స్ట్రాంగ్ ఉమన్

టాంక్ బండ్ పై కొత్తగా పెట్టిన ఈ లాంప్ పోస్ట్ లంటే నాకు చాలా ఇష్టం. ఆధునికంగా కనిపించే అలంకారాల కన్నా ఇలా గడిచిపోయిన పాత రోజుల్లలోకి తీసుకువెళ్లె ఆర్కిటెక్చర్ పై నాకు మమకారం ఎక్కువ. ఈ లాంప్ పొస్ట్ లతో కొత్త కళ వచ్చింది హుసేన్ సాగర్ కి.

ఇలా తీరిగ్గా కూర్చుని సమయం గడిపే అవకాశం నాకు ఎప్పుడూ రాదు. ఇవాళ ఎందుకో చాలా దుఖంగా ఉంది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బి ఉన్నాయి. కనురెప్పలు మండిపోతున్నాయి. ఒంట్లో ఓపిక లేకపోయినా తప్పక ఓ మీటింగ్ కోసం ఆబిడ్స్ దాకా రావలసి వచ్చింది. ఇంటికి వెళ్లబుద్ది అవ్వట్లేదు. ఇలాగే ఈ నీళ్లలోకి దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక వేళ నేను అలా మరణించినా నాది ఆత్మహత్య అని ఎవరూ అనుకోరు. అది ప్రమాదం అని సరిపెట్టుకుంటారు. బైటికి నేనిచ్చే ప్రదర్శన అలా ఉంటుంది. ‘ది స్ట్రాంగ్ ఉమన్’ అంటారు అంతా నన్ను.

కాని ఈ మధ్య నీళ్ళని చూస్తే దూకాలని, కనిపించిన మాత్రలన్నీ ఒకే సారి మింగాలని బలంగా అనిపిస్తూ ఉంది. అలాంటి ఆవేశం కలిగినప్పుడు నా కలవాటయిన పద్దతిలో సాహిర్ పాటలు గుర్తు చేసుకుంటూ నాలోని మొండితనాన్ని బైటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాని ఈ మధ్య దానికీ ఓపిక ఉండట్లేదు. లోపల అలసిపోయిన భావం. నిజంగా చాలా అలసిపోయాను. ఒకోసారి అడుగు తీసి అడుగు వేయడం కష్టమవుతుంది. మనుషులంటేనే విసుగ్గా ఉంటుంది. స్నేహితులెవ్వరినీ కలవాలనిపించదు.

హమ్సే మత్ పూచో కైసే మందిర్ టూటా సపనో కా
లొగో కీ బాత్ నహీ హై, యె కిస్సా హై అపనో కా
కోయీ దుష్మన్ ఠేస్ లగాయే తో మీత్ జియా బహలాయే
మన్ మీత్ జొ ఘావ్ లగాయే ఉసె కౌన్ మిటాయే

‘అమర్ ప్రేమ్’ సినిమాలో పాట కదూ ఇది. అటు పక్కన కూర్చున్న పెద్దాయన సెల్ ఫోన్ లో ఈ పాట వింటున్నాడు. అతనూ ఒక్కడే అక్కడ. ఈ పాట విన్న ప్రతిసారి నాలో రేగే విషాదం అంటే నాకు భయం. అందుకే ఇది ఎప్పుడూ వినను. ఎక్కడన్నా వినిపించినా లేచి వెళ్లిపోతాను. శతృవులు మోసం చేస్తే స్నేహితుల దగ్గరకు వెళతాం. మనసుకు దగ్గరయిన వారే గాయం చేస్తే ఎవరికి చెప్పుకోగలం అంటూ సాగే ఈ పాట విన్న ప్రతి సారీ నన్ను ఎంతో అలజడికి గురి చేస్తుంది.

కాని ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి కదిలే ఓపిక అస్సలు లేదు. ఈ స్థితిలో ఆ మీటింగ్ లో నేను అంత సేపు అంత గంభీరంగా ఎలా మాట్లాడగలిగాను అన్నది తలచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏదో ఓ ఇంటర్వ్యూలో మైఖెల్ జాక్సన్ “నెను ఆనందంగా నేను లా ఉండేది ఆ స్టేజ్ పైనే. స్టేజ్ దిగిన వెంటనే ఈ లోకం నాది కాదనిపిస్తుంది” అన్నాడు. నా జీవితం కూడా సుమారుగా అంతే, పని పని. అందులో మాత్రమే నేను జీవించేది. అది అయిపోయాక అందరూ విశ్రాంతిగా ఉంటుంటే నాకు పిచ్చిపడుతుంది. నా చుట్టూ ఉన్న ఈ లోకం నుంచి పారిపోవాలనిపిస్తుంది. పని లేని ఆ క్షణాలు నాకు అర్ధం లేనివిగా అనిపిస్తూ గందరగోళానికి గురి చేస్తాయి.

అసలు నా ఈ ఒంటరితనానికి బీజం ఎక్కడుంది? ఫలించని నా వివాహంలోనా? దాన్ని నేను ఒక సవాలుగానే తీసుకున్నాను. నా పక్కన ఓ మగతోడు లేదని నేను యెప్పుడూ బాధపడలేదు. అదో లోటనీ నేను అనుకోలేదు. ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఒంటరి తల్లిగా మారినందుకు దుఖించలేదు. నా బిడ్డను ఏదో చేయాలని ఎంతో తాపత్రయపడ్డాను. ఎన్ని అవమానాలు? ఎంత వేదన ఎన్ని కన్నీళ్లు. ఎంత ఓటమి. చివరకు ఆ బిడ్డ కూడా నువ్వు నాకు ఒద్దు అనే అన్నాడు. ఎందుకు ? వాడి విలాసాలకు నా క్రమ శిక్షణ అడ్డు అని. అయినా పట్టుదలగా జీవించాలనుకున్నా, వాడిని మార్చుకోవాలనుకున్నా. వాడి కోసం ఎవరికీ లొంగని నేను నా కుటుంబానికి లోంగిపోయా. నా వాళ్ళు నన్ను ఎన్ని సార్లు మోసం చేసి ఉంటారు? వారి వల్ల నేను ఎంత పోగొట్టుకున్నాను. బతకాలనే ఆశనే చంపి నన్ను జీవచ్చవం చేసిన వారి మధ్యనే భాద్యత పేరుతో నేను ప్రతి సారి లోంగిపోయి జీవించడం, దానికి బదులుగా ప్రతి సారి అవమానాలు పొందడం, తేలికగా నన్ను వాళ్ళంతా తీసిపడేసిన విధానం, ఎన్నో సంఘటనలలో ఒకదాని తరువాత మరొకటి గుర్తుకు వస్తుంటే కన్నీరు ఆగడం లేదు. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది.

నా భుజం పై ఓ చేయి పడింది, ఉలిక్కి పడి వెనక్కు తిరిగాను. కళ్ళ నుండి కారుతున్న కన్నీరు క్రిందకు జారుతుంటే అది ఆయన చూసాడన్న సిగ్గుతో కళ్ళు క్రిందకు దించుకున్నాను. ఆ పాట వింటున్న పెద్దాయన పక్కన నిల్చుని ఉన్నాడు. డెబ్బై పైనే ఉంటుంది వయసు నా వైపు దయగా చూస్తున్నాడు. చప్పున కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని నవ్వబోయాను. పక్కన కూర్చుంటూ “మనకు మనం చేసుకునే గొప్ప అన్యాయం ఏంటో తెలుసా తల్లి మనసు ఘోషిస్తుంటే దాన్ని కప్పి పెట్టుకుని లోకం కోసం నవ్వడం” అన్నాడు. కట్ట తెగిన కన్నీరు ఒకేసారి పైకి ఎగిసింది.

మౌనంగా ఆకశంలోకి చూస్తూ కూర్చున్నాడాయన. ఓ పదెహేను నిముషాల దుఖం తరువాత తలెత్తి ఆయన వైపు చూసాను.

నేను తనను చూస్తున్నానని ఎలా గ్రహించాడో చూపు ఆకాశం నుండి మల్లించకుండా, “ఏడవడం తప్పు కాదు తల్లీ, సిగ్గుపడవలసిన విషయమూ కాదు కన్నీళ్ళున్నాయంటే మనలో మనిషి బతికే ఉన్నాడని అర్ధం కదూ”… అన్నాడు.

“మనం బలహినులమనడానికి సాక్షం కూడా ఈ కన్నీళ్ళే ” అన్నాను మౌనంగా.

తల తిప్పి నా వైపు చూసి “అమానుషమైన బలం కన్నా, బలహీనతలలోనే మనిషితనం నిలిచి ఉంటుంది. అందుకే కన్నీళ్ళు బలహీనతకు గుర్తు అనిపించినా సిగ్గుపడకూడదు, అవి మిగిలి ఉన్నాయని గర్వపడాలి” అన్నాడు. నాకు ఏం అనాలో తెలియలేదు.

చిరునవ్వుతో నా వైపు చూస్తూ “ఆలోచించు నీలో కన్నీరుందంటే ఎంతో కొంత హృదయంలో మెత్తదనం ఉందనే. కన్నీరు విలువైనది తల్లి కాకపోతే ఎవరి కోసం దాన్ని చిందిస్తున్నాం అన్నదే ముఖ్యం.”

“నా కోసమే, నా ఓటమి తలచుకునే” అన్నాను తల దించుకుని…

“అంటే ఓ ప్రయత్నం చేసావన్నమాట. జీవితంలో ఏ ప్రయత్నమూ చేయక గాలివాటంగా కొట్టుకుపోయే కోట్ల మంది మధ్య నువ్వు మనసుతో ఓ ప్రయత్నం చేసావ్. అప్పుడే కదా గెలుపు ఓటముల ప్రసక్తి వచ్చేది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చేదే ఆ ప్రయత్నం చేయడానికి. అంటే నీ ఈ ప్రస్తుత ఓటమి నువ్వు మనిషిగా బతికావనేగా చెబుతుంది” అన్నాడు.

అయన ఏం చెప్పాలనుకుంటున్నాడొ నాకు అర్ధం కావట్లేదు. “మనల్ని ఓడించినవారు మనవారే అయితే అది కలిగించే దుఖం భయంకరంగా ఉంటుంది, మీరు ఇందాక వింటున్న పాటలోలా” అన్నా చప్పున నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చింది.

“అంత దుఖం కలిగించారంటే వారు మనవారు కారనేగా అర్ధం” బదులిచ్చాడు ఆయన.

తల తిప్పి అతనివైపు చూసాను. “ఖలీల్ గిబ్రన్ ని కోట్ చేస్తున్నారా” అడిగా.

“నాకు ఆయనెవ్వరో తెలీదు. చదివే అలవాటూ లేదు. అయినా ఒంటరిగా ఇక్కడ ఇలా కూర్చున్నావంటే నీ దుఖాన్ని ఎవరితో పంచుకోలేక లేదా పంచుకోవడానికి ఎవరూ లేకనే కదా. మనవారు అంటూ ఎవరూ లేనప్పుడే కదా ఈ స్థితి వచ్చేది” అన్నాడు.

మనసు చివుక్కుమంది… నిజమే నాకు నా అన్న వారు లేకనే కదా ఈ వీధిలో కూర్చోవడం.

“నీ దుఖానికి కారణం తెలుసుకోవాలన్న కుతూహాలం లేదు.. ఇక్కడ కూర్చున్న నీ ఒంటరితనం వెనుక విషాదం అర్ధం చేసుకోగల జీవితానుభవం ఉంది. ఆ విషాదంతో నువ్వేలా ముందుకెళ్లాలనుకుంటున్నావో వినాలనుకుంటున్నాను. అక్కడ పార్క్ చేసిన కారు నీదని గ్రహించాను. అంటే ఓ స్థాయిలో జీవిస్తున్న వ్యక్తివే. నీ వేషబాషలు నీవో ఉద్యోగస్తురాలివని చెప్పకనే చెబుతున్నాయి. గాయపడిన మనసు నిన్ను ఇక్కడకు తీసుకువచ్చిందనీ తెలుసు. ప్రతి గాయం ఓ పాఠమే. చెప్పు ఈ గాయం నీకేం నేర్పించింది” అన్నడు నా వైపు సూటిగా చూస్తూ.

“నేనో మూర్ఖురాలినని” అన్నాను విసుగ్గా.

తల కొద్దిగా పైకి ఎత్తి ఫక్కున నవ్వాడు ఆ పెద్దాయన.

“ఈ మధ్య అందరూ తెలివి, అతి తెలివి కలవారే కనిపిస్తున్నారు. వీరి మధ్య ఇంకా మూర్ఖులు మిగిలే ఉన్నారని వింటే ఆనందంగా ఉంది.. తిమ్మిని బమ్మిని చేస్తూ గడిపే వాళ్ళందరి మధ్య గ్లాడ్ టు మీట్ యూ” చేయి చాపుతూ అన్నారాయన.

కోపం వచ్చింది ఆయన నవ్వుతుంటే. అవమానంగా కూడా అనిపించింది.

“మనసుకు గాయం అయినప్పుడు మనం మొట్టమొదటగా మనల్ని మనం తిట్టుకుంటాం. ఎవరో చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తాం, మనల్ని కష్టపెట్టుకుంటాం. అన్యాయం కదా. తప్పు ఎవరో చేస్తే శిక్ష నువ్వు అనుభవించడం, నిన్ను నువ్వు నిందించుకోవడం తప్పు కదూ” అన్నారాయన.

“నువ్వు మూర్ఖురాలినని నిర్ణయించుకుంటే సరే. అలాగే జీవించాలనుకుంటే జీవించు. ఆ హక్కు నీకుంది. లేదా తప్పు చేశాను దారి మార్చుకోవాలి అనిపిస్తే ఆ ప్రయత్నం ఎప్పుడు ఎలా మొదలవ్వాలో ఆలోచంచాలి కదా.” తలెత్తి ఆయన వైపు చూసాను. ఆయన కళ్లల్లో గాంభీర్యం మాటలు తుంచాలనిపించనివ్వలేదు.

“అన్యాయం చేస్తున్నాం అని తెలిసి, మన మనసుకు గాయం అవుతుందని తెలిసి మరీ అన్యాయంగా ప్రవర్తిస్తారు మనుషులు. ప్రతి సారి ఈ అనుభవం జరిగిన తరువాత నేనెందుకిలాంటి అవకాశం వీరికి ఇచ్చానని నన్ను నేను తిట్టుకుంటూ బ్రతకడం అలవాటయింది నాకు” అన్నాను.

“ప్రతి సారి ఇలాంటి అనుభవమే దొరుకుతుందని తెలిసుకుని మరీ ఎందుకు నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావు?” అడిగారాయన.

“భాద్యతలను తప్పించుకోలేక” టక్కున చెప్పాను.

మరో సారి తల ఎత్తి ఆకాశంలోకి చూస్తూ గట్టిగా నవ్వాడాయన.

“ప్రతి రోజు భర్తతో తన్నులు తినే స్త్రీ ఓ రిధిమ్ కి అలవాటు పడుతుంది. ఆ పరిస్థితి నుంచి బైటపడాలని అనుకోదు. నేనో మంచిదాన్ని, నా భాద్యతను నెరవేరుస్తున్నాను అంటూ కన్నీరు తుడుచుకోవడంలో ఆమెకు ఓ తృప్తి ఉంది. భాద్యతను నిర్వహించడం అనే పేరున మరొకరి భాధ్యతా రహిత ప్రవర్తనకు ఆమె పరోక్షంగా కారణం అవుతుంది. నీది అదే కథనా.” ఎదో వెతుకుతున్నట్లు చూస్తునాడు నన్ను.

“కాదు నేను డివోర్సీని. భర్తతో విడాకులు తీసుకున్నాను. నా జీవితంలోకి అతను, అతని జీవితంలోకి నేను ఎప్పటికీ రాము. అతని ద్వారా నాకే సమస్యలు లేవు.”

“శుభం. ఓ పెద్ద చాప్టర్ కి ప్రశాంతమైన ముగింపు. ఆ సరిహద్దునే దాటిగలిగిన నువ్వు మరిప్పుడు ఎందుకింత నిస్సహాయంగా”… సగంలో ఆపేశాడు.

కళ్ళలోకి నీరు ఊరుతుండగా. “అన్ని బంధాలకు డైవోర్సులు ఉండవు కదండి. కొన్నిటిని జీవితాంతం మోయాల్సిందే. భర్తకు విడాకులు… కాని బిడ్డలకు ఉంటాయా…”

ఆయన ముఖంలో నీలి నీడలు. మా ఇద్దరి మధ్య కాసేపు మౌనం.

“మరణం దాకా తోడుంటుందనుకునే బంధాన్నే నిబ్బరంగా వదిలించుకోగలిగిన మీ స్త్రీలు ఈ కొన్నాళ్ల మాతృత్వపు బాధ్యతను జీవితాంతం ఎందుకు వదిలించుకోలేకపోతున్నారు తల్లి” నా వైపు చూస్తున్న ఆయన కళ్లలో ఓ విషాదం.

“అదెలా సాధ్యం?”

“ఏ బంధంలో నయినా నీకు గౌరవం లేనప్పుడు అందులోనుండి బైటకు రావాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. అది నీ ఆత్మగౌరవానికి అవసరం”

“వివాహం అనే బంధం నుండి బైటపడగలం. కాని కని పెంచిన పిల్లల పట్ల భాద్యత ఉంటుంది కదా. ఆ ప్రాణిని ఈ భూమి మీదకు తీసుకువచ్చింది మనమే కదా…” ప్రశ్నించాను.

“అవును మనమే… అందుకని భాద్యత తీసుకోవాలి. కాని ఎంత వరకు? ఈ సృష్టిలో ప్రతి జీవి ఆ భాద్యత తీసుకుంటుంది కాని మనుష్యులు మాత్రమే ఈ మాతృత్వపు విషాదంతో కొట్టుకుపోతారు. ప్రతి బంధంలో ఇరువురి భాద్యతా ఉంది. ఒక్కరు మాత్రమే భాద్యత అంటూ తమను తాము నిత్యం బాధించుకుంటూ ఉండిపోవడం తెలివితక్కువతనం. కడుపున పుట్టిన వాళ్లు లేచి నిలబడి తమ జీవితాన్ని తాము చేతుల్లోకి తీసుకునే దాకా చాలదా ఈ బాధ్యత. ఆ క్రమంలో మిమ్మల్ని వారు గాయపరుస్తుంటే వారి నుండి తప్పుకోండి. అది మీ హక్కు. ప్రకృతిలో ప్రతి జీవి చేసేది అదే. గుర్తుంచుకో తల్లి అల్లుకునే తీగను పందిరి ఎప్పుడూ ఆడిస్తుంది.

అది కాదు…. ఏదో అనబోయి “మీ పేరు” అడగబోయాను.

“అవసరమా… ఓ తండ్రిని అంతే.., బాధించే బంధాలకు విడాకులిచ్చిన ఓ మనిషిని… నాన్నా అని పిలవచ్చు. ఒకరిద్దరికి మాత్రమే కట్టుబడకుండా నా తండ్రి ప్రేమను విస్తారం చేసుకున్న మనిషిని. కాని అది చేతగాక నా భార్య గుండే ఆగి చచ్చిపోయింది. లేదంటే ఈ అందమైన సాయంత్రం నాతో ఇలా ఆకాశాన్ని చూస్తూ నాతో పాటు కూర్చుని ఉండేది.”

“మీ భార్య మరణించిందా?”

“అవును. నీలా మాతృత్వం పేరుతో హింసను భరిస్తూ, బండబారిన సంతానాన్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ, వారి ప్రతి అవసరాన్ని తీరుస్తూ, చులకనయ్యి, అవమానాల పాలయ్యి. ఇదిగో నీలా ఇలాగే మౌనంగా ఏడుస్తూ గుండే ఆగి చనిపోయింది. అది సాధారణ మరణం కాదు ఓ కుటుంబం చేసిన హత్య. సమాజంలో తల్లి ఇలాగే ఉండాలి, అది ఆమె కర్తవ్యం అని బోధించే కుటుంబ నీతుల మధ్య పెరిగి మంచి తల్లిగా బతికి అకాల మృత్యువు పాలయింది. ఆమె హత్యకు కారకులు ఆమె పిల్లలు, ఆమె చనిపోయినప్పుడు కడవడు కన్నీళ్ళు కార్చి, ఆమెకు తలకొరివి పెట్టడానికి, క్రియాకర్మలు చేయడానికి ఎంతో ధనాన్ని వెచ్చించి ఈ లోకంలో గొప్ప పిల్లలనిపించుకున్నారు. దానికి నేనూ అడ్డు చెప్పలేదు. నా భార్య తన పిల్లలకు అలాంటి పేరునే కోరుకుంది కాబట్టి. కాని అనునిత్యం ఆమె పడిన హింస నాకొక్కడికే తెలుసు. కొన్నిసందర్భాలలో ఈ బిడ్డలను ఈ భూమి మీదకు తీసుకువచ్చిన క్రియలో నాకూ భాగం ఉందని, ఆమెను నిరంతర నరకంలో కాల్చడంలో నా చేయి కూడా ఉందని ఆ బిడ్డల్లో నా మగతనాన్ని చూసుకుని గర్వపడినందుకు ఇప్పుడు సిగ్గు పడుతున్నాను.”

“అంటే భాద్యత గల తల్లిగా జీవించడం ఆమె చేసిన తప్పా.”

ఆయన ముఖంలో కొంత విసుగు.. “తల్లిగా మాత్రమే జీవించడానికి కట్టుబడిపోవడం ఖచ్చితంగా తప్పే. చేయవలసింది చేసి తప్పుకోవడం నేర్చుకోగలగాలి. భాద్యతల నడుమ ఏ తల్లి జీవితం ఆగిపోకూడదు.”

“అసలు మీ స్త్రీలు ఎందుకు హింసకు గురవుతారో తెలుసా తల్లీ.. మీకు ఆగిపోవడం రాదు. నేర్చుకోరు. మిమ్మల్ని ఈ సమాజం అది నేర్చుకోనివ్వదు. ఎందుకంటె తమ జీవితాలు సుఖంగా జరిగిపోవడానికి మిమ్మల్ని పావులుగా తయారు చేసుకున్న వ్యక్తులు నిర్మించిన వ్యవ్యస్థ ఇది. భార్యగా ఇలా ఉండాలి, తల్లిగా ఇలాగే ఉండాలి అంటూ రుద్దబడిన నియమాల మధ్య ట్యూన్ అయి మీకు మీరే బందీలుగా మారి జీవిస్తున్నారు.”

“కాని భార్య అనే బంధం నుండి బైటపడి నేను నా కుటుంబంలో ఎదుర్కున్న హింస సంగతేంటీ? ఆ ఒక్క నిర్ణయానికి నేను చెల్లించుకున్న మూల్యం ఎంతో. నన్ను కన్న తల్లే నన్నో వస్తువుగా చూస్తుంటే ఎలా భరించేది?”

“ఏం కన్నతల్లి మాత్రం ఈ లోకంలో మనిషి కాదా. ఆమెలో స్వార్ధం ఉండదా? ఉండకూడదా? తన అనుకూలత ఆమె చూసుకుంటుంది. మనిషులు అలాగే కదా జీవించేది. తల్లి ఇలాగే ఉండాలి అనే నియమాల మధ్య నువ్వే బందీవి అయ్యావు. నీ తల్లి అలాగే ఉండాలని కోరుకున్నావు నీవు అలాగే ఉండి నీ పిల్లల దగ్గర చులకన అవుతున్నావు.”
“అంటె ఏం అంటారు నా భాద్యతలను వదిలించుకొమ్మంటారా?”

“నీ పట్ల నీ కుటుంబం అదే బాధ్యతతో ఉందా?”

కాసేపు ఆలోచించాను. “వాళ్ల పరిధిలో వారి అనుకూలతకు భంగం కాకుండా!”

“మరి నువ్వు అదే పద్దతిలోనే భాద్యతతో ఉండవచ్చు కదా…”
“అది తప్పు కాదా. పరిధి నిర్మించుకుని సేప్ జోన్ లో భాద్యతలను నెరవేర్చుకోవడం స్వార్ధం కాదా?”

“కాదు అది నిన్ను నువ్వు రక్షించుకోవడం. అవతలి వారిని వారి పరిధిలో ఉంచడం అంటే నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం.”

“అంటే నేను నా తల్లి తండ్రులను, బిడ్డలను కూడా ఓ పరిధికి పరిమితం చేయాలా?”

“సరే ఒకటి చెప్పు నీ. పట్ల వారు అంత నిస్వార్ధమైన భాద్యతను చూపుతున్నారా?”

“లేదు…”

“అంటే నువ్వు నీకై నీవు పెట్టుకున్న నియమాల మధ్య భాద్యత పేరుతో వారి అవసరాలు తీరడానికి ఉపయోగపడుతూ అవమానాల పాలవుతూ జీవిస్తున్నావ్ అంతేనా?”

తల ఊపాను మౌనంగా…

“ఆ అవమానాలు నీకు భాధ్యతలను నెరవేరుస్తున్నాను అనే తృప్తిని ఇస్తున్నాయా?”

“లేదు, ప్రతి క్షణం రంపపు కోతను అనుభవిస్తున్నాను.” ఆయన వైపు బేలగా చూసాను కన్నీళ్ళతో…

“మరి ఎందుకు ఈ బాధ్యతలను మోయడం?”

“ఎంత ఒంటరిగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న స్త్రీ నయినా నాకు ఎమోషనల్ డిపెన్డెన్సీ అవసరం కాదా…”

మౌనంగా నా వైపు చూసారాయన. బెంచి ని బలంగా పట్టుకున్నాను ఉబికి వస్తున్న కన్నీళ్ళను ఆపుకునే ప్రయత్నంలో. నా చేయి పై చేయి వేసారు.

“నా తల్లిని చెల్లెలిని సాటి స్త్రీలుగా ఎంచి వారి నుండి ఈ ఎమోషనల్ డిపెన్డెన్సీ నా కవసరం అని ఎంతగా బ్రతిమాలుకున్నానో మీకు తెలియదు అండి. బైటి ప్రపంచంలో దొరికే ప్రేమ కోసం నేను ఎదురు చూడలేదు. నేను ఒంటరి స్త్రీని. ఆ ప్రేమను నాకు అందిస్తామంటూ వచ్చే స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ ఏదో ఒక స్వార్ధం ఉంటుంది. వాళ్ళ చేతుల్లో చిక్కకుండా కుటుంబంలో నా వాళ్లు అనుకున్న వారి నుండి ఆ డిపెన్డెన్సీ కోరుకున్నాను… అభిమానం చంపుకుని నాకు ఆ అవసరం ఉందని కనీసం నా బిడ్డ వద్ద నాకా అవకాశం ఉండేలా సహకరించమని వేడుకున్నాను. కాని…” ఇక కంట్రోల్ చేసుకోలేకపోయాను.

కాసేపు నన్ను ఏడవనిచ్చారాయన. కొంత ఉదృత తగ్గిన తరువాత కళ్ళు తుడుచుకుని మౌనంగా ఉండిపోయాను. “నువ్వు అడిగినదానికి విరుద్దంగా ప్రవర్తించారు మీ వాళ్లు. అంతేగా. జీవితంలో నిటారుగా నిలబడాలనుకునే స్త్రీలలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం ఎలా దెబ్బ తీస్తుందో తెలుసా తల్లి ఈ ఎమోషనల్ డిపెన్డెసీ ఆమెకు దక్కకుండా చేసి అందుకే ఒంటరిగా బ్రతకాలనుకుని కూడా చాలా మంది స్త్రీలు విక్టింగానే ఉండిపోతున్నారు ఈ వ్యవ్యస్థలో.”
“మరి బైట పడిన నేను మరో రకంగా విక్టింగానే మిగిలాను కదా అండి.”

“ఎందుకంటే నీ భర్తతో విడిపడి ఈ వ్యవస్థలో నువ్వు సురక్షితంగా ఉన్నానని భ్రమ పడ్డావు. నీ కుటుంబం పై ఎమోషనల్ గా ఆధారపడగలను అనుకున్నావు. కాని అది జరగలేదు.”

“అవును ఎందుకని నేనేం తప్పు చేసాను?”

ఆయన నా వైపు చూసి నవ్వుతూ “నిన్ను నువ్వు బైటేసుకున్నావు. నీకేం అవసరమో చెప్పి అది నేను అందుకోగలను మీ సహాయంతో అన్నావు. నీ ఆత్మ విశ్వాసాన్ని వారిపై విశ్వాసంగా మార్చుకున్నావు. అంటే నీపై వారికి కంట్రోల్ ఇచ్చేసావు. ఏ స్త్రీ కూడా మరో స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని సహించలేదు. ఆమెను బలహీనపరచడం లోనే వారి విజయం ఉంటుంది. నీకేంకావాలో స్పష్టంగా చెప్పుకున్నాక నిన్నుకంట్రోల్ చేయడం వారికి తేలిక.”

“అంటే…నన్ను కంట్రోల్ చేయడం వారికెలా లాభం అదీ నా సొంత తల్లి.”

“తల్లి కూడా ఒక మామూలు స్త్రీ. నువ్వు ఆమెను దేవతగా ఊహిస్తే అది నీ తప్పు. నువ్వు దేవతలా నీ బిడ్డల కోసం మిగిలిపోతే నువ్వు బతికి ఉన్నంతవరకు నిన్ను పీల్చి పిప్పి చేస్తూనే ఉంటారు. నా భార్య చేసిన తప్పు అదే. మనిషిగా పుట్టి దేవతగా మారి రాయిలా మిగలలేక నలిగిపోయి వెళ్లిపోయింది. నువ్వు చేస్తున్న తప్పు అదే. మీ అమ్మ కొంత వరకే తల్లి పాత్ర పోషించింది. తరువాత ఓ సాధారణ స్త్రీ గా మారిపోయింది. కాని నువ్వు ఆమెను అదే తల్లి పాత్రలో ఊహించుకుని భంగపడుతున్నావు. నువ్వు ఇంకా తల్లి పాత్రలోనే ఉండి మనిషిగా మారకుండా నీ బిడ్డలకు చులకన అయిపోతున్నావు. నిన్ను దాటుకుని వెళ్ళిపోయిన సంతానం దగ్గర ఇంకా తల్లి పాత్రేనా నీది.”

“అది మన బాధ్యత కాదా?”

“బాధ్యత బాధ్యత ఇంకా ఎన్నాళ్లు తల్లి ఈ బాధ్యత. పిల్లి తన బిడ్డల్ని నోట కరుచుకుని కొంత కాలం తిప్పుతుంది. కాని ఎప్పటికీ కాదు. కోతి కడుపును దాని బిడ్డలు పట్టుకుని ఉంటాయి. పట్టు తప్పి క్రింద పడిపోయిన బిడ్డలను కోతి తిరిగి కూడా చూడదు. మళ్ళీ అవే తల్లిని వెతుక్కుని పట్టుకుంటాయి. రక్షణ కావాలనుకుంటే తల్లిని పట్టుకోవాలని అవి నేర్చుకుంటాయి. మనం చేస్తున్నదేమిటీ? ఎవరి అవసరార్ధమో పెట్టుకున్న నియమాలను వంట పట్టించుకుని నీ లాంటి తల్లులు అవకాశవాదులయిన బిడ్డల చేతుల్లో నలిగిపోవడం తప్ప. మాతృత్వం ఓ బాధ్యత. కాని దానికీ ఓ టైం పర్మిట్ ఉండాలి. కష్టపడకుండా దొరికుతున్నదానికి విలువ ఉండదు. నీ తల్లి తండ్రులకు నీ బిడ్డలకు కూడా కష్టపడకుందా దొరికే నీ సాంగత్యం విలువ తెలుసా. అసలు దానికో విలువుండాలని నీకు అనిపించలేదా?

అంటే…

“మనిషి చాలా స్వార్దపరుడు తల్లీ. ఒక వయసు వచ్చాక తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు చాలా మంది తల్లి తండ్రులు. బిడ్డల స్తితి వారికి అనవసరం. కొంత మంది పిల్లలు ఇలాంటి తల్లి తండ్రులను భాద్యత పేరుతో సహిస్తారు. అది అవసరమైన మానవత్వమే. కాదనను. కాని పూర్తిగా తమ ఆత్మాభిమానాన్ని కుదువ పెట్టుకుని వారికి లొంగిపోయి కాదు భాద్యతలను నెరవేర్చవలసింది. వారి పరిధిని వారికి చూపించడం అవసరం. అది అన్యాయం కాదు. నీ లాంటి వారు ముఖ్యంగా ఒంటరి స్త్రీలు బ్రతకడానికి అత్యవసరం. తమ పరిధి దాటి రాకూడదని నిర్ణయించిన బిడ్డల దగ్గర అతి జాగ్రత్తగా ఉంటారు తల్లి తండ్రులు. పచ్చిగా చెప్పాలంటే పరిధి దాటితే తమ పరిస్థితి ఏంటన్న అభద్రతా భావంతో అతి జాగ్రత్తగా మసులుకుంటారు. ఇది నీ తల్లి తండ్రుల విషయంలో నీవు పాటించలేదు. అందుకే నీ ఎమోషన్స్ ని వారు శాసిస్తున్నారు.”

“ఇక నీ బిడ్డను పరిధిలో ఉంచడం తప్పని నువ్వు అనుకుంటున్నావ్. నీవు లేక అతను నష్టపోతే పోనివ్వు. జీవితంలో పూడ్చుకోలేని నష్టాలు ఎక్కువగా ఉండవు. బిడ్డలలో ఎంత స్వార్ధం ఉంటుందో తెలుసా… ఈ ప్రపంచంలో తొంభై శాతం పిల్లలు ఈ తల్లి ప్రేమను తమ స్వార్ధం కోసం ఉపయోగించుకుంటున్న వారే. అది మంచి కయితే కొంత వరకు సహించవచ్చు. కాని అది నీ ఆత్మాభిమానానికి దెబ్బ అయితే అక్కడ నువ్వు ఆగిపోవాలి. ఆ బిడ్డలను ఒంటరిగా సాగిపొమ్మని చెప్పాలి. అది భాద్యతారాహిత్యం ఎంత మాత్రమూ కాదు. అదే నీ మాతృత్వానికి బలం.”

“మరి నాకు తోడు ఎవరు?”

“నీకు నువ్వే. ప్రతి మనిషి తన జీవితంలో అతిగా కోరుకునే విషయం ఒకటుంటుంది. అది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. నీవు కోరుకునేది ఆత్మాభిమానాన్ని. అది దెబ్బ తింటే నువ్వు భరించలేవు. దాన్ని కాపాడుకున్నంత సేపు నీవు బలహీనపడవు. నీ ఆత్మాభిమానాన్ని గౌరవించని వ్యక్తులు నీకు ఎప్పటికీ నిజమైన తోడు కాలేరు. అది నీ తల్లి తండ్రులే కావచ్చు బిడ్డయినా కావచ్చు. నీకు తోడు ఎవరన్నది నేను చెప్పలేను. కాని నీ తల్లి తండ్రులు, బిడ్డలు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. అది నువ్వు అంగీకరించలేకపోతే ఈ దుఖం నిన్నంటుకునే ఉంటుంది.”

“అంటే నన్ను అర్ధం చేసుకునే వారెవ్వరూ ఉండరా?”

“నీ స్థితికి కారణం ఏంటో తెలుసా తల్లి. నువ్వు నీ తల్లి తండ్రులకు, బిడ్డకు కూడా పూర్తిగా అర్ధం అవడం. అయితే నీలోని ఈ భాద్యత అనే బలహీనమైన పార్శ్వాన్నే వాళ్ళు పూర్తిగా అర్ధం చెసుకున్నారు. అందుకే నిన్ను గాయాల పాలు చేయగలుగుతున్నారు.”

“ఈ స్థితి నుండి నేను బయటపడే మార్గం?”

“బంధాల మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తి జీవితంలో రెండే మార్గాలు. ఆ బంధాలకు లొంగిపోవడం, లేదా వాటి నుండి బైటపడడం. లొంగిపోవడం నీ తత్వం కాదు. నువ్వు వివాహ బంధానికే లొంగలేదు. అందులో ఉండి అందరి స్త్రీల పద్దతిలో లాభం వెతుక్కోకుండా నిజాయితీగా నచ్చని బంధంలో నుండి బైటపడ్డావు. కాని నీ తల్లి తండ్రులు, బిడ్డల దగ్గర మాత్రం లొంగి ఉండాలని, అది నీ భాద్యత అని భ్రమ పడుతున్నావు. అందుకోసం వారు నీకు విలువ ఇవ్వరని తెలిసి కూడా ఎదో తాపత్రయపడి, వారి చేతిలో చులకన అయిపోతూ నలిగిపోతున్నావు. వదిలేయ్ తల్లి. నీ తల్లి తండ్రులకు, నీ బిడ్డకు వారి అవసరాలకు ఓ పరిధి పెట్టుకో. నీ కో స్పేస్ సృష్టించుకో. అందులో జీవించడం నేర్చుకో.”

“ఇందాక అన్నావే ఎమోషనల్ డిపెన్డెన్సీ అని. అది మానుప్లేట్ చేసే వారి చేతికి నువ్విచ్చే అయుధం. అందుకే సామర్ధ్యం ఉండీ వారి దగ్గర బలహీనపడి పోతున్నావు. ఆ ఆయుధాన్ని వెనక్కు తీసుకో. నిన్ను నువ్వు కాపాడుకో. భాద్యత పేరుతో వారి భాద్యతా రాహిత్యాన్ని సహించవలసిన అవసరం లేదని అర్ధం చేసుకో. నీ జీవితానికో దారి తప్పకుండా దొరుకుతుంది. నా భార్య చెసిన తప్పు నువ్వూ చేయకు.”

“జీవితానికి అర్ధం ఏంటి అండి? పెళ్ళి వ్యాపారం, కుటుంబం మరో వ్యాపారం, ఈ ప్రపంచం ఓ పెద్ద వ్యాపారం”

“ఇన్ని వ్యాపారాల మధ్య నిన్ను నువ్వు గౌరవించుకోగలగడమే నీ జీవితానికి అర్ధం వెతుక్కోవడం. నీకు నువ్వు ముఖ్యం అవ్వాలి. ఇతరులకు చేయవలసింది చేయి కాని వారికి లొంగిపోయి కాదు. నీ బిడ్డలకు మాతృత్వం పేరుతో, తల్లి తండ్రులకు భాద్యత పేరుతో లొంగకూడదు అనుకుంటూనే లొంగిపోతూ ని వల్ల తీరే వారి అవసరాలను వాళ్లు తమ విజయంగా భావిస్తూ నిన్ను అవసరం తీరాక ఏరి పారేసే అవకాశం వారికి నువ్వే ఇచ్చావు. దానికి నీ కుటుంబ వాతావరణం, ఒంటరి స్త్రీగా నీ పరిస్థితులు ఊతం అయ్యాయంతే”

“తలి తండ్రులు, బిడ్డల వద్ద కూడా ఒకే రకంగా నలిగిపోయిన నా లాంటి వాళ్ళుంటారంటారా?”

“ఈ యుగానికి మీరే ఆఖరి విక్టిం లు తల్లి. మీ తరంలో కొందరు కట్టుబాట్లతో జీవించి తల్లి తండ్రులకు లొంగి జీవించడమే భాద్యత అనుకున్నారు. నా పిల్లలదీ నీ తరమే. వారు నీలా లేరే. తెలివితో తమ అవసరాలకు మమ్మల్ని ఉపయోగించుకున్నారు. నీ బిడ్డ నవతరానికి ప్రతినిధి. వారికి ఏం కావాలో దాన్ని సాదించుకోవడం బాగా తెలుసు. వారికి తల్లి తండ్రుల సుఖ దుఖాలతో పని లేదు. విలువల పేరుతో రెండు రకాలుగా నలిగిపోయిన తరానికి నువ్వు చెందడం నీ దురదృష్టం.”

“మానవ సంబంధాలు ఇలానే ఉంటాయా… వీటి కోసం ఎంత తాపత్రయం, ఎంత తపన పడతాం… ఇదంతా అవసరమా…” నా స్వరంలో కోపం వినిపించిందో ఏమో మరి. ఆయన కంఠం ఇంకా మృదువుగా మారింది…

“ఈ ప్రశ్న నన్ను నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. నా భార్య మాత్రుత్వం పేరుతో అంతులేని మానసిక సంఘర్షణను అనుభవించి మరణించింది. ఆమె పోయాక ఆమె పిల్లలు ఆమెను నాతో పోల్చి చూసుకుని మా అమ్మ గొప్పది అంటున్నారు. ఆమె బతికి ఉన్నంతవరకు ఆమె వారి కోసం ఎంతలా తపించి పోయందో, వారి స్వార్ధాన్ని క్షమించడానికి ఎంత గుంజాటన పడిందో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఓ పరిధి పెట్టుకున్నాను. అది దాటి వారిని రానివ్వను. నాకూ శరీరంలో ఓపిక నశిస్తుంది. వారు అప్పుడన్నా నేను నిస్సహాయంగా వారిని చేరతానేమో అని ఒకింత కుతూహలంతో నన్ను గమనిస్తూ ఉన్నారు. ఎవరికీ లొంగని నేనంటే వారికి కోపం. అది నాకు తెలుసు. ఏ పరిధిలోనూ బంధించబడని నా భార్య ప్రేమకు వాళ్లిచ్చిన గౌరవం ఏం ఉంది? ఇప్పుడు నా పై కోపంతో వారు చేయగలిగింది ఏంటని? నేను చనిపోయాక నన్ను తలచుకోరేమో. కాని నాకు ఓపిక ఉన్నంత వరకూ ఇలా ప్రతి రోజు నా పద్దతిలో నేను జీవించగలగడం మాత్రం వాళ్లు ఆపలేరు. నా భార్య అది చేయలేకపోయిందనే నా బాధ. మాతృత్వం ఆమెకు శాపం అయింది.”

ఆకాశంలో వెలుగు తగ్గుతుంది. చిక్కబడుతున్న చీకటి మధ్యన ఆయన లేవబోతూ.. “నీ నుంచి ఓ ప్రశ్నను ఊహించాను. కాని అడగలేదు” అన్నారు. అర్ధం కాక ఆయన వైపు చూసాను…

“నేను పురుషుడిని, తండ్రిని నువ్వు స్త్రీ వి తల్లివి. పిల్లలను ప్రేమించడంలోనూ, బాధ్యతలను నిర్వహించడంలోను మనవి రెండు విభిన్న మార్గాలు కావచ్చేమో. ఈ ప్రశ్న నువ్వు వేస్తావనుకున్నాను. దానికి నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే నేను పురుషుడినే, స్త్రీగా తల్లిగా ఆలోచించలేను.”

నా ముఖంలో బాధతో కూడిన ఓ నవ్వు మెరిసింది. “నేనా ప్రశ్న వేయలేనండి. నేను స్త్రీని అని నేనే మర్చిపోయాను. నా కుటుంబంతో సహా, చివరకు నా తల్లికి కూడా అది గుర్తు లేదు,” అన్నాను నిర్వేదంగా…

ఆయన నా తల నిమురుతూ “శుభం. అదే నీ అదృష్టం కావచ్చు. మాతృత్వం అనే బందీఖానా నుండి విముక్తి కోసం నువ్వు వేసుకోవలసిన దారికి పునాది ఎప్పుడో పడిపోయింది. సంతోషంగా ఉండు తల్లి” అన్నాడు లేచి వెళుతూ…

తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వృద్దున్ని మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఇంతకీ నేను ఇంటికే వెళతానని ఆ నీళ్ళలో దూకనని ఆయనకి అంత నమ్మకమా… వెనక్కు తిరిగి చూడకుండా, నన్ను ముందుగా అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళమని బలవంత పెట్టకుండా తానే వెళ్లిపోతున్నాడు వడి వడిగా. నాలో ఆయనకీ ఓ స్ట్రాంగ్ వుమన్ కనిపించిందా… ఏమో మరి…

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

One thought on “స్ట్రాంగ్ ఉమన్

  1. బేలతనం భావాలు ముప్పిరిగొంటుండగా, సూసైడ్ ఆలోచనలు పదే పదే చేసే వ్యక్తి – స్త్రీ అయినా, పురుషుడయినా – “స్ట్రాంగ్” ఎలా కాగలరు?

    ఈ లోకంలో ప్రతివారికీ సుఖదుఃఖాలు తటస్థించడం అతి సహజం. జలుబు, దగ్గు రోజులు, వారాలుగా తగ్గలేదు – అని చెప్పని మనిషి ఉంటారా? సుఖదుఃఖాలు కూడా అంతే. తేడా ఏమిటంటే మనకి మనం అనుభవించిన సుఖము, ప్రేమలు కన్నా మనకి కలిగిన దుఃఖాలు, బాధలు చాలా కఠినంగా తోస్తాయి, అందుకే వాటిని మర్చిపోలేం.

    మనం ఎవరి చేష్టల వల్ల బాధపడుతున్నామో ఒక్కసారి వారి కోణం నుండి కూడా సంఘటనలను, పరిస్థితులను విశ్లేషించి చూడాలి. అప్పుడు కూడా మనం నీర్దోషులమని అనిపిస్తే వారితో ఇకపై ఎలా ఉండాలో మనం నిర్ణయించు కోవచ్చు.

    ఒంటరిగా జీవించడం తప్పు కాదు, జంటలుగా ఉన్న వారు సైతం ఎప్పుడో ఒకప్పటికి ఒంటరిగా జీవించక తప్పదు కదా. కాకపోతే కోరి ఒంటరితనాన్ని ఎంచుకుని జీవించే వారు తగిన మనో స్థైర్యాన్ని కలిగి ఉండాలి, లేదా పెంపొందించుకోవాలి.

    బంధాలలోను స్వార్థం దాగుని ఉంటుంది. ఈ “సత్యం” మరుగున ఉన్నంతకాలం బంధం పటిష్టంగా ఉంటుంది.

    సత్యం – చాలా ప్రకాశవంతమైనది. నేరుగా చూడకూడదు. మబ్బులు కమ్మిన సూర్యుణ్ణి మాత్రమే చూడగలం. నేరుగా కాదు.

Leave a Reply