సాహిత్యంలో ‘విమర్శ’

సాహిత్యం ప్రజాపక్షపాతంగా ఉన్నదా, కవి పక్షపాతంగా ఉన్నాడా అని విడమరిచి చెప్పేందుకు ‘విమర్శ’ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. బహుముఖమైన మానవ జీవితానికి సాహిత్యం ఎంత అవసరమో విమర్శ కూడా అంతే అవసరం.

సాహిత్య ప్రక్రియలలో ఒకటైన విమర్శ చాలా ప్రత్యేకమైన ప్రక్రియ. మిగతా ప్రక్రియలు కవుల, రచయితల సృజనాత్మకతపైన ఆధారపడేవి. కానీ విమర్శ ఆయా రచనలను తరచి చూపే, తెరచి చూపే వచన ప్రక్రియ. విమర్శ ఏదైనా రచనను ఆశ్రయించుకొని సాగుతుంది. మూల రచనలోని ముఖ్య విషయాన్ని వెలికితీయడమైన, కవి అభిప్రాయాల్ని, కావ్య లేదా రచనల ప్రయోజకత్వాన్ని విడమరిచి చెప్పేదే విమర్శ. ఈ రచన బాగా లేదు, ఈ రచన చాలా బాగున్నది అనే అంశాన్ని పూర్వపరాలు యోచించి ఆయా రచన బాగున్నది అని, బాగా లేదు అన్నప్పుడు ఎందుకు బాగలేదు, ఎక్కడ బాగాలేదు, ఎట్లా బాగాలేదని అంటున్నావో, బాగుంటే ఏయే అభివ్యక్తితో బాగుందని అంటున్నావో విమర్శకుడు చెప్పి తీరాలి.

‘వి’ అనే ఉపసర్గకు ‘మృశ్’ అనే ధాతువును కలిగివున్న విమర్శ అనే పదం చాలా సాధారణమైన విషయాలైన మానవ సంబంధాలు, నిత్యజీవన వ్యవహారాలలోనూ సర్వసాధారణంగా ఉపయోగిస్తుంటారు ప్రజలు. ఈ ధోరణి సాహిత్య విమర్శకుల్లో ఉంటే సరిపోదు. పరిశీలన చేయడం, పరీక్షించి చూడడం, చర్చించడం, పరామర్శించడం అన్నీ కూడా ప్రామాణికంగా ఉండాలి. ఒక్కో ప్రక్రియకు ఒక్కో విమర్శ విధానం ఉంటుంది. ఉదాహరణకు… కవిత్వాన్ని విమర్శించేప్పుడు ఆయా కవిత్వాలలో వుండే ధ్వని విశేషాలను, వస్తు నిర్మాణ సౌష్టవాలను పసిగట్టి విడమర్చి చెప్పాలి విమర్శకుడు. అప్పుడే కవికి, పాఠకునికి వారధిగా వుండగలుగుతాడు. కవి హృదయాన్ని నిష్పాక్షికంగా ఏ విమర్శకుడైతే వ్యక్తీకరిస్తాడో ఆ విమర్శకుడే సద్విమర్శకుడు. అంతే కానీ రచయిత వ్యక్తిగత జీవన సరళి నచ్చనంత మాత్రాన్నో రచయిత ఎంచుకున్న అంశం నచ్చనంత మాత్రాన్నో ఆ కావ్యాన్ని బాగాలేదని చెప్పేయడం కువిమర్శకుడి లక్షణం.

విమర్శలో వివరణాత్మక, అభినందనాత్మక, తులనాత్మక, నిర్ణయాత్మక అనే నాలుగు బేధాల విమర్శలున్నాయి. వివరణాత్మక అంటే వ్యాఖ్యానాత్మకంగా, ప్రతిపదార్థ సహితంగా ఉన్నది ఉన్నట్టు వివరించడం. ఇక అభినందనాత్మకం పేరును బట్టి విషయం తెలుస్తున్నది. తులనాత్మక విమర్శ అంటే ఇతర భాషల్లోని సాహిత్యంతో పోలుస్తూ నిశితంగా పరిశీలించి విమర్శ చేయడం. ఇది ఎక్కువ ప్రచారంలో ఉన్న విమర్శ. ఇందులో పురాణ దేశీయ సాహిత్యాన్ని విదేశీ సాహిత్య సిద్ధాంతాలతో విమర్శ చేయడం సరికాదని, ప్రాచీన సాహిత్యాన్ని విమర్శ చేసేటపుడు ఆధునికమైన నవతరపు దృష్టితో విమర్శ చేయకూడదని ముఖ్యంగా చెప్తుంటారు. ఈ తులనాత్మక విమర్శతో ఒక్కో యుగానికి మధ్య ఉన్న తేడాలను గ్రహించవచ్చు. ఇక చివరిదైన నిర్ణయాత్మక విమర్శలో విమర్శకుడికి స్వేచ్ఛ ఉండదు. ఇది పాక్షిక విమర్శ. రచనలోని వర్ణణలలోనూ, శైలినో, అలంకారాది ఛందస్సునో ఆధారం చేసుకుంటూ విమర్శ సాగుతుంది. పూర్వం చేసిన నిర్ణయాల ఆధారంగా విమర్శించే విమర్శ కాబట్టి నిర్ణయాత్మక అంటే Judicial criticism అంటారు.

విమర్శ పద్ధతిలో స్థూలంగా విమర్శించేదేమంటే అది అంతా కాలానుగుణంగానే సాగుతుంది. విమర్శ సృజనాత్మకంగా పాఠకుడు ఆలోచించడానికి అనుగుణంగా సిద్ధం చేస్తుంది. స్వతంత్ర విమర్శ Inductive Critism లో ఎన్నో కొత్త విషయాలున్నాయి. ఆయా సాహిత్యానికి విలువ కట్టేందుకు ఈ విమర్శ వీలవుతుంది. దీనికి ఏవీ నియమాలుండవు. అయితే ఇందులోనూ విమర్శకుని ఆలోచనకు అనుగుణంగానే విమర్శ సాగుతుంది. ఇదే ఇందులోని లోపం. ఇట్టా ఆత్మాశ్రయ ధోరణిలో సాగే ఈ స్వతంత్ర విమర్శ.

ఇక ఆధునిక విమర్శలో గ్రంథ పరిష్కారం నుండి మొదలుకుంటే అందులోని ఆలంకారిక విషయాలు, సాంఘిక విషయాలు, నైతిక విషయాలు, కవి జీవిత విమర్శ విషయాలు, దాన్ని మనో వైజ్ఞానికంగా (Psychological)గా విమర్శ చేయడాలు అన్నీ ఉంటాయి. ఈ సాహిత్య విమర్శలో లలిత కళలను, వాటి సంబంధిత సాహిత్యాలనూ విమర్శ చేయడం ఒక పద్ధతిలో సాగుతుంది.

భారతీయ అలంకారికులు ప్రసిద్ధిచెందిన విమర్శకులు. ఒక దృక్పథంతో విమర్శలు చేసారు. రస దృక్పథం, అలంకారిక దృక్పథం, వక్రోక్తి దృక్పథం, ఔచిత్య దృక్పథం… ఇట్లా సాగుతాయి.

విమర్శలో కావ్య విమర్శ, నాటక విమర్శ, కథా విమర్శ, నవలా విమర్శ, వ్యాస విమర్శ వివిధ పద్ధతుల్లో ఉంటాయి. ఈ అన్ని ప్రక్రియల్లోంచి సంఘ సంస్కరణ భావంతో చేసే విమర్శ ఉంటుంది. అది కాల్పనిక సాహిత్యాన్ని చేసే విమర్శ ఒకటి. అభ్యుదయ భావజాలంతో చూస్తూ చేసే విమర్శ ఒకటి. హేతువాద దృక్పథంతో చేసే విమర్శ ఒకటి… ఇట్లా వేర్వేరుగా విభజించుకోవాలి. మళ్లీ ఈ విమర్శల్లోనూ ముఖ్య ఉద్దేశ్యాలు, నిర్వచనాలు, రూప సారూప్యాలు, ప్రయోజనాలు, విమర్శ నేపథ్యం ఇవన్నీ వస్తాయి. ఆయా రచనల ధోరణులు, దృక్పథాలు, వాటి లక్షణాలు చర్చించాలి. సాహిత్య పరిణామ క్రమాన్ని అనుసరిస్తూ యుగాలు వస్తాయి, ఇజాలు వస్తాయి. సాహిత్యం కళ్లు తెరిచిన ఆ పాతకాలపు రచనల నుండి నేటి అత్యాధునిక ప్రస్తుత సాహిత్యం వరకు విమర్శ వల్లనే పాఠకులకు అంతర్భావ సహితంగా అందుతున్నది.

పింగళి లక్ష్మీకాంతం, కేవీఆర్ నరసింహం, దివాకర్ల వెంకటావధాని, ఖండవల్లి లక్ష్మీరంజనం, కోరాడ రామకృష్ణయ్య, ఎస్వీ రామారావు, ఎస్వీ జోగారావు, జీవీ సుబ్రమణ్యం వంటివారు, సింగిరెడ్డి నారాయణరెడ్డి, సంపత్కుమారాచార్యులు, దాశరథి రంగాచార్యుల వంటివారు ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు. కట్టమంచి రామలింగారెడ్డి, చిలుకూరు నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, జయంతి రామయ్య పంతులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ, బండారు తమ్మయ్య, నోరి నరసింహ శాస్త్రి, త్రిపురనేని రామస్వామి, తాపీ ధర్మారావు, చలం, దీపాల పిచ్చయ్య శాస్త్రి, నండూరి రామ కృష్ణమాచార్యులు, బూదరాజు రాధాకృష్ణ, వడలి మందేశ్వరరావు, అక్కిరాజు రమాపతి రావు వంటి వారు ప్రముఖ విమర్శకులు. గుంటూరు శేషేంద్ర శర్మ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, రాయప్రోలు, విశ్వనాథ సత్యనారాయణ వంటి విమర్శకులు అటు కవులుగా, ఇటు విమర్శకులు గానూ ప్రసిద్ధులు. సర్దేశాయి తిరుమలరావు, కొమర్రాజు లక్ష్మణరావు, ధూపాటి వెంకటరమణాచార్యులు, తిరుమల రామచంద్ర వంటి విమర్శకవేత్తలు సాహిత్యంలో విమర్శను చేపట్టినవారు.

నేటి తరానికి ఆదర్శప్రాయంగా ఉన్న విమర్శకులు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. కొలకలూరి ఇనాక్, ఎన్. గోపీ, కాత్యాయని విద్మహే, ముదిగంటి సుజాతారెడ్డి, సుప్రసన్నం శ్రీ రంగాచార్యులు, ఎస్వీ రామారావు, కేపీ అశోక్ కుమార్, సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్వీ సత్యనారాయణ, వెలుదండ నిత్యానందరావు, గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, లక్ష్మణ చక్రవర్తి, హనుమాండ్ల భూమయ్య, మసన చెన్నప్ప, కాసుల ప్రతాపరెడ్డి వంటి ఎందరో రచయితలు సాహిత్య విమర్శలో ఉన్నవారు.

సాహిత్య విమర్శకులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలను గమనిస్తే సాహిత్యం పట్ల, వివిధ రచనల పట్ల కుతూహలం, అవగాహన ఉండాలి. విస్తృత పరిచయం లేనిదే మంచి చెడ్డల్ని నిర్ణయించే సామర్థ్యం ఉండదు కాబట్టి అటు సంప్రదాయ సాహిత్యంపైనా, ఇటు ఆధునిక సాహిత్యం పైనా మంచి పట్టు ఉండాలి. సహృదయత, విశాల దృష్టి, దార్శనికత, సునిశిత బుద్ధి, సూక్ష్మ దృష్టి, నిలకడ ఉండాలి. అప్పుడే రచనను భావి తరానికి దిక్సూచి వంటి విమర్శా సాహిత్యాన్ని అందించగలుగుతారు. వీటితో పాటు పరిశ్రమించే సామర్థ్యం వుండాలి. ఆవేశం పనికి రాదు. ఆదర్శమైన జీవన విధానం ఉండాలి. పిరికితనం, మొండితనం ఉండొద్దు. ముఖ్యంగా మిత భాషిత్వంతో ఉంటే అమితమైన భావస్పోరక రచనలు చేయగలుగుతారు. ఇట్లా బహుముఖమైన ప్రజ్ఞ ఉన్నప్పుడే ధైర్య సాహసాలతో విమర్శించగలుగుతారు. ఓర్పు, నేర్పు రెండు భుజాలైనప్పుడే సరళమైన, ఉత్తమమైన విమర్శ చేయగలుగుతారు.

విమర్శ చేయాలనుకునే రచనపైన విమర్శకుడు కొన్ని సూత్రాల్ని సిద్ధం చేసుకోవాలి. విమర్శ వాటికనుగుణంగా అన్వయించుకుంటూ సాగాలి. కవిత్వానికైతే ఒక విధమైన, వచనానికైతే ఒక విధమైన సరళిలో సాగాలి విమర్శ. తన అభిరుచులను, తన స్వభావాన్ని రచనపై రుద్దకూడదు. నిరంతర పఠనం ఎంత సహకరిస్తుందో, నిరంతర అన్వేషణ కూడా కవుల్ని, రచయితలను తనదైన దృష్టి కోణంలో అన్వేషిస్తూ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది సమాజానికి ఆవల ఉంటే కుదరదు. భిన్న మత సంస్కృతులున్న దేశంలో ఉన్నపుడు పరమత సహనం, కులాల అంతరం, ఆంతర్యం, వృత్తులు, పనులు ఆవశ్యకత, అవసరాలు అన్నీ విశ్లేషించుకుంటూ ఉండాలి. అప్పుడే విమర్శకు న్యాయం చేసిన వారవుతారు విమర్శకులు.

సమాజంలో అనుక్షణం అనేకానేక మార్పులు వస్తుంటాయి. అవన్నీ ఆకళింపు చేసుకోవాలి. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడిని, ఇప్పటి మిక్సీ పచ్చడిని ఒక్కటి చేయకూడదు, కొత్త పచ్చడిని తయారు చేయకూడదు.

మారుతున్న సమాజం ఆ సమాజానికి తగినట్టు మారే విలువలు అన్నీ విజ్ఞతతో అంచనా వేసుకోకుంటూ మహోన్నతమైన ఆలోచనలతో విమర్శ చేసినప్పుడే ఉత్తమ విమర్శకులవుతారు. వ్యక్తిగత అభిప్రాయాలతోనూ, వ్యక్తి విమర్శతోనూ సాహిత్యాన్ని చూడకూడదు. నిష్పక్షపాతంగా విమర్శ లక్షణాలకు లోబడి చేసే విమర్శ మూల రచనను చదవాలన్న ఆసక్తిని కలిగించేలా ఉండి ఉంటే విమర్శ పది కాలాలు నిలుస్తుంది.

పూర్వం నుంచే సాహిత్య విమర్శకుల్లో సంప్రదాయ పునరుజ్జీవ దృక్పథాలు ఉండేవి. నవ్య సంప్రదాయ దృక్పథాలకు నాంది ప్రస్తావనలుగా రచనలు ఉండేవి. ఆధునిక భావాలు (Modern Thoughts), అభ్యుదయ దృక్పథాలు (Progressive Outlooks) అనేవి సాహిత్య విమర్శకు సిద్దాంతాలకు జీవగర్రలు. ఎప్పుడూ ఒక తరంపై ముందు తరం ప్రభావం తప్పక ఉంటుంది. శాస్త్రీయ దృక్పథంతో నిర్దిష్టమైన విమర్శ చేస్తే ఎవరి మనో భావాలూ దెబ్బతినవు. ఉన్నపళంగా రెక్కలు విదిలిస్తూ ఏదో కొత్త లోకంలోకి విహరించలేమన్నది దృష్టిలో పెట్టుకుంటూ సాగాలి విమర్శ. కొత్త ప్రతిపాదనలు ఏవైనా చేయాలనుకుంటే ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి. అప్పుడే సమాజం ముందడుగు వేసేలా విమర్శా రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రక్రియ ప్రధానంగా సాహిత్య విమర్శను విశ్లేషించుకుంటూ రచయితలు విమర్శను చేపట్టాల్సిన అవసరం ఉన్నది.

పుట్టింది చిన్న పెండ్యాల, వరంగల్. కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత, ఉపన్యాసకురాలు. ఎం.ఏ. తెలుగు, టి.పి.టి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ (ఒద్దిరాజు సోదరులు, జీవితం, సాహిత్యం) పరిశోధన చేశారు. 20ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనలు: 1. అర్ర తలుపులు, 2. నిర్నిద్ర గానం, 3.ఎనిమిదో అడుగు(కవితా సంకలనాలు). జీవిత చరిత్రలు: (తెలుగు అకాడమీ)1. చిత్రకళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు, 2. పెండ్యాల రాఘవరావు (నా ప్రజా జీవితం), 3. ఒద్దిరాజు సోదరులు, అమెరికాలో ఆరునెలలు(యాత్రా చరిత్ర). వ్యాసహారిక, సృజన రంజని(సాహిత్య విమర్శ), తెలంగాణ వేగుచుక్కలు- ఒద్దిరాజు సోదరులు (పరిశోధన గ్రంథం), ప్రస్తుతం 'తెలంగాణ సాహిత్యంలో స్త్రీల సాహిత్యం' పై పరిశోధనాత్మక రచన చేస్తున్నారు.

Leave a Reply