ఒరోమియా అస్తిత్వ పోరాట గుండె చప్పుడు – హచాలు హుండేస్సా

అతని పాట బాలే (Bale) పర్వతాలల్లో మారు మ్రోగుతూ జిమ్మ(Jemma) లోయల్లో ఎంటోoటో (Entento) పర్వత శ్రేణుల్లో ప్రతిధ్వనిస్తుంది. అతని గొంతు హారెన్న అడవుల్లో పసుపు వర్ణ రామచిలుక గొంతై పలకరిస్తూ సెనెట్టి పీఠభూమి పరుపు బండలపై సేద తీర్చుకుంటుంది. ఆ పాటే లంగానో సరస్సు స్వర్ణ అలలపై తేలియాడుతూ మసింకో (Masinko) నాద స్వరమై నృత్యం చేయిస్తుంది. రిఫ్ట్ వ్యాలి నెగల్లలో ఎర్రబారిన కళ్ళ చారికలై ఎర్తా అలె (Erta ale) అగ్ని పర్వత బిలం నుండి నిత్యం సింహ గర్జన చేస్తూ శత్రు గుండెల్లో నిప్పు రాజేస్తుంది.

ఆ పాటే హచాలు హుండెస్సా పాట. ఆ పాటే, ఆ గొంతే ఒరోమియా ఎత్నిక్ తెగ అస్తిత్వం. పేరెన్నిక గల ఒరోమో గాయకులల్లో ఎదుగుతున్న వర్తమాన గాయకుల్లో ఒకడు హచాలు హుండేస్సా. ప్రజల హృదయాలను కొద్దికాలంలోనే దోచుకున్న ప్రజా గాయకుడు. పిల్లవాళ్ళ నుండి వృద్ధుల వరకు వాళ్ళ నాలుకలపై హచాలు పాటలు ప్రతి నిత్యం కదులుతూ ఉత్తేజ పరుస్తునేవుంటాయి.

హచాలుహుండెస్సా – పరిచయం:
హచాలు హుండెస్సా ఇథియోపియాలోని ఒరోమియా రీజయన్ (రాష్ట్రం) లో అడ్డిస్ అబాబా కు 100 కి.మీ. దూరం లో గల ఆంబో పట్టణంలో ఒరోమియా తెగకు చెందిన గుడాటు హోరా, హుండెస్సా బోన్సా దంపతులకు గల ఎనిమిది మంది సంతానంలో ఒకడుగా 1985 లో జన్మించాడు. ఒరోమో రాష్ట్రం ఇథియోపియా లో కేంద్ర స్థానంలో వున్న అధిక జనాభా గల అతిపెద్ద ప్రదేశం. హచాలు గాయకుడు, తన పాటలు తానే రాసుకుని పాడే వాగ్గేయకారుడే కాదు ఒక క్రియాశీల సామాజిక స్పృహ గల కార్యకర్త. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తన పాటల ద్వారా ఎండగడుతూ ప్రజా చైతన్యాన్ని పెంచే గొంతుక ఆయన. అతను బాల్యంలో పాఠశాల క్లబ్‌లల్లో పాడుతూ ఆంబో పట్టణ పరిసరాలల్లో తన కుటుంబ పశువుల పోషణ చేస్తూ జీవనం గడుపుతూ పెరిగాడు. తన తండ్రి విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తూ తన కొడుకు హచాలును డాక్టర్ ను చేయాలనుకుంటాడు కాని హచాలుకు చదువు పెద్దగా అబ్బలేదు. కాని హచాలుకు చిన్నతనంనుండే పాటలంటే ఇష్టం, తన తల్లి ప్రేరణతో పాటలు పాడుతూ “నా మెదడులోకి ఏది వస్తే అదే పాడుకునే వాడినని చెప్పేవాడు.”

ఇథియోపియా ఎత్నిక్ సంఘర్షణల పునాది:
ఇథియోపియా ఈశాన్య ఆఫ్రికా కొమ్ములో ఒదిగిన పరివేష్టిత (landlocked) దేశం, ఇది అతి ప్రాచీన నాగరికత గల దేశాలల్లో ఒకటి. ఇది 1974 వరకు హైలె సిలాస్సి అనే చక్రవర్తి పాలనలో ఉండింది. చక్రవర్తి పాలనను అంతమొందించి మార్క్సిస్ట్ (వర్కర్స్ పార్టీ) నాయకత్వంలోని మెంగిస్తూ హైలెమారియం ప్రభుత్వం 1974 నుండి 1991 వరకు పరిపాలించాడు. ఈ పాలన మొదట్లో బాగానే వున్నా క్రమంలో నియంతృత్వ పాలనవైపు దారితీసి ప్రజలను ఊచకోత కోయడం తో ప్రజా పోరాటాల ఆగ్రహావేశాలకు గురై 1991 లో పడిపోయి మెలెస్ జానావి నాయకత్వం లోని EPDRF ప్రభుత్వం 1991 లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇథియోపియా అనేక తెగల (ఎత్నిక్) నిలయమై తొమ్మిది పరిపాలన ప్రాంతాలుగా విభజించబడిన బహుబాషా దేశం. ఇథియోపియా శాంతి కాముక దేశం, మెజారిటీ ప్రజలు ఆర్థోడాక్స్ క్రైస్తవ విశ్వాసాలను కలిగి సాంప్రదాయ జీవితం గడుపుతూ ఎక్కువ శాతం కొండలపై, గుట్టలపై వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తారు. మెలెస్ ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగి ఇథియోపియా లోని అన్ని ఎత్నిక్ తెగలను ఏకంచేసి ప్రజా పరిపాలనను అందజేయదానికి కృషి చేసాడు, అయినా వివిధ ప్రాంతాలలో జరిగిన అసమతుల్య అభివృధి మూలాన, తిగ్రాయి ఎత్నిక్ గ్రూప్ (ఇది ఉత్తర ఇథియోపియా లోని ఒక ఎత్నిక్ గ్రూప్) ఆధిపత్యం అన్నిరంగాలల్లో పెరగడం మూలానా మిగతా రీజియన్ లో వున్న ఎత్నిక్ గ్రూప్ లకు అసంతృప్తి పెరిగి ఎత్నిక్ గ్రూపుల మధ్య ఘర్షణలు కొనసాగుతూవచ్చాయి. ప్రధాన మంత్రి మెలేస్ జనావి కూడా తిగ్రాయి ఎత్నిక్ గ్రూప్ కు చెందివాడు కావడం వల్ల 2003 సం. లో అడ్డిస్ అబాబా మరియు ఇతర ఒరోమియా ముఖ్య పట్టణాలల్లో నిరసనల తీవ్రరూపం దాల్చి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోసుకున్నాయి.

మెలెస్ 2012 లో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించాడు. మెలెస్ మరణాంతరం ఆనాటి డిప్యూటి ప్రధానమంత్రి హైలేమరియం దెస్సాలిన్ ప్రధానమంత్రిగా అధికార పగ్గాలను చేజిక్కించుకున్నాడు. ఈయన దక్షిణ ఇథియోపియా లోని వోలయితా ఎత్నిక్ గ్రూపుకు చెందినవాడు. ఈయన కూడా మెలెస్ పంథా లోనే పయనించాడు. మెలెస్ బీజాలు వేసిన అడ్డిస్ ప్లాన్ ను హైలేమరియం అమలు చేయడం ప్రాంభించాడు.

ప్రస్తుత ఈ ఎత్నిక్ ఘర్షణలకు బీజం ఏమిటి?
ప్రభుత్వ ప్లాన్ ప్రకారం అడ్డిస్ నుండి 100కి.మీ వ్యాసార్ధం వరకు అడ్డిస్ అబాబా పాలనను విస్తరించడం, ఈ మేర భూ వైశాల్యాన్ని అడ్డిస్ ఫెడరల్ పాలన కిందికి తీసుకురావడం. దీని మూలాన ఒరోమియా కేంద్రమైన అడామా (నాజ్రేత్) పట్టణాన్ని ఒరోమియా రీజియన్ కోల్పోవాల్సివస్తుంది. ఫలితంగా సహజ వనరులను అనగా రైతులు భూమిని కోల్పోతారు, పశుగ్రాస భూములను కోల్పోతారు, కూలీలు-పశు పోషకులు నిరుద్యోగులవుతారు, పర్యాటక ప్రాంతాలను వదులు కోవాల్సివస్తుంది, ఒరోమియా భాష పై దాడి పెరుగుతుంది, జాతీయ భాష అయినా ‘అమ్హారా (Amhara)’ కౌగిలిలోకి పోవాల్సి వస్తుంది… ఫలితంగా ఒరోమియా అస్తిత్వం ప్రమాదంలో పడిపోతుంది, ఫెడరల్ ప్రభుత్వ ఆధిపత్యం పెరిగి ఎత్నిక్ ఫెడరలిజం కుప్పకూలుతుంది. ప్రపంచ సామ్రాజ్యవాదుల పెట్టుబడులతో ఒరోమియా సంస్కృతి దెబ్బతిని అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి వుంది కాబట్టి ఒరోమియా ప్రజలు నిరసనలకు, ఉద్యమాలకు దిగుతున్నారు. నిజానికి అడ్డిస్ అబాబా కూడా ఒరోమియా రీజియన్ లోనిదే దాని అసలు పేరు ఫిన్ ఫినె (ఒరోమియా పేరు) దానిని ఒరోమియా ప్రజలు వదులుకున్నారు, రెండో పెద్దపట్టణం అయిన అడామాను కూడా వదులుకోవడానికి ఒరోమియా ప్రజలు సంసిద్ధంగా లేరు. దీని ఫలితమే ఒరోమియా ప్రజల ఆగ్రహానికి కారణం.

హచాలు హుండెస్సా – నిరసన పాటల పయనం
ఫలితంగా ఉద్యమ నిర్మాణాలు ఏర్పాటు అయ్యాయి, నిరసన కార్యక్రమాలు రూపు దిద్దుకున్నాయి. ఈ నిరసనలల్లో వందలాది కళాకారులు, మేధావులు, వేలాది విద్యార్థులు, ప్రజలు పాల్గొని ప్రభుత్వ విధానాల వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించడం, ప్రభుత్వం ఈ ఉద్యమాలను ఉక్కుపాదాలతో అణచివేయడం, వందలాది మందిని కాల్చడం వేయడం, వేలాదిమందిపై కేసులుపెట్టి జైల్లో పెట్టడం జరిగింది. హచాలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ అవినీతి వ్యతిరేక పాటలు రాసి పాడడం, ప్రజాచైతన్యాన్ని పెంచి తన పాటల ద్వారా వుద్యమం లోకి ఆకట్టుకోవడంతో ఉద్యమ తీవ్రత పెరిగింది. ఫలితంగా తన 17 వ ఏట 2003 సం.లో ఆనాటి మెలెస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురై అరెస్ట్ అయి, చిత్రహింసల పాలై ఐదు సంవత్సరాలు కర్చలెఆంబో జైలులో శిక్ష అనుభవించి 2008లో విడుదలయ్యాడు. నిజానికి తనకి పాటలు రాయడం, పాడడం రాదని, అవి తను జైలులోనే నేర్చున్నాడని హచాలు ఒక సందర్భంలో చెప్పాడు.

హచాలు హుండెస్సా జైలులో ఉన్నప్పుడు తన మొదటి ఆల్బం “సాయినీ మూత్తి” (The Race of King) యొక్క సాహిత్యాన్ని సృష్టించి శ్రావ్యమైన బాణీలల్లో పాటలను కూర్చి 2009 లో విడుదల చేసాడు. ఈ ఆల్బం తో హచాలె కు ఒరోమో రీజియన్ లో తిరుగులేని (legendary) గాయకుడిగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2013 లో, అతను అమెరికా లో పర్యటించి, తన రెండవ ఆల్బం “వాయీ కీన్యా” (Which brings…) ను విడుదల చేశాడు, ఇది అమెజాన్లో అత్యధికంగా అమ్ముడైన ఆఫ్రికన్ మ్యూజిక్ ఆల్బమ్. హుండెస్సా యొక్క నిరసన పాటలు ఒరోమో ప్రజలను ఏకం చేశాయి, అణచివేతకు వ్యతిరేకంగా వారిని ప్రోత్సహించాయి.

అతని పాటలు 2015 లో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రతిఘటనతో మరియు 2016 ఇథియోపియన్ నిరసనలలో అంతర్భాగం అయ్యాయి. ఒరోమియా ప్రజల స్వేచ్ఛా నినాడాలై ఊరూరా మరోమోగి నిరసన జ్వాలలను రగిలించాయి. అతని బల్లాడ్ “మలన్ జిర్రా” (“what existence is mine…”) ఫెడరల్ ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలను అడిస్ అబాబా నుండి తరిమి వేసే చర్యలగురించి పాడిన పాట ప్రతి ఒరోమియా గడపలోకి పవనం లా వీచింది. అడిస్ అబాబా మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని నెలల తరువాత “సింగిల్” అనే మరో పాటల సంకలనాన్ని (ఆల్బం) విడుదల చేసాడు. అడిస్ అబాబా మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు ఒరోమియా ప్రాంతం అంతటా జరిగాయి. ఈ పాటల ఆల్బం నిరసనకారులకు ఆయుధంగా మారి ఒరోమియా ప్రజలను పోరు పట్టాలెక్కించింది. ఎరిట్రియా, ఇథియోపియా శాంతి చర్చలు సఫలమైనాక ఎరిట్రియా అధ్యక్షుడు అడ్డిస్ లో అడుగుడిన సందర్భం లో ఇథియోపియా ప్రధానమంత్రి అభి హచాలు ను పాటల కచేరి ఏర్పాటు చేయాలని ఆహ్వానించాడు. దానికి సమాధానంగా హచాలు స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా సున్నితంగా తిరస్కరిస్తూ సోమాలి మరియు ఒరోమియా ఎత్నిక్ ఘర్షణల్లో వేలాది మంది మరణించారు, వారి రక్తపు వాసనలు ఇంకా వెంటాడుతూనే వున్నాయి, కుటుంబాలు దుఖ సాగరంలో మునిగివున్న తరుణంలో ఈ పాటల కచేరీలు అవసరమా అని ప్రశ్నించాడు. దానితో ప్రభుత్వ ఆగ్రహానికి మరోసారి గురికావడం జరిగింది.

జాతి హింసతో తరిమివేయబడిన 700,000 ఒరోమోల కోసం డిసెంబర్ 2017 లో నిధులను సేకరించడానికి అడిస్ అబాబాలో నిర్వహించిన ఒక పెద్ద సంగీత కచేరీలో హుండెస్సా పాటలు తూటాలుగా పేలాయి. ఈ కచేరీని ఒరోమియా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. హుండెస్సా పాటలు ఒరోమో ఆశలను, నిరాశలను ప్రతిబింబించాయి. “ఒరోమో విప్లవం యొక్క సంగీత సారణి, ఒక లిరికల్ మేధావి, ఒరోమో ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలను నిక్షిప్తం చేసుకొని తన పాటలతో నిరసన జ్వాలలను రగిలిస్తున్న కార్యకర్త – హచాలు హుండేస్సా” అని అవోల్ ఆల్లో అనడం హచాలు హృదయ స్పందనను తెలియచేస్తుంది. హచాలు ఒరోమో భాష లో పాడినా అన్ని ఎత్నిక్ గ్రూప్ ల నుండి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఆయన పాటలలోని విద్యుత్తు.

హచాలు స్వయంగా ‘నేను రాజకీయ నాయకుడిని కాను, నేను ప్రజా కళాకారున్ని, నేను నా ప్రజలు కోరుకునేదే పాడుతున్నాను. అంతేకాని రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తడానికి కాదు’ అని ప్రకటించుకున్నాడు. చాలా మంది కళాకారులు ఈ దేశంలో కొనసాగుతున్న అణచివేత, వివక్ష, శిక్షలనుండి తప్పించుకోవడానికి ఇతర దేశాలకు ప్రవాసులుగా వెళ్ళారు కాని నా ప్రజలను వదిలి వెళ్ళను, ఇక్కడే వుండి నా గళం తో నిరసనలను తెలియజేస్తాను అని ప్రకటించుకున్నాడు. ఇంకా “సంగీతమే నా జీవితం, ఇది నాకు మిత్రులను, శత్రువులనూ ఇచ్చింది, దీనిని నా అంతరాల నుండి పొంగి పొరలే సంవేదనలను వ్యక్తీకరించే ఆయుధంగా వాడుకుంటాను” అని సగర్వంగా చాటుకున్నాడు.

హచాలు హుండేస్సా – హత్య
హుండెస్సాను 29 జూన్ 2020 సాయంత్రం అడిస్ అబాబాలోని గెలాన్ కండోమినియమ్స్ (ఇళ్ళ సముదాయం) ప్రాంతంలో కాల్చారు. అతన్ని తిరునేష్-బీజింగ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను గాయాలతో మరణించాడు. శోక సముద్రంలో మునిగి పోయిన వేలాది మంది ఆసుపత్రిని చుట్టుముట్టారు. అతన్ని అడిస్ అబాబాలో ఖననం చేయాలని నిరసనకారులు పట్టుబట్టగా, అతని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంబోకు తరలించారు. హచాలుకు భార్య, ఇద్దరు కూతుళ్ళు వున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అనేక మంది నిందితులను అరెస్టు చేశారు. ఒరోమియా మీడియా నెట్‌వర్క కు హచాలు హుండేస్సా మరణానికి వారం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టంగా తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నట్టు తెలిపాడు. కాని రాజ్యం, పోలిస్ దానిని సీరియస్ గా తీసుకోలేదు ఫలితంగా హచాలు అసువులు బాసాడు. అంత్యక్రియల్లో వేలాది ప్రజలు పాల్గొని వివిధ పట్టణాల గుండా, వీధుల గుండా ప్రదర్శన చేస్తూ ముక్త కంఠం తో “ఒక రోజు మేమంతా స్వేచ్ఛాజీవులమవుతాము, హచాలు చిందించిన రక్తం వృధా పోదు” అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.

పాటను హత్య చేసారు, తాత్కాలికంగా గొంతును నులిమేసారు. కాని ఆ గొంతుక ప్రతి ప్రజా కంఠమై వేల పాటలను సృష్టిస్తుంది. పాలకులు ప్రపంచమంతా ప్రశ్నించే గొంతుకలను మట్టుబెడుతూనే వున్నారు. కానీ పాటదే పై చేయి అవుతుంది, పాలక కుట్రలను తుత్తునియలు చేస్తుంది. హచాలు మరణించలేదు, అతను లక్షలాది ఒరోమియా హృదయలాల్లో ఎల్లపుడు జీవించే ఉంటాడు. ఉరికొయ్యలు, చెరసాలలు, హత్యలు ప్రజా పాటను బంధించలేవు, అంతం చేయలేవు.

హుండెస్సా మరణం ఒరోమియా ప్రాంతం అంతటా, ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు దారితీసింది, కనీసం 200 మంది మరణించారు. అడామాలో ప్రదర్శనలలో, తొమ్మిది మంది నిరసనకారులు చంపబడ్డారు మరియు మరో 75 మంది గాయపడ్డారు. చివర్లో ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపగా, హరార్‌ పట్టణం లో నిరసనకారులు ప్రిన్స్ మోకోన్నెన్ వోల్డే మైఖేల్ విగ్రహాన్ని కూల్చివేశారు. 30 జూన్ 2020 న, నైరుతి లండన్ లోని వింబుల్డన్ లోని కన్నిజారో పార్క్ లోని ఇథియోపియన్ మాజీ చక్రవర్తి హైలే సిలాసీ విగ్రహాన్ని ఒరోమో నిరసనకారులు ధ్వంసం చేశారు.

30 జూన్ 2020 ఉదయం 9 గంటలకు, ఇథియోపియాలో ఇంటర్నెట్ తొలగించబడింది. పెరుగుతున్న నిరసనల సెగల మధ్య ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ప్రధాన మంత్రి అబి అహ్మద్ హచాలు హుండెస్సా కుటుంబానికి సంతాపం తెలిపారు. ఒక మీడియా కార్యకర్త జవార్ మొహమ్మద్ ఫేస్ బుక్ లో హుండెస్సా మరణంపై స్పందిస్తూ, “వారు కేవలం హచాలును చంపలేదు. వారు ఒరోమో జాతి గుండెపై మరోసారి బుల్లెట్ తో కాల్చారు!! … మీరు మమ్మల్ని చంపవచ్చు, మా ఉద్యమాలను నిలువరించలేరు!!” అని రాసాడు ఫలితంగా జవార్ మొహమ్మద్‌ను ఇథియోపియన్ ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో కూడా అనేక కవులను, కళాకారులను, గాయకులను ఇథియోపియా ప్రభుత్వాలు జైలు లో పెట్టారు, హత్యలు చేసారు చేయించారు, శిక్షలు వేసారు, అయినా ప్రజావుద్యమాలను, ప్రజల ఆకాంక్షలను ఏనాటికీ ఆపలేరు అనేది చారిత్రిక సత్యం. ఇది ఒక ఇథియోపియా ప్రభుత్వ చర్యనే కాదు, అన్ని దేశాలల్లో ఇదే కోనసాగుతుంది. మనదేశంలో గద్దర్ పై గుల్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నం చేసారు, జ్ఞానేశ్వర్ ను హత్యచేశారు, గౌరీ లంకేష్ ను చంపారు, వి.వి, సాయిబాబా లాంటి ప్రశించే గొంతుకలను జైలు లో పెట్టారు, సుబ్బారావు పాణిగ్రాహి నుండి రిక్కల సహదేవుని వరకు, నూతన్ వరకు… ఇంకా ఎందరినో… రాజ్యం పొట్టన పెట్టుకుంటూనే వుంది. అయినా సమస్యలు పరిష్కరించేవరకు స్వేచ్ఛా గాలులు వీచేవరకు ఈ వుద్యమాలు కొనసాగుతూనే వుంటాయి. ప్రజలదే అంతిమ విజయం.

హచాలు హుండేస్సాకు, ఈ సమరంలో అసువులు బాసిన నిరసనకారులకు మన నివాళులు!!

ప్రజా కళలు, పోరాటాలు వర్ధిల్లాలి!!!

ఊరు సిరిసిల్ల. సాహితీ ప్రియుడు. ఆఫ్రికా లో రెండు దశాబ్దాలు అధ్యాపకుడు గా పనిచేసాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం.

12 thoughts on “ఒరోమియా అస్తిత్వ పోరాట గుండె చప్పుడు – హచాలు హుండేస్సా

  1. గద్దర్ వంటి మంచి ప్రజా గాయకుడిని పరిచయం చేశారు.

  2. చాలా బాగా రాశావు. మంచి పరిచయం

  3. ఒరోమియా భాషలో పాటలకి అనువాదాలు ఇప్పుడు మనకు అందుబాటులో లేవుగానీ, హచాలు హండీస్సా మూడు ముఖ్యమైన పాటలూ తన ప్రయాణానికి అద్దం పడతాయి. 2015 లో రాసిన పాట మాలన్ జీరా (ఎలాంటి జీవితం నీది/ మనం ఎక్కడున్నాం). 2017లో రాసిన పాట జిర్రా (మనం ఇక్కడ వున్నాం), చనిపోవడానికి ముందు రాసిన పాట ఇస్సా జిర్తా (నువ్వెక్కడున్నావు)..

    జర్మన్ ప్రసార సంస్థకి 2018లో ఇంటర్వ్యూ లో హచాలు హండీస్సా మాటలు ఇవి,
    ‘సమాజంలోని రాజకీయ, సాంఘిక, ఆర్ధిక జీవితాన్ని విశ్లేషిస్తామని నేను అనుకుంటాను. వ్యక్తిగతంగా ప్రతిఘటన పాటలు పాడేటప్పుడు నాకు సంతోషమనిపిస్తుంది. సమాజంలో నేను భాగం కాబట్టి ఆ పాటలు నాలో భాగంగా ఉంటాయి… సమాజంలో పీడిత ప్రజలు వున్నప్పుడు, ఆ పీడితులలో నేను ఒక్కడినైనప్పుడు, ఆ అణచివేతకు వ్యతిరేకంగా నా నిరసనని పాట రూపంలో వ్యక్తీకరిస్తాను. పాట అన్నది సత్యాన్ని వెల్లడించే సాధనం, నిరంకుశత్వాన్ని బహిర్గతం చేసే సాధనం.’

    హచాలు హండీస్సా కి జోహార్లు. అతికొద్ది సమయంలో చాలా మంచి వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు శ్రీనూ..

  4. హచాలు ఒక ఉత్తేజం. ఒక పోరాటం. హచాలు గడ్డ మీద గాలిని పీల్చుకున్న సహచర శ్రీను ధన్యుడు. హచాలు మెరుపు పాటని పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు.

  5. జిర్రా పాట వింటుంటే మన జానపద, విప్లవ పాట వింటున్నట్లే ఉంది. అందులోని కొన్ని పదాలు మన తెలుగు,తమిళం, కన్నడ, హిందీ పదాలలానే అనిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విప్లవకారులు, కవులు, కళాకారులు, నిరంకుశ, క్రూర ప్రభుత్వాల చేతుల్లో బలికావాల్సిందేనా? దుర్మార్గుల పాలన అంతానికి ఏదో కొత్త యుధ్ధ తంత్రం కనుక్కోవాలి.
    హున్డే స్సాకు ఘన నివాళి.

Leave a Reply