సృజన

నేను దారి తప్పిపోయాను
మనసు శరీరం కలిసే
లోతైన భావాల లోయలో
నేను దారి తప్పిపోయాను

నేనొక కలనే కన్నాను
మెలకువ నిద్ర కానీ రేయిలో
కంటిరెప్పలే దాటని
కలనే నే కన్నాను

నేనొక పాటనే అల్లాను
పదము పెదవి పలకని రాగంలో
మనసుకే వినిపించే
మౌనగానంతో
నిండిన పాటనే నేనొకటి అల్లాను

నేనొక కవనమే రాశాను
కలం సిరా కలిసి రాయని
అక్షరాలతో
కంటికి కనపడని లక్షణాలతో
గుండె కాగితంపై దట్టంగా
నేనొక కవనమే రాశాను

నేనొక చిత్రమే గీశాను
అన్ని రంగులను కలిపి
నలుపురంగు గా మార్చి
మనిషిలోని చీకటిలోతుల్ని కొలిచే
చిత్రమే నేనొకటి గీశాను

నేను కన్న కలలన్నీ
నేను సృష్టించిన కళలన్నీ
కల్లలుగా రాలిన వేళ ..
గుండె చెమ్మ
కంటి జల్లులుగా
కురిసిన వర్షపు హేల
నా శోకవు దారంతో అల్లుకున్న
ఈ కవితా చిత్రాల అక్షరమాల…

ఊరు హన్మకొండ. రచయిత్రి, కవయిత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్.  ఎకనమిక్స్ లో డాక్టరేట్. కలంపేరు శ్రావణసంధ్య. దాదాపు 1500 కవితలు,  యాభై కథలు, ఇరవై వ్యాసాలు, వంద పాటలు,  రెండు వందల మినీ కవితలు రాశారు. కొద్దిరోజుల్లో రెండు పుస్తకాలు రానున్నాయి.

 

 

Leave a Reply