అన్ని పోరాటాలకూ సిద్ధమై సాహిత్యం సృష్టించడం ముస్లింవాదుల ప్రత్యేకత : స్కైబాబ

తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం ప్రత్యేకమైనది. మతపరమైన సాకులతో ఫాసిస్టు ప్రభుత్వాలు అవకాశవాద రాజకీయాలు నెరపడం కొత్త విషయం కాదు. అందుకే ఇప్పటికీ ముస్లిం సమాజం CAA, NRC లాంటి కుటిల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తోంది. మర్కజ్ తబ్లీగీకి వెళ్ళిన ముస్లింల వల్లే కరోనా వ్యాప్తి పెరిగిందన్న అపవాదుల్నీ, అవమానాల్నీ భరించాల్సి వస్తోంది. ఇలా ముస్లిం సమాజాన్ని గుండెకోత పెట్టిన ప్రతి సంక్లిష్ట సందర్భంలోనూ స్కైబాబ లాంటి ముస్లింవాద కవులూ రచయితలూ తమ కర్తవ్యాన్ని, బాధ్యతని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ముస్లింవాద సాహిత్య గమనాన్ని, లక్ష్యాల్ని గురించి శ్రీరాం పుప్పాల, ప్రముఖ ముస్లింవాద కవీ, కథా రచయిత, బహుజన సాహిత్య ఉద్యమకారుడూ స్కైబాబతో చేసిన ఇంటర్వ్యూ.

***

శ్రీరాం: ముస్లింవాద సాహిత్యం పట్ల వస్తున్న భిన్న అభిప్రాయాల్ని మీరెలా క్రోడీకరిస్తారు? అది ఇంకా సమ్మతీ అసమ్మతుల మధ్య ఊగిసలాడుతోందా?

స్కై: తెలుగు సాహిత్యంలోని అస్తిత్వ వాదాల్లో ముస్లిం వాదం భిన్నమైంది. అనేక కోణాలున్నది. అంతర్ బాహిర పోరాటం చేస్తున్నది. ముస్లింవాద సంకలనాలు వేస్తున్న సందర్భాల్లో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటూనే ఆ పని చేయడం జరిగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తిగతం. వాదానికి వస్తే అన్ని పార్శ్వాలను ఏకంగా చూడడం, అంగీకరించడమే ప్రధానం. అలా ఏ మేరకు అంగీకరించలేని వారు ఆ మేరకు సంకుచితత్వాన్ని మోస్తున్నట్లే!

జాతీయంగా, అంతర్జాతీయంగా ముస్లింలు నేడున్న పరిస్థితుల్లో బాహిర్ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. బహు కొద్దిమంది అంతర్ పోరాటం తర్వాత చేద్దామంటారు. అది సాధ్యం కాదు. అంతర్ పోరాటం వద్దనడం కేవలం పురుషస్వామ్య, మతవాద వాదనే తప్ప అది సాహిత్య లక్షణం కాదు. ఇలాంటి వాదన చేసేవారు అన్ని రకాల రచనలు రాడానికి అడ్డం పడడం, లేదా మౌనం వహించడం ముస్లింలకు, ముస్లింవాదానికేమీ మేలు చేయదు!

ఇక ముస్లింవాదంలో ఊగిసలాటలేమీ లేవు. వాదం ఎప్పుడో స్థిరపడిపోయింది. అసమ్మతులు వారి వారి ఆలోచనా స్థాయిని, పరిధినిబట్టి బయటపడుతుంటాయి. నలుగురైదుగురితో మొదలైన ఈ సాహిత్యం ఇవాళ దాదాపు వందమందిని పొదువుకుందంటేనే దాని శక్తిని అంచనా వేయవచ్చు.

శ్రీరాం: జల్ జలా, ముఖామీ, వతన్ లాంటి పుస్తకాలను ప్రచురించిన అనుభవంతో, మత సంస్కృతినెదిరించగల ముస్లింవాద సాహిత్య భవిష్యత్తునెలా ఊహిస్తున్నారు?

స్కై: ఇండియాలో ముస్లిం సంస్కృతి (ఇస్లామిక్ సంస్కృతి అనడం లేదు) ప్రత్యామ్నాయ సంస్కృతుల్లో ఒకటి. దాదాపు 90 శాతం ముస్లింలు ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచే ఇస్లాం స్వీకరించిన సంగతి మర్చిపోకూడదు. ఇక్కడి వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటు గానో, ఆత్మగౌరవం కోసమో, సమాన గౌరవమూ అవకాశాల కోసమో (కొన్ని చోట్ల బలవంతంగానో) వాళ్ళు ఇస్లాం స్వీకరించారు.

ఆ ఎరుకలోంచి చూసినప్పుడు ఇక్కడ సోకాల్డ్ ‘హిందూ’/ బ్రాహ్మణీయ/ మనువాద సంస్కృతిని మెయిన్ స్ట్రీమ్ గా చూస్తున్నంత కాలం మిగతా బహుజన సంస్కృతులతో పాటు ముస్లిం సంస్కృతి ప్రత్యామ్నాయ సంస్కృతే!

కాకపోతే ముస్లింల జీవన విధానంలో మత ఆచరణలోని ఛాందసాల్ని వదిలించుకుని సంస్కరణల పోరు చేయడం ఇండియాలో (కష్టమైన పని అయినప్పటికీ) సాధ్యమయ్యే వీలున్న అంశం. ఈ విషయంలో ముస్లింవాద రచయితల్లో వ్యక్తిగత అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. అన్ని పోరాటాలకూ సిద్ధమై సాహిత్యం సృష్టించడం ముస్లింవాదుల ప్రత్యేకత. సంస్కరించుకుంటూనే పురోగమించాలి.

ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి అందరివాళ్ళం అనిపించుకుందాం అనుకునేవారి వల్ల ముస్లింలకు మేలు కన్నా కీడే ఎక్కువ. అన్నీ తెలిసీ మౌనంగా ఉండేవారు మరింత ప్రమాదకారులు! ఇక శుద్ధ కవిత్వం అంటూ భజనలు చేయించుకునేవారి వల్ల ముస్లిం కమ్యూనిటీకి గానీ, సాహిత్య ఉద్యమాలకు గానీ ఒరిగేదేమీ లేదు.

మత సంస్కృతినెదిరించడం అనే కన్నా సంస్కరణ అనడం సరైంది. ఎదిరించే స్థాయి, సాహిత్యం భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం. అంతవరకూ ఈ సాహిత్య ప్రభావం అంత త్వరగా ఒడిసేది కాదు. నలువైపులా ప్రసరిస్తూనే ఉంటుంది.

శ్రీరాం: స్కైబాబ కవీ రచయిత గా ఉండటానికి ఇష్టపడతాడా? బహుజన మైనారిటీ ఉద్యమకారుడిగానా? ఏది? ఎందువల్ల?

స్కై: సృజనాత్మకత ఎంత విలువైందో అందరికీ తెలియంది కాదు. నాలోని సృజనకారుడిని కాపాడుకోవడమే నా ప్రథమ కర్తవ్యం. కవిగా, రచయితగా ఉండడమే అత్యంత ఇష్టం నాకు! పైగా ముస్లిం కమ్యూనిటీలో పుట్టి పెరిగి, లోనా, బయటా కమ్యూనిటీ పెను గాయాలకు గురవుతుంటే ఆ పెయిన్ ని మోస్తున్న ముస్లింగా ఆ అనుభవాలనన్నింటినీ రచనలుగా మలవడం ఎంతో విలువైన కార్యం.

అయితే ముస్లింవాదులను కదిలిస్తూనే మిగతా బహుజనులను కలుపుకుంటూ బహుజన వాదంలో భాగమై ఉమ్మడిగా నడవడం ఎంతో అవసరం. ఈ దశలో ఆ పని చేయడం కష్టమైనా తప్పనిసరి. అంతే కానీ ఉద్యమకారుడన్న పేరు అదనపు బరువే నాకు.

శ్రీరాం: ఈ తరం సాహిత్యకారుల్లో (ముస్లిం సృజనకారుల్ని గురించి మరికాస్త ఎక్కువగా) మీరు గమనిస్తున్న అతిముఖ్యమైన ప్లస్ & మైనస్ పాయింట్ల గురించి చెప్పండి.

స్కై: నిర్దిష్ట అస్తిత్వ వాద సాహిత్య సృజన, పెద్ద ప్లస్ పాయింట్! అయితే కొందరు ఈ ముస్లింవాద ముద్రను మోయడానికి సంశయించడం వెనుకబాటుతనం. అందరివాళ్ళు అనిపించుకోవడమంత చాదస్తం, జాఢ్యం మరొకటి ఉండదు. అది బ్రాహ్మణిజం కూడా! ఇప్పుడిప్పుడే కొందరు ముస్లింవాదులమని ప్రకటిస్తుండడం ఆహ్వానించదగిన పరిణామం!

సాహిత్యకారులంటే సంఘటనాత్మకంగా కాదు, సమాజం పట్టించుకోని ప్రతి చిన్న ఖాళీని, మూలను, చీకటి కోణాన్నీ పట్టివ్వాలి కదా! అలా ఏ రచయిత పట్టి ఇచ్చినా దానిని అంగీకరించాలి. విలువనివ్వాలి. ముస్లిం సాహిత్యకారుల్లో (ఆ మాట కొస్తే మిగతా అస్తిత్వ వాదుల్లోనూ) మగవాళ్ళు చాలామంది స్త్రీవాదులు కారు. స్త్రీల పెయిన్ ని ఫీల్ కారు. స్త్రీల రచనల పట్ల మౌనం వహిస్తారు. అలాగే ఆధిపత్య, మెజారిటీ, మత భావజాలాల్ని మోస్తున్నారు. పర్సెంటేజీల్లో తేడాలున్నాయంతే. ఆ సంకెళ్లనన్నింటినీ తెంపుకోవలసిన అవసరముంది.

అలాగే మంచి సాహిత్యాన్ని చదవడంలో కొత్తవాళ్ళు వెనుకబడుతున్నారు. సోషల్ మీడియా బలం, బలహీనత అయ్యాయి. బలాన్ని ఉపయోగించుకుంటూ, తాత్కాలిక కీర్తి బలహీనతను వదులుకోవాలి. ఎడిటింగ్ లేదు, మాగడం లేదు, మిత్రులతో చర్చ లేదు, ఏది రాస్తే అదే అంతిమం అనుకుంటున్న బుద్బుధులు ఎక్కువయ్యారు. వీరిని మోసేవాళ్ళు కూడా! భజనలు.. తద్వారా అవార్డులు! ఇక సీరియస్ సాహిత్యం ఎలా పుడుతుంది! ఎలా మనగలుగుతుంది! ఇదే ప్రధానమైన మైనస్ పాయింటు.

శ్రీరాం: ఉద్యమాల నిర్మాణంలో వాటి సమస్యల్ని, చైతన్యాల్ని ప్రతిఫలించగల సాహిత్య లక్షణాల్ని గురించి మాట్లాడండి. ముస్లిం వాదాన్ని అవి ఎలా ప్రభావితం చేశాయో కూడా చెప్పండి.

స్కై: తెలుగు సాహిత్యానికి అంటరాని జీవితాలను, సమస్యలను, చైతన్యాలను, భాషను, సంస్కృతులను అస్తిత్వ వాదాలు అందించాయి. అందుకు ఉదాహరణలు కొల్లలు. వస్తువు లేని వారు శిల్ప చర్చ ఎక్కువగా చేయడం చూస్తుంటాం. ముస్లింవాదంలో వస్తువూ శిల్పం కలగలిసి కళాత్మకంగా కవిత్వాన్ని, కథనూ పలికించడం చూస్తాం. ముస్లిం జీవితాల్లోని మార్దవం, సొగసు, అబ్బుర పరిచే ఇమేజరీ, ఉర్దూ మిళిత భాష తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం చూస్తాం. అన్నినాళ్ళు సాహిత్యానికి పరిచయం లేని జీవితాలను, వస్తువునూ పరిచయం చేయడం చూస్తాం. రచనల, పుస్తకాల టైటిల్స్ ఉర్దూలో పెట్టడం ఒక కొత్త ట్రెండ్ గా మొదలై సినిమాలకు కూడా పాకింది. కొన్ని వేల ఉర్దూ, దఖనీ పదాలు తెలుగులో భాగమయ్యాయి.

పాయసం స్థానంలో సేమ్యా, (ఉగాది) పచ్చడి స్థానంలో బెల్లం షర్బత్, ‘అసుంట అసుంటకు’ బదులుగా ‘అలాయి బలాయిలు’, చితి స్థానంలో మజార్ ఇట్లా ఇమేజరీ మారిపోవడం మామూలు విషయం కాదు.
సంబోధనలు, పిలుపులూ, అజాతో తెల్లారడాలు, పర్దాలు, బుర్ఖాలు, గుల్పోషీలు, వలీమాలు, నికాలు, తల్లాఖ్ లు, కిరాయి ఇండ్ల ఇబ్బందులు, పాన్ మరకలు, సన్నాయిలు, జగ్నే కీ రాత్ లు, … ఇట్లా ఎన్నో వస్తువులతో, ఎన్నెన్నో ప్రతీకలతో, కొత్త వాతావరణంతో; ఖిబ్లా వైపు మోకరిల్లి దువా చేస్తూ.. లాంటి ముగింపులతో, ఆమె మనసు అలావా గుండం లాగుంది -లాంటి ముగింపులతో తెలుగు సాహిత్యం నివ్వెరపోయే, అబ్బురపడే ఊరేగింపు తీసింది ముస్లింవాదం!

రామారావులు, సుబ్బారావులను దళితవాదంలోని ఎల్లయ్యలు, నర్సయ్యలు వెనక్కి నెడితే ముస్లిం వాదం కరీమ్, సలీమ్, షాహీన్, వహీదాలను వేదికల నెక్కించింది. మొత్తంగా ముస్లిమీయతను సాహిత్యంలో భాగం చేయడం ద్వారా ఉద్యమ నిర్మాణం బలపడింది. ముస్లిం వాదాన్ని దళిత స్త్రీ వాదాలు ప్రభావితం చేశాయి. అదనంగా ముస్లిం వాదం అనేక కోణాలతో, అంతర్ పోరాట దృష్టితో దళిత, స్త్రీవాదాలను ప్రభావితం చేసింది.

జల్ జలా, జీహాద్, అజా, ముల్కి, వతన్, అలావా, రజ్మియా, ముఖామి, పుట్టుమచ్చ, ఫత్వా, నఖాబ్, జగ్ నే కీ రాత్ ముస్లింవాద అస్తిత్వ ఉద్యమంలో ముస్లింల సమస్యల్ని, చైతన్యాల్ని దాదాపు అన్ని కోణాల నుంచి ప్రతిఫలించాయి. మిగతా పుస్తకాల్లోని కొన్ని రచనలు కూడా ఈ పని చేశాయి. ఆ సాహిత్య లక్షణాలన్నీ ఒక థీసిస్ కు తక్కువ గాదు. అది ఎన్నో ప్రత్యేకతలతోనూ కూడుకున్నది. ఆ పని అకడమిక్, విమర్శ దృష్టికోణంలో జరగాల్సి ఉంది. ప్రత్యేక సాహిత్య లక్షణాల దృష్ట్యా చూస్తే ముస్లిం వాదంలో మిగతా వాదాల కంటే ఎక్కువ కోణాలను చూడొచ్చు.

***

తన విలువైన సమయాన్ని వెచ్చించి ఇంటర్వ్యూకి సమాధానాలిచ్చిన స్కైబాబ గారికి ధన్యవాదాలు. అతిత్వరలోనే ఆయన తన కొత్త పుస్తకం తీసుకొస్తారని ఆశిద్దాం. మరో ‘ములాఖాత్’ కోసం కొలిమిలో ఎదురుచూడండి.

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

7 thoughts on “అన్ని పోరాటాలకూ సిద్ధమై సాహిత్యం సృష్టించడం ముస్లింవాదుల ప్రత్యేకత : స్కైబాబ

  1. తాను నమ్మిన విషయంలో క్లియర్ గా ఉండడం స్కై లో ఉన్న మంచి లక్షణం. అయితే ఒక రచయిత ఇతరులను కలుపుకుపోవడం అనే పాజిటీవ్ అంశాన్ని నెగెటివ్ గా ఎందుకు చూస్తున్నాడో తెలియదు. ఆ మధ్య తనే హిందువులని ముస్లీంలు కలుపుకుపోవాలి అని పోస్టు పెట్టినట్టు గుర్తు. ఈ విషయంలో స్కై తనలో పోగొట్టుకోవాలి.

    1. మహమూద్! నీ రెండో మాట కన్ ఫ్యూజింగ్ గా ఉంది.
      అందరినీ కలుపుకుపోవడం ద్వారానే సంకలనాలు వేయడం సాధ్యమైంది కదా! నీ నుంచి ఈ క్లారిటీ లేని మాట ఆశ్చర్యం కలిగించింది.
      వాదానికి మూలమైన జాతికి నష్టం కలిగించే అంశాలను మాట్లాడగలిగినవారు కూడా మాట్లాడకపోతే మరింత నష్టం చేసినవాళ్ళమవుతాం. జాతిలో సగానికి జరుగుతున్న అన్యాయం గురించీ, ఛాందసత్వం గురించీ మనమే మాట్లాడగలం. మాట్లాడకుంటే మన జాతిని ఎవరూ బాగుచేయలేరు!

  2. ఇటీవల అవకాశ రాజకీయాలతో,కరోనా నిందలతో ముస్లీం సమాజం ఎంతటి మానసిక క్షోభకు గురయ్యిందో మనకు తెలియంది కాదు.ఈ నేపధ్యంలో ఒక ముస్లీంవాద కవి,రచయిత అయిన స్కైబాబ గారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం బావుంది. ప్రశ్నలను బట్టే సమాధానాలు ఉంటాయి.విలువైన ప్రశ్నలతో మీరు ఇంటర్వ్యూను నడిపిన తీరు అభినందనీయం శ్రీరాంగారు.

  3. సూటిగా ప్రశ్నించారు శ్రీరామ్…..స్కైబాబా అంతరంగాన్ని వీలైనంతమేర ఆవిష్కరించారు
    నలుగురైదుగురితో మొదలైన ఈ సాహిత్యం ఇవాళ దాదాపు వందమందిని పొదువుకుందంటేనే దాని శక్తిని అంచనా వేయవచ్చు….. మత సంస్కృతినెదిరించడం అనే కన్నా సంస్కరణ అనడం సరైంది. ఎదిరించే స్థాయి, సాహిత్యం భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం. అంతవరకూ ఈ సాహిత్య ప్రభావం అంత త్వరగా ఒడిసేది కాదు. అన్న మాటలు నచ్చాయి…
    కొత్త వారి గురించి అందరూ చెప్పిందే చెప్పారు….
    మంచి సాహిత్యాన్ని చదవడంలో కొత్తవాళ్ళు వెనుకబడుతున్నారు. సోషల్ మీడియా బలం, బలహీనత అయ్యాయి. బలాన్ని ఉపయోగించుకుంటూ, తాత్కాలిక కీర్తి బలహీనతను వదులుకోవాలి. ఎడిటింగ్ లేదు, మాగడం లేదు, మిత్రులతో చర్చ లేదు, ఏది రాస్తే అదే అంతిమం అనుకుంటున్న బుద్బుధులు ..
    ఏది ఏమైనా మంచి ఇంటర్వ్యూ

  4. నెటి సామాజిక పరిస్తితులను ప్రతిబింబించే అంశాలను చర్చకు తీసుకున్నారు శ్రీరామ్ సర్…. ముస్లిం సమాజం పై వచ్చే నిందారోపణలతో ముస్లిం వాద ముద్రను మోయడానికి సాహితీ వేత్తలు సంశయించడం
    సాహిత్యకారులంటే సంఘటనాత్మకంగా కాదు, సమాజం పట్టించుకోని ప్రతి చిన్న ఖాళీని, మూలను, చీకటి కోణాన్నీ పట్టివ్వాలి అంటూ అలా ఏ రచయిత పట్టి ఇచ్చినా దానిని అంగీకరించాలి అంటూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా……స్కై బాబా గారు కూడా చక్కని సమాధానంతో వివరించారు

    చాలబావుంది సర్ ఇంటర్వ్యూ….

  5. శ్రీరామ్, తక్కువ ప్రశ్నలతోనే చాలా కీలకమైన సమాధానాలూ, అభిప్రాయాలూ రాబట్టావు. స్కై కూడా నిర్మొహమాటంగా మాట్లాడాడు. ఈ ముఖాముఖి లతో నీకేదో వ్యూహం వుందనిపిస్తోంది. తర్వాత ఇంటర్వ్యూలలో గానీ అది అర్థం గాదు. తర్వాత యెవరిని అడుగుతావో యెదురు చూస్తా… అభినందనలు

  6. తక్కువ మాటల్లో ఎక్కువ సమాధానం… ఇది ఇద్దరి సృజనాత్మకతను ఆవిష్కరిస్తుంది.ఇరువురికి అభినందనలు 💐💐

Leave a Reply