స్మృతి వచనం

‘తల వంచుకు వెళ్లిపోయావా నేస్తం
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి’

కొంపెల్ల జ‌నార్ద‌రావు కోసం మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ స్మృతి గీతం తెలుగులో దు:ఖపు వ్యక్తీకరణకి కొత్తదారిని చూపింది. కవిత్వంలో అసంఖ్యాకంగా స్మృతి గీతాలూ, కవిత్వాలూ ఉన్నాయి. ఒక మౌలిక రాజకీయ పోరాట సమకాలీనత కలిగిన తెలుగు సమాజంలో స్మృతి కవిత్వం ఒక ధోరణిగా కూడా ఉంది. సహచరులు చనిపోయిన సందర్భంలో తీవ్రమైన వేదనకి లోనై తొలిసారి కవిత రాయడం గమనించవచ్చు. లోతైన దు:ఖాన్ని వ్యక్తీకరించడానికి కవిత్వాన్నే ఎంచుకోవడానికి కారణం ఒక రకంగా అంతశ్చేతన. అది ఒక ఆదిమ సహజాతం. అంతే కాక హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాట రూపాన్ని యివ్వవడం కవిత్వానికి తెలిసినంతగా మరి దేనికీ తెలియదు.

కానీ వచనం కూడా ఆ కంపనకి మాటల్ని యివ్వగలదు. తెలుగులో అలాంటి వచనం రాసినది చలమే. హృదయాన్ని పట్టుకునేలా రాస్తున్న స్మృతి వచనం తెలుగులో అమ్యూలమైన కళా రూపం. దీనిలో అంతశ్చేతన బాహ్యవ్యక్తీకరణ రెండూ కలగలిసి పోతాయి. మొగ్గలా లోలోకి ముడుచుకుని పువ్వులా మరో హృదయంలో వికసించడంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.

స్మృతి వచనంలో వీవీ సార్‌ది మార్గదర్శక శైలి. అది వ్యక్తినీ వ్యక్తి సమకాలీనతనీ దాని ప్రభావాన్నీ చదువరికి చెపుతుంది. ఆ శైలి వెనుక వున్న వీవీ టోన్‌లోని సబ్జెక్టివ్‌ ధ్వని నేపథ్య‌ సంగీతంలా మన హృదయాన్ని కంపింప చేస్తూ ఉంటుంది. విప్లవ నాయకులు నల్లా ఆదిరెడ్డి, కిషన్‌జీ పై ఆయన రాసిన స్మృతి వచనాలు తెలుగు సాహిత్యంలో అమ్యూలమైనవి. ‘ఆ ముగ్గురూ అరుణ్‌..’ అనే పేరుతో రాసిన వచన స్మృతిలో వీవీ ఒక్కొక్క వ్యక్తిత్వాన్నీ అది జనంలో ఇంకిపోయిన తీరునీ బాధాకలిత స్వరంతో అన్వేషిస్తూ పోతాడు. ఆ ముగ్గురి గురించి రాయడం అంటే ఒక కాలాన్ని గురించి తలపోయడం. దు:ఖాన్నీ ఆవేశాన్నీ పంటిబిగువున నొక్కి అమూర్తమైన ఒక పోరాట కాలాన్ని ముగ్గురు మూర్తులుగా అనువదించడం ఈ వచనంలో కనిపిస్తుంది.

ఆంధ్రజ్యోతి దిన పత్రికలో 12 ఏప్రిల్ 2007న వాసుదేవరావు గురించి కె.ఎన్‌.వై.పతంజలి రాసిన వ్యాసం చదివితే కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. వాసుదేవరావుతో పరిచయం అక్కర్లేదు. ఆయన ఎవరో కూడా తెలియనక్కర్లేదు. కానీ తెలిసిన పతంజలిలోని దు:ఖం మనలోకి వస్తుంది. ఈ వ్యాసం శిల్పం కూడా ఒక జానపద వీరగాథలాంటి శిల్పం. మెల్లగా గుణగణాల్ని వర్ణించడం మొదలు పెట్టి తరువాత ఉధృతమైన స్వరంలో ఆయన గురించి తనకున్న జ్ఞాపకాల సారాంశాన్ని చెప్పి పాఠకుడిని తనతో తీసుకుపోతాడు. కాస్త విశ్రాంతి కోసం ఆగినట్టు ఆగి చివరి జడిలాగా ‘పరుషంగా మాట్లాడి ఎరగడు.. ఎవరినీ కించపరిచిందిలేదు…’ అనే వాక్యాలు చదివిన తరువాత మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి రుద్ధ కంఠంతో తలచుకున్నట్టు అనిపిస్తుంది.

రావు కృష్ణారావు రాసిన ‘నాపాలిటి దేవుడు’ చెలికాని రామారావు పై రాసిన ఈ వచన స్మృతి ఒక జల విగ్రహంలా మనలో నిలుస్తుంది. జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం తీర్చి దిద్దిన ఒక గొప్ప వ్యక్తి దైనందిన జీవితాన్ని బొమ్మ కట్టి చూపిన ఈ స్మృతి మన్ని చాలా సార్లు ఉత్తేజ పరుస్తుంది. చాలా సార్లు ఏడిపిస్తుంది. ఈ వచనాన్ని నడిపించిన కృష్ణారావుగారి మానసిక స్థితి మనలో వికసించడం మనం స్పష్టంగా అనుభూతి చెందగలం.

కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘అమరుడు రేలంగి’ అనే స్మృతి వచనంలో తెర మీద కనిపించే కమేడియన్‌ రేలంగిలో ఉన్న క్లాసిక్‌ స్వభావాన్ని చెపుతాడు. ఒక పక్క జనసామాన్యం చేత ‘రారా నా కొడకా’ అని మాటల పూలదండలు వేయించుకున్న రేలంగి పెద్ద మనుషులు వంటి సినిమా చూసి కంట తడి పెట్టుకోవడం ఈ రెండు సందర్భాల్లోనూ మన మనసు ఆనందంతో ఝ‌ల్లుమంటుంది.

అరుణోదయ రామారావు మీద శివాజీ రాసిన ‘ఇక కొండల వెనుక అరుణోదయుడు’ (7మే 2019 ఆంధ్రజ్యోతి) రామారావు భౌతిక రూపాన్నే కాదు, ఆయన స్వభాన్ని కూడా బొమ్మ కట్టి చూపుతుంది. ‘మనసారా నోరారా నవ్వేసే వాడు వెర్రివాడు గాక మానడు..’ అంటూ మొదలయ్యే దీనిలో అమాయకత్వాన్నీ అచంచల కమిట్‌మెంట్‌నీ చెపుతాడు. రామారావు కమిట్‌ మెంట్‌కి సంబంధించిన పదజాలాన్ని సుతారమైన వ్యంగ్యంతోనే అన్వయిస్తూ ‘మొండి ధైర్యంతో రామారావు ఏం సాధించాడో’ అంటూ ఎత్తి పొడుస్తాడు. కానీ వెంటనే ఏ లక్షణాలనైతే వ్యంగ్యం చేసాడో ఆ లక్షణాల వల్లే ‘నా వంటి పరిచయస్తులకు సైతం కళ్ల నిండా నీళ్ళు నింపి పోవడం ఏం మర్యాదా’’ అంటూ వాపోతాడు. యిటువంటి వ్యక్తుల ముందే మన దు:ఖాలన్నీ అదుపు తప్పి మనలో దాగున్న మానవ లక్షణాన్ని బయటకి తీసుకొస్తాయి.

గుర్రం సీతారాములు చిత్రకారుడు కాళ్ల మీద రాసిన ‘అడవిలో కురిసిన రంగుల వాన’ లో కాళ్ళ జీవితానికీ ఆయన చిత్రానికీ మధ్య అభేదాన్ని చెపుతాడు. నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యులు పైన సి.హెచ్‌. లక్ష్మణచక్రవర్తి రాసిన ‘శాస్త్ర వేదగ్రంథాల మార్గదర్శి’ లాంటి ఎన్నో వచన స్మృతులు తెలుగులో వస్తున్నాయి.

కవితలో లాగా కేవలం ఎమోషన్స్‌కే పరిమితం కాకుండా వచన రచనలో ఎమోషన్స్‌ తో పాటు జీవిత రేఖాచిత్రణ కూడా కనిపిస్తుంది. ఒక సాహిత్య కళా రూపంగా స్మృతి వచనం ఒక విలక్షణ రూపాన్ని సంతరించుకుందనడంలో సందేహం లేదు.

జ‌న‌నం: తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. క‌వి, ర‌చ‌యిత‌, ఉపాధ్యాయుడు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్య సృజన వీరి ప్రత్యేకత. 'ఆవాహన','పారిపోలేం', కవితా సంపుటాలు వచ్చాయి. 'పిట్టలేనిలోకం', 'పర్యావరణ ప్రయాణాలు' అనే దీర్ఘకవితలు ప్రచురించారు. 'సీమెన్'  కథా సంపుటి ముద్రించారు.

2 thoughts on “స్మృతి వచనం

  1. బాగుంది మీ చూపు. పతంజలి వ్యాసం ఆయన సమగ్రం లో ఉందా సర్ ?

Leave a Reply