సాహిత్య విమర్శలో యుద్ధ నీతి

“సాహిత్య విమర్శకుడు సాహిత్య జ్ఞాన వ్యాఖ్యాతే కాదు; జ్ఞాన ప్రదాత కూడా. సమాజాన్ని ప్రతిఫలించడంలో సాహిత్యం పోతున్న పోకడలను విశ్లేషించటం ద్వారా సాహిత్య విమర్శ జ్ఞాన ప్రదాన పాత్రను పోషిస్తుంది. రచయితలతో విమర్శకుడు స్నేహితునిగా ఉంటూనే తనదైన ఉనికి కాపాడుకోవాలి. రచయితతో మమేకం పొందటంలో తప్పులేదు; వైరుధ్యాలను విస్మరించటం తప్పు. విమర్శకుడు వినయంగా ఉంటూనే తలవంచని వీరునిగా నిలవాలి. ప్రశంసకు సముచిత స్థానం ఇస్తూనే వివేచనకు ప్రాముఖ్యం ఇవ్వాలి. సాహిత్యం సాహిత్య విమర్శ తమ తమ పద్ధతుల్లో సామాజిక ఆచరణలు”
-రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి (చర్చ)

రచన బోధన ఆయన రెండు కళ్ళు. ఆయన వృత్తీ ప్రవృత్తీ రెండూ సాహిత్య వ్యాసంగమే. కథ నవల కవిత్వం ప్రక్రియ ఏదైనా ఆయన పరిశోధనలో భాగమే. విమర్శకి అవసరమైన విస్తృతమైన అధ్యయనం నిశితమైన పరిశీలన లోతైన విశ్లేషణ ఆయన సొంతం. ప్రాచీనం ఆధునికం అత్యాధునికం అన్ని కాలాల సాహిత్యం ఆయన నాలుక చివరే. ఆస్తిత్వ సాహిత్యంలో భిన్న వాదాలు వివిధ ధోరణులు (స్త్రీ దళిత మైనారిటీ ప్రాంతీయ) వాటిని ఆశ్రయించుకొని వచ్చిన సాహిత్యమంతా ఆయన కరతలామలకం. అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాలు ఆయన కార్యక్షేత్రాలు. సాహిత్య విమర్శ కూడా సామాజిక ఆచరణే అని బలంగా నమ్మి నాలుగున్నర దశాబ్దాలకు పైగా నిరంతర ఆచరణలో వున్న వ్యాసపీఠం రాచపాళెం చంద్రశేఖర రెడ్డి.

ఇది రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి విమర్శ పై సమగ్రమైన పరిశీలన కాదు. అందుకు మరింత పెద్ద కాన్వాస్ కావాలి. వారి ‘విమర్శావరణం’ పుస్తకం (సంపా. ఎ. ఎ. నాగేంద్ర, ప్రచురణ- మార్చి 2021) పై చిరు సమీక్ష మాత్రమే. నిజానికి విమర్శపై విమర్శ రాయటం చాలా కష్టమైన పని. ‘విమర్శావరణం’లో రాచపాళెం చేసిన పని విమర్శపై విమర్శ, విమర్శకులపై మదింపు. సద్విమర్శకు సరైన మార్గదర్శనం. అంతకు ముందు చర్చ(2006), మరో చర్చ(2012) తదితర గ్రంథాల్లో ఆయన చేసిన కృషికి మరింత బలమైన కొనసాగింపు ‘విమర్శావరణం’. ఆ విమర్శపై విమర్శని సమీక్షించడమే నా పని. ఇది సాహసమే కానీ అభ్యుదయ సాహిత్యోద్యమ మార్గంలో పురోగామిగా నడిచే రాచపాళెం వారి విమర్శా దృక్పథం మీది అభిమానమే నన్నీ సాహసానికి పురిగొల్పింది.

సాహిత్య విమర్శను వర్గ పోరాటంలో భాగంగా చూడాలంటారు త్రిపురనేని మధుసూదనరావు. ‘ఇదొక యుద్ధం భూస్వామ్య శక్తులకు ప్రజాస్వామిక శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం’ అని రాచపాళెం నొక్కి చెప్పారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఒక శాస్త్రం – ఒక శస్త్రం. అది సమాజాన్ని సాహిత్యానికి అన్వయిస్తుంది. సామాజిక చలనాన్ని రాజకీయ ఆర్థిక కోణాల్లోంచి చూస్తుంది. మార్క్సిస్టు విమర్శ ప్రాచీన ఆధునిక సాహిత్యాలను అర్థం చేసుకోవడానికి విశ్లేషించడానికి సరైన పరికరం అన్న అవగాహనతో గత దశాబ్దం 2013-2019 సంవత్సరాల మధ్య రాచపాళెం వివిధ సమావేశాల్లో చదివిన పరిశోధన పత్రాల నుంచి చేసిన ప్రసంగాల నుంచి సాహిత్య పత్రికల్లో ప్రచురించిన వ్యాసాల నుంచి యెంచిన వ్యాస సంపుటి ‘విమర్శావరణం’.

‘ఏ భావజాల ప్రమాణంతో విమర్శ రాస్తున్నారో ఆ భావజాల విజ్ఞానం విమర్శకులకు పుష్కలంగా ఉండటం అవసరం. ఆ భావజాల స్వభావం, దాని చరిత్ర, దానిలోని వైవిధ్యం విమర్శకులకు బాగా తెలిసి ఉంటే వాళ్లు రాసే విమర్శలో సాధికారత ఉంటుంది’

అని బలంగా విశ్వసించే రాచపాళెం రాసిన ప్రతి వ్యాసం సాధికారతతో తొణికిసలాడుతుంది అని చెప్పడానికి యీ వ్యాస సంపుటి సాక్ష్యంగా నిలుస్తుంది.

*

‘విమర్శావరణం’లో మొత్తం 18 వ్యాసాలున్నాయి. వాటిలో ఐదు విమర్శకుల కృషిని మదింపు చేసేవి.

కాళీపట్నం రామారావు (సాహిత్య మర్మమెరిగిన కారా), చలసాని ప్రసాద్ (సాహిత్య ప్రేమికుడు చలసాని), పి. రామకృష్ణా రెడ్డి (పదునైన విమర్శకుడు పి రామకృష్ణ), ఎస్వీ సత్యనారాయణ (అభ్యుదయ సాహిత్య విమర్శకు ఆసరా ఎస్వీ), కాత్యాయని విద్మహే (తెలుగు సాహిత్య విమర్శకులలో సవ్యసాచి) – యీ అయిదుగురు విమర్శకులుగా సాహిత్యాన్నీ సాహిత్య విమర్శనీ మార్క్సిస్టు దృష్టి కోణం నుంచి విశ్లేషించిన తీరుని రాచపాళెం తనదైన శైలిలో పరిశీలించారు, వ్యాఖ్యానించారు, పరామర్శించారు, క్రోడీకరించారు, ఆవిష్కరించారు. అందుకోసం ఆయన యెన్నుకున్న సంవిధానం దేనికదే ప్రత్యేకమైనది.

విమర్శక లోకం కారాని కథా రచయితగా మాత్రమే పరిశీలిస్తే రాచపాళెం కారాలో విమర్శ మార్మజ్ఞుడిని గుర్తించి వెలికి తీశారు. సాహిత్య సమాజాల గురించి కారా మాస్టారు అనేక సందర్భాల్లో చెప్పిన అంశాలను క్రోడీకరిస్తూ ఆయన ప్రతిపాదించిన అంశాల లోతుపాతుల్ని చంద్రశేఖర్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. సాహిత్య ప్రయోజనం గురించి చర్చించారు. విమర్శకుడిగా కారాని అంచనా వేయడానికీ కారా సాహిత్య వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికీ అవసరమైన పనిముట్లు ఆ వ్యాసంలో అందజేశారు. అదొక బిగువైన ఆసక్తికరమైన పరిశోధన. ఆ సందర్భంలో రచయిత వ్యక్తిత్వాన్ని రచనా వ్యాసంగాన్నీ సామాజిక నిబద్ధతనీ యెలా చూడాలి, వాటి పరస్పర సంబంధాన్ని యెలా నిర్వచించుకోవాలి, వ్యక్తుల పట్ల విమర్శనాత్మకంగా వుంటూనే మానవ సంబంధాలు యెలా కాపాడుకోవాలి వంటి అంశాల్ని సూక్ష్మంగా వివేచించారు. రాచపాళెం సామాజిక దృక్పథంతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే యిటువంటి తావులు విమర్శావరణంలో సకృత్తుగా తటస్థపడతాయి. ఎస్వీని ‘అభ్యుదయ సాహిత్య విమర్శకుడు’, చలసానిని ‘ఉద్యమ సాహిత్య విమర్శకుడు’ అని ప్రత్యేకంగా పేర్కొన్న విషయం గమనిస్తే విమర్శకుడిగా రాచపాళెం రచనా దృక్పథం కూడా అర్థమౌతుంది.

కొండని అద్దంలో చూపటం అన్నమాట సాధారణంగా వాడుతాం, కానీ రాచపాళెం పరిశోధకురాలిగా విమర్శకురాలిగా సామాజిక శాస్త్రవేత్తగా స్త్రీవాద సిద్ధాంతకర్తగా మార్క్సిస్టు మేధావిగా మూల్యాంకన పునర్మూల్యాంకన వ్యాఖ్యాతగా కాత్యాయనీ విద్మహే బహుముఖ రూపాన్ని ఆవిష్కరించారు. కొండని కొండగానే చూపించారు. పర్వత పాదం నుంచి శిఖరం వరకు నిలువెత్తు రూపాన్ని దర్శింపజేశారు. ఆ సందర్భంగా రాచపాళెం తనకి యెంతో యిష్టమైన మూల్యాంకన పునర్మూల్యాంకనాల గురించి నిర్వచిస్తూ కాత్యాయనీ విద్మహే మార్క్సియ స్త్రీవాద దృక్పథం నుంచి ప్రాచీన ఆధునిక సాహిత్యాల్ని సరికొత్తగా అధ్యయనం చేసిన పద్ధతిని విపులంగా వివరించారు. అందుకు వొక నిర్దుష్టమైన సంవిధానాన్ని సైతం ఆయన రూపొందించుకున్నారు. మూల్యాంకన పునర్మూల్యాంకనాలు సాహిత్యంలో యెందుకు అవసరమో చాలాసార్లు ప్రస్తావించారు. వాటి మధ్య వున్న వ్యత్యాసాన్ని యెత్తిచూపారు. పునర్మూల్యాంకనం ఆధునిక సాహిత్య సామాజిక అవసరాలకు అనుగుణంగా పురోగమన స్వభావంతో వుండాలని యీ వ్యాసంలోనూ యితరత్రా కూడా పదే పదే నొక్కి చెప్పారు. సమాజం ప్రజాస్వామికమయ్యే క్రమంలో వెలువడ్డ వివిధ సిద్ధాంతాల వాదాల ధోరణుల వుద్యమాల భావజాలాల వెలుగులో చేసే పునర్మూల్యాంకనాలు సాహిత్య పురోగమనానికి యెంతగానో మేలుచేస్తాయని ఆయన నమ్మిక.

తెలంగాణా మలిదశ వుద్యమానికి యెంతో ముందునుంచీ కాత్యాయనీ విద్మహే తెలంగాణా కథ నవలల మీద చేసిన విస్తృత అధ్యయనం ప్రాంతీయ అస్తిత్వ విమర్శకి కరదీపికగా వుపయోగపడిందని గుర్తిస్తూనే యే ప్రాంత సాహిత్య పరిశోధనకైనా వుపయోగించే వొక మెథడాలజీని ఆమె అందించారని పేర్కొన్నారు. నిజానికి స్త్రీవాద ప్రాంతీయ దళిత సాహిత్య అధ్యయనం చేయడానికి కాత్యాయనీ విద్మహే వుపయోగించుకున్న సిద్ధాంతాలు పరికరాలు ప్రమేయాలు మార్క్సిస్టు సాహిత్య తత్త్వశాస్త్రం నుంచి తయారుచేసుకున్నవే. విప్లవోద్యమంపై, వుద్యమ సాహిత్యంపై ఆమెకున్న బలమైన నిబద్ధత గాఢమైన అభినివేశం అస్తిత్వ సాహిత్యాన్ని అన్ని విధాలుగా ఆహ్వానించి అంచనా వేయడానికి మరింతగా తోడ్పడ్డాయి.

ఈ సంపుటికే తలమానికమైన పరిశోధన వ్యాసమిది. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పరిశోధకులకు (విద్యార్థులకూ ఆచార్యులకూ) పరిశోధన పత్రాన్ని ప్రణాళికా బద్ధంగా రాయడానికి వొక నిలువెత్తు నమూనాగా style sheet లా యీ వ్యాసాన్ని prescribe చేయాలని నాకనిపించింది. ఇంత విస్తృతమైన పరామర్శ (36 పేజీలు) యితర సాహిత్య విమర్శకులపైన కూడా వెలువడితే బాగుంటుంది అని కూడా అనిపించింది. కట్టమంచి అందించిన విమర్శ సూత్రాలను అభ్యుదయ సాహిత్య విమర్శకులు మార్క్సిస్టు దృక్పథం నుంచి స్వీకరించి అభివృద్ధి చేశారు; ఆ తర్వాత అది అనేక రూపాలుగా విస్తరిస్తున్నది అని ఆయనే మరో వ్యాసంలో పేర్కొన్నారు. ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణంలో భాగంగా మద్దుకూరి చంద్రం జివి కృష్ణారావు నాటి నుంచి/లేదా యింకా ముందు నుంచీ అభ్యుదయ సాహిత్య విమర్శకులందరి కృషి గురించి విపులమైన విమర్శ రావలసి వుంది. అటువంటి ప్రయత్నం చేయటానికి విశ్వవిద్యాలయాలు యెలాగూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. రాచపాలెం లాంటి వారి మార్గదర్శనంలోనైనా ఆ ప్రయత్నం జరిగితే బాగుంటుంది. రామకృష్ణారెడ్డి అన్నట్లు విమర్శే ఆయన ప్రధాన వ్యాపకం కాబట్టి, తాపీ ధర్మారావు రారా వల్లంపాటి టియమ్మెస్ వంటివారి విమర్శా ప్రస్థానం గురించి యింతకు ముందు రాసి వున్నారు కాబట్టి దీన్ని వొక సమగ్రమైన ప్రాజెక్టుగా చేపట్టాల్సిన బాధ్యతని కూడా ఆయన నెత్తిమీదే పెట్టే చొరవ నాది.

*

ఈ పుస్తకంలో యేడు గ్రంథ సమీక్షలున్నాయి. రాచపాళెం చేతిలో సమీక్షా వ్యాసాలు సైతం పరిశోధన పత్రాల్లా రూపొందాయి. ప్రతి వ్యాసం ఆయన నిశిత పరిశీలనకు నిదర్శనం.

వరవరరావు ‘భూమితో మాట్లాడు’ (పీఠికను విమర్శగా ఎదిగించిన వివి), సీతారాం ‘అదే పుట’, అనుమాండ్ల భూమయ్య ‘మాలపల్లి – అభ్యుదయ మహాకావ్యం’, తెలకపల్లి రవి ‘గురజాడ యుగ స్వరం’, ఎండ్లూరి సుధాకర్ ‘జాషువా సాహిత్యం దృక్పథం, పరిణామం’ మంచాల గంగాధర్ ‘ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవధోరణులు’, కొలకలూరి ‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’ గ్రంథాలపై రాచపాళెం చేసిన సమీక్షలు మంచి పరిశోధన వ్యాసాలుగా పరిణమించడానికి కారణం ఆయన విస్తృత అధ్యయన అనుభవ సారాన్ని వాటికి జోడించడమే.

ఈ సమీక్షా వ్యాసాల్లో పరామర్శించిన గ్రంథాల గుణ దోషాల విశ్లేషణతో పాటు ఆ యా విమర్శకులపై నిర్దిష్టమైన అంచనాలు కూడా వున్నాయి. మరో ముచ్చట యేమంటే గురజాడపై గురజాడ రచనలపై రవి చేసిన ప్రతిపాదనల్ని చెబుతూనే గురజాడపై తన పరిశీలనల్ని కూడా ప్రస్తావిస్తారు. అలాగే విమర్శకుడిగా కొలకలూరిని అంచనా కడుతూనే వసుచరిత్ర, భూస్వామ్య యుగంలో పుట్టిన వసుచరిత్ర వంటి యితర ప్రాచీన ప్రబంధాల్ని పునర్మూల్యాంకనం చేసేటప్పుడు వర్తమాన సామాజిక అవసరాలని దృష్టిలో వుంచుకోవాలనీ గుర్తుచేస్తారు. భూమయ్య రచన గురించి మాట్లాడుతూ మాలపల్లి వైశిష్ట్యాన్నీ, సుధాకర్ పరిశోధనని విశ్లేషిస్తూ జాషువా ఔన్నత్యాన్నీ వుగ్గడించకుండా వూరుకోరు. ఇదంతా వ్యాస రచనా సంవిధానంలో రాచపాళెం ముద్ర.

ఆ క్రమంలోనే మంచాల గంగాధర్ సిద్ధాంత గ్రంథం ‘ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణులు’ సమీక్షిస్తూ వుపోద్ఘాతంగా సాహిత్యంలో మార్క్సిస్టు విమర్శ మౌలిక సూత్రాల గురించి అనేక విషయాలు స్థూలంగా క్రోడీకరించారు; ఆ క్రోడీకరణ వ్యాసానికి భూమికని యేర్పరచడం వొక యెత్తయితే దాని వెలుగులోనే మొత్తం గ్రంథాన్ని విశ్లేషించడం మరొక యెత్తు. సమాజానికి సాహిత్యానికి మధ్య వుండే విడదీయరాని సంబంధాన్ని మార్క్సిజం గుర్తించినట్లుగా అంతకుముందే సిద్ధాంతమూ గుర్తించలేదు అని గంగాధర్ సిద్ధాంత గ్రంథాన్ని నెపం చేసుకుని రాచపాళెం యీ వ్యాసంలో రుజువుచేశారు. రచనలో రచయితలో విమర్శలో సమాజానికి కీడు చేసే తిరోగమన అంశాల్నీ, వుపయోగపడే పురోగమన స్వభావాన్నీ గుర్తించడానికి వర్గ సిద్ధాంతం గీటురాయిపై పరీక్షించడం చూసినప్పుడు విమర్శకుడిగా రాచపాళెం సాహిత్యాన్ని యెంత గతి తార్కికంగా వివేచన చేస్తారో తెలుస్తుంది.

వరవరరావు గారి ముందు మాటల్ని సమీక్షిస్తూ – వివి ముందుమాట పరిమితుల్ని దాటి దానికి విమర్శ స్థాయి తీసుకువచ్చారు అని పేర్కొంటూ పీఠికా రచనలో ఆయన పాటించిన మెథడాలజీని అద్భుతంగా పట్టుకున్నారు. ‘చరిత్ర, దాని గమనం, దాని తీరు, సమాజం, దానిలోని మనుషులు, వాళ్ళ సంబంధాలు, ప్రపంచ సాహిత్య ప్రస్తావనలు, రచయితల పరిణామాలు, ప్రతిపాదన, వివరణ, విశ్లేషణ, తులనాత్మకత, సూత్రీకరణ సాహిత్య విమర్శకు ఉండవలసిన సకల లక్షణాలు’ వివి ముందుమాటల్లో కనిపిస్తాయని సోపపత్తికంగా పరామర్శించారు. ముందు మాటలకి విమర్శలో స్థానం గురించి కూడా ఆ సందర్భంలో ప్రస్తావించారు. తాను స్వయంగా దాదాపు వంద పరిశోధన/ విమర్శ గ్రంథాలకు పీఠికలు రాయడం వల్ల వివి ముందుమాటల సంవిధానంలోని విశిష్టతనీ విలక్షణతనీ గుర్తించి గౌరవించగలిగారు.

సీతారాం ‘అదే పుట’ పుస్తకాన్ని పరామర్శిస్తూ నవ్య సంప్రదాయవాదం పోస్టు మాడర్నిజం రెండూ మార్క్సిజాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించాయని కుండ బద్దలుకొట్టారు. పోస్టు మాడర్నిజం మార్క్సిజాన్ని, సమిష్టివాదాన్ని ప్రతిఘటించే వ్యక్తి వాదమనీ మార్క్సిజాన్ని ప్రాదేశికం చేయటంలో ఏర్పడ్డ వెలితిని పోస్టుమాడర్నిస్టులు సొంతం చేసుకున్నారని తీర్మానిస్తారు.

గురజాడపై తెలకపల్లి రవి పుస్తకాన్ని సమీక్షిస్తూ దాన్ని కెవిఆర్ మహోదయంతో పోల్చడం వొకింత అతిశయోక్తి అనిపించింది. గురజాడ భావజాలం, ప్రాంతం, కులం నచ్చక కించపరిచే విమర్శలు నిలవవు అనీ గురజాడ కాలం చెల్లిన రచయిత కాదనీ ఘంటారావంగా స్పష్టం చేశారు.

రాచపాళెం వారి విమర్శలో ఒక అకాడమిక్ అప్రోచ్ వుంటుంది. వ్యాస నిర్మాణంలో నిర్దిష్టమైన సంవిధానం వుంటుంది. ఆ సంవిధానం వెనుక వొక స్పష్టమైన దృక్పథం వుంటుంది. అందువల్ల అధ్యయనానికి పరిశీలనకు వొక శాస్త్రీయత ఏర్పడుతుంది. శాస్త్రీయ పద్ధతి సమాచారాన్ని అందించడానికి/అందిపుచ్చుకోడానికి మాత్రమే కాకుండా ఆచరణాత్మక జ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడుతుంది. చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ఆ దృక్పథం మార్క్సిస్టు దృక్పథం. అయితే అకాడమిక్ సంవిధానంలో రచించే వ్యాసాల నిర్మాణం ఒక మూసకు లోనై చట్రాల్లోకి కుదించినట్లు వైవిధ్యం కోల్పోయే ప్రమాదం వుంది. ఒక యూనిఫార్మిటీ వుండటం వల్ల రొడ్డకొట్టుడు నిర్మాణంలా కనిపించే అవకాశం వుంది. దాని నుంచి బయటపడటానికి వ్యాస నిర్మాణంలో సృజనాత్మకతని జోడించాల్సిన అవసరం వుంటుంది. గోడకు తగిలించిన గడియారాల్లో అంకెలు పన్నెండే. గంటల్నీ నిమిషాల్నీ క్షణాల్నీ సూచించే ముళ్ళు అవే. కానీ వాటిని యెన్ని రకాల డిజైనుల్లోకి ఫ్రేమ్స్ లోకి తర్జుమా చేయొచ్చు. ఎన్ని విధాలుగా అలంకరించవచ్చు. అలాగే వొక ఫ్రేమ్లో ఇమిడి పోయేలా కనిపించే వ్యాసాల్ని ప్రతిదాన్నీ కొత్తగా భాసించేలా చేయడంలో రాచపాళెం యెంత అప్రమత్తంగా వుంటారో ఆయన రాసిన వందలాది వ్యాసాల్ని గమనించినప్పుడు తెలుస్తుంది. ఒక దృక్పథానికి కట్టుబడి వున్నప్పుడు కూడా ఆ దృక్పథానికి చెందిన సైద్ధాంతిక పరిభాషని ఉపయోగించండం వల్ల విమర్శకుల ఆలోచనలో పునరుక్తి, భాషలో మూసదనం వచ్చే అవకాశం వుంది. దాన్నుంచి బయట పడటం చేయి తిరిగిన రచయితకి కూడా కష్టమే. ఎంతో సాధన చేస్తేనే గానీ అలవడని విద్యని రాచపాళెం అలవోకగా వొంటబట్టించుకున్నారు. విస్తృతమైన అధ్యయనం ద్వారా విమర్శని విస్తృతపరచుకోవచ్చనీ చూపుని విశాలం చేసుకోవచ్చనీ ఆయన నిరూపించారు.

*

విభజిత సమాజంలో సాహిత్యమైనా సాహిత్య విమర్శ అయినా విభజితమే అయి ఉంటుందని రచయితలయినా విమర్శకులైనా తాము ఏ పక్షం వహించాలో నిర్ధారించుకోవాలని రాచపాళెం అనేక సందర్భాల్లో హెచ్చరిస్తారు. సంప్రదాయ సాహిత్యం మీద సంప్రదాయ పద్ధతిలోనే చేసే విమర్శ వల్ల సంఘానికి ప్రయోజనం శూన్యమనీ ఆధునిక భావజాల నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనీ పేర్కొంటారు. అదే సందర్భంలో ఆధునిక సాహిత్యం అంతా కూడా ఒకే ముద్ద కాదనీ దాన్ని భిన్న స్థల కాలాల్లో వచ్చిన ఉద్యమాల, భావజాలాల ప్రభావం నుంచి చూడాలనీ జాతీయ అంతర్జాతీయ స్థానిక ప్రమేయాల్లోంచి పరిధిలోంచి వ్యాఖ్యానించుకోవాలనీ చెబుతారు. భిన్న భావజాలాల ప్రభావాన్ని కూడా కాలగమనంలో పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన చారిత్రక అనివార్యతని గుర్తిస్తారు. అలాగే ప్రాచీనాలంకారిక సిద్ధాంతాలను తెలుగు సాహిత్య పరిశోధకులు విమర్శకులు సాహిత్యానికి అన్వయించే క్రమంలో వాటిని పుంఖానుపుంఖాలుగా వుటంకించుకోవడం తప్పితే అలంకార శాస్త్రాన్ని సమగ్రంగా విశ్లేషించుకోలేదని భావిస్తారు. తెలుగులో భారతీయ అలంకార శాస్త్ర చరిత్ర మీద జరగవలసినంత పరిశోధన జరగలేదు అని నిర్ధారించారు.

స్త్రీ దళిత బహుజన ముస్లిం ప్రాంతీయ వాదాలు మార్సిజాన్ని భారతీయ సమాజానికి అన్వయించుకోవడంలో ఏర్పడ్డ వెలితిని పూడ్చటానికే పుట్టాయనీ ఆ యా వాదాలకు అభ్యుదయ విప్లవ దృక్పథాలతో ఉన్నది మిత్ర వైరుధ్యమే అని చెప్తారు. కానీ పాలకవర్గ భావజాలాన్ని వొంట పట్టించుకున్న వాళ్ళు దాన్ని శత్రు వైరుధ్యం చేస్తున్నారని అనైక్యత వల్ల చాలా నష్టం జరుగుతుందని సమాజం సాహిత్యం సాహిత్య విమర్శ దారి తప్పి శత్రువు బలపడుతున్నాడని హెచ్చరిస్తారు. సాహిత్య విమర్శ ఒక ధర్మ యుద్ధం. యుద్ధం చేయవలసిందే కానీ అది ధర్మ యుద్ధం కావాలి. ధర్మ యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి తప్పితే కుట్రలు ఉండవని నడక ఉంటుంది అది ముక్కుసూటి నడకై ఉంటుంది కానీ వంకర నడకలు ఉండవనీ తర్కం ఉంటుంది కానీ కుతర్కం వుండదనీ తెలివి ఉంటుంది కానీ అతితెలివి వుండదనీ చెబుతూ సాహిత్య విమర్శకు, అధ్యయనానికీ కొన్ని ఎథిక్స్ (నైతిక సూత్రాలు) అందజేశారు. నిశ్చిత నిశ్చయాలతో రచన పట్ల రచయిత పట్ల అభిప్రాయాలు యేర్పరచుకుని విమర్శకు పూనుకోకూడదని హితవు పలికారు. రచనలోని పురోగమన అంశాలను గుర్తించి రచయితలు ప్రజాభ్యుదయ పంథాలో యే మేరకు వున్నారో నిష్పాక్షికంగా తెలియజేసి వారిలోని తిరోగమన కారణాలు చెప్పటం వివేకంతో కూడిన పని తప్ప రచయితలు మొత్తంగా పనికిమాలినవాళ్ళే అని ధ్రువీకరించడం మంచిది కాదని చెప్తారు. ఆధునిక సాహిత్యం ద్వారా అపసవ్యతలతో నిండి వున్న యే వ్యవస్థను అయితే మనం నిర్మూలించాలి అనుకుంటున్నామో ఆ వ్యవస్థను పటిష్టం చేసే రచయితల ప్రయత్నాలను రాచపాళెం తీవ్రంగా గర్హించారు. సాహిత్యంలో అభినవ మనువాదాన్ని గుర్తించి అది చాలా అపాయకరమని చెప్పి ప్రాచీన మనువుతో పాటు అభినవ మనువుతో కూడా యుద్ధం చేయాల్సి వుందని ప్రబోధించారు. కులమత అడ్డుగోడల్ని అధిగమించాలని ప్రబోధించే ఉద్యమ రచయితల్ని మళ్లీ కులమతాల గోడల్లోకి కుదించే సంకుచిత ధోరణి దుర్మార్గమని పేర్కొంటారు. ఒక రచనలోని వస్తువుని విశ్లేషించినా శిల్పాన్ని విశ్లేషించినా దానికి ప్రయోజనం, ప్రాసంగికత వుండాలని చెప్పారు.

తెలుగులో విమర్శ స్థితిగతుల గురించి విమర్శకుల పోకడల గురించి పరిశోధన రంగంలో లుప్తమౌతున్న విలువల గురించి రచయితల అధ్యయన లోపం గురించి సాహిత్యంలో నిబద్ధత నిమగ్నతల గురించి సందర్భవశాత్తూ ప్రస్తావించడమే కాకుండా ఆ రంగంలో కృషి చేస్తున్నవాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ప్రత్యేకించి యెన్నో వ్యాసాలు రాశారు రాచపాళెం. ఈ సంపుటిలో అటువంటి వ్యాసాలు దాదాపు అరడజను దాకా వున్నాయి.

తెలుగు సాహిత్య విమర్శ ఇటీవల ధోరణలు, సాహిత్య విమర్శకులకు ఉండకూడని లక్షణాలు, తెలుగు సాహిత్య విమర్శ దశ దిశ, వేయిరేకులుగా వికసిస్తున్న తెలుగు సాహిత్య విమర్శ, ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రను సరికొత్తగా రచించాలి, తెలుగు సాహిత్యానికి బ్రౌన్ సి పి చేసిన సేవ ఆ కోవలో వచ్చినవే.

సాహిత్యంలో మంచి సాహిత్యం చెడు సాహిత్యం వున్నట్లే విమర్శలో కూడా సద్విమర్శ కువిమర్శ వుంటాయని నమ్మిన రాచపాళెం విమర్శకులకు వుండకూడని లక్షణాలు పేర్కొంటూ రాసిన వ్యాసం విమర్శావరణంలో విమర్శకులు పాటించాల్సిన విలువల్ని ప్రతిపాదిస్తుంది. ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన వ్యాసాల్లో యిది వొకటి.

*సాహిత్యకారునికి నీతి ఉన్నట్లే సాహిత్య విమర్శకుడికి కూడా నీతి ఉండాలి.
*విమర్శ నీతి యుద్ధ నీతి లాంటిదే. నీతిని అతిక్రమించడం వల్ల అనారోగ్యకర ధోరణులు తలెత్తుతున్నాయి.
*దొంగ పేర్లతో నచ్చని రచయితల మీద దాడి చేయడం నీతి బాహ్యం.
*సైద్ధాంతిక అనిబద్ధత విమర్శను భ్రష్టు పట్టిస్తుంది.
*చరిత్రని విశ్లేషించాలి విమర్శించాలి తప్పితే అవమానించకూడదు తిరస్కరించకూడదు.
*విమర్శకులు కుల మత దురభిమానాలు వదులుకుని సెక్యులర్ భావన కలిగి ఉండటం అవశ్యం.
*గేలరీ మెప్పు కోసం, చలామణి కోసం తాము నమ్మని భావజాలాలను అనుసరించిపోయే గాలివాటం తప్పు.
*విమర్శకులు సంచలన ప్రియులు, సంచలన జ్వర పీడితులు కాకూడదు.
*ఏ రచయితనైనా కాలాతీతులుగా గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు.
*సమాజ సాహిత్యాలే కాదు సాహిత్య విమర్శ కూడా స్థలకాలబద్ధమై ఉండాలి.
*విమర్శకులు స్థల కాల నిర్దిష్టతను విస్మరించి రచయితల్ని వ్యాఖ్యానించడం అసమంజసం.
*వ్యక్తిగతమైన శత్రుత్వంతో ద్వేషంతో దొంగ దాడి చేసే విమర్శకులు సాహిత్యంలో చీడపురుగులు.
*విమర్శకులకు తెలివి ఉండాలి కానీ అతితెలివి మంచిది కాదు.

తన సాహిత్య జీవితానుభవం నుంచి సదసద్విచక్షణ వివేచన కల్గించే యిటువంటి సుద్దులు యెన్నో విమర్శావరణంలో మూటగట్టి అందించారు. సాహిత్య విమర్శలో ఖాళీలను పూరించడం ద్వారా సాహిత్యం లోని సమాజంలోని ఖాళీలను పూరించవచ్చు అని రెండు / మూడు వ్యాసాల్లో బలంగా చెప్పారు. అలాగే పూర్వ సాహిత్యాన్ని పూర్తిగా నిరాకరించకూడదనీ దానికి వర్తమాన సమాజంతో గల సంబంధాన్ని నిర్వచించడం నిరూపించడం అవసరమనీ స్పష్టం చేశారు. కాలం చెల్లిన సాహిత్యాన్ని కీర్తించడం వల్ల ప్రయోజనం లేదు; సమకాలిక పరీక్షలో మిగిలిన దాన్ని స్వీకరించటం ఇంగితం అంటారు. వ్యక్తి హననానికి పూనుకొనే సాహిత్య రాజకీయాలను ఆయన చీదరించుకున్నారు. సాహిత్య కెరీరిస్టులను దూరముంచారు. అంతిమంగా సాహిత్య విమర్శకులు తమ సైద్ధాంతిక జ్ఞానాన్ని భావజాలాన్ని నిర్ణయించుకొని నిర్వచించుకొని వర్తమాన సామాజిక సాహిత్య సందర్భాలను గుర్తించి సాహిత్య విమర్శను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉందనీ తెలుగు సాహిత్య విమర్శకు శాస్త్రీయతను సమకాలీనతను తీసుకురావడానికి సమష్టి కృషి చేయాలనీ వుద్బోధించారు.

కొలకలూరి ఇనాక్ రచించిన ‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’ గ్రంథం తెలుగు పునర్మూల్యాంకన విమర్శకు దారిదీపం అని పేర్కొంటూ అది ఆ విధంగా రూపొందడానికి ‘విమర్శకుని భావజాల నిబద్ధత నేపథ్యంగా నిలిచింది’ అని రాచపాళెం ముక్తాయింపు పలికారు. విమర్శావరణంలోని వ్యాసాలని కూడా ‘విమర్శకుని భావజాల నిబద్ధత నేపథ్యంగా’నే పరిశీలించినప్పుడు విమర్శకునిగా పరిశోధకునిగా రాచపాళెంని అంచనా కట్టగలం. మార్క్సిస్టు భావజాలం నుంచి విడదీసి ఆయన రచనల్ని బేరీజు వేయలేం.

నిండు కుండ లాంటి ఆయన వ్యక్తిత్వమే ఆయన సాహిత్య విమర్శలో కూడా ప్రతిఫలిస్తుంది. ఆయన ఎక్కడా తొణకడు. బెణకడు. చెదరడు. బెదరడు. శాంతంగా స్థిరంగా గంభీరంగా వుండే ఆయన స్వరం ప్రతి అక్షరంలోనూ ప్రతి మాటలోను కనిపిస్తుంది – వినిపిస్తుంది. తర్కబద్ధత ఆయన ప్రతి ప్రతిపాదనలోనూ గోచరిస్తుంది. ఆయన రాసిన వాక్యం యెదురుగా కూర్చుని సంభాషణ చేస్తున్నట్టు వుంటుంది. పరుషోక్తులూ యెత్తిపొడుపులూ పొల్లు మాటలూ అప్రస్తుత ప్రసంగాలూ ఆయన విమర్శలో వెదికినా కనిపించవు. ఆవేశంలో కొట్టుకుపోవడం గానీ ఆగ్రహంతో వూగి పోవడం గానీ వుండవు. శాఖా చంక్రమణాలు వుండవు. స్వవచోవ్యాఘాతాలు వుండవు. కేటలాగ్ బయోడేటా విమర్శకు రాచపాళెం వ్యతిరేకి. దాన్ని ఆయన అటెండెన్స్ రిజిష్టర్ విమర్శ అంటారు. కార్య కారణ సంబంధ నిరూపణ లేని విమర్శని గానీ పరిశోధనని గానీ ఆయన అంగీకరించరు, యెన్నడూ ప్రోత్సహించలేదు. సంయమనం ఆయన విమర్శకు బాటమ్ లైన్ గా గోచరిస్తుంది. విమర్శలో ఆయన శైలి ప్రవాహశైలి. కానీ అది గట్టుల్ని తెంచుకొని ప్రవహించదు. శరత్కాలపు నదిలా ప్రశాంతంగా తేటగా ఉంటుంది.

రాచపాళెం వారి వాక్యం సరళంగా ఉంటుంది. సూటిగా ఉంటుంది. స్పష్టత క్లుప్తత గాఢత ఆయన విమర్శలో బలం. ఒక ప్రతిపాదన చేయడానికి అవసరమైన భూమికను ముందు నిర్మించుకుంటారు. విమర్శకుల కృషిని అంచనా వేయటానికి వారి నేపథ్యాన్ని ప్రస్తావిస్తారు. ఆ నేపథ్యాన్ని వర్గం దృష్టితోనే పుటంపెట్టి అంచనా వేస్తారు. అవసరమైన చోట మాత్రమే వుటంకింపుల జోలికి పోతారు. లేదంటే తనకు అవగాహన అయిన సారాన్ని తెలియజేస్తారు. పరిశోధన వివేచన విశ్లేషణ పరిశీలన అనుశీలన పరామర్శ సమీక్ష యేం చేసినా సహృదయత వాటికి ప్రాణభూతంగా వుండాలని నియమం పెట్టుకుని రాచపాళెం దాన్ని వొక వ్రతంగా పాటించారేమో అని చాలా సందర్భాల్లో అనిపించింది. పక్కనే నడుస్తూ భుజమ్మీద చేయి వేసి బుజ్జగిస్తూ నచ్చచెబుతున్నట్టు మిత్ర సమ్మితంగా మాట్లాడటం ఆయన నైజంలా తోస్తుంది. అలా అన్జెప్పి అవసరమైన సందర్భాల్లో విమర్శనాత్మకతని వదులుకున్న జాడలు కూడా లేవు. ఖచ్చితత్వం ఆయన విమర్శకు నిండుదనం తెచ్చింది. అనుమాండ్ల భూమయ్య మాలపల్లిని ఆధునిక మహాకావ్యంగా అభివర్ణించారు. దాని లోతుల్లోకి వెళ్లే ముందు మహాకావ్య లక్షణాల్ని ఆధునిక నవలకి అన్వయించడంలో గల ఔచిత్యాన్ని రాచపాళెం ప్రశ్నించారు.

సంప్రదాయవాది అయిన భూమయ్య చేసిన మాలపల్లి పునర్మూల్యాంకనాన్ని విశ్లేషిస్తూ రాసిన యీ వ్యాసం అభినందన సంచిక కోసం రాసినదైనప్పటికీ మోమాటం పక్కనపెట్టి అంతర్జాతీయంగా జాతీయంగా ప్రాదేశికంగా మర్క్సిజానికి మార్క్సిస్టు సాహిత్యానికి కాలం చెల్లింది అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో శ్రీశ్రీని మహాకవిగా కాకుండా ఉన్నవని మహాకవిగా ముందుకు తేవడం వెనుక వున్న వ్యూహాన్ని గుర్తించారు. అలాగే సీతారాం ‘అదే పుట’పై రాసిన వ్యాసం కూడా అభినందన సంచిక కోసం రాసినదే అయినప్పటికీ సీతారాం విమర్శలోని నవ్యత్వాన్ని గుర్తిస్తూనే ప్రజా పక్షం వహించిన విశాలమైన సాహిత్యం మీద అతను యెందుకు మాట్లాడలేదు అని విస్తుపోతారు. ఇటువంటి వుదాహరణలు విమర్శకుడిగా రాచపాళెం వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి.

‘తెలుగు సాహిత్య విమర్శ ఇటీవలి ధోరణులు’ వ్యాసం ముగింపులో తెలుగు సాహిత్య విమర్శ ‘వైవిధ్యం, విస్తృతి, సైద్ధాంతిక బలం’ అనే త్రిసూత్రాల మీద నిర్మింపబడి ప్రయాణిస్తున్నది అంటారు. ఈ త్రిసూత్రాలను రాచపాళెం గారి విమర్శకు కూడా అన్వయించుకోవచ్చు. సైద్ధాంతిక బలం లేని విమర్శ కాలానికి నిలవదన్న స్పష్టమైన యెరుకతో రాసిన విమర్శావరణం నుంచి నాలాంటి ఔత్సాహికులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం. అందుకే యీ సమీక్షని చంద్రశేఖర రెడ్డి మాటలతోనే ముగించుకుందాం.

“సాహిత్యం జీవనది వంటిది. అది నిరంతర ప్రవాహ శీలి. పరిణామశీలి. నేల స్వభావాన్ని బట్టి నది నీటి రుచి మారినట్లు స్థల కాలాలను బట్టి సాహిత్యం తన సారాన్ని, తన రూపాన్ని మార్చుకుంటుంది. అలాగే తన కర్తవ్యాన్ని తన పక్షపాతాన్ని కూడా మార్చుకుంటుంది. సాహిత్యానికుండే పరిణామ శీలాన్ని గుర్తించకపోతే దానిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అలాగే కొత్తనీటిలో పాతనీటి స్వభావ లక్షణాలుంటాయి. కొత్త సాహిత్యం పాత సాహిత్యాన్ని జీర్ణం చేసుకుని పుడుతుంది. ఈ పరిణామాన్ని చారిత్రక క్రమంలో సరైన దృక్పథంతో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.”

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “సాహిత్య విమర్శలో యుద్ధ నీతి

  1. లోతైన విశ్లేషణ చేయడంలో మీరు ముందుంటారు …సాధికారత అన్న ఒక్క పదం ఆయన్ని అన్ని కోణాల్లో నిలబెడుతుంది ..మీ ఇద్దరికీ అభినందనలు ..

    ముకుంద రామారావు,
    హైదరాబాద్

Leave a Reply