స్వేచ్ఛ జీవితేచ్ఛ

తలుపు తెరవగానే
ఒక సీతాకోక
ఎక్కడ్నుంచొచ్చిందో…
గదుల మధ్య
కానరాని గగనాన్ని వెదుక్కుంటుందో..
లేని పూలచెట్లకై పచార్లు కొడుతుందో…
తొలిరోజు ఈతనేర్వడానికొచ్చిన పిల్లాడిలా
గృహగుహలోకి దారితప్పొచ్చినగ్రహాంతరవాసిలా
దిక్కులేనిదై ,రెండు రెక్కలదిగులునదై
ఆకాశమంత అయోమయంతో అల్లాడిపోతూనే…
సముద్రాన్ని లంఘించే సాహసిలాగా
అంతరిక్షాన్ని చేధించే వనవాసిలాగా
ఇంట్లోంచి బయటపడదామని
బహుముఖయత్నం చేస్తూ
స్వేచ్ఛాకాంక్షతో లోలో నే రగిలిపోతూ
సమరయాత్ర సాగిస్తున్నది
ఇల్లు దానికి అండా సెల్లు
ఉక్కిరిబిక్కిరి ని ఉత్పత్తి చేసే ఉక్కమిల్లు
అభిమన్యుని చెరపట్టిన పద్మవ్యూహపు నకలు
నిరంతర యాతనతో,చేతనతో
పరుగులరాణయి, ధిక్కార వాణయ్
ఇల్లంతా కలియతిరుగుతున్న సీతాకోకను
ఆశ్చర్యానందాలతో వెంబడించి,వెంటాడి
అనంతమైన ప్రేమతో
తన గుప్పిట్లో పట్టుకొని
పక్కింటి తోటలో వదిలొచ్చి
“అకారణంగా దేన్నైనా
నిర్బంధించడం నేరమే కదా”
అని అంటూ మా పాప
మరో సీతాకోకైంది.

మహబూబ్ నగర్ జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు : పక్షులు (దీర్ఘ కవిత), అతను వ్యాపిస్తాడు
(కవితాసంకలనం). జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇప్పటూర్(మహబూబ్ నగర్ జిల్లా)లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Leave a Reply