స్వప్న భూమి

మెతుకులనో
గింజలనో పండిస్తావు అనుకుంటాం గానీ
నువ్వు పండిస్తున్నది స్వప్నాలని

కలల గింజలు కండ్ల నేలలో జల్లి దిగుబడి చేస్తున్నది జీవన వైవిధ్యాన్ని

బతుకు ఒక నడకనీ
చేతుల శక్తికి శ్రమను తొడుగుగా తొడిగి
కంటికి చూపుకు చురుకునద్దింది
నీవేనని తెలుసునా జగతికి?

వొంగి నాట్లేసి నిటారుతనాన్ని నిలబెట్టి
నిలబడి తూర్పార బడుతున్నది
బతుకులోని నిస్సారతనే అని
తెలుసా జనానికి?

జీవితం యుధ్ధం కానిదెప్పుడు నీకు

భూగోళమంత కురువృధ్ధుడివి
చచ్చే చావులు చచ్చి
బతకనేడ్ఛినోడివి

ఆకలికి ఆకులు కలబందలు కాకుండా
అన్నం మెతుకులు అలవాటు చేసినోడివి

మనిషిని ఆదిమానవుణ్ణించి
మహనీయుడిగా మార్చింది నీ నాగలి
భూమికి పండించే కళ నేర్పింది నీ గొర్రు
సంస్కృతికి అర్థం ఇచ్చిన పాఠశాల నీ కష్టం

నీ చెమట నేల దేహానికి అత్తరు పరిమళం
ఈ భూమిని మానవజాతి ఆస్తి చేసిన
సాక్షి సంతకం నీ పాదం

మట్టి మాతృత్వానికి భూగర్భాన్ని
దానం చేసిన దాతృత్వానివి

నీవెరివో ఇంకా తెలుసుకోలేదీ ప్రపంచం

పొలాల మీద నీ హక్కును
కాలరాయడానికి పన్నుతున్న
వలలను ఛేదించడానికి
నాగలి ఓ ప్రత్యామ్నయ ఆయుధమై
లేస్తున్న వేళ

నా కలలు కొత్త నాట్లు తొడిగి
నీ పాదం పడిన చోట నుండి ఉద్యమ వంగడాన్ని
సృష్టించుకుంటున్నాయి

నవీన మానవుడి ఆవిష్కరణకి సిధ్ధమౌతున్నాయి

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

2 thoughts on “స్వప్న భూమి

  1. కలలు కొత్త నాట్లు తొడగటం.. మహమూద్ గారి కవిత్వం చాలా బావుంది

Leave a Reply