సాంఘిక జీవనం పై సునిశిత వ్యాఖ్యానం- శివరాజు సుబ్బలక్ష్మి నవలలు

రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి శతజయంతి సంవత్సరం ఇది. పదిహేడు సెప్టెంబర్ 1925 లో జన్మించిన వీరు ‘అదృష్ట రేఖ’, ‘నీలం గేటు అయ్యగారు’, ‘తీర్పు’ అనే మూడు నవలలు, ‘కావ్యసుందరి కథ’, ‘ఒడ్డుకు చేరిన కెరటం’, ‘మనోవ్యాధికి మందుంది’, ‘మగత జీవి చివరిచూపు’ మొదలైన కథా సంపుటాలు, రెండు స్మృతి కథనాలు, ఒక జ్ఞాపకాల కథనం రాశారు. ప్రముఖ రచయిత బుచ్చిబాబు ఈమె భర్త. తన రచనలు అన్నిటిలో నాటి సామాజిక జీవనం, మానవ సంబంధాలను సునిశిత దృష్టితో పరిశీలిస్తూ, ప్రత్యేకించి స్త్రీల అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రచనలు చేశారు సుబ్బలక్ష్మి గారు. వీరి నవల ’నీలం గేటు అయ్యగారు’ పై ఈ ప్రస్తుత వ్యాసం.

శివరాజు సుబ్బలక్ష్మి గారు రాసిన నీలం గేటు అయ్యగారు నవల ఒక విభిన్నమైన నవల. ఇందులో మానవ సంబంధాలను ఒక మూస ధోరణిలో కాక ఒక విశ్లేషణాత్మకమైన ఇంకా చెప్పాలంటే మనోవైజ్ఞానిక విశ్లేషణతో పరిశీలించి రాసిన నవలగా చెప్పవచ్చు. ఈ మానవ సంబంధాలను సుబ్బలక్ష్మి గారు అనేక కోణాల నుండి పరిశీలించి పాత్ర చిత్రణ చేసినట్టుగా అనిపిస్తుంది. స్త్రీపురుషుల మధ్య సంబంధాలు, ఒక యజమాని, అతనికింద పనివారికి ఉండే సంబంధం, అలాగే భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు పిల్లలు సంబంధాలు, ఇక పనివాళ్ళు… వారిలో వారికి స్నేహంగానీ బంధాలు గానీ ఎలా ఉంటాయి అనేది ప్రధాన పాత్రలైన పున్నమ్మ, యజమాని వెంకటేశ్వర్లు పాత్రల ద్వారా నవలలో ఆమె చిత్రించారు.

కథా నేపథ్యం; నాటి సామాజిక నేపథ్యం :
ఈ కథా కాలము 1960లు 70 ల నాటి కాలం. రచనా కాలం కూడా అదే. మన సమాజంలో ఫ్యూడల్ అంటే భూస్వామ్య సంస్కృతి ఇంకా బలంగా నాటుకొని ఉన్న కాలము. ఫ్యాక్టరీలు పరిశ్రమలు తక్కువగానే ఉండి కార్మిక చైతన్యము లేదా కార్మిక వర్గ చైతన్యము ఇంకా అప్పుడప్పుడే పుంజుకుంటున్న కాలం. బడుగు బలహీనవర్గాల ప్రజలు తమ పేదరికానికి వెనకబాటుతనానికి తమ పూర్వజన్మ దుష్కృతమో, కర్మ ఫలమో కారణమని నమ్మి సరిపెట్టుకునే రోజులు. తమకు పని కల్పించి తిండి పెట్టే యజమానులను దైవంగా నమ్మి వారికి పూర్తి విధేయతను ప్రకటించాలి అనుకునే రోజులవి. ఆ వ్యవస్థలోని దోపిడీ తత్వాన్ని, శ్రమ దోపిడీని అర్ధం చేసుకోవటం తక్కువ.

యజమానులు సాధారణంగా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారే అయి ఉండి వారు తమ ఆ స్థానానికి ఉన్నతికి తమ ప్రతిభ నైపుణ్యాలే కారణం అని నమ్ముతూ కింద వర్గంలో ఉన్నవారు సహజంగానే తమకన్నా తక్కువ తెలివితేటలు నైపుణ్యం కలవారుగా విశ్వసిస్తూ, వారు తమకి సేవ చేయటం కోసమే ఉన్నట్టుగా నమ్మిన రోజులు. ఈ స్థితిని అర్థం చేసుకొని ధనికులు, పేదవారు వారి మధ్య తారతమ్యాలను, వారి మానసికతను బాగా పరిశీలించి అవగాహనతో, చైతన్యంతో ఈ కథను రచయిత్రి నడిపించినట్లుగా సంభాషణల ద్వారా తెలుస్తుంది.

జాతీయోద్యమంలో భాగంగా సంఘ సంస్కరణ, స్త్రీ జనోద్ధరణ మొదలైనప్పుడు ఆ సంస్కరణకు కేంద్రం అగ్రవర్ణ స్త్రీలు, వారి సమస్యలే కావటం గమనార్హం. స్త్రీ విద్య, బాల్య వివాహల రద్దు, వితంతు పునర్వివాహం వంటి సంస్కరణలు, ఆ పై సంబంధిత చట్టాల ఏర్పాటు వలన లబ్ది పొందినది కూడా అధిక భాగం అగ్రవర్ణ స్త్రీలే అని చెప్పవచ్చు! అలాగే స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా బడుగు వర్గాల జీవనంలో వెంటనే పెనుమార్పులేమీ చోటుచేసుకోలేదు. రాజ్యాంగంలో పొందుపర్చిన సామ్యవాద, ప్రజాస్వామిక భావనలు సమాజంలో ఇంకా అమలు కాలేదు. భూస్వామ్య భావజాలం, కుల వ్యవస్థ బలంగా పాతుకునే ఉన్నాయి.

కుటుంబ వ్యవస్థలో కూడా కుటుంబ పెద్ద పురుషుడుగా, అతని అదుపాజ్ఞలలో మిగతా వారు మసలాలి అనే భావన బలంగా ఉన్న రోజులు. సమాజంలో అప్పటి పరిస్థితులు అవి. ఆ నేపథ్యం నుండే ఈ నవలను చూడాలి.

ఇతివృత్తం :
పేదరాలు పొన్నమ్మ ఒక నీలం గేటు ఉన్న పెద్ద మేడలో ఇంటిపని చేస్తూ ఉంటుంది. ఆమెకు అప్పటికే పెళ్ళి అయి ఇద్దరు ఆడపిల్లలు. భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అని నలుగురిలో పంచాయతీ పెట్టి విడిపోతుంది. పొట్ట నింపుకోవటానికి, పిల్లలను పోషించుకోవటానికి పని చెయ్యక తప్పదు. పొన్నమ్మ పాత్ర ద్వారా ధనిక పేద జీవితాల మధ్య తారతమ్యం , పొన్నమ్మ కళ్ళతో గొప్పింటి వారి ఆర్భాటాలు, అభిజాత్యాలు, అలకలు, ఆరాటాలు,పోట్లాటలు చిత్రిస్తారు రచయత్రి శివరాజు సుబ్బలక్ష్మి. కథా గమనంలోనే మానవ సంబంధాలను లోతుగా విశ్లేషిస్తూ,పాత్రల వ్యక్తిత్వాన్ని పరిణితితో చిత్రిస్తారు. నీలం గేటు ఇంటి యజమాని వెంకటేశ్వర్లు ఇంజినీరుగా పెద్ద హోదాలో పని చేసి పదవీ విరమణ చేస్తాడు. నిజాయతీ కల మనిషిగా పేరు తెచ్చుకుంటాడు. కుటుంబం మాత్రం అంత సవ్యంగా ఉండదు.

ఇద్దరు పిల్లలని కన్న తర్వాత మూడో కాన్పులో భార్య పుట్టిన బిడ్డ ఇద్దరూ కన్ను మూస్తారు. బతికి ఉన్నప్పుడు ఆ భార్య ఏమీ అనుకూలంగా ఉండేది కాదు. ఇక మళ్లీ పెళ్ళి వద్దనుకుని ఉన్న అతను కేవలం పిల్లల కోసం ఒకరు చూసిన సంబంధం చేసుకుంటాడు. ఆ రెండో భార్యకు డబ్బు విలాసాల మీద మోజు ఎక్కువ. ఇల్లు పిల్లలను పట్టించుకోకుండా క్లబ్బుల వెంట, సమాజంలో ఎక్కువ హోదా ఉన్న వారి వెంట తిరుగుతూ ఉంటుంది. పిల్లల పెళ్ళి జరుగుతుంది . ఇదే క్రమంలో పిల్లలు పెద్ద అవటం వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి.

ఇక కొడుకు బాగానే ఉన్నా బద్ధకస్తుడు అంటారు. కూతురు భర్తతో చీటికి మాటికి తగవులు పెట్టుకుని పుట్టింటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి మాట వినదు. కోడలు కూడా గడసరి. అల్లుడు కోడలికి సొంత అన్నే.

వెంకటేశ్వర్లు ఆరోగ్య రీత్యా చల్లటి కొండ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడి పనులకు డ్రైవర్ నారాయణను, పొన్నమ్మను వెంట తీసుకువెళ్లటం జరుగుతుంది. కొత్తగా పనిలో చేరిన పొన్నమ్మ విధి లేక తన ఇద్దరు ఆడపిల్లలను పక్కింటి కన్నమ్మను కనిపెట్టుకు చూడమని ప్రయాణం అవుతుంది.

ఇక ఆ ప్రయాణంలో కొడుకు కోడలు వెంట రావటం, వారి ఇంట కొన్నాళ్ళు ఉండటం, కూతురు అల్లుడు గొడవలు, యజమానికి మాటల్లో పొన్ని తన గతం చెప్పటం. ఆయనకు సేవలు చేసి ఆయన అభిమానం సంపాదించుకోవటం జరుగుతుంది. యజమాని కూడ తన కుటుంబంలో గొడవలు పొన్నమ్మకు చెప్పుకుంటాడు. యజమాని కుటుంబంలో సభ్యుల కథ అనేక మలుపులు తిరుగుతాయి. అల్లుడు వ్యాపారంలో భాగస్వాములతో గొడవపడి అతనికి మతి భ్రమిస్తుంది.

ఇక్కడ పొన్నమ్మ తిరిగి ఇల్లు చేరేసరికి పెద్ద కూతురు రజస్వల అయి ఉంటుంది.
నారాయణ ఒక సంబంధం తేగా యజమాని, నారయణల సాయంతో ఆ పిల్ల పెళ్ళి చేస్తుంది.
ఆ తర్వాత కొన్ని రోజులకే పొన్ని మలేరియా జ్వరం సోకి చనిపోతూ చిన్న బిడ్డను నారాయణకు అప్పగిస్తుంది. పేదవాణ్ణి నేనెక్కడ పెంచగలను అంటూ ఆ పిల్లని, అతను యజమాని దగ్గర పనికి అప్పగించి పోతాడు.

అక్కడ వెంకటేశ్వర్లు రెండో భార్య, కోడలు ఇద్దరూ ఇల్లు దాటి వేరెవరి మోజులోనో తిరిగి భంగపడి దెబ్బ తిని ఇంటికి తిరిగి వస్తారు. భార్య పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినట్టు, వైరాగ్యం, అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు చెపుతారు. ఆమెకు కొంత మతి కూడా చలిస్తుంది. తాగుడుకి బానిస అయిన కోడలుని కొడుకు వదిలేసి మరొక ఆమెతో వెళ్ళిపోతాడు. సోషల్ లైఫ్ కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, పిల్లలను భార్య సరైన దారిలో పెట్టలేకపోయాను, తప్పు చేశానన్న పశ్చాత్తాపం తో వైరాగ్యం పొందే ప్రయత్నాలు చేస్తూ… రోగిష్టి భార్య, తాగుబోతు కోడలు మనవడు మనమరాలుతో (కూతురి పిల్లలు) తో బతుకు వెళ్ళదీస్తూ మిగిలిపోతాడు నీలం గేటు యజమాని.

పాత్ర చిత్రణ :
నవల పేరు నీలం గేటు అయ్యగారు అని ఉన్నా నిజానికి ఈ కథ పొన్నిగా పిలవబడే పొన్నమ్మది. ఆమె బ్రతుకు తెరువు పోరు ఇది. ఆమె తనను తన పిల్లల్ని పోషించుకోవటానికి పడే యాతన. మనిషిగా ఒక పక్క కొన్ని కోరికలు, కొన్ని బలహీనతలు కలిగి ఉండి మరొక పక్క ఆత్మాభిమానం కల స్త్రీగా, నీతిగా బతకాలనుకునే మనిషిగా, కొంత ప్రేమ కోసం, కొంత గుర్తింపు కోసం ఆరాటపడే వ్యక్తిగా శివరాజు సుబ్బలక్ష్మి గారు తీర్చిదిద్దిన పొన్నమ్మ కథ ఇది. సామాజిక పరంగా ఆమెకు అన్ని ప్రతికూలతలే! ఆమె పేదరాలు, ఆడది అందునా భర్త వదిలేసిన వంటరి , సంతానం చూస్తే ఇద్దరు ఆడపిల్లలు. యజమానుల తప్పులకి ఈమెకు పోకిరి అని పేరు పడుతుంది.

పురుషుడికి ఇల్లు వేరు పని వేరు! భార్య వేరు యజమాని వేరు. బయట పని చేసొస్తే ఇంట్లో సుఖపడచ్చు. కానీ స్త్రీకి ఇటు ఇంట్లో భర్త యజమాని అటు పనిలో వేరే
ఒక యజమాని! ఇద్దరికీ సేవ చెయ్యాలి. ఒకొక్క సారి ఇతర సేవలతో పాటు భర్తకు మాత్రమే ఇచ్చే శారీరిక సుఖం యజమాని కూడా కోరుకుంటాడు. ‘బందిపోట్లు’ కవితలో సావిత్రి చెప్పినట్టు ఆఫీసులోనూ, ఇంట్లోనూ నా మొగుడు ఉన్నాడు అని భయపడాల్సి వస్తుంది.

పొన్నమ్మ/ పొన్ని పాత్ర ను విలక్షణంగా మలిచారు రచయత్రి. పొన్నమ్మ బలమైన వ్యక్తిత్వం గలది. నీతి నిజాయతీ గల ఆడది. మొగుడు తనను మోసం చేశాడని తెలుసుకుని చూస్తూ ఊర్కోదు. నోరు మూసుకుని పడి ఉండదు. అతనితో గొడవ పడి విడిపోతుంది. మరొక అతనితో తన సంబంధాన్ని కూడ దాచి పెట్టడానికి ప్రయత్నించదు. నిజాయతీగా ఒప్పుకుంటుంది. వంటరిగానే బిడ్డలను పోషించుకుంటుంది. వంటరి ఆడది, అందునా ఆకర్షణీయంగా ఉంటుంది కనుక ఆమె మీద మోజు పడ్డ వాళ్ళు చాలా మందే ఉంటారు. అయినా తెలివిగా, లౌక్యంగా వారిని తప్పించుకుని బతుకు వెళ్ళతీస్తూ ఉంటుంది. తనకు పని కల్పించిన యజమాని పట్ల విధేయత, విశ్వాసం కనపరుస్తూ సమయానుకూలంగా అతనకి నేనెంత దానిని అంటూనే సలహాలు సూచనలు ఇస్తూ, అతను తప్పు చెయ్యబోయినప్పుడు సున్నితంగా వారిస్తూ నైతికంగా ఉన్నత స్థానంలో ఉంటుంది పొన్నమ్మ.

నవల ఆరంభంలోనే పున్నమ్మ లేదా పొన్ని పాత్ర ద్వారా పలికించిన సంభాషణలు రచయిత్రి స్వీయ అవగాహన స్థాయి ,ఆమె నమ్మకాలు విలువలు కూడా ఏ వైపు ఉన్నాయి అనేది పాఠకులకు స్పష్టం అవుతుంది.

సాధారణంగా సాహిత్యంలో ఆడవాళ్ళను బాధితులు గానో లేదా శీలం కోల్పోయిన పతితలుగానో చిత్రిస్తారు. ఈ నవలలో పొన్నమ్మకు కేవలం రెండిటిలో ఏదో ఒక పేరు తగిలించకుండా ఆమె పాత్రకు సంక్లిష్టత సాంద్రత కల్పిస్తారు రచయత్రి.

ఇక వెంకటేశ్వర్లు పాత్ర ఒక సందర్భంలో పేద వాళ్లకు ధనికుల భూమి పంచితే అందరూ ధనికులు అవుతారో లేదో కానీ అందరూ పేదవాళ్లు అయ్యే అవకాశం ఉంది అంటాడు. వారు దాన్ని దుబారా చేసి పోగొట్టుకుంటారు అని ఆయన భావం. అంటే డబ్బున్న వారికి పేద వారి పట్ల ఉండే చులకన భావం దీని ద్వారా వ్యక్తం అవుతుంది.

శైలి, శిల్పం :
నవల ఎత్తుగడే పొన్నమ్మ పాత్ర పరిచయంతో మొదలవుతుంది. ఎటువంటి వర్ణనలు, ఉపోద్ఘాతాలు, నేపథ్య వివరణ లేకుండా సూటిగా విషయంలోకి వచ్చేసి పాఠకులకు పొన్నమ్మ కథ పట్ల ఆసక్తి ఉత్కంఠ కలిగేట్టు రాస్తారు రచయత్రి శివరాజు సుబ్బలక్ష్మి. తమ వంటి పేదల బతుకుల పైన, సంఘం తమను చూసే విధానం పైన డబ్బున్న వారి ప్రవర్తన పైన పొన్నమ్మ విసిరే చెణుకులు , చేసే ప్రకటనలు ఆమె సూక్ష్మ పరిశీలనా దృష్టికి ఆమె ఆత్మాభిమానానికి నిదర్శనంగా కనిపిస్తాయి.
ఉదాహరణకి పొన్ని మాట్లాడే ఈ మాటలు :
‘ఏంటో అండి! ఎవరిది తింటే ఆరి పక్కే పలకాల! పొట్టుొచ్చుకొచ్చిన బీదాల్లం మాకు స్వతంత్రంగా మాటా పలుకు పలికేందుకు ఏడకుదురుద్ది లేండి.
“ఈ భగవంతుడికి ఎందుకో బీదోళ్ళు అంటే కోపం! కోపమేటి లెండి, ఇసుగు! ఈ మూక ఎక్కడున్నా. అందుకే ఈ భూమ్మీదే గుంపుల్లా ఉండండి రా అని ఒగ్గేసినాడు. సరగానికి వెళ్లే వాళ్లంతా గొప్ప బుద్ధి ఉన్న గొప్పోళ్ళే కదండీ!”
“అయ్యగారు ధర్మదేవత! ఆరి చుట్టూ మాస వంటి కుక్క మూక బడి తింటూ కాపలా కాస్కుంటాం. అంతే కదండీ… ఎముక ముక్కల్లా మీరు డబ్బు చూపెడతారు, దాన్ని ఇడవలేక ఉండలేక మేము తిక మొకబడతాం!”

మాండలికంలో రాసిన సంభాషణలు నవల శిల్పాన్ని మరింత శక్తివంతం, జీవవంతం చేశాయి.
నిజానికి ఈ నవలను నాటకంగా రూపొందిస్తే ఆరంభంలో పొన్నమ్మ డైలాగులకి ఈలలు, వన్స్ మోరులు రావటం ఖాయం! ధనిక పేదల మధ్య తేడాల విషయంలో, సంపన్నులు పని వారితో వ్యవహరించే తీరు పై పొన్నమ్మ చేసే వ్యాఖ్యలు దురదృష్టవశాత్తు నేటికి తమ ప్రాసంగికతను కోల్పోవు.

నవలలో కథనం అధిక శాతం సంభాషణ ద్వారానే సాగుతూ ఉంటుంది. రచయత్రి జోక్యం కానీ పాత్రల గుణగణాల పై తీర్పులు ప్రకటించటం ఉండదు. ఈ క్రమంలో కొన్ని ఘటనలు జరిగినట్టు వాళ్లు వీళ్ళు చెప్పుకున్నట్టు పని వాళ్ళు చెప్పుకోవటం జరుగుతుంది. ఆయా ఘటనలలో నిజానిజాలు రచయత్రి ధృవీకరించటం కానీ ఖండించటం కానీ చెయ్యక తటస్థంగానే ఉండటం వలన పాఠకులు కూడా వారికి తోచిన నిర్ణయానికి రావచ్చు.

సామాజిక చిత్రణ :
రచయత్రి పొన్ని- వెంకటేశ్వర్లు పాత్రల ద్వారా ధనిక పేద వర్గాల మధ్య తారతమ్యం , వారి జీవన శైలిలో కనపడే విపరీతమైన తేడాను కథాక్రమంలో చాలా సూక్ష్మంగా చిత్రిస్తారు. ఆంధ్రదేశం లోని విశాఖ ప్రాంతం లోని ఒక ఊరి నుండి కేరళలో ఒక కొండప్రాంతాల వరకు కథను నడిపిస్తారు. పేదలు తమ వెనుకబాటుతనానికి తమ ఖర్మగా భావిస్తూ ధనికులను ఆరాధిస్తూ చీటికిమాటికి వారి కాళ్ళ పై పడుతూ వారిని ప్రభువులుగా , మహరాజులుగా సంబోధిస్తూ,తమను తాము తక్కువ చేసుకుంటూ మాట్లాడటం, కనపడుతుంది.

ఇక వంటరి పేద మహిళ అయిన పొన్నమ్మ పై చిన్నతనంలో ఊరిలో శాస్త్రులు మొదలుకుని పని చేసిన చోటు కామందు, ఆ పై ఆసుపత్రిలో పని చేసేటప్పుడు అక్కడి డాక్టరు, నీలం గేటు మేడ పూర్వ యజమాని అయిన గడ్డపాయన, నారాయణ ఇలా అందరూ ఆమె పై మోజు పడ్డ వారే! కొందరికి అవసరం కొద్దీ చేరువ అవుతుంది. కొందరు ఆమెను లొంగదీసుకుంటారు. మల్లిగాడితో ఇష్టంగానే సంబంధం పెట్టుకున్నట్టు చెపుతుంది. కానీ అతను నలుగురి ముందు ఆమె నా చెల్లెలు లాంటిది అని చెప్పినప్పుడు అతనిని అసహ్యించుకుని దూరం పెడుతుంది.

ఇక పొన్నమ్మ పెద్ద కూతురు పొన్నమ్మ ఊరికి వెళ్ళినప్పుడు నీలం గేటు ఇంట్లో పని చెయ్యటం , వంట అతను రంగయ్య ఆమెతో చనువుగా మసిలి ఆమెను పెళ్ళి చేసుకుంటా అనటం, ఆ పిల్ల కూడా అతనితో పారిపోయి అతనినే మనువాడుతా అనటం పేద
వారి అమాయకత్వం , యజమానులు ఇతరులు వారి శ్రమనే కాక వారిని అన్ని విధాలుగా ఎలా దోపిడీ చేసే వారో స్పష్టం అవుతుంది.

సమాజం , రాజకీయాలు మతం ప్రస్తావన :
నవలలో కథ సాగే క్రమంలో మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం, ఆ పై తొలి దశ తెలంగాణా ఉద్యమం ప్రస్తావన ఉంటాయి. అలాగే కార్మిక ఘాలు, కార్మిక నాయకులు వారి హక్కులకై పోరాడటం వంటి విషయాల ప్రస్తావన ఉంటుంది.

భాష :
నీలంగేటు అయ్యగారు నవలలో పొన్నమ్మ పాత్రకు వాడిన మాండలిక భాష చాలా సహజంగా మెప్పేటట్టు వ్రాశారు. యజమానులతో సంభాషణలో సేవకులు తరచూ వాడే పదాలు కూర్చుతూ… మాటల్లో తరచూ తమను తాము తక్కువ చేసుకుంటూ, యజమానిని పొగుడుతూ, ఆ రకంగా వారి అహాన్ని సంతృప్తి పరుస్తూ వారి విశ్వాసాన్ని చూరగొనే విధానం ఆ సంభాషణల ద్వారా తేటతెల్లం అవుతుంది.

స్త్రీ పురుష సంబంధాల విశ్లేషణ :
నవల చదివాక స్త్రీ పురుష సంబంధాల ల పై అనేక లేవనెత్తే ప్రశ్నలు చుట్టుముడతాయి. అలాగే సేవక యజమాని సంబంధాలపై కూడా. ఈ రెంటినీ విడివిడిగా చూడాలా లేక రెండూ పెనవేసుకుని ఉన్నాయా? యజమాని పొన్నమ్మ పై మోజు పడ్డ ప్రతిసారి అది ఆమె బ్రతుకు తెరువును బలి తీసుకుంది. అందుకే ఆ చేదు అనుభవాలు నేర్పిన పాఠంతో వెంకటేశ్వర్లును వారిస్తుంది. అసలు ఆ యెల్లిగాడే బాగుంటే నాకిన్ని తిప్పలు ఉండేవి కాదు కదా అని తన భర్త గురించి పదే పదే అనుకుంటుంది.

అటు వెంకటేశ్వర్లు జీవితంలో కూడా మొదటి భార్య మొదటి రాత్రి నుండే ఎడపెడ ముఖంగా ఉండటం, రెండో భార్య ఇంటిని పిల్లలను పట్టించుకోకుండా క్లబ్బులు ఇతర కార్యక్రమాలకు తిరగటం వలన అతని వంటరితనంతో బాధపడ్డట్టుగా ఉంటుంది. అదే క్రమంలో తనపై ఆపేక్ష, గౌరవం చూపిస్తూ తనకు సేవ చేస్తున్న పొన్ని పై మనసు పడటం జరుగుతుంది. శారీరిక సంబంధాల వెనుక ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. పెళ్లి ద్వారా, ఒక చక్కటి కుటుంబం, అనుకూలమైన భాగస్వామి దొరికినప్పుడు ఇలా వివాహేతర బంధాలు ఏర్పడవు అన్న సూచన నవలలో కనపడుతుంది. అలాగే వ్యక్తులకు , స్త్రీ అయినా పురుషుడైనా ఒక మానసికమైన తోడు కోసం ఆశిస్తారని ఆ తోడు పొందే క్రమంలోనే శారీరికంగా దగ్గర అవుతారనే సూచన కూడా నారాయణ, పొన్నిల సంబంధంలో సూచిస్తారు. ‘ఆ రాత్రి నారాయణ మనసులోని పొన్ని పై కోరిక సింగారించుకు మంచి చేసుకుంది, మంచి మాటలతో దగ్గరయింది. బలహీనత ఒకటి చేసింది’. అంటారు రచయత్రి. అయితే పొన్ని అయ్యగారు తనను తిట్టారనే బాధ, భార్యపై ఆపేక్ష చూపిస్తున్నాడనే అక్కసుతో నారాయణకు దగ్గర అవుతుంది. కానీ వెంటనే తన బలహీనతకు పశ్చాత్తాప పడుతుంది.

వెంకటేశ్వర్లు ఒక దశలో “నిజమే దానికి నా ఆత్మక్షోభ ఏమి తెలుస్తుంది. అనవసరమని ప్రాధేయపడితే శరీర సుఖం ఇవ్వచ్చు. మాట్లాడితే అర్థం కాకపోయినా ఊ కొట్టచ్చు. అంతే స్నేహితురాలు కాలేదు” అనుకుంటాడు పొన్ని గురించి.
సమాజం ఆడ మగ విషయంలో ద్వంద నీతి అవలంబిస్తుంది. భర్తను భారత స్త్రీకి దైవంగా, ప్రభువుగా, యజమానిగా, సంరక్షుకునిగా,ఇలా రకరకాలుగా అభివర్ణిస్తారు. అలాగే రాచరికంలో, భూస్వామ్య వ్యవస్థలో సేవకులకు యజమాని కూడా దైవంగా, ప్రభువుగా, సంరక్షుకునిగా భావిస్తారు. వారి మధ్య కేవలం పని- జీతం ఒక్కటే కాక విధేయత, విశ్వాసం, కృతజ్ఞత, భయభక్తులు వంటి భావనలన్నీ చాలా హెచ్చు స్థాయిల్లో ఉంటాయి.

పొన్నమ్మ ఈ రెండు కోణాలలో అంటే స్త్రీగా, సేవకురాలిగా రెండు విధాలుగా తన యజమానిని సర్వస్వంగా భావించిన విధం కనపడుతుంది. యజమాని పట్ల విధేయత కనపర్చే క్రమంలో అతని తప్పు కూడా తన నెత్తిన వేసుకుని తమ శారీరిక సంబంధాన్ని, అతని తప్పుగా కాక ఏమో ఆ చెడ్డ బుద్ధి నాకే పుట్టిందేమో అనేస్తుంది.

అగ్రవర్ణ స్త్రీలతో పోలిస్తే కింది వర్గం వారికి శీలం విషయంలో పట్టింపు ఉండదని ఒక ధోరణి ప్రచారంలో ఉండేది. వారికి పునర్వివాహం తప్పు కాకపోవటం, పై కులాల అంత గుట్టుగా కాక ఇంటి గొడవలు నలుగురిలో పంచాయతీ పెట్టి తీర్చుకోవటం కనిపిస్తుంది. బహుశా అదే కారణంగా పొన్ని పాత్ర ను అలా సృష్టించి ఉండవచ్చు. ఇక సంపన్న కుటుంబాలలో స్త్రీలు కూడా తాగుతారని క్లబ్బుల వెంట తిరుగుతారని ప్రచారం ఉండేది. ఆ నేపథ్యంలో నుండే నీలం గేటు మేడలో అమ్మగారు, కోడలు గారు, అమ్మాయిగారి పాత్రల సృజన జరిగింది అనిపిస్తుంది.

అయితే ఈ నవలలో నీలంగేటు యజమాని అయిన వెంకటేశ్వర్లు పాత్రను ఉదార స్వభావుడుగా, కుటుంబ సభ్యులు అయిన భార్య, కోడలు, కూతురిని కట్టడి చేయకుండా స్వేచ్ఛ ఇచ్చినట్టు ఫలితంగా వారు చెడుదారులు పట్టినట్టు చూపిస్తారు. అయ్యగారు ఇచ్చిన స్వేచ్ఛ వలన కొడుకు చెడిపోడు కానీ వింతగా, ఆడవాళ్ళు ముగ్గురూ పలు రకాల పెడ త్రోవ పడతారు. అంటే భర్త కఠినంగా లేకపోతే భార్యలు అతి చనువు తీసుకుని చెడిపోతారన్న ఒక సందేశం అంతర్లీనంగా ఈ నవలలో ఉన్నట్టు కనపడుతుంది.

అయితే కూతురి విషయంలో మాత్రం ఆమె భర్త, పిల్లలను వదిలి చుట్టపాయినతో వెళ్ళి పోవటానికి చిన్నప్పుడు తల్లి పోవటం, తండ్రి ప్రేమ సరిగా దొరకక పనివారితో ఎక్కువగ గడపటం, అత్తింట్లో ఆమెను సరిగా చూసుకోకపోవటం , భర్త ఇతర స్త్రీలతో చెడు తిరుగుళ్లు తిరగటం అనే కారణాలూ కనపడతాయి…. నవల ఆఖరులో ఆమె భర్తను పిల్లలను విడిచి చుట్టపాయనతో వెళ్లిపోతూ అన్న మాటలతో ఆమె బాల్యంలో తల్లి లేక తండ్రి నిరాదరణకు గురిఅయి ఇలా తయారు అయిందని ఆమె మాటల్లోనే చెప్పిస్తారు. ఇంటికి వస్తే వంట వాళ్లు, పని వాళ్ళు ఉండే వారు తప్ప తల్లి తండ్రి కాదు అని ఆవేదన వ్యక్తపరుస్తుంది. అందుకే వంటమనిషితో నే చనువుగా ఉన్నట్టు చెపుతుంది. ఇంకొక వింతగా అనిపించే విషయం చిన్నప్పుడు తల్లితండ్రుల ప్రేమకు దూరమై బాధపడ్ద కూతురు తన పిల్లల పట్ల ఏమీ బాధ్యత చూపకపోవటం.

కధనం, శిల్పం బలంగా లేని సాహిత్యం ఘటన ప్రధానంగా సాగుతూ మంచి చెడులు నైతిక అనైతిక ప్రవర్తనలకు స్పష్టమైన సరిహద్దు రేఖలు గీస్తూ మూస పాత్రలను తయారు చేస్తుంది. కానీ శివరాజు సుబ్బలక్ష్మి నవలలలో పాత్రలు స్పష్టమైన రేఖలలో ఒదగవు. సంక్లిష్టమైన మరియు బహుముఖమైన పాత్ర చిత్రణ రచయిత్రి ప్రత్యేకత.

తాను సృష్టించిన పాత్రలలో వారి స్వభావాలను,మానవ ప్రవృత్తిలో తారసపడే భిన్న మనస్తత్వాలు, చిత్త చాంచల్యాలు నేపథ్యాన్ని, భాష, యాస వంటివన్నీ జాగ్రత్తగా పరిశీలించి రాశారు. అదృష్టరేఖ నవలలో అంతగా కనపడని వర్గ దృక్పథం/ చైతన్యం నీలంగేటు అయ్యగారు నవలలో కనపడుతుంది. అయితే రచయిత్రికి మానవ స్వభావంపై, సాంఘిక జీవనం పై అందులో అందరికీ ఆమోదయోగ్యంమైన జీవన సరళి పై నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నట్టు అనిపిస్తాయి. అవి ఆ నాటి సమాజం నిర్దేశించిన పాత్రలకు మరీ భిన్నమైనవి అయితే కావు.

నీలం గేటు అయ్యగారు నవలలో విభిన్నమైనవి ప్రధానమైనవి అంశాలు ఏమిటంటే…
1) ప్రధాన పాత్రలు రెండూ మూస ధోరణిలో ఇమడనివి. ఒకటి పొన్నమ్మ పాత్ర సంప్రదాయ దృష్టితో చూస్తే శీలవతి కాదు. ఆ రోజుల్లో స్త్రీలకు శీలం అనేది ప్రాణం కన్నా ముఖ్యం అని భావించే వారు. అనేక లైంగిక సంబంధాలు ఆ నాటి పురుషులకు సాధారణమే కానీ ( ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండటం, భార్య చని పోతే పునర్వివహం, ఇదే కాక కొందరికి వివాహేతర సంబంధాలు ఇవన్నీ పురుషులకు సర్వ సాధారణం) స్త్రీలకు మాత్రం ఇవన్నీ నిషిద్ధంగా ఉండేవి.
వెంకటేశ్వర్లు పాత్ర కూడా కుటుంబ సభ్యుల పై అధికారం చెలాయించకుండా వారికి స్వేచ్చని ఇచ్చిన పాత్ర. సమాజం పురుషులకు నిర్దేశించిన పాత్ర కుటుంబ పెద్దగా కుటుంబాన్ని పోషించటమే కాక వారిని తన అదుపాజ్ఞాలలో పెట్టుకుని సక్రమ మార్గంలో నడిపించటం. స్త్రీకి శీలం ప్రధానం అయితే పురుషుడికి అధికారం ప్రధానం. ఆ రకంగా చూసినప్పుడు ఈ రెండు పాత్రలు ఆ మూసలో ఒదగవు.

2) లైంగిక సంబంధాలు, అధికార సంబంధాలు: పొన్నమ్మ నారాయణతో సంబంధం ఏర్పడ్డాక ” ఛీ నాకు ఇదేమి వికారం ఎదిగిన గుంటలని పెట్టుకుని అనుకుంటుంది. అదే వెంకటేశ్వర్లు తనకు పొన్ని మీద కలిగిన వాంఛను చాలా సహజంగా భావిస్తాడు. తమ మధ్య వయసులో వ్యత్యాసం కానీ ఆమె తనను నమ్మి తన దగ్గర పని చేసే ఉద్యోగి అన్న విషయం కానీ అతన్ని బాధించవు, తన భావనలకు ఏమీ కించపడడు కూడా. స్త్రీ పురుషుల మధ్య ద్వంద ప్రమాణాలకు వారి అలోచనలే తార్కాణంగా నిలుస్తాయి. అందుకే మీ టూ ఉద్యమం తో సహా అన్ని స్త్రీల ఉద్యమాలు అసమ సంబంధాలలో కన్సెంట్( ఒప్పుదల) లేదా అంగీకారాన్ని వేరేగా చూడాలి అంటాయి. వయసులో, హోదాలో, అధికారంలో, స్థాయి స్థోమతులో ఆధిపత్య స్థానాలలో ఉన్న వారు తమ కిందివారు తమతో ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకున్నారు అనలేరు.

3) నవల చివర్న వెంకటేశ్వర్లు కూతురు తనకు ప్రేమ గౌరవం ఇవ్వని, ఇష్టం లేని వివాహ బంధాన్ని విడిచిపెట్టి, తిరుగుబోతు భర్తను పిల్లలను వదిలి వెళ్లిపోతూ అనే మాటలు ఒక స్త్రీగా, మనిషిగా ఆమె తన హక్కులను గుర్తించిన తీరు తెల్పుతుంది. నా పిల్లలకు ఆస్తి ఇవ్వాల్సిన బాధ్యత మీదే! ఒక వేళ నేము తిరిగి వస్తే ఈ ఇంటికి వచ్చే హక్కు కూడా నాకుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అవి ఆమె వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మగౌరవానికి, స్వతంత్ర్య ఆలోచనా ధోరణికి ప్రతీకగా నిలుస్తాయి. ‘అదృష్టరేఖ’ నవలలో నా భర్త నన్ను వదిలేస్తే ఎక్కడ ఉండాలి అని బేలగా అలోచించే వరలక్ష్మి పాత్ర సృజన నుండి స్వంతంత్రంగా తన మార్గాన్ని ఎంచుకునే ఈ కూతురి పాత్ర సృజన రచయత్రి పరిణితికి కూడా ప్రతీకగా కనపడుతుంది.

అయితే నవల చివరిలో పొన్నమ్మ వెంకటేశ్వర్లు ఇద్దరూ తాము అలా భిన్నంగా ఉండవలసింది కాదేమోనన్న శంకలో పడతారు. తను అతి స్వేచ్చ ఇచ్చి ఉండక పోతే పిల్లలు భార్య కోడలు చెడిపోయే వారు కాదేమో అని వెంకటేశ్వర్లు, తన భర్త ఎల్లయ్య కనక బాగా ఉంటే తనకీ తిప్పలు ఉండేవి కావు అని పొన్నమ్మ బాధపడతారు. కానీ ఇద్దరి బాధలో చాల వ్యత్యాసం ఉంది. పొన్నమ్మ ఆత్మాభిమానం కల వ్యక్తి.తన పనితనం పట్ల ఆత్మగౌరవం ఉన్న మనిషి. తన కడుపు , పిల్లల కడుపు నింపటం కోసం ఆరాటపడుతూ ఆ పని కల్పించిన యజమని పట్ల విధేయత కనపర్చే మనిషి. శ్రమ దోపిడీకి లైంగిక దోపిడీ కి గురి అయిన మనిషి.

వెంకటేశ్వర్లు విషయం అలా కాదు. అతని చేతిలో డబ్బు ఉంది. పురుషుడిగా అధికారం ఉంది. కుటుంబ పెద్ద గా ఆ అధికారం చెలాయించే అవకాశం ఉంది. అవి వాడుకోలేదన్న దుగ్ధ ఆయనది.

నవలలో భర్త బాగుండి మంచి కుటుంబ జీవనం ఉంటే స్త్రీకి భద్రత ఉంటుదన్న సూచన కనపడుతుంది. అలాగే అతి స్వేచ్చ ఇస్తే స్త్రీలు చెడిపోతారన్న సూచన కూడ కనపడుతుంది. మొదటి దానిలో కొంతవరకూ వాస్తవం ఉన్నా రెండవది అవగాహనా లోపంగానే కనపడుతుంది.

మొత్తానికి సంఘం, కుటుంబం , వర్గ తారతమ్యాలు, మానవ సంబంధాలు, నైతికత, జీవన సార్థకత పై అనేక విషయాలు ప్రతిభావంతంగా చర్చిస్తూ అనేక ఆలోచనలు రేకెత్తించే నవల నీలం గేటు అయ్యగారు!

**

కవయిత్రి, కథా రచయిత, అనువాదకురాలు.  వరంగల్ వాస్తవ్యులైన వీరు, ముప్ఫై ఏళ్ళ పాటు భారతీయ జీవిత బీమా సంస్థ లో పని చేశారు. పలు ప్రముఖ దిన, వార, మాస పత్రికలలో, వెబ్ పత్రికలలో వీరి కథలు, కవితలు, వ్యాసాలు, అనువాద కథలు ప్రచురితం అయ్యాయి. పలు నాటికలు, గేయాలు, పుస్తక సమీక్షలు, సినీ విమర్శ వ్యాసాలు కూడా రచించారు. మానవ సంబంధాలు , సమకాలీన సమస్యలు, సమాజంలో కొత్త పోకడలు, అన్ని రకాల వివక్షలు వీరి కథా వస్తువులు. ఆగస్ట్ 2014 లో తొలి కథా సంపుటి ‘ఒక పరిచయం... ఒక పరిమళం’, ఆగస్ట్ 2025లో రెండవ కథా సంపుటి ‘ఔను నాకు నచ్చలేదు’ విడుదల చేశారు. జెండర్, వర్గ దృక్పథంతో పలు సమకాలీన సామాజిక అంశాలపై అనేక వ్యాసాలు రాశారు. నేటి తెలుగు సినిమాలలో హీరో పాత్ర చిత్రణ పై వీరు రాసిన ‘పురుషత్వానికి ఒక ప్రమాదకర నమూనా- తెలుగు సినిమా హీరో’ వ్యాసం, అన్వేషి సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ వారు డిగ్రీ విద్యార్థుల కోసం రూపొందించిన జెండర్ టెక్స్ట్ బుక్ ’ టువర్డ్స్ ఎ వరల్డ్ ఆఫ్ ఈక్వల్స్’ లో పాఠ్యాంశంగా చేర్చారు. 2004 లో, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలపై కథలతో, అన్వేషి సంస్థ వారు ప్రచురించిన ’వాడపిల్లల కథలు’ పుస్తకం కోసం రెండు కథలు అనువదించారు. 2022 లో విడుదలైన రెండు ప్రముఖ స్త్రీవాద కవితా సంకలనాలు ’సంఘటిత’, ’అపరాజిత’ లో వీరి కవితలు చోటు చేసుకున్నాయి. డా. మాడభూషి రంగాచార్య స్మారక సంఘం, హైదరాబాదు వారు 2024 లో ప్రచురించిన ‘నేటి కాలపు మేటి కథకులు’ నాలుగవ సంపుటి పుస్తకంలో ప్రముఖ రచయత్రి ఇంద్రగంటి జానకీబాల గారి కథలపై విమర్శ వ్యాసం రాశారు.

Leave a Reply