సెప్టెంబర్ 11, 1973 – మృత్యుముఖంలో సాల్వడార్ అయెందే చివరి సందేశం

అది సెప్టెంబరు 11, ఆ బీభత్సపు మంగళవారపు ఉదయాన, మా ఇంటిపైన యుద్ధ విమానాలు ఎగురుతూ వున్న శబ్దాలతో నేను మేల్కొన్నాను. ఒక గంట తర్వాత నగరం నడిబొడ్డున పొగలు సుళ్ళు తిరుగుతూలేవడాన్ని చూశాను. జీవితం, శాశ్వతంగా మారిపోయినట్లనిపించింది, నా జీవితమూ, నా దేశపు జీవితమూ శాశ్వతంగా మారిపోయాయి.

– ఎరియల్ డార్ఫ్ మన్, ఇంకొక సెప్టెంబర్ 11 గురించి

అది సెప్టెంబర్ నెల మొదటి వారం. కొన్ని సంవత్సరాల క్రితం మాడ్రిడ్ నగరంలో అనుకోకుండా సాల్వడార్ అయెందే  అన్న పేరుతో ఒక వీధి కనిపించింది. ఆగి చూస్తే, స్పానిష్ భాషలో అక్కడే నెలకొల్పిన స్మారక చిహ్నం కనిపించింది. తన వివరాలు అందులో ఉన్నట్లు అర్ధమౌతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే, ఇంకొక స్మారక చిహ్నం. తరచి చూస్తే, అది సెప్టెంబరు 11, 1973 న అయెందే  చనిపోవడానికి కొన్ని గంటల  ముందు చిలీ ప్రజలని ఉద్దేశించి ఇచ్చిన రేడియో  ఉపన్యాసంలోని మాటలని తేలింది.

ఒక్కసారి జ్ఞాపకాలు ముసురుకున్నాయి. శివసాగర్ కవిత వివాలా! శాంటియాగో! గుర్తుకొచ్చింది.

శాంటియాగో! శాంటియాగో!

అలెండిజం హత్య చేయబడింది
అలెండిజం ఆత్మహత్య చేసుకుంది
మిత్రుడు ఫైడల్ కాస్ట్రో కానుకగా ఇచ్చిన
సబ్ మెషిన్ గన్ తో కాల్చుకుంటేనేం?
శత్రువు మెషిన్ పిస్టల్ కాల్పులకు… ఒకటి
రెండు… మూడు.. పదమూడు గాయాలతో
ఈడిగెలబడితేనేం!

నేడు అలెండిజం వినాడెల్ మారోలో భూస్థాపితమయింది
బూర్జువా ప్రజాస్వామ్య జాజ్ మ్యూజిక్ కు
వూగి వూగి నేడు అలెండిజం హీనంగా నేలకూలింది
బ్యూనోస్ ఎయిర్స్ ట్యాంగో క్లబ్బుల్లో
తాగి తాగి నేడు అలెండిజం హీనంగా కుక్కచావు చచ్చింది


వివరాలు తెలిసిన కొద్దీ, సాల్వడార్ అయెందేని తృణీకరించడం సరికాదనే అనిపించేది. తర్వాతి కాలంలో శివసాగర్ ని చాలాసార్లు ముఖాముఖి కలిసి వేర్వేరు విషయాలు చర్చించినా, ఆ కవిత గురించి అడగాలని వున్నా, ఎందుకోగానీ అడగలేదు. కృశ్చెవ్ పరివర్తన శాంతియుత పరివర్తన సిద్ధాంతం,  ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడం,  ఆ తర్వాతి పరిణామాలు అన్నిటినీ గమనంలో వుంచుకున్నా,  ఆనాటి ఘటనల్ని  మనం  మళ్ళీ అంచెనా వేసుకోవాల్సిందే. సోవియట్ యూనియన్ నాయకత్వం తనని వెన్నుపోటు పొడిచిందని అయెందే గుర్తించాడు కూడా.

ఇది అప్పుడు అడగకుండా మిగిలిపోయిన ప్రశ్నకీ, చనిపోయిన శివసాగర్ ఇప్పుడు ఇవ్వలేని సమాధానానికీ మధ్య చర్చ కాదు. ఈ కవిత రాసింది శివసాగరే అయినా, అది ఒక్క వ్యక్తి అభిప్రాయం కాదు. ఆనాటి రాజకీయ వాదవివాదాల నేపథ్యంలో ఒక శిబిరంలోని  అందరి అభిప్రాయాల వ్యక్తీకరణే అది,.

చిలీ సోషలిస్టు నాయకుడు సాల్వడార్ అయెందే 1970 నవంబరు లో ఎన్నికలద్వారా అధికారంలోకి వచ్చాడు. సోషలిజానికి తనదైన చిలీ మార్గం ద్వారా శాంతియుతంగా సామాజిక పరివర్తనని సాధించవచ్చునని బలంగా విశ్వసించాడు. అధికారంలోకి రాగానే పరిశ్రమలు, గనుల జాతీయ కరణ, విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వ నియంత్రణ, కనీస వేతనాల పెంపుదల, భూముల పంపకం వంటి చర్యలను స్థిరంగా అమలు చేయడం మొదలుపెట్టాడు. దీనితో అమెరికా సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు, అభివృద్ధి నిరోధకులు కలిసి సైనిక కుట్ర ద్వారా సాల్వడార్ అయెందే ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ఆగస్టో పినోషే ఆధ్వర్యంలో  సైనిక నియంతృత్వ పాలన నెలకొల్పారు. సెప్టెంబరు 11, 1973 న సైనిక కుట్రలో భాగంగా అధ్యక్ష నివాస ప్రాసాదంపై దాడి చేశారు. సాల్వడార్ అయెందే ఈ కుట్రని ఎదిరిస్తూ నేలకొరిగాడు.


సాల్వడార్ అయెందే ఎలా మరణించాడన్న విషయంపై చర్చ చాలా కాలంపాటు కొనసాగింది. ఆత్మహత్యనా, హత్యనా అన్న వివాదం కొనసాగింది.  ‘మర్డర్ ఆఫ్ అయెందే అండ్ ది ఎండ్ ఆఫ్ చిలియన్ వే ఆఫ్ సోషలిజం’ అన్న పుస్తకంలో రాబిన్సన్ రోయాస్ సాల్వడార్ అయెందే మృతదేహం గురించీ, అధికారిక కథనాలలో వైరుధ్యాల గురించీ వివరంగా చర్చించాడు. 1990ల తర్వాత అయెందే ఆత్మహత్యకి పాల్పడి ఉండవచ్చనే వాదనలు బలపడ్డాయి. 2011 లో విచారణ, అస్థికల పరిశీలనల అనంతరం తనది ఆత్మహత్యయేనని నిర్ధారించారు. అయితే, అది పినోషే సైనిక బలగాల చేతిలో హత్యనా, ఆత్మహత్యనా అన్నది అప్రస్తుతమనే చెప్పుకోవచ్చు. పినోషే బలగాల చేతిలో చిక్కినా తనని హత్య చేసేవాళ్ళు. సైన్యానికి అధికారం అప్పగించి, వాళ్ళు ఏర్పాటు చేసిన విమానంలో పారిపోవడానికి అంగీకరించినా, ఆ విమానం మధ్యలోనే కూలిపోయి ఉండేది. ‘అయెందేకి సంబంధించినంతవరకూ, మనం తనని దేశం నుండి విదేశాలకి పంపించివేస్తామనే ప్రతిపాదిస్తాము. కానీ, ఆ విమానం మధ్యలోనే కూలిపోతుంద’ని పినోషే ఒక సైనికాధికారికి చెప్పాడు కూడా. అందుకని, అది హత్యనా, ఆత్మహత్యనా అన్న చర్చలో నిజానిజాల్ని అటుంచితే సాల్వడార్ అయెందేది మాత్రం కుక్కచావు కానేకాదు, ప్రజలకోసం తుదివరకూ నిలబడిన ధీరోదాత్తమైన మరణం అనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే, అయెందే  ప్రభుత్వాన్ని కుట్రతో కూలదోసి అధికారాన్ని కైవసం చేసుకుని నెత్తురుటేరులు పారించి, శాసించిన సైనిక నియంత ఆగస్టో పినోషేదే దిక్కుమాలిన చావు. సైనిక కుట్రలో హత్యకి గురైన జనరల్ ప్రాట్స్ మనవడు, ఆ తెగబలిసి, ఉబ్బిపోయిన ఆగస్టో పినోషే మృతదేహం మీద కాండ్రించి ఉమ్మేసి తన అసహ్యాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తీకరించాడు.

సైనిక తిరుగుబాటు ప్రారంభమై అధ్యక్షుని అధికార  నివాసం లా మొనేదా ప్రాసాదాన్ని చుట్టుముట్టి బాంబు దాడులు సాగిస్తున్న సమయంలో దఫదఫాలుగా అయెందే ప్రజలని ఉద్దేశించి ప్రసంగించాడు. క్షణక్షణం పరిస్థితులు మారిపోతున్న సమయంలో, బాంబులు, తుపాకుల మోతల మధ్య, అత్యంత ప్రతికూల వాతావరణంలో మాట్లాడిన మాటలవి.   సాల్వడార్ అయెందే  ఉపన్యాసంలో మాటలు  తన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. భవిష్యత్తుపట్లా, ప్రజల పట్లా విశ్వాసానికీ నిదర్శనంగా నిలుస్తాయి.


చివరి మాటలు

ఉదయం 7.55 నిమిషాలకి రేడియో కార్పొరేషన్ ప్రసార కేంద్రం నుంచి ప్రసారమైన మొదటి ఉపన్యాసం

“లా మొనేదా ప్రాసాదం నుంచి రిపబ్లిక్ అధ్యక్షుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నిర్ధారించిన వార్తల ప్రకారం నౌకా దళంలోని ఒక సెక్షన్ వాల్పరైసో నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది (వాల్పరైసో శాంటియాగో నగరానికి తూర్పున 135 కిలోమీటర్ల దూరంలో వున్న, చిలీ దేశపు రెండవ అతిపెద్ద నగరం, కీలకమైన ఓడరేవు – అను). ఇది ప్రభుత్వం పైన, చిలీ పౌరుల ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా, చట్ట బద్ధమైన, న్యాయమైన అధికారానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు.

ఈ పరిస్థితులలో కార్మికులకు నేను పిలుపునిస్తున్నాను. అందరూ సంఘటితమై మీ కర్మాగారాలనీ, కార్యాలయాలనీ ఆక్రమించుకోండి. అయితే ప్రశాంతంగా ఉండండి, ప్రశాంత వాతావరణాన్నే కొనసాగించండి. ఇప్పటివరకూ శాంటియాగో నగరంలో సైనిక బలగాల కదలికలు మామూలుగానే వున్నాయి. శాంటియాగో నగరంలో తమ స్థావరాలకే పరిమితమై ఉంటుందని రెజిమెంట్ కమాండర్ నాకు తెలియజేశాడు.

ఏదేమైనా నేను అధ్యక్ష నివాస ప్రాసాదంలోనే వున్నాను, వుంటాను. ప్రజాభిప్రాయానికి కట్టుబడిన ప్రతినిధిగా నేను ఈ ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవడానికి సిద్ధంగానే వున్నాను.

కార్మికులందరూ అప్రమత్తంగా ఉండాలి, ఘటనలని శ్రద్ధగా గమనిస్తూ వుండండి. ఎవరూ రెచ్చిపోవద్దు. ముందుగా, చిలీ సైనికులు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాము. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాన్ని కాపాడుతామని వాళ్ళు  ప్రమాణం చేశారు. చిలీ దేశానికీ, సైనిక బలగాలకీ పేరు ప్రతిష్టల్ని కొనితెచ్చిన ఆ విశ్వాసపు సంప్రదాయాలకు సైన్యం కట్టుబడివుండాలి. ఈ పరిస్థితులలో సైన్యం నిర్వహించాల్సిన బాధ్యతలు ఏమిటో, వాటికి ఎలా కట్టుబడి పనిచేయాలో సైనికులకు తెలుసుననే నమ్మకం నాకుంది.

ఏది ఏమైనా ప్రజలు, ముఖ్యంగా కార్మికులు తమ కార్యాలయాల దగ్గర సమీకృతం కండి, పరిణామాలని శ్రద్ధగా గమనిస్తూ ఉండండి, కామ్రేడ్ అధ్యక్షుడు ఇచ్చే పిలుపుకి సిద్ధంగా ఉండండి.”

ఉదయం 8.10 నిమిషాలకి రేడియో కార్పొరేషన్ ప్రసార కేంద్రం నుంచి ప్రసారమైన రెండవ   ఉపన్యాసం

“చిలీ దేశ శ్రామిక ప్రజలారా, నేను మీ రిపబ్లిక్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను.

ఇప్పటివరకూ మనకు తెలిసిన వార్తల ప్రకారం వాల్పరైసో ప్రాంతంలో నౌకా దళం తిరుగుబాటు చేసింది. సైనిక విభాగం అక్కడికి వెళ్లి తిరుగుబాటుని అణిచివేయాలని నేను ఆదేశించాను.

అధ్యక్ష కార్యాలయంనుంచి వచ్చే ఆదేశాలకోసం చూడండి. నేను లా మొనేదా ప్రాసాదంలోనే వుంటాను. శ్రామిక ప్రభుత్వాన్ని పరిరక్షిస్తానని హామీ ఇస్తున్నాను. నవంబరు 4, 1976 వరకూ దేశ పాలనా బాధ్యతలు అప్పగించిన ప్రజల తీర్పుని అమలుజరుపుతానని హామీ ఇస్తున్నాను. మీరు మీ మీ కార్యస్థలాలలో అప్రమత్తంగా ఉండండి. నా మాటకోసం ఎదురు చూడండి.

తాము చేసిన ప్రమాణానికి కట్టుబడిన సైనికబలగాలు, సంఘటితమైన శ్రామికులు కలిసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టిన ఈ  ఫాసిస్టు సైనిక కుట్రని ఓడిస్తారు.”

ఉదయం 8.45 నిమిషాలకి రేడియో కార్పొరేషన్ ప్రసార కేంద్రం నుంచి ప్రసారమైన మూడవ  ఉపన్యాసం


ఉదయం 8.35 నిమిషాలకి పరిస్థితి మారిపోయింది. సైన్యం తన పరిధిని అతిక్రమించింది, రాజకీయాలలో సైన్యం జోక్యం చేసుకోబోదనే సూత్రాన్ని, ప్రమాణాలని ఉల్లంఘించింది. ప్రభుత్వానికి విధేయంగా ఉంటామని మాట ఇచ్చిన సైనికాధికారులు కుట్రలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు.  సైన్యం తన రేడియో ప్రకటనల ద్వారా హెచ్చరికల్ని జారీ చేసింది. అధ్యక్షుడు పదవినుంచి తప్పుకొని, అధికారాన్ని సైన్యానికి అప్పగించాలని ఆదేశించింది. అయెందే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న రేడియో కేంద్రాలు తమ ప్రసారాలని నిలిపివేయకపోతే ఆ ప్రసార కేంద్రాలపై విమాన దాడులు  చేస్తామని హెచ్చరించింది. దీంతో, ఉదయం 8.45 నిమిషాలకి, అయెందే మరో సారి రేడియోలో మాట్లాడాడు.

“పరిస్థితి ఇప్పుడు చాలా విషమంగా వుంది. మెజారిటీ సైనిక బలగాలు సైనిక కుట్రకి పూనుకున్నాయి… నేను ఈ పరిస్థితులని కోరుకోలేదు. నేను అమరవీరుణ్ణి కాదలుచుకోలేదు. నేను సామాజిక న్యాయం కోసం పోరాడేను, ప్రజలు నన్ను కోరిన కర్తవ్యాన్నే నిర్వహించాను. అయితే చరిత్రని వెనక్కి తిప్పాలని కోరుకుంటూ, ఈ దేశ ప్రజలలో అత్యధికుల అభీష్టాన్ని తిరస్కరించాలనుకుంటున్న వాళ్లొక విషయాన్ని అర్ధం చేసుకోవాలి… నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. చిలీ ప్రజల ఆకాంక్షలని నెరవేర్చకుండా వాళ్ళు నన్ను తూటాల బలంతో మాత్రమే ఆపగలరు. కానీ నేను చనిపోయినా, ప్రజలు మాత్రం ముందుకే సాగిపోతారు. తేడా ఒక్కటే, ఆ క్రమం మరింత కష్ట భరితం కావచ్చు, మరింత హింసాయుతంగా ఉండవచ్చు. ఎందుకంటే, ప్రజలకి అది ఒక అత్యంత స్పష్టమైన, వస్తుగతమైన గుణపాఠాన్ని నేర్పుతుంది. తమ ప్రయోజనాలని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధపడే వాళ్ళున్నారని ప్రజలకి అర్ధమౌతుంది… లా మొనేదా  ప్రాసాదం లోనే నేను నిలబడతాను. నా ప్రాణాల్ని ఒడ్డి అయినా సరే…”.


ఉదయం 9.03 నిమిషాలకి
రేడియో మాజెలానిస్ ప్రసార కేంద్రం నుంచి ప్రసారమైన నాలుగవ ఉపన్యాసం

ఆ తర్వాత ఒక్కొక్క రేడియో కేంద్రాన్నీ సైనిక బలగాలు బెదించి మూసివేయడం మొదలైంది. గియెర్మో రావెస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రేడియో మాజెలానిస్ చివరివరకూ నిలబడింది. నో నోస్ మోవేరాన్ (మేము అచంచలంగా దృఢంగా నిలబడతాం అనే )ప్రతిఘటనా గీతాన్ని పలుమార్లు ప్రసారం చేసింది.

మన ఈ దేశానికి అత్యంత ప్రియమైన విలువలని రక్షించడానికి నేను నా ప్రాణాలు అర్పిస్తాను. తాము చేసిన ప్రమాణాలకు కట్టుబడకుండా, ఇచ్చిన మాటకి కట్టుబడకుండా, సైనిక విధుల సూత్రాలని ఉల్లంఘించిన వాళ్ళు చరిత్రలో నీచులుగా నిలిచిపోతారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీరు రెచ్చిపోవద్దు, మిమ్మల్ని ఊచకోత కోసే అవకాశం ఇవ్వవద్దు, అయితే, మీ విజయాల్ని మీరే కాపాడుకోండి. మీ సొంత కృషితో మరింత ఉన్నతమైన, మెరుగైన జీవితాన్ని నిర్మించుకునే మీ హక్కుని మీరు కాపాడుకోవాలి.

ప్రజాస్వామికవాదులుగా ప్రకటించుకుంటూ, ఈ  తిరుగుబాటుని రెచ్చగొడుతున్న వాళ్ళకిఒక మాట. ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు గందరగోళానికి గురై, చిలీ దేశాన్ని ఒక ప్రమాదపు అంచులలోకి నెట్టే మూర్ఖమైన పనికి పాల్పడుతున్నారు.

అత్యంత పవిత్రమైన ప్రజల ప్రయోజనాల పేరుమీద, మన దేశం పేరు మీద నేను చెప్పేది ఒక్కటే – మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. హీనమైన నేరాలు, నిర్బంధం ఇవేవీ చరిత్రని అడ్డుకోలేవు, ఇప్పటి ఈ దశని మీరు అధిగమిస్తారు. ఇది ఒక కఠినమైన, బాధాకరమైన సమయం.

వాళ్ళు ఈరోజు మనల్ని నిలిపివేయవచ్చు. కానీ రేపు మాత్రం ప్రజలది, కార్మికులది. మెరుగైన జీవితాన్ని సాధించే కృషిలో మానవాళి ముందుకు నడుస్తుంది.

సహవాసులారా, వాళ్ళు బహుశా రేడియో కేంద్రాలని మూగబోయేలా చేస్తారు. నేనిప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నాను. ఈ క్షణాన మా తలలపై విమానాలు ఎగురుతున్నాయి.  వాళ్ళు మా శరీరాలు తూట్లు పడేలా తూటాలతోకాల్చవచ్చు. కానీ తెలుసుకోండి, మేం ఇప్పుడు ఇక్కడ వున్నాం. ఈ దేశంలో తమ బాధ్యతలకు కట్టుబడి ఎలా వ్యవహరించాలో తెలిసిన మనుషులకి ఉదాహరణగా మేం  ఇక్కడే నిలబడతాం. ప్రజలు నన్ను ఆదేశించినట్లు, నా స్వీయ అంతరాత్మ ఆదేశించినట్లు, తన బాధ్యతలని ఎరిగిన ఒక అధ్యక్షునిగా నేను ఈ పని చేస్తున్నాను..

ఉదయం 9.10 నిమిషాలకి
రేడియో మాజెలానిస్ ప్రసార కేంద్రం నుంచి ప్రసారమైన ఆఖరి, ఐదవ ఉపన్యాసం

“మిత్రులారా,

నేను మీతో మాట్లాడటానికి చిట్టచివరి  అవకాశం ఇదే. వైమానిక బలగాలు రేడియో పోర్టాలే, రేడియో కార్పొరేషన్ టవర్లపైన బాంబు దాడి చేశాయి.

నా ఈ మాటలలో విద్వేషం లేదు, మోసపోయిన బాధ వుంది. చిలీ దేశ సైనికులుగా ప్రమాణం చేసి తమ ప్రమాణాన్ని ఉల్లంఘించినవాళ్లకి  నైతిక శిక్ష పడి తీరుతుందని నా ఆశ. చిలీ సైనికులు, సైన్యాధిపతులు, నౌకాదళాధిపతిగా తనని తానే ప్రకటించుకున్న అడ్మిరల్ మెరినోకీ, నిన్నంటే నిన్న ప్రభుత్వానికి విధేయంగా ఉంటానని హామీ ఇచ్చి, ఇవాళ్టి రోజున కరాబినరో బలగానికి (చిలీ జాతీయ పోలీసు విభాగం – అను) డైరెక్టర్ జనరల్ గా తనని తానే నియమించుకున్న ఆ నీచుడు మెండోజాకీ, మిగతా అందరికీ  ఆ శిక్ష పడాలి.

ఇలాంటి పరిస్థితులలో, కార్మికులందరికీ నేను చెప్పేది ఒక్కటే: నేను రాజీనామా చేసేది లేదు!

ఈ చారిత్రక సన్నివేశంలో నిలబడిన నేను, ప్రజల పట్ల నా విధేయతకు మూల్యాన్ని నా ప్రాణాలతోనే చెల్లిస్తాను. నేను పూర్తి విశ్వాసంతో  చెప్పే మాట ఇదే, లక్షలాది మంది చిలీ ప్రజల స్వచ్ఛమైన హృదయాంతరాలలో నాటిన ఈ విత్తనాలు ఎప్పటికీ వృధాకాబోవు. వాళ్ళ దగ్గర బలమూ, బలగము వున్నాయి, ఇవాళ వాళ్ళు  మనల్ని అణిచివేయవచ్చు. కానీ, ఈ నేరాలూ, బలమూ చరిత్ర క్రమాన్ని అడ్డుకోలేవు. చరిత్ర మనదే, ప్రజలే చరిత్రని సృష్టిస్తారు.

ఓ నా దేశ శ్రామికులారా: నా పట్ల మీరు చూపించినవిశ్వాసానికీ, నమ్మకానికీ కృతజ్ఞతలు. మీరు నమ్మిన మనిషిగా నేను న్యాయంకోసం కలలుగన్న మీ ఆకాంక్షలకు ఒక ప్రతినిధిని మాత్రమే. రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ గౌరవిస్తానని నేను మీకు మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన  ఆ మాట మీదనే నేను నిలబడ్డాను. ఈ అంతిమ ఘడియలలో, మీతో నేను మాట్లాడగలిగే ఈ చిట్టచివరి క్షణాలలో మీరు ఒక గుణపాఠాన్ని తీసుకోవాల్సి వుంది. విదేశీ పెట్టుబడీ, సామ్రాజ్యవాదమూ, అభివృద్ధి నిరోధకులూ కలిసి, ఈ దేశపు సాయుధ బలగాలు తమ సంప్రదాయాలని ఉల్లంఘించే వాతావరణాన్ని సృష్టించారు. [రాజ్యాంగానికి కట్టుబడి, సైన్యం రాజకీయాలలలో జోక్యం చేసుకోకుండా వుండే సంప్రదాయం – అను]. ఈ సంప్రదాయాన్ని నెలకొల్పిన వాడు జనరల్ ష్నైడర్, దాన్ని సమర్ధించిన వాడు కమాండర్ అరాయా. విదేశీ అండతో తమ లాభాలనీ, వైభోగాలనీ తిరిగి నిలబెట్టుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న సామాజిక బృందాలే ఈ ఇద్దరినీ బలిగొన్నాయి. 

అన్నిటికీ మించి, నేను మన దేశపు మహిళలతో మాట్లాడాలనుకుంటున్నాను. మాపై నమ్మకముంచిన రైతాంగ మహిళలు, శ్రమలో తమ సర్వశక్తులనీ ఒడ్డిన కార్మిక స్త్రీలు, పిల్లల భవిషత్తు గురించి మన ఊహలని అర్ధం చేసుకున్న తల్లులు అందరితో మాట్లాడుతున్నాను. చిలీ దేశంలో గౌరవప్రదమైన వృత్తులలో పనిచేసే వృత్తి నిపుణులతో, దేశభక్తులైన వివిధ వృత్తి నిపుణులతో మాట్లాడుతున్నాను. పెట్టుబడిదారీ సమాజం అందించే హోదాలనీ, సదుపాయాలనీ కాపాడుకోవడంకోసం మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వృత్తి నిపుణుల సంఘాలు, కులీన వున్నత వర్గాల సంఘాలు  తమని రెచ్చగొడుతున్నా మనతో నిలబడి పనిచేస్తూ వచ్చిన దేశభక్తులైన వివిధ వృత్తి నిపుణులందరితో  మాట్లాడుతున్నాను.

యువజనులారా, నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు పాటలు పాడి, మన పోరాటానికి సంతోషాన్నీ, పోరాట స్ఫూర్తినీ అందించారు. ఓ చిలీ దేశపు మనిషీ, ఓ రైతూ, ఓ మేధావీ మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని వేధించి, వెంటాడుతారు. ఎందుకంటే,  మన దేశంలో హీనమైన ఫాసిజం ఇప్పటికే ముందుకొచ్చింది. వాళ్ళు టెర్రరిస్టు దాడులు చేశారు, వంతెనలు కూల్చివేశారు, చమురు, గ్యాస్ పైపులైన్లని ధ్వంసం చేశారు. వాళ్ళని అరికట్టాల్సిన బలగాలు తమ పని చేయకుండా , మారు  మాట మాట్లాడకుండా మౌనంగా వ్యవహరించాయి. వాళ్లకి అందుకు బాధ్యత వుంటుంది. చరిత్ర వాళ్ళని నిలదీస్తుంది.

రేడియో మాజెలానిస్ ని ఖచ్చితంగా మూసివేస్తారని నాకు తెలుసు. ప్రశాంతమైన నా కంఠ స్వరం ఇక ముందు మీకు వినిపించదు. అయినా ఏమీకాదు, నా మాటలు మీకు వినిపిస్తూనే ఉంటాయి. నేను ఎప్పటికీ మీతోనే వుంటాను. కనీసం, తన దేశాన్ని ప్రేమించి, ఆత్మగౌరవంతో నిలబడిన మనిషిగా నా జ్ఞాపకం ఎప్పటికీ మీతోనే ఉంటుంది.

జనం తమని తాము రక్షించుకోవాలి. అయితే ఆత్మత్యాగాలు వద్దు. తమని తాము నాశనం చేసుకోవద్దు, తూటాలకు ఎర కావద్దు. కానీ మీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు.

ఓ నా దేశపు శ్రామికులారా, నాకు చిలీ దేశం మీదా, దేశ భవితవ్యం మీదా విశ్వాసముంది. విద్రోహం పైచేయి సాధిస్తున్న ఈ చేదు, చీకటి కాలంపై మిగిలి వున్న మనుషులు విజయం సాధిస్తారు. గుర్తుంచుకోండి, అనతికాలంలోనో, కాస్త ఆలస్యంగానో మళ్ళీ గొప్ప అవకాశాలు మీ ముందుకి వస్తాయి. స్వేచ్ఛగా  మనుషులు ముందుకు సాగిపోతారు. మెరుగైన మంచి సమాజాన్ని నిర్మించుకుంటారు.

చిలీ వర్ధిల్లాలి! ప్రజలు వర్ధిల్లాలి! శ్రామిక జనం వర్ధిల్లాలి!

ఇవే నా చివరి మాటలు. నా త్యాగం వృధా కాదని నేను నమ్ముతున్నాను. కనీసం, మన దేశాన్ని భ్రష్టు పట్టించే నేరాలనీ, పిరికితనాన్నీ, విద్రోహాన్నీ నిలదీసి శిక్షించే ఒక నైతిక గుణపాఠంగానైనా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను.”

నిజం, ఈ మాటలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. తన దేశాన్ని ప్రేమించి, ఆత్మగౌరవంతో నిలబడిన మనిషిగా సాల్వడార్ అయెందే  జ్ఞాపకం ఎప్పటికీ మనతోనే ఉంటుంది.

(సెప్టెంబరు 11, 1973 సైనిక కుట్రలో భాగంగా ఫాసిస్టుల చేత చిక్కి, చిత్రహింసలకు గురయ్యి, హత్య చేయబడిన చిలే ప్రజా గాయకుడు విక్టర్ హారా గురించి ఈ లింక్ లో చదవండి. – కొలిమి ఎడిటోరియల్)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply