సృజనాత్మక విశ్లేషణ

సాహిత్యాన్ని అంచనా కట్టడానికి ప్రారంభం నుంచే కొన్ని ప్రమాణాలు న్నాయి. ఆ ప్రమాణాలతో రూపొందినదే సాహిత్య శాస్త్రం. శాస్త్రం అంటున్నామంటే నియమబద్ధ పరికరాలని అర్థం. వాటి ఆధారంగానే వ్యాఖ్యాన పద్ధతి రూపొందుతుంది. వ్యాకరణ శాస్త్రం, ఛందశ్శాస్త్రం, అలంకార శాస్త్రం… ఈ మూడింటిని కలిపి సాహిత్యశాస్త్రం అంటున్నాం. పద్య రచన మొదలైనప్పటి నుంచే కవులు ఈ పద్ధతిని పాటించారు. ఆ కాలంలో సాహిత్యానికి వ్యాఖ్యానం ఉండేది. విశ్లేషణకు అవకాశం తక్కువ. కవిత్వాన్ని వ్యాఖ్యానించడానికి అలంకార శాస్త్రం ముఖ్యమైన ప్రమాణంగా ఉండేది. రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం పాఠకుల కోణాన్ని ఆవిష్కరిస్తే ఛందశ్శాస్త్రం కవి ప్రతిభను వివరించేది. కనుక ఎవరైనా సరే సాహిత్యాన్ని సమీక్షించాలంటే రూపొందిన ఈ ప్రమేయాలను ఆధారం చేసుకొనవలసినదే. కనుక సాహిత్య విశ్లేషణలో శుద్ధ శాస్త్రబద్ధ విషయాలే ఉండేవి.

ఆధునిక కాలంలో ఆంగ్ల సాహిత్య సంపర్కం వలన విమర్శ అనే భావన తెలుగు సాహిత్య ప్రక్రియలలో స్థిరపడింది. అయితే విమర్శను ప్రారంభంలో చేపట్టిన వారంతా సాహిత్య శాస్త్ర నేపథ్యం నుంచి వచ్చిన పండితులే. కనుక విమర్శను సృజనాత్మక కార్యకలాపంగా కాకుండా శాస్త్రబద్ధ విషయంగానే పరిగణించారు. ఆంగ్ల సాహిత్యంలో విమర్శను చేపట్టి నిర్వహించిన వాళ్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ తెలుగు సాహిత్యానికి ఉండే పరిమితి వలన విమర్శ నిర్మాణం విస్తృతం కాలేదు. చివరికి కొందరి ‘ఆర్ష విజ్ఞానులకే’ పరిమితమయింది. పాఠకులను విస్మరించిన విమర్శ సూత్రంగానే కొనసాగుతుంది. తెలుగు సాహిత్యంలో పాఠక కేంద్రకంగా విమర్శను విస్తరించడానికి ఇప్పటికీ అనేక పరిమితులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో విమర్శను, విశ్లేషణను సృజనాత్మకం చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏ ప్రక్రియ అయినా రచయిత చేపట్టాక అది సృజన రూపం పొందవలసినదే. సాహిత్య రచననే దానికదిగా సృజనాత్మక కార్యకలాపం. సాహిత్య వస్తువును, శిల్పాన్ని విశ్లేషించే సందర్భంలో మొరటుదనం ఉండకూడదు. సున్నితత్వం పొందినప్పుడే సాహిత్యంగా మారుతుంది.

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు కందుకూరి వీరేశలింగం అనుకుంటే ఆయన విమర్శ ప్రక్రియను చేపట్టి నిర్వహించిన పద్ధతి శాస్త్రబద్ధమైనదే తప్ప సృజనాత్మకమయినది కాదు. ఆ తర్వాత ‘కవిత్వతత్త్వ విచారము’ పేరుతో విమర్శను చేపట్టిన కట్టమంచి రామలింగారెడ్డి పూర్వపు నియమాల నుంచి విమర్శను కొంత వేరుచేసే ప్రయత్నం చేశారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కూడా పూర్తిగా మార్గపద్ధతిని విడనాడలేకపోయాడు. తెలుగు సాహిత్యానికి మార్క్సిజం పరిచయమయ్యాక విమర్శ నిర్వహణలో మార్పు వచ్చింది. అది సృజనాత్మక ప్రక్రియగా వికసించడానికి మార్క్సిస్టు మెథడాలజీ దోహదం చేసింది. అయితే రాచమల్లు రామచంద్రారెడ్డి కూడా విమర్శను ఎక్కువగా శాస్త్రబద్ధ విషయంగానే భావించాడు. విమర్శను సృజనాత్మక కోణంలో భావించిన వాడు ఆ కాలంలో శ్రీశ్రీ ఒక్కడే. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల కోణంలో సాహిత్యాన్ని విశ్లేషించే సంవిధానం రూపొందాక విమర్శలో సృజనాత్మకత ప్రవేశించిందని చెప్పవచ్చు. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో త్రిపురనేని మధుసూదనరావు, దళిత సాహిత్య విమర్శలో జి.లక్ష్మీనరసయ్య, స్త్రీవాద విమర్శలో ఓల్గా సాహిత్య విమర్శను సృజనాత్మకం చేయడానికి ప్రయత్నం చేశారు.

‘సాహిత్య విమర్శ మేధో సంబంధమయినది’ అనే మాటను అంగీకరించడానికి మినహాయింపులు ఉండకపోవచ్చు. కానీ దానినొక మొరటు రచనా ప్రక్రియగా మార్చిన వారి విషయంలోనే పేచీ ఉంది. నిజానికి ఏ సాహిత్య రూపమైనా కొరకరాని కొయ్యగా ఉండడానికి వీలు లేదు. సాహిత్యమంటేనే సౌందర్యాత్మకమయినదని అర్థం. భావుకతతో కూడినదని కొత్తగా చెప్పనవసరం లేదు. సాహిత్య విమర్శ దీనికి మినహాయింపేమీ కాదు. ప్రతీ సాహిత్య ప్రక్రియకు ప్రత్యేకమైన సంవిధానం ఉంటుంది. దాని వ్యక్తీకరణలో కొంత భాషా నిర్మాణం కూడా రూపొందుతుంది. పద్య కవిత్వం నుంచి ఆ మాటకొస్తే మౌఖిక కవిత్వం నుంచి ఎదిగిన లిఖిత కవిత్వం కొత్త డిక్షన్‌ను రూపొందించుకున్నది. పండితులు పద్య కవిత్వం చుట్టూ కేంద్రీకృతమయ్యారు. పాండిత్య పరిభాషలోనే పద్య కవిత్వం వ్యక్తమయింది. దానికొక నిఘంటువు రూపొందింది. పద్య శిల్పంలో వాడిన భాష కూడా కొన్నాళ్లకు పాతబడిరది. దీనిని గుర్తించిన ఆధునిక గేయ, వచన కవులు కొత్త పదబంధాలతో, నిర్మాణంతో కవితా సృజనను కొనసాగించారు. కవిత్వాన్ని మరింత నూతనంగా, లేతగా సృజనాత్మకం చేశారు. ఉత్పత్తి కులాల భాష, వ్యక్తీకరణ నైపుణ్యాలు కవిత్వంలోకి ప్రవేశించడమే ఈ మార్పుకు కారణం. కానీ సాహిత్య విమర్శ అలంకార శాస్త్రం బొడ్డుపేగు తెంచుకోవడానికి చాలా సమయం పట్టింది. అది ఇంకా సహృదయ పాఠకుల వద్దనే ఆగిపోయింది. భాషలో కూడా సరళత్వం, సూటిదనాన్ని సొంతం చేసుకోలేని పరిమితికి గురైంది. కారణమేమిటంటే సాహిత్య విమర్శలోకి ఉత్పత్తి వర్గాలు ప్రవేశించకపోవడమేనని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే సాహిత్య విమర్శ సృజనాత్మకంగా రూపొందడానికి ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటుంది.

ఈ నేపథ్యంలో ఈ తరం సాహిత్య విమర్శకులు విమర్శను సృజనాత్మకం చేయడానికి కృషిచేస్తున్నారు. కొత్త వ్యక్తీకరణతో ఫ్రెష్‌గా రాస్తున్నారు. అందులో శివరాత్రి సుధాకర్‌ మొదటి వరుసలో ఉన్నాడు. శివరాత్రి వెలుగుల ప్రపంచాన్ని స్వప్నిస్తున్నాడు. చీకటి బతుకుల్లో వెన్నెల కురువాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వయంగా భావుకుడు. మోదుగు పువ్వుల్లో విరజిమ్మే మకరందం లాంటివాడు. నీరెండ పొలుపులో గడ్డిపూల మైదానం మీద మెరుస్తున్న నీటి బిందువు లాంటి స్వభావి. నాగటి కర్రును తోసుకొని భూమికి ఎరుపు రంగును తొడిగిన ఆరుద్రపువ్వులను ప్రేమిస్తాడు. పాలపిట్టను, గోరువంకను, తుమ్మెద మోతలను తన బీభత్స జీవితంలో భాగం చేసుకొని, రాళ్ల సందుల్లో నుంచి పూస్తున్న పువ్వులా తానే ఒక రాగమవుతాడు. అద్దమరాతిరి భూమి పొత్తిలిలో రాలిన నెత్తురు సూర్యోదయానికి ప్రశ్నలా మొలిచినప్పుడు తాను ఒక మొక్కనే. ఎడారి జీవితాలలో బ్రహ్మజెముళ్ల బృందావనం కోసం పరుగెత్తి శిశిర దారుల్లో వసంతాన్ని కలగంటున్నాడు. బాల్యమే ఒక యుద్ధమైనప్పుడు యుద్ధతంత్రం తప్ప మరో పాఠం వినే అవకాశం లేదు. కూలిన గోడలు, దగ్ధమైన ఇంటి కప్పు, ఎడారైన పంట పొలం, తండ్రి అజ్ఞాతవాసం, తల్లి ఒంటరి శోకం, తోబుట్టువుల అమాయకత్వం… జీవితం ఎట్లా నడిపిస్తే అలా పరుగెత్తాడు. రాపిడి పడిన ఈ జీవితమే సుధాకర్‌ను కవిని చేసింది. కథకుడిగా మలిచింది. విమర్శకుడిగా నిలబెట్టింది. ఇదిగో ఇలాంటి విలువైన జీవితం నుంచే కొత్త పాటను ఎత్తుకున్నాడు. డిక్షన్‌ రూపొందించుకున్నాడు. బండను పగలజీరి దానికొక ఆకృతిని ఇచ్చినట్లే సాహిత్య విమర్శ గురించి ఆలోచిస్తున్నాడు. తాను చదివిన సాహిత్యాన్ని తనదైన కోణంలో విశ్లేషణకు పూనుకున్నాడు.

సుధాకర్‌ కొత్తగా ఆలోచిస్తాడు. లోతుగా అన్వేషిస్తాడు. తనకు ఇష్టమనిపిస్తే చేజిక్కే వరకు సంతృప్తి చెందడు. అభిప్రాయాలను దాచుకొని వ్యక్తమయ్యే స్వభావి కాదు. తడబాటు లేకుండా వ్యక్తం కావడం నేర్చుకున్నాడు. నిర్భయంగా సంవాదంలోకి దిగుతాడు. ఈ లక్షణాలే ఆయనలో పరిశోధకుడిని తట్టి లేపాయి. మధ్య మధ్యలో రుతువుల్లాంటి అవాంతరాలు వస్తుంటాయి. కొంత కాలం మౌనంగా ఉంటాడు. సామాజిక సంభాషణకు పరిమితులు విధించుకుంటాడు. వెంటనే తేరుకొని ఆగిపోయిన చోటు నుంచి పని ప్రారంభిస్తాడు. పూర్తయ్యే వరకు విరామం ఉండదు. అందుకే తాను ఎంచుకున్న ‘విప్లవ కవిత్వంలో వస్తురూప వైవిధ్యం’ అనే సారవంతమైన పరిశోధనను పరిపూర్తి చేశాడు. బహుశా ఈ అంశం మీద ఇప్పటి వరకు క్రమపద్ధతిలో విశ్లేషణ చేసినవాళ్లు లేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అతడు పరిశోధన చేస్తున్న సమయంలోనే సమాంతరంగా రచనా కృషిని మొదలుపెట్టాడు. విశ్లేషణాత్మక వ్యాసాలు రాశాడు. సాహిత్యం మీద తన అభిప్రాయాలను ప్రకటించాడు.
సుధాకర్‌ అదాటుగా రాయడం కాకుండా ఆలోచించి సాహిత్య రూపంలో వ్యక్తమవుతాడు. సృజనాత్మక భాష మీద ఆయనకు సాధికారత ఉంది. కనుక తన విశ్లేషణను సృజనాత్మకం చేయడం కోసం ప్రయత్నించాడు. కవి, కథకులు, విమర్శకులు… ఎవరైనా తమ సామాజిక నేపథ్యం నుంచి సాహిత్యంలో వ్యక్తమవుతారనే ఎరుక సుధాకర్‌కు ఉంది. ఆయన రాసిన వ్యాసాలలో ఎంపిక చేసుకున్న భాష ప్రత్యేకంగా ఉంది. అనుసరణనో, అనుకరణనో కాకుండా తనదైన ప్రత్యేక ముద్రతో విమర్శా ప్రక్రియను చేపట్టాడు. కావ్యగత విషయాలను చెప్పడానికి దాని నిర్మాణ రహస్యం తెలిసి ఉండాలి. ఆ దినుసు సుధాకర్‌ వ్యాసాలలో మనకు ప్రత్యక్షమవుతుంది. కవిత్వాన్ని విశ్లేషించడానికి కవితా భాషను, కథను వివరించడానికి కథన శైలి, విమర్శను పరిశీలించడానికి వివేచనాత్మక భాషను రూపొందించుకొని ఈ విశ్లేషణకు పూనుకున్నాడు. భాష, పరికరాలు, శైలి ఈ మూడిరటి మధ్య అతడు సాధించిన సమన్వయం వలన ఒక సారవంతమైన సంభాషణ నడిచింది.

ఒక రచయితనో, వారి రచననో విశ్లేషించడానికి ఒక్కో విమర్శకుడికి ఒక శైలి ఉంటుంది. విశ్లేషించిన రచయితల పేరు లేకపోయినా ఆ విశ్లేషకుడిని గుర్తుపట్టేలా శైలి పాఠకుల మీద ముద్రవేస్తుంది. ఈ ప్రతిభను విమర్శకులు అభ్యాసం వలన సాధిస్తారు. సుధాకర్‌ కూడా తనకంటూ ఒక శైలిని అభ్యసించాడని ఈ వ్యాసాలను చదివితే అర్థమవుతుంది. ఆయనది కవితా శైలి. కవిత్వానికి మాత్రమే పరిమితమయ్యే ఈ శైలి, వ్యాసాలలో ముఖ్యంగా విమర్శకు ఒప్పుతుందా? అనే ప్రశ్న ఉదయించవచ్చు. కవితాత్మకంగా విమర్శ ఎందుకు రాయకూడదనే ప్రశ్న దాని వెంటనే ఉంటుంది కదా? శైలి ప్రమాణాలు ఎవరు నిర్ణయించారు? అనే చర్చలోకి దిగితే సామాజిక విమర్శలోకి ప్రవేశించవలసి వస్తుంది. శ్రీశ్రీ కవిత్వం ద్వారానే విమర్శను నిర్వహించాడని చెప్పడంలో సత్యమే ఉంది. అంతెందుకు… నన్నయ నుంచి మొదలు శ్రీశ్రీ వరకు తమ కవితా లక్షణాలను వారే వింగడిరచారు. పూర్వం సంస్కృత కవులందరికి కావ్య విశ్లేషణకు కవిత్వమే ఆధారం. ఎప్పుడైతే శైలిలో సౌందర్యాత్మకత ఉంటుందో విమర్శా శిల్పం సృజనాత్మకంగా మారుతుంది. కనుక సుధాకర్‌ కవితా శైలిని ఎన్నుకోవడం వలన విమర్శను సృజనాత్మక కార్యకలాపంగా రూపు కట్టడానికి ప్రయత్నం చేశాడు.

ఇతడి విమర్శలో మరో ముఖ్యమైన విషయం కవి నేపథ్య విమర్శ. కవి, రచయిత నేపథ్యాన్ని పాఠకులకు అర్థంచేయిస్తే రచన సులభంగా అర్థమవుతుంది. ఇలాంటి విశ్లేషణ కొందరే చేస్తారు. ఈ విమర్శా పద్ధతిని విస్తృతం చేయవలసి ఉంది. ఈనాడు రచనా రంగంలోకి ప్రవేశించిన వారంతా ఎలాంటి పూర్వ సామాజిక నేపథ్యం లేనివాళ్లు. కనుక పాఠకులు వెంటనే వారి రచనకు కనెక్ట్‌ కాలేరు. అందుకే నేపథ్య విమర్శ అవసరంగా ఉంటుంది.

శ్రీరామ్‌ పుప్పాల ‘1818’ అనే దీర్ఘ కవిత రాశాడు. దాని మీద సుధాకర్‌ చేసిన విశ్లేషణ విలువైనది. ‘‘దేశమే జైలైపోయిన సందర్భమిది. ఇట్లాంటి ఫాసిస్టు సందర్భాన్ని శ్రీరామ్‌ లోతుగా అర్థం చేసుకున్నాడు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని ఎదుర్కొనే శక్తులతో గొంతు కలిపాడు. అతణ్ని కోరేగావ్‌ రణస్థలి ఆలోచింపజేసింది. భీమా నదీ ప్రవాహంలోకి నడిపించింది. ఆ ప్రవాహంలో పారిన నెత్తుటిని అక్షరాల్లోకి ఒంపాడు శ్రీరామ్‌’’ ఈ విశ్లేషణలో సుధాకర్‌ రెండు పనులు చేశాడు. ఒకటి: కవి సైద్ధాంతిక అవగాహనను, రెండు: విశ్లేషణలో పాటించిన కవితా శైలిని పాఠకుల ముందుంచాడు. కవిని అర్థం చేసుకోవడానికి పుస్తకం ఆసాంతం చదువవలసిన అవసరం లేదు. సుధాకర్‌ కవి మీద చేసిన అంచనా చదివితే తెలిసిపోతుంది. ఏ విమర్శకుడైనా చేయవలసింది ఇదే. తలకిందులైన చరిత్రను అర్థం చేసుకోవడానికి మార్క్సిజం దారి చూపుతుందని సుధాకర్‌కు తెలుసు. మరి శ్రీరామ్‌ మార్క్సిస్టు కవేనా? అనే సందేహం రాకుండా ఆయన స్థానాన్ని కూడా సుధాకర్‌ నిర్ణయం చేశాడు.

కవి నేపథ్య విమర్శను సుధాకర్‌ సూత్రబద్ధంగానే చేపట్టాడు. ఈ కవిని చూడండి మనకు ఎలా పరిచయం చేస్తున్నాడో… ‘‘కోడం కుమార స్వామి నడిచి వచ్చిన దారి బందగి చిందిన నెత్తుటి దారి. దొడ్డి కొమరయ్య ఒరిగిన నేల. వేన వేల యుద్ధగీతాలు హోరెత్తిన భూమి. దొరల గడీల్ని కూల్చిన వీరులు నడిచిన తొవ్వ. దేశమంతటా విముక్తి ఆకాంక్షల్ని వెదజల్లిన కడివెండి వీరయోధుడు సంతోష్‌ నడిచిన తొవ్వ. ఆ గాలిలో హోరెత్తిన నినాదాలేవో కుమార్‌ను కవిగా మలిచాయి.’’
సుంకిరెడ్డి నారాయణరెడ్డి విమర్శకుడు, పరిశోధకుడిగా సాహిత్య ప్రపంచానికి తెలుసు. ఆయన కవి కూడా అనే విషయం సీరియస్‌ పాఠకులకే తెలుసు. ఆయన రాసిన దీర్ఘ కవిత పేరు ‘తావు’. ‘ఈ తావు దేనికోసం?’ అనే ప్రశ్నను ఒక పాఠకుడిగా సుధాకర్‌ వేసుకున్నాడు. కనుక శాస్త్రీయమైన సమాధానం చెప్పుకున్నాడు. ‘‘ఒక గమ్యం కోసం నిరంత అన్వేషణే ఈ తావు’’. ‘‘ఈ తావున కవిత్వమంటే ‘మంటే’’. ‘మంటే’ అనే పదాన్ని వెంటనే ప్రయోగించటం వలన పొరపాటుగా పడిరదేమో అని అనుకుంటాము. కానీ కొద్దిగా ఆలోచిస్తే ‘మంట’ అని స్ఫురిస్తుంది. రచనలో ఇదొక శైలి.

‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌’ (1976) పేరుతో ఆనాటి విద్యార్థులు ఒక సాహిత్య సంస్థను నడిపారు. ఆ లెగసిని కొనసాగిస్తూ సుధాకర్‌ ‘ఓయూ సాహిత్య వేదిక’ (2017) ప్రారంభించాడు. కనుక తన మూలాలను వెతికి ఆనాడు వాళ్లు ప్రచురించిన ‘ఈ తరం యుద్ధ కవిత’ మీద విశ్లేషణ చేశాడు. క్యాంపస్‌లు ఏం చేస్తాయి? కదలికకు ప్రాణం పోస్తాయి. ‘‘సమరశీల సందేశమే కవితా వస్తువు’’గా మార్చి ప్రపంచంలో వెదజల్లుతాయి. యువ కవులకు కవితా వస్తువు ఏమై ఉంటుందో… అంటే సమరశీల సందేశం. ఇది సుధాకర్‌ నిర్ధారణ.

కవుల మీద, వారి కవిత్వం మీద విశ్లేషణ ఒక కోణం సుధాకర్‌లో కన్పిస్తుంది. కానీ విమర్శకుల మీద విశ్లేషణ అనేది రెండో కోణం. ఇది జాగ్రత్తగా నిర్వహించాల్సిన బుద్ధిపూర్వకమైన వ్యక్తీకరణ. సుధాకర్‌ స్వయంగా కవి కావడం వలన కవిత్వ విశ్లేషణ అనువుగా ఉంటుంది. అయినా విమర్శ మీద విశ్లేషణ చేయవలసి వచ్చినపుడు ఔచిత్యాన్ని పాటించాడు. కానీ సుధాకర్‌ శైలి మాత్రం సడలలేదు. ‘‘డాక్టర్‌ రఘుది సరళమైన వాక్యం. పదునైన వ్యంగ్యం. ముక్కుసూటి విమర్శ. అతని విమర్శ రాగద్వేషాలకు అతీతం. మౌనంగా కన్పించినా లోలోపలేదో అక్షరాల కుంపట్లు రగుల్తున్నట్టే వుంటడు.’’ రఘువాక్యం సరళమే. కానీ సుధాకర్‌ వాక్యం అంతకంటే సుందరం. విమర్శకుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఎంతటి గంభీరమైన విషయాన్ని అయినా సులభంగా, సరళంగా చెప్పడం.

ఈ మొత్తం వ్యాసాలలో పట్టు సడలని కవితా శైలి సుధాకర్‌ది. కవిత్వం హృదయగత వ్యాపారం అంటారు. అది మెదడుతో సంలీనం చెందే రసాయన క్రియ కూడా అని సుధాకర్‌కు తెలుసు. అందుకే బుద్ధిని, హృదయాన్ని జోడించి ఈ వ్యాసాలను మన ముందుకు తెచ్చాడు. వర్తమాన సాహిత్య ప్రపంచంలో విమర్శకు అనేక పరిమితులు ఏర్పడ్డాయని చర్చ జరుగుతున్న సమయంలో వాటిని పూర్వపక్షం చేస్తూ సాహిత్యానికి మార్క్సిస్టు సంవిధానాన్ని అన్వయించి విశ్లేషిస్తున్న సుధాకర్‌ భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నాడు. ఇప్పటికి విశ్లేషణతో ప్రారంభమైన సుధాకర్‌ లోతైన విమర్శా సూత్రాలను ప్రతిపాదిస్తూ మరింత విలువైన విమర్శను అందించాలని ఆశిస్తూ… పాఠకులను ఈ సృజనలోకి ఆహ్వానిస్తున్నాను.

                           -ప్రొఫెసర్‌ చింతకింది కాశీం, 
                            డిసెంబర్‌, 2023,
                            హైదరాబాద్‌.

పాలమూరు జిల్లా అంబట్ పల్లి. కవి, రచయిత, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు. విరసం సభ్యుడు. రచనలు: పొలమారిన పాలమూరు, గుత్తికొండ, మానాల(దీర్ఘ కవితలు), నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, తెలంగాణ ఉద్యమాలు-పాట, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ-సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు, తెలంగాణ సాహిత్యం, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు; అగ్రకులత్వం, టీఎస్ఎఫ్ చరిత్ర, కాగితం మీద అక్షరానికి కమిటైన కవి, అకడమిక్ అన్ టచ్ బులిటీ. ఇరవయేళ్ల కవిత్వమంతా ''కాశీం కవిత్వం (1994 -2014)'' పేరుతో సమగ్ర సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply