(‘సృష్టికర్తలు’ కథ నేపథ్యం – నిజ సంఘటనలు – కథగా రూపొందిన క్రమం)
‘కొలిమి’ పత్రిక వారు ‘సృష్టికర్తలు’ కథ నేపథ్యం, ఆనాటి వాస్తవ ఘటనలను కథగా ఎలా మలిచారు? అనగానే అగులు బుగులయింది. ఆ కథ రాసింది సెప్టెంబర్ 1979లో. అది ‘సృజన’ మాసపత్రికలో అచ్చయింది మాత్రం అక్టోబర్ 1979లో. అంటే సుమారుగా నలభై ఏళ్లు వెనక్కి పోవడం… వారం రోజులుగా ఆ రోజులన్నీ గాయంగా రేగి నిద్రపట్టని రాత్రులు. కలగపులగంగా అనేక దృశ్యాలు… కలసి తిరిగిన మనుషులు పోటెత్తారు. అనుకోకుండా ఆ కాలంలో కరీంనగర్, ఆదిలాబాదు రైతాంగ పోరాటంలో భాగమై ‘జగిత్యాల జైత్రయాత్ర’ 7 సెప్టెంబర్ 1978 తను పట్వారీ వేషం వేయడమే గాక ‘జననాట్య మండలి’ టీమ్‌కు బాధ్యుడిగా పనిచేసిన మా నారాయణ – ఆ కాలంలో మంథనిలో ఆర్గనైజర్‌గా పనిచేసిన పోరెడ్డి వెంకన్న, ‘జగిత్యాల జైత్రయాత్ర’లో జగిత్యాల వేదిక మీదుగా ‘ఎర్రజెండెర్రజెండెన్నియలో’ పాట రాసిన అల్లం వీరయ్య కలిసి గోదావరిఖని మీదుగా ఆ పల్లెల దారిలో ఈ మధ్య పోయాం. నారాయణ ఆనాటి ముచ్చట్లు మనుషులను తలుచుకుంటూనే ఉన్నాడు. ఎవరూ రాయని వందలాది అమరుల గురించి, వారి పనుల గురించి ఆనాటి గ్రామగ్రామాన జరిగిన రైతుకూలీ పోరాటాలు, సమ్మెలు, ‘దున్నేవాడికి భూమి నినాదంతో దున్నించిన భూములు, పోలీసు దాడులు, కోర్టు కేసులు, రామయ్యపల్లె పోరాటం, పెండ్లి రమణారెడ్డి వాళ్ల నాయిన పెండ్లి తిరుమల రెడ్డి దారిపొడుగునా దూరంగా కనిపించే మా ఊరి గుడిమెట్లు చూస్తూనే ఉన్నాను. అయితే మొట్టమొదటి సారిగా ఏప్రిల్20, 1980 పీపుల్స్‌వార్ పార్టీ మా గుడిమెట్టులో ఏర్పడడం గురించి వాళ్లిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు.
“మరుగునపడిపోతున్న మన కాలపు చరిత్ర గురించి మనమే రాయాలి. నాకు వీలైతే ఒక ఐదేండ్లు ప్రతి ఊరు తిరిగి సేకరించి రాస్తే మంచిగుండు.” అన్నాడు నారాయణ చివరగా. ఆ గుట్టకింది చేన్ల నిలబడి. ఆనాటి విప్లవకారులకు “మా మోటబాయి కరెంటు మోటరు షెడ్డు” అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.
నా కండ్లు నీళ్లతో నిండిపోయాయి. ఎందరెందరో? బయ్యపు దేవేందర్‌రెడ్డి, ముంజల రత్నయ్య, మల్లోజుల కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు, గజ్జెల గంగారాం, పెండ్రి బుచ్చిరెడ్డి, శంకరమ్మ ఆరోజుల్లో ఆగమాగంగా దారులు సరిగా లేని వర్షాకాలం చీకటి రోజుల్లో ఊళ్లనిండా పోలీసులుండంగనే తిరిగిన రోజులు గుర్తొచ్చాయి. ఈ పల్లెల నుండి బెగ్గంపాడై ముసలీ ముతక అడువులు పట్టిన ఆ దెబ్బలు నొప్పుల మధ్యనే ఆ గాయిగాయి మధ్యనే ఆ గుంపుల మధ్య బురదలో కాళ్ల మీద కూసోని పులుకు పులుకున వాళ్లు వెలుగు రాసిన గొంతులతోటి చెప్పే మాటలు… నా చెవుల నిండా ఇప్పటికీ హోరెత్తుతున్నాయి. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఊత్తే పడిపోయే శరీరం. పీక్కపోయిన కండ్లు. నిదుర లేని, రాని ముఖం. నా ఈడువాళ్లందరి లాగే ఆ కాలంలో నాకు నా కాళ్ల కింది నుండి పెకిలించుకుపోయే విప్లవోద్యమం. బాంబెన్ దొర అనే మనుషులే ఇంత తెలివితోటి ఎంత వెలుగుతోటి ఎంతటి ధైర్యం, తెగింపుతోటి పోరాడినారో కదా?
***
21 మార్చ్1977 నాడు ఎమర్జెన్సీ ఎత్తివేశారు. అప్పటికే జైళ్లలో ఉన్న కరీంనగర్, ఆదిలాబాదులోని కార్యకర్తలు విడుదలయ్యారు. ఏప్రిల్ 1977లో ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కార్యకర్తలతో సుమారు 30మందితో శాస్త్రుల పల్లిలో(మంథనికి ఐదు కిలోమీటర్ల దూరం)సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విప్లవానికి బాట, ఇంతవరదాకా దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ పోరాటాల ఆత్మవిమర్శ, వ్యవసాయ విప్లవం- ప్రజా సంఘాల నిర్మాణం, సాయుధ పోరాటం- తాత్కాలిక విరమణ ఈ నాలుగు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి ఆ 30మందికి వారివారి ప్రాంతాలను కేటాయించి ఉన్నారు.
అప్పటికే ఏర్పడి పనిచేస్తున్న ‘రాడికల్ విద్యార్థి సంఘం’,’రాడికల్ యువజన సంఘం’, ‘జననాట్య మండలి’ ద్వారా ‘దున్నేవాడికి భూమి’ ప్రాతిపదికన ఊరూరునా, బస్తీలల్లో అనేక మీటింగులు జరిగాయి. “ఊరు మనది వాడ మనది- దొర ఏందిరో వాని పీకుడేందిరో` పాటలు గ్రామాల్లో మార్మోగాయి.
అప్పుడు కరీంనగర్ జిల్లాలో మంథని, పెద్దపల్లి, సిరిసిల్లా, జగిత్యాల, హుజూరాబాదు, ఆదిలాబాదు జిల్లాలో లక్షెట్టిపేట, ఆసిఫాబాదు, చెన్నూరు, నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో రైతుకూలీ సంఘాల నాయకత్వంలో దున్నేవాడికి భూమి ప్రాతిపదికగా పోరాటాలు ఉవ్వెత్తున నడిచాయి. ఆ రోజుల్లో ప్రతీ గ్రామంలో 30శాతం నుండి 50శాతం దాకా శిఖం, బంజరు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు దొరల ఆక్రమణలో ఉండేవి. పట్టాభూముల మీద కాకుండా ఇలాంటి భూముల్లో రైతుకూలీ సంఘాలు ఎర్రజెండాలు పాతి దున్నుకునేవి. అప్పటికే సర్వేచేసి ప్రతి గ్రామంలో ఉన్న భూమి వివరాలు, ఉత్పత్తి, కుటుంబ వివరాలు విద్యార్థులు వేసవి సెలవుల్లో గ్రామాలకు తరలి సేకరించారు. అప్పటికే వ్యవసాయ కూలీ రేట్ల పెంపు కోసం ప్రతీ ఊరిలో రైతుకూలీ సంఘం పిలుపు మేరకు సమ్మెలు జరిగాయి. కూలి రేట్లు, పాలేర్ల జీతాలు, పెట్టుబడులు పెంచుకున్నారు. ఆశ్రిత కులాలైన చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్ల, గొల్ల, గౌడ లాంటి వారి వెట్టి మామూళ్లు రద్దు చేసుకున్నారు. ప్రజా పంచాయితీలు నిర్వహించి రకరకాలుగా ఇదివరకు వసూళ్లు చేసిన దండగలు వాపస్ తీసుకున్నారు.
***
బలర్షా నుండి ఖాజీపేటకు వెళ్లే రైలు కట్టకు అటు ఇటుగా విస్తరించి ఉన్న గ్రామాలు అటు పెద్దపల్లి తాలూకాలో గానీ, ఇటు జగిత్యాల తాలూకాలో గానీ దారులు లేక క్రూరమైన దొర పాలనలో ఉండేవి.
జగిత్యాల తాలూకాలోని మద్దునూరు, లొత్తునూరు, చినమెట్టుపల్లి, పెద్దపల్లి తాలూకాలోని రాఘనీడు, కుక్కల గూడూరు ఇసంపేట, పొట్యాల, ఖిలా వనపర్తి, మంథని తాలూకాలోని కన్నాల, పుట్టపాక, రామయ్యపల్లె లాంటి గ్రామాలు అనేక పోరాటాలు చేశాయి.
దాదాపు 180 గ్రామాల ప్రజలు సుమారు యాభై వేలమందితో కలిపి 7 సెప్టెంబర్ 1978 జగిత్యాలలో జైత్రయాత్ర జరిగింది. ఇది కరీంనగర్- ఆదిలాబాదు పోరాటాల్లో ఒక మూలమలుపు.
ఆ తరువాత అదే నెల మధ్యలో చినమెట్టుపల్లి దొర తన గూండాలతో దాడిచేసి 15 ఇండ్లు కూలగొట్టి పది మందిని కిడ్నాప్ చేసి తన గడీలో దాచాడు. దాదాపు 1000మంది రైతుకూలీలు, రైతులు గడీని చుట్టుముట్టారు. దొర మిద్దెమీదికెక్కి కాల్పులు జరిపాడు. అప్పటికే తిమ్మాపూర్(సిరిసిల్లాలో) 6 నవంబర్ 1977నాడు లక్ష్మీరాజంను, 10 నవంబర్ 1977నాడు జగిత్యాల తాలూకా కన్నాపురంలో పోశెట్టిని దొరలు గూండాలు చంపారు. మద్దునూరులో ప్రజాకంటకులను ప్రజలు చంపారు. 20 జులై 1978న ఆరు గ్రామాల ప్రజలు ఐదు వందల బండ్లు కట్టుకొని మద్దునూరు దొర ఆక్రమించిన అడివిన నరికి తమ అవసరాలకు కర్ర తీసుకుపోయారు. లొత్తునూరు భూస్వామి, అతని కొడుకు లొత్తునూరు- సిరికొండ ప్రజలను పీల్చి పిప్పి చేసిండ్రు. దండుగలు, వెట్టి, దౌర్జన్యం వాళ్ల నీతి. రైతుకూలీ సంఘం నాయకత్వంలో కూలీ రేట్లు పెరగాలని, తీసుకున్న దండుగలు వాపస్ ఇవ్వాలని ప్రజలు సమ్మె చేశారు. సమ్మె నడుస్తుండగానే దొరలను సాంఘిక బహిష్కారం చేశారు. చాలా రోజులు పనులు బందు. చివరకు 26 సెప్టెంబర్ 1978 దండుగలు వాపస్ ఇస్తామని గ్రామస్తులను జమ కమ్మన్నారు. అటు దొర పోలీసులను కూడా పిలిచాడు. పోలీసులు వచ్చీ రావడంతోనే కాల్పులు జరిపారు. వ్యవసాయ కూలీ పేద దళితుడు పోచాలు ఆ కాల్పుల్లో చనిపోయాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఆరు గ్రామాల నుండి నాలుగు వందల మంది మీద కేసు బనాయించారు. వందమంది యువకులను జైల్లో పెట్టారు. ప్రజలు అడవుల్లో, గుట్టల్లోకి పోయి రక్షణ చేసుకున్నారు. రేడియోలో “ఉగ్రవాదులు ప్రజల నుండి డబ్బు గుంజుకుంటుండగా లాఠీచార్జి కూడా చేసినా ఫలితం లేక కాల్పులు జరిపాము” అని ప్రకటించారు.
ఇవి మచ్చుకు కొన్ని ఘటనలు. వీటన్నిటి తరువాత జగిత్యాల జైత్రయాత్ర తరువాత కార్యకర్తల హత్యలు మొదలు కావడంతో కార్యకర్తలు రహస్యంగా తిరగడం ఆరంభించారు. ఒకరికి ఇద్దరు అనుచరుల చొప్పున గ్రామాలల్లో తిరిగేవారు. మొత్తంగా జగిత్యాల, సిరిసిల్లాలో భూస్వాములు తమంత తాము ఎదుర్కొనే పరిస్థితి దాటిపోయింది.
సుమారు 72 మంది భూస్వాములు అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని కలిసి మొర పెట్టుకున్నారు. ఫలితంగా అక్టోబర్ 1978లో కల్లోల ప్రాంతాల చట్టం జగిత్యాల, సిరిసిల్లా తాలూకాల పరిధిలో అమలులోకి తెచ్చారు. అప్పటికే పోరాట ప్రాంతాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో ఉన్న పోలీసు క్యాంపులకు తోడు 20అక్టోబర్ 1978న అదనపు బలగాల రాక జరిగింది. సిరిసిల్లా, జగిత్యాల గ్రామాల్లో తీవ్రమైన నిర్భంధం, ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని గ్రామాల్లో దొరలను సాంఘిక బహిష్కారం చేశారు. కొన్ని గ్రామాల్లో క్రూరమైన దొరల గూండాలను హతమార్చారు. ఫలితంగా జగిత్యాల, సిరిసిల్లా నుండి కార్యకర్తలు రావడంతో పెద్దపల్లి, మంథని, మహాదేవపూరు, అటు గోదావరి కావల ఖానాపూర్, జన్నారం లాంటి చోట్ల కొత్తగా పోరాటాలు తీవ్రతరమయ్యాయి. అటవీ ఉద్యమానికి సంబంధించిన దారులు వెతకడం ప్రారంభమయింది. ఇది ఇంకొక మార్పు.
***
నా ఆసక్తి కొద్దీ గ్రామాల్లో తిరుగుతున్నపుడు – దాదాపు అన్ని రకాల మనుషులను కలిసేవాణ్ని. అందులో ధనిక రైతులు, మధ్య తరగతి రైతులు, పేద రైతులు ముఖ్యంగా బహుజన కులాల వారు – గోడ మీద పిల్లి లాగా ఎటు వంగైతె అటు దుంకుదామని చూసేవాళ్లు. దొరల ప్రభుత్వాల నిఘా వ్యవస్థ ఉంటుంది కనుక ఎటు పొయి ఎటొస్తదోనని కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడేవాళ్లు.
“ఔనయ్యా! కూలీ రేట్లు పెరగాలన్నది నిజమే. కానీ రైతు మొకం సుత సూడాలె.”
“ఎనుకటి రీతి రివాజు ఒక్కసారి మార్తదా?”
“దున్నెటోనికే భూమి కావాలె. – కానీ, ఉపాయంగ తెచ్చుకోవాలె.”
“ఉచ్చిలితనం జేత్తే ఉన్నది బోతది. ఉంచుకున్నది బోతది”
“ఏమైంది సూడు. మేం మొత్తుకుంటనే ఉన్నం. ఎనుకిసారం లేనోళ్లు ముందల బడితె ఈపులు సాపైనయ్. జేల్ల బడ్డరు. మీదికెల్లి అదాలత్‌లు కచ్చీర్లల్ల బడ్డరు.”
“కొండ నాలికెకు మందు బెడితె ఉన్న నాలుక బోయింది.”
రైళ్లు, బస్సులల్లనయితె దేని గురించి మాట్లాడ్తార్రో తెల్వకుంట అనేక గుంపులుగా విడిపోయి – లేశి లేశి వాదించుకుంట కొట్టుకున్నంత పనిజేసెటోళ్లు.
“ఉద్యోగస్తులు – బాగనే ఉన్నది గని పిడుక్కు బియ్యానికి కొట్లాడుడు అవసరమా? నక్సలైట్‌లు ఆవలబడ్డంక ఎట్ల బత్కుతరు? ఒక్కొక్కన్ని ఏరేరి దంచుతరు. అప్పుడు సూస్కో అందరి తమాషా.”
“తెలంగాణ సాయుధ పోరాటం గంగలకల్సి పోలేదా?
“అరే భయ్… రాజ్యాంగం ఉన్నది- లీగల్‌గ కొట్లాడాలె.”
పత్రికలు, రేడియో (అప్పటికి టీవీలు పెద్దగా రాలేదు)హంతకులు, హింసాకారులు, ఉగ్రవాదులు రకరకాల పేర్లుబెట్టి- దొరల గడీల మీద దాడులు, దొమ్మీ, దొంగతనం, హింసాత్మక సంఘటనలు లాంటి మాటలు వాడి నక్సలైట్లు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా, సిద్ధాంతం లేకుండా అరాచక పరిస్థితులు సృష్టిస్తున్నట్టుగా కథనాలు రాసేవి. అప్పటికీ దాదాపుగా పత్రికలన్నీ ఆంధ్ర ప్రాంతపు అగ్రకులాల వారివి. జర్నలిస్టులంతా దాదాపుగా అగ్రకులాల వాళ్లే.
ఎక్కువ మంది రచయితలు ప్రజా పోరాటాలను కీర్తిస్తూనే – నక్సలైట్‌ల మూలకంగా – నక్సలైట్‌లు పోలీసుల మధ్య ప్రజలు నలిగిపోతున్నట్లుగా రాసేవాళ్లు. అప్పటికీ ఇలాంటి కూతలనూ రాతలనూ ఎదుర్కోవడానికి తగిన సౌలతులు ఇంకా విప్లవోద్యమాలకు సమకూరలేదు. ప్రజల భాషలో చిన్న చిన్న కరపత్రాలు ముద్రించి పంచేవాళ్లు. అచ్చు యంత్రాలు కరువే. జిల్లా కేంద్రాల్లో తప్ప అలాంటివి దొరికేవి కాదు. రాసుడు, అచ్చుగొట్టిచ్చుడు, పంచుడు పెద్ద తతంగం. అలాంటి కరపత్రాలు ఉంచుకోవడం ప్రమాదం.
‘సృజన’, ‘క్రాంతి’ లాంటి పత్రికల్లో పోరాట వార్తలు వచ్చేవి. సృజనలో అప్పటికే నేను చాలా కథలు రాశాను. కొలిమంటుకున్నది నవల సీరియల్‌గా వచ్చింది.
అంతకుముందు అక్కడక్కడ క్రూరులైన భూస్వాములను వర్గశత్రువు నిర్మూలనలో భాగంగా ఖతం చేయడం వలన- అలాంటి కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యం అంతగా లేనందువల్ల – ఆ ఊళ్లల్లోని ప్రజలు అనేక రకాలుగా హింసించబడ్డారు. తాము చేయని హత్య కేసుల్లో జైళ్ల పాలయ్యారు. పార్టీ కార్యకలాపాల నిమిత్తం చేసిన ఆర్థిక దాడులు నక్సలైట్‌లకు వ్యతిరేకత దొరలు, పత్రికలు ప్రచారం చేశాయి. ప్రజాపంథా తీసుకొని లక్షలాది ప్రజలను పోరాటాల్లో కదిలిస్తున్నా కూడా పాత ఆచరణకు సంబంధించిన విషయాలు పదే పదే రాసేవాళ్లు.
(ఇంకా ఉంది…)
‘సృష్టికర్తలు’ కథ కింది లింక్ క్లిక్ చేసి చదవవచ్చు.