కళ్ల ముందే తూరుపు నలుపెక్కింది
నెత్తురు కక్కుకొని సూర్యుడు
అమరత్వపునీడలో అశువులు బాశాడు
యిల్లును ఇడిసిన జాడలు
శవాలై తిరిగొచ్చిన తీరుకు
ఊళ్లు గొల్లుమంటున్నాయి
ఆశకొట్టేసుకున్న కన్నపేగులకు
దింపుడుగల్లం ఆశ కూడా గల్లంతయ్యింది!
ప్లీజ్…ఎవరైనా అడవితల్లికి
ఒక పచ్చటి చీరను
బహుమానంగా ఇవ్వగలరు
నెత్తురంటిన చోట మొక్కను నాటేందుకు
ఇప్పుడు కాసిన్ని చేతులు కావాలి
జనం గుండెల్లో ఆరిపోని
జ్వాల లాంటి ఒక దీపాన్ని కాపాడే
పిడికెడు భరోసా కావాలి
సద్దులు మోసినా…
జెండాలు పట్టినా…
పుట్టెడు శెరల బడ్డ చరిత్ర
ఒక్క ఆపరేషన్లోనే తుడిచిపెడితే ఎలా?
ఊళ్లకు ఊళ్లు మౌన ముద్రలో
లక్షల ప్రశ్నల కొడవళ్లతో
ఒక నిట్టూర్పును విడుస్తున్నాయి
ఇన్ని గాయాల అనుభవాలు
ఇంత తడిఆరని త్యాగాలు
అంతా గతమై
అడవి ఖాళీ అవుతుందా? లేదు!
రేపు ఉదయించక మానదు…!
ఆశకోట్టేసుకున్న కన్నపేగులకి. దింపుడు గళ్ళం ఆశ కూడా లేకుండా చేసిన. బట్టేబాసి గాళ్ళ భరతం పట్ట సూర్యుడు మళ్ళీ పుడతాడు అన్న….. 💐