సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత – 2

ఇవ్వాళ బహుజన సాహిత్యం గా మనం పిలుస్తున్న సాహిత్యం లో కనిపించే తాత్వికత అంబేద్కర్ తాత్వికతే. నిజానికి ఈనాడు విప్లవ, వామపక్ష గొడుగు కింద వస్తున్న సాహిత్యం లోనూ అంబేద్కరిస్టు తాత్వికత ప్రభావం ఉంది.

బహుజన సాహిత్యం అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు పూర్తిగా భిన్నమైనది. పేదవాళ్ళంతా ఒకటి, బాధలన్నీ ఒకటి అనే అభ్యుదయ ప్రగతివాద దృష్టికి భిన్నమైనది బహుజన దృష్టి. కుల మతాలు సృష్టించిన అసమానతల వల్ల పేదవాళ్ళంతా ఒకటిగా వుండే అవకాశమే ఈదేశంలో లేదని బహుజనవాదం అవగాహన. పేదవాళ్ళలోనూ పైకులాల పేదల బాధలకీ కింది కులాల బాధలకీ ఉన్న తేడాను ఇది గుర్తిస్తుంది. పైకులాల్లోని పేదలు కులం ద్వారా వారికి సంక్రమించిన సాంఘిక అధిపత్యంతో తమతోటి పేదలైన పీడితకులస్తుల మీద పెత్తనం చేయడాన్నీ, పీడించడాన్నీ బహుజనవాదం ఎత్తి చూపుతుంది. ‘చిక్కనవుతున్న పాట’, ‘పదునెక్కిన పాట’ దళిత కవితా సంకలనాలు ఈ తాత్వికతకు పెద్ద నిదర్శనాలు. ఇంకా నిశాని, విడి ఆకాశం, గుండెడప్పు, బహు వచనం, లాంటి పుస్తకాలు ఈ తాత్విక దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్ళాయి.

కనుక బహుజన సాహిత్యంలో పేదరికాన్ని చిత్రిస్తూనే దానికున్న కుల పునాదినీ, స్వభావాన్ని వెల్లడి చేయడం చూస్తాం. కేవలం ఆకలి బాధలే కాక ఆత్మగౌరవలేమి నుంచి వచ్చే క్షోభ దీనికి ప్రధాన వస్తువవుతుంది. అధికసంఖ్యాకులకి ఆత్మగౌరవం లేకుండా చేయడం ద్వారా వారిని ఆకలికీ అధికారలేమికీ ఆదాయరాహిత్యానికీ గురిచేస్తున్న కులవాస్తవికతని బహుకోణాలనుంచి ప్రదర్శిస్తుంది బహుజనవాద సాహిత్యం. అందుకే ఇది రాజ్య హింసకంటే సాంఘిక హింసకు ప్రాధాన్యతనిస్తుంది.దానివెనకున్న బ్రాహ్మణవాద భావజాలాన్ని ఎండగడుతుంది. బహుజనులపురోగతి దారిలో అడుగడుగునా కుల సర్పం అడ్డువస్తున్న తీరుతెన్నులను చిత్రిస్తుంది. బహుజన రాజ్యాధికార భావన తాలూకు సాంస్కృతిక వాయిస్ గా పని చేస్తుంది.సామాజిక న్యాయాన్ని పునాదిగా జేసుకున్న ప్రగతిని దర్శనీకరిస్తుంది. స్వేచ్చా సమానత్వం సౌబ్రాతృత్వంలను ప్రాణంగా కలిగివున్న అంబేడ్కరిజాన్ని తాత్విక దృక్పధంగా స్వీకరిస్తుంది. SC, ST, బీసీ, మైనారిటీల ఐక్యతనూ,బహుజనుల పట్ల అగ్రకుల ప్రగతి వాదుల సంఘీభావాన్నీ ఆకాంక్షిస్తుంది. భారతీయ వ్యవస్థ యొక్క అగ్రకుల హిందూ పురుష స్వభావాన్ని నిర్దిష్టంగా విమర్శిస్తుంది. ఈ వ్యవస్థ యొక్క కుల, మత పోరాటాల చరిత్రని గ్రంధస్తం చేస్తుంది. ఆనాటి వీర బ్రహ్మం, జాషువాల నుంచి ఈనాటి బహుజన సాహితీవేత్తలంతా తమతమ రచనల ద్వారా కవిత్వం ద్వారా సైద్ధాంతిక చర్చల ద్వారా మనకందించిన సారాంశమిదే.బుద్ధుడు, రవిదాసు, కబీర్, పోతులూరి వీరబ్రహ్మం, పూలే , అంబేద్కర్, పెరియార్ ల ఆచారణా ఆలోచనల వెలుగులో రూపొందిన సారాంశమిది.ఈరీత్యా బహుజన కవిత్వానికి ఉన్న ప్రాపంచిక దృక్పధం అంబేడ్కరిజం అని మనం మరువరాదు.

విప్లవ సాహిత్యం సమాజాన్ని విప్లవీకరించాలంటూనే భారతీయ సమాజ పునాదిగా ఉన్న కులాన్నీ, దాని పీడననూ వర్గ దృక్పథం లో భాగంగా చూసింది. ఫలితంగా కులానికి కారణమైన హిందూ విలువలనీ, ప్రతీకలనీ, దేవుళ్ళనీ ప్రగతి చిహ్నాలుగా స్వీకరించింది. బహుజన సాహిత్యం అలా కాదు.హిందూ విలువల్ని ప్రతికూల విలువలుగా, రాముడు, కృష్ణుఫు, విష్ణు, శివుడు మొదలగు హిందూ దేవుళ్లను విలన్లుగా చిత్రిస్తుంది. వీరి మీద యుద్ధం జేసిన రాక్షసులను ఆది బహుజన నాయకులుగా రక్షకులుగా కీర్తిస్తుంది.తొలి బహుజన విప్లవకారులుగా వర్ణిస్తుంది.పేదరికం పోతే అంతా మారుతుందనే వాదనను తప్పుబట్టి కులవ్యవస్థ పోతే పేదరికమూ పోతుందని వాదిస్తుంది. ధనమేరా అన్నిటికీ మూలం అనే ఆలోచనబదులు ధనంతో పాటు మిగతా అన్నిటికీ కుల మతాలే మూలంగా వ్యవహరిస్తున్న తీరుతెన్నుల్ని వెల్లడి చేస్తుంది బహుజన సాహిత్యం.శుష్క దేశభక్తి కన్నా,మూఢ దైవ భక్తికన్నా సమానత్వం, సౌబ్రాతృత్వం స్వేచ్ఛను బోధించే రాజ్యాంగ స్ఫూర్తి గొప్పదని బహుజన కవులూ, రచయితలూ ఎలుగెత్తి చాటుతారు.

ఈ దృష్టితో చూసినప్పుడు నేడు మెజారిటీ పేరుతో, జనామోద వాదం పేరుతో హిందూత్వ శక్తులు ముస్లింలనూ, క్రైస్తవులనూ, SC లనూ మూక దాడులకు గురిచేసి, బ్రతుకుతెరువుకు దూరం చేస్తున్న వాస్తవాన్ని బహుజన సాహిత్యం ఎండ గడుతుంది.మత రాజకీయాల స్థానే మానవ నిర్మాణ రాజకీయాలకు పట్టం కడుతుంది. బహుజన సంస్కృతినీ, ప్రతిభనీ, సృజననీ సెలబ్రేట్ చేస్తుంది మన కవిత్వం.బహుజన జీవన విధానంలోనే ఉన్న ప్రజాస్వామిక మాధుర్యాన్నీ, ఉన్నత విలువలనీ గొప్పగా పాడుతారు బహుజన కవులు.రాజ్యాధికార భావన ద్వారా రాజకీయ విముక్తి వైపుకూ,హిందూ మత చాందసాన్ని విడనాడటం ద్వారా మానసిక విముక్తి వైపుకూ బహుజనులను సన్నద్ధం చేసే అంబేడ్కరిజాన్ని మార్గదర్శకంగా స్వీకరించి ముందుకుపోతుంది బహుజన కవిత్వం. ఒకపక్క బహుజన రాజకీయ విముక్తి , మరొకపక్క బహుజన మానసిక విముక్తీ ధ్యేయంగా అంతిమంగా కులనిర్మూలనను సాదించటానికి కదిలే బహుజన ఉద్యమాలకు సాంస్కృతిక బాసటగా నిలిచేదే బహుజన కవిత్వం.

కవిత్వం, కధ, నవల, విమర్శ మున్నగు ప్రక్రియలలో పైన చెప్పుకున్న తాత్వికత స్పష్టంగా కనిపిస్తుంది.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

Leave a Reply