మొత్తం మీద ‘గౌ రక్షక్’ దళాలు ఏర్పడ్డాయి. ఈ దళాలకి ఒకటే పని – ముస్లింలు లేదా దళితులు పశు వ్యాపారం కోసమో, పాడి కోసమో ఆవులతో కనిపిస్తే సరి, వారిని చంపడం. ఈ వ్యాపారులు, రైతులు చట్టబద్ధంగా పశువులని తమ ఇంట్లో అవసరాలకో, వాళ్ళ ఊళ్ళల్లో చట్టబద్ధంగా అమ్మడానికో తీసుకువెళ్తున్నా సరే, వాళ్ళని కొట్టడం, చంపడం గౌ రక్షకుల పని. గూండాగిరీ చేస్తూ, యదేచ్ఛగా చంపుతూ దేశం మొత్తం మీద స్వేచ్ఛగా తిరిగే అతి భయానక గుంపులు గౌ రక్షకులు.

ప్రతి చోట ముస్లింలని అనుమానిస్తూ తమ దేశభక్తిని రుజువు చేసుకోమంటున్నారు.

‘భారతీయ సంస్కృతికి’ అనుగుణంగా మహిళల వస్త్రధారణ మీదా, నడత మీదా, చేపట్టతగ్గ వృత్తుల మీదా పరిమితులు విధించడం, తల్లులుగా, భార్యలుగా వాళ్ళు నిర్వర్తించవలసిన విధులని నిర్ణయించడం చేస్తున్నారు.

మీడియాలో, విద్యాసంస్థల్లో, సాహిత్య సంస్థల్లో, మామూలు జనం మాటల్లో ఉన్మాదకరమైన జాతీయవాదం ఆధిపత్యం వహిస్తోంది. అసమ్మతిని తెలిపే ఏ వ్యక్తినైనా వెంటనే దేశద్రోహి అని ముద్ర వేసి, హింసించడమో లేదా జైల్లో పెట్టడమో చేస్తున్నారు. యూనివర్సిటీల్లో, విద్యా స్థలాల్లో విమర్శనాత్మక చర్చలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రజా హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే హక్కుల కార్యకర్తలని దేశద్రోహుల కింద చిత్రించి వాళ్ళని జైళ్లలో వేసి శిక్షిస్తున్నారు.

హిందూ మత మూఢ నమ్మకాలని, కులం వంటి దురాచారాలని ప్రశ్నిస్తున్న, సంఘ్ పరివార్ హిందూ మత వ్యాఖ్యానంతో సమ్మతించని హేతువాదులు, రచయితలు, విద్యావేత్తలు, మీడియా వాళ్ళని బెదిరించడమో, చంపడమో చేస్తున్నారు. అట్లాగే, సంఘ్ పరివార్ జాతీయవాదంతో, రాజకీయ ఆచరణతో ఏకీభవించని ఉదారవాద మేధావులని, ప్రజాస్వామిక వాదులని బెదిరించి వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నారు.

సంఘ్ పరివార్ కి విధేయులైన విద్యావేత్తలని – వాళ్ళ సామర్థ్యాన్ని, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా – పేరుగొన్న విద్యా సంస్థలకి, ఇండియన్ హిస్టారికల్ కాంగ్రెస్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంటి ప్రొఫెషనల్ సంస్థలకి అధిపతులుగా నియమిస్తున్నారు. అట్లాగే, రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, ఆర్‌బీఐ, కేంద్ర నిఘా సంస్థ వగైరాల అధిపతులుగా సంఘ్ సభ్యులనో లేక సంఘ్ తాఖీదులకి పూర్తిగా విధేయులైన వారినో నియమిస్తున్నారు. ఎన్నో కేంద్ర యూనివర్శిటీల ఉపకులపతులు స్వయంగా ఆర్ఎస్ఎస్ సభ్యులు. లోకంలోనే పేరుప్రఖ్యాతులున్న జేఎన్‌యూ యూనివర్సిటీని ఎట్లాగైనా నాశనం చేయాలని చూస్తున్న దాని ఉపకులపతి అందుకు ఒక ఉదాహరణ.

భారత దేశపు పూర్వపు శోభ పునరుద్ధరించే పేరుతో సంఘ్ సభ్యులు, బీజేపీమంత్రులు ‘వేద శాస్త్రం’, ‘వేద గణితం” ని బాగా ప్రచారం చేస్తున్నారు. నిరూపితమైన శాస్త్రీయ విషయాలని పాశ్చాత్య భావనలుగా కొట్టివేస్తూ, వేదాల్లో చెప్పిన పద్ధతులని వ్యవసాయంలో, పునరుత్పత్తిలో, ఇంజినీరింగ్లో పాటించాలని బలంగా వాదిస్తున్నారు. ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలన్నీ హిందూ గ్రంథాల్లో వేల ఏళ్లుగా ఉన్నాయని వాదిస్తున్నారు – ఉదా ప్లాస్టిక్ సర్జరీ, విమానాలు, న్యూక్లియార్ ఫ్యూజన్ ప్రాచీన భారతంలోనే ఉన్నాయని చెప్తున్నారు.

చరిత్ర పుస్తకాలని తిరగ రాసే తీవ్ర ప్రయత్నాల్లో భాగంగా వీర్ సావర్కర్, వల్లభ భాయి పటేల్ వంటి వారి చారిత్రక పాత్రని మార్చి, నెహ్రూ పాత్రని పూర్తిగా తుడిచి పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.

హిందుత్వ ఫాషిజంని ప్రతిఘటించడమెలా?

సంఘ్ పరివార్ కి ఉన్న ఫాషిస్టు లక్షణాలు ఏఏ రూపాల్లో వ్యక్తీకరణ పొందుతున్నాయో పైన చూశాము. సంఘ్ పరివార్, దాని అనుబంధ రాజకీయ పార్టీ ఐన బీజేపీ ఫాషిస్టువైనా, ఇంకా భారత రాజ్య వ్యవస్థ, యంత్రాంగం పూర్తిగా ఫాషిస్టు అనలేము. ఈ సంఘ్ పరివార్ హిందుత్వ ఫాషిజాన్ని ఎదుర్కోవడానికి వివిధ సెక్షన్ల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమాలు, కార్మిక, రైతు, విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి పని చెయ్యాలి. ఈ సందర్భంగా చారిత్రక ఫాషిజం ని ఓడించడానికి క్లారా జెట్కిన్ ప్రతిపాదించిన కార్యాచరణ నుంచి ఈనాటి సందర్భానికి సరిపోయే కొన్ని విషయాలని తీసుకోవచ్చు.

హిందుత్వ ఫాషిస్టుల కార్మిక ప్రతికూల వర్గ స్వభావం గురించి కార్మిక వర్గానికి చెప్పాలి; ఫాషిజం పెట్టుబడిదారీ విధానానికి ఏ విధంగా తోడ్పడుతుందో ప్రజలకి తెలియచేయాలి.

కార్మిక వర్గాల్లో ఆత్మ రక్షణ దళాలని ఏర్పరచాలి. ముఖ్యంగా హిందుత్వ ఫాషిస్టుల ప్రచారానికి లక్ష్యమైన అసంఘటిత కార్మిక వర్గాన్ని ఈ దళాల్లో సమీకరించాలి. కార్మిక వర్గ చైతన్యాన్ని, ఆచరణని అడ్డుకొనే ఫాషిస్టు ప్రయత్నాలని నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టాలి.

హిందుత్వ ఫాషిస్టుల ప్రచారానికి ఎక్కువగా ప్రభావితమౌతున్న నిరుద్యోగ యువతపై దృష్టి పెట్టాలి. వాళ్ళ సమస్యలకి మూలం పెట్టుబడిదారీ విధానంలో ఉందని, దానికి పరిష్కారం ఆ విధానాన్ని ప్రతిఘటించడంలో ఉందని, అంతే కానీ ఫాషిజం కాదని చెప్పాలి.

అన్ని శ్రామికుల, వామపక్ష పార్టీలు, కార్మిక, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రజా సంఘాలు కలిసి ఫాషిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనగా ఏర్పడి హిందుత్వ ఫాషిజానికి వ్యతిరేకంగా పోరాడాలి.

హిందుత్వ ఫాషిస్టు వ్యతిరేక ప్రతిఘటన అటు పార్లమెంటులోనూ, ఇటు ప్రభుత్వ, బహిరంగ వ్యవస్థల్లోనూ సాగించాలి. ఫాషిజం కి ఉన్న పెట్టుబడిదారీ, జాత్యహంకార స్వభావాన్ని తేటతెల్లం చెయ్యాలి.

హిందుత్వ ఎంతగా మీడియాని వాడుకుంటోందో అంతగా హిందుత్వ వ్యతిరేక శక్తులు కూడా వాడడం నేర్చుకోవాలి. పాత మీడియా, పాత పద్ధతులే కాకుండా సోషల్ మీడియా లాంటి కొత్త వాటిని, యువతని ఆకర్షించేలా వాడుకోవాలి. అంతర్జాతీయంగా భారత దేశంలోని డొల్ల ప్రజాస్వామ్యాన్ని బహిర్గత పరచడానికి పత్రికలని, ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని, అంతర్జాతీయ హక్కుల సంఘాలని వాడుకోవాలి.

ప్రస్తుతానికి దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ సెక్షన్ల ప్రజలు హిందుత్వ ఫాషిస్టు ప్రభుత్వ విధానాలని, కార్యక్రమాలని రకరకాల పద్ధతుల్లో ప్రతిఘటిస్తున్నారు. ముఖ్యంగా దళిత, ఆదివాసీ, రైతాంగ, విద్యార్థి సంఘాలు ఇందులో ముందున్నాయి. ఇవన్నిటిని ఐక్య పరిచి ఒక నిర్దిష్ట రాజకీయ, సైద్ధాంతిక కార్యక్రమంతో నడిపించే ఐక్య సంఘటనని ఏర్పరచడమే తక్షణ కర్తవ్యం, అవసరం.

ఇంజినీరింగ్ చదువుకున్నారు. సాహిత్యం, రాజ‌కీయార్థిక శాస్త్రాల అధ్యయ‌నంలో అభిరుచి. మూడు ద‌శాబ్దాల‌పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ప‌నిచేశారు. సీడీఆర్‌సీ, వీక్ష‌ణం మాస‌ప‌త్రిక‌తో ఎనిమిదేళ్లు ప‌నిచేశారు. భార‌త‌దేశంలో కుల‌, వ‌ర్గ సంబంధాల‌పై అధ్య‌యనం చేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉంటున్నారు.

Leave a Reply