ప్రపంచ విద్యార్థులకు పాఠ్యాంశమైన ప్రొ. సాయిబాబ

అతని అక్షరాలలో రాజ్యం ఆయుధాలు వెతికింది. అతని సమానత్వ భావనల చుట్టూ కుట్రలు అల్లింది. అతని స్వేచ్ఛాగీతాన్ని దేశద్రోహంగా ప్రకటించింది. అతను వీల్ చైర్ లో కూర్చోనే ఒంటి చేతితో రాజ్యాన్ని కూల్చేయగల బలవంతుడని భయపడింది. అంత పెద్ద సాయుధ రాజ్య మూఠా ఒక సున్నిత సృజనకారుడిని చూసి వణికిపోయింది. ఇదే కదూ అక్షరానికి, సమోన్నతమైన ఆలోచనలకు, నిబద్ధత గల రాజకీయ ఆచరణకు ఉండే బలం.

ఇదేమి చరిత్రలో జరగనిది కాదు. కొత్తగా నిరూపించబడింది కూడా కాదు. హేతువు, తర్కం, సమానత్వ భావనలు మొలకెత్తిన ప్రతిసారీ ఆజ్ఞానం, అహంకారం, అధికారం, భూస్వామ్యం, పెట్టుబడి, పితృస్వామ్యం, మత మౌఢ్యం ఏదో ఒక రూపంలో ప్రశ్నల గొంతుకలను నరుకుతూనే వున్నాయి. సామాజిక చింతనాపరుడైన ప్రొ. సాయిబాబను కూడా తన రాజకీయ విలువల మూలంగానే అండా సెల్ లో జీవిత ఖైదు చేసి మృత్యుముఖంలోకి నెట్టివేసింది అమానవీయ రాజ్యం.

సాయిబాబ తాను నమ్మిన అక్షరానికే బలైపోతూ ఆ అక్షరానికే ఆయువు పోస్తుండు. అండా సెల్ లో రాజ్యాన్ని ధిక్కరిస్తూ, చావును సహితం నిరాకరిస్తూ ప్రపంచ స్థాయి కవిత్వం రాస్తుండు. తాము రాసే గుప్పెడు అక్షరాలను చూసి మురిసిపోతూ, వాటినే అలంకారాలుగా ఊరేగుతూ, పుస్తక ప్రదర్శనలు చేస్తూ సోషల్ మీడియా “షేర్ మర్కెట్” లో వీలైనంత బలగాన్ని పోగేసుకోని పొంగిపోయే కాలంలో తన ప్రాణాలనే పణంగా పెట్టి ఏకాంతంలో సహితం జనసముద్రాన్ని కలగంటున్న సాయిబాబను ఎట్లా అర్థం చేసుకుందాం. ఆ ఉక్కు ధృడ సంకల్పాన్ని ఎట్లా అంచనా వేద్దాం? ఎక్కడి నుండి వచ్చింది ఆయనకు అంత శక్తి? ఎంతమంది అమరుల త్యాగాల ఊహలు ఆయనను బతికిస్తున్నాయి? ఏ సైద్ధాంతిక పునాది ఆయనను ప్రపంచ మానవుణ్ణి చేసింది?

ఈ ప్రశ్నల సమాధానం కోసం తెలుగు నేల మీది కవులు, రచయితలు, బుద్ధిజీవులు ఎంతవరకు ప్రయత్నం చేశారో తెలియదు కాని ఇప్పుడు ప్రపంచ విద్యార్థులు మాత్రం ఆ పరిశోధన చేస్తున్నారు. నాకు తెలిసి సమకాలీన భారతదేశంలో ఒక ప్రజా మేధావి జీవితం గురించి ఇలాంటి ఆలోచనలు చెయ్యడం చాలా అరుదైన విషయం.

నార్త్ అమెరికాలోని ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో (అమెరికాలోని Yale University, University of Tennessee, Illinois Wesleyan University. కెనడాలోని University of British Columbia, Carleton University) విద్యార్థులు ఆయన కళ్ళతో భారతదేశాన్ని చూస్తుండ్రు. ఆ విద్యార్థులు ఒక సెమిస్టర్ మొత్తం ఆయన స్ఫూర్తితో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుండ్రు. ఈ ఐదు విశ్వవిద్యాలయాల ఆహ్వానం మేరకు నేను ఆ విద్యార్థులతో నేరుగా సంభాషించే అవకాశం కలిగింది. ఆ అనుభవం పంచుకోవడం కోసమే ఈ ప్రయత్నం.

ఆ విద్యార్థులు ఎవ్వరు కూడా కేవలం సాయిబాబ భౌతిక పరిస్థితి, ఆరోగ్య సమస్యల మూలంగా ఆయన మీద సానుభూతితో ఆయనను అర్థం చేసుకోవడం లేదు. ఆయన ఆలోచనలో ఉన్న మానవతావిలువలు ఆ యువ విద్యార్థుల హృదయాలలో ఆయనను నిలబెడుతున్నాయి. ఆయన ఆలోచనలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిని నిరసిస్తునారు. అంత దుర్భలమైన స్థితిలో కూడా ఆయన అనుక్షణం ప్రపంచ అభాగ్యజీవుల గురించే ఆలోచించడం వాళ్ళను అబ్బురపరుస్తుంది. అందుకే వాళ్ళు ఆయన కవిత్వాన్ని సామూహిక గానం చేస్తున్నారు.

ఇప్పుడు సాయిబాబ ఒక ప్రేరణా శక్తిగా వాళ్ళ క్యాంపస్ నోటీస్ బోర్డ్ ల మీదికి, గోడల మీదికి, విద్యార్థి మాగజైన్లలోకి ఎక్కాడు. వాళ్ళు తోటి విద్యార్థులలో అవగాహన కల్పించడం కోసం సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఒక పోస్టు కార్డ్ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇప్పటికే వందలాది ఉత్తరాలు భారత రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి పంపారు. అంతేకాదు వివిధ అంతర్జాతీయ సంస్థల ముందు ప్రతినిధులుగా నిలబడి సాయిబాబ కేసులోని కుట్రను విడమరిచి చెబుతున్నారు. ఆయన పేరుమీద ఒక వీకీపీడీయ పేజ్ నిర్మాణం చేసే పనిలో ఉన్నారు. మత విశ్వాసం ఉన్న విద్యార్థులు ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారు.

కేవలం ఆక్టివిజం తో ఆగకుండా ఎలాంటి సామాజిక, రాజకీయార్థిక పరిస్థితులలో ఇలాంటి హింస కొనసాగుతుంది, ఆ హింసకు చట్టబద్దత, సాధికారిత తీసుకురావడానికి రాజ్యం ఏంచేస్తుంది. రాజ్యానికి సామ్రాజ్యవాద శక్తులు ఎలా సహాయం చేస్తాయి. ఇలాంటి అంశాలతో పాటుగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలు, హక్కుల పోరాటాల గురుంచి తమ అవగాహనలో నుండి అకడెమిక్ పేపర్లు, ఎడిటర్లకు లెటర్స్ రాస్తున్నారు. లోకల్ రేడియో స్టేషన్ లో సాయిబాబ గురించి విద్యార్థులు 10 నిమిషాల నిడివితో ఒక ప్రోగ్రాం కూడా చేశారు.

https://www.wutc.org/post/advocacy-week-utc-scholars-risk

ఆ విద్యార్థులతో మాట్లాడిన ప్రతి సందర్భంలో సాయిబాబ తల్లి నాతో పంచుకున్న మాటలు వాళ్ళకు గుర్తుచేశాను: “నా కొడుకు ప్రజల కోసం చేసిన ఉద్యమాల మూలంగా ఆయనను చంపేయాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఆయనను చంపొచ్చు. మమ్ముల కష్టపెట్టొచ్చు. మేము ఏమయిపోయినా బతికుండే ముందు తరాలు బాగుంటయనే ఆశ మాత్రం వుంది.” ఆ తల్లి మాటలకు చెమ్మగిల్లని కళ్ళులేవు. చప్పట్లతో మారుమోగని తరగతి గది లేదు. సరిహద్దులు దాటిన ఆ తల్లి మాట ఎందరికో పోరాట విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ తల్లి మాటలు మాత్రమే కాదు అలుపెరుగక పోరాటం చేస్తున్న సాయిబాబ సహచరి వసంత కూడ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె కరచాలనం కోసం ఎన్నో చేతులు ఇవతలి ప్రపంచం నుండి ఎదురుచూస్తున్నాయి.

అమలాపురం దగ్గర చిన్న గ్రామంలో పుట్టిన ఒక పోలియో బాధితుడు ఆదివాసుల, దళితుల, మహిళల, జాతుల హక్కుల గురుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడే గొంతుకగా ఏ విధంగా ఎదిగిండు అని ఆశ్చర్యపడుతూనే, అతని జీవితం మానవ ధృడసంకల్పానికి, రాజకీయ పరిణితికి ఒక ఉదాహరణగా అర్థం చేసుకుంటుండ్రు. అలాగే మధ్యభారతంలో ఆదివాసుల మీద జరుగుతున్న హింసను అమెరికాలో ఆదివాసుల మీద జరిగిన మారణహోమంతో పోల్చుకుంటున్నారు. ఆదివాసుల “జల్, జంగల్, జమీన్, ఇజ్జత్, అధికార్” నినాదానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. దళితుల పరిస్థితులను తమ సమాజంలో నల్లజాతీయులపై జరుగుతున్న హింస, వివక్షతో పోల్చుకుంటున్నారు. పేట్రేగుతున్న హిందూ ఫాసిజాన్ని గమనిస్తున్నారు. వీటితో పాటుగా అమెరికన్ సామ్రాజ్యవాదం ఏ విధంగా భారతదేశంలో హింసను, అసమానతలను పురిగొల్పుందో అవగాహన చేసుకుంటున్నారు. వీటన్నింటిని ఎదుర్కొంటున్న విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలను సానుకూలంగా పరిశీలిస్తున్నారు. ఇంత విశాల దృక్పథంతో సాయిబాబను చూస్తున్నారు.

భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా అక్కడ న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉంది కదా సాయిబాబను ఇంత అక్రమంగా ఎలా నిర్భందించగలిగారని కొందరు విద్యార్థులు అడిగారు. దానికి సమాధానంగా న్యాయవ్యవస్థ ఏ విధంగా పాలకవర్గాల పల్లకి మోస్తుందో ఉదాహరణలతో వివరిస్తూ సాయిబాబకు జీవిత ఖైదును ఖరారు చేసిన 827 పేజీల జడ్జిమెంట్ ప్రతిని ఒక్కసారి చదవే ప్రయత్నం చేయమని చెప్పిన. సాయిబాబ పై జరిగిన కుట్ర కేసుకు సంబంధించి ఇంతకు మించిన మంచి ఆధారం మరొకటి దొరకదు. అందులో మనకు ప్రతి పేజీలో విసుగుపుట్టేంతగా కనిపించేవి “డిజిటల్ ఆధారాలు.” ఎంత డేటా, ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎన్ని ఫైల్స్, ఎన్ని విడియోలు, ఎన్ని పుస్తకాలు… ఇలా అక్షర ఆయుధాలను ఆ డాక్యుమెంట్ నిండా పోగేశారు. ఆ డాక్యుమెంట్ చదివిన ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసర్ “వీలయితే ఆ డాక్యుమెంట్ మీద content analysis చెయ్యి. నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉంది” అని జోక్ చేశాడు. ఎందుకంటె అందులో ఒక సరైన వాక్య నిర్మాణం కాని, ఒక వాక్యానికి మరొక వాక్యానికి మధ్య సంబంధం కాని ఉండదు. ఇది కేవలం భాషకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలోని (అ)న్యాయానికి సంబంధించినది కూడా.

ఆ విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూ చివరిగా చెప్పిన మాట: “సాయిబాబ జీవితాన్ని, ఆయన రాజకీయాలను అర్థం చేసుకోని మీరు చేస్తున్న పని మూలంగా ఆయనకు ఏమి మేలు జరుగుతదో నాకు తెల్వదు కాని, మీకు మాత్రం మేలు జరుగుతదని ఖచ్చితంగా చెప్పగలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు నమ్మిన విలువల కోసం ఎలా నిటారుగా నిలబడాలో సాయిబాబ జీవితం చెబుతుంది. అంతకు మించి మన జీవితాలకు అర్థం ఏంటో, ఒక సామాజిక సంఘర్షణ, సంక్షోభం సందర్భంలో మనం ఎటువైపు నిలబడాలో కూడా చెబుతుంది.” ఆ విద్యార్థులు నా మాటను చప్పట్లతో స్వాగతించారు.

సాయిబాబ రాజకీయ జీవితం తెలిసిన ఎవ్వరైనా నా మాటలు అతిశయోక్తి కాదు అనే చెబుతారు. సాయిబాబ నిలబెట్టిన విలువలను మన జీవితాల్లో కూడా భాగం చేసుకుందాం. ఆయనను అక్రమ నిర్బంధం నుండి బయటకు తీసుకు రావడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply