సృజ‌నాత్మ‌క‌త‌కు చేరువచేసిన విర‌సం

1970 జూలై 4 రోజువారి తేదీ కాదు. సాహిత్య రంగంలో వ‌ర్గపోరాటం ఆరంభ‌మైన రోజు. ప్ర‌జా విముక్తి రాజ‌కీయాలను ఎత్తిప‌ట్టిన ర‌చ‌యిత‌ల‌ న‌వ ప్ర‌స్థానం మొద‌లైన రోజు. ఆ ప్ర‌యాణానికి యాభై ఏండ్లు. ఓ చారిత్రక‌ అవ‌స‌రంలోంచి, సంఘ‌ర్ష‌ణ‌లోంచి ఆవిర్భ‌వించిన విర‌సం ఈ యాభై ఏండ్లలో ఎన్నో క‌ల్లోలాల‌ను, ఎన్నెన్నో ఆటుపోట్ల‌ను ఎదురీదింది. మూడు త‌రాల్లో వంద‌లాది ధిక్కార స్వ‌రాల‌ను, క‌లాల‌ను తెలుగు నేల‌కు ఇచ్చింది. వేలాది మంది ర‌చ‌యిత‌ల‌పై ప్ర‌భావం వేసింది. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల గొంతుక‌గా మారింది. నిజానికీ అక్ష‌రాలు కాదు, ఆ అక్ష‌రాల‌కు మెరుపుల‌ద్దిన ఆలోచ‌న‌లు, ఆ ఆలోచనలకు దారులేసిన‌ విప్ల‌వోద్య‌మం దాని బ‌లం. న‌క్స‌ల్బ‌రీ నుంచి శ్రీకాకుళం, తెలంగాణ మీదుగా ఇవాళ దండ‌కార‌ణ్యం దాకా విస్త‌రించిన ప్రత్యామ్నాయ రాజకీయలు దానికి స్ఫూర్తి. అందుకే… విర‌సం నక్సల్బరీకి సాంస్కృతిక ప్రతినిధిగా నిల‌బ‌డింది. సాహిత్య, మేధో రంగాల్లో భావ సంఘ‌ర్ష‌ణ‌కు కేంద్రంగా మారింది.

సాహిత్య‌రంగంలో వ‌ర్గ‌పోరాటానికి యాభై ఏండ్లు నిండిన ఈ చారిత్ర‌క సంద‌ర్భంలో ప్ర‌యాణంలోని ఆటుపోట్ల‌ను, అగాథాల‌ను, విజ‌యాల‌ను స‌మీక్షించుకోవ‌ల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ…. కొలిమి సంపాద‌కులు నాలోకి న‌న్ను చూసుకొమ్మ‌న్నారు. ర‌చ‌నా ప్ర‌మాణాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని, సాహితీ సృజ‌న జోలికే వెళ్ల‌ని నాలాంటి సాధార‌ణ కార్య‌క‌ర్త ఏం చెప్ప‌గ‌ల‌డు?

నిజ‌మే… విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం ఏనాడూ ప్ర‌మాణాల‌ను న‌మ్మ‌లేదు. సాహిత్యంలో వ‌ర్గ పోరాటాన్ని ఆరంభించిన విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల ప‌ట్ల విశ్వాసం, ప్ర‌జా ఉద్య‌మాల ప‌ట్ల ప్రేమ ఉన్న ఎంద‌రో ర‌చ‌యిత‌ల‌ను త‌న ఒడికి చేర్చుకుంది. కొత్త గొంతుక‌ల‌ను తెలుగు స‌మాజానికి అందించింది. అలా… విర‌సానికి చేరువైన వారిలో నేనూ ఒక‌డిని.

విద్యార్థి రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న కాలంలోనే సాహిత్యంతో అనుబంధం ఏర్ప‌డింది. మార్క్సిజమ‌నే శాస్త్రీయ సిద్ధాంతం న‌న్ను వ‌ర్గ పోరాట రాజ‌కీయాల వైపు న‌డిపిస్తే… ఆ ప్ర‌యాణంలో నా చూపును సాహిత్యం వైపు తిప్పుకుంది మాత్రం శ్రీశ్రీ. తొలినాళ్ల‌లో అంద‌రిలాగే మ‌హాప్ర‌స్థానాన్నిప‌దే ప‌దే చ‌దువుకునే వాణ్ణి. ఇక‌… దిగంబ‌ర క‌విత్వం అడ్డుగోడ‌ల‌ను కూల్చే ఆవేశాన్ని అందించింది. అలా క‌విత్వం వైపు మ‌ళ్లినా… ఓ కార్య‌క‌ర్త‌గా ప్ర‌జా రాజ‌కీయాల చుట్టే నా అధ్య‌య‌నం ఎక్కువ‌గా సాగింది. మ‌రో మాట‌లో చెప్పాలంటే… సృజ‌నాత్మ‌క సాహిత్యం కంటే, సీరియ‌స్ రాజ‌కీయార్థిక అంశాల చుట్టూ సాగింది. (అధ్య‌య‌నం అన‌డం కంటే, ఆ రాజ‌కీయాల్లో భాగ‌మ‌వ్వ‌డం, నిర్ధిష్ట కార్య‌క్షేత్రంలో నిల‌బ‌డ‌డానికి ప‌రిమిత‌మైంది.)

కాక‌పోతే, ముందే చెప్పిన‌ట్లు విద్యార్థి రాజ‌కీయాల్లో ఉండ‌డం వ‌ల్ల‌, విజృంభ‌ణ, విమోచ‌న‌, తెలంగాణ విద్యార్థి లాంటి ప‌త్రిక‌లు రాయాల్సిన అవ‌సరాన్ని క‌ల్పించాయి. అలా ర‌చ‌న వైపు అడుగులేయ‌కా త‌ప్ప‌లేదు. ఉక్క‌పోత నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అప్పుడ‌ప్పుడూ క‌విత్వం రాసినా, ప్ర‌ధానంగా చాలాకాలం పాటు వ్యాస ర‌చ‌నే సాగింది.

కానీ, నేను నిల‌బ‌డిన కాలం మాత్రం చాలా ఉద్వేగ‌భ‌రిత‌మైన‌ది. నెత్తురోడుతున్న నేల‌… ప్ర‌జా విముక్తి గీతాన్ని ఎత్తి పాడుతూనే ఉంది. అయినా విధ్వంస‌క‌ర అభివృద్ధిలో న‌లిగిపోతున్న శ్ర‌మ జీవుల ఆశ‌ల‌న్నీ అడ‌వి మందారాల మీదే. ఆ మందారాలు మ‌న వాకిట విర‌బూయాల‌నే ఆశ‌? ఓ ఉషోద‌యాన అదీ జ‌రిగింది. కోట్లాది మంది శ్ర‌మ జీవుల ప్ర‌తినిధులుగా స‌ర్కారుతో చ‌ర్చించేందుకు వ‌చ్చారు వాళ్లు. శాంతి చ‌ర్చ‌లు నెరిపారు. ఆ నాలుగు రోజులూ ప‌ల్లెల్లూ, ప‌ట్ట‌ణాలూ, న‌గ‌రాల నిండా మందార‌పూల వాస‌నే. అలాంటి వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డంలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల పాత్ర ఎంతో ఉంది. ఈ వాతావ‌ర‌ణంలో ఎక్క‌డో గ‌జిబిజిగా తిరుగుతున్న నేను తెలియ‌కుండానే విర‌సానికి ద‌గ్గ‌ర‌య్యాను. వాళ్ల‌కు తెలీయ‌కుండానే వీవీ, జీకేలు వేసిన ప్ర‌భావం అందుకు కార‌ణం ఒక కార‌ణ‌మైతే… ప్ర‌త్య‌క్షంగా న‌న్ను విర‌సానికి ద‌గ్గ‌ర చేసింది మాత్రం కాశీం. అప్ప‌టికే తాను రాసిన‌ నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, గుత్తికొండ ధీర్ఘ‌క‌విత న‌న్ను విర‌సం వైపు న‌డిచేలా చేశాయి.

2005 విశాఖ విర‌సం సాహిత్య పాఠ‌శాల‌లో పాల్గొన‌డంతో ఒక‌ర‌కంగా తొలిసారి సాహిత్య ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించిన‌ట్లయ్యింది. స‌రిగ్గా స‌భ‌లు జ‌రుగుతుండ‌గానే దూర తీరాల నుంచి అమ‌ర‌త్వ‌పు వార్త ఒక‌టి. శాంతి చ‌ర్చ‌ల సంద‌ర్భంగా చేసుకున్న కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడిచి ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా ఆరంభించిన యుద్ధంలో అప్ప‌టికే చైత‌న్య మ‌హిళా సంఘం స‌భ్యురాలు ల‌క్ష్మీ అమ‌రురాలైంది. ఈ క్ర‌మం ఏకంగా శాంతి చ‌ర్చ‌ల ప్ర‌తినిధినే హ‌త్య చేసేవ‌ర‌కు వెళ్లింది. శాంతి చ‌ర్చ‌ల్లో విప్ల‌వోద్య‌మం త‌రుపున ప్ర‌తినిధిగా పాల్గొన్న రియాజ్ అమ‌ర‌త్వం ఒక చేదు నిజం లాంటింది. అంత సుల‌భంగా జీర్ణించుకోవ‌డం వ‌ల్ల‌కాలేదు. ఇలాంటి బ‌రువైన స‌మ‌యాల‌న్నీ క‌విత్వంలో క‌రిగిపోయేవి. దుఃఖం పొగిలిన‌ప్పుడ‌ల్లా క‌విత్వాన్ని ఆశ్ర‌యించ‌డం అల‌వాట‌య్యింది. ఈ స్థితిలో… 2005 ఆగస్టులో విర‌సంపై నిషేధం విధించ‌డం, నిషేధం ఎత్తివేసిన త‌రువాత హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌భ‌లు ఎటికి ఎదురీదుతున్న సాహిత్య సంస్థ‌పై ఎన‌లేని ప్రేమ‌ను క‌లిగించాయి.

ఈ నేప‌థ్యంలోంచి, నాకున్న కొద్దిపాటి సాహిత్య ప‌రిచ‌యంతో 2008 జ‌న‌వ‌రి 5, 6 తేదీల్లో గుంటూరులో జ‌రిగిన 21వ మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా నేను విరసం స‌భ్య‌త్వం తీసుకున్నాను. అప్ప‌టి వ‌ర‌కు విద్యార్థి, ఇత‌ర రాజ‌కీయ రంగాలు కేంద్రంగా ఉండిన నా కార్య‌క్షేత్రం 2010 త‌రువాత పూర్తిగా సాహిత్య రంగం వైపు మ‌ళ్లింది.

అక్క‌డి నుంచి మ‌రో కొత్త ప్ర‌యాణం మొద‌లైంద‌నే చెప్పాలి. ఈ ప్ర‌యాణంలో విర‌సం నాకు కొత్త చూపునిచ్చింది. సృజ‌నాత్మ‌క‌త‌కు చేరువ చేసింది. చ‌రిత్ర‌ను, వ‌ర్త‌మానాన్ని హేతుబ‌ద్ధంగా అర్థం చేసుకునేందుకు విర‌సం అందించిన అవ‌గాహ‌న నిశిత‌మైన‌ది. స‌మాజంలోని వైరుద్యాలను అర్థం చేసుకునే ప్ర‌య‌త్నంలో విర‌సం ఒక దారిదీపంలా నిల‌బ‌డింది. విర‌సం విశ్వ‌సిస్తూ, ఆచ‌రిస్తున్న రాజ‌కీయాల శ‌క్తి అది. ఆ దారిలో ఎదురుప‌డ్డ ప్ర‌తి శ్ర‌మ‌జీవినీ ప‌ల‌క‌రించ‌డం నేర్పింది. ధిక్కార స్వ‌రంతో గొంతుక‌ల‌పడం నేర్పింది. పోరాడే ప్ర‌జ‌ల‌కు నైతిక మ‌ద్ద‌తునివ్వ‌డం బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం. ఆ క‌ర్త‌వ్యాన్ని విర‌సం యాభై ఏండ్లు నిర్వ‌ర్తిస్తోంది. వ‌ర్గ‌పోరాట రాజ‌కీయాలే గీటురాయిగా సాగుతున్న విర‌సం రాసే ప్ర‌తి అక్ష‌ర‌మూ ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డాల‌నే స్పృహనందించ‌డ‌మే కాదు… విముక్తిపై విశ్వాసాన్నీ అచంచ‌లంగా పెంచింది. విర‌సం స‌భ్యుడిగా నేను చేసే ప్ర‌తి ర‌చ‌న‌కు హేతువుగా నిలుస్తున్న‌దీ వ‌ర్గ పోరాట రాజ‌కీయాలే.

క‌ల్లోలానికి గురిచేసే కాల‌మైనా స‌రే, భావోద్వేగాల మీద ఆధార‌ప‌డి కాకుండా, హేతుబ‌ద్ధంగా ఆలోచించి రాయడం నేర్పింది విర‌సం. ప్ర‌జా ఉద్య‌మాల గొంతుక‌గా ఎన్నెన్నో సంక్షోభాల‌ను ఎదురీదిన విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం… ప్ర‌తిఘాతుక ఆందోళ‌నల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పాటు నికార్సైన విమ‌ర్శ‌ను స‌మాజం ముందుంచింది. ఈ నికార్సైన వైఖ‌రే విర‌సం కొత్త‌త‌రానికి అందిస్తున్న నెత్తురు.

ప్ర‌జా పోరాటాల‌ను అక్ష‌రీక‌రించ‌డంలో విర‌సం మ‌రే సంస్థా చేయ‌ని కృషి చేసింది. ఒక ధిక్కార ప‌రంప‌ర‌ను కొన‌సాగించింది. అనేకానేక అస్థిత్వ ఉద్య‌మాల‌పైనా విర‌సం చెర‌గ‌ని ప్ర‌భావాన్ని వేసింది. సృజ‌న‌కారుడెప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్ష‌మే అని నిర్ధ్వంధంగా ప్ర‌క‌టించి, ఆచ‌రిస్తున్న‌విర‌సం ఒక్క తెలుగు నేల‌పైనే కాదు మొత్తం దేశం మీద త‌న ప్ర‌భావాన్ని వేయ‌గ‌లిగింది. ఈ క్ర‌మంలో ఎన్నో సంక్షోభాల‌ను చ‌విచూసింది. ఎన్నెన్నో విమ‌ర్శ‌ల‌నూ ఎదుర్కొంది. తొలి నుంచీ విప్ల‌వోద్య‌మంపై వినిపించే విమ‌ర్శ‌ల్లో అహేతుక‌తే ప్ర‌ధానంగా క‌నిపిస్తుంది. అయినా… వాటి ప‌ట్ల ఏనాడూ విర‌సం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. సాహిత్య ప్ర‌మాణాలు న‌మ్మ‌ని విర‌సం… ఈ ఐదు ద‌శాబ్దాల‌లో అనిత‌ర సాధ్య‌మ‌నిపించే విస్తృతిని సాధించింది. యాభై ఏండ్ల సంద‌ర్భంగా వాటిని స‌మీక్షించుకోవ‌ల్సి అవ‌స‌రం ఎంతైనా ఉంది. విప్ల‌వ సాహిత్య‌మ‌న‌గానే సృజ‌నాత్మ‌క‌త క‌రువ‌ని మాట్లాడే విమ‌ర్శ‌కులు గ‌త ఇర‌వై ఏండ్ల‌లో వ‌చ్చిన విప్ల‌వ సాహిత్యాన్ని ప‌రికిస్తే… సృజ‌నాత్మ‌క‌త ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతుంది.

విప్ల‌వ‌మంటే అత్యంత ప్రేమ‌మ‌య‌మైంద‌ని, మాన‌వ స‌మాజ విముక్తికోసం సాగే యుద్ధం అత్యంత ఆర్థ్ర‌త‌తో కూడింద‌ని విప్ల‌వ సాహిత్యమే అర్థం చేయించింది. స‌మాజంలోని అట్ట‌డుగు స‌మూహాల ప‌ట్ల సానుభూతితో కాకుండా స‌హానుభూతితో స్పందించ‌డం నేర్పించింది. నూత‌న వ్య‌వ‌స్థ నిర్మాణం కోసం సాగుతున్న‌ ప్ర‌త్యామ్నాయ పంథాలో మ‌మేక‌మ‌య్యే స్పృహ‌నూ విర‌సం ఇచ్చింది. ఈ ప‌దేళ్ల కాలంలో నేనో నిత్య విద్యార్థిని.

ఈ ప‌దేళ్ల కాలంలో నేనో నిత్య విద్యార్థిని. ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా, సాహిత్యంలో ఓన‌మాలు దిద్దుతున్న వ్య‌క్తిగా త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రంలోంచి రాస్తున్న నాకు… రాసే అక్ష‌రం మోయాల్సిన బాధ్య‌త‌ను అర్థం చేయించింది విర‌సం. అక్ష‌రం పాల‌కుల పాద‌సేవ‌లో మునిగిపోయిన‌ప్పుడు, అక్ష‌రం కార్పోరేట్ కబంధ హ‌స్తాల్లో చిక్కుకున్న‌ప్పుడు ప్ర‌జా పోరాటాల‌ను ఎత్తిప‌ట్టే బాధ్య‌త‌ను విర‌సం ఎత్తుకుంది. ఆ స్పృహే న‌న్ను న‌డిపిస్తుంది. అరుణ‌తార కోస‌మో, విర‌సం ఆన్‌లైన్ మ్యాగ‌జైన్‌ కోస‌మో, న‌డుస్తున్న తెలంగాణ కోస‌మో రాస్తున్న ప్ర‌తీదీ, మెజార్టీవాదం ద‌బాయింపుల‌కు జ‌డ‌వ‌కుండా రాయ‌డం ఎలాగో నేర్పింది. ర‌చ‌యిత‌గా నిత్యంగా నాలోకి నేను తొంగిచూసుకోవ‌డం, నిస్సంకోచంగా పునస్స‌మీక్షించుకోవ‌డం నేర్పింది.

యాభై ఏండ్ల ప్ర‌యాణంలో విర‌సం ఎన్నో నిర్బంధాల‌ను ఎదురీదింది. క‌విత్వం, క‌థ‌, న‌వ‌ల‌, విమ‌ర్శ ఇలా అన్ని ప్ర‌క్రియ‌ల్లో ప్ర‌జా రాజ‌కీయాల‌ను ఎత్తిప‌ట్టిన విర‌సం స‌భ్యులెంద‌రో బందీఖానాకు నేస్తుల‌య్యారు. రాజ్యానికి నిజ‌మైన ప్ర‌తిప‌క్షంగా నిల‌బ‌డిన విర‌సం నేటికీ చీక‌టి కాలాన్ని స‌వాల్ చేస్తూనే ఉంది. ప్ర‌జ‌ల కోసం చిరున‌వ్వుతో చెర‌సాలతో స్నేహం చేయ‌గ‌ల ధైర్యాన్ని విర‌సం ఇచ్చింది. 80 ఏండ్ల వ‌య‌సులో కూడా న‌మ్మిన రాజ‌కీయాల కోసం జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్న వీవీ ఒక స‌జీవ ఉదాహ‌ర‌ణ‌.

ఇలాంటి ధిక్కార స్వ‌రాలు, ఆ స్వ‌రాల‌కు బ‌లాన్నిస్తున్న విప్ల‌వ‌ రాజ‌కీయాలే న‌న్నూ, నా ర‌చ‌న‌నూ నిల‌బెడుతున్నాయి. స‌రిదిద్దుతున్నాయి. అందుకే… నిత్యం ప్ర‌జా పోరాటాల నుంచి నేర్చుకుంటూ, కొత్త త‌రానికి నూత‌న ఉత్తేజాన్ని అందిస్తున్న విర‌సం దారి అజ‌రామ‌రం.

పుట్టింది న‌ల్ల‌గొండ జిల్లా న‌క్రేక‌ల్‌. పాత్రికేయుడు. విర‌సం స‌భ్యుడు. రచనలు: క‌ల‌త నిద్దురలో (క‌వితా సంక‌ల‌నం), అన‌గ‌న‌గా అడ‌విలో - హిడ్మే మ‌రికొంద‌రు (వ్యాస సంక‌ల‌నం).

Leave a Reply