సృష్టిక‌ర్త‌లు

ఇంకా సూర్యోదయమన్నా కాలేదు. ఆకాశం కడిగిన పళ్ళెం తీరుగున్న‌ది. తూరుపు దిక్కు ఒకటీ అరా మేఘపు ముక్కలు ముఖం మాడ్చుకొని వేళ్లాడుతున్నాయి. ఉదయించని సూర్యకాంతి ఆకాశానికి ఎర్రమట్టి పూసినట్టుగున్నది. చెట్ల ఆకులు రాత్రి కురిసిన వర్షానికి పచ్చగా నిగనిగలాడుతూ లోకంలో ఇంకా ఏ అన్యాయం చూడని పసిపిల్లల మొఖాల్లా వెలిగిపోతున్నాయి. గాలి ఉండీ ఉండీ వీస్తోంది. ఆ గాలికి గుట్టబోరు కింది భాగంలోని టేకు లేతాకులు “బొంయ్యి” మని శబ్దం చేస్తూ కదులుతున్నాయి. కొండరాళ్ళ మీదినుండి జలజల రాత్రి కురిసిన వర్షపు నీళ్ళు ఇంకా జారుతూనే ఉన్నాయి. వాగు ఎర్ర నీళ్ళతో నిండి అదేదో సందడిగా, అలజడిగా, అనేకమంది కలిసి తర్జన భర్జన పడుతూ సాగుతున్నట్టుగా పారుతోంది. చెట్లకొసల మీద అప్పుడే స్వేచ్ఛ పొందినట్టు, ప్రపంచంలోని సంతోషమంతా తమదేనన్నట్లు పక్షులు పల్టీలు కొడుతున్నాయి. అడివి అంచుకు పచ్చగా నవనవ లాడున్న గడ్డిని విడిచి కొన్ని పశువులు ఒకటి నొకటి గెదుముకుంటూ చెంగులిస్తూ ఆడుకొంటున్నాయి. ముసలి ఎడ్లు సయితం లెంకలేసి పుట్టలు చిమ్ముతూ ఎర్రమట్టి కొమ్ములకు, ముఖాలకు పూసుకొని వీరోత్సాహం తో ఉన్నాయి. అన్ని కాలాలు తెలిసిన వాటిలాగా, సంతోషం, విషాదం లేనట్టుగా, తమకీ సందడి పట్టనట్టు బర్లు వాగులో అక్కడక్కడ తేలిన తుంగ గడ్డలను బరుకు బరుకున పీక్కుతింటున్నాయి. వాగొడ్డు ఎర్ర సెలుకల నుండి అక్కడక్కడ పురుగులు లేసి తిరుగుతున్నాయి. ఆరుద్ర పురుగులు నేలమీద పగడాల్లా పాకుతున్నాయి.

అదిగో అలాంటి వాతావరణంలో తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించాడు. సూర్యునితోపాటు కిరణాల్లాగా భుజాలమీద నాగళ్లెత్తుకొని, కొడవళ్లు, గొడ్డండ్లు, తట్టలు బట్టుకొని నేల ఈనినట్టుగా జనం ఎర్ర సెలుక వేపు వచ్చారు.

నాగండ్ల వాళ్లు నాగండ్లు సెలుకలో దించి తాళ్లు సరిచేస్తున్నారు. పెయిమీద అంగీలు లేనివాళ్లు కొందరు నోట్లో మొక్కిసుట్టలు ఆవలపారేసి పాత గుడ్డ పేగులు తలలకు చుట్టి పగ్గాలు విప్పుకొని అడవి అంచు ఎడ్లను పేరు పేరున పిలుస్తూ ఎడ్ల ముక్కుదాళ్ళకు పగ్గాలు కట్టి నాగండ్ల దగ్గరికి తీసుకొచ్చారు. కానికి మొక్కి కొందరు ఎడ్ల మెడల మీద కాని ఆనించారు. నాగండ్లు నిలబడ్డయ్.

ఎర్రతేలులాంటి ఎల్లయ్య ఎక్కన్నో నాలుగు టేకు పెండెలు విరుసుకచ్చాడు. ఎల్లయ్య భార్య ఒళ్ళె నుంచి నాలుగు ఎర్రజెండలు తీసింది. ఎల్లయ్య కొయ్యలకు జెండాలు తగిలించి నాలుగువేపుల నాలుగు పాతివచ్చాడు.

బుర్రమీసాల బుచ్చిలింగం అందరిని ఓసారి తేరిపారచూసిండు. అతని మనుసులో వాగులోని ప్రవాహంలాగా మాటలకందని సంతోషం పోటెత్తుతోంది. కుర్పెకట్టె చేతబట్టి కోండ్రలు గీసిండు.

ముందటి నాగలి కదిలింది. కర్రు కస్సున భూమిలోనికి దిగింది. ఎడ్లు తోకలు ఆడించినయ్. ఒకటెన్క ఒకటి. ఒకటా రెండా? ఇరువై నాగండ్లు కదిలినయ్. దున్నిన దుక్కిలో పొట్టి లాలయ్య ఒడిగట్టుకొని గుట్టకుమొక్కి, సెలుకకు మొక్కి, అటెన్క తూరుపుకు మొక్కి పెసరు విత్తనాలు జల్లిండు.

విత్తనాలు జల్లిన దుక్కిమీద అయిదు గుంటకలు తిరుగుతున్నాయి. బర్ల దగ్గర సంకల కట్టె ఆనించుకొని ఓటుగాలు మీద నిలుచున్న బర్ల ఓదన్నకు గిదంతా చిత్రంగా కనిపిస్తోంది. పూరేడు పిట్ట కళ్లలాంటి కళ్లు చికిలించి నాగండ్లవేపు చూసిండు. బర్రె పెయ్యిలాంటి పెయ్యిని గీతలుబడ బరబర గోకిండు. నెత్తి పునుక్కున్నడు. బర్రె పెదిమిల్లాంటి పెదిమలు ఎందుకో వనికినయ్. ఎందుకో పూరేడు పిట్టలాంటి కళ్లల్లో నీళ్లూరినయ్. అతనికి తన చిన్నతనం, వయసు, స్వంత భూమి, భార్య, పిల్లలు యాదికొచ్చారు. ఆ వెనువెంటనే తాను నాగలి బట్టి దున్ని దోకిన రోజులు కళ్లముందు మెదిలినయ్. అప్పుకింద భూమిపోయిన దినం- బాలెంత రోగమచ్చి భార్య పోయిన దినం- పసిపోరగండ్ల ఎంటేసుకొని బతికిన దినాలు- పసిపోరగండ్ల తన చేతులతోటే మట్టిల కప్పిన దినాలు- తన చేతికి కట్టె వచ్చిన రోజు. ఊరి బర్లకాపరిగా మారిన దినాలు- అన్నీ గుర్తుకొచ్చాయి. అట్లా ఎంత సేపు నిల్చున్నడో ఓదెలుకు గుర్తులేదు.

తూర్పుదిక్కు సూర్యుడు చురచురమంటున్నాడు. ఆకాశంలో మబ్బులు కుదురు కుంటున్నాయి. నేలంతా పొగచూరినట్టుగా దువ్వెన పురుగులు లేచాయి. బర్లు నీళ్లల్లో పన్నయ్. ఎక్కడో తీతువ పిట్ట అరుస్తున్నది.

పిల్లలు బరిబాత వాగొడ్డుకు ఎండ్రికిచ్చలు, జిమ్మలు పడుతూ, కొందరు ఈదుతూ, కొందరు ఇసుకలో పొర్లుతూ కేరింతలు కొడుతున్నారు.

పిల్లల మీది నుండి దృష్టి మళ్లీ నాగండ్ల మీదికి మలిపాడు. కండ్లు నిలబడి పోయాయి. ముఖం మీద ఎవరో ఝాడిచ్చి గుద్దినట్టుగా కమిలిపోయింది. ఆదరాబాదరా గెంటుకుంట గెంటుకుంట ఆవలి ఒడ్డు నుండి ఈవలి ఒడ్డుకు దాటి గెంటుకుంట గెంటుకుంటనే పరిగెత్తాడు. కాళ్లకు రాళ్లు తాకుతున్న లక్ష్యంలేదు.

ఓదెలు నాగండ్ల దగ్గరికి చేరుకునేసరికి గుంటకలు నాగండ్లన్ని ఆగిపోయినయ్. ఎడ్లు సిర్రుబుర్రులాడన్నయ్. పిల్లాజెల్లా, ఆడోల్లు, మొగోళ్లు అంత ఒక్కకాడికి జేరి పోయిండ్లు. ఎవలేం మాట్లాడ్తండ్లో ఎవలి కినబడ్త‌లేదు.

మందిని తొలగించుకొని మూతి లోపలికిబెట్టి ఓదెలు చూసిండు. మందిల ఏడుగురు పోలీసోల్లు తుపాకులెక్కుబెట్టి మొరిగే శునకాల్లా మొరుగుతున్నారు. వాళ్ల మ‌ధ్యలో ద‌ర్జాగా నిలుచున్న అమీన్ సాబ్ పిస్తోలు పట్టుకున్నాడు. అతనిపక్క పట్వారి గోప‌య్య సెయ్యెత్తి అంతూపొంతూ లేకుంట తిడుతుండు.

కాసేపు సంగతేందో సమజ్‌గాలే.

అంతలోనే “మాకెలపుడా మార్ సాలెకు మార్-” యస్.ఐ. అరిచిండు.

పటేల్-పటేల్- బరిబాత పెయిలమీద లాఠీదెబ్బలు- పిల్లలు ఏడుస్తున్నారు. స్త్రీలు శాపనార్థాలు బెడుతున్నారు. కాని ఎవలు కదలరే- ఓదెలు తలమీద లాఠీదెబ్బ- ఎడం చేత పునికి చూసుకున్నడు. నెత్తురు కూడా కమిలిపోయి పిడుదునెత్తురై పోయింది. కాని అంతరంగంలో కోపం ఎర్రగా రవులుకుంటోంది. అదెక్కడికోపమో? ఏన్నేండ్ల కోపమో? ఎవరికెరుక?

“ఆపుండ్లి” యస్.ఐ.

లాఠీలాగినయ్-

“అరె హర్రామ్ కెబచ్చె- గీభూమి మీదిగాదు. ఉత్తపున్నానికి దెబ్బలెందుకు దింటరు బే. నడువుండ్లి. ఎల్లిపోండ్లి. లేకుంటే మాదెర్ సోద్ ఒక్కొక్కన్ని పిట్టను గాల్చినట్టు గాల్చి కాకులకు గద్దలకేత్త-” యస్.ఐ-

“ఒరే లంజ కొడుకుల్లారా… మీ యమ్మల కుక్కల్… నాకు మీకు ఎప్పుడో సెల్లుబాటయ్యింది. ఎండకాలం పనులు బందుజేసి నాయేంబీక్కున్నరు? మీ ఎనుకున్న పార్టోల్లూ, మీరూ నా రోమం బీకలేరుర్రా. నేనే తలుసుకుంటే మసిరా! మసి జేసిపారేత్త…!” ముత్యంరావు దొర.

“వారీ గిదేం నాయెంరా? మంది భూములు దున్నుకోను పాపమా? పచ్చిభూతర్రా! ఇయ్యల్ల సేండ్లమీనబడి దున్నుకుంటరు. రేపు ఇండ్లమీదపడి దోసుకుంటరు. మనూల్లె పోలీసోల్లుండగనే గింతపని కెత్తుకుంటిరి. లాపోతెనా మాయిండ్లక‌గ్గి త‌ల్గ‌బెట్టి పేలాలేరుక బుక్కుతరు” గోపయ్య.

“నిబాంచెనాతె నీ పేరు దల్సుకుంటె బుక్కెడు బువ్వన్న దొర్కది” కొండమ్మ చేతులు మెటికలిరిసింది.

ఓదెలు పెదిమలు వనికినయ్. ఏదోచెప్పాలని నోరుతెరిసిండు కని ఏది చెప్పలేక పోయిండు.

“మీ సంఘ పెద్దెవడురా?” అమీను గర్జించిండు.

ఎవలూ మాట్లాడలేదు.

“ఇక్కన్నుంచి కదులుండ్లి- ముదుగాలు గ జెండాలు పీక్కరాండ్లి- నక్స‌లైట్‌ నాకొడుకుల ఠానాకు పట్టుకపోత-”

పోలీసులు జెండాల దిక్కు కదిలిండ్లు.

ఎల్లయ్య పరుగందుకున్నడు. జెండాకొయ్యదగ్గర నిలిసున్న‌డు. పోలీసోడు తుపాకి మడమతోటి ఎల్లయ్యను అంచి గుద్దిండు.

జనంలో కదిలిక- పోలీసుల సుట్టూ గిరేసుకున్నరు.

“ఖవర్దార్ జెండాలు ముట్టుకున్నరో గీడ నెత్తురుడొల్లాలె-” ఎవడో ఛాతి బాదుకుంటూ గొంతు తెగిపోయేటట్టు అరిచిండు.

అమీన్ పిస్తోల్ గాలిలోనికి పేల్చిండు. దొర కండ్లల్లో కూసంత బెదురు. గోపయ్య కాల్లు వనుకుతున్నాయి.

జనంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. ఒక పోలీసోడు జండా అందుకున్నడు. ఆన్ని జనం చుట్టేసిండ్లు. “ఒకటి-రెండూ-మూడు” అమీన్ బండగొంతుతో అరుస్తున్నాడు.

తుపాకులు మొరిగినయ్.

మీస లక్ష్మీ నాగటి చాల్లల్లో పడి గిలగిల తన్నుకుంటున్నది. కడుపుల నుంచి కార్తన్న జీవరక్తం ఎర్రగా నాగటి చాల్లో పారుతోంది. గడ్డం సోగాలు యన్.ఐ. మీద దునికిండు. పిస్తోలు పేలింది. సోగాలు ఎర్రమట్టిలో తన్నుకున్నడు.

ఆకాశంలోకి రాళ్ళు లేసినయ్. కాని తుపాకుల ముందు రాళ్ళు నిలువలేదు. అట్లా మరో ఐదు నిమిషాలు తుపాకులు మొరిగినయ్. అడివి ప్రతిధ్వనించింది. చెట్లు పుట్టలు బట్టి జనం ఉరికిండ్లు. ఆఖరుకు ఎల్లయ్య ఓదెలుతో సహా పదిమంది పురుషులు, నలుగురు స్త్రీలు, నలుగురు పిల్లలు దొరికారు.

మీస లక్ష్మీ, గడ్డం సోగాలు శవాలను పోలీసులు మాయంచేశారు. వాళ్ళందరిని తుపాకులు ఎక్కుబెట్టి నడిపిస్తూ వాగుదాటించి ఈవలోడ్డుకు తీస్కచ్చిండ్లు.

నెత్తిమీదికి పొద్దచ్చెటాల్లకు పోలీసువ్యాన్ బుర్రుమన్నది.

సగం దున్నిన ఎర్ర సెలుకలో ఇంకా మూడు ఎర్రజండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి.

***

ఆ రాత్రంతా నిరాయుధులైన బందీలను తాళ్లతో మట్లకు కట్టేసి కొట్టవలసిన వాళ్లంతా కొట్టారు. పిల్లల లేత శరీరాల మీద యస్.ఐ. కొట్టాడు, తన్నాడు. స్త్రీల మీద అమానుష కృత్యాలు జ‌రిపారు. పురుషుల శరీరాలు నెత్తురు ముద్దలైపోయాయి.

అయినా ముత్యంరావుకు కసి తీరలేదు. నిరు పేదజనం సంఘం బెట్టుకున్ననాటి నుండి సంఘం బలపడినదాదిగా బలపడిన కసి, కోపం చల్లారలేదు. గోపయ్య ఆ రాత్రంతా తాగుతూ ముత్యం రావుకు ఏదో చెప్పుతూనే ఉన్నాడు. అమీన్ పెట్టాల్సిన కేసుల గురించి త‌ల ప‌ట్టుకున్నాడు.

బ్రాందీసీసాల మధ్య ఆలోచనలు సాగినయ్. క్యాంపు పోలీసులు రాత్రి ఊరుమీద ప‌డ్డారు. ఇల్లిల్లు గాలించారు. గడుక కుండలు పగులగొట్టారు. నిశిరాత్రి ముస‌లి వాళ్లు ఏడుస్తుంటే ఊరంతా గస్తీ తిరిగారు. ఆ రాత్రి ఎల్లయ్య గుడిశెతో పాటు మ‌రి నాలుగు గుడిశెలు కాలిపోయాయి. కాలిపోయిన గుడిశెల్లో మీస లక్ష్మీ, సోగాలు శవాలు కాలిపోయాయి.

తెల్లారి నెత్తురు ముద్దలై దొరికిన వాళ్ళను వ్యాన్లెక్కించి సబ్ జైలుకు పట్టుకపోయారు.

***

కోర్టు గదిలో ఫ్యాను గద్దలా తిరుగుతోంది.

ఎత్తుగద్దె కుర్చీమీద జడ్జి అసహ్యంగా ముఖం పెట్టి కూర్చున్నాడు. అతను నల్లగా నున్నగా గొరగిన మీసం గడ్డంతో తాటిపండు తీరుగున్నాడు. ఎత్తుపొట్ట. ఎర్రగా ఎద్దుకండ్లలాంటి కళ్ళు.

అతని టేబుల్ ముందు ముసలి గుమస్తా అదేపనిగా రాస్తున్నాడు వంచిన తల ఎత్తకుండా.

జడ్జి నెత్తిమీద గాంధీ ప్రశాంతంగా ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్టు, అహింస నవ్వులు నవ్వుతున్నాడు.

జడ్జికి కుడివేపు అందంగా బైండుచేసిన పాపాల రికార్డులు, లా పుస్తకాలున్నాయి. వాటి మీద బంగార్రంగు అక్షరాలు కొట్టొచ్చినట్టు రాసున్నాయి.

జడ్జ్ టేబుల్‌కు కొంతదూరంలో పెద్ద కర్రటేబుల్. దానిముందు నల్ల గౌన్ల లాయర్లు అస‌త్యాల ఫైళ్లు అతి జాగ్రత్తగా పట్టుకొని కూర్చుండి అవసరంలేని విషయాలు గుసగుసలాడుతున్నారు.

పక్కగదిలో పి.పి.ఒ. లక్ష్మణ్ రావు డి.యస్.పి తో మాట్లాడుతున్నాడు.

జడ్జి బెల్లు మోగించాడు. కోర్టు జవాను బయట ఏదో పేరును బొంగురు గొంతుతో పిలిచాడు.

పి.పి.ఓ. పరుగెత్తుకొచ్చాడు.

ఆ తరువాత అమీన్ ఇద్దరు పోలీసులు వెంటరాగా కాసంత బెదురు ముకాల‌తో మాసిన గుడ్డ పేగుల రైతులు, రైతు స్త్రీలు, నలుగురు పిల్లలు ప్రవేశించారు. ఎల్ల‌య్య బోనెక్కాడు. అతని వెనుక ఓదెలు- అందరు వరుసగా నిలుచున్నారు.

లాయర్ల ముఖాలల్లో అసహ్యం రూపు కడుతోంది.

పి.పి.ఓ. గొంతు సరిచేసుకొని ఉత్తగనే గాలిపంఖా వేపు కాసేపు చూసి అలవోకగా కత్తిరించిన కుడి మీసం మీద గోక్కొని రైతులను చూడకుండానే జడ్జిని చూశాడు.

జడ్జి రైతులను చూశాడు.

పి.పి.ఓ. కాయిదాలు బల్లమీద పడేసి కొంచెం ముందుకు నడిచి “యువరానర్ సర్” అని కాసేపు గుర్తుకు తెచ్చుకోను ప్రయత్నం చేస్తున్నట్లు నటించి – పక్కగదివేపు- ఓరకంట చూసి అక్కడ గ్లాస్కో ధోవతి తచ్చాడడం, కరుకు బూట్లు కదలడం గమనించి సంతృప్తిపడి, కొత్త ఉత్సాహంతో ఈవిధంగా వాదించాడు.

“ముద్దాయిలు చూడడానికి చాలా అమాయకంగా, నిరుపేద వాళ్ళుగా కనిపిస్తున్నారు. యువరానర్ సర్ – అదంతా పైపై నటనే. వాళ్ళ గురించి తెలుసుకుంటే లోకంలో ఎంతటి క్రూరత్వం, అన్యాయం తాండవ మాడుతున్నదో మనం అర్థం చేసుకోగలం. ముద్దాయిల గురించి చెప్పేముందు కొంత ఆ గ్రామం గురించి తెలుసుకోవాలి. రాజకీయంగా కూడా ఈ కేసు చాలా ఆసక్తికరమైంది.

నక్కల గూడూరు 1976 దాకా ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ- అనివార్యంగా తలెత్తిన చిన్నచిన్న తగువులు వాళ్ళలో వాళ్లకు సర్దుబాటు చేస్తూ వాళ్ళను కన్నబిడ్డలుగా ముత్యంరావుగారు చూసుకునేవారు. గతంలో ఈ ఊరి నుండి ఒక్క కేసు కూడా కోర్టువారి దాకా రాకపోవడం గుర్తించాలి.

అలా ఉండగా ఇదిగో ఈ కేసులో మొదటి ముద్దాయి నక్కల ఎల్లయ్య దేశ విద్రోహ, సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపాడు. అలాగా బాహాటంగానే నక్సలైట్లు ఊళ్లోకి రావడం మొదలయ్యింది. మీటింగులు, ఉద్రేక పూరితమైన ఉపన్యాసాలు, రెచ్చగొట్టే పాటలు మామూలైపోయాయి. ముత్యంరావుకు ప్రజలకు మధ్య సంబంధాన్ని నక్సలైట్లు ఆ విధంగా విచ్ఛిన్నం చేసి ముత్యంరావుగారికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టారు.

మొద‌ట ఇక్క‌డున్న‌వాళ్లంతా అలా ముత్యంరావుగారికి వ్య‌తిరేకంగా తయారయ్యారు. ఉద్దేశపూర్వకంగా కూలి రేట్ల గురించి త‌గాదా ప‌డ్డారు. ముత్యంరావుగారు కూలి పెంచారు. అది మొదలు ఏదో సాకుతోటి ముత్యంరావుగారి ఇంటి మీదికి దాడికి వెళ్ల‌డం, ఆయనను చంపుతామని, కొడుతామ‌ని బెదిరించ‌డం ప‌రిపాట‌యింది. తేది 20 జనవరి 1978 ఒకమారు క‌ర్ర‌లు, క‌త్తులు, గొడ్డండ్లు లాంటి మారణాయుధాలు ధ‌రించి ముత్యంరావుగారి ఇంటిమీద మొదటి ముద్దాయి ఎల్లయ్య నాయకత్వంలో దాడిచేసి- ఇంట్లో ఫర్నీచర్ విరగొట్టారు. తేది 2- 2- 78 నాడు అతని మక్కజొన్న పెరడు ఐదెక‌రాలు విరుచుకతిన్నారు. ఇంకా పశువుల నెత్తుకపోయారు. పంటలు నాశనం చేశారు. పడారి గోడ కూలగొట్టారు. గడ్డి, చొప్ప ధాన్యం ఏది దొరికితే అది ఎత్తుకపోయారు. ఇలాగ‌ “యువరానర్ సర్ నేను చాలా సంఘటనలు చెప్పగలను. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.”

“అన్నాలెందొరా! పచ్చులసొంటోల్లం దొరా! మామీన్నేపడి అనేక పారీలు కొట్టిచ్చిండు దొరా” ముసలివెంకయ్య చేతులు జోడించి పదేపదే మొక్కాడు.

“ఆడర్-ఆడర్-” జడ్జి సుత్తెతో బల్లమీద కొట్టాడు. పి.పి.ఓ. కాసేపాగి-

“అలాంటి పరిస్థితిలో తన కుటుంబం ధన, మాన, ప్రాణ రక్షణ కోసం పోలీసులకు, ప్రభుత్వానికి తన గోడు చెప్పుకున్నాడు. ఫలితంగా ప్రభుత్వం వారు ఆ ఊళ్లో పోలీసు క్యాంపునేర్పాటు చేశారు.”

“అవద్దం- మమ్ముల సర్వనాశిడం సెయ్యటానికి పోలీసోల్ల తీసుకవచ్చిండు దొర ” లక్ష్మీ- మళ్ళీ జడ్జి మూలిగిండు. కర్ర సుత్తె శబ్దం.

“యువరానర్ సర్! అన్నిటికి తెగించిన ఈ సంఘ విద్రోహ శక్తులకు పోలీసులన్నా లక్ష్యంలేదు. 1979 జూన్ 21న మొత్తం ఊరు ఊరంతా కలిసి ముత్యంరావుగారి ఇరువై ఎకరాల చెలుకలో ఎర్రజండాలు పాతి అక్రమంగా దున్నుకోవడం సాగించారు. అది తెలిసి ముత్యంరావుగారు, యస్.ఐ. కొండారెడ్డి, మరి ఏడుగురు పోలీసులు చెలుక ద‌గ్గ‌రికి వెళ్ళారు. యస్.ఐ. కొండారెడ్డి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కాని ముద్దాయి ఎల్ల‌య్య అడ్డుతగిలి తూలనాడుతూ జనాన్ని రెచ్చగొట్టాడు. ఫలితంగా జనం రెచ్చిపోయి పోలీసుల మీద ముత్యంరావుగారి మీద, ప‌ట్వారి గోప‌య్య మీద రాళ్ల‌తో దాడికి సిద్ధ‌మ‌య్యారు. పైగా చుట్టూ చ‌క్రబంధంగా నిల‌బ‌డి ముల్లుక‌ర్ర‌ల‌తో దాడిచేసి చంప‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. తప్పనిసరైన పరిస్థితిలో లాఠీచార్జి చేయ‌వ‌ల‌సి వచ్చింది. ఆ తరువాత కొంత ఘర్ష‌ణ‌ తరువాత గుంపు చెదిరిపోయింది. ప‌రిస్థితి చ‌క్క‌బ‌డ్డ‌ట్టుగానే క‌నిపించి పోలీసులు, ముత్యంరావుగారు వెనుకకు తిరిగి వచ్చారు.

కాని ఆరాత్రి ఎల్లయ్య నాయకత్వంలో మళ్ళీ దాదాపు 500 మంది దాకా జ‌మై ముత్యంరావుగారి ఇంటి మీద దాడి చేశారు. తనకు రక్షణగా ముత్యంరావుగారు ఉంచుకున్న బైరి రాములు, బందెల లింగయ్య ఇండ్లు కాలబెట్టి – ఊరంతా భీభత్సం సృష్టించారు. ఆ దొమ్మిలో మీస లక్ష్మీ, గడ్డం సోగాలు అనేవాళ్ళు పాల్గొని ప్రమాదవశాత్తు కాలిపోయారు. పోలీసులు జోక్యం చేసుకొని ఈ బోనులో నిలబడ్డ వ్యక్తులను అతికష్టం మీద కస్టడీలోకి తీసుకోగలిగారు…”

“మోసం – దగా వాళ్లిద్దరిని చెలుకలో పోలీసులే కాల్చేసిండ్లు” వెంకటి అరిచిండు. ఎవరో అతని నోరు మూసిండ్లు.

“ఈ విధంగా మొదటి ముద్దాయి ఎల్లయ్య. రెండవ ముద్దాయి అంకం నాగమల్లు నాయకత్వంలో ముద్దాయిలు మరి అయిదు వందల మంది కలిసి గృహ దహనాలు, దోపిడి, ఆస్తి నష్టం, పరువు నష్టం, మొదలగు అకృత్యాలే కాక ముత్యంరావుగారిని చంపడానికి ప్రయత్నం చేశారు. కావున ముద్దాయిలు 197, 302, 144 ఇండియన్ పీనల్ కోడు ప్రకారంగా శిక్షార్హులు.

కోర్టు వారు విచారించి న్యాయం చేయగలరని, ముత్యంరావుగారికి ప్రాణ, ధన, ఆస్తి రక్షణ కలిగించగలరని కోరుతున్నాను…”

పి.పి.ఓ. నుదురుకు చెమట పట్టింది. తెల్లటి కర్చీఫ్ తో నుదురు తుడుచుకొని కుర్చీలో కూలబడిపోయాడు.

కాసేపు గాలి స్తంభించిపోయింది.

ముసలయ్య వనుకుతూ బిగుసుకుపోయి నిలుచున్న వాడల్లా పిట్టలా నోరుతెరచి “మా బతుకులు సూసెటోల్లెవలు లేరు దొరా! ఎంటికెలున్న కొప్పు ఎటు ముడిసినా సక్కంగనే ఉంటది. బాంచెన్- గరీబోడు ఏది సేసిన తప్పే. నీ బాంచెన్ దొరా! సానా ఏండ్ల నుంచి దుర్జిట్ట బతుకులు బతికినం. పసురాల తీర్గ- కొడితే పడ్డం! తిడితే పడ్డం- సంపుతే సచ్చినం. నోరెత్తలేదు. గుడ్లల్ల నీల్లు గుడ్లల్ల గుక్కుకున్నం. మా కడుపునొప్పేందని ఏ సర్కారు అడుగలేదు. ఓట్లచ్చినయని ఇల్లిల్లు దిర్గినోల్లు మళ్ల మా మొఖం సూల్లే. మేమెన్ని బాధలు పడ్డమో? గ పరమాత్ముని కెరుక…”

“పరమాత్ము డనేటోడే ఉంటె మన బతుకులు గిట్టేందుకు తెల్లారిపోవు” లక్ష్మి గునిసింది.

“ససరాదే పిల్లా! ఆడున్నడో? ఉంటె ఏడ తాగిపన్నడో మన కెందుకు? గ అకీలు దొర ఎన్నెన్ని పుండకోరు మాటలు మన మీన- పుట్టిచ్చి సెప్పిండు? ఇన్నరుగదా! మ‌న క‌ట్టం సుఖం మనం సెప్పుకుందాం.” ముసలయ్య కసిరి కొంచెం ముంగటికి జ‌రిగిండు.

నాకా బాంచెన్ కానూక్లెర్కలే. మాటనెనుక మాట ఇలవరిసె బెట్టి మాట్లాడ‌రాదు. ప‌నిచేసి బ‌తికినోన్ని బాంచెన్‌. మాటలు సేసి బతికినోన్ని గాదు. కాలం సూడ‌బోతె నోరున్నోనిదే ఊరంట‌రు. తమరు అరన్నం దింటరు బాంచెన్. గ అడ్ల గింజ‌లు బురుద‌ల నుంచి తీసేటందుకు మేం పడే కట్టం ఏంజెప్పాలె బాంచెన్? గట్ల కట్ట‌పడి గ అన్నాల‌డుగ‌లే బాంచెన్‌. కడుపుకు సాలక కములమడిగినం. మేం నెత్తురు దారపోసి బ‌య‌లుసేసుకున్న సెలుక‌లు క‌బ్జా సేసుకోకుండ్లన్నం. మమ్ముల గొడ్లను కొట్టినట్టు కొట్ట‌క‌న్నం. సంపకన్నం. మా ఆడోల్ల మనుషుల తీర్గ సూడుమన్నం. ఏం జెప్పాలె పెద్దొర‌? మేం సెప్పరాని బాధలు బడ్డం. సెప్పుకుంటే మానంబోద్ది. సెప్పుకోకుంటే పానంబోద్ది.

మేం ఇగ గట్ల బతుకలేం అనుకున్నది తప్పయింది. మామీద కోతుకం బెట్టుకున్నడు దొర.

ఇవ్వార్దనుక అకీలు దొర మేం సెయ్యని తప్పుల గురించి సానా చెప్పిండు. పోలీసోల్లు మావూళ్ల మీదబడి రజాకార్ల తీరుగ గోసలు బెడుతుండ్లు. దొర సేసిన తప్పుల గురించి చెప్పలేదు- మా”

“ఓ ముసలోడా! గీడ గయ్యన్ని సెప్పేం లాభం? నీ గుడ్డ పేగులోని మాట లెవలింటరు?” ఒక పడుసోడు-

వకీల్లు అనాసక్తిగా ముచ్చెట్లు పెట్టుకుంటున్నారు.

ముసులోడు అదేపనిగా ఏదో చెప్పుతున్నాడు. జడ్జి మధ్య మధ్య బల్లమీద కొడుతూనే ఉన్నాడు.

చాలా సేపటి నుండి ఇదంతా చూస్తున్న బర్ల ఓదేలు కు ముఖమంతా ఎరుపెక్కింది. పెదిమలు అదురుతున్నాయి. కుడిపక్క నుండి కొంచెం చొల్లుకారుతోంది. అతను గట్టిగా సరాయించి- “ దొరా! గియ్యన్ని సెప్పేం లాభం? నా దొక్క మాటున్నది కూసంత సెవున బెట్టుండ్లి. ఆయింక తమరు చేసేది చెయ్యిండ్లి.” ఈ గొంతు కొత్తగున్నది.

వకీల్లు ముచ్చెట్లాపిండ్లు.

“అకీలు దొర మా దొర ప‌చ్చాన శానా జెప్పిండ్లు. గయ్యన్ని కాదని మావోడు భార‌తం జెప్పుకొచ్చిండు. అకీలు సెప్పిన సంగతులు కాదని మేమెంత మొత్తుకున్నా త‌మ‌రి ముంగ‌టికి సాచ్చాలు దెత్త‌రు.

అకీలు దొర మమ్ముల దొంగలన్నడు, లంగలన్నడు, లఫంగులన్నడు, పానా.లు దీసే కటికోల్లన్నడు. అంతేకాదు అకీలు దొర‌…”

పి.పి.ఓ. కండ్లు పులపొడిసిండు.

“మేం దొంగలమే దొరా! అకీలు దొరన్నట్లు మేం దొంగలమే అయ్యుంటే మా పెయిమీన అంగిలేకుంట నారపడి దోరపడి నరిగిపడి గిట్ల మీ ముంగట నిల్సోక‌పోనే పోదుము. గీ దేశంల మనకండ్ల ముంగట దొంగతనం జేసేటోడు ఒకడు. గుప్పుచాపుగ కిందకుండ కిందుండంగనే మీదికుండ మీదుండగనే నడిమికుండ తప్పదీ సెటోడు. మరొకడు. అగో గాడు బాగుపడిపోతండు. పదేండ్లకింద నా దగ్గర అయిదెకరాల అవ్వల్దర్జ పెరడుండే. గదేమయిపోయింది? దొర పెరట్ల గల్సిపోయింది. దొర దొరే. మల్ల నేను దొంగనయిపోయిన. నా సంసారం పోయింది, ఇల్లుబోయింది. పెండ్లాం సచ్చింది, ఆఖరుకు పోరగండ్ల సుత బతికిచ్చుకోలేకపోయిన. గీ ఈడుల నేను కట్టెబట్టుకొని బర్లకాసి బతుకుతున్న. దొర నా కండ్ల ముంగట ఏటకేట పెరిగిపోయిండు. ఇరవై ఎకరాలోడు ఇన్నూరెకరాలోడయ్యిండు. ఎకరం అరెకరమోడు మ‌ట్లెగల్సిపోయిండు. మట్లెగల్సినోడు దొంగ… పెరిగిపోయినోడు, మా బతుకుల్ల మన్నుబోసినోడు దొర.

మేము సంఘంబెట్టుకున్నం నిచ్చమే. గిందుల దాపుకంలేదు, మాపుకంలేదు. ఆ మాటకత్తె దొరలకు నా తలమీనెంటికలన్ని సంఘాలున్నయి. పార్టీలున్నయి. కడుపుకు జాలదన్నం నిచ్చమే. మరి మాకేమిచ్చిండ్లు? తన్నులు, గుద్దులు.

బతుకుదెరువు కోసం పరంపోగుల మావోల్లు నాగండ్లు గట్టిండ్లు. సెయ్యి బొమ్మ బెట్టుకోని మా ఊళ్ళెకచ్చిన తెల్లబట్టలాయిన బంజెర్లు, పరంపోగులు ఇప్పిత్తనన్నడు దొరగన్క‌. మేం దున్నుకుంటె దొంగలం. నచ్చలేట్లం.

ఆఖర్న మేం ఇండ్లు గాలబెట్టినమన్నడు. పంటలు ఖరాబు చేసినమన్నడు. సెలుకల మిలమిల సూడంగ మీస లచ్చిమిని, గడ్డం సోగాలును కాల్సి సంపి ఇండ్లు కాలబెట్టి అందట్లేసి కేసులేకుండజేసిండ్లు. ఎందరిని సంపినా ఉదరేలేదా దొరా?

దొరా! గీ సెత్త సూడుదొరా! మట్టి-మట్టిల బుట్టి మట్టిదిని మట్టిల నుంచి పంటలుదీసే టోల్లం మేము. ఒక్కొక్క గింజకు ఎన్ని నెత్తురు బొట్లు అడుపుతమో లెక్కలేదు. మబ్బు మెత్తబడ్డకాన్నుంచి మామనుసు మెత్తబడ్డది. కర్ర ఏనుకుంటె మకు పానంబడ్త‌ది. మారాకేత్తే మాగుండెలు గుబగుబలాడ్త‌యి. దాన్ని పానంల పానంగ సాది సవరచ్చనజేసి, కోసి కుప్పేసి ఇత్తులు జేత్తే బత్తాలుకుట్టిచ్చి ఎత్తుకపోయినోడు దొర‌. ఉత్త సేతులతోని మిగిలిన మేం దొంగలం. గ పంటల సాదే నెనరే లేకుంటే మేం బతుకలేం!

దొరా… మేం పంట బండిచ్చేటోల్లం గ‌ని నాశిడం చేసెటోల్లం కాదు దొర‌. మా నెత్తురంత దారపోసి పంటలు బెంచిన‌ట్టుగ‌నే దొర‌ను బెంచినం. మనుషులకు బువ్వ‌బెట్టెటోల్లంగ‌ని, సంపేటోల్లం కాదు దొరా! కడుపులు కట్టుకొని మీ సేవలు సేసినం. మేం ఒక్కొక్క పెల్ల‌బేర్చి ఇండ్లు గట్టేటోల్లం దొరా! కూలగొట్టెటోల్లంగాదు.

ఇగ సంపెటోల్ల‌న్న‌రు. గ‌ తెగువే మాకుంటే దొర… ఒక్కడు గింత మంది మీద ఎక్కి సవారెట్ల జేత్తడుదొరా! నా మట్టుకు నేను కోడిపిల్ల‌ను గోసెరుగ‌, నెత్తురు సూత్తె నాకండ్లు సిరుతలు గమ్ముతయ్…”

ఓదెలు పిచ్చోని తీరు చుట్టూ చూసిండు.

“మనమంతా నిలుసున్న‌ గీ కచ్చీరు ఇల్లే ఉన్నదనుకోండ్లి దొరా! డంగులు గొట్టి, ఇటిక‌లుజేసి మాడెంటికలు ఊసిపోంగ తట్టలు మోసి నీల్లు నిప్పులు దాగి దీన్ని కట్టినోన్ని కూల‌గొట్టుమ‌నుండ్లి! ఆడెంత ఇదయిపోతడో, ఆని మనుసెంత సుమ్మర్లు సుట్టుకపోద్దో! గ‌ కట్టం దెల్వనోడు మూడు ఘడియల్ల సత్తెనాశిడం చేత్తడు. కూల‌గొడ్త‌డు.

మా పానాలు, మానాలు దీసిండ్లు. మా పంటలు ఎత్తుకపోయిండ్లు. మా భూములు గుంజుకున్నరు. ఇండ్లు కాలబెట్టిండ్లు. సంపేసిండ్లు, మేం గ సత్తెనాశిడాన్ని సూడలేక ఒక్కటయినం. ఔను దొరా… లాకలాంగ ఒక్కటైనం.

మా నెత్తురును మేం సంపుకోం. కాని ఇంకొకడు సంపుతాంటే ఇగ సూడం. దొరా… మేము అన్ని చీజ్ల తయారుజేసెటోల్లం. మిమ్ముల మీ బంగుళాల అన్ని… అన్ని-అన్ని మేమే తయారుజేసినం. అయ్యన్ని మీరు నాశనం చేత్తె మేం మరింక ఊకోము, మమ్ముల మరేమన్న అనుండ్లి. నచ్చలేటులే అనుండ్లి. ఇంకేమన్నా అనుండ్లి. మాకేం పరువలేదు. మానెత్తురు మరుగుతాంది దొరా!”

జడ్జి అసహనంగా కుర్చీలో నుండి లేచి ముఖం మాడ్చుకొని గొంతు చించి ఆడర్ ఆడర్ అంటూ అరిచిండు.

కేసు వాయిదా వేసినట్టుగా ప్రకటించి జడ్జి పక్కగదిలోకి వెళ్ళిపోయాడు.

పోలీసులు రైతుల చేతులకు సంకెళ్లు తగిలించి వ్యానెక్కించారు.

ఎల్లయ్య ముఖం విప్పారింది. సంతోషంతో ఓదెలును కౌగిలించుకున్నాడు.

“మీస లక్ష్మి, గడ్డం సోగాలు” ఎవరో అరిచారు.

“అమర్ హై” రైతులంతా ఒక్కగొంతుతో కోర్టు ప్రతిధ్వనించే విధంగా అరిచారు.

దూరంగా నిలుచున్న బక్కపలుచటి వ్యక్తొక‌డు పిడికిలెత్తి ఎర్ర సలాం జెప్పిండు. వ్యాను కదిలింది.

చేతుల సంకెల్లు ఒకటికొకటి తాకిస్తున్నారు. ఆ శబ్దంతో ఎల్లయ్య గొంతెత్తి పాట పాడుతున్నాడు.

“మా రక్తంతో సృష్టిస్తున్న
తిండి గింజలు కట్టుగుడ్డలు…
పెట్టుబడులతో దోచుకు దాచే…
ద్రోహుల గుండెలో అగ్నికణములై…”

ఓదెలు ఇంకా పలవరిస్తున్నట్టుగా గొణుగుతూనే ఉన్నాడు.

మా నెత్తురు
మా మాంసం
మా బొక్కలు
మా మూలుగు
మా బతుకు
మా సుఖం – కట్టం
చెమట, కన్నీళ్లు
మేం నాశిడం జేసుకుంటామురా?

(సృజన మాసపత్రిక అక్టోబర్ 1979)


పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply