కలసి చూడవలసిన చంద్రవంకలు: హనీఫ్ కథలు

హనీఫ్ నూతన సహస్రాబ్ది కథా రచయిత. పుట్టుక వల్ల ముస్లిం అస్తిత్వ ఆరాటాలు, వృత్తి రీత్యా సింగరేణి బొగ్గుబావుల జీవన వ్యధలు ఆయనకు అనుభవ విషయాలు. అందువల్ల సహజం గానే ఆయన కథా వస్తు మూలాలు అవే అయ్యాయి. తొలి కథ గోస బొగ్గుబావి కార్మికులను అనారోగ్యం నెపంతో బావి పనికి పనికి రావని ముద్రవేసి , సర్ఫేస్ పనులు లేవని తిప్పుకొంటూ పని ఇవ్వలేమని పరోక్షంగా సూచించే సింగరేణి యాజమాన్య వైఖరి నూతన ఆర్ధికవిధానాల పరిణామమే అని సూచిస్తుంది. మలి కథ నసీమా ముస్లిం స్త్రీల జీవితంలోని కుటుంబ హింస పైకి దృష్టి మళ్లించింది. ఈ రెండు కథలతో ఆయన తాను ఎవరికి ప్రతినిధిగా నిలబడాలో నిర్దేశించుకొన్నట్లయింది. ఆ క్రమంలో వ్రాసిన తొమ్మిది కథలతో తొలి సంపుటి ‘పడమటి నీడ’ 2009 లో వచ్చింది. మళ్ళీ పన్నెండేళ్లకు ఇప్పుడు రెండవ కథా సంపుటి ప్రచురించబడుతున్నది. కథలు ఇంతకు ముందు పత్రికలలో ప్రచురించబడినవే కనుక చాలా మందే చదివి ఉంటారు. రచయిత వాళ్లకు బాగా పరిచయమయ్యే ఉంటాడు. అయితే పుస్తకంగా దీనికి తెరతీసి పాఠకుల ముందు ‘ఇవిగో చూడండి ఇవి హనీఫ్ కథలు, అతని దృక్పథం ఇదీ’ అని పరిచయం చేసే పని అవకాశం నాకు దొరికింది. అప్పుడొకటి , అప్పుడొకటి చదివి పొందిన అనుభవం కన్నా చెప్పుకోదగిన సంఖ్యలో కొన్నిటిని ఒక దగ్గర ఒకేసారి చదవడంలో పొందే అనుభవం సాంద్రమూ , సారవంతమూ అని అందరికీ తెలిసినదే. హనీఫ్ కథల సంపుటికి తొలి పాఠకురాలిగా నా అనుభవాన్ని పంచుకొనటం కోసం ఈ నాలుగు మాటలు.

1.

ఈ సంపుటిలోని పదకొండు కథలలో ‘వారసత్వం’ సింగరేణి గని కార్మిక జీవితానికి సంబంధించింది. ఈ కథ ఒక తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ఒక అల్లం రాజయ్య, ఒక జాతశ్రీ వంటి రచయితల వారసత్వంలో సింగరేణి గని జీవన ఆరాటపోరాటాల కథా వస్తువు యొక్క కొనసాగింపు. రాత్రి పగళ్ల తేడా లేని బొగ్గుబావి లోకి తలపై క్యాప్ కు అమర్చిన లాంప్ తో దిగే కార్మికులు, భద్రతలేని పని ప్రదేశంలో జరిగే ప్రమాదాలు , ఆక్సిజన్ తగినంత ప్రసారం కానీ ప్రదేశంలో బొగ్గు తవ్వుతూ పైకి పంపుతూ బొగ్గు పొడి , దుమ్ము పీల్చటం వల్ల వచ్చే క్షయ వంటి ఊపిరి తిత్తుల జబ్బులు, గుండెపోట్లు, అకాల అసహజ మరణాలు, సరిపడినంతగా లేని ఇంటివసతి, నీటి వసతి మొదలైన సమస్యలు, వాటిని పరిష్కరించుకొనటానికి సింగరేణి కార్మిక సమాఖ్య నాయకత్వాన జరిగిన వినూత్న పోరాటాలు వస్తువుగా ఏనభై తొంభైలలో కథలు విస్తృతంగా వచ్చాయి. శ్రామిక వర్గాన్ని దోచుకొనటం మీద అభివృద్ధి చెందే పారిశ్రామిక రంగాన్ని గురించిన సరి అయిన సమాచారాన్ని, అవగాహనను అవి మానవ జీవిత సంబంధాలనుండి , సంఘర్షణ నుండి సృజనా త్మకంగా వ్యాఖ్యానిస్తూ తెలుగు పాఠకులకు పరిచయం చేశాయి. ఆ కథలకు, ఈ నాటి వారసత్వం కథకు మధ్య దాదాపు ముప్ఫయ్ ఏళ్ల కాలం గడిచింది.

2018 లో వచ్చిన ఈ కథలో కొత్తజిల్లాల ఏర్పాటు ప్రస్తావన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014 లో . తెలంగాణాలో 21 కొత్తజిల్లాల ఏర్పాటు జరిగింది అక్టోబర్ 2016. కొత్తజిల్లాల ఏర్పాటువల్ల భూముల ధరలు పెరగటాన్ని గురించి -పిఎఫ్ లోన్ పెట్టి ఎక్కడన్నా జాగాతీసుకొని ఇల్లుకట్టుకుందామన్న భార్య భాగ్య మాటకు సమాధానంగా- రాజయ్య చెప్తాడు. అంటే ఈ కథ ప్రవర్తించే కాలం 2016 నుండి 2018 లోపల అన్నది స్పష్టం. దాదాపు ముప్ఫయ్ ఏళ్ల నాటి – ఆ ఉజ్వల పోరాటాలు, పోటెత్తిన కార్మిక చైతన్యం, సాధించిన విజయాలు, సాధించుకొన్న ప్రయోజనాలు ఏమైనాయో కానీ- అదే భద్రతలేని పని ప్రాంతాలు, ప్రమాదాలు, జబ్బులు, బ్రతుకు భయాలు, వేసటలు యధాతధంగా సాగుతూనే ఉన్నాయని ఈ కథ రాజయ్య ఆలోచనలుగా , కలలుగా, కలవరింతలుగా,వాస్తవ అనుభవంగా చూపిస్తున్నదన్నమాట.

ఆ నాటి వలె కార్మికుల సమస్యలను పట్టించుకొనే విప్లవకార్మిక సంఘం ఈ కథలో లేదు. ఉన్నది ‘ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా లేనిపోని హామీలు ఎడాపెడా ఇచ్చేసే’ బొగ్గుబావి యూనియన్ గుర్తిపు సంఘాలు మాత్రమే. అవి చేస్తున్న హామీలలో ప్రధానమైనది వారసత్వ ఉద్యోగాలు ఇప్పించటం. వారసత్వ ఉద్యోగాల పద్ధతి ఇదివరలో ఉన్నదే. పరిమిత అవకాశాల మధ్య తండ్రుల ఉద్యోగం కోసం కొడుకులు ఘర్షణపడటం, ఆ ఒత్తిడిమధ్య తండ్రీ పిల్లలు పరస్పర విశ్వాసాలు కోల్పవటం ఇతివృత్తంగా 1992 నాటికే ఉరి (తుమ్మేటి రఘోత్తమరెడ్డి) కథ వచ్చింది.ఆ తరువాత 26 ఏళ్లకు ‘వారసత్వం’ కథ వచ్చే వరకు జరిగిన పరిణామాలు ఏమిటి? సరళీకరణ ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వకం పెద్దపెద్ద యంత్రాల సహాయంతో చేపట్టే పద్ధతి విస్తరించింది. రాజకీయపార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ప్రభుత్వాలతో కుదుర్చు కొన్న ఒప్పొందాల మధ్య వారసత్వ ఉద్యోగ హక్కును వదులుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఓట్ల కోసం వారసత్వ ఉద్యోగాల సమస్యను ఎజండాలోకి తీసుకొని వచ్చాయి కార్మిక సంఘాలు. అధికారంలో ఉన్న యూనియన్ ప్రభుత్వంతో ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా చేయించింది. ఇదంతా రాజకీయ వ్యాపారుల అవసరాల కోసం విసిరిన పాచిక అన్న అవగాహన హనీఫ్ ది.

ఆ నేపథ్యంలో ఈ కథేతివృత్తం రూపొందింది. రెండేళ్ల సర్వీస్ వుందనగానే రాజయ్య ఉద్యోగ వారసత్వం ఎవరిదీ అన్న దానిమీద కొడుకులిద్దరూ ఆ ఉద్యోగం తనకే పెట్టించాలని అంటుంటే కూతురు తన భర్తకు పెట్టించాలని తండ్రిపై వత్తిడి తేవటం ఇందులో కథ. ఇది రాజయ్య ఒక్కడి కథ కాదంటాడు రచయిత. బొగ్గుబాయి ఉద్యోగుల కుటుంబాలలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య కుంపటి రాజేసిన రాజకీయం అని రాజయ్య చేత అనిపిస్తాడు. ఆ రకంగా ముప్ఫయేళ్ల కాలం మీద కార్మిక వర్గ పరిస్థితి ప్రజాస్వామ్య భారతంలో ఏ మాత్రం మారకపోగా మరింతగా నిప్పులగుండం గా మారటం ఈ కథ చదివేసరికి అర్ధం అవుతుంది.

2.

2017 లో వచ్చిన కథలు చోటీ,ఓపెంపకం కథ.ఈ రెండూ కుక్కకూ మనిషికీ మధ్య బంధాన్ని తెలియచెప్పేవి. గోపీచంద్ ‘మాకూ ఉన్నాయ్ స్వగతాలు’ అనే శీర్షికతో వ్రాసిన కథా ప్రయోగాలను గుర్తుచేస్తుంది చోటీ కథ. మనుషుల పట్ల కుక్క చూపే విశ్వాసం అందరికీ తెలిసిందే. చెప్పుకొనేదే. అన్నిటినీ పసిగట్టగల కుక్క మనుషుల లోని స్వార్ధాన్ని కూడా పసిగట్టగలగటం ఇందులో విశేషం. నోరు లేదు కనుక చెప్పలేదు. పెద్దమనసు తో క్షమించనూ గలదు. ఓ పెంపకం కథ లో తిండిపెట్టిన మనిషిపట్ల కుక్క చూపించే విశ్వాసం, రక్షణగా ఉండటం ప్రధాన విషయం అయినా భర్త నిర్లక్ష్యం, అధికారం, తాగివచ్చి తన్నటం, అనుమానించటం స్త్రీల జీవితంలో ఎంత హింసను సృష్టించి మనసును విరిచేస్తాయో, ఒంటరి ఆడదానికి జీవితంలో కాఠిన్యం అలవరచు కోవటం ఎలా అవ సరమూ, అనివార్యమూ అవుతుందో కూడా చూపటం అంత ప్రధానంగానూ కనిపిస్తాయి. చచ్చాక కూడా తన శరీరాన్ని పాతెయ్యటానికో, కాల్చటానికో కూడా ఏ మగవాడు ముట్టకూడదనేంతటి పురుష ద్వేషం స్త్రీలో కలగటానికి కారణమైన వ్యవస్థలోని అధికార క్రౌర్యాలు జాలిగుండె లేని మనిషికన్నా కుక్కే నయమనిపించేలా చేస్తాయి అని ఈ కథ సూచిస్తుంది.

చివరి కథను మినహాయించి మిగిలిన ఏడూ అసలు హనీఫ్ ముద్రను చూపించే కథలు. హనీఫ్ మాత్రమే వ్రాయగల కథలు. వ్రాయవలసిన కథలు. ముస్లిముల జీవన విధానం, సంస్కృతి, సంబంధాలు, సంఘర్షణలు వస్తువుగా వ్రాసిన కథలు ఇవి. భారతదేశం లో ముస్లిముల జీవితం హిందూ సమాజ సంబంధాల నుండి విడదీయరానివి కనుకనే హనీఫ్ కథలు ముస్లిములను కేంద్రంగా చేసి మొత్తం హిందూ సమాజాన్ని వ్యాఖ్యానించేవిగా ఉంటాయి.

బిడ్డపురిటికొచ్చింది(2013) ఎక్కాలు రానోడు(2019) రెండుకథలు ముస్లింల జీవన వృత్తులకు సంబంధించినవి. మొదటి కథలో వలీ వృత్తి గొల్ల కురుమల మందల వెంట తిరిగి రోగానపడ్డ జీవా లను కొని ఆదివారం సంతలోనో, కటికవాళ్ళకో అమ్ముకొనటం. కూటికీ గుడ్డకు తప్ప అవసరాలకు సరిపోని ఆదాయం. కూతురు పురిటికి వచ్చి ఇంట్లో ఉన్న పరిస్థితులలో నాలుగైదు వేలు సమకూ ర్చటం ఎట్లాగా అన్న దిగులు ఆలోచనల నేపథ్యంలో నడుస్తుంది ఈ కథ. గొల్ల కురుమలకు వలీ ని చూస్తే గొర్ల మంద రోగాన పడ్డ ఒక అశుభ భావన. మళ్ళీ రోగానపడిన గొర్రెను అంతో ఇంతో సొమ్ము చేసి పెట్టటానికి అతనే మార్గం. వలీ తెచ్చిన గొఱ్ఱె రోగిష్టిది అని, ఫుడ్ ఇన్స్పెక్టర్ నుండి తనకు సమస్య అని ఆ సరుకు పై తనకసలు ఆసక్తే లేనట్లు మాట్లాడే మాంసం కొట్టు మట్టయ్య ఆంతర్యం దాని విలువను సాధ్యమైనంత తగ్గించటమే. లాభాలు తీయటమే. ఈ రెండు ధ్రువాల మధ్య అనుమానాన్ని , అవమానాన్ని భరిస్తూ వలీ చేసే జీవన పోరాటం చిన్న చిన్న జీవన వ్యాపకాలలో చాలీచాలని ఆదాయాలతో గడిపే అనేక మంది ముస్లిముల జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్లనే ఇది అనేక సంకలనాలకు ఎక్కింది. అవార్డులను పొందింది.

లెక్కలు రానోడు కథలో షరీఫ్ కౌలు రైతు. కాయకష్టం చేయటం తప్ప మరో ప్రపంచం తెలియని మనిషి. రైతులనుండి పంట కొని మార్కెట్లో అమ్మి లాభం చేసుకొనే మారుబేరగాళ్లతో మిర్చి పంట మారుబేరంలో భాగస్వామి అయి అతను ఎదుర్కొన్న సమస్య ఈ కథకు వస్తువు. లెక్కలు,లౌకిక వ్యవహారాలు తెలియక మార్కెట్ లో సరుకు కాపలాదారుగా కష్టపడినా బేరంలో నష్టం వచ్చింది కనుక నష్టం వాటా కట్టాలన్న భాగస్థుల అన్యాయాన్ని కొన్న ధరకంటే ఎక్కువకే సరుకును అమ్మినాక నష్టం ఎక్కడిదని ప్రశ్నించి ధైర్యంగా నిలబడటం ఎక్కాలు రాని షరీఫ్ ను ప్రమాదంలో పడకుండా కాపాడింది.

నష్టం వాటా కట్టాలన్న భాగస్థుల వాదం షరీఫ్ ను వూళ్ళో పంచాయితీకి లాగింది. ఈ సందర్భాన్ని రచయిత ఒక సూక్ష్మమైన మత సామాజిక వైరుధ్యం వైపు ఆలోచనను ప్రేరేపించటానికి జాగ్రత్తగా వాడుకొనటం చూస్తాం. భాగస్థులు హిందువులు. షరీఫ్ తో పొత్తు కలిపి నష్టం వాటా నెపంతో తగాదాకు దిగారు. ఇలాంటి సందర్భాలను ఇరువర్గాలమధ్య గొడవగా మార్చాలనుకొనే సామాజిక వాతావరణం గురించిన స్పృహ తనపనేంటో తనేంటో తప్ప ఇల్లుదాటని షరీఫ్ లో కూడా పనిచేస్తున్నది. అందువల్లనే అతను పంచాయితీ జరిగే చోటికి ‘ ఈ మద్యల నమాజ్ కు పోతూ గడ్డాలు పెంచి, టోపీలు తగిలించుకొని తిరుగుతున్న వయసొచ్చిన పోరగాళ్లను’ రాకుండా చూడాలను కొంటాడు. ముస్లిములు ఎప్పుడూ హెచ్చరికతో నిమ్మళంగా ఉండాల్సిన హిందూ ముస్లిం వైరుధ్యాలు మొలకెత్తిన సమాజం వైపు అలా వేలుపెట్టి చూపించాడు రచయిత.

ముస్లిం కావటం వల్ల ఒక స్త్రీ జీవితం ఎంతగా దుఃఖభాజనం అయిందో చూపించే స్మృతి రూప కథనం ‘రంజాన్ బి దుఃఖం’(2020). రంజాన్ బీ ఎవరు ? భర్తను కొడుకును పోగొట్టుకొని ఒంటరి దుఃఖంలో కుమిలిపోతున్న స్త్రీ. ఆత్మీయుల మరణం ఎవరి జీవితంలోనైనా దుఃఖ కారణమే. మరి రంజాన్ బి దుఃఖం కథ ఎందుకైంది? అవి సహజ మరణాలు కాకపోవటం వల్ల. ముస్లిములు అయిన కారణంగా సంభవించినవి కావటం వల్ల. స్వంత ఎడ్లు , నాగలి , రెండెకరాల వ్యవసాయం, ఆత్మగౌరవ జీవనం అదే తెలంగాణ గ్రామీణ భూస్వామ్య పెత్తందారీ వర్గాలకు కంటగింపై రంజాన్ బీ భర్త హత్యకు కారణం అయింది. దొరలు తమకు గిట్టని వాళ్ళను చంపేసి హిందువులైతే అది రజాకార్ల పని అనటం ముస్లిములు అయితే వాళ్ళే రజాకార్లు అనటం పరిపాటిగా అయిన చారిత్రక కాలం లో ఆ రకంగా ఆమె భర్తను కోల్పోయింది. పసిబిడ్డతో భర్త వదిలిన వ్యవసాయాన్ని చేతబట్టి బతుకు బండి ఈడ్చిన రంజాన్ బీ చేతికి అందివచ్చిన కొడుకు టీ దుకాణంతో మొదలుపెట్టి చిన్నపాటి హోటల్ గా దానిని అభివృద్ధి పరచుకొన్న కాలానికి కడుపుతో ఉన్న భార్యతో సహా సజీవ దహనానికి గురయ్యాడు. గొడ్డు మాంసం అమ్ముతున్నాడని ఆరోపించి దుండుగులు దాడి చేసి కొట్టి చంపి, హోటల్ ను ఇంటిని తగలబెట్టారు. ఆరకంగా ఎనభై అయిదేళ్ల వయసులో ఆమెది ఒంటరి జీవితం అయింది.

రజాకార్లు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభువుకు మద్దతుగా మత ప్రాతిపదికన పనిచేసిన ప్రయివేటు సైన్యం. స్థానికంగా కమ్యూనిస్టుల అణచివేత, స్వతంత్ర భారత సైన్యం ఆక్రమణను నిరోధించటం లక్ష్యంగా హింసాకాండ సాగించిన కాలం 1947- 48. రంజాన్ బీ భర్త మరణించిన కాలం అదే. ఆమె కొడుకు చంపబడింది గొడ్డుమాంసం అంటే ఆవు మాంసం కలిగివున్నారనో, రవాణా చేస్తున్నారనో, అమ్ముతున్నారనో ముస్లిముల మీద దాడులు, హత్యాకాండ పెచ్చరిల్లిన కాలం. 2010 నుండి చెదురుమదురుగా జరుగుతూ 2014లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక పెచ్చుపెరిగిన దశ అది. ఒక సర్వేని బట్టి ఆ సమయంలో గోమాంస హింసకు బలైనవాళ్లలో 86 శాతం ముస్లిములే. ముస్లిముల పట్ల అసహనం , హత్యాకాండ ఆందోళన కరంగా కొనసాగిన నూతన సహస్రాబ్ది రెండవ దశకపు ఘటనల పరంపరకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ కథలోని జాకీర్ హత్య. ముస్లిముల ఆహార వ్యవహారాల పట్ల ద్వేషం , శత్రుభావం రెచ్చగొడుతూ ఆవు పేర హింసను వ్యవస్థీకరిస్తున్న రాజకీయాల నేపథ్యంలో ఆర్ధికంగా ముస్లిముల ఎదుగుదలను నిరోధించే కుట్ర కూడా ఉంది. ఆవు మాంసంపేర జరిగిన దాడులు అనేకం అందుకు రుజువు. హోటల్ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తూ ఇంత స్థలం కొనుక్కొని ఇందిరమ్మ ఇల్లు కూడా సంపాదించి వృద్ధిలోకి వస్తున్న జాకీర్ హత్య ఈ సమకాలీన అసహన చరిత్రకు అద్దం పట్టేదే. ఈ విధమైన భర్తల మరణాలు, కొడుకుల మరణాలు ముస్లిం మహిళల జీవితంలో ఎంత విషాదాన్ని నింపుతున్నాయో చూపటమే ‘రంజాన్ బీ దుఃఖం’ కథ చేసిన పని.

  1. అయితే ఈ వైరుధ్యాలు అధికార రాజకీయాల సృష్టి అని హిందువులైనా , ముస్లిములైనా ప్రాధమికంగా అందరూ మనుషులేననని,మనిషికి సహజమైన కనికరం, ప్రేమించే హృదయం శాశ్వత సత్యమని నమ్ముతాడు రచయిత. అదే హిందూ ముస్లిముల స్నేహ సౌహార్ద్ర సహజీవనానికి మూలమని భావిస్తాడు. దానిని నిరూపించటానికి ఆయన వ్రాసిన కథలు ఇప్పుడే వస్తాను, అల్విదా, పాకిస్థానీ, ఈద్ కా చాంద్.

అల్విదా(2013) కథ మతాలకు అతీతంగా సహనమూ సంస్కారవంతమూ అయిన జీవితాన్ని నిర్మించు కొనే స్వభావం మనుషులకు ఎంత సహజమో చూపించింది. కిరాణా కొట్టు జీవనాధారంగా గల ఒకసాధారణ స్త్రీ అనాథ అయిన ముస్లిం గర్భిణీ స్త్రీకి ఆశ్రయమిచ్చి ఆమె ప్రసవించి మరణిస్తే ఆ బిడ్డను పెంచి పెద్దచేయటం ఇందులో కథ. పిల్లలు లేని ఐలమ్మ అప్పటికే పెంపకానికి తెచ్చుకున్న బంధువుల పిల్లతో సమానంగా ఈ పిల్లను పెంచటం ఒక ఎత్తయితే జరీనా అని పేరుపెట్టి ఆమెను ముస్లిం గానే పెంచటం, ముస్లిం కు ఇచ్చి పెళ్లిచేయటం మరొక ఎత్తు. ఐలమ్మ ఆ శిశువును హిందువుగా పెంచితే అభ్యంతర పెట్టేవాళ్ళెవరూ లేరు. కానీ శిశువును ఆమె వంశ మూలం నుండి వేరు చేయకూడదన్న ఒక సంస్కారం ఆమెను నడిపించింది. పిల్లకు నమాజు చేయటం నేర్పించటం దగ్గర నుండి అందుకు ఇంట్లో ఆమెకు స్థలం కేటాయించటం వంటివి అన్నీఆమె అభివృద్ధి చేసుకొన్న సహన సంస్కృతి ఫలితం. వాళ్ళ తల్లీ కూతుళ్ళ సంబంధానికి మతం అడ్డురాలేదు. పసిపిల్ల జరీనా ను ఐలమ్మ ఎలా పెంచిందో వృద్దాప్యంలో , జబ్బులో ఐలమ్మ పోషణ రక్షణలను అంతగా చూసుకొన్నది జరీనా. హిందువుగా పుట్టిన ఐలమ్మ చివరి రోజులు జరీనా దగ్గర గడిపి మరణించటంవల్ల అంత్యక్రియలు ముస్లిం పద్ధతిలో జరిగాయి. జీవించటానికైనా , మరణించటానికైనా మతం తో పనిలేదని అలవోకగా చెప్పిన కథ అల్విదా.

మిగిలిన మూడు కథలకు సామాన్య సూత్రం హిందూ ముస్లిం కుటుంబాల మధ్య స్నేహం. ఇప్పుడే వస్తాను(2016) కథలో జానకీ ఫాతిమాల చిన్ననాటి స్నేహం పెళ్లాయ్యాక వాళ్ళ భర్తల మధ్య స్నేహంగా బలపడి పిల్లల స్నేహంలో స్థిరపడి కుటుంబాల బంధంగా పెనవేసుకొని పోతే ఈద్ కా చాంద్ (2021) కథలో పరంధామయ్య పీరు సాహేబుల బాల్య స్నేహం కూడా అట్లాగే రెండు కుటుంబాలను పెనవేసిన బంధం అయింది. ఇప్పుడే వస్తాను కథలో జానకి కొడుకు కృష్ణమూర్తి ఫాతిమా కొడుకు లతీఫ్. ఆ రెండు కుటుంబాల సాన్నిహిత్యం, ఆ ఇద్దరి మధ్య స్నేహంలోని గాఢత ప్రమాదవశాత్తు చనిపోయిన కృష్ణమూర్తి వియోగ దుఃఖాన్ని మోస్తున్న లతీఫ్ జ్ఞాపకాల రూపంలో ఆవిష్కరించాడు రచయిత. జానకి ఫాతిమాల రెండు కుటుంబాలకు లతీఫ్ ఉమ్మడి కొడుకై ప్రవర్తించటంలోని విశాల మానవీయ చైతన్యాన్ని సంభావిస్తూ ముగుస్తుంది ఈ కథ.

కాగా ఇలాంటి సహజ మానవీయ చైతన్యాన్ని కలుషితం చేసే రాజకీయాలు జీవితంలో సృష్టించే సంఘర్షణ ఈద్ కా చాంద్ కథలో చూస్తాం. పరంధామయ్య పెద్దకొడుకు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని వంటపట్టిచ్చుకొన్న రాజకీయాల ఫలితం ఆ కుటుంబాల స్నేహ సంబంధాల మీద చూపిన ప్రభావ కథనం ఇది. ముస్లిములను పరాయి దేశస్తులుగా , శత్రువర్గంగా చూచే అసహన వైఖరిని అయోధ్య జన్మభూమి వివాదకాలం నుండి రకరకాలుగా ప్రచారంచేస్తూ సామాజిక సమ్మతిని కూడగట్టడం చాపకింద నీరులా జరిగిపోయింది. హిందువు అనుకొన్న ప్రతివాళ్ళకు ముస్లిం ను దేశద్రోహిగా భావించే హక్కు అనధికారంగానే అయినా సంక్రమించింది. అనుమానితుల జాబితాలో తాను లేననని నిరూపించుకొనటం ముస్లిం బాధ్యత అయింది. ఈ పరిస్థితులలో ఒక ఊపిరాడనితనం కుటుంబాలలోకి చొరబడటం గురించిన దిగులు, దానిని చక్కదిద్దటం ఎట్లాగా అన్న చింతన పరంధామయ్య ను ఒత్తిడికి గురిచేశాయి. సైతానుల ఇల్లుగా చెప్తూ పిల్లలను పీర్ సాహెబ్ తాత ఇంటికి పోకుండా నిషేధించ చూసే కొడుకు వైఖరి ఆయనకు ఆందోళన కలిగించింది. ఈ పరిస్థితులలో తమ కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోతాయా అని విలవిలా లాడాడు.

పరంధామయ్య ముఖంగా ఈ కథ ముస్లిములు ఎప్పుడో పరాయిదేశాల నుండి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకొన్నవాళ్ళే కావచ్చు. కానీ అలాగే ఆ తరువాతి కాలంలో దేశాన్ని ఆక్రమించి పాలించి సంపదను కొల్లగొట్టుకుపోయిన బ్రిటిష్ వాళ్ళు శత్రువులు కాకుండా ఇక్కడే జీవించి ఇక్కడే మరణించిన ముస్లిములు ఎట్లా శత్రువులయ్యారు అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాడు రచయిత. అంతే కాదు అసహనాన్ని సహనంతో ఎదుర్కొని జయించే పరిణితిని ముస్లిములు సాధించటాన్ని ఈ కథలో ఒక బలమైన అంశంగా ప్రవేశపెట్టాడు. రెండిళ్లకు ఒకే ఒక ఆడపిల్ల అనన్య. తమను ద్వేషించే పరంధామయ్య పెద్దకొడుకు బిడ్డ. ఆ పిల్ల పుట్టిన రోజున ఎప్పటిలాగానే గోరింటాకు రుబ్బి చేతులు అలంకరించారు. పిల్ల తండ్రికి తమ రాక ఇష్టం ఉండదని తెలిసినా పిల్ల కోసం , మిగిలినవాళ్ళకోసం అందరూ ఆ సాయంత్రపు వేడుకకు వాళ్ళ ఇంటికి వెళ్లారు. తెలుగులోకి అనువదించిన ఖురాన్ కానుకగా ఇచ్చారు. రంజాన్ ఉపవాసాలు ముగిశాక పీర్ సాహెబ్ కొడుకులు ఇద్దరూ వెళ్లి పరంధామయ్య పెద్దకొడుకును ‘అన్నా’ అని పిలిచి ‘ఈద్ కా చాంద్ నీతో కలిసి చూదామని వచ్చినం’ అన్నారు. మనిషి తత్వం మేల్కొన్న అన్న తమ్ములిద్దరినీ సందిట్లోకి తీసుకొనటం తో కథ ముగుస్తుంది.

ఈద్ కా చాంద్ అంటే పండగ చంద్రుడు. రంజాన్ పండుగ ఉత్సవం లో భాగం రాత్రి నింగిలోని చంద్రవంకను చూడటం. చంద్రవంక ప్రకృతిలో భాగం. అది హిందూవులదీ ముస్లిములదీ ప్రపంచంలోని మానవులందరిదీ. పరంధామయ్య కొడుకుతో కలిసి చంద్రుడిని చూడాలన్న పీరు సాహెబ్ కొడుకుల ఆకాంక్షలో ఆ విశ్వజనీన భావనను ధ్వనింప చేసాడు రచయిత. అంతే కాదు. ఈద్ కా చాంద్ అనే జాతీయానికి కలవటానికి కష్టమైనది అని అర్ధం. చంద్రుడు కనబడతాడు, రోజూ చూస్తాం. కానీ కలవలేము కదా! అలాగే కలవటానికి కష్టమైన వ్యక్తిని కూడా ఈద్ కా చాంద్ అని వ్యవహరిస్తారు. కలవటానికి కష్టమైన పరంధామయ్య కొడుకుకును కలుపుకొనటానికి పీరు సాహెబ్ కొడుకులు చూపిన సహనం అసహనం పై సాధించిన విజయమే. ఆ రకంగా ఈద్ కా చాంద్ ఒక మంచి కథ అయింది.

పాకిస్తానీ కథ కూడా కుటుంబ స్నేహాల కథే. ఈద్ కా చాంద్ కథ వలె ముస్లిం విద్వేషం వెనుక రాజకీయాలవైపు వేలు చూపించే కథ ఇది. ఈ కథలో హిందూ ముస్లిం కుటుంబాల మధ్య స్నేహ బంధం చిన్ని అనే అయిదేళ్ల పాప. దానిపేరు నసీమా. పక్కింటి ముస్లిముల అమ్మాయి. మనుమలు తప్ప మనుమరాళ్లు లేని మీనాక్షమ్మగారి ఇంట ఇంట్లో పిల్లగా తిరుగుతూ అందరి ప్రేమను చూరగొన్న అమ్మాయి. అందరి హృదయాలను ఆనందమయం చేసిన అమ్మాయి. ఈ సహజసుందర వాతావారణాన్ని భగ్నపరిచింది మీనాక్షమ్మ తమ్ముడి రాక. నసీమాలో పసిపిల్ల స్నిగ్దత్వం కాక పాకిస్తానీ సైతాన్ కనబడింది అతని కళ్ళకు. అతని కొడుకు బాంబు పేలుడులో చనిపోయాడు అని ముస్లిములందరినీ పాకిస్థాన్ తీవ్రవాదులుగా చూసే అతని సంకుచిత దృష్టి ఈ కథలో నిరసనకు గురయింది.

ఏ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తోనో మొదలయ్యే తెలుగు కథ ముస్లిం జీవన సంస్కృతీ సంబంధంలో కొత్తకళను సంతరించుకొనటం హనీఫ్ కథలలో కనిపిస్తుంది. ఫజర్ నమాజ్ వేళకు నిద్రలేవటం దగ్గర నుండి ముస్లిం మహిళ దినచర్య ఎలా ఉంటుందో అల్విదా కథా ప్రారంభం చెప్తుంది. ‘భోజనాల బంతికాడా, సావుకాడా’ అందరూ సమానమేననే సంస్కృతీ సంప్రదాయాలు అ ల్విదా కథలోను , ఇప్పుడే వస్తాను కథలోనూ తెలిసివస్తాయి. డిజైన్లు డిజైన్లుగా గోరింటాకు పెట్టుకొనే కళ ప్రస్తావన ‘ఈద్ కా చాంద్’ కథలో వుంది. ఉర్దూ భాషా పదాలను పొదవుకొన్న మాటతీరు సంభా షణలు కథలకు కొత్తవన్నెలు అద్దాయి. ఈ దిశలో మెజారిటీ భారతీయ సమాజానికి తెలియని సహచరులైన ముస్లిముల జీవిత వాస్తవికతను ఎరుకపరిచే కథలు హనీఫ్ మరింత నిబద్దతతో వ్రాయాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply