సామాజిక స్పృహ

తెల తెలవారుతున్న పొద్దున
కాస్తలా నడిచివద్దామని బయలుదేరాను
కాలవకట్టన రేకులగుడిసె ముందు
ఇనపచట్రం వైరు మంచమ్మీద
అప్పుడే నిద్రలేచి కూర్చుందా అమ్మాయి-

ఎర్రపూల నైటీలో
రేగిన జుట్టూ విచ్చిన కళ్ళతో
రెండరచేతులమధ్యకూ ముఖం చేర్చుకుని
అలా నడిమంచమ్మీద బాసింపట్లేసుక్కూర్చుని
ఏమాలోచిస్తోందో ఏమో-
అసలేమీ ఆలోచించట్లేదో ఏమో-

మంచిగా మర్యాదగా మెత్తగా ఇలా గమ్మునుండటం
కాసేపాగితే ఆమెక్కుదరదనుకుంటా
నీళ్ళ టాంకరొస్తుంది
మొగుడు లేస్తాడు
ఇళ్ళలో పనికి ఇంకా రాలేదేమని అమ్మలు కేకలేస్తారు-
**
పాల ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి బయల్దేరాను ..
కొత్త ఫిల్టరు,
ఇవాళ కాఫీ ఎలా ఉంటుందో ఏమో!

Leave a Reply