సామాజిక జ్వాలా కెరటాల`రూపాంతరం`

జ్వలిత గారి కలం నుండి రుపు దాల్చిన వన్నీ సజీవ పాత్రలే. మన చుట్టూ సమాజంలో అనునిత్యం మనకు ఎదురయ్యే అనేక సంఘటనల సమాహారమే ‘రూపాంతరం’ కథాసంపుటి. చుట్టు పక్కల ఐదు ఉర్లలోనూ తిరుగు లేని పనిమంతుడు బ్రహ్మయ్య. ట్రాక్టర్లు, ఇతర ఆధునిక పనిముట్లు పల్లెల్లో ప్రవేశించడంతో అతని జీవిక ఆగమ్యం అయింది. భార్యా బిడ్డలను పోషించుకోవడానికి గత్యంతరం లేక వ్యవసాయ కూలీగా రూపాంతరం చెందాడు అతడు. ‘ఒక నైపుణ్యం కలిగిన వృత్తి కళాకారుడు ఎలా, ఎందుకు కూలీగా మారాడు?’ అదే ఈ కథలో ఇతివృత్తం. అదే పేరుతో ఈ కథల సంపుటిని వెలువరించారు.

‘అమ్మ ఓడిపోయింది’ కథలో అమ్మ ఏ పరిస్థితుల్లో, ఎంత నలిగిపోతూ ఓడి పోయిందో, చాలా ఆర్ద్రంగా వివరించారు. కోల్డ్ స్టోరేజ్ రూపంలో రైతులను నిలువునా ముంచే బడా దళారుల గురించి ‘పాత గాయం’ కథ చూపుతుంది. ‘కర్మ ఋణం’ కథలో చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది అనీ, ఆ పాప ఫలితం అనుభవించక తప్పదు అనీ తెలుస్తుంది. ఒక వదినా మరదలు తమ భర్తల ఆగడాలను భరించినంత కాలం భరించి, ఇక సాధ్య పడక ఏ విధంగా వారి చెర నుండి విముక్తి పొందారో, అలాంటి మొగుళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో ‘కొత్త మందు’లో రుచి చూడవచ్చు. యశోదమ్మ ముందు చూపుతో పాటు, వివిధ చట్టాలు, సహాయమందించే ఫోన్ నంబర్లను ‘యశోదమ్మ’ కథలో తెలిపారు.

‘ఓయాసిస్’ కథలో కూడా జన సామాన్యానికి అవసరమైన అనేక ఫోన్ నంబర్లను పాత్రల ద్వారానే తెలియ పరిచారు. ‘అత్మాన్వేషణ’ కథలో వయసుతో సంబంధం లేకుండా మనసు స్నేహాన్ని కోరుకుంటుందని, ఆ స్నేహానికి అంతరాయం కలిగితే తట్టుకోవడం కష్టమని, కానీ మనసుకు శాంతి కలుగాలంటే అనాధలు, వీధి బాలలను ఆదరించడం చేయ వచ్చని తెలిపారు. పండుగకు అయినా కొడుకూ కోడలు, మనుమడితో వస్తారని, వారితో ఆనందంగా గడపాలని ఎదురు చూసే ఒక అమ్మ వేదన ‘పడిగాపులు’ కథలో కనపడుతుంది. ఎన్నెన్నో కష్ట నష్టాలకు ఓర్చి, ఎంతో ప్రేమగా, ప్రాణంలా పెంచుకున్న కొడుకే ప్రయోజకుడు అయ్యాక, ఆమెను ఒక గదికే పరిమితం చేసి నిర్బంధించడం మనసును కదిలిస్తుంది, ‘మాయమవుతున్న మనసు’ కథలో. తెలంగాణ, ఆంధ్ర అనే విభజన ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో వివరిస్తుంది తెలంగాణ మాండలికంలో వున్న ‘సిబ్బి’ కథ.

ఒంటరి మహిళలు అందరూ ఒకరికొకరు తోడుగా వుంటూ, జీవితం కొనసాగించాలని తనలాంటి ఒంటరి స్త్రీలు అందరికీ దిశా నిర్దేశం చేసి, ఆచరించింది ‘మానవ సరోవరం’ లో సరోజమ్మ. మనుమరాలు చిలిపి అల్లరి ని, ఆ అల్లరితో తను అనుభవించే సంతోషాన్ని ఒక నానమ్మ ‘నాన్మా ఎవడు వాడు’ లో వ్యక్త పరిచారు. నేటి విద్యాలయాల తీరు తెన్నులు, అధికారుల నిర్లక్ష్యం, కొందరు ఉపాధ్యాయుల అలసత్వం సహస్ర ధారలో చక్కగా అర్థం అవుతుంది. ఒక ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం ఒక తరాన్నే నిర్వీర్యం చేస్తుందనే బాధ రచయిత్రి లో స్పష్ట మవుతుంది. తల్లిదండ్రుల గొడవల్లో బిడ్డలు నలిగి పోతారనీ, పెద్దల అండ వారికి చాలా అవసరం అనీ ‘బలికుసుమాలు’ కథ తెలియ చేస్తుంది.

‘ఊరు విడిచిన ఉత్తరం’లో ఆ వూరి పెద్ద అఘాయిత్యాలకు, ఒక సాహసమహిళ ఎలా అడ్డు కట్ట వేసిందో, మిగిలిన స్త్రీలకు ఎలా రక్షణ కల్పించినదో తెలుస్తుంది. ‘మా ఊరి వేప చెట్టు’లో వేప చెట్టు ఎన్ని విధాలుగా మానవులకు ఉపయోగ పడుతుందో, పర్యా వరణ పరిరక్షణ మనుషులకే కాదు, సమస్త ప్రాణకోటికి ఎంత ఆవస్యకమో తెలియ చేశారు. చివరిగా కన్న కొడుకే కాదని గెంటి వేసిన ఒక వృద్దు రాలిని చావునుండి తప్పించి, కొందరు విద్యార్థులు దత్తత తీసుకున్న సంఘటన ‘ప్రశ్నించే పంజరాలు’ కథలో కనిపిస్తుంది.”నిజంగా అలాంటి యువత వుంటే దేశంలో. అనాధలే వుండరు కదా!” అనిపిస్తుంది. మొత్తం ఇరవైరెండు కథలున్న ‘రూపాంతరం’లో అన్ని కథల్లోనూ స్త్రీల సమస్యలు, పరిష్కారాలు సూచించిన రచయిత్రి స్త్రీవాదిగా కనిపించినా, సమాజం పట్ల బాధ్యత, అందులోని లొసుగులు తొలగించాలనే తాపత్రయం, ఆమెలో నిండుగా వుంది. జ్వలిత ఈ పుస్తకాన్ని తల్లిదండ్రులకు, అత్తమాలకు అంకితమిచ్చారు. అన్ని వయసుల పాఠకులు చదువ తగినకథల పుస్తకం రూపాంతరం.

ఈ పుస్తకానికి ముందుమాట ప్రముఖ సాహితీవేత్త బి.ఎస్.రాములు, కథల పరిశోధకుడు వెల్దండి శ్రీధర్ర్ స్ప్రేడింగ్ లైట్ జ్యోతి ముందు మాటలతోపాటు బల్దేర్ బండి నాయక్, మారోజు దేవేంద్ర, ఎన్నెల కథలపై తమ అభిప్రాయాలను వ్రాసారు. ఇంతకు ముందే కవిత్వం, కథలకు సంపాదకత్వం వహించిన సంగతి అందరికీ తెలుసు. ఇది ఆమె రెండవ కథాసంపుటి. ఆమె కలం నుండి మరెన్నో మంచి కథలు జాలువారాలని మనసారా కోరుకుంటున్నాను.

(‘రూపాంతరం’ (కథలు), పేజీలు : 200, వెల: 200/-, ప్రతులకు: జ్వలిత – 9989198943)

ఖమ్మం జిల్లా. అధ్యాపకురాలు, కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ(హిందీ) చదివారు. 30 ఏళ్లగా ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో హిందీ అధ్యాపకురాలిగా పనిచేసి  2010 లో పదవీ విరమణ పొందారు. కథలు, కవితలు రాయడం  ప్రవృత్తి.

Leave a Reply