పడగ్గది రాజకీయాల్ని విప్పిన ఇనపగొంతు

కాంతి చెప్పినట్టు కథలు చదివితే ఆనందం కలుగుతుంది… కథలు చదివితే మనోవికాసం కలుగుతుంది. కథలు చైతన్యాన్నిస్తాయి – మనుషుల పట్ల ప్రేమని కల్గిస్తాయి కానీ కథలు చదివితే భీతావహమైన అనుభవంతో, భయంతో వొణికిపోవడం, నిరంతరాయంగా నిద్ర లేని రాత్రులు గడపాల్సి రావడం, రోజుల తరబడి మరో ఆలోచనే లేకుండా ఆ కథల్లోనే గుడిసుళ్ళు పడడం ఇవీ గీతాంజలి కథలు కలిగించిన అనుభవం.

ఇంత పచ్చిగా విప్పి చెప్పాలా అన్న అభియోగాన్ని పక్కన పెట్టి ఈ కథల యొక్క అనివార్యతని పరిగణించాలి. చుట్టూ ఉన్న సమాజం చెప్పరానంత నెగటివ్ గా, భరించరానంత భీతావహంగా స్త్రీలను పీక్కుతింటూ ఉంటే సాహిత్యం భయాన్ని కాక మరే అనుభూతినివ్వగలదు? రెస్ట్‌లెస్‌నెస్ కాక సుఖనిద్రనెలా ఇవ్వగలదు?

సమస్యను నగ్నంగా, ఉద్విగ్నంగా, తీవ్రకోపంగా, మొరటుగా, కఠోరంగా బండబూతులుగా చెప్పి పాఠకుల్ని భీతావహుల్ని చేయడం గీతాంజలికీ ఇష్టముండదు కానీ అంత మోటుగా చెప్తేనే తప్ప దళసరి చర్యలు కదలబారవు కదా.

నిజానికి గీతాంజలి ఒక మామూలు రచయిత్రే.

ఆమెకీ తూరుపు కొండల్లో ఉదయిస్తోన్న సూర్యుడి గురించీ, ఆకాశం మీద స్వేచ్ఛగా ఎగురుతోన్న వరస పక్షుల గురించీ, చెట్టు కొమ్మమీది జంట గువ్వల గురించీ, టీనేజీ ప్రేమ గురించీ, చుట్టూ ఉన్న మనుషుల జీవన విధానాల గురించి హాయిగా రాసుకోవాలనే ఉంటుంది… ఏ కళ యొక్క అంతిమ లక్ష్యమైనా జీవనానందమే కదా… అయితే ఆమె వద్దకు వచ్చే స్త్రీ పేషెంట్లు చెప్పే గాధలు ఆమెను మరోవైపుకు లాగుతాయి. ఆమెను కుదురుగా కూర్చోనివ్వవు, నిలబడనివ్వవు. అందుకే ఆమె నిర్ణయించుకుంది… సమాజంలోని ఇతరేతర బాధాకరమైన సందర్బాలను చర్చించడానికి, సాహిత్యంలోకి తేవడానికి చాలా మందే మేధావి రచయితలున్నారు… స్త్రీలకు సంబంధించిన ఈ సున్నితమైన జీవ కోణాన్ని, లైంగిక విషాదాల్ని తను మాత్రమే చెప్పగలదు కాబట్టి ఈ గాథల్ని సభ్యసమాజం ముందు పరచాలని తీర్మానించుకుంది… ఇతర రచయితల కంటే ఒక భిన్నమైన దారిలో ప్రయాణించడం ప్రారంభించింది… అయితే ఈ జీవిత శకలాల్ని కథలుగా మలచే క్రమంలో ఆమె ఎంతగా తనలోకి తాను దిగబడిపోయిందో ఊహించడం కష్టం.

చాలా ఏళ్ళముందు నాగప్పగారి సుందర్రాజు రాసిన “నడిమింట బోడెక్క బసివిరాలయ్యెద” అన్న కథ చదివి పాఠకులు భీతిల్లారు… ఒక చోట బసివిని, ఒకచోట మాతంగి, మరోచోట ‘జోగిని’… ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు అయితే ఏ ప్రాంతంలోనయినా ఆమె పురుషుడి ఆస్తి. సుందర్రాజు కథ బసివిని చేసే విధానాన్ని, ఆ సాంప్రదాయాన్ని సాహిత్య ప్రపంచానికి చెప్తే, దానికి కొనసాగింపుగా గీతాంజలి రాసిన కథ పాఠకుల పేగుల్ని పుండు పుండు చేస్తుంది… జోగినులయ్యాక వారి పరిస్థితిని చాలా సూక్ష్మస్థాయిలో కెళ్ళి అంతిమంగా ఆ ఆడపిల్ల జీవితం ఎలా ముగుస్తుందో చెప్పిన కథ ‘ఉయ్యాల’… అసలీ సాంప్రదాయమేమిటో, ఇది ఇలానే ఎందుకు కొనసాగాలో, ఎల్లమ్మ జాతరలో జోగిని ఎందుకు నగ్నంగా ఉయ్యాలలూగాలో, అసలు మనం ఇంకా మధ్యయుగాలలోనే ఉన్నామా అని ఆగమాగమవుతాం మనం…

ఎయిడ్స్ వచ్చి తనింక ఎక్కువ దినాలు బతకదన్నపుడు కూడ భయమెయ్యలే అనసూయకు “బంబయిలో ఎంత సంపాయిచ్చినవు బిడ్డా” అంటూ తల్లి డబ్బు కోసం వచ్చినపుడు, తన యోనిని ఉత్పత్తి కేంద్రంగా పరిగణించిన తల్లి దండ్రుల్ని చూసినప్పుడు మాత్రం మనుషుల పట్ల, మానవత్వం పట్ల నమ్మకం కోల్పోయి భయమేస్తుంది అనసూయకు… చదువుతున్న పాఠకుడికి కూడ.

తమ కులంల తనసొంటి ఆడపిల్లలను జోగినులయ్యి వ్యభిచారం చేసి బతకమన్న ఎల్లమ్మ దేవతెట్లయింది —- దెయ్యమయితది గద?” అంటూ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నని సమాజం మీదికి వొదులుతుంది అనసూయ.

ఆ మాటకొస్తే ఈ సంపుటి లోని ప్రతీ కథా కూడా అంతే జవాబులేని ప్రశ్నల్ని మన ముఖాల మీదికి వదులుతాయి… సిగ్గుతో కుచించుకుపోతాం మనం.

పాతికేళ్ళ క్రితం మగపిల్లాడ్ని కనలేదని పుట్టింటికి తరిమి వేయబడిన భారతి గురించి నాకు తెలుసు… ఎంఎస్సీ చేసి జువాలజీ లెక్చరర్ గా పని చేసే భారతి భర్తకి స్త్రీ లలో ఎక్స్ఎక్స్ క్రోమోజోములుంటాయనీ, పురుషుడి లో ఎక్స్ వై క్రోమోజోములుంటాయనీ… స్త్రీలోని ఎక్స్ పురుషుడిలోని ఎక్స్ కలిసినపుడు ఆడపిల్ల, పురుషుడిలోని వై స్త్రీలోని ఎక్స్ తో కలిసినపుడు మగపిల్లాడు పుడతారని సైన్స్ చదువుకున్న అతడికి తెలీకనా. పుట్టింటికి తరచు వచ్చే ఆడపిల్లల్ని పరువు కోసం భయపడి, ఏదో విధంగా నచ్చ చెప్పి అత్తింటికి పంపేసే తల్లిదండ్రుల్ని అమ్మా ‘మాక్కొంచెం నమ్మకమివ్వండి’ అంటుంది భారతి. అప్పటికి సమస్య ఏమిటో అర్థం చేసుకుని పోరాడ్డానికి కొంత వీలుండేది. కాని స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే కేవలం ఒక్క అవయవంగా, స్త్రీలు సరుకులుగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆడది మగపిల్లాడ్ని కనిచ్చే ఉత్పత్తి కేంద్రంగా మాత్రమే చూడబడుతోంది… ఆ వంశోద్దారకుడ్ని కన్న తర్వాత ఆ తల్లి శరీరం ఉన్నా, పోయినా ఒకటే. ఈ పరోక్ష హత్యల్ని గుర్తించి, ఎదిరించి పోరాటం చేయడం అంత తేలికేమీ కాదు… అదంతా అత్యంత సహజమైన విషయంగా భావించి లోలోపల నలిగి మానసికంగా, శారీరకంగా కృంగిపోయి అదే జీవితమని భ్రమించి చావుకి దగ్గరయిన మంజీర చాలా కాలం దాకా మరపురాదు మనకి.

ఈ కథలు చదువుతోన్న పాఠకుడికే ఇంత భయం, గగుర్పాటు కలిగితే ఇక ఆ మనుషులందరికీ, ఎట్లా ఉంటుందో… కానీ సమస్యని చూసి చలించిపోవడం కాదు నిబ్బరంగా దాన్ని ఎత్తిపట్టడం, ఎదురు నిలిచి పోరాట స్ఫూర్తిని రగిలించడమే ధ్యేయంగా ఆమె ఈ కథలు రాసినట్లు తెలుస్తుంది. వాళ్ళందరినీ అక్కున చేర్చుకుంటూ ఈ డాక్టరమ్మ ఎన్నెన్ని అవతారాలెత్తిందో ఈ కథల్లో.

స్వంత కూతురి మీద ఏడేళ్ల వయసు నుండి స్వయంగా తండ్రి చేసిన అత్యాచారం ఎంతకీ మింగుడు పడదు మనకి… వదలమని ఏడిస్తే జుట్టుపట్టి లాగి కొడుతూ, బెదిరిస్తూ వంటగదిలోకి లాక్కెళ్ళడం అడ్డు చెప్తే, అమ్మని, చెల్లెళ్ళనూ చంపేస్తానంటూ బెదిరించడం, “బేటీ మేరా ప్యారా హై” అంటూ నచ్చచెప్పడం దీన్ని తండ్రి ప్రేమంటారా. కేవలం కోరికతో, కామంతో ఎరుపెక్కిన కళ్ళలో మదంతో కూతుర్ని కన్నతల్లి ముందే, తన ఇతర సంతానం ముందు నుండే కాళ్ళు పట్టి వంటగదిలోకి ఈడ్చుకెళ్ళడాన్ని, కాళ్ళ మధ్యన కత్తిని దింపడాన్ని తండ్రి ప్రేమంటారా? అందరి తండ్రులూ ఇలాగే ఉంటారా? పధ్నాలుగేళ్ళు నిండకనే రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న ఆస్రా పసి మనసులో ఎన్నెన్ని రకాల ప్రశ్నలో… తనని సహానుభూతితో అర్థం చేసుకున్న టీచర్ సాయంతో అబ్బాని జైల్లో పెట్టించినందుకు వీధిలో వాళ్ళు ఆస్రాని, ఆమె తల్లినీ రాళ్ళతో కొడతారు. అదే వీధిలో వాళ్ళు తల్లినీ, కూతుర్నీ సవతులని ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి… ‘ఆ తల్లికెంత సిగ్గులేదో, ఎట్లా ఊకుందో’ అంటూ నిందించిన రోజులున్నాయి. ఆ తల్లి భర్త చేత తిన్న చావు దెబ్బల గురించి ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు జనం చేసిన పత్తర్ల గాయాల ఆస్రాని మరింత సలుపుతుంది… ఆమెకి అర్థం కాని దొకటే… కన్నబిడ్డను ఖరాబు చేసిన తండ్రిని కదా రాళ్ళతో కొట్టాల్సింది… అంటూ అమాయకంగానే సమాజాన్ని నిలదీస్తుంది.

ఇవ్వాళ తండ్రుల, తాతల, మామయ్యల, అన్నయ్యల పక్కింటి అంకుల్ వాళ్ళు తమని ముట్టుకునే స్పర్శలో తేడాల గురించి పిల్లలకి చిన్ననాటి నుంచే బోధించాల్సిన విషాద స్థితిని కూడ చెప్తాయీ కథలు.

మన సమాజంలో ఏ సామాజిక వర్గంలోనయినా, ఏ స్థాయిలో నయినా సరే ఏకపక్షంగా సాగుతోన్న లైంగిక సంతృప్తుల మీద చాచి పెట్టి కొట్టిన దెబ్బ ‘హస్బెండ్ స్టిచ్’… నడి వయసొచ్చాక మనుషులు వొదులవడం సహజమే కదా అన్న స్పృహ పురుషుడిలో ఉండదు. నిజానికి పురుషుడిలోనూ ఎన్నెన్ని ఇబ్బందులుంటాయి? అయితే వాటినధిగమించడానికి, పటిమ పెంచడానికి అనేక రకాల మందులూ, మార్గాలూ వారికి సహకరిస్తాయి… స్త్రీలకీ తృప్తి కావాలన్న స్పృహ అస్సలు సమాజంలోనే లేదు.

భర్తల పక్కన అందమైన రంగు బొమ్మల్లా నడవడం కోసం కడుపు మాడ్చుకుని జిమ్ముల చుట్టూ తిరిగి శరీరాల్ని హింస పెట్టుకోవడం చూశాం కానీ భర్తల్ని తృప్తి పరచడం కోసం తమ యోనుల్ని కుట్టించుకోవడం, డాక్టర్ల వద్దకి వెళ్ళి యోనులకి అదనపు కుట్లేయించుకుంటారని తెలిసి విస్తుపోతాం మనం.

అంతకంటే ముక్కున వేలేసుకుని, కడుపులో తిప్పి వాంతి చేసుకునే కథ మరొకటుందీ సంపుటిలో… భర్త చేతికి తన ఎద చాలడం లేదని తెలిసి సిలికాన్ సంచుల్ని రొమ్ముల స్థానంలో ఇంప్లాంట్ చేసుకోవడం… అలా ఇంప్లాంట్ చేయించుకోవడం వల్ల భవిష్యత్ లో బ్రెస్ట్ కేన్సర్ వంటి వ్యాధుల్ని డయగ్నోజ్ చేయడం సాధ్యపడదని తెలిసి కూడ, తన ప్రాణం కంటే భర్తని తృప్తి పరచడమే ముఖ్యమని నమ్మే పిచ్చితల్లి సుశీల ఆ ఇంప్లాంట్ సర్జరీకి ముప్పయి వేలవుతుందని తెలిసి అప్పుకోసం అందరి వద్దకూ పరిగెట్టడం గుండెల్ని పిండేస్తుంది… భర్తలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడం కోసం, వారు తమ నుండి దూరం జరగకుండా ఉండడం కోసం ఎట్లా స్త్రీలు తమ ప్రాణాలని కూడ పణంగా పెడతారు అన్నది సూక్ష్మస్థాయిలోకి వెళ్ళి అర్థం చేయిస్తుందీ కథ…

ఈ పితృస్వామిక వ్యవస్థ ఎంత క్రూరమైనదంటే… అవమానాలతో జాగారపు రాత్రులలో పుండు పుండయిన మనః శరీరాలతోనయినా స్త్రీలు ఉదయానే నిద్ర లేవాలి. నవ్వుతూనే మొగుడికీ, కుటుంబానికి అన్ని సేవలూ చేయాలి. ఒక బానిసతో చేయించుకున్నట్లుగా ఇంటి పనులన్నీ చేయించుకుంటాడు. భార్యతో పగలంతా హుంకరిస్తూ ఇంటి పనులు, రాత్రంతా సెక్స్ కోసం వేధింపులూ ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ ఒక్క మాటంటుంది కథకురాలు.

“దొడ్డికి పోతే అదొక్కటే స్వంతంగా కడుక్కుంటాడీ వెధవ” అని వేల ఏళ్ళుగా ఆమోదయోగ్యమైపోయిన కుటుంబ హింసంతా ఈ ఒక్క వాక్యంలో వ్యక్తమవుతుంది… ఈ వాక్యాన్ని పురుషులందరి చేతా ఇంపొజిషన్ రాయించి, బెత్తం పెట్టి ఇంటి పనులు నేర్పించాలన్న ఆవేశం కలుగుతుంది పాఠకురాలికి… ప్రతి కథా పాఠకుడి ముందు స్ఫూర్తిని ఆవిష్కరించడం ఈ కథల్లోని విశేషం.

స్త్రీల లైంగిక అసంతృప్తుల దృష్టికోణం నుండి చూసినపుడు ఈ సంపుటికే తలమానికమైన కథ ‘ది కిస్’ – ఈ సందర్భంగా ఒక రష్యన్ కవితను ఉటంకిస్తుంది రచయిత్రి…

“నదుటి పై పెట్టే ముద్దు దుఃఖాన్ని పోగొడుతుంది.
నీ నుదుటిని ముద్దాడనీ
కళ్ళమీద పెట్టే ముద్దు నిద్రపుచ్చుతుంది
నీ కళ్ళను ముద్దాడనీ
పెదవుల మీది ముద్దు దాహార్తిని తీర్చే నీరువంటిది
నీ పెదవులను ముద్దాడనీ
నుదుటిపై పెట్టే ముద్దు చేదు జ్ఞాపకాలని చెరిపేస్తుంది
ప్రియా నీ నుదుటిని మళ్ళీ ముద్దాడనీ…”
చేదు జ్ఞాపకాలను చెరిపేసి, దాహార్తి తీర్చి, దుఃఖాన్ని పోగొట్టి నిద్ర పుచ్చే ఇటువంటి ముద్దుల కోసమే స్త్రీల తపన… అయితే వందమందిలో ఒక్కరికయినా ఇటువంటి స్వచ్ఛమైన ముద్దు లభిస్తోందా?

“అసలు శృంగారమంటే ఏమిటి? కేవలం పురుషుడికి మాత్రమే సుఖాన్ని పంచే ఒక దేహరాపిడి మాత్రమేనా? రెండు హృదయాలు మాట్లాడుకునే దేహ భాష, స్నేహ స్పర్శ కాదా? సున్నితంగా, ప్రేమగా పిల్ల తెమ్మెరలలో బృందావనాలను దాడంచి, నందనోద్వానవనాలలో విహరింపచేసి, సముద్ర గర్భంలోని పగడపు దీవుల వద్దకు స్త్రీని తీసుకెళ్ళగలిగే ప్రేమ సమాగమం కాదా శృంగారమంటే…” అంటుంది రచయిత్రి “ఒక సాయంకాలం పూటో, ఒక వెన్నెలరాత్రో పూల పరిమళాల మధ్యో లేక ప్రేమ పరవశాల నడుమో ఒక మల్లెమాలతో పాటు తనదైన దరహాసమాల మెడ ఒంపుల్లో పెదాలతో ఒక చక్కని ముద్ర… రెండు అరచేతుల మధ్య నా ముఖం పెదాలపై పరిమళాల వెచ్చని సంతకం… ఒక మోహ పరవశం, సున్నితమైన దేహ భాషలలో వ్యక్తమయ్యే ప్రేమావేశం ఒక అద్భుతమైన దేహ ప్రయాణం. రెండు మనసులు ఏకమైతేనే కానీ ప్రకటితం కాలేని ఒక సమాగమ సంరంభం…”

కానీ మృగ వాంఛే తప్ప మృదుస్పర్శే తెలీని రోమాంఛితమైన శృంగారాలు లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి 90 శాతం కుటుంబాలలో… స్త్రీని చీల్చేస్తూ ఆమె అనుభవిస్తోన్న నరకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కువ సేపు సుఖాన్ని పొందాలని పురుషులు వాడుతోన్న వయాగ్రాలు స్త్రీల పాలిటి భయాగ్నాలుగా మారడం ఎంత విషాదం? ఇదేనా దాంపత్యం. ఇష్టంగానో, అయిష్టంగానే ఆమె ఆర్గాజమే పొందుతున్న సమయంలో ‘ఛీ నువు వొదులయిపోయావనో ‘నీ రొమ్ములు నా చేతికందడం లేదనో, సిలికాన్ సంచుల్ని కుట్టించుకో’ అనో ‘జీతమెప్పుడిస్తారనో’ ఆమెని అధః పాతాళానికి నెట్టేసే సర్వపరిష్వంగాలు ఈ దాంపత్వాలు… ఒక విధంగా స్త్రీ పురుషులిరువురూ శత్రువులు కారనీ, మనః శరీరాల భాష నెరిగి, మనో అవగాహన కలిగి మిత్రులుగా మెలిగితే స్వర్గాన్ని చూడవచ్చునని సూచించిన కథ ఇది.

పురుషుడిలోని హింసోన్మాదాన్ని, పైశాచికానందాన్ని, రణతృప్తినీ ఈడ్చి వీధిలో పెట్టిన కథలివి. లాగి బయటేసిన కథలివి. పెళ్ళి లైసెన్స్ తో మొగుడనే కామపిశాచి పెడుతోన్న హింసని ఎండగట్టిన కథలివి… మొగుడనేవాడు ఎలా ఉంటే బావుంటుందని స్త్రీలు భావిస్తారో అటువంటి చైతన్యపు కోణాలు కూడ ఈ కథల్లో మిళితమై ఉన్నాయి… మొత్తం మీద నాలుగ్గోడల నడుమా ఇంత గనం హింస జరుగుతోందా అని నివ్వెరపరిచి, దిగ్ర్భాంతి చెందించి ఒక ఆవిరి గదిలోకి తీసుకెళ్ళి వదిలి పెడతాయీ కథలు.

ఈ పుస్తకం మీద అన్నిచోట్ల సదస్సులు జరిపి లోతుగా చర్చించాల్సిన అవసరముంది… ప్రతీ పురుషుడినీ చేయిపట్టి స్త్రీ హృదయంలోకి నడిపించి ఆమె పడుతోన్న అన్ని రకాల హింసలనీ ఎరిగించి చైతన్యపరచాల్సిన అనివార్యతని మన ముందుంచుతాయీ కథలు.

గీతాంజలి సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి సమాజ సమస్యలకు వ్యతిరేకంగా నిరంతరాయంగా విముక్తి పోరాటం చేస్తోన్న సామాజిక వేత్త. స్త్రీ పేషంట్ల వేదన, కార్చిన కన్నీళ్ళు ఆమె గుండెని తడిపి, తడిపి ఆలోచనల చిగుళ్ళు తొడిగి పాఠకుడి హృదయంలోకి వెళ్ళి చైతన్యపు పరిమళాలు నింపుతాయి. అవి కాంతి కిరణాలయి ఈ పితృస్వామ్యపు విలువల భీభత్సం మీద పరావర్తించాలనీ, స్త్రీలపై నిర్లజ్జగా, యదేచ్ఛగా సాగిపోతోన్న దాడులు లేనటువంటి వ్యవస్థను రూపొందించుకోవాలన్నదే ఆమె అభిలాష. అందుకు ఉక్కు పిడికిళ్ళే సరయిన ఆయుధాలని ఆమె నమ్మకం. ఆమె ఒంటరి పోరాటాన్ని ఐక్య సంఘటనగా మారుస్తూ మనమంతా ఆమెతో కలిసి నడుద్దాం.

కథా రచయిత. చెన్నైలో పుట్టి, నెల్లూరులో స్థిరపడ్డారు. రచనలు: పక్షి (2004), ఖండిత (2008), సుప్రజ (2001) కథా సంకలనాలు), రెండు భాగాలు (2008) కవితా సంపుటి ప్రచురించారు.

2 thoughts on “పడగ్గది రాజకీయాల్ని విప్పిన ఇనపగొంతు

  1. నిజంగా గీతాంజలి కథలు స్త్రీల శరీరలపై
    రోజువారీ గా జరుగుతున్న అత్యాచార పర్వాలను అందులో జరిగే అత్యంత క్రూరమైన హింసను మనకళ్లముందు ఉంచుతాయి. ఒక్కో కథ లోపలి పొరలను చుట్టచుట్టి పడేస్తాయి..బాగారాశారు ప్రతిమ. మీకు గీతాంజలి కి అభినందనలు
    మీరన్నట్లుగా ఈ కథలు స్త్రీలతో పాటు పురుషులే అత్యధికంగా చడవాల్సినవిగా నేను భావిస్తాను

  2. సమీక్ష బాగుంది.

Leave a Reply