సృజనకారులకు సొంత సామర్ధ్యం ఉంటుందా?

“All texts are composed of other texts held together in a state of constant interaction.It means that there are no original texts, no complete texts and no singular texts: all texts exist in a state of partiality and inter-dependancy with other texts” అంటుంది Julia Kristeva. ఇదే సూత్రాన్ని ప్రతి రచయితకూ , కవికీ వర్తింపజేస్తూ మాట్లాడినవాళ్ళు వున్నారు.

రచయిత కూ కవి కీ సొంత సామర్ధ్యం ఒకటుంటుందా? ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది? దాన్ని ఎలా పట్టుకోవాలి? ఈ ప్రశ్నలకు ఎవరి సమాధానం వాళ్లదే.

కవికి సొంత సామర్ధ్యం ఏమీ ఉండదనీ కవిత్వంలో మొదటినుంచీ ఎప్పటికప్పుడు కాలానుగుణ మార్పులూ చేర్పులూ పొందుతూ పరంపరగా వస్తున్న వచ్చిన మొత్తం కవిత్వ వారసత్వానికి వారసుడిగానో, వారసురాలిగానో అమరిపోవటంలోనే కవి సొంత సామర్ధ్యం ఉంటుందని T.S.Eliot అంటాడు. ఈ వారసత్వం కవి ప్రాంతీయతకి మాత్రమే కాదు, జాతీయతకీ, అంతర్జాతీయతకి కూడా చెందినదై వుంటుందంటాడు. అనూచానంగా అందిన ఈ సంప్రదాయాన్ని కవి జీర్ణం చేసుకొనే, సొంతంచేసుకొనే రీతిలోనే కవి వ్యక్తిగత సామర్ధ్యం ఉంటుందికానీ అంతకుమించి ఏ కవికీ ఏ అదనపు సామర్ధ్యం ఉండటానికి వీలు లేదనీ అంటాడు. దీన్ని ఆ తరవాత వచ్చిన కవిత్వ సిద్ధాంతకారులు ఎవరి పద్ధతిలో వారు ఒప్పుకుంటూ వచ్చారు. వీరిలో F.R. Leavis ముఖ్యుడు.

ఈ అంశాన్ని మార్క్సిస్టు విమర్శకులైన Raymond Williams,Adorno,Terry Eagleston లాంటివాళ్ళు భిన్నంగా చూశారు. కవులు కానీ రచయితలు కానీ సొంతం అనుకునేవీ స్వతంత్రం అనుకునేవీ అన్నీ సమాజం నుండే వస్తాయని వీళ్ళు అంటారు. సమాజం నుంచి కవులకు సంక్రమించిన వాటిని కవులు బాధ్యతాయుతంగా స్వీకరించడంలోనే సొంతతనం ఉంటుందని దీని అర్ధం. వాటిని చైతన్యపూరితంగా ఆమోదించటంలోనే స్వతంత్రత ఉంటుందని ఈ వాద సారం. అయితే ఇవి సమాజంలో ఏకోణం నుంచి వచ్చాయో, ఎవరి ప్రయోజనం కోసం ఏ శక్తులనుంచి వచ్చాయో, ఏ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తాయో గమనించి వాటిని సొంతం చేసుకోవడంలోనే కవుల సత్తా ఇమిడివుందని వీరు వివరిస్తారు. రాచమల్లు రామచంద్రారెడ్డి నుంచి త్రిపురనేని మధుసూదనరావు, బాలగోపాల్ లాంటి వాళ్ళు తెలుగులో ఈ వాదాల్ని చేశారు. “ప్రజల క్షేమం కోరేవారు, తిరుగుబాటుదార్లు గానీ రచయితలు గానీ, ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మన ఆలోచనల మూలం ఏమిటో, అవి ఎవరికి ఉపయోగపడతాయో, ఎవరిని అణచివేయడానికి అవి కల్పించబడ్డాయో వివేచించకుండా ఇవి నా సొంత ఆలోచనలూ, స్వతంత్రమైన భావాలు, నేను ఎవ్వరికీ విధేయుడను కాను, ఏ వర్గానికీ బానిసకాదు అనుకోవడం చాలా పొరపాటు” అంటాడు బాలగోపాల్. సమాజంలోని వివిధ అంగాలలో భాగంగానే సాహిత్యాన్ని చూడాలనే మార్క్సిస్ట్ దృష్టినుంచి వచ్చిన అవగాహన ఇది.

ఆ తర్వాత వచ్చిన పోస్టుమోడనిస్టుల దృష్టి ఇంకొక రకం. ప్రస్తుతం కవులకుగానీ రచయితలకుగానీ సొంతంగా తమను తాము వ్యక్తం చేసుకునే అవకాశమే లేదనీ, వ్యవస్థ తన వునికికోసం తయారుచేసుకున్న భావాల చట్రంలో కవులూ రచయితలూ ఇమిడిపోయేట్లుగా పకడ్బందీ అదృశ్య ఏర్పాట్లు ఉన్నాయని వీరంటారు. బోనులో తెలియకుండానే చిక్కుకునే జంతువుల మాదిరి తామేదో సృజిస్తున్నామనుకునే కవులు, పాలక వ్యవస్థ గుప్పిట్లో చిక్కుకొని అది కోరుకునేదాన్నే సృజిస్తారని వీరి అవగాహన. ఆ రకంగా సాహిత్యం కొత్తగా సృజించటమంటే కాపీకొట్టటమేనని వీరంటారు. గత సాహిత్యంలోని అన్ని భావాలనీ, రూపాలనీ, శైలుల్నీ కలిపి ముక్కల్ని పేర్చటంద్వారా pasticheని విచ్చిన్న వాస్తవికతనీ (fragmentation నీ) నిర్మించటమే కవులూ రచయితలూ చేయగలిగిన పని అని వీరి వాదన. కొత్తగా చెబుతున్నామని అనుకునేదంతా పాతకు బలహీన అనుకరణ గాబట్టి ప్రతిదాన్నీ అనుమానించాలనీ, సంశయ పరీక్ష ద్వారా సత్యంగా చలామణిలో ఉన్న ప్రతిదాన్నీ వడకట్టాలనీ, అప్పటికీ ఆ ప్రయత్నంలో విజయం ఒక భ్రమేననీ పోస్టుమోడనిజం చెబుతుంది. కనుక సొంతతనం దుర్లభమనీ, దాని స్థానంలో ఉండేది నకిలీతనమేననీ, కల్తీతనమే స్వచ్ఛత రూపంలో రాజ్యమేలుతుందనీ వీరి ధోరణి.

Nothing is original. Steal from anywhere that resonates with inspiration or fuel your imagination.Select only things to steal from those that speak directly to your soul. If you do this, your work (and theft) will be authentic”. అంటాడు Jim Jarmusch. ఎక్కడినుంచి తీసుకున్నావనేది కాదు ఎక్కడికి తీసుకెళ్లి ఎందుకు ఉపయోగిస్తున్నవనేది ముఖ్యం అంటాడు Jean-Luc Godard. ‘It’s not where you take things from- it’s where you take them to’ అనేది ఇతని స్టేట్మెంట్. కనుక రచయిత సొంతతనం అనేది ఏమీ ఉండదనీ వుండేదంతా ముందున్నదాన్ని తమకు కావలసిన విధంగా రూపొందించుకోవటమేననీ వీరి వాదన. Post-modernism rejects originality and stresses the inevitability of appropriation in creative work అని అందుకే Alice Fulton వాదిస్తుంది.

వీరి తరవాత వచ్చిన చిన్న గ్రూపు మెటామోడనిస్టులు. వీరి ప్రకారం సొంతం , సమిష్టి అని విభజించలేని జారుడు వాస్తవికతలో ఊగిసలాట (oscillation)సంస్కృతిలో వ్యక్తి సొంత తనం క్షణక్షణం రంగులు మారుతుంది. కవులకీ రచయితలకి కూడా ఇది వర్తిస్తుంది.

కవి సొంత సామర్థ్యం గురించిన వివిధ ధోరణులు ఎలా ఉన్నాయో కొంత మేరకు చూడగలిగాం. ఈ విషయంలో ఎవరు ఏమి నిర్ధారించినప్పటికీ ఆ నిర్ధారణలకు కొన్ని పరిమితులున్నాయ్. కొన్ని అతి సాధారణీకరణలూ ఉన్నాయ్. వాటి లోతుల్లోకెళ్లి ఏదేంటో తేల్చి చెప్పటం కాకుండా కవుల సొంత సామర్ధ్యం గురించిన నా ఆలోచనలు కొన్నిటిని మీతో పంచుకుంటాను.

కవులకంటూ సొంతం ఏదీ ఉండదని తుది నిర్ణయాలు ప్రకటించలేం. వారి సామర్ధ్యం వారి కవిత్వ వస్తువులోకంటే రూపంలోనే ఎక్కువ బయటపడుతుందని ధైర్యంగా చెప్పగలం. చెప్పే విషయంకంటే చెప్పే పద్ధతే కవి సొంత సామర్ధ్యాన్ని పట్టిస్తుంది. ఇది అన్ని సాహిత్య ప్రక్రియలకూ వర్తిస్తుంది. సాహిత్యం సాహిత్యం అయ్యేది దాని శిల్పం వల్లనే అని ఒప్పుకున్నాక, సాహిత్యాన్ని సామాజిక శాస్త్రాల నుంచీ, విలేఖరత్వం నుంచీ వేరు చేసేది దాని కళాత్మకతే అని తేల్చినాక ఆ కళాత్మకత ఆయా సాహితీకారుల సొంత ముద్రతో నిర్మితమౌతుందని తెలుసుకోవటం కష్టం కాదు.

కవి నుంచి కవిత్వం ప్రవాహంగా వెలువడుతుందని చాలామంది చెప్పారు. అదొక ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ ని ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యక్తం చేయడంలో వాళ్ళ సొంత సామర్ధ్యం తప్పనిసరిగా ఉంటుంది. A river flows from the tip of my little finger అంటాడు Yannis Ritsos.ఈ వ్యక్తీకరణలో కవి సొంత టాలెంట్ లేదని చెప్పలేం. నా కలం నుంచి బతుకు బొమ్మలు బొమ్మలుగా రాలిపడుతుందంటాడు ఒక తెలుగుకవి. కనిపించకుండా వినిపించేవాడు కవి అన్నవాళ్ళున్నారు. Let the birds do the singing అని మరొక కవి అంటాడు.

లూనషార్స్కీ ఒకచోట అన్నట్లు పునరుత్పత్తి వృత్తి కావచ్చేమో కానీ కళ కాదు. కొత్త రచనలో కొత్త వస్తువుతో పాటు కొత్త రూపం ఉండాలి. అందుకే వస్తువు ఎంపిక కూడా కళాకారుడి సామర్ధ్యాన్ని సూచిస్తుంది. వస్తువు పట్ల కవి దృక్కోణమూ కవి సొంతతనానికి నిదర్శనమే. వస్తువును వ్యక్తంచేసే క్రమంలో వెలువడే స్వరం (tone) కవి సొంతమే. ఒకోసారి కవి వాడిన టెక్నిక్ పాతదనం కారణంగా కవి సొంతతనం మసకబారే అవకాశమున్నప్పటికీ కవి టోన్ మాత్రం సొంతతనం నుంచి వేరు కాలేనిది. జాషువా పద్యాన్ని రూపంగా స్వీకరించినప్పటికీ అందులోని భాష, ఆయన అభివృద్ధి చేసిన ఇడియమ్ , ఆయనదే అయిన స్వరం ఆయన టాలెంట్ ని పట్టిచ్చిన సంగతి మరచిపోకూడదు. జాషువా లాగే కులవాస్తవికతనే వస్తువుగా స్వీకరించిన తెరేష్బాబు కవిత్వంలో దృక్పధం, దృక్కోణం, స్వరం విభిన్నంగా ఉండటంలో ఆయన కాల ప్రభావాన్నే కాదు ఆయన సొంత ముద్రనీ గమనిస్తాం.

కనుక కవికి సొంత సామర్ధ్యం అనేది ఉండదని చెప్పలేం. అంతా కవి సామర్ధ్యమే అనటం ఎంత పొరపాటో అంతా గత వారసత్వమే, సామాజిక, మేధో ఆవరణ ఫలితమే అనటమూ అంతే పొరపాటు. కవి టెక్నిక్, స్వరం, నైపుణ్యం, దృక్కోణం ,ఇమాజినేషన్, భాషా చాతుర్యం చాలా వరకు కవి సొంత సామర్ధ్యాలే. ఇక శైలి విషయానికొస్తే ,Style is the man అని Ezra Pound ఎప్పుడో అన్నాడు కదా!

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

10 thoughts on “సృజనకారులకు సొంత సామర్ధ్యం ఉంటుందా?

  1. విలువైన వ్యాసం…సాహితీ వేత్తలంతా చదివి తీరాల్సిందే…

  2. చాలా బాగుంది సర్.. ధన్యవాదాలు

  3. రచనలో సొంతతనం నకిలీతనం గురించి పలువురు రచయితల అభిప్రాయాలతోటి ఆలోచనాత్మక వ్యాసం అందించారు. బాగుంది అభినందనలు సర్💐💐💐

  4. వ్యాసంలో ఆఖరిలో ముక్తాయుంపు తో విభేధించే సాహసం చేయను గానీ ఆఖరి పేరా లో మొదటి స్టేట్మెంట్ తో అందరిలానే ఏకీభవిస్తాను. కానీ రెండవ భాగంలో కవి టెక్నిక్, స్వరం, నైపుణ్యం, దృక్కోణం ,ఇమాజినేషన్, భాషా చాతుర్యం చాలా వరకు కవి సొంత సామర్ధ్యాలే అన్న మాట నిజమే కానీ వాటి నేపధ్యం ఎక్కడ నుండీ వచ్చిందనేది ఆలోచిస్తే అలాంటి వారు చాలా చాలా తక్కువ శాతం ఉంటారని అని అనుకుంటా. తప్పైతే సరిదిద్దండి

  5. ఆధునిక కవులు సాహిత్యాన్ని కొత్తకోణంలో అర్ధం చేసుకోడానికి ఇలాంటి వ్యాసాలు చదవడం అవసరం. వ్యాసంలో సృజనకారునికి సొంత సామర్ధ్యం లేదని సశాస్త్రీయంగా చెప్పారు. దీనికి ఊహాశక్తిని, భాషా చైతన్యం, టెక్నిక్ వంటి ఇతర అంశాలు మినహాయించడం వ్యాస సమతూకత, రిలయబిలిటిపై గౌరవం హెచ్చింది. కవుల సృజనపై రాజుల కాలం నుండి పాలకుల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీనిని ధిక్కరించిన పోతన, వేమనలు తెలుగులో ఉన్నారు. బోనులో చిక్కుకున్న కవులు ఇంకా అందులోనే ఉన్నారు. వాళ్లకు దాస్య విముక్తి అంత సులభం కాదు. “కవి కూడా నేతగాడే” అన్నట్టు వస్తువు మీద కాకుండా టెక్నిక్ మీదనే కవి విజయం ఆధారపడుతుందనేది వాస్తవం. మంచి వ్యాసం అందించారు. ధన్యవాదాలు. అభినందనలు.

  6. లోతైన పరిశీలనతో రాసిన వ్యాసం. ఊటంకింపులు ఊతంగా ఉన్నాయి. ధన్యవాదాలు సర్

  7. ఒక అద్భుతమైన విలువైన అందరూ పాటించదగిన ఆచరించదగిన సామర్ధ్యపు వ్యాసం. కానీ అక్కక్కడ కవి సామర్ధ్యాన్ని తక్కువ చేయడం, పరిమితం చేయడం, కాస్త విలువ తగ్గించడంగా అనిపించింది కానీ ఇతరుల ఓపిణీయన్స్ ను కోట్ చేస్తూ రాసినప్పుడు అలా అనిపించడం సహజమే. కవితా సామర్ధ్యాన్ని పెంచుకునే నిర్మాణాన్ని గొప్పగా వ్యాసం అంతటా చెప్పారు.
    దాచుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు అన్న గారు

Leave a Reply